"నీకేం రెండు చేతులా సంపాదిస్తున్నావ్?" అన్నాడు మిత్రుడొకడు మా అమ్మాయి బర్త్ డే పార్టీ కోసం మొన్న ఆదివారం మాల్ లో షాపింగ్ చేస్తుంటే.
"నేనేమన్నా ఇండియా లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానా ఏమిటి? రెండు చేతులా సంపాదించడానికి" అన్నాను నేను.
అదే..బ్లాగ్ రాస్తున్నావ్ కదా.
అయితే?
బోలెడు యాడ్స్, బోలెడు సంపాదన.
ఓహో ఆ సంపాదనా ! అవును ఆ డబ్బుతో కార్ కొందామనుకుంటున్నాను.
"అవునా అంత వస్తుందా?" అతని కళ్ళలో ఆశ.
ఉండు, అంత ఆత్రుత ఎందుకు, ఇంకా నేను మాట పూర్తి చేయందే. ఆ డబ్బుతో కార్ కొందామనుకుంటున్నాను ఇంకో రెండు వందల ఏళ్ళ తర్వాత.
అదేంటి?
అవును మరి, నేను ఒక పోస్ట్ రాస్తే 5 సెంట్స్ రావడమే ఎక్కువ, ఆ పోస్ట్ రాసే బదులు అలా రోడ్డు మీద తిరిగొచ్చినా ఒక 5 సెంట్స్ కాయిన్ దొరకచ్చు , ఇక్కడ జనాలకు ఐదు సెంట్స్ కు పెద్ద వేల్యూ ఇవ్వరు, రోడ్డు మీద పారేస్తారు. (ఇది నిజంగా నిజం, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో రోడ్డు మీద ఈ ఐదు సెంట్స్ కాయిన్స్ బాగా కనపడేవి, ఈ మధ్య నా లాంటి ఇండియన్స్, చైనీస్ ఎక్కువయ్యారేమో అంత ఎక్కువగా కనపడట్లేదు 😊)
అవునా? బ్లాగ్స్ రాసి బాగా సంపాదించచ్చు అనుకున్నానే? కనీసం ఒక పూట లంచ్ చేయడానికి సరిపోయేంత డబ్బులైనా వస్తాయా నెలకు?
కనీసం ఒక కాఫీ తాగడానికి కూడా సరిపోయేంత రావు సంవత్సరానికి.
అవునా?
అవును మరి, ఇంతవరకు మొత్తం కలిపి 4 డాలర్స్ వచ్చాయి.
మరింకేం ఒక కాఫీ తాగొచ్చన్నమాట.
గొచ్చు గొచ్చు, ఇంకో 96 డాలర్స్ వస్తే
మళ్ళీ ఇదేంటి?
అదంతే. టోటల్ అమౌంట్ వంద డాలర్స్ వస్తేనే నువ్వు గూగుల్ నుంచి ఆ డబ్బు పొందొచ్చు. కాబట్టి ఇంకో రెండు సంవత్సరాలు ఆగు అప్పుడు 100 డాలర్స్ వస్తే మన ఇద్దరం వెళ్లి లంచ్ చేద్దాం అని అన్నాను అతనితో.
నేనేదో బ్లాగ్ లో రాస్తూ తెగ సంపాదిస్తున్నానని మొన్నొక అమ్మాయి వాట్సాప్ లో తెగ questions అడిగింది, నేను కూడా ఇలా ఒక బ్లాగ్ ఓపెన్ చేసి పోస్ట్స్ రాస్తే వచ్చే డబ్బులతో నా పాకెట్ మనీ లాంటివి సంపాదించుకోవచ్చా? blogspot అయితే బెటరా లేక wordpress అయితే బెటరా అని? (నిజ్జంగా నిజం ఆ అమ్మాయి అలాగే అడిగింది). మరికొందరేమో బ్లాగ్స్ లో పోస్ట్స్ రాసి నేనేదో తెగ సంపాదిస్తున్నానని అనుకుంటున్నారు. కేవలం డబ్బు సంపాదించడమే అయితే, ఇక్కడ ఆస్ట్రేలియా లో స్టోర్ కీపర్ గానో, రెస్టారెంట్ లో సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చేసినా గంటకు 20 డాలర్స్ సంపాదించచ్చు. డబ్బు కోసం కాదు, ఏదో రాయాలన్న దురద, సరదా అంతే. అందరూ Adsense కు అప్లై చేశారు కాబట్టి నేను చేశా అంతే . తెలుగు బ్లాగ్స్ కు ఈ Adsense approval ఒక 9 నెలల కింద వచ్చినట్లుంది, కానీ నేను బ్లాగ్ రాయడం మొదలెట్టి మూడేళ్లు అయింది.