31, అక్టోబర్ 2021, ఆదివారం

పఠనమా..లేక దృశ్య మాధ్యమమా?

ఎనిమిదేళ్ళ క్రితం అనుకుంటాను తెలుగు మీద  మోజుతోనో లేదంటే ఏదో తెలుగుని బతికించాలి అనే సదుద్దేశ్యంతో ఒక తెలుగు పత్రిక స్టార్ట్ చేశారు ఆస్ట్రేలియా లో. మంత్లీ 4 డాలర్లు కట్టండి లేదంటే సంవత్సర చందా 40 డాలర్లు కట్టండి,  పత్రిక మీ ఇంటికే పంపిస్తాము. నెలలో జస్ట్ ఒక కాఫీ కంటే తక్కువ ఖర్చుకే మీరు మంచి తెలుగు కథలు చదవచ్చు అని advertise చేసుకున్నారు. 

పుస్తకం పట్టుకు చదివితే వచ్చే మజానే వేరు అనే ఉద్దేశ్యంతో నేనూ 8 డాలర్లు మిగులుతాయని సంవత్సర చందా 40 డాలర్లు కట్టాను, తర్వాత సరిగ్గా సంవత్సరానికి ఎక్కువ మంది చందాదారులు లేక ప్రింట్ ఆపేస్తున్నాము, ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ లో చదువుకోండి  అని చెప్పి ఆన్లైన్ లో మరో ఏడాది కొనసాగించి ఆ తర్వాత దుకాణం పూర్తిగా మూసేశారు. చదవాలి అనే ఆసక్తి పాఠకుల్లో లేకపోవడమో లేదంటే చదివి తీరాలి అనిపించే కంటెంట్ వాళ్ళు ఇవ్వలేకపోవడమో జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పఠనానికంటే దృశ్య మాధ్యమానికే మొగ్గు చూపుతున్నారు ఈ నాటి తరం. చిన్న హాస్య పుస్తకం చదవడానికంటే జబర్దస్త్ చూడటానికో, సినిమా రివ్యూ చదవడం కంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికో యు ట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు తప్ప అసలు చదవడం అన్నదానికి ఫుల్ గా ఫుల్స్టాప్ పెట్టేసినట్లున్నారు. 

నేనొక న్యూస్ కంపనీ లోని IT డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను. ఆ న్యూస్ పేపర్స్ కి ఉన్న సబ్స్క్రైబర్స్ సంఖ్య చాలా ఎక్కువ, నేను మాట్లాడేది ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ గురించి కాదు ప్రింట్ సబ్స్క్రిప్షన్ గురించి. ఇంకా ఇంటికి పేపర్ తెప్పించుకొని చదివే అలవాటు పెంచుకుంటున్నారు తప్పితే తగ్గించుకోవడం లేదు. ప్రింట్ పేపర్ తగ్గించడం వల్ల వాతావరణానికి మంచి చేసినట్లే అవ్వచ్చు కానీ మన కంటికి విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాము అదే టైం లో ఈ లాప్టాప్, మొబైల్ ఫోన్స్ వాడి విపరీతమైన రేడియేషన్ పెంచుతున్నాము అని నా అభిప్రాయం. 

ఇక్కడ చాలా మంది తెల్లోళ్ళ ఇళ్ళలో ఈ బుక్ షెల్ఫ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది, వారు ఈ చదివే అలవాటు తగ్గించుకోవడం లేదు. మన పాత జనరేషన్ లో ఈ బుక్ షెల్ఫ్ వ్యవహారం ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఈ జనరేషన్ వాళ్ళు అంతా ఫోన్ లోనే వినడం లేదంటే పోడ్ కాస్ట్ లంటూ వింటూ ఉండటం, చివరికి కథలు కూడా ఎవరో రికార్డు చేస్తే  వింటున్నారు. అసలు కథలను మనం చదివితే కదా మజా, వాళ్లెవరో చదివి వినిపించడం ఏమిటి? సరేలెండి నేను ఓల్డ్ జనరేషన్  కాబట్టి నా అభిప్రాయం ఇదేమో. చదవడానికి అంత టైం ఎక్కడుంది, వినడం అయితే సైకిల్ మీద  వెళ్తూనో లేదంటే జాగింగో, జిమ్ చేస్తూనో వినచ్చు అంటున్నారు ఇప్పటి వారు.  ఏదైనా సరే ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఒక వీడియో చూడటం కంటే చదివి తెలుసుకోవడం ఉత్తమం అనేది పాత చింతకాయ పచ్చడి కిందే లెక్క. 

మొన్నీ మధ్యే ఏదో మళయాళ సినిమా బాగుంది అన్నాడు ఒక మిత్రుడు. ఎప్పుడు చూశావ్ అంటే చూడలేదు విన్నాను అన్నాడు. వినడం ఏమిటి, అప్పట్లో మాయాబజార్,  శ్రీ కృష్ణ తులాభారం లాంటి సినిమా ఆడియో కాస్సెట్స్ వచ్చేవి, పాటలు మాత్రమే కాకుండా సినిమా అంతా. అలా ఇప్పుడు కూడా ఆడియో సినిమాలు రిలీజ్ చేస్తున్నారా అని అడిగాను. 

అదేం లేదు, యు ట్యూబ్ లో కొన్ని సైట్స్ ఉన్నాయి.  రెండు గంటల సినిమా చూసే ఓపిక లేని వాళ్ళకు సినిమా స్టోరీ  మొత్తం అరగంట లో చెప్పేస్తారు అన్నాడు. సినిమా కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ యు ట్యూబ్ వీడియోస్ కూడా వచ్చాయంటే జనాలు దృశ్య మాధ్యమానికి యెంత అడిక్ట్ అయ్యారో తెలుస్తోంది. ఇదేం విచిత్రం రా నాయనా అనుకున్నా?  20-20 క్రికెట్ మ్యాచుల జనరేషన్ లో పోను పోను ఇలాంటి ఎన్ని విచిత్రాలు వినాల్సి వస్తుందో. 

పాతికేళ్ళ క్రితం 'రోజులో అలా 8 గంటలు టీవీ ముందు కూర్చుని క్రికెట్ చూస్తూ టైం ఎందుకు వేస్ట్ చేస్కుంటారు' అని మా నాన్న అంటుంటే ఓల్డ్ జనరేషన్ అని సరిపెట్టుకున్నా. ఇప్పుడు  నేను కూడా అదే ఓల్డ్ జనరేషన్ లోకి చేరినట్లున్నాను. 

పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిందే, అదే ప్రకృతి ధర్మం కూడా. 

29, అక్టోబర్ 2021, శుక్రవారం

కన్నడ పవర్ స్టార్

ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు ఈ పోస్ట్. 

నిన్న సాయంత్రం మిత్రుడి కొడుకు బర్త్డే పార్టీ లో ఉన్నప్పుడు  'పునీత్ రాజ్ కుమార్ చనిపోయారట' అన్నాడో మిత్రుడు వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూసి. 

ఇదేదో ఫేక్ న్యూస్ అయి ఉంటుందిలే అన్నాను. మొన్నొకసారి శ్రీకాంత్ మరణం అని హెడ్డింగ్ పెట్టి హీరో శ్రీకాంత్ ఫోటో కూడా పెడితే అయ్యో పాపం అనుకున్నా, తీరా చూస్తే హెడ్డింగ్ ఒకటి మేటర్ మరొకటి. ఇది కూడా అలాంటిదేనేమో అన్నాను. 

లేదు నిజమే, ఫొటోస్ కూడా షేర్ చేశారు అన్నాడు. 

కొంచెం షాకింగ్ గానే అనిపించింది అతని మరణం. నేను MCA చదువుతున్న రోజుల్లో ఒకసారి బెంగుళూరు వెళ్ళినప్పుడు అప్పు సినిమా రిలీజ్ అయి దుమ్ము దులుపుతోంది. యెవర్రా ఈ హీరో అని చూస్తే రాజ్ కుమార్ కొడుకు 'పునీత్ రాజ్ కుమార్' అని ఆ సినిమా డైరెక్టర్ మన పవన్ కళ్యాణ్ తో బద్రి తీసిన పూరి జగన్నాథ్ అని తెలిసింది. 

మొదటి సినిమా బద్రి తో బంపర్ హిట్ కొట్టి రెండవ సినిమా  బాచి తో మొహం వాచేలాగా ప్లాప్ అందుకున్న పూరి జగన్నాధ్ ని పిలిచి మరీ రాజ్ కుమార్ తన పెద్ద కొడుకుతో అప్పటికే తెలుగులో బంపర్ హిట్ అయిన 'తమ్ముడు' సినిమాని రీమేక్ చేయించాడు. 

ఆ తర్వాత పూరీ జగన్నాద్ తెలుగులో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' తో మళ్ళీ హిట్ అందుకుని కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యారట, కానీ మళ్ళీ  రాజ్ కుమార్ గారు పిలిపించి తన చిన్న కొడుకైన పునీత్ రాజ్ కుమార్ ని హీరో గా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత పూరి భుజాలపై ఉంచారు. కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్ళకూడదని అనుకున్న పూరి, రాజ్ కుమార్ గారి మీద గౌరవంతో చేసిన సినిమానే 'అప్పు'. అప్పట్లో అదొక బ్లాక్ బస్టర్ హిట్. 

అదే సినిమాని రవి తేజ తో 'ఇడియట్' గా తీసిన పూరి వెనక్కి తిరిగి చూసే అవసరం లేనంతగా దూసుకెళ్లిపోయారు వరస హిట్లతో. 

నెక్స్ట్ ఇయర్ పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రా వాలా తీస్తుంటే అదే సినిమాని కన్నడలో కూడా పునీత్ తో తీయమని అడిగితే పూరి జగన్నాథ్ సున్నితంగా తిరస్కరించారట కావాలంటే ఇదే కథని వేరే డైరెక్టర్ తో తీసుకోమని. అప్పుడు  అదే కథని మెహర్ రమేష్ డైరెక్షన్ లో 'వీర కన్నడిగ' పేరుతో సమాంతరంగా తీశారు. రెండు భాషల్లో రిలీజ్ అయిన ఆ సినిమా తెలుగులో బోల్తా కొడితే కన్నడ లో బంపర్ హిట్ అయింది. 

ఆ తర్వాత కూడా ఎన్నో తెలుగు సినిమాలు రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు పునీత్. రీసెంట్ గా యువరత్న సినిమాతో తెలుగు లో కూడా కాస్త చోటు సంపాదించుకోవాలని చూశారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. 

ఒక సూపర్ స్టార్ కొడుకు సూపర్ స్టార్ అవ్వడం చూస్తుంటాం. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు లాగా కానీ ఒక సూపర్ స్టార్ ఇద్దరి కొడుకులు సూపర్ స్టార్స్ అవ్వడం అరుదుగా చూస్తుంటాం.  అలాంటి రికార్డు సాధించారు రాజ్ కుమార్ గారి పుత్రులు శివరాజ్ కుమార్ మరియు పునీత్ రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారి రెండవ కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ కెరీర్ లో  'నంజుండి కళ్యాణ' లాంటి రెండు మూడు బంపర్ హిట్స్ ఉన్నా పెద్దగా నిలదొక్కుకోలేక పోయారు. (ఇదే 'నంజుండి కళ్యాణ' సినిమాని తెలుగులో రాజేంద్ర ప్రసాద్, నిరోషా జంటగా 'మహాజనానికి మరదలు పిల్ల' అని రీమేక్ చేశారు గానీ ప్లాప్ అయింది. కన్నడ నుంచి రీమేక్ చేసిన 90% సినిమాలు తెలుగులో ప్లాప్ అయ్యాయి నా అంచనా ప్రకారం). 

శోభన్ బాబు గారు ఆరోగ్యం బాలేక కాదు ఆయుష్షు లేక మరణించారు అంటుంటారు అలా పునీత్ గారిని కూడా ఆయుష్షు లేక మరణించారనే అనుకోవాలి.  ఎందుకంటే నిత్యం వ్యాయామం చేస్తూ ఆహారం కూడా మితంగానే తీసుకుంటారని అతని సన్నిహితులు చెప్తూ ఉండేవారు. 

ఫ్రీ స్కూల్స్, వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాలు, గోశాలలు లాంటివి నిర్మించి తన సేవా గుణాన్ని కూడా చాటుకున్నారు. బాల నటుడిగా కెరీర్ మొదలెట్టి నటుడిగా కెరీర్ లో ఇంకా ముందుకు దూసుకు పోతాడు అనుకున్న అభిమానులను శోకం లో ముంచి వెళ్లిపోయిన పునీత్ రాజ్ కుమార్ గారికి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. 

25, అక్టోబర్ 2021, సోమవారం

నాగేంద్ర బాబు - ఫెయిల్యూర్ స్టార్

ఈ మధ్య కాలంలో సినిమాల ద్వారా కాకపోయినా వివాదాల మధ్య నలిగిన పేరుగా నాగబాబు బాగా గుర్తుండిపోయాడు.  

మంచి ఎత్తు, పర్సనాలిటీ ఉన్న నాగబాబుని చిరంజీవి మంచి డైరెక్టర్స్ చేతిలో పెట్టలేదేమో అని నా అనుమానం.  పోటీ కొస్తాడని భయపడ్డాడా లేక హీరో మెటీరియల్ కాదని అనుకున్నాడా? అయినా ఈ నాగార్జున, వెంకటేష్ మొదట్లో చేసిన యాక్షన్ కంటే బానే చేశాడు, కనీసం కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న మంచి డైరెక్టర్స్ అయిన దాసరి, కోదండరామి రెడ్డి, జంధ్యాల, వి మధు సూధన రావు లాంటి వారి డైరెక్షన్ లో ట్రై చేశాడు గానీ ఒక్క బజార్ రౌడీ తప్పితే సోలో హీరోగా పెద్దగా హిట్స్ ఏమీ కొట్టలేకపోయాడు గానీ సోలో హీరోగా డజన్ సినిమాలతో లక్ చెక్ చేసుకున్నాడు. మరి నాగేంద్ర బాబు సోలో హీరో గా వర్క్ అవుట్ కాలేడని మూడు నాలుగు సినిమాలతోనే చిరంజీవి డిసైడ్ అయ్యారా లేక నిర్మాతలే ముందుకు రాలేదా?

అఫ్ కోర్స్  కొడుకు, తమ్ముడు ఒకటే కాకపోవచ్చు. లేదంటే 'తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే' అని అప్పటికే చిరంజీవి పక్కన అల్లుకుపోయిన వారెవరైనా ఎగదోశారా? జస్ట్ అస్కింగ్. 

మొన్నా మధ్య పాత సినిమాల వైపు మనసు లాగితే పనిలో పనిగా దాదర్ ఎక్ష్ప్రెస్స్ , 420 లాంటి సినిమాలు చూశా.

దాదర్ ఎక్ష్ప్రెస్స్ సినిమా మసాలాలు ఉండని కాస్త డ్రై సబ్జెక్టు. మాటల రచయిత గా సత్యానంద్ గారిది అందె వేసిన చెయ్యి కావచ్చేమో గానీ డైరెక్షన్ మరీ బాడ్ గా ఉంది దానికి తోడు యాక్షన్ అంటే స్పెల్లింగ్ కూడా తెలీని హీరోయిన్ వల్ల సినిమా అస్సలు ఆకట్టుకోదు. అప్పట్లో ఈ సినిమా మీద వివాదం రేగి చివరకు సూపర్ ఎక్ష్ప్రెస్స్ అని పేరు మార్చి రిలీజ్ చేశారు.  దాదర్ ఎక్ష్ప్రెస్స్ లో అలాంటి సంఘటన జరగలేదని అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయరాదని సెన్సార్ వాళ్ళు అడ్డుకున్నట్లు ఉన్నారు. 

ఇక 420 సినిమా గురించి వినడమే గానీ చూడటం ఇదే తొలిసారి. దీనికి ఈవీవీ సత్య నారాయణ డైరెక్టర్. అప్పటికే సీతా రత్నం గారి అబ్బాయి, ఆ ఒక్కటి అడక్కు లాంటి హిట్లతో ఫామ్లో ఉన్నాడు. ఈ సినిమాలో పాటలు అనవసరంగా ఫ్లో కు అడ్డుపడ్డాయి గాని మాంచి టైంపాస్ మూవీ. తాడి మట్టయ్య అనబడే క్యారెక్టర్ లో కోట, కానిస్టేబుల్ గా మల్లి ఖార్జున రావు పాత్రలని ఎక్స్టెన్షన్ లాగా మళ్ళీ హలో బ్రదర్ లో వాడుకున్నాడు కాస్త సెంటిమెంట్ టచ్ లాస్ట్ లో అద్దేసి. 

ఆ తర్వాత హాండ్స్ అప్, కౌరవుడు లాంటి సినిమాల్లో ట్రై చేసాడు గానీ అప్పటికే యంగ్ జెనెరేషన్ వేగంలో అవి సరిపోవు అనిపించింది 

నాగబాబు ఉంటే ఆ సినిమా ఫట్టవుతుందని అప్పట్లో నాకో గట్టి నమ్మకం ఉండేది, ఆ నమ్మకాన్ని అతను నటించిన చాలా సినిమాలు వమ్ము కాదని ప్రూవ్ చేశాయి. 

ప్రతీ నటుడికి లాండ్మార్క్ లాంటి ఒక మూవీ ఉంటుంది చెప్పుకోవడానికి.  కానీ నటించడం మొదలెట్టిన ఇన్నేళ్లయినా అలాంటి సినిమా ఒక్కటి కూడా లేకపోవడం ఇతనికి లోటే. చందమామ, రుక్మిణి లాంటి సినిమాల్లో కాస్తో కూస్తో గుర్తుంచుకో గలిగే పాత్రలు చేశాడు గానీ అవి ఎంతమందికి గుర్తుంటాయి అనేది ప్రశ్నార్ధకమే. ఇకపైన అయినా  కనీసం అలాంటి ఒక సినిమా తాను చేయగలడని సినిమాల్లో ఫెయిల్యూర్ లా మిగిలి పోవద్దని  ఆశిస్తూ ఇంకో రెండు మూడు రోజుల్లో 60 వ వడిలో అడుగు పెట్టబోతున్న మా నాగబాబు కి జన్మదిన శుభాకాంక్షలు. ఏం మెగా స్టార్. పవర్ స్టార్ కేనా ఫాన్స్ ఉండేది టవర్ స్టార్స్ కి ఉండరా?

20, అక్టోబర్ 2021, బుధవారం

చల్లని కేసు

ఈ మధ్య నేను చూసిన మరో మంచి సినిమా కోల్డ్ కేస్, పృథ్వి రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మళయాళ సినిమా ఇది, మరి తెలుగులో డబ్బింగ్ చేశారో లేదో తెలీదు. 

పరిష్కరించకుండా మిగిలిపోయిన కేసునో లేదంటే ఐడెంటిఫై చేయలేని వ్యక్తుల హత్య కి సంబంధించిన కేస్ లని కోల్డ్ కేస్ అంటారని నాకు అర్థమైన ప్రకారం నిర్వచించగలను. గూగుల్ లో సరదాగా సెర్చ్ చేస్తే తెలుగు అనువాదం ఇలా దొరికింది, దాన్నే తీసుకొచ్చి టైటిల్ గా  పెట్టేశా.
కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ ని అయితే 'చల్లటి రక్తపు హంతకుడు' అని అనువాదం చేసుకోవచ్చేమో.  సరే సోది పక్కనబెట్టి సినిమా గురించి మాట్లాడతా. 

సాధారణంగా మర్డర్ మిస్టరీ కి సంబంధించిన థ్రిల్లర్ సినిమాల్లో ఇతనే హంతకుడు అని మొదట్లోనే పరిచయం చేయడం ఆ తర్వాత హీరో అతన్ని ఏ విధంగా కనిపెట్టి పట్టుకుంటాడు అనేది ఒక రకం అయితే మరో రకం లో చివరి వరకు ఆ హంతకుడెవరో ప్రేక్షకులకి కూడా తెలియనివ్వకుండా చివర్లో రివీల్ చేయడం. సో, ఈ రెండు పద్ధతుల్లో ఏది బెటర్ గా తీయొచ్చు అనేది ఆ తీసే విధానం బట్టి ఉంటుంది గానే మొదటి పద్దతిలోనే తీస్తేనే లేదంటే రెండో పద్దతిలోనే తీస్తేనే హిట్ అవుతాయని ఎవరూ బల్ల గుద్ది చెప్పలేరని నా గట్టి నమ్మకం. లేటెస్ట్ గా వచ్చిన నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'V ' మొదటి రకానికి చెందినదైతే, అదే నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరో గా వచ్చిన 'Hit' సినిమా రెండో కోవలోకి చెందినది. 

ఈ రెండవ కోవలోని థ్రిల్లర్స్ ని కూడా రెండు రకాలుగా విభజించచ్చు అని నా అభిప్రాయం. చాలా వరకు సినిమాల్లో హత్య లేదా హత్యలు  చేసిన వాడు ఇదిగో వీడే అంటూ ప్రేక్షకులను ఫూల్స్ ని  చేస్తూ  అంత వరకు సీన్ లో చూపించని కారెక్టర్ ని సీన్ లో కి తీసుకొచ్చి వీడే హంతకుడు అని చెప్తారు. అక్కడే ప్రేక్షకులు ఆ ట్విస్ట్ ని ఎంజాయ్ చేయలేక ఆ సినిమా మీద నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. 'శివన్ ' అని ఒక తెలుగు సినిమా యు ట్యూబ్ లో ఉంటుంది చూడండి, చివర్లో  అంతవరకూ సినిమాలో చూపించని వాడిని తీసుకొచ్చి, వీడే అంతటికీ కారణం అని చివర్లో చిన్న ఫ్లాష్ బ్యాక్ జత చేర్చి చూపెడతారు. 

ఇక రెండో కోవలోకి వచ్చేది నాకు గుర్తున్నంతలో అప్పట్లో వంశీ అన్వేషణ, రాజశేఖర్ 'ఆర్తనాదం', కథ లో సస్పెన్స్ పండించగలిగితే బాబీడియోల్ ని కూడా హీరోగా పెట్టి హిట్ తీయొచ్చని నిరూపించిన 'గుప్త్',  నిన్నటి రీమేక్ సినిమా రాక్షసుడు. ఈ సినిమాల్లో అంతవరకూ కథలో ఉండే కారెక్టరే ఆ హత్యలు చేస్తున్నట్లు చూపించి, అర్రే మనం గుర్తించలేక పోయామే భలే ట్విస్ట్ ఇచ్చాడు రా కథకుడు అని సలాం చేస్తారు. సరిగ్గా ఈ కోల్డ్ కేస్ సినిమాలో కూడా అంతవరకూ కథలో ఉండే కారెక్టరే ఆ హత్యలు చేస్తున్నట్లు చూపించి కాస్త థ్రిల్ చేస్తారు. ఈ సినిమాలో థ్రిల్ కి హారర్ మోడ్ ని కూడా ముడెయ్యడం కొంచెం వెరైటీ అనుకోవాలి. 

కథలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి గానీ సినిమాటిక్ లిబర్టీ కింద వాటిని వదిలేయచ్చు. పైగా  చెత్త సినిమాల మధ్య ఈ మాత్రం విషయం ఉన్న సినిమా చూపిస్తే ఖుషీ అయిపోతాం. సినిమా నాకు నచ్చింది కానీ మరెందుకో చాలా మందికి నచ్చినట్లు లేదు. 

మమ్ముట్టి నటించిన మళయాళ సినిమా 'ది ప్రీస్ట్' కూడా చూశాను గానీ అంతగా నచ్చలేదు, యేవో రెండు స్టోరీ లను కలిపి ఒక సినిమాగా తీసిన ఫిలింగ్ కలిగింది. ఈ సినిమా నాకు నచ్చలేదు కానీ ఎక్కువ మందికి నచ్చినట్లు ఉంది. 

12, అక్టోబర్ 2021, మంగళవారం

పెదరాయుడు దెబ్బకు చిత్తై పోయిన బిగ్ బాస్

బిగ్ బాస్ దెబ్బకు పెదరాయుడు చిత్తై పోతాడనుకుంటే పెదరాయుడు దెబ్బకు బిగ్ బాస్ మట్టి కరిచాడు. ఇది నిన్నో మొన్నో జరిగిన మా ఎన్నికల గురించి అని అనుకునేరు? కాదు కాదు పాతికేళ్ళ క్రితం జరిగిన విషయం చెప్తున్నా. 

ఘరానా మొగుడు సినిమాతో 10 కోట్ల కలెక్షన్స్ సాధించి శిఖరం అంచుకు ఎక్కేసిన చిరంజీవి, ముగ్గురు మొనగాళ్లు, మెకానిక్ అల్లుడు, SP పరశురామ్ అంటూ దిగడం మొదలు పెట్టాడు, ఎంతగా అంటే హిట్టొస్తే చాలురా ఈవీవీ సత్యనారాయనా అని అల్లుడా మజాకా సినిమాలో నటించి మరింత కిందికి దిగజారి పోయాడు. ఆ రోజుల్లో మహిళలతో ఛీకొట్టించుకుని సభ్య సమాజం తలదించుకునేలా పేరు తెచ్చుకున్న ఆ బూతు సినిమా ఎలాగోలా హిట్టనిపించుకుంది గానీ చిరంజీవి రేంజ్ కి నికార్సయిన హిట్ సినిమా కాదది.  

అల్లుడా మజాకా తర్వాత విడుదల అవుతున్న బిగ్ బాస్ సినిమాతో మళ్ళీ శిఖరం పైకి ఎక్కుతాడని అప్పట్లో నేనెంతో ఆశపడ్డాను  పైగా గ్యాంగ్ లీడర్ లాంటి బంపర్ హిట్ తీసిన విజయ బాపినీడే ఈ బిగ్ బాస్ కు దర్శకుడు అవడం నా ఆశలకు మరింత ఊతమిచ్చింది. 

అదే రోజు రిలీజ్ అవుతున్న పెదరాయుడు మీద వేరే ఎవరికైనా నమ్మకాలు ఉన్నాయేమో గానీ మెగా స్టార్ మేనియా లో ఉన్న నా కళ్ళకు ఆ సినిమా అనలేదు. పైగా ఆ సినిమాలో రజని కాంత్ ఉన్నాడు, నాలుగైదు నెలల క్రితం రిలీజ్ అయిన బాషా రికార్డ్స్ ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి అయినా సరే బిగ్ బాస్ ఇక్కడ అని ధైర్యం చెప్పుకున్నా. 

అప్పట్లో రిలీజ్ కి ముందు రోజు రాత్రే ఫాన్స్ షో వేసే వారు, దానికి టికెట్స్ తీసుకురావడానికి ఎప్పటిలాగానే మా కరడు గట్టిన చిరంజీవి అభిమాని ఉండనే ఉన్నాడుగా కాబట్టి టికెట్స్ గురించి భయం లేదు. ఉన్న దిగులంతా నాన్న ను ఒప్పించడమే, మరీ కష్టం కాదు కానీ ఆ రోజుకు ఒక రెండు గంటలు ఎక్కువ చదివేస్తే ఒప్పుకుంటారు సినిమాకి వెళ్ళడానికి. 

రాత్రి 10 గంటల టైం లో షో మొదలైంది. గంట లోపే అర్థం అయిపోయింది సినిమా లో అస్సలు విషయం లేదని.  ఫాన్స్ అయిన మాకే నచ్చలేదంటే ఇక మామూలు ప్రేక్షకులకు అస్సలు ఎక్కదు అని సినిమా చూసొచ్చాక అర్థమైంది. ఇంటికొచ్చేదాకా మేమెవ్వరం నోరు విప్పలేదు సినిమా ఇంట చెత్తగా ఉందే అని. 

భాషా లాంటి సినిమా తీయాలని అనుకున్నారని, లేదు.... లేదు  భాషా సినిమా లాంటి కథనే తీయబోయి భాషా రిలీజ్ అయిందని స్టోరీ మార్చేసి కలగా పులగం చేశారు అని ఎవరికి నచ్చినట్లు వారు విశ్లేషించారు సినిమా సర్కిల్స్ లో. 

ఏది ఏమయితేనేం రెండ్రోజులకే పూర్తిగా బిగ్ బాస్ థియేటర్స్ ఖాళీ ఇక్కడ, అక్కడేమో పెదరాయుడు ఆడే థియేటర్స్ లో జాతర మొదలైంది. అగ్నికి వాయువు తోడయినట్లు  మోహన్ బాబు నటనకు, రజనీ కాంత్ స్టైల్ తోడై  బిగ్ బాస్ ను పూర్తిగా బూడిద చేసేసింది పైగా 10 కోట్లు అని గొప్పగా చెప్పుకునే ఘరానా మొగుడు కలెక్షన్స్ ని 2 కోట్ల మార్జిన్ తో దాటేసింది. 

అదీ, పెదరాయుడు దెబ్బకు చిత్తై పోయిన బిగ్ బాస్ విషయం. మొన్న జరిగిన 'మా' ఎన్నికలకు దీనికి ఎటువంటి సంబంధం లేదని మనవి.  

చిరంజీవి సినిమాలతో పాటు దాదాపు ఒకే టైం లో రిలీజ్ అయి అంచనాలు తారుమారుచేసిన సినిమాలు మచ్చుకు కొన్ని గుర్తున్నాయి.  

రిక్షావోడు - ఒరేయ్ రిక్షా (దాసరి, ఆర్ నారాయణ్ మూర్తి కాంబినేషన్)

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ - స్టువర్ట్ పురం దొంగలు (భానుచందర్ హీరో)

మృగరాజు - నరసింహనాయుడు (హీరో ఎవరో చెప్పాల్సిన పని లేదు)

కొదమ సింహం - ఇంద్రజిత్ 

ఈ చివరి రెంటిదీ డిఫరెంట్ స్టోరీ. రెండూ హిట్ కాలేదు కానీ, కొదమ సింహం వల్ల  తన కొడుకు బోసుబాబు(అతనికి మొదటి/చివరి సినిమా ఇదే అనుకుంటాను) ని  హీరో గా పెట్టి తను డైరెక్ట్ చేసిన సినిమా 'ఇంద్రజిత్' కి నష్టం జరిగింది అని గిరిబాబు చాలా సార్లు తన గోడు వెళ్లబోసుకున్నారు.