ఉచితాలు ఇచ్చి శ్రీలంక దివాలా తీసింది, త్వరలోనే ఆంధ్ర కూడా అలాగే అవుతుంది అని ప్రతిపక్షం జగన్ గారి మీద విమర్శలు కురిపిస్తోంది. పైగా మోడీ గారు కూడా ఈ మిఠాయి సంస్కృతి కి(ఉచితాలు ఇవ్వడం) రాష్టాలు మంగళం పాడితే మంచిది అని చురకలు అంటించారు గానీ దేశం మొత్తం మీద చాలా పెద్ద మొత్తం అప్పే ఉందని అంటున్నారు, ఇలాంటి విషయాల్లో పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి కాస్త లైట్ గా అన్ని విషయాలను టచ్ చేస్తా.
ఇప్పుడు పాకిస్తాన్ కూడా శ్రీలంకలాగా దివాలా తీస్తుందని అంటున్నారు, పాకిస్తాన్ రూపాయి డాలరుతో పోల్చితే 210 కి చేరుకుందట, మన ఇండియన్ రూపాయి 80 కి చేరుకున్నట్లు.
పాకిస్తాన్ లో ఆ మధ్య టీ తాగడం తగ్గించుకోండి అని ప్రభుత్వం ప్రజలని రిక్వెస్ట్ చేసిందట, ఆ దేశం టీ పొడిని అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఆ దిగుమతి చెల్లింపులు తగ్గించుకోవడానికొచ్చిన తిప్పలు అవి.
ఇంధనం వృథా చేయొద్దని ఫ్రాన్స్ కూడా ఏసీ లను వాడుతున్నప్పుడు వీలైనంతవరకూ తలుపులు మూసి ఉంచాలని, అలాగే లైట్స్ మితంగా వాడాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా విద్యుత్ వినియోగం కాస్త తగ్గించుకోమని ప్రజలని కోరింది.
ఇవన్నీ మన తాతలు తండ్రుల కాలం నుంచి చెబుతున్నవే, నీళ్ళు వేస్ట్ చెయ్యొద్దురా, కరెంట్ వేస్ట్ చెయ్యొద్దురా అని ఎన్ని సార్లు చెప్పి ఉంటారో. కోవిడ్ వచ్చేదాకా బయటికి వెళ్లి వచ్చాక చేతులే కాదు కాళ్ళు కూడా కడుక్కోవాలి అని మన పెద్దలు చెప్పిన మంచి అలవాట్ల విలువ మనకి తెలియరాలేదు. పీకల్దాకా మునిగే వరకు ఉండి అప్పుడు నివారణ చర్యలు చేపట్టడం అలవాటయిపోయింది.
ఇక ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మొత్తం ప్రపంచమే ఒక కుదుపుకి లోనయింది. నేను కార్ కొనక ముందు లీటర్ పెట్రోల్ డాలరు, కార్ కొన్నాక రెండు డాలర్లని దాటేసింది. నేను అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనక ముందు హొం లోన్ వడ్డీ రేటు 1.5% ఉండేది, ఇప్పుడది 4% కి ఎగపాకింది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అది ఈ సంవత్సరం చివరకి అది 7% కి చేరవచ్చని వాట్సప్ విశ్లేషకులు కోడై కూస్తున్నారు.
ఈ ఉచితాలు ఇవ్వడం వల్లే ఆంధ్రా అప్పుల్లో కూరుకుపోతోంది అంటున్నారు. ఆ విషయం మీద మాట్లాడే పరిజ్ఞానం నాకు లేదు గానీ ఉచితాలు అనేవి ప్రతీ దేశంలో ఉండేవే, కాకపోతే అవి ప్రోత్సాహకాలని మరొకటని పేర్లు మార్చుకొని ఉంటాయి అంతే.
ఇక్కడ ఆస్ట్రేలియా లో కూడా సంపాదించేవారు కట్టే 35% టాక్స్ డబ్బులనుంచి పని లేని వారికి ఆహార పథకం అన్నట్లు జాబ్స్ లేని వారికి నెల నెలా డబ్బులు ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. కొంతమంది అదే చాలు అనుకుంటూ బద్దకస్తులుగా ఉండిపోయారు. ఒక ఫామిలీ లో సంపాదన బిలో సం లైన్ కింద ఉంటే ఆ ఫామిలీ లో ఉండే ఒక్కొక్క కిడ్ కి కాస్త పెద్ద మొత్తంలోనే నెల నెలా డబ్బులు ఇచ్చేవారు, ఒకప్పుడు జనాభా ఇక్కడ తక్కువని అలా ప్రోత్సాహకాలు అందించేవారు. ఇప్పడు ఆ అమౌంట్ ని కాస్త తగ్గించినట్లు ఉన్నారు.
ఇక ఫ్రీ కూపన్స్ పథకం అని టైటిల్ లో ఎందుకు అన్నానంటే COVID తర్వాత జనాల్ని ఇళ్ళ లోంచి బయటకి రావడానికి ఎంకరేజ్ చేసి తద్వారా రెస్టారెంట్స్, రిసార్ట్స్ , థియేటర్స్ బిజినెస్ ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావడానికి 18 ఏళ్ళు నిండిన ఒక్కొక్కరికి (సిటిజెన్ అవ్వాల్సిన అవసరం లేదు, కేవలం ఏదో ఒక వీసా మీద ఆస్ట్రేలియా లో ఉంటే చాలు) ఎనిమిది 25$ ఫ్రీ కూపన్స్ ఇచ్చింది. వీటిని క్యాష్ చేసుకోలేము గానీ రెస్టారెంట్స్ లో గానీ థియేటర్స్ లో గానీ ఉపయోగించుకోవచ్చు.
పోయిన సంవత్సరం పిల్లల స్కూలింగ్ అంతా ఇళ్ళలోనే గడిచి పోయింది కాబట్టి మీ పిల్లలను మీరు భరించినందుకు మా గిఫ్ట్ ఇది అంటూ గవర్నమెంట్ 250$ విలువ చేసే మరో కూపన్ ఇచ్చింది. దీన్ని ఎక్కడైనా ట్రిప్స్ కి వెళితే యూజ్ చేసుకోవచ్చు ఒక రోజు హోటల్ రూమ్ బుక్ చేయడానికి ఇలాంటి తాయిలాలు గవర్నమెంట్ అప్పుడప్పుడూ పంచేస్తూ ఉంటుంది.
ప్రతీ ఆరు నెలల కొకసారి పర్మనంట్ రెసిడెంట్స్/ సిటిజన్స్ కి పిల్లలు ఉంటే వారికి active vouchers అని ప్రతీ కిడ్ కి 100$ ఇస్తుంది, వీటిని కూడా క్యాష్ చేసుకోలేము, కాకపోతే పిల్లల్ని స్విమ్మింగ్ క్లాసెస్ కో లేదంటే కరాటే క్లాసెస్ కో పంపినప్పుడు వేడినీళ్ళకు చల్లనీళ్ళు తోడైనట్లు ఉపయోగపడతాయి. మన దేశంలో కూడా రేషన్ ఇవ్వడం లాంటివి ఇలాంటి పథకాల కిందే వస్తాయి, డైరెక్ట్ గా డబ్బులు చేతిలో పెట్టకుండా.
కాబట్టి గవర్నమెంట్ దగ్గర డబ్బులుంటే క్యాష్ పరంగా కాకుండా ఇలా కూపన్స్ పరంగా ఇవ్వడం అనే పద్దతి బాగుంది, దానివల్ల ప్రజలకి, బిజినెస్ కి ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే వాటిని క్యాష్ చేసుకోవడం లేదంటే వేరే వారికి బదిలీ చేయడం లాంటి వాటిని నిరోధించగలగాలి.
ఇన్ని చెప్పాను కానీ దేశాలు, రాష్ట్రాలు ఎలాగోలా అప్పులు తీర్చేసుకుంటాయి కానీ ముడ్డి కింద ఉన్న నలుపు ఎరుగని గురివిందగింజ లాగా నా అప్పుల గురించి మరచిపోయానే ఈ పెరిగిన వడ్డీ రేట్లతో ఇంటి అప్పు ఎప్పటికి తీరునురా దేవుడా!