నిన్న F3 చూశాను అనేకంటే చూడాల్సి వచ్చింది అని చెప్పొచ్చు, ముందే చేసుకున్న కమిట్మెంట్స్ వల్ల. బాలేదు అని చాలా మంది చెప్పారు కాబట్టి సినిమా బాగుండదు అని నాకు నేను డిసైడ్ చేసుకొని తక్కువ అంచనాలతో చూసినా సినిమా నచ్చలేదు.
F2 సినిమా లోనే సెకండ్ హాఫ్ లో స్టోరీ ఏదీ లేక ఏవోవో సీన్లు పెట్టి మమ అనిపించేశాడు, ఇక అది F3 లో పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ కు ముందు ఒక కథ, ఇంటర్వెల్ తర్వాత ఒక కథ అన్నట్లుగా ఉంటుంది సినిమా, సినిమా మొదటి సగం చూడకపోయినా వచ్చే నష్టం లేదు, లేదంటే రెండో సగం చూడకపోయినా వచ్చే నష్టం లేదు అనిపిస్తుంది. ఒక టికెట్ మీద రెండు అర సినిమాలు చూసినట్లు. ఆ రెండు అర సినిమాలు కూడా జబర్ధస్త్ లాంటి ప్రోగ్రాం లో వచ్చే నాలుగైదు స్కిట్స్ ని కలిపి వాటికి పాటలు కలిపి సినిమా తీసేశాడు.
వెంకటేష్ కామెడీ బాగా చేస్తాడు కదా అని మరీ ఇంత లేకి కామెడీ అంటే చూడలేం. "నీ ఏజ్ ఏంటి నీ గేజ్ ఏంటి" అని పోకిరి సినిమాలో అలీ అనే డబల్ మీనింగ్ డైలాగ్ లాగా వెంకటేష్ వయసుకు తగ్గ క్యారెక్టర్ వేసుకుంటే మంచిదేమో. నువ్వు నాకు నచ్చావ్ గానీ లేదంటే మల్లీశ్వరి గానీ ఇప్పటికీ చూడగలుగుతున్నాం అంటే ఎంజాయ్ చేయగలిగిన కామెడీ ఉంది కాబట్టే. జంధ్యాల గారి సినిమాలైనా లేదంటే ఈవీవీ గారి వైనా కొంత వరకు చూడగలుగుతున్నామంటే మంచి నవ్వించే సీన్స్ ఉండబట్టే.
మొత్తానికి సినిమా కామెడీ కి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఇంత చవకబారు సినిమాలతో ఎక్కువ కాలం బండి లాగలేననే విషయం ఈ సినిమా తర్వాత దర్శకరచయిత అయిన అనిల్ రావిపూడి కి తెలిసి వస్తుంది కాబట్టి ఈ సారైనా కాస్త గట్టిగా అలోచించి మంచి కథలు రాసుకుంటే బెటర్. "నాన్నా పులి" అని అరిస్తే రెండు మూడు సార్లు వర్కవుట్ అవచ్చు కానీ ఆ తర్వాత కెరీర్ డేంజర్ లో పడే అవకాశం ఉంది. ఇలాంటి ఫార్మాట్ సినిమాలు తీస్తూ పోతే "లింగడు తెగితే రాయి" అనే సామెత లాగా ఇంకో నాలుగైదు సినిమాలకి డైరెక్టర్ శీను వైట్ల లాగా మూలకు వెళ్ళిపోవాలి.
ఇలాంటి తొక్కలో పోస్ట్ రాయడానికే నేను ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను, అలాంటిది ఇలాంటి రొచ్చు కథతో సినిమా తీసినందుకు అతను ఎన్ని సార్లు ఆలోచించుకోవాలో మరి.
"నా చెప్పును నిలబెట్టినా ఎన్నికల్లో గెలుస్తుంది" అని ఎన్టీయార్ గారు ఆ రోజుల్లో అనేవారని విన్నాను, అది ఎలెక్షన్స్ లో ప్రతీ సారి గెలవడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ నుంచి పుట్టిన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అవ్వచ్చు. మరి అనిల్ రావిపూడి కూడా అదే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏ సినిమా తీసినా హిట్టవుతుందని కదా అని ఈ సినిమా తీసి ఉండచ్చు.
ఇలాంటి తల తిక్క సినిమా చూసినందుకు డబ్బులు బొక్క, కాకపోతే "మొలమట్టు దుఃఖం లో మోకాలు మట్టు దుఃఖం యెంత అన్నట్లు" ఆచార్య సినిమా చూసిన అనుభవంతో పోలిస్తే ఈ అనుభవం కాస్తో కూస్తో ఉపశమనం అంతే.