25, ఫిబ్రవరి 2018, ఆదివారం

బ్లాగ్ కి పట్టిన బూజు


ఓయ్ పవనూ ఎటెళ్లి  పోయావూ ఇన్ని రోజులు, నీ కోసమే ఈ ఎదురు చూపులు 


సంక్రాంతి వస్తోందిగా బూజు దులపడానికి వచ్చా

ఇప్పుడు  సంక్రాంతి ఏమిటి తమరి బొంద శివ రాత్రి కూడా వెళ్ళిపోయింది .. అజ్ఞాతవాసి సినిమా చూసాక నీ మతి గతి తప్పినట్లుంది. 

అయినా  ఇంట్లో చెప్పే సినిమాకి వచ్చావా అని ఎంట్రీ దగ్గర ఉండే గేట్ కీపర్, జండూ బామ్ కావాలా నాయనా అని పైనుంచి  కీర వాణి హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడుండాల్సింది. 

కీర వాణి ,దివ్య వాణి కాదు ఆకాశ వాణి..అయినా ఆ సినిమా ..

సరేలే ఆ సినిమా గుర్తుకు తెప్పించి మానిపోతున్న గాయాన్ని గెలక్కు

ఆరిపోతున్న దీపాన్ని నువ్వు వెలిగించాలనుకోవట్లా ఇదీ అంతే

దీపమా?

అదేలే  నీ బ్లాగ్

ఏదో కాస్త బూజు దులిపి మళ్ళీ మొదలెడతామని

బూజా .. ఇంటికా నీ బుర్రకా?

కాదు బ్లాగ్ కి

ఇన్ని రోజులేం చేస్తున్నావ్ బ్లాగ్ రాయకుండా

రాస్తునే ఉన్నాను కానీ,  అది జావా కోడ్. 

ఇంట్లో రాయొచ్చుగా

ఇంట్లో కూడా జావా కోడ్ రాయమని మా మానేజర్ ఫోర్స్ చేస్తుంటేనూ కుదరడం లేదు. 

మిగతా టైమ్స్ లో రాయొచ్చుగా

బరువు భాధ్యతలు కూడా ఉన్నాయిగా అందుకే


అలాగని రాయకుండా వదిలేస్తే ఎలా? ఆఫీస్ పని ఉందని దాని మీదే కాన్సట్రేట్ చేస్తే ఎలా?

నేనంతే, దేని మీదైనా కాన్సంట్రేట్ చేస్తే ఆ పని పూర్తయ్యేదాకా డిస్టర్బ్  అవ్వను


చూస్తూనే అర్థమవుతోంది...నీ కాన్సంట్రేషన్ దేని మీదో, అయినా పనులన్నాక వస్తుంటాయ్ పోతుంటాయ్...కడలి తరంగాల లాంటివి అవి, అలాగని బ్లాగ్ రాయకపోతే ఎలా

కడలి తరంగాలు...ఇదేదో బాగుంది, నెక్స్ట్ పోస్ట్ కి నా టైటిల్ ఇదే

రామ్ గోపాల్ వర్మ లా ఏది అనిపిస్తే ఆది చేసేస్తావా, అదేం టైటిల్, అయినా బ్లాగ్ కి కాదు నీ బుర్రకు పట్టిన బూజు దులుపుకో ముందు

'లలిత్ మోడీ నీరవ్ మోడీ లాంటి  కేడీలు ఎందరో మా నరేంద్ర మోడీ రాజ్యం లో' అనే టైటిల్ పెట్టి పోస్ట్ రాస్తా

ఏమిటా అర్థం పర్థం లేని డైలాగు

సమకాలీన పరిస్థితులను నా బ్లాగ్ ద్వారా ఎలుగెత్తి చాటాలని తపన

తపన ఒక్కటే సరిపోదు దానికి తగ్గ విషయం ఉండాలి

పవన్ కళ్యాణ్ దగ్గర ఏ మాత్రం ఉందని ....

అయినా ఆయన్ని కామెంట్ చేయడానికి నువ్వేమీ కత్తివో వర్మవో కాదు.

వర్మ అంటే గుర్తుకు వచ్చింది యెంత ఇష్టమో శ్రీదేవి అంటే తనకి.  నాకు కూడా శ్రీదేవి అంటే బాగా ఇష్టం. 

ఎప్పటికైనా

పెళ్లంటూ చేసుకుంటే శ్రీదేవినే చేసుకుంటా 20  ఏళ్ళు పెద్దదైనా,
వాళ్ళింట్లో, మా ఇంట్లో ఒప్పుకోకపోతే దివ్య భారతి నైనా చేసుకుంటా 15 ఏళ్ళ తర్వాతైనా
ఇల్లంటూ కట్టుకుంటే నాగార్జున సిమెంట్ తోనే కట్టుకుంటా 10 ఏళ్ళ తర్వాతైనా [అప్పట్లో టి.వి లో ఇదే యాడ్ వచ్చేది మరి]
కిళ్ళీ అంటూ తినవలసి వస్తే పూర్తిగా చదువైపోయాకే తింటా ఎన్నేళ్ల తర్వాతైనా [కిళ్ళీ తింటే చదువు సరిగ్గా రాదు అని ఎవరో చెప్పిన మాటకు భయపడి ]

అని అప్పుడెప్పుడో స్కూల్ రోజుల్లోనే గట్టిగా డిసైడ్ అయ్యాను.  అలాంటిది శ్రీదేవి చనిపోయిందట అని మా ఆవిడంటే, వయసైపోయిందిగా పైగా బోల్డన్ని సర్జరీలు అన్నాను కొద్దిగ కూడా బాధ పడకుండా.

కానీ మా ఆవిడే చాలా బాధ పడింది. "కట్టిన చీర మళ్ళీ కట్టేది కాదట, ఇప్పుడు ఆ చీరలన్నీ ఎవరు సొంతం చేసుకుంటారో అని". 

ఏది ఏమైనా పాత సినిమాల్లో చిరంజీవి పక్కన ఏ హీరోయిన్ ఉన్నా చిరంజీవినే చూడాలనిపిస్తుంది ఆ  విషయంలో శ్రీదేవి మాత్రం మినహాయింపు.

కే.వి రెడ్డి - మాయా బజార్, రాం గోపాల్ వర్మ - శివ, బాపు - ముత్యాల ముగ్గు, బ్రహ్మదేవుడు - శ్రీదేవి. అరుదుగా మాస్టర్ పీస్ లు సృష్టించబడతాయి. 

ఆగ్రా కు వెళ్లి తాజ్ మహల్ చూడాలి, ముంబై కి వెళ్లి శ్రీదేవిని చూడాలి అనుకునేవాడిని. మొదటిది ఎప్పుడో తీరింది రెండోది ఇక ఎప్పటికీ తీరదు. 

ఈ పోస్ట్ చదివే ముందు వద్దు వద్దు అని మీకు కీర వాణి ,దివ్య వాణి, ఆకాశ వాణి లాంటివి హెచ్చరించినా  మీరు పట్టించుకోక పోయి ఉండచ్చు.  ఇప్పటికి మించిపోయింది లేదు , చరవాణి చేతిలోకి తీసుకొని జండూబామ్ తెప్పించుకోండి. గత 6 నెలల్లో సేల్స్ బాగా తగ్గిపోయాయని ఒకటే గగ్గోలు.