అప్పడాలు, గొడుగులు సరే, ఈ సానుకూల దృక్పథమేమిటబ్బా? ఈ పదం ఎప్పుడూ వినలేదే, ఇదేదో గ్రాంధిక భాష లా ఉందే అని ఇంగ్లీష్ మీడియం చదివినోళ్లకు అనిపించచ్చు కానీ అది అందరికీ తెలిసిన 'పాజిటివ్ థింకింగ్' అనే ఇంగ్లీష్ పదానికి సరి సమానమైన మన అచ్చ తెలుగు పదం.
ఈ డోర్ మూసుకుపోయిందే అని బాధ పడుతూ మళ్ళీ ఆ డోర్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురుచూడకుండా, ఇంకో డోర్ ఏదైనా తెరిచి ఉంటుందేమో వెతుకు.
నా మిగిలిన జీవితంలో ఇదింకా మొదటి రోజే, ఇప్పటికీ మించిపోయింది లేదు నాకు చాలా టైం ఉంది ఏదైనా సాధించాలి అనుకుంటే.
కాలిలో ముళ్ళు గుచ్చుకుందని బాధపడటమెందుకు? కంట్లో కుచ్చుకోలేదని సంతోషించు.
అర్రె! గ్లాస్ లో సగం జ్యూస్ అయిపొయిందే అనుకునే కన్నా సగం మిగిలి ఉందని అనుకో.
రోజుకు 1440 నిముషాలు అంటే 1440 అవకాశాలు ఉన్నట్లు, ఏదైనా కొత్తగా ఆలోచించి ఆచరణలో పెట్టడానికి.
రోజా పువ్వుకు ముళ్ళు ఉన్నాయని చూడకు, అంతకు మించిన అందం దానికి ఉందని గుర్తుంచుకో.
రోజా పువ్వుకు ముళ్ళు ఉన్నాయని చూడకు, అంతకు మించిన అందం దానికి ఉందని గుర్తుంచుకో.
ఇలా పాజిటివ్ థింకింగ్ గురించిన కొటేషన్స్ ప్రతీ రోజూ ఫేస్బుక్, వాట్సాప్ మెస్సేజుల్లో చదువుతూనే ఉంటాం, కానీ అవసరమైన చోట మాత్రం ఈ పాజిటివ్ థింకింగ్ ని ఆచరణలో పెట్టం.
ఈ పాజిటివ్ థింకింగ్ గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకానొక ఊరిలో ఎంకాయమ్మ అని ఒక పెద్దావిడ ఉండేది. ఆవిడ ఇద్దరు కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసింది. పెద్ద అల్లుడు అప్పడాల వ్యాపారం, చిన్న అల్లుడు గొడుగుల వ్యాపారం చేసేవాళ్ళు. ఇద్దరు అల్లుళ్ళు మంచి వాళ్ళే, వారి భార్యలను బాగానే చూసుకునేవారు. అయినా కూడా ఎప్పుడూ ఆ పెద్దావిడ దిగులుగా ఏడుస్తూ ఉండేది. కారణం ఎవరికీ తెలిసేది కాదు కానీ, ఊర్లో వారందరూ ఆవిడను ఏడ్చే ఎంకాయమ్మ అని పిలిచేవాళ్ళు.
ఒక రోజు ఆ ఊరికి స్వామిజీ వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళి తన గోడు వెళ్లబోసుకుంది. స్వామీ, ఎండ ఉండే రోజు, ఎవరూ గొడుగులు కొనరు. కాబట్టి నా చిన్న అల్లుడు ఊరూరా తిరుగుతూ ఒక్క గొడుగు కూడా అమ్మలేడు అందుకే ఎండ ఉండే రోజు ఈ బాధ మనసును తొలుస్తూనే ఉంటుంది. ఇక వర్షం పడే రోజు, పెద్ద అల్లుడు ఊరూరా తిరుగుతూ అప్పడాలు అమ్మలేడు, అలాగే ఇంట్లో తయారు చేసిన అప్పడాలను ఇంటి డాబా మీద కూడా ఎండబెట్టలేడు. కాబట్టి వర్షం పడే రోజు పెద్ద కూతురి సంసారం గురించి బాధ. కాబట్టి వర్షం పడినా బాధే, ఎండ కాసినా బాధే అని తన గోడు వెళ్లదీసుకుంది ఆ స్వామీజీ తో.
అప్పుడు ఆయన 'చూడు తల్లీ! ఎండ ఉండే రోజు నీ పెద్ద అల్లుడి వ్యాపారం గురించే ఆలోచించు, ఆ రోజు ఎక్కువ అప్పడాలు అమ్మి డబ్బు సంపాదించుకుంటాడు కాబట్టి. వర్షం పడే రోజు నీ చిన్న అల్లుడి వ్యాపారం గురించే ఆలోచించు, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ గొడుగులు అమ్మి డబ్బు సంపాదించుకుంటాడు కాబట్టి. అనవసరంగా సమస్యను భూతద్దం లో చూడకుండా సానుకూల దృక్పథాన్ని అలవరచుకో ' అని చెప్పి పంపించాడు. ఆ రోజు నుంచి ఏడ్చే ఎంకాయమ్మ కాస్త 'నవ్వే ఎంకాయమ్మ' అయ్యింది.
భూతద్దం అంటే భూతాలను, ప్రేతాలను చూపే అద్దం కాదు, magnifying glass అని మనవి. ఈ జనరేషన్ వాళ్ళు భూతద్దం అంటే అదేదో బూతు మాట అనుకునే ప్రమాదం ఉంది. అసలే రూపాయి కన్నా ఘోరంగా మన తెలుగు వేల్యూ పడిపోతోంది రోజు రోజుకి.
అరే, ఆ ఎంకాయమ్మ సమస్య చాలా సింపుల్ కదా, దీనికి పోయి ఆ ఎంకాయమ్మ బాధ పడటం ఏమిటి మరీ సిల్లీ కాకపొతే అని అనుకుంటాం కానీ మనలో కూడా చాలా మంది ఇలాంటి వాటికే బాధపడుతుంటాము.
మరి ఇంత చెప్తున్నావ్? ముందు నువ్వు చెప్పు, చిన్న చిన్న విషయాలకు నువ్వెప్పుడూ బాధపడలేదా అంటారా? "విజయానికి ఐదు మెట్లు" పుస్తకం రాసిన యండమూరి కూడా కొన్నిట్లో విజయాలు సాధించలేక పోయాడని గుర్తుంచుకోండి.
"విజయానికి ఐదు మెట్లు" అంటే ఒక గుర్తొచ్చింది, ఆ పుస్తకం చదవకుండానే అంతో ఇంతో విజయాలు సాధించాను, ఇక ఆ పుస్తకం కూడా చదివేస్తే మరిన్ని విజయాలు సాధించచ్చు. హమ్మయ్య! ఇవాళ్టికి పాజిటివ్ థింకింగ్ అయిపోయింది.
ఫైనల్ గా నే చెప్పొచ్చేది ఏమిటంటే మీ చేతిలో లేని విషయాల గురించి బాధపడటం మానేసి ఉదయాన్నే ఈ "అప్పడాలు-గొడుగులు" సిద్ధాంతాన్ని ఫాలో అయిపోయి రోజంతా సంతోషంగా ఉండండి.
అలాగే ప్రతీ రోజు రాత్రి పడుకునే ముందు మరొక్కటి ఆలోచించండి, ఈ రోజుకు ఎంతో కొంత సాధించామా లేదా అని? ఏదీ సాధించలేదా, కనీసం ఎంతో కొంత నేర్చుకున్నాం కదా అనుకోండి, అదీ చెయ్యలేదా కనీసం జబ్బు పడలేదు కదా అనుకోండి, సరే జబ్బు పడ్డామా, చావలేదు కదా అది చాలు అందుకు సంతోషించండి, "రేపు" అనేది ఇంకా ఉంది నేను అనుకున్నది సాధించడానికి అని హాయిగా నిద్రపోండి.