29, మే 2019, బుధవారం

కాకరకాయ కుక్క అయింది

పోయిన వారం కాస్త టైం దొరికింది కదా అని టీవీ పెడితే 'నీ గుండెల్లో చోటు' అనే సీరియల్ వస్తోంది. 

"నీ రాకతో ఈ ఇంట్లో చీకటి చిన్నబోయింది, దిగులు దూరంగా పారిపోయింది" లాంటి పాత చింతకాయ పచ్చడి డైలాగులు విన్నాక 'నీ గుండెల్లో చోటు' సీరియల్ దెబ్బకు తలపోటు తెచ్చుకోవడం ఎందుకని  ఛానల్ మార్చా 

అందులో మాస్ పాటలేవో వస్తున్నాయ్. 

నువ్వో కొండ ముచ్చు
నీదో  పిచ్చి బొచ్చు

నీ ప్రేమే ఒక ఉచ్చు
నీ చూపులే నా గుండెల్లో గుచ్చు

ఏంటో ఆ దిక్కుమాలిన లిరిక్స్ వినలేక ఛానల్ మారిస్తే చిన్న పిల్లల డాన్స్ ప్రోగ్రాం వస్తోంది, కనీసం ఇది చూడచ్చు అనుకునే లోగా 

నీకు ఆకలుంది
నాకు మెస్ ఉంది
మంత్లీ కార్డు తీసుకో
రోజూ పంచ్ వేసిపో

నా దగ్గర ఫ్యూజ్ ఉంది
నీ దగ్గర బల్బు ఉంది
మొత్తం రాత్రంతా
లైట్ వెలిగిద్దాం

అనే దిక్కుమాలిన బూతు పాటకు ఇద్దరు చిన్న పిల్లలతో డాన్స్ చేయించడం మొదలెట్టారు.

చూడలేక ఛానల్ మార్చా. 

'అడిగా అడిగా' అని ఏదో కొత్త సినిమాలోని పాపులర్ మెలోడీ సాంగ్ వస్తోంది. నాకెందుకో ఆ పాట పాడిన పాపులర్ గాయకుడి గొంతు కంటే రైళ్లలో పాడేవాళ్ళ గొంతే నయమనిపించి మళ్ళీ ఛానల్ మార్చా.

అదేదో ఇంగ్లీష్ ఛానల్ వస్తోంది, మన తెలుగు చానెల్స్ కన్నా ఇంగ్లీష్ చానెల్స్ బెటర్ అని అనుకున్నానో లేదో...

షేమ్ షేమ్ అని అరిచాడు మా మూడేళ్ళ బుడ్డోడు T.V వైపు చూసి

అదేదో Bigboss లాంటి ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం, ఒక 5 జంటలు బట్టలు లేకుండా బీచ్ లో తిరుగుతున్నారు, వాళ్ళకేవో టాస్క్ లు ఇస్తున్నారు.

ద్యావుడా! మన తెలుగు చానెల్స్ వంద రెట్లు  బెటర్ అని మళ్ళీ ఛానల్ మార్చా

వంటల ప్రోగ్రాం వస్తోంది, కాకరకాయ ఎలా వండాలో చెప్తోంది యాంకరమ్మ. సరే అదే చూద్దామని డిసైడ్ అయ్యా. 

"ఎవర్ని సపోర్ట్ చేస్తున్నావ్"? అన్నాడు మిత్రుడు ఫోన్ చేసి

అర్థం కాలేదు? అన్నాను నేను. 

అదే ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నావు అని.

పార్టీ విషయమా, ఈ వీకెండ్ సుందర్ గాడేమో వాళ్ళ అబ్బాయి బర్త్ డే పార్టీ అంటున్నాడు, కుమార్ గాడేమో త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడుగా అందుకని బ్యాచులర్ పార్టీ అంటున్నాడు. బర్త్ డే పార్టీ బోర్, అందుకే బ్యాచులర్ పార్టీనే సపోర్ట్ చేద్దామనుకున్నా. 

నేను మాట్లాడేది ఆ పార్టీల గురించి కాదు. ఇవాళ కౌంటింగ్ కదా, ఈ ఎలెక్షన్స్ లో ఏ పార్టీ ని సపోర్ట్ చేస్తున్నావు అని.

ఓహో అదా, నువ్వు చెప్పే వరకు తెలీదు ఇవాళ కౌంటింగ్ అని.  

మరి నీకు ఇంట్రస్ట్ లేదా ఎవరు గెలుస్తారో అని?

ఏముంది ఎవరో ఒకరు గెలుస్తారు. కోర్టు లో కేస్ ఓడిపోయినవాడు  కోర్టు మెట్ల మీదే ఏడిస్తే గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడట అలా ఇద్దరూ ఏడ్చినట్లే, ఎలెక్షన్స్ లో గెలిచినోడు ఓడినోడు ఇద్దరు డబ్బు లెక్కలు వేసుకుంటుంటారు. గెలిచినోడు అసెంబ్లీ లో వెళ్ళి కూర్చుని ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ ఎన్ని నెలల్లో సంపాదించగలను అని లెక్కలు వేసుకుంటుంటే ఓడినోడు ఇంట్లో కూర్చొని పదవిలో ఉన్నప్పుడు సంపాదించిన దాంతో పోలిస్తే ఇదెంత అనుకొని నెక్స్ట్ ఎలెక్షన్స్ లో గెలవడానికి ప్రయత్నిస్తా అప్పుడు ఇంతకు ఇంత రాబట్టుకుంటా అని లెక్కలేసుకుంటాడు. అయినా ఎవరు గెల్చినా పెద్ద తేడా ఉండదు, ఏ రాయయినా ఒకటే తల పగలగొట్టుకోవడానికి. 

ఛ! నీకసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, నీతో మాట్లాడటం వేస్ట్ అన్నాడు.

ఏమోలే గానీ, ఇందాకా దిక్కు మాలిన ఛానలన్నీ చూసి తలపోటు తెచ్చుకున్నా, నీతో మాట్లాడాక అదెటో ఎగిరిపోయింది అన్నాను.

అది ఎగిరొచ్చి నా తల మీద వాలింది, నీ సోది అంతా విన్నాక అని ఫోన్ పెట్టేశాడు.

ఓహో, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ లాగా, ఆన్లైన్ తలనొప్పి ట్రాన్స్ఫర్ కూడా చెయ్యొచ్చన్న మాట అని అనుకుంటుండగా "ఇప్పుడు కాకరకాయ కుక్క అయింది" అంది T.V లో యాంకరమ్మ. 

కాకరకాయ కుక్క కావడమేమిటి చెప్మా, ఇదేదో వంటల ప్రోగ్రాం అనుకున్నానే, మేజిక్ ప్రోగ్రాం అని తెలీదే, ఛ అనవసరంగా మిస్ అయ్యాను అన్నాను. 

అది కుక్క కాదు నక్క కాదు, కాకరకాయ 'కుక్' అయింది అనే దానికి యాంకరమ్మ పాట్లు , ఆవిడ తెలుగు అట్లా ఏడ్చింది అంది  మా ఆవిడ. 

P.S : ఏదో అర గంట టైం దొరికింది, ఖాళీగా ఉండటం ఎందుకని ఈ కిచిడి వండేశా, ఇది చదివాక మీకైమైనా తలపోటో, వాంతులో, కడుపులో దేవినట్లో, మురికి కాలువలో ఈదినట్లో అనిపిస్తే నాకు సంబంధం లేదు.  

24, మే 2019, శుక్రవారం

ముక్కి మూలిగి మూడేళ్లు కంప్లీట్ చేసుకుంది

పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

ఎవరికి?

నీకే? మూడేళ్ళ క్రితం ఇదే రోజు బ్లాగ్ వైన నువ్వు పుట్టావు. నీలో మొదటి పోస్ట్ రాశాను.

ఓహ్! పెద్ద రాశావులే, అదీ ఒక పోస్టేనా?

వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది

రోమ్ వాజ్ నాట్ బిల్ట్ యిన్ ఎ డే లాంటి కామన్ సేయింగ్స్ మాకు తెలుసు అయితే ఏంటంట?

విన్నవి విని వదిలిపెట్టకుండా ఆచరించడం మొదలెట్టింది ఆ ఒక్క మొదటి పోస్ట్ తోనే. 

మూడేళ్ళు రాసినందుకే మురిసిపోతున్నావే? అక్కడ పదేళ్ళ నుంచి రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 

అలాంటి వాళ్ళే నాకు ఆదర్శం.  

దీన్నే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం, బాహుబళి లాంటి సినిమా తీయాలనుకొని బొక్క బోర్లా పడటం, 'ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతాను అనటం'  అంటారు. 

ఒక మూడ్నెల్లు రాయగలిగితే గొప్ప అనుకున్నా అలాంటిది మూడేళ్లు కంప్లీట్ చేశా. ఇలాగే ముప్పయ్యేళ్లు, మూడొందల ఏళ్ళు కంప్లీట్ ... 

ఆపేయ్ అక్కడే! మూడొందల ఏళ్ళు .. అంటే నీ తర్వాత వచ్చే ఇంకో ఐదు తరాల వాళ్ళు కూడా రాస్తూనే ఉండాలి. ఇదేమైనా నువ్విచ్చిన ఆస్థి అనుకుంటున్నావా నిలబెట్టుకోవడానికి, ఇప్పటి తరం వాళ్ళే చదవడానికి ఇష్టపడట్లేదు, ఇక మహా అయితే నీ పిల్లలకు తెలుగు నేర్పించగలనేమో ఆ తర్వాత వాళ్ళు 'What is Telugu'? అని గూగుల్ నో, బోగూల్ నో అడుగుతారు నెక్స్ట్ జనరేషన్ నుంచి.

సరేలే, నేను రాయగలిగిన రోజులైనా రాస్తా. 

ఏం రాస్తావ్? మొదటి సంవత్సరానికి, రెండో సంవత్సరానికి నువ్వు రాసిన పోస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 

పోస్టుల quantity తగ్గి ఉండచ్చేమో కానీ, quality విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు. వీలైనంత వరకు ఇంటరెస్టింగ్ టాపిక్స్ మీదే రాస్తూ వచ్చాను అవి సీరియస్ అయినా కామెడీ అయినా సెటైర్ అయినా సెట్యూబ్ అయినా మరోటైనా. అలాగే రాస్తూనే ఉంటాను.

కానీ, మొదట్లో నువ్వు పండిస్తున్నంత హ్యూమర్ ఇప్పుడు పండించలేకపోతున్నావేమో అని నా ఫీలింగ్.

చిన్నప్పుడు స్కూల్లోనో, కాలేజీ లోనే ఆర్ధిక శాస్తంలో క్షీణోపాంత సిద్ధాంతం అని చదివి ఉంటాం. దాని ప్రకారం మొదటి స్వీట్ కంటే రెండవ స్వీట్ రుచి తక్కువగా ఉంటుంది అన్నది దాని మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఆయా సిద్ధాంతం ప్రకారం అలా అనిపించి ఉండచ్చు, నా ప్రయత్నం ఆపను, రాస్తూనే ఉంటాను వీలైనంతవరకు. 

అంత నమ్మకమా?

అవును, చివరిగా ఒక చిన్న కథ చెప్తా విను. అందరికీ తెలిసిందే, కానీ అప్పుడప్పుడూ మనందరం మననం చేసుకోవసిన కథ.

నేనొద్దంటే ఆపేస్తావా ఏంటి? చెప్పు. 

ఒక ఊరిలో నెలల తరబడి ప్రతీ నెలా తప్పకుండా హోమాలు చేస్తున్నారు. కానీ ఒక రోజు మాత్రం హోమం జరుగుతున్నప్పుడు హోరున వర్షం మొదలైంది. 

స్వామి, ఇన్ని రోజులు కురిపించకుండా ఇవాళే ఎందుకు ? అడిగింది దేవత దేవుడిని. 

అదిగో ఆ ఒక్కడు జనాల్లో అక్కడొకడు ఉన్నాడు చూశావా? 

అవును, చూశా . 

వచ్చిన ప్రతీసారీ వర్షం పడుతుందనే నమ్మకంతో గొడుగు పట్టుకొస్తున్నాడు. ఒక్కసారి కూడా గొడుగు తీసుకొని రాని రోజు లేదు. ఇప్పటికైనా వాడి నమ్మకం వమ్ము చేయకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వర్షం కురిపించాను అన్నాడు.

అదీ కథ.

ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పావ్?

కథలో గొడుగు తీసుకొచ్చాడే వాడి లాంటి వాడినే నేను కూడా, ఏదైనా గట్టిగా నమ్ముతాను. ఇంకో కొన్నేళ్లు రాయగలనని నమ్ముతున్నాను, నా నమ్మకం కచ్చితంగా నిలబడుతుంది.

కథలో హోమం అంటే గుర్తొచ్చింది,  అప్పుడేదో స్థిర యోగ హోమం చేస్తున్నానన్నావ్? యెంత వరకొచ్చింది?

అందరూ అదే అడుగుతున్నారు, హోమం పూర్తయ్యింది, ఫలితాల కోసం వెయిటింగ్ ఇక్కడ. అదయ్యాక చెబుతా.

P.S: ఈ బ్లాగ్ మొదలెట్టి మూడేళ్లు అయింది అందుకే ఈ ఊకదంపుడు పోస్ట్. 

16, మే 2019, గురువారం

వయసెప్పుడూ అడ్డంకి కాదు - ఏర్చి కూర్చిన కథలు

"నాకు చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకోవాలని తెగ కోరిక, కానీ ముప్పయ్యేళ్ల వయసులో కరాటే  క్లాస్ కెళ్తే అందరూ నవ్వరూ?" అని సిగ్గు. 

"నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రస్ట్ ఉండేది, కానీ పదేళ్ల వయసులో నేర్చుకోవాలింది ఈ నలభయ్యేళ్ళ వయసులో ఏం నేర్చుకుంటాం?" అని బెరుకు. 

"కాలేజ్ లో చదివేప్పుడు  కథలు, కవితలు అంటూ తెగ రాసేవాడిని, ఆ తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అంటూ యాభయ్యేళ్ళు వచ్చేశాయ్, ఇప్పుడేం రాస్తాను" అని ఒక నిర్లిప్తత. 

వయసులో ఉన్నప్పుడు స్టేజి మీద ఎన్ని నాటకాలు వేసేవాడిని, ఒక్క సినిమాలో అయినా నటించాలన్న కోరిక మాత్రం అట్లాగే మిగిలి పోయింది.... జాబ్ లోంచి రిటైర్ అయిన అరవయ్యేళ్ళ వ్యక్తి మనసులోంచి బయటపడిన ఒక నిరాశ. 

"అసలు నాకున్న ఐడియాలు సరిగ్గా వర్కౌట్ చేసి ఉంటే నా చివరి దశలో వైద్యానికి సరైన డబ్బు లేక ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంత ఇబ్బంది పడేవాడిని కాదు" అనే ఆవేదన. 

ఎప్పుడో ఒకప్పుడు మనలో చాలా మంది పైన చెప్పిన ఏదో ఒక స్టేట్మెంట్ తో relate చేసుకునే ఉంటారు. 

కానీ ఒక వ్యక్తి మాత్రం 'ఈ వయసులో ఇప్పుడేం చేయగలం?' అని అందరిలా అనుకొని చేతులు కట్టుకు కూర్చోలేదు. 

ఆ దానిదేముంది, అతని విషయం వేరు, మన విషయం వేరు అని కుంటి సాకులు చెప్పడానికి వంద కారణాలు వెతుక్కుంటాం కానీ ఒక్క ప్రయత్నం కూడా చేయం.

"అదేం కాదు, నేను కనీసం ఒక వంద సార్లు ట్రై చేసి ఉంటాను." అనేవాళ్ళు ఉంటారు. మరొక్క ప్రయత్నం నిన్ను విజయానికి చేరువ చేసేదేమో ఎవరు చెప్పొచ్చారు. నువ్వు చేస్తున్న ప్రయత్నం 101 సారికే ఫలిస్తుంది అని నీ తల రాత లో రాసి ఉంటే? నువ్వు ఓడిపోయినట్లేగా.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో వ్యక్తి కూడా 1009 సార్లు ప్రయతించి ఫెయిల్ అయ్యాడు. మరి అతను 1010 సారి ప్రయత్నించకుండా అక్కడితోనే ఆపేసి ఉంటే అతను కూడా మనలో ఒకడిగా మిగిలిపోయి ఉండేవాడు, ఈ రోజు అతని కథ మనం చదివే వాళ్ళం కాదు.

అతనే ఈ రోజు మన కథలో హీరో, పేరు Harland Sanders. అతను ఎక్కడ పుట్టాడు, ఏం చేసాడు, ఏం చదివాడు అన్న సోది ఈ పోస్టుకి అవసరం లేదు. ఒక చిన్న ఇంట్లో ఉంటూ అరవయ్యేళ్లు పైబడ్డ వయసుతో పెన్షన్ లాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొందుతూ,  ఓ డొక్కు కారు కలిగి ఉన్న అతని ఇంట్రడక్షన్ చాలు.


తను చేసిన చికెన్ తిని అందరూ మెచ్చుకుంటున్నారు కదా అని అక్కడితో ఆగిపోలేదు అతను. దాన్ని మరింత పెద్ద రేంజ్ కి తీసుకెళ్ళి తద్వారా తన ఫైనాన్సియల్ రేంజ్ కూడా పెంచుకోవాలి అనే సంకల్పం అతని వయసుని గుర్తుకురానివ్వలేదు.

తను వండిన ఫ్రైడ్ చికెన్ తీసుకొని లోకల్ రెస్టారెంట్స్ చుట్టూ తిరిగాడు డీల్ కోసం. ఆ డీల్ ప్రకారం, ఆ చికెన్ తయారు చేయడానికి అవసరమయ్యే 11 రకాల herbs, spices (మసాలా దినుసులు) అంతా కలిపి ఒక ప్యాకెట్ లో ఇస్తాడు. దాన్ని రెస్టారెంట్ వాళ్ళు యూజ్ చేసి ఫ్రైడ్ చికెన్ తయారు చెయ్యొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మసాలా ఆ పెద్దాయనది, చికెన్ ఏమో రెస్టారంట్ వారిది. మసాలా లో వాడే దినుసుల గురించి సీక్రేసీ మెయింటైన్ చెయ్యడానికే  తను ఇలా అన్నీ ముందే కలిపి వాళ్లకు ఒక ప్యాకెట్ లో అందిస్తాడు. ఆ రెసిపీ వాడి రెస్టారెంట్స్ అమ్మిన ప్రతీ చికెన్ మీద ఒక నికెల్ (5 సెంట్స్) ఇతనికి ఇచ్చే ఒప్పందం ఇది.

లోకల్ రెస్టారెంట్స్ వారందరూ రుచి చూసి బాగుందన్న వాళ్ళే గానీ డీల్ ఓకే చేసుకోలేదు.  వాళ్ళు ఓకే చెయ్యలేదని ఆగిపోలేదు ఆ పెద్ద మనిషి. తన డొక్కు కారు వేసుకొని యునైటెడ్ స్టేట్స్ మొత్తం తిరిగాడు ఏదో ఒక రెస్టారెంట్ తనతో డీల్ చేసుకోదా అని.

ఇలా 1009 సార్లు నో అనే రెడ్ సిగ్నల్స్ తర్వాత 1010 సారి ఎస్ అనే గ్రీన్ సిగ్నల్ ఎదురైంది. ఆ చికెన్ కోసం అమెరికా లోని చాలా మంది జనాలు  ఎగబడ్డారు, ఆ తర్వాత ప్రపంచంలో చాలా మంది.

అలా మొదలైన ప్రస్థానం 1964 నాటికి 600  ఫ్రాంచైజీలలో ఆ చికెన్ అమ్మడం దాకా వెళ్ళింది.
ఇక ఆ చరిత్ర గురించి మరింత చెప్పాల్సిన అవసరం లేదు, KFC (Kentucky Fried Chicken) బ్రాండ్ చెబుతుంది ఆ వ్యాపారం యెంత పాపులర్ అయిందో.

65 ఏళ్ళ దగ్గర చాలా మంది తమ విజయ యాత్ర ను ముగిస్తే, అతను మాత్రం అదే 65 ఏళ్ళ దగ్గర మొదలెట్టాడు ప్రపంచం నలుమూలలా తన KFC సామ్రాజ్యాన్ని విస్తరించే జైత్ర యాత్రని.

ఇక చాలు, ఈ వయసులో ఇంకేం చేస్తాం అనుకునే వారందరికీ ఈ కథ చెప్పేది ఒక్కటే Never Give-up, It’s never too late to chase your dreams అని.

11, మే 2019, శనివారం

రేట్స్ పెంచితే ఎవరికి నష్టం?

రోబోట్స్ అమ్మే షాప్ కి వెళ్ళి ఒక్కో రోబోట్ రేట్ చూస్తున్నా. ఒక్కొక్క రోబోట్  మీద ఒక్కొక్క రేటు ఉంది.  లక్ష రూపాయలు,  2 లక్షల  రూపాయలు, 3  లక్షల రూపాయలు అని రాసి ఉంది.

అన్ని రోబోట్స్ ఒకేలా ఉన్నాయి, ఎందుకలా డిఫరెన్స్ రేటులో అని అడిగా షాప్ కీపర్ ని.

ఇదేమో గార్డెనింగ్ బాగా చేయగల రోబోట్, దీని రేటు లక్ష.

ఇదేమో ఇల్లు క్లీన్ చేసే రోబోట్, దీని రేటు 2 లక్షలు.

ఇదేమో వంట బాగా చేయగల రోబోట్ , దీని రేటు 3  లక్షలు.

ఆహా, మరి ఆ చివరి రోబోట్ మీద మాత్రం 5 లక్షలు అని రాశారు. ఏంటి దీని స్పెషాలిటీ? ఏయే పనులు బాగా చేస్తుంది.  అని అడిగా.

అది పని చేయగా ఎవరూ చూడలేదు, అసలు దానికి ఏ పని వచ్చో ఎవరికీ తెలీదు కానీ అన్ని రోబోట్స్ దాన్ని "మేనేజర్" అని పిలుస్తుంటాయ్, అందుకే దాని రేటెక్కువ.

సో, అలా రెట్లు తెలుసుకున్నాక ఇష్టమైతే కొనుక్కుంటాము లేదంటే కొనుక్కోకుండా వచ్చేస్తాము అంతే గానీ ఆ మేనేజర్ రోబోట్ కు ఎందుకంత రేట్ పెట్టావ్ అని గొడవ పెట్టుకోము.
                                                ********************

తర్వాత బట్టల  షాప్ కి వెళ్లి షర్ట్స్ చూపించమన్నాను.  కొన్ని చూపించాడు, అందులో ఒకటేమో 5000 అన్నాడు, ఇంకోటేమో 3000 అన్నాడు మరొకటి 2000 అన్నాడు.

అంత రేటెందుకు అన్నాను, క్వాలిటీ, స్టిచ్చింగ్, డిజైన్ ఇలాంటివేవేవో చెప్పి అందుకే రేట్ ఎక్కువ అన్నాడు.

ఆ షాప్ నుంచి బయటపడి ఇంకో షాప్ లోకి వెళ్ళాను.

కొన్ని చూపించాడు, అందులో ఒకటేమో 500 అన్నాడు, ఇంకోటేమో 300 అన్నాడు మరొకటి 200 అన్నాడు.

నాకు 200 రూపాయల షర్ట్ చాలనిపించింది. కొనుక్కొని వచ్చేశాను.

పనిలో పనిగా ఆ ముందు షాప్ కి వెళ్ళి, నువ్వు ఇంత రేట్ చెప్పడం అన్యాయం అని ఎవరైనా గొడవ పెట్టుకోవడం చూశామా?
                                      ***************************

తర్వాత థియేటర్ కి వెళ్ళాను, వాడు టికెట్ 500 అంటున్నాడు.  పక్కన ఇంకో సినిమాకు 200 అంటున్నాడు.

ఎందుకంత డిఫరెన్స్ అని అడిగితే  ఒకదాని బడ్జెట్ 100 కోట్లు, ఇంకో దాని బడ్జెట్ 10 కోట్లు అందుకే తేడా అన్నాడు.

మరి పై రెండు సిట్యుయేషన్స్ లాగానే నీకు ఏది నచ్చితే దానికి వెళ్ళాలి. అంతేగానీ టికెట్ రేట్స్ పెంచారు అని గొడవెట్టడం మూర్ఖత్వం.

ఆ బుద్ది చూసే వాళ్లకు ఉండాలి అంత ఖర్చు పెట్టుకొని చూడటం అవసరమా అని. ఎవడూ వెళ్ళి చూడకపోతే ఆ సినిమా వాడే దిగివస్తాడు రేట్స్ తగ్గించుకొని. లేదంటే బడ్జెట్ అదుపులో పెట్టుకుంటాడు అనవసర ఖర్చు పెట్టుకోకుండా.

మీకు నచ్చితే థియేటర్ కి  వెళ్లి సినిమా చూడండి లేదంటే కొన్ని నెలలు ఆగి టీవీ లో వచ్చినప్పుడు చూడండి.

మహర్షి సినిమా టికెట్ రేట్స్ పెంచారని పెద్ద న్యూస్ చేస్తున్నారు, అలా పెంచడం అన్యాయం అని. నాకైతే అది వాళ్ళిష్టం అనిపించింది. మరి ఇంత రేట్ మాత్రమే ఉండాలి అని ఏమైనా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయోమో తెలీదు మరి. 

రైతులకు తప్ప ప్రతీ ఒక్కరికీ తమ ప్రొడక్ట్ మీద రేట్ ఫిక్స్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లుంది చూస్తుంటే.

7, మే 2019, మంగళవారం

విలయ విధ్వంసానికి బీజం పడ్డ రోజు

స్థలం: మంగస్థలం సినిమా షూటింగ్ స్పాట్. 
సమయం: దుర్ముహూర్తం, 2018. 
జరిగిన సంఘటన: 2019 లో జరగబోయే విలయ విధ్వంసానికి బీజం పడ్డ రోజు. 

బ్రేక్ టైం లో రచణ్ జిమ్ లో exercise చేస్తున్నాడు.  అవి ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ లోనే, ట్విట్టర్ లోనే అప్లోడ్ చేస్తోంది ఉప్మానస. 

ఒరేయ్ అబ్బాయ్! ఈ సినిమా ఎలాగూ దెబ్బేసేలా ఉంది. ఈ సినిమాలో నటన, గిటన అంటున్నారు అది నీ వల్ల కాదు.  అయినా అందంగా ఉండే మన గానార్జున కోడల్ని హీరోయిన్ అంటే మంచి గ్లామర్ కురిపిస్తుందనుకున్నా. ఇక్కడేమో గేదలు కడుగుతూ, అంట్లు తోముతూ మసి గొట్టుకు పోయినట్లు చూపిస్తున్నఆ మసంత మొహం.. ఇవన్నీ చూస్తుంటే అసలు గ్లామర్ కనిపించట్లేదు ఈ సినిమాలో. కుసుమార్ ను నమ్ముకుంటే నట్టేట ముంచేసేలా ఉన్నాడు. నా మాట విని మనకు అచ్చొచ్చిన మాంచి మాస్ మసాలా సినిమా ఈ మంగస్థలం రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ చేయడానికి రెడీ చేసి పెట్టుకోవడం మంచిది.

అంతే అంటారా డాడ్.

అంతేరా అబ్బాయ్, 150 సినిమాల అనుభవంతో చెప్తున్నా వినుకో.

మరి ఏ డైరెక్టర్ అయితే మంచి మాస్ సినిమా తీస్తాడు. V.V వాజమౌళి ని పట్టుకుంటే?

ఏదో ఆయన వల్లే నీ కెరీర్ లో నిఖార్సయిన 'గమధీర' అని అప్పట్లో ఇండస్ట్రీ హిట్ వచ్చింది. మనకి ఇప్పటికిప్పుడు ఫాస్ట్  గా సినిమా తీసే వాడు కావాలి, అతనేమో ఇంకో రెండేళ్లు సినిమా తీస్తూనే ఉంటాడు. అయినా మనం అడగ్గానే మనతో సినిమా తీసే రేంజ్ లో లేడు. వీలయితే ఫ్యూచర్ లో ఆయన కరుణిస్తే చేద్దువులే . 

టపోరి గజన్నాథ్ ఉన్నాడుగా, భలే ఫాస్ట్, ముప్పై రోజుల్లో తీయగలడు.

అదేమైనా హిందీనా, తమిళా, ముప్పై రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా? అన్నట్లు, అలాంటి బుక్ చదివి యెంత హిందీ నేర్చుకోగలమో, ఆ టపోరి జగన్నాథ్ సినిమా నుంచి కూడా అంతే కలెక్షన్స్ తెచ్చుకోగలం.

హిందీ అని గుర్తుచెయ్యొద్దు డాడ్, బంజీర్ సినిమా గుర్తొస్తే మంజీరాలో దూకేయాలి అనిపిస్తది.

జుట్టున్నమ్మ ఏ కొప్పు కట్టినా అందమే, మరి నీకేమో అంత సీన్ లేదు. తెలుగులోనే ఇప్పటిదాకా సరిగ్గా దిక్కు లేదు గానీ హిందీకి పోయావ్.

అబ్బా, వదిలేయ్ డాడ్. మరి, S.S. సినాయక్ తో అయితే.

నాలాగా బాగా outdated సరుకు అతను. expire అయిన మెడిసిన్స్ వాడటం యెంత డేంజరో ఇలాంటి వాళ్లతో సినిమా కూడా అంతే డేంజర్.

మరి ష్రిక్ అయితే బాగా తీస్తాడేమో?

మరీ అంత క్లాస్ మనకు నప్పదు.

వితిక్రం?

అజ్ఞాన వాసి దెబ్బకు ఇంకా మీ బాబాయే కాదు, చూసిన జనం కూడా ఇంకా కోలుకోలేదు.

నుశీ బ్లాక్ల అయితే?

వద్దురా బాబూ, మందమైన వాడు, వెస్లీ అని మనిద్దరం బోల్తా కొట్టాం అతనితో కలిసి. మళ్ళీ అవసరమా?

మాస్ కు అడ్రస్ లాంటి వాడైన యోబపాటిని పిలిపించు. అతనైతే దండగమారి వంశ హీరోతో హింసా, భజండ్ లాంటి మాంచి మాస్ సినిమాలు తీసినట్లు మన తడికెల వంశంతో కూడా మంచి మాస్ సినిమా తీస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఆవు లాగా పిండేసి మంచి మ్యూజిక్ రాబడతాడు.

మంచి చాయిస్ డాడ్. అందుకే నిన్ను గెమాస్టార్ అనేది అందరూ. సరే అలాగే పిలిపిస్తాను. 

                                                                   ************

సమయం: 10 జనవరి 2019
స్థలం: ఒకటని కాదు "విలయ విధ్వంస రామ" సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల
జరిగిన సంఘటన: సునామీలు, తుఫాన్లే కాదు, ఇలాంటివీ వస్తుంటాయని వచ్చిన హెచ్చరికలు ఖాతరు చేయకుండా పోయిన జనాల హాహాకారాలు. 

                                                                ****************

సమయం: ఇటీవల ఒకరోజు రాత్రి 9:30, శుక్రవారం
స్థలం: ఆస్ట్రేలియాలో ఒక ఇంట్లో
జరిగిన సంఘటన: గర్వం అణిగిన రోజు

యెంత చెత్త సినిమా అయినా కన్నార్పకుండా చూస్తానని నాకు భలే గర్వం ఉండేది. అలాంటి నా గర్వాన్ని ఈ సినిమా అణిచేసింది. హాట్స్ ఆఫ్ టు యోభపాటి ఫర్ సచ్ ఏ గ్రేట్ మూవీ. 

ఇంటర్వెల్ తర్వాత నేనెళ్ళి పడుకుంటాను అని నిద్రపోయింది మా ఆవిడ. మరుసటి రోజు ఉదయం అడిగింది ఇంటర్వెల్ తర్వాత కథ ఏంటి? అని. 

ఒకే మాటలో చెప్పాను. ఇంటర్వెల్ తర్వాత మొదలెట్టిన ఫైట్ సినిమా ఎండ్ కి ఆపేశాడు అని.

అవార్డు సినిమాల గురించి శివాజీ గణేశన్ గారు చెప్పే వారట 'ఒక వ్యక్తి సముద్రంలో పడవ వేసుకుని బయల్దేరతాడు, వెళ్తుంటాడు, వెళ్తూనే ఉంటాడు సినిమా చివరి దాకా' అని. 

ఈ సినిమా స్టోరీ కూడా అలాగే ఉంటుంది. 'హీరో ఫైట్ మొదలెడతాడు, చేస్తుంటాడు, చేస్తూనే ఉంటాడు సినిమా చివరి దాకా'. మరి ఇలాంటి డబ్బా సినిమాలను ఏ కేటగిరి లో చేర్చాలబ్బా?

P.S: ఈ పోస్ట్లోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం, కల్పితం, కల్పితం. 

1, మే 2019, బుధవారం

బయోపిక్స్ - మహానాయకుడు - ఒక పరిశీలన

టి.వి లో హీరో కృష్ణ సినిమా వస్తోందని తెలిసి, కాసేపు చూశాక నా ఫేవరెట్ హీరో అయిన కృష్ణ ఇంత చెత్త సినిమాలో ఎందుకు నటించాడబ్బా? అని కాసేపు దుఃఖించి, దూరదర్శన్ లో ఇలాంటి చెత్త సినిమాలే వేస్తారు, ఫైటింగ్ సినిమాలు అస్సలు వెయ్యరు అని తీర్మానించుకుని ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాను.

మనం ఈ పోస్ట్ లో బయోపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అప్పటి నా దృష్టి లో ఆ చెత్త సినిమా ఏమిటో.

అదే అల్లూరి సీతారామరాజు. అప్పట్లో ఆ టైటిలే నాకు నచ్చలేదు. మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు చేసిన మా కృష్ణ సినిమాకు మరీ ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు అని అనుకున్నాను. అప్పటికి గాంధీ గారి గురించి పుస్తకాలు భోదించినంతగా లోకల్ విప్లవ వీరుడైన మన అల్లూరి సీతారామరాజు గారి గొప్పతనం గురించి భోధించకపోవడం, అలాగే పసితనం వల్ల కావచ్చు అల్లూరి సీతారామరాజు గారి గురించి బొత్తిగా తెలీదు.

తర్వాత కొన్నేళ్ళకు అదే అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం అయిదారు సార్లు స్టేజి మీద వేసి ఉంటాను స్కూల్ ఫంక్షన్స్ లో.

తర్వాత నేను హై స్కూల్ లో చదివేప్పుడు అనుకుంటా 'అశ్విని' అని ఒక మూవీ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మూవీస్ అప్పట్లో అరుదు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఆ సినిమా.

అశ్విని నాచప్ప నిజ జీవితానికి కాస్త మసాలా దట్టించి తీసిన సినిమా అది. అలాంటి సినిమాలను బయోపిక్ అంటారని తెలీని రోజులు. అప్పట్లో అంత నాలెడ్జి లేదు కాబట్టి, ఎవరి కథ తీస్తే వారే నటిస్తారు ఆ సినిమాలో అని అనుకునేవాడిని.  

ఆ తర్వాత స్కూల్లో చూసిన 'గాంధీ' సినిమా నన్ను సంధిగ్ధం లో పడేసింది, గాంధీ ఎప్పుడో మరణిస్తే ఇప్పుడు ఆయన మీద ఎలా సినిమా ఎలా తీశారు, ఎప్పుడో తీసి ఉంటారు, ఇప్పుడు మాకు స్కూల్ లో వేసి చూపిస్తున్నారు అనుకున్నా. 

తర్వాత ఇంకొన్ని బయోపిక్ లాంటి మూవీస్ చూశాను. ఒక రకంగా ఈ బయోపిక్  మూవీలకు మన తెలుగులో కేర్ అఫ్ అడ్రస్ లాంటి విజయ చందర్ నటించిన 'శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం', 'ఆంధ్ర కేసరి', 'కరుణామయుడు'  లాంటి సినిమాలు చూశాక క్లారిటీ వచ్చింది బయోపిక్ లో ఆ  సదరు వ్యక్తే నటించాల్సిన అవసరం లేదు అని. 

సో, ఏదైనా ఒక వ్యక్తి జీవిత చరిత్రను సినిమా గా తీస్తున్నప్పుడు, మనం ఆ వ్యక్తి ని ఎప్పుడూ చూడనప్పుడు అతని లేదా ఆమె లక్షణాలను మ్యాచ్ చేయగల నటుడు/నటి నటిస్తే ఈజీ గా కనెక్ట్ అయిపోతాము. 

రుద్రమదేవి సినిమా చూసినప్పుడు, రుద్రమదేవి గురించి పుస్తకాల్లో చదవడమే తప్ప, చూసింది లేదు కాబట్టి అనుష్క అయినా నయనతార అయినా లేక కాస్త ఒడ్డు పొడుగు ఉన్న ఇంకో నటి అయినా మనం ఈజీ గా కనెక్ట్ అయిపోతాం మూవీ స్టార్ట్ కాగానే. 

మొన్నా మధ్య వచ్చిన శాతకర్ణి సినిమా విషయంలో కూడా ఇలాగే కనెక్ట్ అయిపోయా. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎలా ఉంటారో నాకు తెలీదు కాబట్టి  సైరా మూవీ లో చిరంజీవి ని చూపెట్టినా లేక వెంకటేష్ ని చూపెట్టినా నాకంత ఇబ్బంది ఉండదు. 

కాకపోతే మహానాయకుడు విషయంలో ఇక్కడే తేడా కొట్టింది. ఎందుకంటే నా ఒకప్పటి అభిమాన నటుడు, నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అయిన ఎన్టీయార్ గారి స్థానం లో బాలకృష్ణ ను చూడలేక పోయా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

మహానటి, యాత్ర సినిమాలు చూడలేదు కాబట్టి సావిత్రి గారి స్థానంలో కీర్తి సురేష్ ని, రాజశేఖర్ రెడ్డి గారి స్థానం లో మమ్ముట్టిని చూడగలనా లేదా అనేది చెప్పలేను. 

ఇక మహానాయకుడు సినిమా విషయానికి వస్తే, అసలే రాజకీయాలు అనేవి నాకు బోరింగ్ సబ్జెక్టు మరి, అలాంటిది సినిమా మొత్తం అదే అయ్యేప్పటికి మరీ బోర్ కొట్టేసింది. 

సాయి మాధవ్ బుర్రా సంభాషణల్లో లోపాలు వెతికే అంత స్థాయి నాకు లేదు కానీ అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు పంటి కింద రాళ్ళలా ఇబ్బంది పెట్టాయి. ఉదాహరణకు మనవడు, మనవరాళ్లతో మాటల సందర్భం లో 'ఇంకొన్ని బర్డ్స్ యాడ్ చెయ్, బాగుంటుంది' అని ఎన్టీఆర్  పాత్రధారి అయిన బాలక్ట్రిష్ణ ఒక పిల్లడు గీసిన చిత్రాన్ని ఉద్దేశించి అనడం లాంటివి. 1983 కాలం నాటికే 'యాడ్' లాంటి ఇంగ్లీష్ పదాలు మన తెలుగులో చొరబడలేదని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పైతే మన్నించగలరు. 

విలన్ అంటే నార్త్ ఇండియన్ యాక్టరే ఉండాలన్న మన తెలుగు సినిమా నిబంధనను అతిక్రమించడం నేరమన్నట్లు నాదెండ్ల భాస్కర రావ్ పాత్రకు అక్కడి నటుడినే తీసుకొచ్చారు. 

'బసవతారకం' గారి పాత్రకు విద్యా బాలనే ఎందుకు? మన తెలుగులో ఆ పాత్రకు తగ్గ యాక్టర్ ఎవరూ లేరా? అన్న సందేహం సినిమా చూస్తున్నంత సేపు వెంటాడింది. 

విద్యా బాలన్ అంటే గుర్తొచ్చింది, ఆ విషయం చెప్పకుండా ఈ పోస్ట్ ముగిస్తే అసలు అర్థమే లేదు, ఎందుకంటే 'డర్టీ పిక్చర్' ప్రభంజనం అలాంటిది మరి, చిన్నప్పుడు బట్ట సినిమాలు వేసినప్పుడు సిల్క్ స్మిత ను స్క్రీన్ మీద చూసిన కొన్ని లక్షల మందిలో నేనొక్కడిని. సో అలాంటి వారందరు కూడా విద్యా బాలన్ ను సిల్క్ స్మిత గా accept చేసినట్లున్నారు అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఎందుకంత హిట్టయ్యింది అన్నది ఇక్కడ మరీ డిటైల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఒక రకంగా అయితే మన ఎన్టీవోడు నటించినన్ని బయోపిక్స్ లో యెవరూ నటించి ఉండరేమో కృష్ణుడు, రాముడు, రావణుడు, కీచకుడు, దుర్యోధనుడు, కర్ణుడు, చంద్రగుప్తుడు 😂  (అబ్బో చెప్పుకుంటూ పోతే ఇలా యెన్నో) అంటూ ఆయన కోణంలో వాళ్ళ జీవిత చరిత్రను చాలా వరకు సినిమాల్లో వక్రీకరించి చూపాడు. ఇప్పుడు ఎన్టీవోడి జీవిత చరిత్రను ఆయన తనయుడే కాస్త వక్రీకరించి చూపాడు చంద్రబాబుని హైలైట్ చేస్తూ.

మహానాయకుడు కి మొదటి భాగం అయిన 'కథానాయకుడు' సినిమా ఎప్పుడైనా భవిష్యత్తులో చూస్తే దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం.