29, నవంబర్ 2018, గురువారం

కె.ఏ పాల్ అంటే నాకు కోపం, ద్వేషం, పగ, పగ, పగ

"సిడ్నీ లో వరదలటగా , అందరూ క్షేమమేనా?" అంటూ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఫోన్.  

సిడ్నీవరదలు,  క్వీన్స్ ల్యాండ్  కరువులు, స్ట్రాబెరిల్లో సూదులు, ఖర్భుజా లో కల్తీలు ఇలాంటివన్నీ వీళ్లకు పెద్ద విషయాలుగా కనపడతాయి. ఏరియా ను బట్టి వీటి డెఫినిషన్ మారుతూ ఉంటుంది. మన చెన్నై, కేరళ వరదలతో పోలిస్తే ఇవి నథింగ్.

స్ట్రాబెరిల్లో సూదులు, ఖర్భుజా లో కల్తీలు  ఏమిటి?

ఆ మధ్య స్ట్రాబెరిల్లో సూదులు వచ్చాయని గోల పెట్టారు.

అక్కడ కూడా కల్తీ ఉందన్నమాట.

అలాంటిదే అనుకో. ఇంకేంటి విశేషాలు?

ఏముంటాయ్, సుహాసిని గెలుస్తుందా లేదా అని బెట్టింగులు జరుగుతున్నాయ్. 

సుహాసిని గెలవడమా? దేంట్లో? సీరియల్లోనా? సినిమాల్లోనా?

ఎలెక్షన్స్  లో

జయప్రద, జయసుధ లాగా సుహాసిని కూడా పాలిటిక్స్ లో ఎంటర్ అయిందా?

నీకు పొలిటికల్ నాలెడ్జి నిల్లు అని తెలిసి కూడా నీతో ఆ టాపిక్ ఎత్తడం నాదే తప్పు. 

సరే ఆ "సుజనా చౌదరి" .... 

మళ్ళీ ఈవిడెవరు?

ఆవిడ కాదు అతను, బొత్తిగా నీకు లోక జ్ఞానం లేనట్లు ఉంది

లోక జ్ఞానం అంటే గుర్తొచ్చింది, లోక్ సత్తా పార్టీ ఎలా ఉంది?

ఆ దుకాణం మూసేసారు, ఇప్పుడు జేడీ లక్ష్మీ నారాయణ గారు సొంత పార్టీ పెడతారంట.

రాఖీ సావంత్ సొంత పార్టీ పెట్టగా లేనిది ఆయన పెట్టలేరా ఏమిటి?

ఈ సారి మన ఆంధ్రా లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటావా ?

రాజకీయాల గురించి నాకెంత తెలుసో ఆయనకు అంతే తెలుసని నా ఫీలింగ్.  'విజ్ఞాన గని అని ఫీలయ్యే అజ్ఞాని అతను' అని అందరూ అంటూ ఉండగా విన్నాను. 

అయితేనేం కె.ఏ పాల్ చేరదీసి సి.ఎం ని చేస్తానన్నాడుగా.

సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ డౌన్ అవ్వచ్చు కానీ కె.ఏ పాల్ కామెడీ చెయ్యడం లో ఎప్పటికీ తగ్గరు.

పాల్ గారు అంటే నీకు బాగా ఇష్టం ఉన్నట్లుంది.

ఇష్టం కాదు, విపరీతమైన కోపం, ద్వేషం, పగ కూడా.  పాకిస్తాన్ టెర్రరిస్ట్ నైనా క్షమించచ్చు గానీ ఆయనను క్షమించే ప్రసక్తి లేదు, నాకు ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది.

ఆయనకు నువ్వు బాగా తెలుసా అయితే.

లేదు, నాకు ఆయన తెలుసంతే.

మరి కోపమెందుకు.

యిరవైయ్యేళ్ల క్రితం జరిగిన సంఘటన అది, చెబుతా విను

సంవత్సరం: 1998
నెల: జులై 24
సమయం: పగలు పన్నెండు గంటలు
స్థలం: కడప, మిత్రుడు మాథ్యూస్ ఇంటి బయట

అయితే సాయంత్రం "తొలిప్రేమ" సినిమా కు రానంటావ్? కోపంగా అడిగాను నేను 

అవును అన్నాడు మాథ్యూస్

నీకు పవన్ కంటే పాల్ ముఖ్యమా?

అవును. K.A పాల్  'సువార్త మహా సభలు' జరుగుతున్నాయి. ఇంట్లో వాళ్లతో వెళ్లకపోతే  నా తోలు తీసి చెప్పులు కుడతారు.



ఇంకో సారి  అడుగుతున్నా, వస్తావా రావా ?

ముందు నువ్వు ఇంట్లోకి వచ్చి కూర్చో. పైన ఎండలు, కింద బండలు మండిపోతున్నాయి

ఎండలు బండలదేముంది, లోన బాధతో గుండెలు మండిపోతున్నాయ్ ఇక్కడ , ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్. 

ఎప్పటివరకు?

రేపు ఉదయం వరకు,  మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్ గా ఫ్రెండ్షిప్ మొదలెడదాం.

అలా నేనొక్కడినే  తొలిప్రేమ సినిమాకి వెళ్ళొచ్చాను. అలా నాకు నా ఫ్రెండ్ కి మధ్య పాల్ వల్ల గొడవైంది. ఆ తర్వాత వాడు మూడు సార్లు తొలిప్రేమ సినిమాకి వెళ్ళొచ్చాడు అది వేరే విషయం. హలో! హలో ! 

ఫ్రెండ్ ఫోన్ పెట్టేశాడు ఆల్రెడీ నా సోది వినలేక. 

మీరు కూడా చదివేసారుగా, కామెంట్స్, లైక్స్, హేట్స్ ఉంటే పెట్టేసి మీ ఫోన్/లాప్టాప్ పక్కన పెట్టేయండి. 

25, నవంబర్ 2018, ఆదివారం

అన్నము, బ్రెడ్ పకోడి అయింది

ఈ ముడి విప్పుతావేమో చూడు  అంది మా ఆవిడ 

మన ఇద్దరి మధ్య ఆ బ్రహ్మ వేసిన ముడి విప్పడం ఎవ్వరివల్ల  కాదు

చాల్లే నీ పంచ్ లు, ముడి విప్పమని నేనన్నది ఈ స్కిప్పింగ్ రోప్ కి

ఆ ముడి విప్పడానికి నేను తంటాలు పడుతుంటే, మా బుడ్డోడు ఆ తాడు లాగడానికి ట్రై చేస్తున్నాడు.

నో నాన్నా! అలా లాక్కోకూడదు, అందరూ నిన్ను 'బ్యాడ్' అంటారు అన్నాను

ఇప్పటికీ మించిపోయింది లేదు, అనీష్ అనే పేరు మార్చేసి 'గుడ్' అని పెట్టు, అప్పుడు అందరూ 'గుడ్' అనే పిలుస్తారు అంది.

నాకూ పంచ్ వేసేసావా? అన్నాను

పంచులు తర్వాత,  పప్పు, అన్నము లోకి నంచుకోవడానికి పకోడ చేస్తాను అని మా ఆవిడ కిచెన్ లోకి వెళ్ళింది.

ఇంతలో మా మిత్రుడి ఫోన్

ఇవాళ సిడ్నీ లో క్రికెట్ మ్యాచ్ ఉందిగా, వెళ్లట్లేదా ?

లేదు, అంబీ అదే మన అంబరీష్ పోయారుగా అందుకే బాధతో వెళ్ళలేదు

అంతలేదు గానీ, అసలు విషయం చెప్పు

వెళ్లింటే బాగుండు, కనీసం సచిన్ ను చూసి ఉండచ్చు

ఇంకా సచినేమిటి, ఆయన టైం అయిపోయింది క్రికెట్ లో

సరేలే కనీసం సెహ్వాగ్ ని అయినా చూసి ఉండేవాడిని వెళ్లి ఉంటే

అర్థమైంది మహానుభావా నువ్వు క్రికెట్ చూడ్డం మానేసి ఏళ్ళు అయిందని, అది సరే గానీ హాయిగా క్రికెట్ చూడ్డం మానేసి 'బ్లాగ్' అంటూ అంత కష్టపడి రాయడం అవసరమా ?

కష్టపడే కాదు ఇష్టపడి కూడా. అయినా కష్టపడకుండా వచ్చేదంటూ ఉంటే అది ముసలితనమే. అది వచ్చే లోగా కష్టపడి ఏదో సాధించాలని  తపన అంతే. 

డైలాగ్ బాగుంది రజనికాంత్ కు పంపించు, తన సినిమాలో పెట్టుకుంటాడు.

సరేలే ఇప్పుడెందుకు ఫోన్ చేసావ్ ?

'నేను N.T.R మూవీ లో ఒక రోల్ చేస్తున్నాను' అన్నాడు 

ఏ రోల్

అడవిరాముడు లో అప్పారావ్ వేసిన రోల్

అడవిరాముడు లో అప్పారావ్ రోలా? అదేం క్యారెక్టర్ ?

అదే అడవిలో ఉండే జనాల్లో మొదటి వరసలో ఉంటాడే అతని రోల్

అంటే ఇప్పుడు నువ్వు కూడా ఆ గుంపు లో మా బాలకృష్ణ వెనుక ఉంటావన్నమాట.

అవును, N.T.R సినిమా తప్పకుండా చూడు అని ఫోన్ పెట్టేసాడు మావాడు.

ఏంటో ఈ క్రిష్! ఒక సారి శ్రీదేవి అంటాడు, ఇంకోసారి సావిత్రి అంటాడు మరోసారి జయ ప్రద, జయ సుధ కేరక్టర్స్ అంటాడు ఇంకోసారి నాగేశ్వర రావు అంటాడు. ఏదో పల్లెల్లో రికార్డింగ్ డాన్స్ చేసినట్లు అందరూ తలా కాసేపు వచ్చి డాన్స్ చేస్తారో ఏమో, మొత్తానికి సినిమా తీస్తున్నాడో, రికార్డింగ్ డాన్స్ తీస్తున్నాడో అర్థం కావట్లేదు. 

పకోడి రెడీ అంది ప్లేట్ లో పెట్టి



శనిగ పిండి లేదన్నావ్?

అందుకే బ్రెడ్ తో చేసాను

బ్రెడ్ కొద్దిగానే ఉంది కదా

అవును అది కొంచెమే ఉందని దానికి కొంచెం అన్నము కూడా కలిపేసి చేశాను అంది  

అసలే ఈ బ్రెడ్ అంటే పేసెంట్స్ తినే ఫుడ్ అని నా ఫీలింగ్, దానికి తోడు ఏవేవో కలిపి కలగాపులగం చేసేసావ్.

క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో, టమేటా, ఆనియన్ వేశానంతే. తిను, బానే ఉంటుంది

ఏమో అనుకున్నా కానీ పకోడ టేస్ట్ చాలా బాగుంది. అయినా వంట చేసేవాళ్లకు తెలుసు వంట ఎలా వండాలో.  క్రిష్ కూడా మంచి వంటగాడే కాబట్టి ఎన్ని కేరక్టర్స్ పెట్టినా సినిమా బానే తీస్తాడు లే అనుకున్నా.

20, నవంబర్ 2018, మంగళవారం

Plantar Fasciitis - ప్లాంటార్‌ ఫేషియా


'మీరు మధ్య వయస్కులై ఉండి పొద్దుటే లేవగానే నొప్పి లేదంటే  మీరు మీ బెడ్ మీద కాక స్వర్గం/నరకం లోనో ఉన్నట్లు' అనే మాట నిజం అని నమ్మేవాడిని నేను

గత రెండు నెలల క్రితం వరకు, నిద్ర లేవగానే నేను నా బెడ్ మీద ఉన్నానా? లేదా? అని రోజూ నేను చెక్ చేసుకునే వాడిని  .. కానీ గత రెండు నెలలుగా అవసరం తప్పింది లేస్తూనే 'కాలి మడమ' నొప్పిగా ఉండటంతో


మిత్రులైన జోసెఫ్,సలీంతో ఈ విషయం చర్చించినప్పుడు/మసీదించినప్పుడు వాళ్ళ ఇద్దరికీ కూడా ఇలాంటినొప్పి ఉందని తెలియంగానే నేను కూడా బాలకృష్ణలా సంబర ఆశ్చర్యాల్లో మునిగిపోయాను. హమ్మయ్య, మన లాంటోళ్ళు ఇంకా ఉన్నారన్నమాట అనే శాడిస్టిక్ ఆనందం తో పక్కనోడికి కూడా ఉందని తెలిసాక.  


ఎలాగూ కాలమతి ని కాబట్టి, నొప్పి ఎక్కువయ్యాకే డాక్టర్ దగ్గరికి వెళ్లాలను కున్నా. కానీ రోజు దీపావళి సంబరాలు ఆఫీస్ లో జరుగుతూ ఉంటే టైం కలిసి వస్తుందని, డాక్టర్ దగ్గరికి బయలు దేరాను

బ్రౌనీ తినకుండా ఎక్కడికి వెళ్తున్నావ్ అని ఒక తెల్లోడు ఎదురయ్యాడు

దీపావళి  ఫెస్టివల్ లో బ్రౌనీ ఏమిటా అనుకున్నా

తర్వాత అర్థమైంది అది బిర్యాని అని, నోరు తిరగక అతను అలా అన్నాడని

పక్కనే ఉండే హాస్పిటల్ లోకి నొప్పిగా ఉండే ఎడం కాలుతో అడుగెట్టి డాక్టర్ ఉన్నారు అని అడిగా?

డాక్టర్ జత్వట్ ఉన్నారు అందా అందమైన రిసెప్షనిస్ట్ 

జట్టట్ .. నోరు తిరగకపోవడమేంటో ఇవాళ. సరే అని ఆయన రూమ్ లోకి అడుగెట్టా

కాసేపు నా సోది విన్నాక, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 'Plantar Fasciitis' అన్నాడు 

డాక్టర్ పేరే కాదు ఆయన చెప్పిన పదం కూడా నోరు తిరగడం లేదు పలకడానికి.  'ప్లాంతర్ పకిడి'?  అన్నాను అర్థం కాక 

కాదు 'ప్లాంటార్ఫేషియఅన్నాడు

ఈయనేదో పెద్ద పేరే చెప్పాడు, కొంపదీసి నాకు రోజులు దగ్గర పడట్లేదుగా .. ఇక శాలువా కప్పుకు తిరగాలా గీతాంజలి లో నాగార్జున లా . ఇప్పటికిప్పుడు సిడ్నీ లో శాలువా కొనాలంటే నెల శాలరీ దానికే పోతుంది.  అర్జెంట్ గా ఇండియా నుంచి పంపమని నాన్నకు చెప్పాలి

స్కాన్ రిపోర్ట్స్ ఉన్నాయా నీ దగ్గర అన్నాడు?

ఇండియా లో ఉన్నాయిఅప్పుడెప్పుడో నాన్న రిటైర్ అయినప్పుడు చాలా శాలువాలు వచ్చాయి. అందులో వడియాలు ఆరేయగా మిగిలిన శాలువాల లోంచి ఒకటి ఉండాలి డాక్టర్

Excuse me అన్నాడు నే చెప్పేదేదో అర్థం కాక 

సారీస్కాన్ రిపోర్ట్స్లేవు డాక్టర్ 

సరే స్కాన్ చేయించుకురా అన్నాడు 

స్కాన్ చూసిప్రతీ పది మందిలో ఒకరికి ఇది వస్తుంది

ఇంతకీ ఒకడిని నేను మిగతా తొమ్మిది మంది ఎవరబ్బా అని తీవ్రంగా ఆలోచించాను కానీ నా అరికాలి కి తట్టలేదు. ఇలా తెగ అలోచించి నా అరికాలికి ఇంత స్ట్రైన్ ఇస్తాను కాబట్టే పెయిన్ వచ్చి ఉంటుంది అని తీర్మానించుకునేలోపే  ప్లాంటార్ఫేషియా గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యడం మొదలెట్టాడు 

కొంత మందికి మడమ క్రింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదునుగా పెరుగుతుంది. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది.



ఇది తగ్గడానికి కింది సూచనలు ఇచ్చాడు. 
  • అధికబరువును తగ్గించుకోవటం.  -- నా బరువు మరీ ఎక్కువ లేదు. 
  • కొందరికి కార్టికోస్టిరాయిడ్‌ ఇంజెక్షన్లూ అవసరమవుతాయి. -- నో మెడిసిన్ ప్లీజ్ 
  • ఏ చికిత్సలూ పనిచేయకపోతే ఆపరేషన్‌ కూడా చేయాల్సి రావొచ్చు. -- వామ్మో ఇదంటే భయం 
  • కూసిన్ని వ్యాయామాల లాంటివి చేయాలి - ఇది ఓకే. చేసేస్తాను. 

సో, ప్రస్తుతానికి  వ్యాయామాలు చేస్తున్నా, తగ్గుతుందేమో చూడాలి