బిజీ ఏం లేదు నాన్నా, ఇప్పుడే రూంకి వచ్చా.. నువ్వు ఫోన్ చేశావు.
అదేరా, డబ్బులు?
నెల నెలా పంపిస్తున్నట్లు నిన్న కూడా ఇరవై వేలు పంపించానుగా నా జీతం లోంచి, ఇంకేం?
జీతం డబ్బులేవో ఈ నెల నుంచి పదివేలు పెరిగాయని పార్టీ ఇచ్చావటగా మన సుబ్బు గాడు చెప్పాడు
అయితే ఇప్పుడేమంటావ్?
పది వేలు నువ్వొక్కడివే ఏం చేసుకుంటావ్, అందులోంచి 8 వేలు పంపరా, అమ్మకు మందులు, పంటకు పురుగుల మందులు కొనాలి.
ఈ వయసులో ఇప్పుడా నష్టాలొచ్చే వ్యవసాయం చేయకపోతే వచ్చే నష్టమేమి నాన్నా?
నువ్వే అన్నావు గదరా వ్యవసాయం అని అందులోనే సాయం ఉందిరా, కష్టమో, నష్టమో ఈ రైతులు ప్రపంచానికి చేస్తున్న సాయమే ఈ వ్యవసాయం.
అయినా ఇప్పుడా సాయం అదే వ్యవసాయం చేసి ఎవరిని ఉద్దరించాలని?
అందరూ అలా అనుకుంటే తినడానికి కరెన్సీ కట్టలు తప్ప కూడు ఉండదురా కొడకా
సరే పంపిస్తాలే, అన్నిటికీ అన్నీ చెబుతావ్, నువ్వు చదువుకోలేదు కానీ లోకాన్ని బాగా చదివావ్, నీతో ఏం మాట్లాడగలను, అమ్మ కి ఫోన్ ఇవ్వు.
ఏంటి డ్యూడ్ ! మీ డ్యాడా, డబ్బు పంపించమంటున్నాడా? ఈ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ మారదు బ్రో, ఎంతసేపూ పిల్లలను బాగా చదివించి వాళ్ళ డబ్బు మీద బతికేయాలనుకుంటారు ఓల్డ్ అయ్యాక, అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఇలా వాళ్ళ పిల్లల నుంచి మనీ అస్సలు expect చెయ్యరు తెలుసా?
ఏరా అబ్బి, బాగున్నావా? ఏమన్నా తిన్నావా లేదా?
తిన్నాను కానీ, నీకేదో బాలేదంట.
మీనాయన అట్లే చెబుతాడులేరా, ఎప్పుడూ ఉండే కాళ్ళ నొప్పులే, అవి మందులు మాకులతో పోవు, నాతోనే పోవాల, టైం కు తింటా ఉండు, జాగ్రత్త.
సరే అమ్మ, ఉంటా మరి.
*****************************
నాకు ఫోన్ చేసింటే బస్సు స్టాండ్ కి వచ్చి బైక్ లో పికప్ చేసుకునేవాడ్నిగా నాన్నా?
పర్లేదు లేరా, మీ రూమ్ దగ్గరేగా బస్టాండ్ నుంచి, అందుకే నడిచే వచ్చేశా.
అమ్మ బాగుందా?
బాగుంది, ఇదిగో నీకోసం తినడానికి యేవో పంపించింది.
ఈ వయసులో అమ్మ ఇలా కష్టపడకపోతేనేం నాన్నా, కాళ్ళ నొప్పులు పెట్టుకొని.
దానికి నీ మీద ఉన్న ప్రేమ, దాని కాళ్ళ నొప్పుల్ని మరిపించేస్తుందిరా. అది సరే గానీ, ఉద్యోగం ఏమన్నా దొరికినాదిరా ?
లేదు నాన్న, రెసిషన్ కదా, ఎక్కడా జాబ్స్ దొరకట్లేదు.
సరే ఈ డబ్బు ఉంచరా, ఖర్చులకు ఉంటది.
వద్దులే నాన్నా, నేనే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాను. మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది.
ఇది నువ్వు పంపించిన డబ్బు లోదేలేరా.
ఖర్చయిపోలేదా? తోటకి, ఇంటి రిపేర్లకు ఖర్చులున్నాయని అని అన్నావ్?
లేదురా, ఇన్నేళ్లు ఎవరి ముందు చెయ్యి చాచకుండా నిన్ను చదివించి ఈ జీవితాన్ని ఇలా నెట్టుకొచ్చాను, ఇప్పుడు మాత్రం నీ ముందు చెయ్యి ఎలా చాచుతాననుకున్నావురా? నా తిప్పలేవో నేను పడ్డాను, నీ డబ్బులు అస్సలు ఎప్పుడూ వాడాలనుకోలేదు.
మరి నెలా నెలా డబ్బులెందుకు పంపమనేవాడివి?
ఈ కాలం కుర్రాళ్ళు పార్టీలని, ఫ్యాషన్లని డబ్బంతా వృధా చేస్తారని భయపడి, ప్రతీ నెలా నీ దగ్గరి నుంచి అడిగి తీసుకొని, నా పేరు మీద బ్యాంక్లో వేసేవాడిని, నేను సీనియర్ సిటిజెన్ ని కదా నా పేరు మీద వేస్తే కొంచెం వడ్డీ ఎక్కువస్తది. అలా అప్పుడు దాచిన సొమ్మే ఇప్పుడు నీకు ఉపయోగపడుతోంది.
హే డ్యూడ్! ఈయనేనా మీ డాడ్?
అవును బాబూ, ఆ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఉన్నవాడిని నేనే, రూపాయికి రూపాయి కూడబెట్టి బిడ్డల బాగు కోసం మిగలబెట్టాలని ఆశ ఉన్న ఇండియన్ తండ్రిని, కట్టె కాలేవరకు ఈ బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ మారదు. ఇంతే మేమింతే.
****************************
ఎప్పుడూ యేవో కబుర్లే రాస్తుంటాను కదా అందుకని, నా స్కూల్ కాదని తెలిసీ 'కథ' ఒకటి రాయడానికి పూనుకొని చివరికి ఏదో రాసేసాను దీన్ని మరి 'గిథ' అనో 'గాథ' అనో అనచ్చేమో 😊.
నా కొలీగ్ అయిన ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి 'బ్లడీ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్' అంటూ ఉంటుంది ఎప్పుడూ, సో ఆ పాయింట్ మీద ఒక కథ రాయాలని అనుకొని ఏదో గెలికేశాను. నచ్చితే మెచ్చుకోండి 😊, నచ్చకపోతే హెచ్చరించండి ⚠️ఇక ముందు ఇలాంటివి రాయకుండా ఉండటానికి 😭