29, ఆగస్టు 2020, శనివారం

అంకాళమ్మ గుళ్ళో ప్రసాదం పంచి పెట్టే పని చెయ్

అయిదారు నెలల క్రితం కొలీగ్ తో జరిగిన వాదన లాంటి సంభాషణలో భాగంగా 'పేద వాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ చేతగానితనమే' అనే కాన్సెప్ట్ ని బలపరుస్తూ నేను నా లైఫ్ లో చూసిన ఉదాహారణలతో పాటు వాదించాను. 

ఈ మధ్య పూరి జగన్నాథ్ ఏమైతే అన్నారో దాదాపు అలాంటి పాయింట్స్ నేను కూడా లేవదీశాను. బాగా డబ్బు ఉండి కూడా  రేషన్ కార్డు అడ్డ దారిలో సంపాదించి ఫ్రీ బియ్యం తెచ్చుకొని అన్నం చేసుకోవడానికి బాగోకపోతేనేమి ఇడ్లీ కి పనికొస్తాయి అని వాడుకునే వాళ్ళను చూశాను. 

మొన్నా మధ్య నేను పనిచేస్తున్న కంపెనీ లో రిజైన్ చేసాను. మేనేజర్, ఆ పై మానేజర్ మాట్లాడారు సంధి కుదర్చడం కోసం.  అవి ఫలించకపోవడంతో కంపనీ డెలివరీ హెడ్ నన్ను పిలిచి మాట్లాడారు. 

రెక్కలొచ్చాయి కాబట్టి ఎగరాలనుకుంటున్నావు? అంతేనా?

అంతే కదా సుబ్బారావ్ గారు. ప్రతీ కుక్కకి ఒక రోజు వస్తుంది. 

నువ్వు ఇక్కడే ఉండాలంటే మేము ఏంచెయ్యాలి?  

గత ఎనిమిది సంవత్సరాలుగా నా శాలరీ లో హైక్ అనేది లేకుండా చేస్తున్నారు  యెంత మంచి రేటింగ్స్ వచ్చినా హైక్ ఇవ్వడం లేదు యేవో కారణాలు చూపిస్తూ. కాబట్టి 10% హైక్ ఇస్తే ఉంటాను. 

తప్పకుండా, ఈ సారి అప్రైసల్ లో హైక్ వచ్చేలా చూస్తాను. 

గత మూడేళ్ళలో ఇది రెండో సారి మీ నుండి ఇదే మాట వినడం 

లేదు, ఈ సారి confirm.  

ఎలా నమ్మేది, ఒక మెయిల్ పంపించండి అలా అని. 

అలా కుదరదు. సరే, బయట నీకు యెంత ఇస్తున్నారు?

30% హైక్ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్న శాలరీ పైన. 

నీకు ఇప్పుడు ఇక్కడ యెంత వస్తుందో తెలుసుకోవచ్చా.  

***** $

ఆయన తన ఫోన్లో calculator ఓపెన్ చేసి నీకు ఈ మధ్యే PR వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు  PR హోల్డర్ వి. నీకు ఇద్దరు పిల్లలు అలాగే నీ శాలరీ ##### కంటే తక్కువ,  కాబట్టి నీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్, ఇప్పటి నీ సాలరీ కలుపుకుంటే నీకు ఆ కొత్త కంపెనీ ఇచ్చే శాలరీ కి ఆల్మోస్ట్ సమానం. మరి అలాంటప్పుడు నువ్వు కంపెనీ మారడం అవసరమా? ఇక్కడ నీకు ఈ కంపెనీ లో హాయినా జరుగుతూ ఉన్నప్పుడు?

అంటే నన్ను భిక్షం ఎత్తుకోమంటారా?

అలా ఎందుకు అనుకుంటావ్? నువ్వు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా బెనిఫిట్స్  పొందుతున్నావ్. 

నాకు ఎక్కువ సంపాదించే శక్తి ఉండి కూడా చేవ చచ్చిన వాడిలా  గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవడం అవసరం అంటారా, ఆ బెనిఫిట్స్ యేవో నిజంగా అవసరం అయ్యే వారికి ఉపయోగపడతాయి. 

PR ఉండి కూడా మన కంపెనీ లోనే తక్కువ శాలరీ కి పనిచేస్తూ గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు వారిలాగే నువ్వు అనుకోవచ్చుగా.  

టాలెంట్ ఉండి ఈ కంపెనీ వదిలి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలా ఉండాలనుకుంటున్నాను అని అన్నాను. 

అలా  డిస్కషన్ ముగిసింది. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి 'గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకో, జాబ్ మారడం అవసరమా?' అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ "సారా పాకెట్స్ ఇస్తాము, మీకు కలర్ టీవీలు ఇస్తాము మాకే ఓటు వేయండి" అని ఓటర్లను ప్రలోభపరిచే రాజకీయ నాయకుడిని తలపించాడు. 

ఈ సోది అంతా ఎందుకు చెప్పాను అంటే, పూరి జగన్నాథ్ గారి వాఖ్యలకు ఈ ఇన్సిడెంట్ కాస్త దగ్గరగా ఉండటం వల్ల. ఆయన పూర్తిగా ఏమన్నారో వినలేదు కానీ అక్కడ ఇక్కడ చదివిన దాన్ని బట్టి ఆయన ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకున్నాను. 

చివరిగా నేను చెప్పేది ఏమిటంటే మనం ఏది అన్నా కూడా దాన్ని విమర్శించే వారు ఉండనే ఉంటారు కాబట్టి పూరీ జగన్నాథ్ వాఖ్యల మీద కస్సు బుస్సుమని బుసలు మొదలు పెట్టారు కొందరు. నేను ఆయన్ని సమర్థిస్తున్నాను అని నేను పూరి జగన్నాథ్ ఫ్యాన్ ని అనుకోకండి అతని సినిమాలు చాలా వరకు నాకు నచ్చవు.  సరే అలాంటి వాళ్ళను పట్టించుకుని వారిని సంతోషపరచాలి అనుకుని ఆయన సారీ చెప్తూ పోతే కుదరదు. 

నేను తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడు నన్ను క్లాస్ లీడర్ గా పెట్టారు. ఎవరైనా టీచర్ రానప్పుడు స్కూల్ లో అల్లరి చేయకుండా పిల్లలు చదువుకోవాలి, ఎవరైనా అల్లరి చేస్తే వారి పేరు బోర్డు మీద రాయాలి ఇది క్లాస్ లీడర్ పనిలో భాగం.  

ఒక అరగంట తర్వాత  మా శాస్త్రి సార్ వచ్చి బోర్డు మీద చూసారు అందులో ఎవరి పేరు లేదు . నన్ను పిలిచి 'మా ఆఫీస్ రూమ్ వరకు వినపడుతోంది ఈ క్లాస్ లో పిల్లలు చేసే అల్లరి' మరి బోర్డు మీద ఎవ్వరి పేరు లేదెందుకు అన్నారు. 

ఫలానా వాళ్ళు అల్లరి చేస్తున్నారు కానీ వాళ్ళను భాధ పెట్టడం ఎందుకని రాయలేదు అన్నాను.  

అందరిని సంతోష పెట్టాలంటే 'అంకాళమ్మ గుళ్ళో ప్రసాదం పంచి పెట్టే పని చెయ్, క్లాస్ లీడర్ గా పనికి రావు' అన్నారు. 

'If you want to make everyone happy, don't be a leadersell ice cream!'  అనే స్టీవ్ జాబ్స్ గారి కొటేషన్ గుర్తుకు వచ్చింది కదూ. అప్పుడెప్పుడో మా శాస్త్రి సార్ ఇదే మాట అన్నారు, కాకపోతే శంఖం లోంచి వస్తేనే కదా తీర్థం అయ్యేది. అవును కాపీ కేసు వేయచ్చంటారా స్టీవ్ జాబ్స్ వారసుల మీద. ఇలాంటి కాపీమరకలు  కొత్త సినిమాలు అయిన 'ఆచార్య', 'పుష్ప' మీద పడ్డట్లున్నాయి ఈ మధ్య. 

తోక: నా మేనేజర్స్ ని ఎవరైనా సరే సుబ్బారావ్ అని పిలుచుకుంటాను నేను.