31, మే 2017, బుధవారం

సిడ్నీ లో ఘనంగా జరిగిన రామారావు జన్మదిన వేడుకలు

ఎక్కడో న్యూస్ పేపర్లో వార్త నా బ్లాగ్ పోస్ట్ కి హెడ్డింగ్ అయిందేమిటబ్బా అనుకుంటున్నారా? 

గత ఆదివారం సిడ్నీ లో తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన రామారావు గారి జన్మదిన వేడుకల గురించి ఈ పోస్ట్.


ఇక్కడ 5 ఏళ్లుగా ఉంటున్నాకూడా, ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకలకు ఎప్పుడూ వెళ్లలేక పోయాను. ఈ సారి మాత్రం వీలు చూసుకొని వెళ్ళాను. ఒక్కచోట అంత మంది తెలుగు వాళ్ళను సిడ్నీ లో చూడటం ఇదే మొదటి సారి.

మేము వెళ్ళేప్పటికీ పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, కాకపొతే మా వాడు అటు ఇటు పరిగెత్తుతూ ఉండటం తో వాడితో రన్నింగ్ రేస్ లో పాల్గొనటం వలన అవేవీ చూడలేకపోయాను. వాడు పడుకున్నాక కాస్త తీరికగా కూర్చుని అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. 

ఇంతలో నా పక్కన ఉండే సీట్ లో కూర్చున్న వ్యక్తి(50 ఏళ్ళు ఉండచ్చు అనుకుంటున్నాను) నాతో మాట్లాడటం మొదలెట్టాడు 

మీరు  నాయుడూసా లేక చౌదరీసా?

రెండూ కాదండీ.

మరి ఏ కులం?

ఖర్మరా బాబు ఖండాలు దాటినా కులాల పట్టింపులు మాత్రం పోలేదు అనుకొని 'రెడ్డి' అన్నాను. 

అలాగా జగన్ మోహన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి నాకు బాగా పరిచయం అన్నాడు 

'సమర సింహా రెడ్డి' , 'ఇంద్ర సేనా రెడ్డి' , ' ఆది కేశవ రెడ్డి'  నాకు  బాగా తెలుసు అందామనుకొని సైలెంట్ అయిపోయాను 

అప్పట్లో కాంగ్రెస్ లో ఉండేవాడిని, ఆ తర్వాత తెలుగు దేశం లోకి మారాను అన్నాడు. 

'ఏం తరిమేశారా?' అందామనుకొని ఊరికే ఉండిపోయాను 

రాజ శేఖర్ రెడ్డి అప్పట్లో నాకు బాగా తెలుసు. నేనెంత చెపితే అంత తనకు అన్నాడు. 

అవును నాకు కూడా ట్రంప్ బాగా తెలుసు ఇప్పట్లో, కాకపొతే తనకే నేను తెలీదు అందామనుకొని ఊరికే ఉండిపోయాను. 

జగన్ మాత్రం వాళ్ళ నాయనలా కాదబ్బా, కొంచెం నేర్చుకోవాల అన్నాడు 

ఏం నేర్చుకోవాలండి అన్నాను 

పద్దతి నేర్చుకోవాలబ్బ. పెద్ద వాళ్ళను రాజ శేఖర్ రెడ్డి ఎంత బాగా గౌరవించేవాడు అది ఈ పిలగాడికి రాలా అన్నాడు. 

యంగ్ జెనరేషన్ కదండీ కాస్త దూకుడెక్కువుండచ్చు అన్నాను 

అది కాదులే అబ్బి..వాళ్ళ నాయన్ను కూడా ఆ వయసులో చూశానుగా ఆయన పద్దతి వేరు అన్నాడు.  

కొడుకును తండ్రితో పోలిస్తే కష్టం కదండీ ఆయన ఐడెంటిటీ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ని కూడా వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు తో పోలిస్తే ఎప్పటికీ రెండు మూడు అడుగులు కిందే ఉంటాడు కదండీ అన్నాను. 

రెండు మూడు అడుగులు కాదబ్బాయ్ .. పాతాళం లో ఉంటాడు అన్నాడాయన (ఆయన వాడిన బాష ఇక్కడ వాడటం బాగోదు కాబట్టి నేనిలా మార్చాల్సి వచ్చింది)

ఇంతలో అతనికి ఫోన్ రావడం తో, సరిగ్గా వినపడటం లేదని బయటికి వెళ్ళిపోయాడు.  

ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వహించినా దాన్ని కేవలం N.T.R గారి పుట్టినరోజు వేడుకలగా నిర్వహించారే గానీ చంద్ర బాబు గారి అలాగే వారి సుపుత్రిడి  గురించిన భజన అయితే ఎక్కడా కనపడలేదు, అందుకు సంతోషం. 

ఈ సందర్బంగా ఎన్టీవోడి గురించి నా చిన్ననాటి సంఘటన. 

కర్నూల్ జిల్లా లోని కొత్తకోట గ్రామం లో నేను 5 వ తరగతి చదువుతున్న రోజులు అనుకుంటా. మా టీచర్ ఒకాయన క్లాస్ లోకి రాగానే 'ఎన్నికల ప్రచారం లో భాగంగా రామారావు గారు మన బడి ముందుగా వెళ్తున్నారట' రండి బయటికి వెళ్లి చూద్దాం అని పిలిచారు. 

అందరూ వెళ్లిపోయారు ఒక్కసారిగా నేను తప్ప. అందరితో పాటు పరుగెత్తుకెళ్ళిన మా బడ్ దల్(నా ఫ్రెండ్) వెనక్కి వచ్చి, నువ్వూ రా వెళదాం అని పిలిచాడు 

మనం ఎన్టీవోడి పార్టీ నుంచి కృష్ణ పార్టీ కి మారాము ఆ మాత్రం గుర్తులేదా నీకు.  సిగ్గు, ఎగ్గు, లజ్జ, మానం, మర్యాద నీకు లేవేమో గాని పౌరుషం, సాహసం, సింహాసనం, కురుకేత్రం, అగ్నిపర్వతం ఉన్నాయి నాకు. నువ్వెళ్లు నేను రాను అన్నాను అగ్ని పర్వతం లో కృష్ణ లా రగిలిపోతూ. 

నీకు చిన్నప్పుడు ఏ స్వీట్ అంటే ఇష్టం అన్నాడు 

బెల్లం మిఠాయి 

మరిప్పుడు 

లవ్ లడ్డు (రవ్వ లడ్డును సరిగ్గా పిలవటం తెలీక అలా పిలిచే వాడిని చిన్నప్పుడు)

మరిప్పుడు నిన్ను బెల్లం మిఠాయి తినమంటే తినవా?

పద వెళ్లి చూద్దాం అన్నాను లేచి. 

బయటికి వెళ్లి చూశామా! విజిల్స్, అరుపులూ, కేకలతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా.  ఈ ఊళ్ళో ఇంత మంది జనమున్నారా అనిపించింది. కొందరైతే ఏదో దేవుడు ఊరేగింపుకు వస్తే దండాలు పెట్టినట్లు దండాలు పెడుతున్నారు తమ జన్మ ధన్యమైనట్లు. 

పవన్ కళ్యాణ్ ఫంక్షన్ లో ఫాన్స్ వేసే కేరింతలు, బాహుబలి-2 ఇంటర్వెల్ లో జనాలు పలికే జేజేలు ఇవేవీ సాటి రావు అప్పటి ఆ అరుపులకి.  

అదే మొదటి సారి అలాగే  చివరి సారి ఎన్టీవోడిని చూడటం. 

ఆయనలా వెళ్ళిపోయాక 'నువ్వు జీవితం లో చేసిన రెండో మంచి పని నన్నుకన్విన్స్ చేయడమే' అన్నాను మా 'బడ్ దల్' భుజం తడుతూ. 

మరి మొదటి మంచి పని ఉత్సాహంగా అడిగాడు తన జేబులోంచి ఒక చాక్లెట్ తీసి నా చేతిలో పెడుతూ 

'నాతో  ఫ్రెండ్ షిప్  చేయడం' అన్నాను  ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ. 

24, మే 2017, బుధవారం

సంవత్సర కాలంగా భరిస్తున్నందుకు ధన్యవాదాలు

అలా సరిగ్గా సంవత్సరం క్రితం పులిని చూసి వాతలు పెట్టుకున్ననక్కలా, బాహుబలి అద్భుత విజయం చూసి భారీ బడ్జెట్ తో సినిమాలు తీయాలనుకుంటున్న కొంతమంది గొర్రెల్లా (ఈ గొర్రె అనే మాటకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కమల్ హాసన్ గారి పోలిక ఇది) వాళ్ళు వీళ్ళు రాసిన బ్లాగ్ లను చూసి నేనూ బ్లాగ్ మొదలెట్టాను.

పురిటిలోనే సంధి కొట్టినట్లు బ్లాగ్ అయితే మొదలెట్టాను కానీ ఏం రాయాలో తెలియలేదు.  నేను రాస్తే చదివేవాళ్ళు ఉంటారా అసలు ఏం రాయాలి ఎలా రాయాలి అని తెగ నిరుత్సాహపడ్డాను.

ఆ తర్వాత 'ధైర్యే సాహసే ఆయాసే ఉబ్బసే దగ్గే ఎంకట లక్ష్మే' అని ఏదో ఒకటి రాయడం మొదలెట్టాను. ( ధైర్యే సాహసే లక్ష్మి  అనే దాన్ని చిన్నప్పుడలా సరదాగా అనుకునేవాళ్ళము ఏదైనా పని మొదలు పెట్టాల్సి వచ్చినప్పుడు, మీలో కొందరికి అది గుర్తు ఉండే ఉంటుంది)

ఆదిలోనే హంసపాదు అన్నట్లు మొదట్లో నేను రాసిన ఒక పోస్ట్ చదవమని నా మిత్రుడిని అడిగితే నాకు తెలుగు మాట్లాడటం వచ్చు కానీ చదవడం రాదు అన్నాడు (నెల్లూరు కుర్రాడే కానీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లో చదివాడట మరి)

సరే అని మా ఆవిడ ని అడిగితే చదివే ఓపిక లేదు నువ్వే చదువు వింటాను అంది .హతవిధీ! పగవాడైన మా మేనేజర్ కు కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనుకున్నాను. 

అలా రెండు మూడు పోస్ట్లు రాసి పోస్ట్ చేసాక, ఎవరైనా చదువుతున్నారా అని అనుమానం వచ్చింది. ఎవరైనా చదువుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది, కనీసం కామెంట్ పెడితే చదువుతున్నారని తెలుస్తుంది అని అనుకున్నాను. ఇక అప్పటి నుంచి  

C.M పోస్ట్ కోసం జగన్ లా, 
P.M పోస్ట్ కోసం రాహుల్ లా, 
అమరావతి కోసం ఆంధ్రుల్లా, 
చంద్రుని కోసం చకోర పక్షిలా

కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్న నా నిరీక్షణ కు తెర పడింది ఒకరో ఇద్దరో కామెంట్ పెట్టడంతో. 

ఆ కామెంట్స్ తో కాస్త ఉత్సాహం వచ్చి అప్పటినుంచి గుడ్డెద్దు చేలో పడ్డట్లు తోచింది రాసుకుంటూ వస్తున్నాను. కొన్ని మీకు నచ్చి ఉండచ్చు మరికొన్ని నచ్చక పోయి ఉండచ్చు. చదువుతున్న వారికి అలాగే చదివి అభిప్రాయలు షేర్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. 


పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు కాకుండా కనీసం పది కాలాల పాటు పడుతూ లేస్తూ  అయినా ఏదో ఒకటి రాస్తూ ఉండాలని అనుకుంటున్నాను. (రాయబట్టి సంవత్సరం, అంటే 3 కాలాలు అయిపోయాయి, ఇంకా పది కాలాల పాటు అంటే ఇంకో 3 సంవత్సరాలు రాస్తావా? ఆశకైనా హద్దు ఉండాలి రా వెధవ - నా అంతరాత్మ గోల ఇది. పట్టించుకోకండి  ప్లీజ్ )

ఇంతోటి బాగోతానికేనా మీసాలు గొరిగాడు అన్నట్లు బ్లాగ్ మొదలెట్టి సంవత్సరమైనందుకే ఇంత హంగామా చేసావు , నీ  సంబడం సంతకెళ్లా ఈ మాత్రం దానికే ఒక పోస్ట్ పెట్టాలా అంటారా ఏం చేస్తాం కాకి పిల్ల కాకికి ముద్దు కదండీ అందుకే ఈ సంబడం.

మొన్నా మధ్య నా మిత్రుడు ఫోన్ లో మాట్లాడుతూ నీ పోస్టులు చదువుతూ ఉంటాను అందులో నీ సృజనాత్మకత బాగుంది అన్నాడు

పొరపడినట్లున్నావ్.. నాకు ఆ సృజన ఎవరో ఆవిడ ఆత్మకథ ఏమిటో అస్సలు తెలీదు అని చెప్పేశా, ఆ తర్వాత అతను కింద పడి గిల గిల కొట్టుకున్నట్లు వాళ్ళావిడ చెప్పగా వినడమే తప్ప అతనితో తర్వాత మాట్లాడలేకపోయాను.

అప్పటినుంచి ఆ సృజనాత్మకత ఎప్పుడు రాశానబ్బా అని నా బ్లాగ్ పోస్ట్ లన్ని వెదుక్కుంటున్నా. కొంపదీసి నా బ్లాగ్ కూడా అందరి సెలెబ్రెటీల అకౌంట్స్ లా హాక్ చేసి ఎవరైనా పోస్ట్ చేసి ఉంటారా ?

అవును మరి నువ్వో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వి, సింగర్ సుచిత్రవి కదా అందుకని నీ అకౌంట్ ని హాక్ చేసి ఉంటారు అంది నా అంతరాత్మ. 

చెప్పలేము కదా ఎవరైనా నా బ్లాగ్ ని హాక్ చేసి ఉండచ్చు

బుద్ధి ఉంటే సరి నువ్వేమైనా మనిషివా చలపతిరావువా?  వాళ్లంటే సెలెబ్రెటీలు, వాళ్ళ అకౌంట్స్ హాక్ అయ్యానని చెప్పుకుంటుంటారు. అంతెందుకు రేప్పొద్దున రేపుల స్పెషలిస్ట్ అయిన ఆ చలపతి రావు లాంటి వాళ్ళు కూడా నా గొంతు ఎవరో హాక్ చేసి ఆ మాట అనిపించారు అని ఒక స్టేట్మెంట్ పడేస్తారు. అయినా బోడి నీ అకౌంట్ ఎవడు హాక్ చేస్తాడు?

మరి ఎవరూ హాక్ చేయకపోతే నేను రాయకుండానే ఆ సృజన గారి ఆత్మ కథ నా బ్లాగ్ లో ఎలా కనిపించి ఉంటుందబ్బా నా మిత్రుడికి ?

22, మే 2017, సోమవారం

సరిగ్గా 363 రోజుల క్రితం

సరిగ్గా అటు ఇటుగా సంవత్సరం క్రితం ఒక బ్లాగ్ ఓపెన్ చేసి ఏమైనా రాద్దామనుకున్నప్పుడు నా అంతరాత్మకు, నాకు జరిగిన సంభాషణ. 

బ్లాగ్ రాయాలనుకుంటున్నావ్ బాగానే ఉంది..టైం దొరుకుతుందంటావా?

అవేమైనా 5 సెంట్స్ కాయిన్ అనుకుంటున్నావా, రోడ్డు మీద దొరకడానికి?

అంటే నా ఉద్దేశం బ్లాగ్ రాయడానికి టైం కేటాయించ గలవా అని?

వారం లో ఒక గంట అయినా కేటాయించలేనా? నా తిప్పలేవో నేను పడతాను.

ఏం పేరు పెడదామనుకుంటున్నావ్?

కడప కత్తి, నాటు బాంబులు, రాయల సీమ రెడ్డి ఇలా ఏదో ఒకటి.

సాంబారు బుడ్డి, గంపలో గడ్డి, నీ మొహం మడ్డి .. ఏంటా పేర్లు నువ్వేమైనా ఫ్యాక్షన్ సినిమా తీస్తున్నావా?

ఏదో సీమ వాడిని కదా అలా relate చేసుకుంటే బాగుంటుందని

నీ మొహం అదొక డబ్బా ఐడియా

మరి బఠాణీలు, మరమరాలు , జంతికలు, వేడి వేడి పకోడీలు అని పెట్టుకుంటే?

అప్పడాలు, వడియాలు, పిడత కింద పప్పులు, డబ్బాలో మురుకులు అని పెట్టుకో, రాసే కబుర్లకు ఇదే ఎక్కువ. 

పోనీ కాఫీ కబుర్లు, టీ టైం చతుర్లు ?

పాల పుంతలు , మజ్జిగ ముంతలు , వెచ్చటి బొంతలు , సంతలో సరుకులు అని పెట్టుకో ఇంకా బాగుంటుంది

ఊసుల లోగిలి, పవనం, చిరు జల్లులు, తొలకరి చినుకులు

ఉరుములు పిడుగులు అని పెట్టుకో దెబ్బకు నీ బ్లాగ్ పక్కకు ఎవరూ రారు. నువ్వు రాసే లొల్లాయి కబుర్లకు అలాంటి కవితాత్మకమైన పేర్లు అవసరమంటావా?

పోనీ సినిమా కబుర్లు అని పెడితే

సినిమా కబుర్లు అని పేరు పెడితే, చిన్నప్పుడు గోళీలాడి గ్రాండ్ స్లాం గెలుచుకున్నాను, పరుగు పందెం లో పది రికార్డ్స్ సాధించాను, సొల్లు కబుర్లు చెప్పడం లో స్టేట్ ఛాంపియన్ని లాంటి గొప్పలు చెప్పుకోవడం కుదరదు.

అసలు నువ్వు దేని గురించి రాయాలనుకుంటున్నావో క్లారిటీ తెచ్చుకో. రాజకీయాల గురించి రాయాలనుకుంటున్నావా? 

M.P కి M.L.A కి తేడా కూడా తెలీదు ఇక రాజకీయాల గురించి ఏం రాస్తాను?

లేక సాహిత్య సౌరభాలు వెదజల్లలనుకుంటున్నావా?

సాహిత్య అంటే అమ్మాయి పేరని, సౌరభ్ అంటే సౌరభ్ గంగూలీ అని తెలుసు కానీ వాళ్ళను వెదజల్లడం ఎలాగో నాకస్సలు తెలీదు.

కనీసం నీ రచనలతో ప్రజలను చైతన్య పరుద్దామనుకుంటున్నావా?

చాప పరచడమో, దుప్పటి పరచడమో అయితే చేయగలను గాని చైతన్యం ఎలా పరవాలో నాకు తెలీదు

కార్మిక, కర్షక సోదరుల గురించి ఏమైనా రాయగలవా?

కరిష్మా, కరీనా సోదరీమణుల గురించి అయితే కాస్తో, కూస్తో రాయగలను గానీ కార్మిక, కర్షక సోదరుల గురించి నేనేమి రాయలేనందుకు సిగ్గు పడుతున్నాను.

కనీసం రామాయణమో, భారతంలో జరిగి కొన్ని ఘట్టాల గురించి

రామాయణం కడు రమణీయం, రామాయణం లో రాముడు హీరో, భారతం లో కృష్ణుడు హీరో, రామాయణం రంకు, భారతం బొంకు అని వాళ్ళు వీళ్ళు అంటే విన్నాను కానీ ఏ రోజు అవి చదవని అవివేకిని. 

కనీసం కృష్ణ శాస్త్రి కవితలో, రావి శాస్త్రి రచనలో, శ్రీరంగం శ్రీనివాసరావు వంటి అభ్యుదయ రచయిత రాసిన పుస్తకాలో చదివావా?

ఈ శ్రీరంగం శ్రీనివాసరావు ఎవరు?  ఎప్పుడూ వినలేదే?

అగ్గి పుల్ల,  కుక్క పిల్ల,  సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్న శ్రీ శ్రీ గారు తెలీదు నువ్వూ ఒక బ్లాగ్ రాయడమే, 

హుర్రే దొరికేసింది.. నా బ్లాగ్ కు ఒక పేరు దొరికేసింది 'కాదేదీ బ్లాగ్ కి అనర్హం' .

అసలేమీ తెలీకుండా ఒక బ్లాగ్ రాసేస్తావా? అసలేం అర్హత ఉందని?

వెయ్యి కథలు చదివాక ఒక కథ రాయడం మొదలెట్టు అని నాకొక సలహా ఇచ్చాడు మా మాథ్స్ లెక్చరర్ ఒకసారి

ఆయనెందుకు అలా సలహా ఇచ్చాడు

అదో  పెద్ద కథ..ఇంకో సారి చెప్పుకుందాం

అయినా ఆ సలహాకు ఈ బ్లాగ్ కి ఏంటి సంబంధం?

'వెయ్యి కథలు చదివాక ఒక కథ రాయడం మొదలెట్టు అని' ఆయన అన్నారు, వెయ్యి కథలు చదివక పోయినా, వెయ్యి బ్లాగు పోస్టులు అయితే చదివి ఉంటాను కాబట్టి మా లెక్చరర్ ప్రకారం నేను ఒక బ్లాగ్ మొదలెట్టచ్చు. 

18, మే 2017, గురువారం

ప్లాట్ నెంబర్ 62 బ్లాగోతానికి పునః స్వాగతం


ప్లాట్ నెంబర్ 62 కి తరువాయి భాగం చదవండి.

మీరంత బెదిరిస్తే చెప్పక ఛస్తానా? పైగా నా గెస్ట్ మీరు చెప్పకుండా ఉంటానా?

ఆ ఇద్దరు ఎవరంటే పక్క వీధిలోని C.D షాప్ ఓనర్, జయభారత్ థియేటర్ ఓనర్. 

సంబంధం లేకుండా మోకాలికి బోడిగుండుకు ముడి పెడుతున్నానంటారా? అబ్బే సంబంధం ఉంది.. అదే చెబుతున్నా. 

నన్ను నమ్ముకొని పోయిన ఏడాది ఇల్లు కట్టించుకొని, ఈ ఏడాది పిల్ల పెళ్లి చేయాలనుకున్నవాడు ఆ C.D షాప్ ఓనర్, అలాగే సెకండ్ షిఫ్ట్ మీద కొత్తగా రిలీజ్ అయిన సినిమాను ఆడించుకునే బదులు ఎప్పటికైనా ఫస్ట్ రోజే పవన్ కళ్యాణ్ సినిమాను తన థియేటర్ లో రిలీజ్ చేసుకునే ఆర్ధిక స్తొమత  కోసం నా మీద భరోసా పెట్టుకున్న వాడు ఆ జయభారత్ థియేటర్ ఓనర్.  అదే వాళ్ళిద్దరికీ, వారికి రెగ్యులర్ కస్టమర్ ని అయిన నాకు మధ్య ఉన్న ఆర్ధిక సంబంధం. 

పదండి దగ్గర్లో మంచి టీ స్టాల్ ఉంది అక్కడ టీ తో పాటు మిర్చి బజ్జి, ఎగ్ బజ్జి కూడా భలే ఉంటాయి. యెంత దూరమంటారా ఇక్కడే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్

ఇదేంటి ఊరి మధ్యలో 'వెల్కమ్ టు తిరుపతి' అని బోర్డ్ పెట్టారని అడుగుతున్నారా?

ఊరి మధ్యలో కాదండి మనం ఊరి బయటకి వచ్చేశాం. 5 కిలోమీటర్స్ వచ్చేసాం ఇంకెంత 3 కిలోమీటర్స్ వెళితే మంచి ధాబా ఉంటుంది అక్కడికెళ్లి డిన్నర్ చెయ్యొచ్చు సారీ టీ తాగొచ్చు. ఇంకెంత 3 కిలోమీటర్లు,  టూ వీలర్ మీద అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం పదండి. 

టూ వీలర్ ఎ.. క..డా  అంటున్నారా?

మన రెండు కాళ్ళు మనకుండగా మళ్ళీ  టూ వీలర్ ఎందుకు దండగ?  నా  ఉద్దేశ్యం ప్రకారం మనకున్న టూ లెగ్స్ టూ వీల్స్ కదా అందుకే అలా అన్నాను 

నువ్వు నీ తొక్కలో ఉద్దేశ్యం .. అదే 10 కిలొమీటర్లు ఇటు వైపు వెళ్తే తిరుమల కొండపైకి ఎక్కి దేవుడికో హాయ్ చెప్పి ఒక టీ తాగి రావచ్చు. అయినా నీతో టీ కి వెళ్లడమంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అంటారా? నువ్వు నీ సోది, తలనొప్పి తెప్పిస్తున్నావ్? %$#%#$%#$%$#%$#% అంటారా?

ఆపండి బాబోయ్ !!! మీ తలనొప్పి తగ్గిపోతుంది, ఇక్కడే ఎక్కడో చోట టీ తాగేద్దాం.

ఇప్పుడే చెబుతున్నాను టీ తాగాక మా చిన్నితో కాస్త జాగ్రత్త. కొత్త చెప్పులు కొనాలి షాప్ కి వస్తావా అని అడిగితే పొరపాటున కూడా వెళ్ళకండి. తనకి సరిపడే  చెప్పులు దొరకాలంటే తిరుపతి లో ఉండే షాప్స్ అన్ని వెతకాల్సిందే లేదా స్పెషల్ గా ఆర్డర్ చేసి తయారు చేయించాలి లేదూ instant గా కావాలి అంటే దగ్గర్లో ఏదైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. అక్కడైతే పెద్ద పెద్ద చెప్పులు ఉంటాయి గుడి బయట పూజ కోసం, అవి కొట్టుకొచ్చెయ్యాలి, పాపమైన సరే తప్పదు మరి అతని కాళ్ళ సైజు అలాంటిది.

భాగవతం లో బలి చక్రవర్తి వామనుడికి దానమిస్తానన్న మూడడుగుల నేల కథలో రెండు పాదాలతోనే లోకమంతా  కొలవడం ఏమిటి మరీ కట్టు కథ కాకపొతే అని కొట్టి పడేసే వాళ్ళెవరైనా ఉంటే మా చిన్ని భయ్యా పాదం సైజు చూశాక బహుశా అది నిజమే అయి ఉండచ్చు అని నమ్మేస్తారు.  

(నీ పాదం మీద దిష్టి చుక్క పెడుతున్నానన్నయ్యా  .  ఎవరి దిష్టి తగలకుండ )

చెప్పడం మర్చిపోయాను టీ మాత్రమే కాదు ఫ్రెండ్షిప్ అన్నా మహా ఇష్టం మా చిన్ని భయ్యా కి. (అసలే తన కాళ్ళ మీద జోక్ చేశాను కాబట్టి లాస్ట్ లో ఈ మాట చెప్పి బాలన్స్ చేశాననుకుంటున్నారేమో, కాదండీ నిజ్జంగానే ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం తనకి)

9, మే 2017, మంగళవారం

ప్లాట్ నెంబర్ 62 కి పునః స్వాగతం


క్షమించాలి .. మిమ్మల్ని నిద్ర లేపటం కాస్త ఆలస్యమైంది. ఎక్కడున్నాను అని దిక్కులు చూస్తున్నారేమిటి?  మీ ఖర్మ కాలి టైం మెషిన్ ఎక్కి ప్లాట్ నెంబర్ 62 కి వచ్చారు.

ఓహో గుర్తుందా మంచింది. ఏమిటి నిద్ర లేచాక కాస్త టీ తాగాలనిపిస్తోందంటారా?

చక్కటి ఆలోచన.. పదండి అలా బయటికి వెళ్లి చిక్కటి టీ తాగొద్దాం. అదిగో టీ అనగానే రివ్వున గువ్వలా దూసుకువస్తున్నాడు చూడండి అతనే మా చిన్ని భయ్యా  (అసలు పేరు గురు లక్ష్మీకర్, మేము పెట్టుకున్న కొసరు పేరు చిన్ని).

అర్థరాత్రి అయినా సరే లేపి టీ తాగుదాం వస్తావా అంటే సై అని ఎవడంటాడో వాడే మా చిన్న భయ్యా.  తనతో వెళదాం పదండి టీ తాగి రావడానికి.

ఏంటి? అక్కడ కనపడే హోటల్ కి వెళదాం అంటారా?

మీ ఇంట్లో చెప్పే వచ్చారా? ఆ హోటల్ గురించి తెలుసే మాట్లాడుతున్నారా? అసలు  ఏ హోటల్ పేరు చెబితే జనాలు ఆ హోటల్ లో తినడం మానేసి మూడు పూటలా పస్తు అయినా ఉండటం బెస్టు అనుకుంటారో , ఏ హోటల్ పేరు చెబితే తొక్కలో ఉండే అరటి పండైనా తిని ఆ పూటకు కడుపు నింపుకుంటారో, ఏ హోటల్ పేరు చెబితే బస్ స్టాండ్ లో బఠాణీలు తిని అటే రిటర్న్ బస్సు ఎక్కి వెళ్ళిపోతారో ఆ హోటలేనండి ఈ పులిరాజు హోటల్. 

ఆ T.V add లో వచ్చే పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందో రాదో తెలీదు కానీ ఈ పులిరాజు హోటల్లో తింటే మాత్రం వెంటనే నరకానికి రైడ్ గ్యారెంటీ. (ఆత్మహత్య కు నరకమే ప్రాప్తి అని ఎక్కడో చదివినట్లు గుర్తు) తమిళనాడు కు చెందిన అతడి వంటలకు తమిలోళ్ళే తట్టుకోలేకపోయారు  ఇక మనమెంత జుజుబీ. అసలు తమిళ్ వాళ్ళు సాంబార్ యెంత కమ్మగా పెడతారండీ, ఇతనెందుకో మరి అంత చెండాలంగా చేస్తాడు. తమిళోళ్ళ పరువు తీసేసాడు. ఇతనితో పాకిస్తాన్ లో ఆ ఉగ్రవాదులుండే చోట ఒక హోటల్ పెట్టిస్తే బాగుండు.  ఇతని జన్మకి ఒక సార్థకత లభిస్తుంది, అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక పరమ శూర ఘోర వీర చక్ర కూడా. తధాస్తు..ఆమెన్. (క్షమించాలి నా ఈ అతి వీరావేశానికి)

ఒకసారి గ్రహపాటునో పొరపాటునో చపాతీ తిందామని వెళ్తే చపాతీ లోకి సాంబార్ ఇచ్చాడు మహానుభావుడు. అయినా అదేం కాంబినేషన్ ఛండాలంగా? లంగా వోణి తో అందంగా ఉన్న అమ్మాయి పక్కన లుంగీ కట్టుకున్న అబ్బాయిని జోడి గా నిలబెట్టినంత ఛండాలంగా ఉంది. ఏ పప్పో, ఆలూ కర్రీ నో అయితే పంచె కట్టుకున్న అబ్బాయి లాగానో లేక ప్యాంటు వేసుకున్న అబ్బాయి లాగానో ముచ్చటగా ఉండేది జోడి. (ఏంటి? నా పోలిక చపాతీ,సాంబార్ కాంబినేషన్ కన్నా దరిద్రంగా ఉందంటారా? ఏదో ఫ్లో లో అలా వచ్చేసింది..మన్నించాలి. రోజూ చూస్తున్న దిక్కుమాలిన తెలుగు సినిమాల ప్రయాసల ప్రాసల ప్రభావం)

ఆ రోజు అలా సాంబార్ తో చపాతీ తినలేక  వచ్చేసాను కాబట్టే ఈ రోజు ఇలా మీ బుర్ర తినడానికి  తయారయ్యాను. అప్పుడు ఏ నక్క తోకో తొక్కి వెళ్లి ఉంటాను గానీ లేకపోతే కుక్క చావు చావాల్సి వచ్చేది.  అదే జరిగుంటే నాతో పాటు మరో ఇద్దరి పేర్లు నరకం లో రిజిస్టర్ అయ్యేవి ఆ రోజో మరుసటి రోజో.

ఇంకో ఇద్దరెవరంటారా? వద్దులెండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అన్ని రహస్యాలు మీకు చెప్పడం బాగోదు.

అయినా ఆ పులిరాజు హోటల్ లో తినాలంటే పులి మీద రైడ్ చేసేంత దైర్యం కావాలి, నాకంత లేదు వేరే హోటల్ వెతుక్కుందాం పదండి.

ఏంటి అక్కడేదో ఇంకో హోటల్ ఉంది వెళదాం అంటారా వద్దండి.

రుచి గురించి కాదండీ బాబోయ్, 'బాబాయ్ హోటల్' అని రుచి,శుచి బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతైనా గుంటూరు వ్యక్తి కదా వంటలు అద్భుతంగా చేస్తాడు. కాకపొతే రుచి, శుచి కోసం పొతే మన మెదడు వాచి పోతుంది ఆయన గొప్పలు వినలేక. 

అబ్బో ఆ రోజుల్లో అయితే అని మొదలెట్టి "సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశానని, ఎన్టీవోడు అయినా అక్కినేని అయినా నేను యెంత చెబితే అంతే అని" పప్పు వేసినప్పుడల్లా డప్పుతో, రసం వేసినప్పుడు సన్నాయితో, మజ్జిగ వేసినప్పుడు మద్దెలతో మన పొట్ట చించి ఫిడేలు, డొక్క చించి డోలు వాయించేస్తాడు, పీకల దాకా మెక్కి ఉంటామా ఆ వాయింపుకు  ఎటూ పారిపోలేక మెక్కడానికి వెళ్లిన మనం మన చొక్కా మనమే చించేసుకొని ఆయన గోచినే లాక్కొని వెంకన్నకు మొక్కు తీర్చడానికి పెట్టుకున్న తలను కుర్చీ పైకెక్కి అక్కడున్న ఫ్యాన్ రెక్కకి అర్పించేయాలి, దానికంటే ముక్కు మూసుకొని తపస్సు చేసినా వెంకన్న దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లొచ్చు. అందుకే అటు వైపు వద్దులెండి అసలే నన్ను నమ్ముకొని ఇద్దరున్నారు.

నీ ఇద్దరి గొడవేమిటయ్యా .. అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు నిన్ను నమ్ముకొని ఉన్నారో తెలిసీ చెప్పకపోయావో నీ తల ఆ పులిరాజు బారిన, ఈ బాబాయ్ బారిన పడ్డ బాధితుల సంఖ్య అంత ముక్కలవుతుంది అంటారా? కాస్త ఓపిక పట్టండి చెప్తాను.