27, జూన్ 2016, సోమవారం

ఈ సారి కృష్ణ గారి పార్టీ నుంచి చిరంజీవి పార్టీ లోకి కప్ప దాట్లు

ముందు టపా కి తరువాయి భాగం ఇది.

నా చిన్నతనమంతా పల్లెలలోనే గడిచింది. అప్పట్లో సినిమా చూడాలంటే  పక్కనున్న టౌన్ కో లేదా వారానికోసారి దూరదర్శన్ లో వచ్చే సినిమాలే ఆధారం. మేముండే పల్లెలో నెలకు ఒకసారి బట్ట సినిమాలు వేసేవారు. ఇక ఆ రోజు మా నాన్న ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉండేవాడిని. ఇంటికొచ్చిన మా నాన్నకు అర్థం అయ్యేది ఇది వీడు సినిమా కు పోవడానికి వేసిన ప్లాన్ లో భాగం అని.

గోపాల్ పళ్ళపొడి వదిలేసి కోల్గేట్ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటున్న రోజులవి. నేను కూడా అలా ఓ రోజు కోల్గేట్ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటుంటే మా బడదల్ వచ్చి రేపు రాత్రి తోడుదొంగలు అనే సినిమా వేస్తున్నారు అని చెప్పాడు. కృష్ణ హీరో ఆ పైన తోడుదొంగలు అనే మంచి కిక్కిచ్చే పేరు, ఫైటింగ్స్ బాగానే ఉంటాయని పేరు చూస్తే తెలిసిపోతుంది. తోడు దొంగలు అన్నారు కదా ఇంకో హీరో ఎవడురా ఎన్టీవోడా, నాగ్గాడా, లేక శోభన్ బాబా అని అడిగితే వీళ్ళెవరూ కాదు చిరంజీవి అని ఎవరో కొత్త హీరో అట అన్నాడు. అంతవరకు బావి లోని కప్ప లాంటి నేనైతే ఆ పేరున్న హీరో గురించి ఎప్పుడూ వినలేదు కాబట్టి వీడెవడో ఆటలో అరటిపండు లాంటి వాడు అయుంటాడు ఏదో ఇంకో హీరో కావాలి కాబట్టి ఎవరూ దొరక్క వీడిని తీసుకొని ఉంటారు అని అనుకున్నాను.

జనాలు రామకృష్ణ కాఫీ లాంటి లోకల్ బ్రాండ్స్ వదిలేసి గ్రీన్ లేబుల్ కాఫీ వెంట పడుతున్న రోజులు. అలా మా అమ్మ కూడా గ్రీన్ లేబుల్ కాఫీ ఆస్వాదిస్తున్నప్పుడు ఇంత కన్నా మంచి సమయం మించిన దొరకదు అని సినిమా ప్రపోసల్ తన సైడ్ నుంచి O.K చేయించుకున్నాను. ఇక నాన్న ఎలాగూ భోళా శంకరుడే ఆయన దగ్గర O.K చేయించుకోవడానికి పైన చెప్పిన చిట్కా ఎలాగూ ఉంది కనుక భయం లేదు. 

సినిమా మధ్యలో తినడానికి కావలసిన బజ్జీలు, జంతికలు, బెల్లం మిఠాయి, పాకం పప్పు లాంటివి శెట్టి గారి షాప్ లో కొనుక్కెళ్ళాము కానీ సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడొంతులు పైనే ఖాళీ చేసేసాము, మిగిలిన ఆ ఒక్క భాగాన్ని సినిమా అయిపోయాక ఇంటికి పోయేప్పుడు తింటూ వెళదాం అని పక్కన పెట్టుకున్నాము.

కృష్ణ కంటే ముందే చిరంజీవి సినిమా లో ఎంటర్ అయ్యాడు కాసేపయ్యాక తెలీకుండానే కళ్ళు అతని వైపు attract అవుతున్నాయి. దేవతలు మళ్ళీ ఆ కళ్ళు ఆర్పకుండా ఉండే వరాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేసేశారు. మొదటి పాట మొదలైంది. ఆ పాటలో కృష్ణ ఏమో మామూలుగా మర్యాదగా సైకిల్ తొక్కుతున్నాడు కాని చిరంజీవి ఏమో హేండిల్ ని అటూ ఇటూ తిప్పుతూ ఒక్కోసారి చేతులు వదిలేస్తూ ఇలా సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు, బంతి లాగా గెంతుతున్నాడు, మాంచి మాంచి డాన్సులేస్తున్నాడు.

అంతవరకూ సినిమాల్లో హుందాగా మెట్లు దిగే హీరోనే చూసాను కాని చిరంజీవి మాత్రం రెండు మూడు మెట్లు స్కిప్ చేస్తూ గెంతుకుంటూ ఎగురుకుంటూ దిగుతాడు ఒక సీన్ లో. ఇలాంటి రకరకాల విన్యాసాలతోనే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మొన్నటి చచ్చుబడిన చపాతి ని ఇవాళ తిన్నట్లు రుచిగా అనిపించకపోవచ్చు కానీ డైరెక్ట్ గా పెనం మీది చపాతీని ప్లేట్ లో వేసుకొని వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో ఆ ఫీట్లు డాన్సులు ఆ కాలంలో కుర్రాళ్ళుగా  ఉన్న నా లాంటి వాళ్ళను అంతగా ఆకట్టుకున్నాయి.

మొత్తానికి సినిమా అంతా అయిపోయాక ఇడ్లి కంటే చట్నీ టేస్ట్ గా ఉన్నట్లు కృష్ణ గారు ఎర్రగా, ఎత్తుగా అందంగా ఉన్నా చిరంజీవి కోతి చేష్టలు బాగా ఆకట్టుకోవడంతో త్రాసు కాస్త చిరంజీవి వైపు తూగింది. 

సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తూ ఇందాక తినకుండా మిగిలినవి కొన్ని ఉన్నాయి కదా ఇవ్వు తింటూ వెళదాం అని అడిగాను.

ఇంకెక్కడున్నాయ్ ఎప్పుడో తినేసాను అన్నాడు

ఎప్పుడు అని అడిగాను

ఆ జయమాలిని పాట వచ్చినపుడు, చుట్టుపక్కల భూకంపం వచ్చినా ఆ టైం లో నువ్వు పట్టించుకోవు అని తెలుసు అందుకే మిగిలినదంతా ఆ పాట అయిపోయేలోగా తినేసాను అన్నాడు.

మిగతా ఏ విషయం లో నైనా అమాయకుడేమో కానీ తిండి విషయం లో మాత్రం మా వాడి బుర్ర మహా బాగా పనిచేస్తుంది.

మరుసటి రోజు చిరంజీవి గురించి కూపీ లాగాను మా అమ్మ దగ్గర నుంచి. తాను అప్పటికే చూసిన పున్నమి నాగు సినిమా గురించి గొప్పగా చెప్పింది.  ఇక ఆ తర్వాత చట్టానికి కళ్ళు లేవు, న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సినిమాలతో అభిమానం పీక్స్ కు చేరింది.

పార్టీ మారదామని మళ్ళీ ఓ రోజు మీటింగ్ మా బడదల్ తో.

టాట్ టూట్ నేను మారనంతే ఖరాకండిగా చెప్పేశాడు.

నేను నీ ఫ్రెండ్ ని నా మాట వినవా అని request చేస్తూనే "స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం" అనే పాట కూడా గుర్తుచేసాను.

అయినా అలా చీటికీ మాటికీ పార్టీ మారడం అన్యాయం అన్నాడు

ఇక వీడికి అప్పుడెప్పుడో చేసిన కృష్ణ బోధ లాంటిదే ఇంకో నికృష్ట బోధ చేసి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నాను. చూడు బడదల్ "నిన్నటి వరకు నిక్కర్లతో తిరుగిన మనం ఇప్పుడు పాంట్ వేసుకుంటున్నామా లేదా? ఎందుకు పెద్దవాళ్ళం అవుతున్నాం పైగా అందరూ వేసుకోవడం మొదలు పెట్టారు కాబట్టి.  తప్పులేదు కాలం తో పాటు update అవ్వాలి" అని కన్విన్స్ చేశాను.

అయినా కూడా నాకెందుకో ఇలా పార్టీ మారడం అంటూ నసిగాడు.

అవునులే నేను చెప్తే ఎందుకు వింటావ్ అదే గుడి దగ్గర టెంకాయలు అమ్మే వెంకట లక్ష్మి చెప్తే వినేవాడివి కదా అన్నాను.

అది కాదు ఇలా పార్టీ మారడం న్యాయం అనిపించటం లేదు పవన్ అని అంటూనే వెంకట లక్ష్మి గుర్తుకు వచ్చి మనోడు కాస్త సిగ్గుపడిపోయాడు.

ఇదే మంచి సమయం అని "మొన్నటి వరకు రేగ్గాయలు అమ్మే రమణమ్మ అంటే ఇష్టపడ్డావ్, మరి నిన్నటి నుండి రమణమ్మ కంటే కాస్త బాగుందనేగా వెంకట లక్ష్మి అంటే ఇష్టపడుతున్నావ్ మరి ఇందులో మాత్రం న్యాయం ఉందా" అని తిరుగులేని లా పాయింటు లాగాను జస్టిస్ చౌదరి కి కాలు విడిచి వేలు పట్టుకున్న మేనమామ కొడుకులా. చెప్పానుగా ముందు టపాలోనే జల్లెడతో నీళ్లు పోసే టైప్ మా వాడని పార్టీ మారడానికి ఒప్పుకున్నాడు కాదు ఒప్పుకునేలా చేసాను.

రెండవ కప్పదాటు .. కృష్ణ గారి పార్టీ నుంచి చిరంజీవి పార్టీ కి మారాము.

మా బడదల్ అసలు పేరు చెప్పలేదు కదూ "ఓబులయ్య". తనకి ఆ పేరు నచ్చలేదు కాబట్టి బడదల్ అనే పేరుతోనే పిలవడాన్ని ఇష్టపడేవాడు.

ఇక మూడవ కప్పదాటు గురించి తర్వాతి టపాలో 












24, జూన్ 2016, శుక్రవారం

కప్ప దాట్లు - ఎన్టీవోడి పార్టీ నుంచి కృష్ణ పార్టీ కి

రాజకీయ నాయకులు కప్ప దాట్లు వేసినట్లు నేను కూడా ఆ రోజుల్లో అన్న గారి పార్టీ నుంచి కృష్ణ పార్టీ కి ఆ తర్వాత చిరంజీవి పార్టీ కి మారాను.

విసన కర్రలు పోయి టేబుల్ ఫ్యాన్ లు వచ్చిన కాలం అది. అలాంటి టైం లో అన్న గారి సినిమా T.V లో వచ్చిందంటే ఆ సినిమా అయ్యేవరకు దేవతలకుండే కన్ను ఆర్పని లక్షణం నాకు ట్రాన్స్ఫర్ అయ్యేది. అలా అలా ఎన్టీవోడి మీద ఇష్టం పెరిగి టేబుల్ ఫ్యాన్ కు ఈ ఎన్టీవోడి ఫ్యాన్ కూడా తోడయ్యాడు మా ఇంట్లో. ఎప్పుడో రిలీజ్  అయిన సినిమాలు T.V లో వేస్తే చూసి అవి కొత్త సినిమాలేమో ఎన్టీవోడు అలాగే యంగ్ గా ఉంటాడేమో అని భ్రమ పడేవాడిని.

బార్బర్లు ఇంటి దగ్గరికే వచ్చి అరువు మీద కట్టింగ్ చేసే రోజులు పోయి మనమే సెలూన్ కి వెళ్లి కటింగ్ చేయించుకునే రోజులొచ్చాయి. అలా ఓ రోజు మా నాన్న నన్ను కటింగ్ షాప్ కి తీసుకెళితే, నాకు ఎన్టీవోడి హెయిర్ స్టయిల్ కావాలి అని అడిగా. ఆయనది బట్ట తలరా, సినిమాల్లో విగ్ వాడుతారు నువ్వు కూడా ఇంకో 50 సంవత్సరాలు వచ్చాక ఆయన స్టయిల్లోనే కటింగ్ చేయించుకోవచ్చు అని చెప్పి ఎప్పటిలాగానే ఒక 3, 4 నెలల వరకు కటింగ్ ఆవరసం లేకుండా డిప్ప కటింగో చిప్ప కటింగో చేయించేశాడు.

ప్రేమ సింహాసనం, సూపర్ మాన్ లాంటి లేటెస్ట్ మూవీస్ కర్నూల్ లో చూసినప్పుడు గాని సత్యం బోధపడలేదు. మా నాన్న నిక్కర్ వేసుకున్న కాలం లో రిలీజ్ అయిన సినిమాలు నేను నిక్కర్ వేసుకుని తిరిగే రోజుల్లో T.V లో వస్తున్నాయని అర్థం అయింది.

ఇక కొన్నాళ్ళ తర్వాత అదే ఎన్టీవోడు గ్రీన్ కలర్ కోట్ వేసుకొని, దాచినా దాగని ఫ్యామిలీ పాక్ ను గాట్టిగా బెల్ట్ తో బిగించి, పసుపు కలర్ పాంట్ వేసుకొని తల్లి, చెల్లి, చెలి అనే తేడా లేకుండా సినిమాలో ఆడాళ్ళను చపాతి పిండి పిసికినట్లు పిసికేయడం మెదలుపెట్టాడు. ఇక నాగేశ్వర రావు గారు కూడా కుర్ర వేషాలు మొదలు పెట్టేశారు పోటీగా. వీళ్ళు రిటైర్ కాకుండా అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో తమ లోని నటనను నిద్రపుచ్చి అతిని బయటకు తీసుకొచ్చేవారు. ఇప్పటి పిల్లలు కనుక ఆ సినిమాలు చూశారంటే "రూపాయికి డాలర్ యాక్షన్ చేస్తున్నారు..ఎవరు వీళ్ళు" అని అడిగినా ఆశ్చర్యం లేదు.

మా నాన్నకు వేరే పల్లెకు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడే మా బడదల్ (చిన్నప్పటి మిత్రుడు. అందరూ వాడిని అలాగే పిలిచే వాళ్లు, ఎందుకో తెలీదు ) పరిచయం అయ్యాడు. వాడి గురించి సరిగ్గా చెప్పాలంటే ఇల్లు కాలుతుంటే జల్లెడతో నీళ్ళు  పోసేంత అమాయకుడు పాపం. అలా ఒక ఎన్టీవోడి ఫ్యాన్ కి ఇంకో ఎన్టీవోడి ఫ్యాన్ కలవడం జరిగింది. 

అప్పుడప్పుడే వడియాలు పాతబడి పోయి అప్పడాలు మార్కెట్ లోకి వస్తున్న రోజులు. అటువంటి టైం లో  T.V లో jamesbond, cowboy లాంటి కాన్సెప్ట్ లతో వచ్చే కృష్ణ గారి సినిమాలు ఆకట్టుకున్నాయి . ఆ వయసులో ఆయన యంగ్ గా స్మార్ట్ గా భలే ఉండేవారు. అచ్చు కృష్ణ గారి స్టెప్స్ లాంటివే స్కూల్లో సాయంకాలం డ్రిల్ల్ క్లాస్ లో మాతో చేయించేవారు.

ఒక రోజు  నేను, మా బడదల్  అరుగు మీద కూర్చొని శెనగలు తింటూ మాట్లాడుకుంటుంటే ఎన్టీవోడి పార్టీ నుంచి కృష్ణ పార్టీకి మారదాం అని ప్రపోసల్ పెట్టాను.

అలా ఎలా కుదురుతుంది..ఇది అన్యాయం అని లేచి నిలబడ్డాడు మాదాల రంగారావు నటించిన ఎర్ర సినిమాలేమైనా చూసాడేమో మరి అప్పటికే. 

మొన్నటి వరకు ఈ శెనగలు పేపర్ పొట్లాల్లో కట్టి ఇచ్చేవాడా ఆ షాప్ వాడు ఇప్పుడేమో అదే షాప్ వాడు ప్లాస్టిక్ కవర్ లో ఇస్తున్నాడు. కాబట్టి కాలం తో పాటే ఆ షాప్ వాడు మారినట్లు మనం కూడా update అవ్వాలి తప్పులేదు అని "కృష్ణ" బోధ చేసి కన్విన్స్ చేశాను. ముందే చెప్పానుగా మా వాడు జల్లెడతో నీళ్ళు పోసే రకం అని, నా మాటకు తలూపాడు. 

మొదటి కప్పదాటు ప్రారంభం .. ఎన్టీవోడి  పార్టీ నుంచి కృష్ణ పార్టీ కి మారాము.

రెండవ కప్పదాటు గురించి తర్వాతి టపాలో. 


21, జూన్ 2016, మంగళవారం

బాల్యంలో గురువు, డిక్షనరీ, వికీపీడియా, గూగుల్ అన్నీ నాన్నే

నాన్న అనడంలోనే 'నా' అన్న భరోసా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి బాల్యంలో గురువు, డిక్షనరీ, వికీపీడియా, గూగుల్, అన్నీ నాన్నే.

చదువు నేర్పడంలో ఆయన ఒక గురువు
విస్తృతమైన సమాచారం ఇవ్వడం లో వికీపీడియా
అర్థం కానీ పదాలకు ఆయనో డిక్షనరీ
తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆయనో గూగుల్
మొత్తంగా నా అనుకునే ఒక వెలకట్టలేని నిధి నాన్న. 

స్కూల్లో చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ ఎవరన్నా నన్ను కలవడానికి వస్తే గేటు దగ్గర నుంచే నన్ను పిలిచి, మా నాన్నగారు ఇంట్లో లేరని  confirm చేసుకున్నాకే లోనికి వచ్చేవారు. మా నాన్న ఉన్నప్పుడు వస్తే "ఎలా చదువుతున్నారు" అని వాళ్ళను అడుగుతారని భయం.  అడగడంతో  ఆపేస్తే పర్లేదు నన్ను textbook తెమ్మని చెప్పి అందులోంచి ప్రశ్నలు కూడా అడిగేవారు. అలాగని మా నాన్న హిట్లర్ అనుకునేరు..చదువు విషయం లో కాస్త స్ట్రిక్ట్  అంతే. అదే ఈ రోజు నా ఈ స్థితికి కారణం.  ప్రతి రోజూ తెల్లవారుజామునే లేపి చదివించేవారు. క్రమ శిక్షణ ను మా జీవితం లో ఒక భాగం చేసాడు. 

అప్పట్లో పల్లెటూళ్లలో ఆరుబయట ఒక గోడకు తెల్లని బట్టను కట్టి దాని మీద సినిమాలు ప్రదర్శించేవారు. బట్ట సినిమాలు అని పిలిచేవాళ్లు వాటిని. నెలకొకసారి అలాంటి సినిమాలు వేసేవారు మేముండే పల్లెలో.  అలా వేసే రోజు ఆ సినిమా కు వెళ్లాలంటే అమ్మ ద్వారానో  చెల్లి ద్వారానో రెకమండేషన్ వెళ్ళేది నాన్న దగ్గరికి. నాన్నను డైరెక్ట్ గా అడగలేదు కానీ ఎన్నడూ వెళ్లొద్దు అనలేదు. ప్రతి నెల జీతం రాగానే సరుకులు తేవడానికి పక్కనున్న Town కు పోయినప్పుడల్లా ఒక సినిమాకి తప్పకుండా తీసుకెళ్లేవారు. ఒక సారి పెళ్లికి నెల్లూరు వెళ్ళినప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా సెకండ్ షో కు తీసుకెళ్ళేదాకా వదిలిపెట్టలేదు నేనైతే. అంత బిజీ షెడ్యూల్ లోనూ తను ఇబ్బంది పడి  కూడా నా సంతోషం కోసం  ఏ మాత్రం విసుక్కోకుండా సినిమా కు తీసుకెళ్లారు. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా కాస్త బాధగా ఉంటుంది. ఈ విషయం లోనే కాదు ఎన్ని విషయాలలో ఇలా బాధపెట్టానో అన్నిటికి క్షమించేసారు. ఆయన క్షమాగుణం ముందు బంగాళాఖాతం కూడా బలాదూర్.  

తిరుపతి లో చదివే రోజుల్లో ఒక సారి మా ఊరికి మిడ్ నైట్ ఎప్పుడో వెళ్లాను నేను నా మిత్రుడితో కలిసి.  మేము డోర్ కొట్టగానే ఓపెన్ చేసి "ఎగ్జామ్స్ బాగా రాశారా?" అని అడిగాడు. 

మీ నాన్న ఏమిటి రాగానే బాగున్నారా అంటాడనుకున్నాను కానీ ఎగ్జామ్స్ బాగా రాశారా అంటారేమిటి అని ప్రశ్నించాడు నా మిత్రుడు.

ఉదయం లేవగానే ఇదే మాట నేను మా అమ్మతో అని బాధపడితే వెళ్లి ఫ్రిడ్జ్ తెరువు అంది.  తెరిచి చూసాను కదా ఫ్రిడ్జ్ అంతా నా కిష్టమైన grapes, apples ఇలా అన్నిరకాల  పళ్లతో నిండి ఉంది. అంతే కాదు బిస్కెట్స్,బేకరీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి అదే ఫ్రి డ్జ్ మీద.  అదిరా మీ నాన్నకు నీ మీద ప్రేమ, నువ్వుస్తున్నావని తెలిసి ఇల్లంతా నీకు ఇష్టమైన వాటితో  నింపేసాడు అని చెప్పింది. ఇప్పుడు కూడా నీ కిష్టమని ఉదయాన్నే అయితే మంచి చేపలు దొరుకుతాయి అని తీసుకు రావడానికి షాప్ కు వెళ్ళాడు  అంది. పాపం పిచ్చి నాన్న ఎవరెస్టు శిఖరమే చిన్నబోయేంత  ప్రేమ ఉన్నా బయటపడడు అంతే. 

కనీసం కాఫీ కలుపుకోవడం కూడా రాని మా నాన్న అమ్మ ఊరెళ్ళినపుడు నా కోసం ఒకసారి ఉప్మా చేసి పెట్టాడు. కానీ పాపం అన్ని తిరవాత గింజలతో పాటు మెంతులు కూడా వేసేశాడు తెలీక. మాకు మంచి చదువులు చెప్పించడానికి ఎన్ని సార్లు ఎంతెంత దూరాలు ఆటోలోనే బస్ లోనో వెళ్లకుండా, కాలినడకన వెళ్లారో లెక్క కట్టలేను. 

చిన్నప్పుడు ఆటలు పాటలలో పడి నాన్నల గొప్పతనం తెలుసుకోలేము కానీ పెద్దయ్యాక వాళ్లకు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం ఏమిటో. వెలుగులో ఉన్నప్పటికంటే చీకటిలో ఉన్నప్పుడే కదా వెలుగు విలువ తెలుసుంటాము. 

అయినా మా నాన్న ప్రేమ గురించి నేను చెప్పింది అణువంత చెప్పాల్సింది ఇంకా కొండంత.

HAPPY FATHERS DAY నాన్న. ఈ FATHERS DAY రోజే కాదు ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాను మీ గురించి. 



17, జూన్ 2016, శుక్రవారం

బకాసురులను కూడా బక్కగా మార్చే డైట్ మేళాలు

ఇది ఓ పదేళ్ళ కిందటి మాట. 

ఒకసారి నేను ఆఫీస్ లో ఉండగా నా ఫ్రెండ్ వచ్చి ‘దగ్గరలో S.B.I  ATM ఎక్కడ ఉంది ?’ అని అడిగాడు.

నేను ఇలా ఇలా వెళ్ళాలి అని డైరెక్షన్స్ ఇచ్చాను.

ఎంత దూరం ఉంటుంది? అని అడిగాడు.

ఎంత…జస్ట్  వాకబుల్ డిస్టెన్స్ అన్నాను

సరే ATM కు వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు.

ఒక గంట తర్వాత వచ్చి ‘నీ ప్రకారం వాకబుల్ డిస్టెన్స్అంటే ఎంత?’ అని అడిగాడు.

3 నుంచి 5 కిలోమీటర్లు అని నేను చెప్పాను.

బాబూ, ఏదో ఒక అర కిలోమీటర్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అంటారు గాని  నాకేం తెలుసు వాకబుల్ డిస్టెన్స్ అనేది   నీ ఉద్దేశ్యం లో 3 నుంచి 5 కిలోమీటర్లు అని. దాదాపు కిలోమీటర్ దూరంలో ఉండే ఆ ATM కి వెళ్ళేటప్పటికి నడవలేక నా ప్రాణాలు పోయాయి. అందుకే వచ్చేటప్పుడు ఆటో లో వచ్చాను అని చెప్పాడు.

ఇలా ప్రతి చిన్న దూరానికి కూడా ఆటో లోనో  బైక్ లోనో  వెళ్ళే అలవాటున్న అతను ఇప్పుడు పదేళ్ళ తర్వాత సన్నబడటానికి తన అపార్ట్మెంట్ చుట్టూ మార్నింగ్ వాక్ లు చేస్తూ, గ్రీన్ టీ లు తాగుతూ జిమ్ కు వెళ్తూ డైటింగ్ అంటూ ఏది పడితే అది తినకుండా ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో డైట్ చార్ట్ ప్రకారం తింటూ తిప్పలు పడుతున్నాడు.

పదేళ్ళ కిందటే కాస్త వాకింగ్ ను వంటికి అలవాటు చేసి ఉంటే ఇవాళ అతని పరిస్థితి మరీ ఇలా ఉండేది కాదేమో అనిపిస్తుంది. రోజూ కాస్త దూరం నడిచిన వారంతా సన్నగా అవుతారు అని కాదు కానీ బాగా నడిచే వారి పరిస్తితి కాస్త మెరుగ్గా ఉంటుందనేది నా ఉద్దేశ్యం. నా వరకు నేనైతే మూడు నాలుగు కిలోమీటర్లు అయినా నడిచే వెళ్తాను, అంతే కాకుండా షవర్ బాత్ గట్రా కాకుండా బక్కెట్లో నీళ్ళు పట్టుకొని మగ్ తో నీళ్ళు ముంచుకొని స్నానం చేస్తాను. అలా చేయడం వలన కనీసం ఒక 20 సార్లయినా వంగిలేయటం వలన మనకు తెలీకుండానే శరీరానికి కొంత వ్యాయామం ఇస్తున్నాము. ఈ జనరేషన్ లో కూడా ఈ పాత చింతకాయ పద్దతులు ఏంటి అని అనుకున్నా పర్లేదు నేను మారను. మరీ జంక్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ ల జోలికి పోకుండా ఆయిల్ ఫుడ్, స్వీట్స్  ఏదైనా సరే నాకు నచ్చినది, నేను అనుకున్నది శుభ్రంగా తింటాను ఎలాంటి సంశయాలు లేకుండా . మన పూర్వికులు మనకిచ్చిన యోగా అనబడే ఒక అద్బుతమైన కానుకను కనీసం వారం లో 3-4 సార్లు అయినా చేస్తాను. యోగా చేయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా నాన్న గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. గత పాతికేళ్ళుగా ఆయన యోగ చేస్తూ అరవై దాటినా ఇంకా ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు.

ఇక్కడ సిడ్నీ లో కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ లో 3 స్పూన్స్ షుగర్ అని చెప్తే Are you  sure అని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకొని నాశనమై పోతావు రేయ్ అంత షుగర్ కలుపుకు తాగితే అన్నట్లు మొహం పెడతారు గాని నేను మాత్రం ఎటువంటి భయాలు లేకుండా 3 స్పూన్స్ షుగర్ తోనే కాఫీ తాగుతాను. నా వరకు నేను కాఫీ ని కషాయం లా తాగడానికి ఇష్టపడను. ఈ మధ్య చాలా మంది వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తే వచ్చిన వాళ్ళు తాగుతారో లేదో కూడా తెలుసుకోకుండా గ్రీన్ టీ ఇస్తున్నారు. నాకూ అలాగే ఇచ్చారు వద్దంటే బాగోదని ఒకటి రెండు సార్లు తాగాలని ప్రయత్నించాను కాని అది నా కప్ అఫ్ టీ కాదని అర్థమైపోయింది. మీకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఒక అరగంట సేపు T.V లో ఏదో ఒక తెలుగు సీరియల్ ను పెట్టేసి రిమోట్ దాచిపెట్టేసుకొని మీ పాటికి మీరు ఫేసుబుక్ లో మెసేజ్ లు పెట్టుకుంటూ కూర్చోండి కానీ ఇలా గ్రీన్ టీ మాత్రం ఆఫర్ చేయకండి అన్నాను నవ్వుతూ.  

మొన్న ఆ మధ్య తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అడక్కుండానే వైట్ టీ ఇచ్చారు. వద్దు నేను తాగలేను అని సున్నితంగా చెప్తే ఆరోగ్య సూత్రాలు చెప్పడమే కాకుండా వైట్ టీ బాగా కాస్ట్లీ అని దర్పం కూడా ప్రదర్శించారు.  మీరు నాకు ఈ వైట్ టీ ఇవ్వకపోయినా పర్లేదు మీ ఆరోగ్య సూత్రాలు మీ దగ్గరే అట్టి పెట్టుకోండి నాకు మాత్రం అంట గట్టకండి నా ఆరోగ్య సూత్రాలేవో నా దగ్గరే ఉన్నాయి అని గట్టిగా చెప్పాలనుకొని చెప్పలేకపోయాను. రోజూ ఉదయాన్నే లైట్ అండ్ ఈజీ అని అదేదో డైట్ కంపనీ డెలివరీ బోయ్ వచ్చి ఓ రెండు బాక్స్ లు వాడాలి వెళ్తారు వాళ్ళ డోర్ ముందు ఒకటి అతనికి ఇంకొకటి వాళ్ళావిడకి. అందులో 5 చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. రోజంతా అదే వాళ్ళ ఫుడ్. ఉదయాన ఇంట్లో ఒకసారి ఆఫీసు లో మూడు సార్లు రాత్రి ఇంటికి వచ్చాక ఒక సారి ఆ చిన్న చిన్న డబ్బాల్లో ఫుడ్ తింటూ ఉంటారు. నన్ను కూడా పాటించమని వాళ్ళు నాకు చెప్పిన ఆరోగ్య సూత్రాలలో ఇదొకటి. 

ఈ జనరేషన్ వాళ్ళమైన మనము మన పాత జనరేషన్ వాళ్ళతో  పోలిస్తే ఆరోగ్యం విషయం లో క్వాలిటీ అఫ్ లైఫ్ బతుకున్నాము అన్నది అతని నమ్మకం. అదే విషయాన్ని గూగుల్ లో సెర్చ్ చేసి చూపించాడు.  నాకేమో దాన్ని ఒక పట్టాన ఒప్పుకోవాలనిపించలేదు . డైట్ కంపనీ వాడు పంపించే రుచి పచి లేని ఆహారం తినడం, ఇష్టమైనవి తినకుండా నోరు కట్టేసుకుని ఉండటం, ఏది తినాలన్నా కేలరీలు ఎంత అని లెక్కిస్తూ కూర్చోవడం క్వాలిటీ అఫ్ లైఫ్ ఎలా అవుతుందో నాకైతే ఎప్పటికి అర్థం కాని విషయం. 

పోయిన వారం ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే హాయ్ అనే పిలుపు వినిపించింది. తిరిగి చూద్దును కదా ఎక్కడో చూసిన మొహం లా ఉన్నట్లుందే అనుకున్నాను కాని గుర్తు రావడం లేదు. తర్వాత గ్రీన్ లైట్ వెలిగింది అటు బుర్రలో ఇటు సిగ్నల్ లో. నమిత లాగా బాగా లావుగా ఉండే నా పాత కొలీగు నయనతార లాగా తయారైంది.  గత 2 నెలల్లో డైట్ ప్లాన్ ఫాలో అయి 20 కిలోలు తగ్గానని దాంతో పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాళ్ళను కనీసం ఒక పది మందిని చూసి ఉంటాను ఈ మధ్య కాలంలో. అందరూ 25 నుంచి 30 లోపు వాళ్ళే పైన చెప్పిన భార్య భర్త తో కలిపి.  వీళ్ళంతా ఆ డైట్  కంపెనీ లకు మహారాజ పోషకులు. ఇంతకీ లంచ్ ఏమి తిన్నావు అని నేను అడిగితే 300 కేలరీలు అని లెక్క చెప్పే వాళ్ళని కూడా చూసాను. 

బకాసురులను కూడా బక్కగా మార్చి చూపిస్తాము అనే టైపు లో చెప్పుకునే ఒక కంపెనీ కి వెళ్ళిన నా మిత్రున్ని వాళ్ళ జిమ్ కు తీసుకెళ్ళి సన్నబడటానికి పాటించవలసిన డైట్ పాలసీ వివరించాడు instructor. 

మేము సప్లై చేసే ఫుడ్ మాత్రమే తినాలి, రైస్ మానేయాలి, పొటాటో మానేయాలి, ఆయిల్ ఫుడ్ మానేయాలి, నువ్వు బతకడం మానేయాలి, నీకు నువ్వు తద్దినం పెట్టుకోవాలి, ఇంకా ఏవేవో మానేయాలి అని చెప్పి ఒక పెద్ద లిస్టు ఇచ్చాడట. 

పాపం ఏం  చేస్తాడు బకాసురుడి లాంటి నా మిత్రుడు మానేసాడు ..... జిమ్ కు వెళ్ళడం. 






14, జూన్ 2016, మంగళవారం

మా పాప బర్త్ డే కబుర్లు

సాధారణంగా కథలు Once Upon A Time అనో లేదంటే It Was a nice sunny day అనో మొదలవుతాయి. అలాగా నేను కూడా It Was a nice sunny day అని మొదలుపెట్టాలి కథ కాని ఈ పోస్ట్ ని. ఎందుకంటే నిన్న వర్షం రాకుండా బాగా ఎండ కాయడం వలన  పోయిన ఆదివారం భారీ వర్షాల కారణంగా cancel అయిన మా పాప birthday పార్టీ ని ఈ శనివారం ఏ ఇబ్బంది లేకుండా జరపగలిగాము. కాకపోతే పార్టీ జరిగిన హోటల్ చుట్టుపక్కల కొంత రోడ్ repairs కారణంగా రోడ్స్ కొన్ని బ్లాక్ చేయడంతో కాస్త ట్రాఫిక్ జామ్  అయింది. 

సిడ్నీ ట్రాఫిక్ జామ్ ని మన బెంగుళూరు,ముంబై, హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ జామ్ లతో పోల్చడమంటే నదిని పట్టుకొని సముద్రం తో పోల్చినట్లే. కానీ మన ఇండియన్స్ ముంబై ట్రాఫిక్ అంటే ఎంత భయపడతారో  ఈ  ఆస్ట్రేలియా వాళ్ళకు  కూడా  సిడ్నీ ట్రాఫిక్ అంటే అంత  భయం. నా ఆస్ట్రేలియన్ ఫ్రెండ్ ఒకతను పోయిన సంవత్సరం కాన్బెర్రా నుంచి సిడ్నీ కి ట్రాన్స్ఫెర్ అయి వచ్చాడు. ఇక్కడి ట్రాఫిక్ కి భయపడి మూడంటే మూడే  నెలల్లో తిరిగి కాన్బెర్రా కు ట్రాన్స్ఫెర్ చేయించుకున్నాడు. కాన్బెర్రా ట్రాఫిక్ గురించి పైన చెప్పినట్లు పోలికలో చెప్పాలంటే అదో పిల్ల కాలువ. ఇక అతను పొరపాటున ఏ బెంగుళూరు కో ముంబై కో వచ్చాడంటే అక్కడి ట్రాఫిక్ చూసి విరక్తి చెంది ఏ మురుగు కాలువో చూసుకొని దూకడమో  లేదా ఏ ట్రక్కు కిందో తల పెట్టేయడమో  ఖాయం.  

పార్టీ కి వచ్చిన  అతిధులను ఒకరిని ఒకరికి పరిచయం చేయవలసిన అవసరం రాలేదు . వరల్డ్ ఈస్ సో స్మాల్ అంటారు కదా అలా ఇక ఈ సిడ్నీ అయితే మరీ స్మాల్ అనిపిస్తుంది ప్రతి తెలుగు వాడికి ఇంకో తెలుగు వాడు  ఫ్రెండో లేదంటే ఫ్రెండ్ కు ఫ్రెండో  లేదంటే ఓల్డ్ colleague గానో పరిచయం ఉండే ఉంటుంది.  కాబట్టి పార్టీ కి వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక రకంగా ఒకరికి ఒకరు పరిచయస్తులే. మన తెలుగు వాళ్ళే కాకుండా 3 తమిళ్ ఫ్యామిలీస్, 2 శ్రీలంకన్ ఫ్యామిలీస్, 3 నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వచ్చారు

ఇక్కడ హైదరాబాద్ పారడైస్ బిర్యాని అని మన తెలుగు వాళ్ళదే ఒక రెస్టారెంట్ ఉంది. పార్టీ శనివారం జరపడం వలన వచ్చిన వాళ్ళలో సింహ భాగం non-veg తినని వాళ్ళే ఉన్నారని ముందే తెలియడంతో పూర్తిగా వెజిటేరియన్ డిషెస్ తో పార్టీ అరేంజ్ చేసాము. వంటలు అదిరిపోయాయి అని కితాబు ఇచ్చారు వచ్చిన వాళ్ళు ఇక బిర్యాని రుచి గురించి అయితే ప్రతీ ఒక్కరూ తెగ మెచ్చుకున్నారు.  ఇదైతే మేము expect చేసిందే ఎంతైనా చెఫ్ మన హైదరాబాదీ కదా.  అయినా మన హైదరాబాదీ చెఫ్ వండే వంటల్లో బిర్యాని గురించి పొగడడమంటే మన చిరంజీవి సినిమా చూసి స్టెప్స్ బాగున్నాయని పొగిడినట్లు ఉంటుంది అదంతా సహజం అంతే . మన హైదరాబాద్ బిరియాని, మన చిరంజీవి స్టెప్స్ నా వరకైతే ఎప్పటికీ ప్రత్యేకమే. ఇంకా చిరంజీవి స్టెప్స్ ఏమిటి ఈ కాలంలో అంటారా మన త్రివిక్రమ్ గారు నువ్వే నువ్వే సినిమాలో చెప్పిన స్టైల్ లో చెప్పాలంటే అమ్మ, ఆవకాయి, అన్నయ్య స్టెప్స్ ఎప్పటికీ  బోరు కొట్టవు  అంతే.  

ఇక పార్టీ లో భోజనం విషయానికి వస్తే ముందుగా సలాడ్, అప్పడం లతో స్వాగతం పలికి ఆ తర్వాత  గోబీ మంచురియా, మిక్స్ వెజ్ పకోడా, వెజ్ కట్లెట్ వంటి స్టార్టర్స్ తో పొట్ట పూజ ప్రారంభించి తర్వాత రోటి, పనీర్ బట్టర్ మసాలా, గుత్తి వంకాయి, మిక్స్ వెజ్ కుర్మా ల మీదుగా వెజ్ బిర్యాని విత్ రైతా లతో కడుపును పూర్తిగా సంతృప్తి పరచి రసమలాయ్ తో తియ్యగా ముగించాము. 

ఇక పిల్లలు వాళ్ళ వాళ్ళ ఆట పాటలతో సరిగా భోజనం చేయక కడుపు నింపుకున్నారో లేదో తెలీదు కాని వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళందుకున్న రిటర్న్ గిఫ్ట్ లతో వాళ్ళ కడుపు పూర్తిగా నిండిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. 

ఇక ఈ పార్టీ ఇంత  బాగా జరగడానికి తోడ్పడిన మిత్రులకు ధన్యవాదాలు, ముఖ్యంగా ఉదయాన్నే అంత  చలిని కూడా లెక్కచేయక హోటల్ లో పార్టీ జరిగే స్థలానికి వచ్ఛి బెలూన్లు అవీ  వూది పార్టీ హాల్ ను అలంకరించడానికి వచ్చిన మిత్రులకు. ఇక ప్రత్యేకించి చెప్పవలసి మరొక వ్యక్తి  ఉన్నారు ఆయనొక సర్దార్జీ.  కొంత కాలం క్రితం పరిచయమైన ఒక మిత్రుడు, నా కన్నా వయసులో బాగా పెద్దవారు కూడా.  పార్టీ జరిగే సమయం లో పార్టీ కి వచ్చిన వారి మంచి చెడ్డలు చూస్తూ ఆ బిజీ లో పడి మేము సరిగా తినకపోతే మా పనులలో ఆయన సాయపడుతూ  మేము తినని విషయం ఆయన గుర్తుచేస్తూ తను ఎంతగానో బాధపడటం మేము ఎన్నటికీ మర్చిపోలేము. ఇంత  మంచి మనసున్న సర్దార్జీ ల మీద facebook లో, పేపర్ లలో కనపడే  జోకుల గురించి చూసినప్పుడల్లా మనస్సు చివుక్కుమంటుంది కానీ "పళ్ళున్న చెట్లకే కదా రాళ్ళ దెబ్బలు" అనే మాట గుర్తుకొచ్చి నాకు నేను సర్దిచెప్పుకుంటాను. పార్టీ అంతా అయిపోయాక చివర్లో మమ్మల్ల్ని ఇంటి దగ్గర కార్లో డ్రాప్ చేసినపుడు థాంక్స్ చెబితే "థాంక్స్ మత్ బోల్నా తుమ్ తో మేరా చోటే భాయి జైసా" అని ఒక హగ్ ఇచ్చి భుజం తట్టినప్పుడు నా కంట్లో తిరిగిన నీరే సాక్షం ఆయన మంచితనం గురించి చెప్పడానికి.  

ఆరోగ్యం అంత  బాగా లేకపోయినా కేకు ఆర్డర్ లతో పూర్తి  బిజీ గా ఉండి కూడా మేము అడిగిన వెంటనే ఆవిడ ఛార్జ్ చేసే రేట్లో సగం రేటుకే  అందమైన మిన్ని మౌస్ కేకు చేసి ఇచ్చి, పూర్తి  డబ్బులు ఇచ్చినా తీసుకోని  మా పక్కింటి ఆంటీ .. ఇలా ఎంతో మంది మంచి వారి మంచితనం మధ్య  "ఇంగువ చుట్టిన గుడ్డలా" నాకూ కొంతైనా వారి మంచితనం అంటుకుంటే చాలు. 

అయినా ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బాజాలు ఎందుకు అన్నట్లు నిన్నేప్పుడో అయిపోయిన బర్త్ డే కి  ఇంత  సోది ఇప్పుడు అవసరమా అంటారా ఏదో నాడైరీ లో ఇదొక మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఇలా రాసుకున్నాను అంతే. 


P.S : పైన నేను రాసిన హిందీ లో గ్రామర్ మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. హిందీ లో నేనంత పర్ఫెక్ట్ కాదు of courese తెలుగు లో కూడా అనుకోండి. 

11, జూన్ 2016, శనివారం

నా చిన్ని వానర సైన్యం కబుర్లు

పిల్లల మనసు స్వచ్ఛంగా ఉంటుంది, సాధ్యమైనంత వరకు ఆ మనసు T.V, సినిమాల లాంటి మాధ్యమాల నుంచి కల్మషం కాకూడదనే ప్రతి రోజు సాయంత్రం బాల్కనీ లోనే కూర్చోబెట్టుకొని కాసేపు కబుర్లు చెప్పడం అలవాటు నాకు. ఇండియా లో అయితే చాలా వరకు ఈ I.T కంపెనీ లలో ఫలానా టైం కి ఆఫీసుకు వెళ్ళడమే తప్ప ఫలానా టైం కి తిరిగి ఇంటికి రావడమనేది మన చేతిలో ఉండదు కాని ఇక్కడ 8 గంటలు కన్నా ఎక్కువ  పని గంటలు ఉండకపోవడం ఆఫీసు నుంచి సాయంత్రం 6 గంటలకే ఇంట్లో వాలిపోవడము, మా వానర సేన తో చేరి ఇల్లు కిష్కింధకాండ చేయడం అలవాటు. కేవలం డబ్బు బాగా సంపాదించవచ్చనే ఇక్కడికి వచ్చాను కానీ మా పిల్లలతో గడపటానికి  సమయం కూడా ఎక్కువ దొరకడంతో   డబ్బు కాదు కానీ మధురమైన జ్ఞాపకాలు అయితే మాత్రం బాగా సంపాదించుకున్నాను .  

పిల్లలు ఒక వయసు దాటాక హోంవర్క్, ఫ్రెండ్స్, కార్టూన్స్ అని బిజీ బిజీ గా ఉంటారు. మొదటి నాలుగు సంవత్సరాలు మాత్రం వాళ్లకు అమ్మా నాన్నే లోకం. ఈ నాలుగు సంవత్సరాలు  మా పాపతో ఆడుకున్న ప్రతి సాయంత్రం ఒక ఫోటో లాగా ఎప్పటికీ నా గుండెలోని ఆల్బంలో పదిలంగా నిలిచి ఉంటుంది. ఇలా పిల్లలతో గడిపిన ప్రతీ  క్షణం ప్రతీ తండ్రి నా లాగే తనే ఒక చక్రవర్తి అని ఫీల్ అవుతాడేమో. రెండు కోట్లు సంపాదించాక కలిగే తృప్తి కన్నా ఇద్దరు పిల్లలు కలిగాక కలిగే తృప్తి అనంతం. డబ్బు విషయం లోనూ, పిల్లల విషయం లోనూ ఒక పోలిక ఏమిటంటే  ఆశ తీరదు ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది  అని అనిపిస్తుంది.  ఇద్దరు పిల్లలున్నా ఇంకో పాప  కూడా ఉంటే  బాగుండు అని గొణుగుతూ ఉంటాను. (మీకేం మగాళ్ళు ఎన్నైనా చెప్తారు .. కనేవాల్లము మేము మాకు తెలుస్తుంది ఆ బాధ అంటుంది నా భార్య. అది సరే పాపే ఎందుకు బాబు అనచ్చుగా అంటుంది నా భార్య) ఏది ఏమైనా చెప్పండి ఆడపిల్లలు ముద్దుగా ఉంటారండి ఇంటికి వాళ్ళు ఒక కళను తీసుకువస్తారు (ఔనా మేమింకా అల్లుడ్ని తీసుకోస్తారనుకున్నామే  అని పంచ్ డైలాగ్  మాత్రం వెయ్యకండే) దానికి తోడూ ఆడపిల్లలకు అయితే షాప్ లో ఎన్ని రకాల కలర్ల లో డ్రెస్సెస్ ఉంటాయో.  అదే అబ్బాయిలకు అయితే అవే నాలుగైదు కలర్స్.నాకు పాపంటే బాగా ఇష్టమని మా బుడ్డోడిని బుడ్దమ్మ గా మార్చేసి ఫొటో తీసింది నా భార్య. ఈ ఫోటో జీవితాంతం దాచుకోగల జ్ఞాపకం నాకు. 





మా పాపతో నేను ఆడిన దాగుడు మూతలు, ఉప్పు మూటలు, కేకలు, కోతి గంతులు  మళ్లీ నా బాల్యాన్ని నాకు తిరిగి రుచి చూపించాయి.  అప్పుడప్పుడు  బొమ్మలు గీద్దాం రా నాన్నా అని అంటూ ఉంటుంది.  చిన్నప్పుడు అయితే బాగానే బొమ్మలు గీసేవాడిని కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా గుర్తులేవు . స్కూల్ లో ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ఒక బొమ్మ మాత్రం ఎందుకో కానీ  బాగా ముద్ర పడిపోయింది కింద గీసాను మీరూ చూసి తరించండి. చిన్నదానికి ఏమీ తెలీదని ఎప్పుడూ ఇదే బొమ్మేనా గీసేది అంటూ ఉంటుంది నా భార్య అయితే.  చెప్పడం మర్చిపోయాను మేఘాల బొమ్మలు కూడా గీయడం వచ్చు అలాగే గడ్డం గీయడం కూడా :)



మా పాప ఒక్కోసారి తన బొమ్మ తమ్ముడికి ఇవ్వను అంటుంది కానీ వాడు, నువ్వు వేర్వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అని నచ్చచెప్పాక కాసేపటికి తనే ఆ బొమ్మ తీసుకెళ్ళి తన తమ్ముడికి ఇస్తుంది.   చాలా రోజుల క్రితం ఒకసారి వాడిని బేబీ చైర్ లో కూర్చోబెట్టాము. చైర్ బెల్ట్ ఎలా ఊడి వచ్చిందో తెలీదు కాని పాపం వాడు కింద పడి  బాగా ఏడ్చాడు. వాడైనా కొద్ది సేపే ఏడ్చాడు కానీ పాపం మా పాప మాత్రం చాలా సేపటి వరకు ఏడుపు ఆపలేదు. ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి పాపం తమ్ముడు కి ఎక్కువ నొప్పి ఉండదు కదా నాన్నా అని అడిగింది. తమ్ముడి మీద తనకున్న ప్రేమ చూసి  'నొప్పి ఉండదురా ఊరికే కిందపడ్డానని భయపడ్డాడు అంతే' అని అనాలనుకున్న మాటను బాధతో పూడుకు పోయిన నా  గొంతు ఆపేసింది కాని బయటకు వస్తున్న కన్నీటిని మాత్రం నా కన్ను ఆపలేకపోయింది. అంత స్వచ్చమైన ఆపేక్ష ఉంటుంది పిల్లల్లో ఒకరి మీద ఒకరికి.

మీకు ఈ ఆర్టికల్ నా పర్సనల్ డైరీ లోని ఒక పేజి లాగా అనిపిస్తూ నా నస నచ్చకపోచ్చు కాబట్టి... చిన్న పిల్లల మనస్తత్వం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఎక్కడో విన్నకథను వీలైనంతగా నా మాటల్లో వివరించి ముగిస్తాను. 

పదేళ్ళు కూడా నిండని అన్నాచెల్లెలు ఇద్దరూ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ పాప కింద పడి తలకు పెద్ద దెబ్బ తగిలితే హాస్పిటల్ కు తీసుకు వెళ్తారు. రక్తం చాలా పోయింది కాబట్టి అదే గ్రూప్ రక్తం దొరకక  చివరకు ఆ చిన్న పిల్లాడిది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని తెలిసి ఆ పిల్లాడిని ఇమ్మని అడుగుతారు. మొదట కాసేపు మౌనంగా ఉండి  ఆ తర్వాత ఒప్పుకుంటాడు.

కాసేపు అయ్యాక ఇక చాలు అని రక్తం తీయడం ఆపేస్తారు. అప్పుడు ఆ కుర్రాడు చెల్లెలు నిద్ర లేచేవరకు ( స్పృహ  వచ్చేవరకు)  అయినా నేను బతుకుతానా డాక్టర్ అని అడుగుతాడు ఆశగా. అంటే రక్తం తీస్తేనువ్వు చనిపోతావని అనుకున్నావా అంటాడా డాక్టర్ . అవునని సమాధానమిస్తాడు ఆ కుర్రాడు. అంటే చనిపోతావని అనుకొని కూడా నువ్వు ఆ రక్తం ఇచ్చావా అన్న వణుకుతో కూడిన మాటలు వచ్చాయి ఆ  డాక్టర్ గొంతు నుంచి.   



9, జూన్ 2016, గురువారం

సేల్స్ మరింత పెరిగాయి

ఒక ప్రముఖ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి  ఆంధ్ర, తెలంగాణాలలోని తమ తమ బ్రాంచ్ సేల్స్ ఎగ్జిక్యుటివ్ మేనేజర్స్ అందరికీ  హైదరాబాద్ లో జరగబోయే  రేపటి సమావేశానికి అర్జెంటుగా  రమ్మని మెసేజ్ వచ్చింది. అందరూ మరుసటి రోజు సమావేశానికి హాజరయి ఈ అర్జెంటు సమావేశానికి కారణం ఏమిటో తెలియక అటూ ఇటూ తిరుగుతూ పక్కవారి చెవులు కొరకడమే కాకుండా అందిన కాడికి తమ తమ చెవులు కూడా కొరుక్కుంటున్నారు.

ఇంతలో మేనేజింగ్ డైరెక్టర్ రావడం చూసి గోడ మీది బల్లి అతుక్కు న్నట్లు ఎవరి సీట్ కి వాళ్ళు అతుక్కుపోయారు. అతను వచ్చీ రాగానే టేబుల్ మీద ఉన్న ఒక పిన్ కింద పారేసి ఆ శబ్దం విని హ్యాపీ గా ఫీల్ అయి మాట్లాడటం మొదలుపెట్టాడు. 

గత 4-5 వారాలలో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో గల ఇండియన్ షాప్స్ లో కూడా మన ప్రోడక్ట్ సేల్స్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. గత 4 వారాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న రెండు కొత్త తెలుగు సినిమాలు రిలీజ్ అవడం ఇందుకు కారణం అని మన కంపెనీ బ్రాంచ్ ల బయట నిద్రపోయే వాచ్ మెన్ ను నిద్ర లేపి అడిగినా చెబుతాడు.  కానీ  అంతు చిక్కని విషయం ఏమిటంటే  పోయిన వారం నుంచి మరింత జోరుగా మన ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతున్నట్లు సమాచారం. స్వతహాగా సినిమా పిచ్చివాడి నయిన నాకు తెలిసినంత వరకు పోయిన వారం కాని ఈ వారం కాని రిలీజ్ అయిన తెలుగు సినిమాలకు మన ప్రోడక్ట్ సేల్స్ పెంచే దమ్ము లేదన్నది అందరికి తెలిసిన నిజం, మరి మన ప్రోడక్ట్ సేల్స్ పెరగడానికి గల కారణాలేవో తెలియడంలేదు అని నెత్తి మీద ఉన్న నలభై వెంట్రుకలలో నాలుగు వెంట్రుకలు పీక్కున్నాడు

మన ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతున్నాయని మనకు అర్థం అవుతోంది కాబట్టి మనం సంతోషించాల్సిన విషయం కదా ఇది. అంతే కాని దాని బదులు ఉన్ననలభై వెంట్రుకలు పీక్కోవడం వల్ల కబడ్డీ కబడ్డీ ఆడడానికి సరిపోయే గ్రౌండ్ ను 20-20 మ్యాచ్ ఆడటానికి సరిపోయే గ్రౌండ్ గా మార్చుకోవడం అవసరమంటారా  అన్నాడొక బ్రాంచ్ సేల్స్ ఎగ్జిక్యుటివ్ మేనేజర్. 

అందుకేనండి  పి.పి గారు మిమ్మల్ని మన ఎర్రగడ్డ బ్రాంచ్ కు సేల్స్ ఎగ్జిక్యుటివ్  మేనేజర్ ను చేసింది. మన ప్రోడక్ట్ సేల్స్ పెరగడానికి గల కారణాలేవో తెలుసుకుంటే ఆ కారణాలను ఉపయోగించుకొని మనం మరింత సేల్స్ పెంచుకోవచ్చు.  కాబట్టి మై డియర్ ఎంప్లాయిస్ మీలో ఆ కారణం తెలిసిన వారు ఎవరైనా ఉంటే కాలో చెయ్యో ఎత్తి మాట్లాడండి  అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్.

కాసేపు వెయిట్ చేసి టేబుల్ మీద ఉన్నమరొక పిన్ కింద పారేసి ఆ శబ్దం విని ఈ సారి కోపం గా మాట్లాడటం మొదలుపెట్టాడు. కారణం తెలిసిన వారు ఎవరూ లేరు కాబట్టి ఒక త్రిసభ్య కమిటీ ని వేద్దాము.  వారు ఒక మూడు రోజుల్లో నివేదిక అందించవలసి ఉంటుంది అని ముగ్గురు మెరికల లాంటి సేల్స్ ఎగ్జిక్యుటివ్  మేనేజర్ ను ఎంపిక చేసాడు. అందులో పి.పి గారిని కూడా ఎంపిక చేసి ఉంటాడు అని అనుకున్నవాళ్ళు నేరుగా ఎర్రగడ్డ కు వెళ్ళాలని మనవి.

అందరూ నాల్గవ రోజు సమావేశమయ్యారు. వాళ్ళ రిపోర్ట్ కూడా మన దేశంలో అన్ని కమిటీ లు సమర్పించినట్లుగానే అతి పెద్ద రిపోర్ట్ ని అంటే 333 పేజీల రిపోర్ట్ ని  సబ్మిట్ చేస్తూ చదవడం మొదలుపెట్టారు. ఇప్పటి తెలుగు సినిమా కథల్లో కథ లేనట్లుగా ఆ రిపోర్ట్లో కూడా పనికొచ్చే విషయం శూన్యం అని అర్థమయ్యాక, నిద్ర పోకుండా సిన్సియర్ గా ఆ రిపోర్ట్ విన్న వాళ్ళందరికీ తమ కంపెనీ ప్రోడక్ట్ అవసరం ఎంతైనా ఉందని గుర్తించి ఫ్రీ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. 

సరిగ్గా అప్పుడే మన హీరో పి.పి చినిగిన బట్టలతో లోనికి వచ్చాడు. అసలే  కారణం తెలియక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న M.D కి ఇలా ఆలస్యంగా అదీ చిరిగిపోయిన బట్టలతో రావడం పుండు మీద కారం చల్లినట్లుగా అనిపించడంతో పాత సినిమాల్లోని బాలయ్య లాంటి వాడు నందమూరి బాలయ్య లా గాండ్రించి ఆలస్యానికి కారణం అడిగాడు. 

మా తమ్ముడు గత వారం నుంచి విపరీతమైన తలనొప్పి తో బాధపడుతుంటే పక్కనే ఉంది కదా అని ఎర్రగడ్డ హాస్పిటల్ కు తీసుకెళ్ళాను. అక్కడ మా తమ్ముడు డాక్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం  చెప్పేటప్పుడు మన ప్రోడక్ట్ సేల్స్ పెరగడానికి కారణం అర్థమైపోయింది ఆ సంతోషంలో బట్టలు చించుకున్నాను  అంటూ  పక్కనున్న బోర్డు మీదా చార్ట్ గీసాడు


అంతే దాన్ని చూసిన M.D పి. పి కో లక్ష రూపాయల బోనస్, 'నా కబుర్లు' బ్లాగ్ రాస్తున్న నాకో 2 లక్షల రూపాయల చెక్ ని గిఫ్ట్ గా పంపించడం తో పాటు ఇంకా తమ ప్రోడక్ట్ సేల్స్ కనుక మరింతగా పెంచగలిగితే అమరావతి లో నిర్మించబోయే తమ కొత్త బ్రాంచ్ కు నన్ను జనరల్ మేనేజర్ ని చేస్తానని ప్రపోసల్ కూడా పెట్టాడు కాబట్టి మీరంతా నా యందు దయగలవారై నా బ్లాగు క్రమం తప్పకుండా చదువుతూ ఉంటారని, అలాగే మీకు శత్రువులు (అంటే బాసులు, భార్యలు/భర్తలు మరియు వారి తరపు బంధువులు లాంటి వారు అన్నమాట) ఉంటే వారికి కూడా నా బ్లాగ్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి నా బ్లాగ్ చదివేట్లు చేస్తారని ఆశిస్తూ ప్రపోసల్ కు ఒప్పుకుంటున్నాను. 


















5, జూన్ 2016, ఆదివారం

సంతోషాన్ని తుడిచేసిన వర్షం

రెండు సంవత్సరాల పరిపాలన సందర్భంగా తెలంగాణా లో K.C.R గారి మీద ప్రశంసల వర్షం , ఆంధ్ర లో చంద్ర బాబు గారి మీద విమర్శల వర్షంకురిసినట్లుగా ఇక్కడ కూడా  సిడ్నీలో గత రెండు రోజులుగా  విపరీతమైన వర్షం కురిసింది. 

నేను 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన కొత్తలో వర్షాలు ఇక్కడ ఎప్పుడైనా పడొచ్చు గొడుకు ఒకటి కొని ఉంచుకో  అన్నాడు నా  మిత్రుడు . అందుకని ఒక షాప్ కి వెళ్లి గొడుగు అడిగితే వాళ్ళు గొడుగులు ఉన్న ప్లేస్ చూపించారు. అన్నీ పెద్ద పెద్ద గొడుగులే. చిన్న సైజు గొడుగు అయితే బాగ్ లో సరిపోతుంది పెట్టుకోవడానికి  అని ఇంత పెద్దవి వద్దు చిన్న సైజు గొడుగు కావాలి అని చిన్నది కొన్నాను. అయినా పాత కాలం వాళ్ళలాగా ఇంతింత పెద్ద గొడుగులు ఇప్పుడు కూడా వాడుతున్నారేమిటబ్బా అని సందేహించాను కానీ  ఆ రోజు సాయంత్రo పడ్డ వర్షానికి నా గొడుగు కుక్కలు చించిన విస్తరి అంటారే అలా తయారైతే  గాని తత్త్వం భోధపడలేదు ఎందుకు ఇక్కడి వాళ్ళు  పెద్ద గొడుగులు వాడతారో. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు గాలి కూడా విపరీతం గా వీస్తుంటుంది. బాగా వర్షం పడిన రోజు బ్రోకెన్ గొడుగులు అక్కడక్కడ రోడ్ పక్కన పడి ఉంటాయి.

చిన్నప్పుడు ఈ వర్షం పడిందంటే మహా సరదాగా ఉండేది ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉండేవి.  స్కూల్ కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎంచక్కా కాగితపు పడవలు చేసుకొని ఆడుకోవచ్చు. పెద్దవాళ్లెవరూ  అరవకపోతే వానా వానా వల్లప్ప పాట పాడుకుంటూ ఆడుకోవచ్చు వానలో. ఇప్పుడు కాలం పిల్లల జీవితాల్లో  రింగా రింగా రోజెస్ అనే రైమ్ వానా వాన వల్లప్ప లాంటి పాటలను కబ్జా చేసేసింది అది వేరే విషయం. ఇక సాయంకాలం కనుక వర్షం పడిందంటే అమ్మ చేతి బజ్జీలో, పకోడీలో పొట్ట పగిలేంతగా తినేసి కమ్మటి కాఫీ ఒకటి తాగడమనేది దాదాపు గా ప్రతి ఒక్కరి జీవితం లో మరువలేని అధ్బుతమైన జ్ఞాపకం. ఇది చదివిన చాలా మంది  ఈ పాటికే తెలుగు సినిమాలో చూపించినట్లుగా మీ మైండ్ లో కూడా చక్రాలు సుడులు తిరిగినట్లుగా అనిపించి అధ్బుతమైన మీ flashback లోకి వెళ్లి అమ్మ చేతి కమ్మటి బజ్జీలో పకోడీలో తినేసి కమ్మటి కాఫీ ఒకటి తాగి వచ్చేసి ఉంటారనుకుంటాను. కమ్మటి కాఫీ ఒకటి తాగి వచ్చారు కాబట్టి నేను రాసిన నస చదవడం వల్ల మొదలైన తలనొప్పి తగ్గి ఉంటుంది కాబట్టి మిగతాది కూడా చదివేయండి.

ఈ రెండు రోజుల కుండ పోత వర్షాల వల్ల బయటికి కూడా వెళ్ళలేకపోయాను. అప్పుడప్పుడూ ఫలానా ఫలానా గ్రామ శివారులోని పొలాల్లో చేపల వర్షం కురిసింది అని T.V లలో చెప్తుంటారు అదేదో ఇక్కడ కూడా మా బాల్కనీ లో పడి  ఉండచ్చు కదా కమ్మగా చేపల పులుసు అయినా వండుకు తినేవాళ్ళము అనిపించింది. బాల్కనీ లో చేపలు కాదు కానీ పక్కనున్న చెట్టు మీదనుంచో లేక పై కప్పు నుంచో millipedes  పడ్డాయి. కాని వాటితో millipedes  పులుసు వండుకొని తినలేము కదండీ. కానీ  వాటి ప్రాణం గట్టిది అనుకుంటా లక్కీగా మా బాల్కనీ లో పడ్డాయి మా అపార్ట్ మెంట్ లోనే  ఉండే ఆ చైనా వాడి  బాల్కనీ లో కాకుండా.

వర్షం పడి  వెలసిన తర్వాత మా పల్లె లో అయితే దారి పొడుగునా  చాలా millipedes కనపడేవి. రోకలి బండ ఆకారం లో ఉంటాయి కాబట్టి రోకలి బండ అనే వారు వాటిని మా ప్రాంతం లో అయితే. టచ్ చేస్తే ముడుచుకుపోయే వాటి తీరు వల్ల వాటిని కాలితో టచ్ చేస్తూ దారిలో నడవడం అదో రకమైన సరదా నాకు. నిన్న సాయంత్రం కాస్త వాన వెలిసాక మా  బాల్కనీ లో అది కనపడితే మా పాపకు చూపించాను. మొదటి సారి దాన్ని చూడటం టచ్ చేస్తే ముడుచుకువు పోవడంలాంటివి తనకు కొంచం కొత్తగా అనిపించాయి. 

వర్షం పడితే ఉండే ముఖ్యమైన నష్టాలు ఏమిటంటే ఒక వేళ ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉందంటే కనుక అది రద్దయ్యే అవకాశం  ఉండేది  కనుక వర్షం వద్దని కోరుకునేవాల్లము. అది చిన్నప్పుడు వర్షం వలన బాధ పడ్డ సందర్భం. మళ్లీ నిన్న వర్షం వలన ఇంకో బాధపడవలసి వచ్చింది. నిన్న హోటల్ లో జరపవలసిన మా పాప birthday పార్టీ ని cancel చేసి నెక్స్ట్ వీకెండ్ కు postpone చేయవలసి వచ్చింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.  నెక్స్ట్ వీకెండ్  ఎప్పుడు వస్తుంది నాన్నా అని ఎంత బాధగా అడిగిందో నా చిట్టితల్లి. దాదాపు వారం రోజులు నుంచి ఈ పార్టీ కోసం ఎంతగానో ఎదురుచూసింది. కాసేపయ్యాక మళ్ళీ వచ్చి మరి నెక్స్ట్ వీకెండ్ కూడా ఎక్కవ వర్షం పడితేనో అంది మరింత దిగులుగా. 

ప్రస్తుతానికి అయితే forecast ప్రకారం రెయిన్ లేదు నెక్స్ట్ వీకెండ్ కి ఇక్కడ. కానీ Don't trust the 3 W's: American Wife, Indian Work, Australian Weather  అన్నది ఇక్కడి కొంతమంది అభిప్రాయం. నెక్స్ట్ వీకెండ్ ఇంత  భారీ వర్షం పడకూడదు అని కోరుకుంటున్నాను. 

మీ తల తిరుగుతున్నట్లుగా భారంగా ఏదో తేడాగా ఉన్నట్లనిపిస్తోంది కదూ పూర్తిగా చదివాక దాన్నే తలనొప్పి అంటారు ఇప్పుడు అర్జెంట్ గా మరో కప్ కాఫీ తాగేయండి ఈ సారి flashback లోకి కాకుండా కిచెన్ లోకి వెళ్లి.





2, జూన్ 2016, గురువారం

బయ్యర్లకు భారమైన బ్రహ్మోత్సవం

మొన్న ఏదో వెబ్సైటు లో చదివా ఈ న్యూస్. '24' సినిమా కథతో దర్శకుడు విక్రం కుమార్ మొదట  మహేష్ బాబు దగ్గరికే వెళ్ళాడని, ఓల్డ్ getup లో  విలన్ గా తను ఆ పాత్రకు న్యాయం చేయలేనేమో  అని అలాగే  ఆడియన్స్ తనను అలా  రిసీవ్ చేసుకోరేమో అని ఇలా రకరకాల కారణాలతో  కాదన్నాడు అని ఆ తర్వాత బ్రహ్మోత్సవం కు ఓకే చెప్పాడని తెలిసింది. ఇది చదివాక  'గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట' అనే సామెత గుర్తొచ్చింది. నాకు తెలిసి బ్రహ్మోత్సవం లాంటి సినిమా చేయడం కన్నా 24 లాంటి సినిమా చేయడం మేలేమో అనిపిస్తుంది . మన హీరోలు ఇమేజ్ అనే చట్రం లో ఇరుక్కుపోయి  అవే రకమైన సినిమాలు చేస్తున్నారు. 1 సినిమా తో మంచి attempt అనిపించుకున్నాడు of course అది ప్లాప్ అయి ఉండవచ్చు. కానీ నాతో పాటు పని చేసే చాలా మంది నార్త్ ఇండియన్స్ కు ఆ సినిమా నచ్చింది. చూడమని నేనే వాళ్లకు రెఫర్ చేసాను. 

బ్రహ్మోత్సవం సినిమా కు సగానికి సగం నష్టం వచ్చిందని అన్ని వెబ్సైటు లలో ఊదరగొడుతున్నారు. అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా అన్నట్లు  ఎంత మహేష్ బాబు సినిమా అయితే మాత్రం అంత  ఖర్చుపెట్టడం అవసరమా. బయ్యర్లు కూడా పోటి పడి సినిమా ను అధిక రేట్లకు కొనేసారు. సినిమా లో ఆడాళ్ళు పచ్చళ్ళు పెట్టేటప్పుడు కూడా పట్టు చీరలు కట్టుకొని ఉంటారు విడ్డూరంగా. ఈ సినిమాలో మహేష్ బాబు అందంగా ఉన్నాడు అనేది ఎంత నిజమో సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని బడ్జెట్ అమాంతం పెంచేసారనేది అంతే  నిజం. 

 హంస నడకలు రాకపోయే - ఉన్న నడకలు మరిచిపోయే అన్న చందాన ఏదో మంచి సినిమాలు తీస్తాడు అనుకునే శ్రీకాంత్ అడ్డాల సినిమాలు రాను రాను దారుణంగా తయారవుతున్నాయి. మొన్న ముకుంద ఇప్పుడు ఈ  బ్రహ్మోత్సవం. మరీ బాడ్ సినిమా అనిపించలేదు కానీ రామాయణం లో పిడకల వేట లాగా ఏడూ తరాలు అనే కాన్సెప్ట్ అనవసరంగా ఇరికించాడు. ఏది ఏమైతేనేం  రావురమేష్ విషయం లో మాత్రం శ్రీకాంత్ అడ్డాల ను మెచ్చుకోవచ్చు అతని అద్భుతమైన నటనను బయటపెట్టే క్యారెక్టర్ ను సృష్టించినందుకు. ఇప్పటికైనా పరభాష నుంచి సహాయ నటులను, విలన్లను అరువు తెచ్చుకోకుండా రావురమేష్ లాంటి వాళ్ళను ఎంపిక చేసుకుంటే మంచిది.

నేను ఒక్కడినే టీ పెడితే బాగుంటుంది లేదా నా భార్య ఒక్కతే టీ పెడితే మరీ బాగుంటుంది. ఎప్పుడైనా ఇద్దరం కలిసి టీ పెడితే  అది కాస్తా చక్కర పాకం లాగానో లేదంటే పంచదార మర్చిపోవడం వలన కషాయం లాగానో అవుతూ ఉంటుంది. కాబట్టి too many cooks spoil the broth అన్నట్లుగా  పరుచూరి బ్రదర్స్ కూడా కథలో వేలు పెట్టేసి  సినిమాను  కిచిడి చేసేసినట్లు ఉన్నారు.

P.S : నువ్వు ఏమైనా చెప్పు ఆస్ట్రేలియా అనేదే  మన తెలుగు సినిమాలకు అచ్చిరాదు అన్నది ఇక్కడి నా ఫ్రెండ్ మూర్ఖ వాదన. ఆస్ట్రేలియా/సిడ్నీ లో తీసిన కొన్ని తెలుగు సినిమాలలో ఒక్క మగాడు, ఆరంజ్, శంఖం లాంటివి  ప్లాప్ అయ్యాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటివి హిట్ అయ్యాయి. బ్రహ్మోత్సవం లో కాజల్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు చెప్తారు. U.S నుంచి వచ్చినట్లు చూపించాల్సింది అన్నది వాడి వాదన.