ముందు మూడు భాగాల - కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం , ఇన్నాళ్ళకి.. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను, 5 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా? కి ఇది క్లైమాక్స్ పోస్ట్.
అలా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ తో ఐదు క్లాసెస్ ముగిశాక, ఇక ప్రాక్టీస్ ముమ్మురం చేద్దామని కార్ కొనాలని అనుకున్నా. ఇంకా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నావ్ కాబట్టి కొత్త కార్ కాకుండా సెకండ్ హ్యాండ్ కార్ కొను అని చాలామంది సలహా ఇచ్చారు.
సరే అని మంచి కండీషన్లో ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ కార్ (51000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది) కొనేశా. కాకపోతే L బోర్డు పెట్టుకొని ఒక్కడినే డ్రైవ్ చేయకూడదు కాబట్టి పక్కన ఫ్రెండ్ ని కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ మొదలెట్టా.
రోజూ నావిగేటర్ లో ఒక ప్లేస్ సెట్ చేసుకోవడం అది చెప్పే రూట్ ఫాలో అవ్వడం. ఒక రోజు ' ఓ మూడొందల మీటర్లు ముందుకు వెళ్ళి అక్కడ పార్కింగ్ ఉంటుంది ఆపేయ్, నేనెక్కడ దిగిపోతా' అంది ఆ నావిగేటర్.
అనదా మరి, నాకు చిన్నప్పటి నుంచి రైట్ అండ్ లెఫ్ట్ మధ్య చిన్నపాటి కన్ఫ్యూషన్ ఉండేది. దాంతో అది రైట్ అని చెప్తే లెఫ్ట్ కి, లెఫ్ట్ అని చెప్తే రైట్ కి వెళ్ళేవాడిని. అది మళ్ళీ రూట్ సెట్ చేసుకోవాల్సి వచ్చేది. అందుకే అది దిగిపోతా అంది.
ఒక వేళ డ్రైవింగ్ టెస్ట్ లో ఇలా చేస్తే వాడు ఇమ్మీడియేట్ ఫెయిల్ చేసి పారేస్తాడు కాబట్టి నావిగేటర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం మంచిది అయ్యింది, ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ పూర్తిగా పోయింది.
ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళు డ్రైవింగ్ ప్రాక్టీస్ అవుతుంది అలాగే కారు మీద మంచి కంట్రోల్ వస్తుంది అన్నారు. పుణ్యం, పురుషార్థం కలిసొస్తుందని అలాగే స్వకార్యం, స్వామికార్యం కూడా తీరిపోతాయని ఏప్రిల్ లో పిల్లల హాలిడేస్ ఉన్నప్పుడు ఒక 5 డేస్ ట్రిప్ ప్లాన్ చేశాను.
అక్కడ నైట్ టైం ఘాట్ సెక్షన్ లో నేను ఏ మాత్రం ఇబ్బంది పడకుండా డ్రైవ్ చేయగలిగాను. అసలు కాన్ఫిడెన్స్ లేకపోతే అంత రిస్క్ చేసేవాడిని కాదు. మొత్తానికి రెండు నెలల్లో నాలుగు వేల కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను.
భలే డ్రైవ్ చేస్తున్నావ్ నాకంటే బాగా అని నా ఫ్రెండ్ అన్నాడు కానీ అది ఎంకరేజ్ చేయడం కోసమే అని నాకు తెలుసు. నువ్వు యూత్ కాదు కాబట్టి నేర్చుకోవడానికి బాగా టైం పడుతుంది అన్నాడు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్. But age is just a number, డెడికేషన్ ఉంటే చాలు.. ఏదైనా నేర్చుకోవడానికి ఏజ్ కి సంబంధం లేదు అనిపించింది.
నేర్చుకోవడం అయింది , ఇక టెస్ట్ కి వెళ్ళడమే. సముద్రాలు ఈది ఇంటెనుక పిల్ల కాలువలో పడి చచ్చినట్లు మొదటి టెస్ట్ ఫెయిల్. నువ్వు మరీ స్లో గా టర్నింగ్ చేస్తున్నావ్, ఇలా చేస్తే నీ వెనుక వచ్చే వారికి ఇబ్బంది, నీకు కాంఫిడెన్స్ లేదు... బాగా ప్రాక్టీస్ చేసి రా అన్నాడు examiner టెస్ట్ అంతా అయిపోయాక. ఓర్నీ, నాకు ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం రాక కాదు, మరీ లెర్నర్ రేంజ్ కదా అని స్లో గా డ్రైవ్ చేశాను లేదంటే రాష్ డ్రైవింగ్ అంటావేమో అని అనుకున్నాను.
నువ్వు మరీ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావ్, construction జరుగుతున్న ఏరియా లో 10km తక్కువ స్పీడ్ లో వెళ్ళాలి అని ఏదో చెప్పి ఫెయిల్ అన్నాడు రెండో సారి.
మూడోసారి టెస్ట్ లో నా పక్కన కూర్చున్న examiner రివర్స్ పారలెల్ పార్కింగ్ చేయమంది. రెండే రెండు turns లో పార్క్ చేసి పర్ఫెక్ట్ అనేశాను బయటికి నాకే తెలీకుండా. ఇగో హర్ట్ అయిందేమో, హనుమంతుని ముందే హై జంప్ లా అని ఫెయిల్ చేసేసింది నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అని, పార్క్ చేసిన కార్ వెనుక మరీ క్లోజ్ గా వెళ్ళావు అని.
అలా మూడు సార్లు ఫెయిల్ అయ్యాక ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా నిన్నే ఉదయాన 8 గంటల టెస్ట్ లో పాస్ అయ్యాను.
"నీకేమైనా పిచ్చా పదే పదే అదే సెంటర్ కి వెళ్తావు టెస్ట్ కి. ఆ ఏరియా లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. పెద్ద పెద్ద ట్రక్స్ తిరుగుతుంటాయి, స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క రోడ్ లో ఒక్కో స్పీడ్ లిమిట్ ఉంటుంది, పైగా ఉదయం 8 కి అంటే స్కూల్ టైం స్టార్ట్ అవుతుంది మళ్ళీ దానికో స్పీడ్ లిమిట్. ఇంత కష్టం అవసరమా, సిటీ కి దూరంగా మూడు నాలుగు సెంటర్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళు అక్కడ పెద్దగా పట్టించుకోరు, నువ్వు జస్ట్ డ్రైవింగ్ చేస్తే చాలు పాస్ అనేస్తారు. పైగా నువ్వెప్పుడూ వెళ్ళే సెంటర్ లో పనిచేసే వాళ్ళంతా మన దేశీ గాళ్ళు, మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు" అని ఎంతమంది చెప్పినా మనదంతా కథలో రాజకుమారుడి టైపు కదా ఉత్తరం దిక్కుకు వెళ్ళద్దు అంటే అటువైపే వెళ్ళేటైప్, పట్టు వదలని విక్రమార్కుడు అన్నమాట. చివరికి P బోర్డు సాధించేశాను.
అరే, ఇంకెన్ని సార్లు exam అటెండ్ అవ్వాలి, ఇప్పటికే మూడు సార్లు ఇచ్చాను అని పూర్తిగా నిరాశ పడ్డాను కానీ ట్రై చేస్తూ ఉండాలి అంతే There is an end for everything అని మరో సారి తెలుసుకున్నా.