ఒరేయ్ అబ్బీ, పాత చొక్కా వేసుకొని వెళ్ళాలని తెలీదా చిరంజీవి కొత్త సినిమాకి వెళ్ళేప్పుడు అని తిట్టేవాళ్ళు అప్పట్లో. ఆ పాత రోజుల్ని తలచుకొని సంబరపడటమే.
ఇప్పుడు చిరంజీవి సినిమా మొదటి రోజు చూడాలి అనే ఇంటరెస్ట్ కలగడం లేదు. గాడ్ ఫాదర్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చారట , ఒక నాలుగైదు వారాల్లో చూడచ్చులే అని లైట్ తీసుకున్నా.
చిరంజీవి కి స్టోరీ ఎంచుకునే సామర్థ్యము తగ్గిపోయింది అని నా ఉద్దేశ్యం. 150 సినిమాలు చేసిన ఆయనకి తెలియకపోవడం ఏమిటి అనుకోవచ్చు కానీ ఎవరికైనా డౌన్ ఫేజ్ అనేది ఉంటుంది కదా ఎప్పుడో అప్పుడు. అసలు సినిమాల్లోకి రీ ఎంట్రీ అన్నప్పుడు "ఆటో జానీ" అనే టైటిల్ తో సినిమా అని వినిపించింది. ఈ మధ్య దేవర కొండ నెత్తిన మరో బండ పడేసిన పూరి డైరెక్షన్ లో ఆ సినిమా అన్నారు. అసలు ఆ టైటిల్ పూరి చెప్పినప్పుడే కథ కూడా వినకుండా రిజెక్ట్ చెయ్యాల్సింది. నా లాంటి ఓల్డ్ జెనెరేషన్ పీపుల్ తప్ప ఎవరైనా ఈ కాలంలో రిలేట్ అవగలుతారా ఆటో డ్రైవర్ క్యారెక్టర్ తో. ఇదేమైనా రౌడీ అల్లుడు కాలమా? అసలు చిరంజీవి ఏజ్ కి రేంజ్ కి ఆటో డ్రైవర్ అంటే మ్యాచ్ అవుతుందా? టాక్సీ డ్రైవర్ అంటే కాస్తో కూస్తో ఓకే. కాకపోతే నా అభిప్రాయం ఏమిటంటే ఆ 'ఆటో జానీ' స్టోరీ నే అటూ ఇటూ మార్చేసి బాలయ్య తో "పైసా వసూల్" అని తీసేశాడని నా ఫీలింగ్.
సరే, అప్పటి విషయం వదిలేస్తే ఇప్పుడు మొహంలో గ్రాండ్ ఫాదర్ కళ కొట్టొచ్చినట్లు కనపడుతుంటే గాడ్ ఫాదర్ అని పెట్టుకుని వస్తే జనాలు చూస్తారా? లేదా? అనేది ఈ రోజుతో తేలిపోనుంది.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ అని వరసబెట్టి పక్క రాష్టాల సరుకును మన మీదికి తోలుతున్న మెగా బ్రదర్స్ ఇకనైనా రూట్ మార్చకపోతే వారి ఫేట్ మార్చడానికి తెలుగు ప్రజలు రెడీ గా ఉన్నారన్నది కాదనలేని సత్యం. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, ఈ OTT కాలంలో కూడా అందరూ చూసేసిన పరభాషా సినిమాలను కూడా హిట్ సినిమాలుగా మలచగలుగుతున్నారంటే మాత్రం ఆ మార్పులు చేసిన వారిని అభినందించి తీరాల్సిందే.
చెర్రీ, వర్రీ, వెర్రి, ధర్రీ, కర్రీ, బర్రి, గొర్రి అని ఇప్పటికే అరడజను వారసులను హీరోలను మోస్తున్నాము. చరణ్ ని చెర్రీ అన్నట్టు వరుణ్ ని వర్రీ అని సాయి ధరమ్ ని ధర్రీ అని పిలవచ్చేమో? రేప్పొద్దున జెర్రి అని ఇంకో హీరో రావచ్చు. మరి వారి ఫామిలీ నుంచి ఇంత మంది హీరోలు ఉండగా ఇప్పటికైనా ఈయన హీరోగా చెయ్యడం ఆపచ్చు కదా అనిపిస్తుంది. ఇంకా నయం ఈ సినిమాలో హీరోయిన్ అంటూ లేదు కాబట్టి డ్యూయెట్స్ ఉండకపోవచ్చు. కమల్ లాగా విక్రమ్ లాంటి సినిమా చేస్తే బాగుండేది ఏజ్ కి తగ్గట్టు.
దెబ్బలు తిన్న సింహాన్ని కాకులు కూడా లోకువగా పొడుచుకుతింటాయంటారు కదా ఇప్పటికే సైరా, ఆచార్య లాంటి దెబ్బలు తిన్న మా బాస్ కి అలాంటి పరిస్థితి రానీయకుండా ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను.