7, జూన్ 2021, సోమవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 1

హలో, మీ సిగరెట్ బాక్స్ కింద పడింది.

అది ఖాళీ అయింది నాకిక అవసరం లేదు అన్నాడు కొత్తగా విదేశానికి వెళ్లిన మన ఇండియన్. 

మా దేశానికి కూడా అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని చేతికిచ్చాడు. 

ఇది చాలా సార్లు విన్న జోకే అయినా సిడ్నీ లో దిగగానే నాకు గుర్తొచ్చింది. దూరపు కొండల నునుపెంతో రోడ్స్ మీద చచ్చి పడున్న సిగరెట్స్, రైళ్ళలో, స్టేషన్స్ లో ఖాళీ అయి పడి ఉన్న కూల్డ్రింక్స్ బాటిల్స్ తెలియజేశాయి. పక్కనే డస్ట్ బిన్స్ ఉన్నా కొందరు ఎక్కడంటే  అక్కడ పడేస్తుంటారు చెత్తని. మలేషియా లోనే సింగపూర్ లోనే అలా కింద పడేస్తే ఫైన్స్ వేస్తారని విన్నాను. అవి కూడా నాకు దూరపుకొండలు కాబట్టి ఎవరైనా దాని నునుపెంతో తెలియజేయండి. ఇక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్ లో మరీ అంత స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ ఉన్నట్లు లేవు. 

ఇక ఫుట్పాత్ మీద నడుస్తూ వెళ్తూ పొగ వదుల్తుంటారు కొందరు ధూమపాన రాయుళ్ళు, వారి వెనుక వస్తే మాత్రం చచ్చే చావే. కాసేపు అక్కడే ఆగి, ఆ పొగ రాయుడు ( చినరాయుడు, పెద రాయుడు, సుబ్బారాయుడు లాంటి వారి మనోభావాలు ఎప్పుడూ దెబ్బతినలేదా అలా ఎవరైనా అన్నప్పుడు, లేక మగరాయుడు అనేదాంట్లో కూడా రాయుడు ఉంది కదా అని సంతోషపడ్డారా??) కాస్త దూరం వెళ్ళే దాకా ఆగడం లేదంటే అర్జెంట్ గా వెళ్తున్నప్పుడు ఆ పొగ రాయుడిని లేదంటే ఆ రాయుడమ్మ ని దాటి వెళ్ళాలి. (ఎవ్వరి మనో బావాల, మరదళ్ళ వివక్షలేదని నా ఉద్దేశ్యం)  నేను రాస్తున్నది రామాయణం కాదు కాబట్టి ఈ పిడకల వేట ఉండటం లో తప్పేం లేదు. అది రామాయణంలో పిడకల వేట కాదని, పితకాల వేట అని కాదు కాదు పీడ కలల వేట అని కొందరు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అంటుంటారు. 

సరే ఆ పిడకల వేట వదిలేసి విషయానికి వస్తే,  ఏ పూర్వ జన్మ శాపమో గానీ, నేను ఏ ఇంట్లో అద్దెకి ఉన్నా నా కింది ఇంటి వాడో, పక్కింటి వాడో బాల్కనీ లో పొగ వదులుతుంటారు. వీళ్ళ దెబ్బకి విశాలమైన బాల్కనీ ఉండి కూడా అక్కడ కూర్చొని టీ తాగాలన్నా, కనీసం ఓపెన్ చేయాలన్నా భయం వేస్తుంది. 'పది మంది పొగరాయుళ్ళకి/రాయుడమ్మలకి  పది రోజుల పాటు పది సిగరెట్ పెట్టెలు పంచి పెడితే ఈ పాపం పోతుందని'  నా జాతకం చూసి పొగేశ్వరస్వామి సెలవిచ్చారు లేదంటే Pavan అని కాకుండా Paavan అని ఒక a ఎక్కువ చేర్చాలట నా పేరులో. ఆలోచించుకోవాలి ఏ రెమెడీ ఫాలో అవ్వాలో. 

నా చిన్నప్పుడు ఈ ఇంటర్నెట్ లేదు కాబట్టి క్రికెట్ విషయంలో మాత్రమే అప్పట్లో ఆస్ట్రేలియా పేరు ఎక్కువగా పినిపించేది, సబ్జక్ట్స్ లో, టీవిలో న్యూస్ లో వచ్చినా అవి మనకు వినపడవు. ఆ తర్వాత రేసిజం మీద ఒక పదేళ్ళ క్రితం జనాల నోళ్ళలో బాగా నానింది. అప్పుడే నా onsite ప్రయాణం ఆస్ట్రేలియా కి, చాలా మంది భయపెట్టారు కానీ రేసిజం తీవ్రతను నేనెప్పుడూ ఎదురుకోలేదు ఇక్కడ. 

ఈ మధ్య గత రెండేళ్ళుగా వార్తలలో మరీ ఎక్కువగా వినపడుతోంది ఆస్ట్రేలియా పేరు. కార్చిచ్చులని కొన్ని రోజులు, వరదలని కొన్ని రోజులు, ఎలుకల దాడి అని గత వారం రోజులు వార్తల్లో నిలిచింది. పోయిన రెండు నెలలలో విపరీతంగా కురిసిన వర్షాల దాటికి కలుగుల న్నీ నిండిపోయి ఎలకలు ఊరిమీద, ఇళ్ళ మీద పడ్డాయి. 

గత సంవత్సరం లంచ్ టైం లో టీవీలో వార్తలు వింటూ ( ఆఫీస్లో ఛానల్ మార్చే అవకాశం లేదు కాబట్టి, లేదంటే వార్తలు చూసే అలవాటు మా ఇంటా వంటా లేదు మా నాన్నగారికి తప్ప) covid గురించి విన్న కొత్తలో 'హెహ్హేయ్, అదెక్కడో చైనా లో మొదలైన వైరస్, దాని గురించి ఎందుకు ఇంత వర్రీ' అనుకున్నా కర్రీ లో చపాతీ ముంచుకొని తింటూ. ఆ తర్వాత కదా దాని ప్రతాపమేమిటో ప్రపంచానికి తెలిసింది. ఆ విషయం ఇంకా గుర్తు ఉంది కాబట్టే మేముండేస్థలం ఆ మూషికదాడులు జరిగే స్థలానికి దూరంగా ఉన్నా భయపడాల్సి వస్తోంది. అవి మేము ఉండే చోటికి చేరేలోగా వాటిని అరికట్టే చర్యలు ప్రభుత్వం చేపడుతుందని  ఆశిస్తూ... 

1, జూన్ 2021, మంగళవారం

మొండోడు మేనేజర్ కంటే గొప్పోడు

ఇవాళ ఉదయం ట్రైన్ లో మా పాత మేనేజర్ కనపడ్డాడు. అతనితో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి  రాయాలనిపించి రాస్తున్నా. 

"IT తల్లికి చేస్తున్న సేవకు ఫలం ఇదేనా?" అన్నాన్నేను బాధతో కూడిన ఆవేశంతో.  

"నువ్వేం ఊరికే చేస్తున్నావా?" నిర్లక్ష ధోరణిలో మా మేనేజర్ సుబ్బారావ్

ఊరికే కాదనుకోండి, కాకపోతే సినిమా వాళ్ళు రొటీన్ గా అంటుంటారు కదా "కళామ తల్లికి యెనలేని సేవలు చేశాను" అని అలా ఏదో ఒక డైలాగ్ ఫ్లో లో వచ్చింది.

ఏది ఏమైనా సరే నాలుగైదు రోజుల్లో నువ్వు ఇండియా పోవాల్సిందే. ఫండ్స్ లేవని క్లయింట్ ప్రాజెక్ట్ ఆపేయమన్నారు. 

నాకు ఇంకో మూడు వారాలు గడువు కావాలి.

ఇవ్వను.

కంపెనీ పాలసీ ప్రకారం ఇచ్చి తీరాల్సిందే 

మరీ మొండిగా బిహేవ్ చేస్తున్నావ్, ఖరా ఖండిగా చెప్పేస్తున్నా మంచిగా వెళ్ళు, ఇన్నేళ్ళు మంచిగానే ఉన్నావుగా ఈ మొండితనం నీకు మంచిది కాదు. 

మనిషి బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి.. మంచితనం మనుషుల మీద .. మొండితనం పరిస్థితుల మీద చూపించాలి

quote బాగుంది, పేస్ బుక్ లో పెట్టుకో

అక్కడినుంచే కొట్టుకొచ్చా, మళ్ళీ నా పేరుతో పోస్ట్ చేస్తే కొట్టేస్తారు. నా సొంత quote చెప్తాను విను.   'మొండోడు మేనేజర్ కంటే గొప్పోడు' ..... గుర్తుంచుకో.

నా ఈగో హర్ట్ చేస్తున్నావ్?

అది నా దగ్గర టన్నుల కొద్దీ ఉంది. అయినా నేనేమైనా నీ ఆస్తులో లేదంటే కంపెనీ ఆస్తులో రాసిమ్మని అడుగుతున్నానా ఏమిటి? నాకివ్వాల్సిన నాలుగు వారాల గడువు నాకివ్వు అనే కదా అడిగేది.

ఇవ్వను. ఈ శుక్ర వారం నైట్ కి టికెట్స్ బుక్ చేసుకో...  నువ్వు ఇండియా పోవాల్సిందే. కావాలంటే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలైతే నిన్నే పిలిపిస్తా. 

దీన్ని శాడిజం అంటారు, మమ్మల్ని ఇండియా వెళ్ళమంటున్నావ్ అదీ నాలుగైదు రోజుల్లో. శుక్రవారం ఆఫీస్ కి వచ్చి ఆ రోజు రాత్రే ఫ్లైట్ ఎక్కాలంటున్నావ్? మేమేమైనా  పిక్నిక్ వచ్చామా, అంతా సర్దేసుకొని సాయంత్రానికి బయలుదేరడానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు పిలవగానే  మళ్ళీ ఇక్కడికి రావడానికి. అయినా ఇలా మమ్మల్ని ఇండియా పంపించడానికి నీకు బాధ వేయట్లేదా?

నీ ఇంట్లోనుంచి నువ్వు ఈగలు బయటికి తరిమేస్తే నీకు బాధగా ఉంటుందా?

అంటే మేము నీకు ఈగలతో సమానమన్నమాట.

అవును అంతే.

చపాతీలు తినేవాడివి నీకే అంత ఉంటే అన్నం తినేవాడిని నాకెంత ఉండాలి?

ఏమిటది?

ఏమో నాకూ తెలీదు, ఒక తెలుగు సినిమాలో హీరో డైలాగ్ గుర్తొచ్చి ఫ్లో లో చెప్పేశా. నీకో కథ చెబుతా విను

కొన్నేళ్ళ క్రితం "నువ్వు onsite ఎలా వెళ్తావో నేనూ చూస్తా" అన్నాడు నీలాంటి ఒక మేనేజర్. నా గుండె మండి పోయి ఆ వీకెండే ఇంటర్వ్యూ కి వెళ్లి మండే కి ఆఫర్ లెటర్ తెచ్చుకొని నా మొండి తనం ఎలా ఉంటుందో చూపించి రిసైన్ చేశా.

అప్పుడు పై మానేజ్మెంట్ దిగి వచ్చి, బాలకా ఏమిటి నీ కోరిక అన్నారు.

పాకిస్తాన్ తప్ప ఏ పరదేశమైనా పంపించండి అని అడిగా.

ఇంత ఫ్రస్ట్రేషన్ ఏమిటి పవన్? అని అడిగింది మా డిపార్ట్మెంట్ హెడ్ 

ఫ్రస్ట్రేషన్  కాక  మరేమిటి వినుత గారు, నన్ను అమెరికా పంపిస్తామని చెప్పి వాడెవడినో పంపించారు మా మేనేజర్ డర్టీ పాలిటిక్స్ నడిపించి.  ఈ ఆఫీసులో అందర్నీ ఏదో ఒక దేశం పంపించారు చివరాఖరికి  ఆ టీ పెట్టే అతన్ని, బయటున్న ఆ సెక్యూరిటీ గార్డ్ ని, బాత్రూములు క్లీనింగ్ చేయడానికి వచ్చే ఆ బాయ్ ని కూడా పంపించేటట్టు ఉన్నారు నన్ను తప్ప. 

అలా మొండిపట్టు పట్టి ఆ దేవత కరుణించబట్టి  ఆస్ట్రేలియా వచ్చా.  ఆ మొండిపట్టుని దాచి ఉంచి మంచిగా ఉంటూ ఎనిమిది ఏళ్ళు నెట్టుకొచ్చా ఆస్ట్రేలియా లో. కాబట్టి నా మంచితనం వైపే చూడు, మొండితనం వైపు చూడాలనుకోకు మాడి మసై పోతావ్. 

నీ తొక్కలో సినిమా డైలాగ్స్ నన్ను భయపెట్టలేవ్, ఏం చేసుకుంటావో చేసుకో. 

వెంటనే నేను ఒక మైగ్రేషన్ ఏజెంట్ మరియు లాయర్ ని కలిసి నాకున్న రైట్స్, అవకాశాల పరిమితులు తెలుసుకొని వాటితో ఇక్కడ నెగ్గుకురాగలను అనే నమ్మకంతో మరుసటి రోజు ఉదయమే మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి .. 

'సుబ్బారావ్ నేను resign చేస్తున్నట్లు మెయిల్ కూడా పంపించా, అలాగే పోర్టల్ లో కూడా అప్డేట్ చేశా' అన్నాను కాంటీన్ లో కాఫీ తాగుతున్న మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి 

ఏంటీ? resign  చేశావా? నెలలో నీ వీసా కాన్సల్ అవుతుంది, అప్పుడైనా నువ్వు ఇండియా వెళ్ళిపోవాలి. అని బెదిరించాడు. 

అవన్నీ నేను చూసుకుంటాను. ఇంకో స్పాన్సర్ ని వెతుక్కుంటా ఆ లోపు, నా మీద నాకు నమ్మకం ఉంది. 

నమ్మకం వమ్ము అయితే?

నమ్మకం అమ్మ లాంటిది, ఎప్పుడూ మనల్ని మోసం చెయ్యదు. 

సినిమాలు ఎక్కువ చూస్తావ్ అనుకుంటా. 

అవును రాత్రే మా బాస్ సినిమా 'ఛాలెంజ్' ముప్పై మూడో సారి చూశా. 

అంత కరెక్ట్ గా  ఎలా గుర్తు పెట్టుకున్నావ్ అన్ని సార్లు చూశావని. 

ఏదో నోటికొచ్చిన నెంబర్ చెప్పా... టాపిక్ డైవర్ట్ చెయ్యకు. 

రిస్క్ చేస్తున్నావేమో ఆలోచించు, రిస్క్ చేయడమంటే రస్క్ తిన్నంత ఈజీ కాదు అన్నాడు కాఫీ లో రిస్క్ ముంచుకు తింటూ. 

అంటే నువ్వు కూడా సినిమాలు ఎక్కువ చూస్తావన్నమాట. 

అవును ఎంటర్టైన్మెంట్ కావాలంటే హిందీ లోకి డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలే చూస్తా. చూశావా మన ఇద్దరి వేవ్ లెంగ్త్ యెంత బాగా మ్యాచ్ అవుతుందో. 

మ్యాచింగ్ తర్వాత, నువ్వు మనిద్దరి మధ్య ప్యాచింగ్ చేస్తున్నావని అర్థం అవుతోంది. ఇంతకీ ఏమంటావ్?

"ఏముంది, ఒక నెల ప్రొడక్షన్ సపోర్ట్ లో వర్క్ చెయ్, ఈ లోపు ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు, అందులో చేరచ్చు" అని మేనేజర్ చెప్పడం తో మా మధ్య సంధి కుదిరింది. 
 
ఒక రెండు వారాలు గడిచాక, ఆపేసిన ప్రాజెక్ట్ మళ్ళీ మొదలెట్టమని క్లయింట్ చెప్పారు. అలా శుభం కార్డు అప్పటికి పడిపోయింది. కాబట్టి నేను చెప్పొచ్చేదేమిటంటే జీవితంలో కొన్ని సార్లు మొండితనం, ధైర్యం, తెగింపు లాంటి వాటికి చోటివ్వాల్సిందే.  

అర్రే, నా లైఫ్ లో కూడా చిన్నా చితక విషయాలు ఉన్నాయ్ కాసింత మసాలా కలుపుకుంటే నా ఆటోబయోగ్రఫీ రాసుకోవడానికి. ఏం గాంధీ, కెప్టెన్ గోపినాథ్, విఠల్ కామత్ లాంటి గొప్పోళ్ళు మాత్రమే రాసుకోవాలా, నా లాంటి అతి సామాన్యుడు రాసుకోకూడదా ఏమిటి? కాబట్టి ఇంకో ఇరవయ్యేళ్ళ తర్వాత 'నేను - నా మదిలో సోది' అని రాసుకుంటా. ఇంకా మంచి టైటిల్ మీకు స్ఫురిస్తే చెప్పేయండి నా బుక్ మీద వచ్చే లాభాలన్నీ మీకే ఇచ్చేస్తా. అవును, సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకున్నట్లు ఈ బుక్ టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్ఛా ఇంకొకరు కొట్టేయకుండా? 

18, మే 2021, మంగళవారం

ట్రై చేస్తూ ఉండాలి అంతే

ముందు మూడు భాగాల - కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం , ఇన్నాళ్ళకి.. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను, 5 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా?  కి ఇది క్లైమాక్స్ పోస్ట్. 

అలా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ తో ఐదు క్లాసెస్ ముగిశాక, ఇక ప్రాక్టీస్ ముమ్మురం చేద్దామని కార్ కొనాలని అనుకున్నా. ఇంకా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నావ్ కాబట్టి కొత్త కార్ కాకుండా సెకండ్ హ్యాండ్ కార్ కొను అని చాలామంది సలహా ఇచ్చారు. 

సరే అని మంచి కండీషన్లో ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ కార్ (51000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది) కొనేశా. కాకపోతే L బోర్డు పెట్టుకొని ఒక్కడినే డ్రైవ్ చేయకూడదు కాబట్టి పక్కన ఫ్రెండ్ ని కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ మొదలెట్టా. 

రోజూ నావిగేటర్ లో ఒక ప్లేస్ సెట్ చేసుకోవడం అది చెప్పే రూట్ ఫాలో అవ్వడం. ఒక రోజు ' ఓ మూడొందల మీటర్లు ముందుకు వెళ్ళి అక్కడ పార్కింగ్ ఉంటుంది ఆపేయ్, నేనెక్కడ దిగిపోతా' అంది ఆ నావిగేటర్. 

అనదా మరి, నాకు చిన్నప్పటి నుంచి  రైట్ అండ్ లెఫ్ట్ మధ్య చిన్నపాటి కన్ఫ్యూషన్ ఉండేది. దాంతో అది రైట్ అని చెప్తే లెఫ్ట్ కి, లెఫ్ట్ అని చెప్తే రైట్ కి వెళ్ళేవాడిని. అది మళ్ళీ రూట్ సెట్ చేసుకోవాల్సి వచ్చేది. అందుకే అది దిగిపోతా అంది. 

ఒక వేళ డ్రైవింగ్ టెస్ట్ లో ఇలా చేస్తే వాడు ఇమ్మీడియేట్ ఫెయిల్ చేసి పారేస్తాడు కాబట్టి నావిగేటర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం మంచిది అయ్యింది, ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ పూర్తిగా పోయింది. 

ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళు డ్రైవింగ్ ప్రాక్టీస్ అవుతుంది అలాగే కారు మీద మంచి కంట్రోల్ వస్తుంది అన్నారు. పుణ్యం, పురుషార్థం కలిసొస్తుందని అలాగే స్వకార్యం, స్వామికార్యం కూడా తీరిపోతాయని  ఏప్రిల్ లో పిల్లల హాలిడేస్ ఉన్నప్పుడు ఒక 5 డేస్ ట్రిప్ ప్లాన్ చేశాను

అక్కడ నైట్ టైం ఘాట్ సెక్షన్ లో నేను ఏ మాత్రం ఇబ్బంది పడకుండా డ్రైవ్ చేయగలిగాను. అసలు కాన్ఫిడెన్స్ లేకపోతే అంత రిస్క్ చేసేవాడిని కాదు. మొత్తానికి రెండు నెలల్లో నాలుగు వేల కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. 

భలే డ్రైవ్ చేస్తున్నావ్ నాకంటే బాగా అని నా ఫ్రెండ్ అన్నాడు కానీ అది ఎంకరేజ్ చేయడం కోసమే అని నాకు తెలుసు.  నువ్వు యూత్ కాదు కాబట్టి నేర్చుకోవడానికి బాగా టైం పడుతుంది అన్నాడు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్. But age is just a number, డెడికేషన్ ఉంటే చాలు.. ఏదైనా నేర్చుకోవడానికి ఏజ్ కి సంబంధం లేదు అనిపించింది. 

నేర్చుకోవడం అయింది , ఇక టెస్ట్ కి వెళ్ళడమే. సముద్రాలు ఈది ఇంటెనుక పిల్ల కాలువలో పడి చచ్చినట్లు మొదటి టెస్ట్ ఫెయిల్. నువ్వు మరీ స్లో గా టర్నింగ్ చేస్తున్నావ్, ఇలా చేస్తే నీ వెనుక వచ్చే వారికి ఇబ్బంది, నీకు కాంఫిడెన్స్ లేదు... బాగా ప్రాక్టీస్ చేసి రా అన్నాడు examiner టెస్ట్ అంతా అయిపోయాక. ఓర్నీ, నాకు ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం రాక కాదు, మరీ లెర్నర్ రేంజ్ కదా అని స్లో గా డ్రైవ్ చేశాను లేదంటే రాష్ డ్రైవింగ్ అంటావేమో అని అనుకున్నాను. 

నువ్వు మరీ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావ్, construction జరుగుతున్న ఏరియా లో 10km తక్కువ స్పీడ్ లో వెళ్ళాలి అని ఏదో చెప్పి ఫెయిల్ అన్నాడు రెండో సారి.  

మూడోసారి టెస్ట్ లో నా పక్కన కూర్చున్న examiner రివర్స్ పారలెల్ పార్కింగ్ చేయమంది.  రెండే రెండు turns లో పార్క్ చేసి పర్ఫెక్ట్ అనేశాను బయటికి నాకే తెలీకుండా. ఇగో హర్ట్ అయిందేమో, హనుమంతుని ముందే హై జంప్ లా అని ఫెయిల్ చేసేసింది నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అని, పార్క్ చేసిన కార్ వెనుక మరీ క్లోజ్ గా వెళ్ళావు అని. 

అలా మూడు సార్లు ఫెయిల్ అయ్యాక ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా నిన్నే ఉదయాన 8 గంటల టెస్ట్ లో పాస్ అయ్యాను. 

"నీకేమైనా పిచ్చా పదే పదే అదే సెంటర్ కి వెళ్తావు టెస్ట్ కి. ఆ ఏరియా లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. పెద్ద పెద్ద ట్రక్స్ తిరుగుతుంటాయి, స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క రోడ్ లో ఒక్కో స్పీడ్ లిమిట్ ఉంటుంది, పైగా ఉదయం 8 కి అంటే స్కూల్ టైం స్టార్ట్ అవుతుంది మళ్ళీ దానికో స్పీడ్ లిమిట్. ఇంత కష్టం అవసరమా, సిటీ కి దూరంగా మూడు నాలుగు సెంటర్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళు అక్కడ పెద్దగా పట్టించుకోరు, నువ్వు జస్ట్ డ్రైవింగ్ చేస్తే చాలు పాస్ అనేస్తారు. పైగా నువ్వెప్పుడూ వెళ్ళే సెంటర్ లో పనిచేసే వాళ్ళంతా మన దేశీ గాళ్ళు, మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు" అని ఎంతమంది చెప్పినా మనదంతా కథలో రాజకుమారుడి టైపు కదా ఉత్తరం దిక్కుకు వెళ్ళద్దు అంటే అటువైపే వెళ్ళేటైప్, పట్టు వదలని విక్రమార్కుడు అన్నమాట. చివరికి P బోర్డు సాధించేశాను. 

అరే, ఇంకెన్ని సార్లు exam అటెండ్ అవ్వాలి, ఇప్పటికే మూడు సార్లు ఇచ్చాను అని పూర్తిగా నిరాశ పడ్డాను కానీ ట్రై చేస్తూ ఉండాలి అంతే There is an end for everything అని మరో సారి తెలుసుకున్నా. 

13, మే 2021, గురువారం

బేసిలేరు నీకెవ్వరూ

'సరిలేరు నీకెవ్వరూ' అనబడే సూపర్ డూపర్ బంపర్ జంపర్ హిట్ తర్వాత అదే అనిల్ రావిపూడి ఈ సారి అదే మహేష్ బాబు ను క్రికెట్ కోచ్ గా చూపిస్తూ 'బేసిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ తో కొత్త మూవీ తీస్తున్నారట. ఆ  స్టోరీ ఇదే అయ్యుండచ్చేమో అని నా ఊహ. 

ఓపెనింగ్ షాట్ లోనే ...  ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ అమెరికా. 

అమెరికా మీద గెలవాలంటే ఇండియా కి 42 పరుగులు కావాలి, ఒక ఓవర్, ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంటుంది. చివరి ఆటగాడు అమ్మో! అన్ని రన్నులే అని టెన్షన్ పడి పాడ్ కట్టుకునే లోపే పాడె ఎక్కేస్తాడు గుండె హార్ట్ ఫెయిల్ అయి. మిగతా ఎక్స్ట్రా ఆటగాళ్ళు ముందు రోజు బార్లో బీర్లు ఎక్కువ తాగి ఎవరితోనే దెబ్బలు తిని మంచం ఎక్కి ఉంటారు. ఇక వేరే ఆప్షన్ లేక పైగా తెలుగు సినిమా కథ లో లాజిక్ మిస్ అయి చాలా ఏళ్ళు అయ్యి ఉండటం వల్ల కోచ్ పాడ్స్ కట్టుకొని బాటింగ్ చేయడానికి వెళ్తాడు. 

గ్యాలరీ లో అందరూ బాబు..  బాబు.. అని అరుస్తుంటారు ఎంకరేజ్ చేస్తూ. ఒక 6 సిక్సులు కొట్టాక  తన సహచర ఆట గాడిని తనతో  పాటు  తీసుకెళ్తాడు టీ తాగి వద్దాం పద అని. ఇక్కడ ప్రేక్షకులంతా బాబు, బాబు అని అరుస్తూనే ఉంటారు. టీ తాగొచ్చి ఆ చివరి సిక్స్ కూడా కొడతాడు. 

ఆ రోజు నైట్ అదే స్టేడియం లో హాలీవుడ్ హీరోయిన్ తో ఒక ఐటెం సాంగ్... కప్పు గెలిచిన సందర్బంగా సంబరాలు చేసుకుంటూ. 

కట్ చేస్తే .. ఫ్లైట్ లో ఇండియాకి తిరుగు ప్రయాణం ..అదే విమానం ఎక్కాల్సిన హీరోయిన్ లేట్ అవడం వల్ల విమానం వెనుక పరిగెడుతూ ఉంటుంది. హీరో చెయ్యి ఇస్తే హీరోయిన్ ఎక్కేస్తుంది. అంతే, హీరో చెయ్యి ఇచ్చాడని హీరోయిన్ మనసు ఇచ్చేస్తుంది.   

కాసేపటికి ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల లైట్స్ ఆరిపోతాయి, ఫ్లైట్ కూడా ఆగిపోయి మేఘాల్లో ఇరుక్కుపోతుంది.  ఫ్లైట్ లో లైట్స్ వెలగకున్నా ఫ్లైట్ అంతా లైటింగ్ ఉండి ఉంటుంది. అది మన హీరో పేస్ లో ఉండే కలర్ అండ్ గ్లామర్ వల్ల అని తెలుసుకున్న హీరోయిన్ రెండో చూపులోనే   హీరో మీద వెళ్లి పడిపోయి, చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటా అంటుంది   

హీరో మాత్రం అదేమీ పట్టించుకోకుండా, మేఘాల్లో ఇరుక్కున్న విమానాన్ని బయటికి లాగి ఆ టెక్నికల్ ఇష్యూ ని సరిచేస్తాడు. దాంతో హీరోయిన్ మరింత ఇంప్రెస్ అయిపోయి 

తెల్లటి బాబు ఓహ్ తెల్లటి బాబు 

భలే భలే.. భలే బూరె బుగ్గల బాబు 

అని సిగ్గు ఎగ్గూ లేకుండా పాట పాడుతూ ట్రాప్ లో పెట్టడానికి రేప్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది.   

ఫ్లైట్ మేఘాల్లో ఇరుక్కున్నప్పుడు ఆ మేఘాల వెనక దాక్కున్న ఫ్లైట్రేట్ (పైరేట్స్ లాగా ఇదో పద ప్రయోగం) ఒకడు ఈ ఫ్లైట్ లోకి ఎంటర్ అయి ఉంటాడు. వాడి పేరు బులెట్ బాబ్జి, వాడు విమానాల్లో ఎక్కి చోటా మోటా దొంగతనాలు చేస్తుంటాడు. రెండు మూడు కామెడీ సీన్స్ నడిపించిన తర్వాత వాడికి హీరో బుధ్ధి చెప్తాడు. 

తర్వాత ఆగ్రా లో ఫ్లైట్ దిగి సరాసరి ఆ చచ్చిన క్రికెటర్ ఇంటికి వెళదాం అనుకునేలోగా ఆ క్రికెటర్ చెల్లిని ఎవరో ఎత్తుకెళ్లాలని వస్తారు ఆ తాజమహల్ సెంటర్లోకి. అక్కడో పెద్ద ఫైట్ సీక్వెన్స్. 

క్రికెటర్ చెల్లి ఒక రిచ్ బాయ్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ రిచ్ బాయ్ ని వాళ్ళ నాన్న డబ్బున్న అమ్మాయి (ఇందాక ఫ్లైట్ లో వికారమైన కామెడీ చేసిన హీరోయిన్) తో పెళ్ళి చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకే ఆ క్రికెటర్ చెల్లిని లేపేయమని తన మనుషులని పురమాయించి ఉంటాడు. 

దాంతో హీరో ఆ విలన్ భరతం పట్టాలని అనుకుంటాడు. విలన్ బ్యాచ్ తో రెండు పులిహోర కామెడీ సీన్స్, ఇంకో రెండు బిర్యాని ఫైట్స్ తర్వాత క్రికెటర్ చెల్లిని ఆ రిచ్ బాయ్ కిచ్చి పెళ్లి చేసి హీరోయిన్ ని తాను పెళ్లి చేసుకొని విలన్ లో పరివర్తన తీసుకురావడం కోసం అతన్ని తీసుకెళ్ళి ఎక్స్ట్రా ప్లేయర్ ని చేసి బ్రేక్ లో క్రికెటర్స్ కి పాడ్స్, డ్రింక్స్ అందించే పని చేయిస్తాడు. 

ఈ మాత్రం కథ చాలు, కావాల్సినంత మసాలా ఉంది కాబట్టి బొమ్మ దద్దరిల్లిపోద్ది, సంక్రాంతి కి రిలీజ్ చేస్తే గల్లా పెట్టె నిండిపోతుంది. 

11, మే 2021, మంగళవారం

వ్యాపార ప్రస్థానం - మిస్టర్ ఎగ్ దోశ

వ్యాపార ప్రస్థానం - బీజం పోస్ట్ కి ఇది కొనసాగింపు 

..... అలా బెంగళూరు లో ఎగ్ దోశ కి అంటుకున్న దోషం పెరిగి పెరిగి పెద్దదై పోయింది. తర్వాత బెంగుళూరు నుంచి సిడ్నీ కి వచ్చిన మరుసటి రోజు నా రూమ్ మేట్ తో హోటల్ లో బ్రేక్ఫాస్ట్ టైం లో ...  

ఏంటి? ఎగ్ దోశ దొరకదా? బర్గర్ తో సరి పుచ్చుకోవాలా? 'బర్గర్ ఈజ్ నాట్ మై ప్లేట్ అఫ్ బ్రేక్ఫాస్ట్' అని గట్టిగా అరవాలనిపించింది. కాకపోతే పక్కన ఇద్దరు అరవోళ్ళు అరవంలో అరుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక నేను అరచినా ఎవరికీ వినపడదు అని అరవడం విరమించుకొని బర్గర్ ని కోక్ లో ముంచుకొని తిన్నా. 

అలా సిడ్నీ లో ఎక్కడ వెదికినా ఈ ఎగ్ దోశ దొరకలేదు. ఏదో ఇండియన్ రెస్టారెంట్స్ లో ఉంది అంటే ఉంది అని కానీ మెనూ లో కూడా చేర్చేవారు కాదు. సిడ్నీ లో ఈ ఎగ్ దోశ కి స్పేస్ ఉందనిపించి, ఎన్నాళ్లు ఈ ఇష్టం లేని సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలి. ఇక చాలు ఇంతటితో ఆపేసి నా జీవిత ధ్యేయం అయిన బిజినెస్ వైపు వెళ్లాలని డిసైడ్ చేసుకున్నా. 

మీ FKC లో కాస్త చోటిస్తే ఒక పక్క నేను దోశలు వేసుకుంటా, నాకు వచ్చిన ప్రాఫిట్ లో 30% నీకిస్తా అని అడిగా మా ఇంటి పక్కన ఉండే FKC చికెన్ వాడిని. వాడు కాదు కూడదు అన్నాడు. అలాగా, మీ ఓనర్ ని పిలువు వాడితో మాట్లాడాలి అన్నా. నేనే ఈ ఫ్రాంచైజ్ ఓనర్ ని అన్నాడు, మరైతే మీ షాప్ మీదున్న ఆ గెడ్డం తాత ను పిలువు ఆయనతోనే డైరెక్ట్ మాట్లాడుతా నా డీల్ అన్నాను. ఆ ముసలాయన చనిపోయి చాలా కాలం అయింది తమరు దయచేయండి అని చెప్పాడు. 'నేను అతని బిజినెస్ ని దెబ్బకొట్టి పైకి ఎదుగుతాననే భయం' అతని కళ్ళలో క్విన్టాలలో చూడటం నా కాన్ఫిడెన్స్ ని  టన్నుల కొద్దీ పెంచింది. 

ఇదే సీన్ మెక్డొనాల్డ్డక్, హంగ్రీ క్రాక్స్ బర్గర్ , ప్రిడొమినోస్  పిజ్జా షాప్ లోనూ రిపీట్ అయింది. 

ఇక ఇలా కాదని నా ప్రోడక్ట్ ని నేనే పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యా. ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ నేను తయారు చేసిన ఎగ్ దోశలు అవి తినని వారికి  దోశలు ఫ్రీ గా పంచిపెట్టా.  ఫ్రీ గా వచ్చిన దోశలు కాబట్టి అందరూ లొట్టలేసుకుని తిని మేము తినే బర్గర్, పిజ్జా ల కంటే పది రెట్లు టేస్టీ గా ఉందని మెచ్చుకున్నారు.  

నాలో కాన్ఫిడెన్స్ పెరిగి, ఒకరి మీద డిపెండ్ అవకూడదు అనుకున్నా అదుగో అప్పుడు ఫ్లాష్ అయిందే ఈ 'మిస్టర్ ఎగ్ దోశ'. అదే పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నా షాప్ కి లోన్ ఇచ్చేవాళ్ళు దొరక్క, కత్తి లాంటి ఐడియా అమలుచేశా.   'కరోనా టైములో రష్మిక మందాన వాడిన మాస్క్' అని వేలం పాట పెట్టి పది డాలర్ల మాస్క్ ని లక్ష డాలర్స్ కి అమ్మేశా. 

ఆ వచ్చిన డబ్బులతో 'మిస్టర్ ఎగ్ దోశ' స్టార్ట్ చేశా, రెండే నెలల్లో FKC, మెక్డొనాల్డ్డక్, హంగ్రీ క్రాక్స్ బర్గర్, ప్రిడొమినోస్ సేల్స్ పడిపోయి నా కాళ్ళ బేరానికి వచ్చారు బ్లాంక్ చెక్ ఇచ్చి. బట్, నేను వారిని ఛీ కొట్టాను, దాంతో కొన్ని రోజులకే వారు రోడ్డున పడ్డారు. 

అక్కడక్కడ బెగ్గింగ్ చేస్తూ కనిపిస్తారు కదా వాళ్ళంతా ఈ FKC, మెక్డొనాల్డ్డక్, హంగ్రీ క్రాక్స్ బర్గర్ , ప్రిడొమినోస్ ఫ్రాంచైజ్ ఓనర్స్ మరియు షేర్ హోల్డర్స్. అప్పుడప్పుడూ మా 'మిస్టర్ ఎగ్ దోశ' షాప్ కి వచ్చి ఫ్రీ గా ఎగ్ దోశ తిని వెళ్ళమని చెప్పాను వాళ్ళకి. 

మా మిస్టర్ ఎగ్ దోశ రుచి తిరుపతి లో తిన్న ఎగ్ దోశ రుచికి సరిపోకపోవచ్చు, కానీ ఇది నా ప్రయత్నం అంతే. తాజ్ మహల్, శ్రీదేవి, బాల సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎగ్ దోశ ఇవంతా unique pieces, మళ్ళీ సృష్టించడం అసాధ్యం.   

చెత్తగా ఉండే పీజ్జాలు, బర్గెర్స్ ప్రపంచం లో ఏ మూలకు వెళ్లినా దొరుకుతున్నాయ్, కానీ రుచికరమైన ఎగ్ దోశ వాసన చూద్దామన్నా దొరకడం లేదు. కాబట్టి ఇకపై ఆస్ట్రేలియా లోనే కాదు అమెరికా, ఆఫ్రికా, అండమాన్  నుంచి జింబాబ్వే వరకు నా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తా. COVID చేరని places ని కూడా మా మిస్టర్ ఎగ్ దోశ  చేరుతుంది. COVID ప్రపంచాన్ని చుట్టేయడానికి మూడు నెలల టైం పట్టి ఉండచ్చు కానీ నా  'మిస్టర్ ఎగ్ దోశ' సామ్రాజ్యాన్ని ఇంకో ముప్పై రోజుల్లోనే విస్తరిస్తా. 

ఆరు ముప్పై .. 

ఆరు ముప్పై కాదు, ముప్పై రోజుల్లో .. 

నాన్నా, టైం ఆరు ముప్పై అయింది, స్కూల్ కి రెడీ అవ్వాలి.  

అరే మా అమ్మాయి! నిన్ను ఈ స్టేజి మీదకు రానిచ్చారు అని చూస్తిని కదా, నేనున్నది బెడ్ మీద. అంటే  రాత్రి 'మిస్ ఇండియా' సినిమా చూసి పడుకోవడం వల్ల వచ్చిన కలా ఇది?

9, మే 2021, ఆదివారం

వ్యాపార ప్రస్థానం - బీజం

అసలు సిడ్నీ ఓపెరా హౌస్ చూడటమే కలగా ఉంటుంది చాలా మందికి. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకలాంటి చిన్న చిన్న కోరికలు ఉండేవి కావు, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు ఉండేవి. అందులో ఒకటి... పెద్ద ఆడిటోరియం లో ది బెస్ట్ బిజినెస్ మాన్ గా అవార్డు తీసుకుంటానని మూడవ తరగతి లోనే జారిపోతున్న నా నిక్కర్ ని లాకుంటూ, కారుతున్న నా ముక్కును తుడుచుకుంటూ నేను ఒక ఛాలెంజ్ చేశాను. 

ఎక్కడి తాళ్ళ ప్రొద్దుటూరు ఎక్కడి సిడ్నీ...మా ఇంటికి స్కూల్ కి యేరు అడ్డు ఉండేది. చెప్పులకి కాళ్ళు లేకుండా .. సారీ కాళ్లకు చెప్పులు లేకుండా రోజుకు 3 కిలోమీటర్లు ఇంటి నుంచి స్కూల్ కి మళ్ళీ సాయంకాలం స్కూల్ నుంచి ఇంటికి ఆ ఇసుకలో నడవాల్సి వచ్చేది. వానాకాలం లో వానలు వస్తే యేరు పారేది అప్పుడు బట్టలన్నీ విప్పేసి అన్నీ అంటే అన్నీ కాదు కొన్ని విప్పేసి వాటిని స్కూల్ బాగ్ లో పెట్టుకొని దాన్ని నెత్తిన పెట్టుకొని యేరు దాటాక మళ్ళీ బట్టలు తొడుక్కొని వెళ్ళేవాడిని. వర్షాకాలం కష్టాలు ఇలా ఉంటే ఎండా కాలం కష్టాలు మరోలా ఉండేవి. చెప్పులు లేక ఇసుకలో కాళ్ళు కాలిపోయేవి. గొప్ప గొప్ప వాళ్ళ బయోగ్రఫీ/ఆటోబయోగ్రఫీ బుక్స్ లో ఉండే ఇలాంటి కష్టాలు దాటి ఈ స్టేజికి చేరుకున్నాను. అసలు నా వ్యాపార ప్రస్థానం ఎలా మొదలైందో నేను మీకు ఈ  సిడ్నీ ఓపెరా హౌస్ ఆడిటోరియం లో కొన్ని లక్షల మంది ముందు  చెప్పబోతున్నాను. 

ఒక రోజు నేను నా కిష్టమైన 12 వ ఎగ్ దోశ తింటుంటే మా నాన్న వచ్చి 'స్కూల్ లో ఎక్సమ్ రిజల్ట్స్ వచ్చాయట కదా' అన్నాడు. 

'అవును నాన్నా, నేను క్లాస్ లో లాస్ట్ వచ్చాను ' అన్నాను. 

నువ్వు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావ్ అది ముఖ్యం, నువ్వు  లాస్ట్ వచ్చావా ఫస్ట్ వచ్చావా అన్నది అనవసరం అన్నాడు. 

అప్పుడే నేను డిసైడ్ అయ్యాను పెద్ద బిజినెస్ మాన్ కావాలని, అలాగే ఒక పెద్ద ఆడిటోరియం లో ది బెస్ట్ బిజినెస్ మాన్ గా అవార్డు తీసుకోవాలని.    

చదువుతో పాటు నాకు ఎగ్ దోశ మీద ఉండే ప్రేమ కూడా పెరిగింది. జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగాలేకపోయినా మూడుపూటలా  మాత్రల బదులు మూడుపూటలా ఎగ్ దోశే తినేవాడిని. ఒకసారి శ్రీదేవి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. నా వయసు తక్కువని ఇంట్లో వద్దన్నారు. నేను వినకపోతే నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చి ఒక్కటే choose చేసుకోమన్నారు.  నువ్వు శ్రీదేవితో పెళ్ళిని  వదులుకుంటావో లేదా ఎగ్ దోశని వదులుకుంటావో నీ ఇష్టం అంటే బోనీ కపూర్ మీద జాలి, ఎగ్ దోశ మీద నా ప్రేమ, మా ఇంట్లో వారి మీద గౌరవం నన్ను వెనక్కి లాగాయి. 

అలా ఎగ్ దోశ మీద నా ప్రేమ వయసుతో పాటూ పెరుగుతూ వచ్చింది. MCA చదవడానికి  తిరుపతి వచ్చినప్పుడు అక్కడ దొరికే ఎగ్ దోశ రుచికి మరింత అడిక్ట్ అవడంతో అక్కడున్న మూడు సంవత్సరాలు అదే నా బ్రేక్ఫాస్ట్ అయింది. ఎందుకో తెలీదు కానీ అక్కడ దొరికే ఆ ఎగ్ దోశ చాలా రుచిగా ఉండేది. 

ఆ తర్వాత చదువు ముగించుకొని ఉద్యోగ అవకాశాల కోసం బెంగళూరు లో అడుగుపెట్టినప్పుడు మంచి రుచికరమైన ఎగ్ దోశ ఎక్కడా దొరకలేదు. కొన్నేళ్ళకు '99 దోశ' అని స్టార్ట్ చేస్తే ఆశగా అక్కడికి వెళ్ళాను నాకిష్టమైన ఎగ్ దోశ దొరుకుతుందేమో అని. 

రండి సర్ మా దగ్గర రక రకాల దోశలు ఉన్నాయి అని అదేదో సినిమాలో సుత్తి వీరభద్ర రావు చెప్పినట్లు దోశల పేర్లు చెప్పడం మొదలెట్టాడు. 

ప్లెయిన్ దోశ 

పేపర్ దోశ 

ప్లెయిన్ పేపర్ దోశ 

పేపర్ ప్లెయిన్  దోశ

కారం దోశ 

ఎర్ర కారం దోశ 

పచ్చ కారం దోశ

తెల్ల కారం దోశ

కారం పొడి దోశ 

వెల్లుల్లి కారం పొడి దోశ

కారం + కారం పొడి దోశ 

చీజ్ దోశ 

అప్పడం వడ ఆశ దోశ 

నిరోషా దోషా 

తనీషా దోషా

మనీషా దోషా 

భాషా దోషా 

ఆపరా నాయనా, దోశ కి దోషం తగులుతోంది నీ పలుకులలో. ఇవన్నీ వద్దు కానీ ఎగ్ దోశ ఉందా అని అడిగా.  

ఉందని ఎగ్ దోశ ఇచ్చాడు కానీ తిరుపతిలో చూసిన 'ఖుషి' ఆశిస్తే బెంగుళూర్ లో 'జానీ' ఎదురైంది. దోశ లో సరిగ్గా రుచి లేదు కాబట్టే దాని మీద రక రకాల పదార్థాలు వేసి అమ్ముతున్నాడని నాకు అర్థమైంది. 

గతి లేనమ్మకి గంజే పానకం అని ఆ ఎగ్ దోశ తోనే నా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేవాడిని అక్కడ ఉన్నన్ని రోజులు. 

అక్కడ నా ఎగ్ దోశ కు అంటుకున్న దోషం అలా అలా ..... 

3, మే 2021, సోమవారం

బీచ్ కి దారేది?

అది నేను సిడ్నీ లో అడుగుపెట్టిన మొదటి వారం.  నేనుండే ఇంటి దగ్గరే ఒక పెద్ద మాల్ ఉండేది. అదే మాల్ లోంచి రైల్వే స్టేషన్ లోకి డైరెక్ట్ గా వెళ్ళి ట్రైన్ ఎక్కేలాగా ఆ మాల్ ని డిజైన్ చేశారు. ఆఫీస్ కి వెళ్ళడానికి రోజూ అదే మాల్ లోకి వెళ్ళి అక్కడే ట్రైన్ ఎక్కేవాడిని. ట్రైన్ దిగగానే ఎదురుగా మా ఆఫీస్ ఉండేది. భలే కన్వీనియెంట్ గా ఉండేది ఆఫీస్ కి వెళ్లి రావడం... వెళ్ళడానికి 20 నిముషాలు, రావడానికి 20 నిముషాలు. పైగా యెంత భారీ వర్షం పడ్డా ఆఫీస్ కి వెళ్లి రావడానికి గొడుగు కూడా అవసరం పడేది కాదు ఎందుకంటే రూమ్ పక్కనే మాల్/స్టేషన్, మళ్ళీ స్టేషన్ పక్కనే ఆఫీస్ ఉండటం వల్ల. బెంగుళూరు మహాసాగరంలోని ట్రాఫిక్ ఈదుతూ ఆఫీస్ కి వెళ్ళడానికి రెండు గంటలు, రావడానికి మరో రెండున్నర్ర గంట పట్టేది. దాన్ని తలచుకుంటే ఆహా! సుఖం అంటే ఇదే కదా అనిపించేది సిడ్నీ లో, పైగా ఇండియన్ ఆఫీస్ లో లాగా కాకుండా 8 గంటల ఆఫీస్ మాత్రమే ఉండేది. నేను మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 వరకు టైం choose చేసుకున్నా. 

ఒక రోజు ఆఫీస్ నుంచి బయల్దేరుతూ ఇవాళ మాల్ లో కొన్ని వంట సరుకులు  కొనాలి అనుకున్నా. ఆ రోజు ఆఫీస్ లో ఈవినింగ్ స్నాక్స్ పార్టీ ఉండి బయలు దేరేటప్పటికీ సాయంత్రం 5 అయిపోయింది.  ట్రైన్ దిగి మాల్ లోకి ఎంటర్ అయ్యాక చూస్తే షాప్స్ అన్నీ మూసేశారు. అదేంటబ్బా! అప్పుడే మూసేశారు అని ఓపెనింగ్ హవర్స్ చూస్తే 8 AM - 5 PM అని రాసి ఉంది షాప్స్ బయట. వార్నీ, ఇవేమైనా ఆఫీస్లు అనుకున్నారా టంచనుగా మూసేయడానికి? ఇప్పుడు నయం సాయంకాలం 6 వరకు తెరిచి ఉంచుతున్నారు. నేనొచ్చిన కొత్తలో 5 వరకే తెరిచేవారు. 

ఇక అసలు విషయం లోకి వస్తాను. మాల్లో ఒక చోట బోర్డు ఉండేది. స్టేషన్ కి దారి ఇటు, బీచ్ కి దారి అటు అని. భలే భలే, మాల్ లోంచి స్టేషన్ కి కనెక్ట్ చేసినట్లు, మాల్ నుంచి బీచ్ కి కూడా కనెక్షన్ పెట్టినట్లున్నారు ఈ తెల్లోళ్ళు అనుకున్నా. బీచ్ లు ఆస్ట్రేలియా లో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా ఉంటాయని విన్నాను కానీ మరీ ఇంత దగ్గరగా ఉందా నేనుండే ప్లేస్ కు అనుకున్నా? మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలని అనుకోని ఈ వీకెండ్ బీచ్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయా. అనుకున్నట్లే శనివారం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరా. తీరా వాడు దారి చూపెట్టిన వైపు వెళ్ళానా అక్కడ చూస్తే ... అదో షాప్ పేరు అని అర్థమై నా తెలివి తక్కువ తనానికి నేనే సిగ్గుపడి ఇప్పటి వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. మీరూ ఎవ్వరికీ చెప్పకండి ప్లీజ్.  

27, ఏప్రిల్ 2021, మంగళవారం

గరిటెడైన చాలు గంగి గోవు పాలు..

ఈ ప్రపంచంలో మీకిష్టమైన సిటీ ఏమిటి? అని అడిగితే 'పబ్లిసిటీ' అని సమాధానం ఇస్తాడు. ఊరందరిదీ ఒక దారైతే ఇతనిది మరో దారి. మీకీపాటికే అర్థం అయి ఉంటుంది ఆ ఉలిపి కట్టె ఎవరో.

'శివ' సినిమా ఏడవ తరగతి లో చూశాను (నా వయసెంత ఉండచ్చు అని లెక్కలెయ్యకండి ఇప్పటిప్పుడు నా  వయసు ఇంకా... అని తక్కువ చెప్పుకోవడానికి నేనేమైనా హీరోయిన్నా?  వయసు దాచుకోవడానికి ఏముంది జస్ట్ మొన్నే ముప్పై దాటింది) శివ సినిమా అప్పుడు పెద్దగా నచ్చలేదు ఆ తర్వాత ఎప్పుడూ చూడాలని అనిపించలేదు. స్కూల్ డేస్ లో కాబట్టి ఆ కాలేజీ గొడవలు ఆ మాఫియా నచ్చలేదు నాకు. 

ఆ తర్వాత వచ్చిన క్షణక్షణం మాత్రం బాగా నచ్చింది, శ్రీదేవి యాక్టింగ్ వల్ల అనుకుంటా. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వర్మ ఫోకస్ అంతా శ్రీదేవి మీదే ఉండేదట. 

ఏదో ఒక సాంగ్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ..  ఓకే, అంతా బాగా వచ్చింది ప్యాకప్ అన్నారట వర్మ గారు.  

డాన్స్ స్టెప్ సరిగ్గా కుదరలేదండి అన్నారట డాన్స్ మాస్టర్. 

ఇదిగో అద్భుతంగా కుదిరింది కదా అన్నారట వర్మ. 

మీరు శ్రీదేవి డాన్స్ మాత్రమే చూస్తున్నారు, కాస్త వెంకటేష్ గారి డాన్స్ స్టెప్ ని చూడండి సింక్ అవ్వట్లేదు మిగతా వారితో అన్నారట ఆ డాన్స్ మాస్టర్. 

మనలో మన మాట.. ఈ డాన్స్ మూవ్మెంట్స్ లో నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ విషయంలో ఇలాంటివి ఎన్ని సార్లు జరిగి ఉంటాయో.  అల్లరి ప్రియుడు షూటింగ్ టైం లో రాజశేఖర్ డాన్స్ కి మిగతా డాన్సర్స్ డాన్స్ కి ఎంతకీ సింక్ కుదరక రాజశేఖర్ ఎలా చేస్తాడో మీరు అలాగే చేయండి అని గ్రూప్ డాన్సర్స్ తో డాన్స్ మాస్టర్ అన్నాడని అప్పుడెప్పుడో విన్నట్లు గుర్తు. 

క్షణక్షణం తర్వాత కొన్ని మంచి సినిమాలు, కొన్ని ప్లాప్ సినిమాలు తీసి ఆ తర్వాత గోవిందా గోవిందా అంటూ తెలుగుకు గుడ్ బై చెప్పేసి ముంబై కి వెళ్ళాడు.  ఎలాగోలా సినిమాలు తీసి బతికేద్దాం అని కాదు ఎలాంటి సినిమాలు తీయొచ్చో చూపించడానికి. రంగీలా, సత్య, సర్కార్, కంపెనీ అంటూ ఒక ట్రెండ్ సృష్టించాడు. ఆ తర్వాత పతనం తెలిసిందే. 

'గరిటెడైన చాలు గంగి గోవు పాలు కడివెడైన నేమి ఖరము పాలు' అనే మాట మరచి  మీ ఖర్మ చూడండి ఈ వర్మ సినిమాలు అని కుప్పలు తెప్పలుగా సినిమాలు తీస్తున్నాడు. అలా తీయడంలో అర్థం లేదని ఆయనకీ తెలిసే ఉంటుంది కాకపోతే దీపం ఉండేలోపే ఇల్లు చక్క బెట్టుకోవాలని అనుకుంటున్నాడేమో. 

కానీ ఒక్కటి మాత్రం నిజం, తనలో టాలెంట్ కి కొరత లేదు, అదే లేకపోతే బాలీవుడ్ లో అన్నేళ్ళు డైరెక్టర్ సీట్ లో కూర్చోలేడుగా, ఒక తెలుగోడు వెళ్ళి బాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు తన జెండా పాతి అక్కడ పాగా వేయాలంటే మాటలా? యెంత మంది కొత్త వారిని యాక్టర్స్ గా, డైరెక్టర్స్ గా ఇండస్ట్రీ లోకి తీసుకురాలేదూ? కాకపోతే ప్రతీ ఒక్కరిలో ఏ మూలో ఉండే వేపకాయంత వెఱ్ఱి అతన్ని డామినేట్ చేస్తూ ఉండచ్చు ఇప్పుడు. లేదా అతని calculations అతనికి ఉండచ్చు. 

చిన్నప్పుడు మొదట్లో బాగా చదివి ఆ తర్వాత సరిగ్గా చదువుకోకపోతే 'రాను రాను రాజు గారి గుఱ్ఱం గాడిద అయ్యిందట' అనేవారు పంతుళ్ళు. అప్పుడు ఆ సామెత పెద్దగా అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు లైవ్ example చూశాక బాగా అర్థమైంది.

ఈ సోది అంతా ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఎప్పుడో సినిమా షూటింగ్ అయిపోయినా బయ్యర్లు ఎవరూ రాక లేటుగా రిలీజ్ చేసిన పట్టపగలు/దెయ్యం సినిమా చూడటమే కారణం. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడం చూశాం గానీ, అంత మంచి సినిమాలు తీసి ఇప్పుడు పట్టపగలు/దెయ్యం లాంటి చెత్త సినిమాలు తీయడం ఏంటో? తన సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో వర్మకి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. జనాల ఫోకస్ తన పట్టపగలు/దెయ్యం సినిమా మీదకు రావాలనేమో మళ్ళీ పవన్ కళ్యాణ్ కి సోకిన కరోనా మీద కామెంట్స్ చేసినట్లు ఉన్నాడు. ఎద్దు పుండు కాకి కి రుచి అన్నట్లు చచ్చిన పాము లాంటి పవన్ కళ్యాణ్ ని పొడుచుకు తింటూ ఉంటాడు అప్పుడప్పుడూ.  

చిన్నప్పుడు అవ్వ/తాత చెప్పే కథల్లో ఉత్తరం దిక్కుకి వెళ్ళకూడదు అనే రూల్ ఉంటుంది. అరె, ఎందుకు వెళ్ళకూడదు అని పట్టు పట్టి మరీ కథానాయకుడు అటు వైపే వెళ్తాడు. అలా వర్మ సినిమాలు చెత్త అని తెలిసి కూడా అవే చూస్తూ ఉంటాను కుక్క తోక వంకర లా. 

వర్మ సినిమాలకి ఎవరో ఒకరు రెడీ గా ఉంటాడు కొనడానికి, దీనికి మాత్రం ఎవరూ ముందుకు రాకపోవడం ఏమిటి? ఫామ్ లో లేని రాజశేఖర్ హీరో అవ్వడం, తక్కిన వర్మ సినిమాల్లో లాగా exposing చేసే హీరోయిన్ లేకపోవడమా, ఏమో మరి ఆ వర్మకే తెలియాలి. 

ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి/ఉలిపి కట్టెది /ఉలికి పిట్టది ఒక దారి అంటారు కదా. ఈ ఉలిపిరి/ఉలిపి కట్టె/ఉలికి పిట్ట లలో ఏది కరెక్ట్? అసలు ఈ కట్టె కథేమిటి, దానిది ఎందుకు మరో దారి? 

ఈ ప్రశ్నలకి జవాబులు తెలిసీ చెప్పకపోతే గత నాలుగైదు ఏళ్లలో వర్మ తీసిన సినిమాలు వరుసబెట్టి చూసే పరిస్థితి మీకు వస్తుంది జాగ్రత్త. 

22, ఏప్రిల్ 2021, గురువారం

వకీల్ సాబ్ - మండేలా

పోయిన వారం 3 సినిమాలు చూశాను. థియేటర్ లో రెండు, ఇంట్లో ఒకటి . దాదాపు 3 సంవత్సరాల తర్వాత థియేటర్ లో సినిమా చూడటం ఇప్పుడే. 

పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది అంటే ఫస్ట్ రోజే చూడాలి అనే అభిప్రాయం 'తొలిప్రేమ' సినిమాతో మొదలైంది. పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా అది అలాగే ఉంటూ వచ్చింది. పైగా ఇక్కడ సిడ్నీ లో మొదటి రోజు టికెట్స్ దొరకడం కష్టం కాదు కాబట్టి వెళదాం అనుకున్నా. కాకపొతే చిన్న ఇబ్బంది మా పిల్లలతో. వాళ్ళు సినిమా చూడరు, నన్ను చూడనివ్వరు కాబట్టి వాళ్ళను కింద తెలిసిన వాళ్ళింట్లో వదిలేసి వెళ్ళాము. వాళ్ళ పిల్లలు మా ఇంట్లో, మా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అది సమస్య కాలేదు. 

వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ హాఫ్ లో కాసిన్ని అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి గానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఇక పవన్ కళ్యాణ్ కి ఫైట్స్ లాంటివి ఉండకపోతే మరీ 'గోపాలా గోపాలా' సినిమాలో  లాగా అభిమానులను  నిరాశ పరచాల్సి వస్తుంది కాబట్టి అవి తప్పని సరి తద్దినాలే. 'ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్' అన్నట్లు టాక్ బాగానే వచ్చినా covid ఎఫెక్ట్ పడి కలెక్షన్స్ దెబ్బ తిన్నాయి అంటున్నారు మరి. 

సినిమాకి మేము మాత్రం వెళ్ళి, పిల్లలను తీసుకుపోలేదు అని గిల్టీ ఫీలింగ్ వచ్చి నెక్స్ట్ రోజు ఏ సినిమాకి వెళ్దాం అని పిల్లల్ని అడిగితే 'Peter Rabbit 2' అన్నారు. కార్టూన్ సినిమాలు చూడటం మా ఆవిడకు పెద్దగా ఇష్టం లేకపోయినా పిల్లలతో కలిసి తనూ వచ్చింది. మొదట్లో మీరు ముగ్గురు సినిమాకి వెళ్ళండి, ఆ 2 గంటల్లో నేను మాల్లో షాపింగ్ చేస్తూ ఉంటాను అంది. ఒక 100 డాలర్లు ఖర్చు అనుకున్నా కానీ, తర్వాత సినిమాకి వస్తాను అనడంతో 20 డాలర్స్ తోనే సరిపోయింది :)

ఇక ఇంట్లో చూసిన సినిమా 'మండేలా'. కాస్త రియలిస్టిక్ మూవీ చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. ఎలక్షన్స్ మీద, ప్రత్యేకించి తమిళనాడు ఎలక్షన్స్ మీద సెటైరికల్ గా తీసిన సినిమా. ప్రముఖ కమెడియన్ యోగి బాబు హీరోగా నటించిన ఈ సినిమా చూద్దామా? వద్దా? అని కాస్త ఆలోచించి చూశాను. ఎందుకంటే కమెడియన్స్ హీరోగా చేసినప్పుడు వాళ్ళకు సరిపోయే సినిమాలు చేయకుండా కాస్త ఎక్స్ట్రా చేస్తుంటారు. సరే కాసేపు చూద్దాం ఎలా ఉంటుందో అని మొదలెట్టా. సినిమా చూసిన తర్వాత అనుకున్నా 'టైలర్ మేడ్ క్యారెక్టర్' అంటారే సినీ పరిభాషలో సరిగ్గా అతనికి సరిపోయే సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు. 

వీలయితే ఈ సినిమా చూడండి, బాగుంటుంది. మొదటి 15-20 నిముషాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ ఒక్కసారి కథ మొదలయ్యాక ఇంట్రస్ట్ పెరుగుతుంది. అరచుకోవడాలు, మెడ రుద్దుకోవడాలు, తొడలు గొట్టే హీరోయిజాలు మచ్చుకైనా కనిపించవు. మంచి మంచి లొకేషన్స్, కేవలం పాటల కోసం వచ్చి ఆ తర్వాత పక్కకు వెళ్లిపోయే అందమైన హీరోయిన్, 'నేనేమో తెల్ల రంగీలా నువ్వేమో నల్లటి మండేలా' లాంటి వెకిలి పాటలు ఆశించేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు.

ఈ ''మండేలా'' సినిమా టైటిల్ విని నెల్సన్ మండేలా మీద తీసిన ఇంగ్లీష్ సినిమా ఏమో అని కొంతమంది పొరపడే ఛాన్స్ ఉంది. ఒక చిన్న జోక్ గుర్తొస్తోంది దీని మీద. 

ఒక ఆస్ట్రేలియన్ డైరెక్టర్ 'టెండుల్కర్' అని పేరు పెట్టి సినిమా తీసి ఇండియా లో రిలీజ్ చేశాడట. ఆ సినిమా మొదటి ఆట చూసిన ఒక వ్యక్తి ఆ డైరెక్టర్ ఫోన్ నెంబర్ దొరకబుచ్చుకొని 'టెండుల్కర్' అని పేరు పెట్టి మా సచిన్ టెండుల్కర్ మీద కాకుండా ఏదో కథ పెట్టి తీసారే అన్నాడట. అప్పుడా డైరెక్టర్ మీరు మాత్రం 'బోర్డర్' అని పేరు పెట్టి మా ఆస్ట్రేలియన్  క్రికెట్ 'అలెన్ బోర్డర్' మీద కాకుండా యుద్ధం మీద సినిమా తీస్తే నాకెంత కాలి పోయి ఉండాలి అన్నాడట. 

జస్ట్ ఫర్ ఫన్, ఇదే  'మండేలా' సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ని పెట్టి తీస్తే  పింక్ రూపు రేఖలు మారిపోయి వకీల్ సాబ్ అయినట్లు మండేలా రూపు రేఖలు మారిపోయి చెగువేరా తయారు అవుద్దేమో??

ఈ బ్లాగ్ లో కంటెంట్ ఏమిటి? బ్లాగ్ టైటిల్ ఏమిటి? బ్లాగ్ టైటిల్ చూసి ఇదేదో వెరైటీ అండ్ ఇంటరెస్టింగ్ టాపిక్ అనుకొని ఎవరైనా చదివి టైం వేస్ట్ చేసుకొని ఉండచ్చు. కాకపోతే సరైన టైటిల్ ఏదీ దొరక్క అలా టైటిల్ పెట్టేశాను. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్న వారికి క్షమాపణలు. 

18, మార్చి 2021, గురువారం

సరదాకి....ఇవాళ్టి జోకులు

ఇవాళ ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వస్తూనే అన్నం పెడితే తింటూ, నాన్నా! ఇవాళ ఇల్లు ఎందుకంత సైలెంట్ గా ఉందని అడిగింది మా పిల్లల్లో పెద్దదైన అమ్మాయి. 

మీ అమ్మ లేదు ఇంట్లో, అందుకే అన్నాను నవ్వుతూ. 

సర్లెండి, నేను మాట్లాడేది పైన నేనన్న జోక్ గురించి కాదు. ఇవాళ మా పిల్లలు చెప్పిన జోక్స్ గురించి. మా అమ్మాయికి వాళ్ళ స్కూల్లో ప్రతీ వారం ఒక స్కూల్ మ్యాగజైన్ ఇస్తారు అందులో జోక్స్, పజిల్స్, కథలు భలే బాగుంటాయి. ఇవాళ ఇచ్చిన మ్యాగజైన్ లో ఒక జోక్ చదివి చెప్పింది మా అమ్మాయి. 

ఒక వ్యక్తి వచ్చి కుర్చీ లో కూర్చొని  'నా టేబుల్ కి ఒక ప్లేట్ ఫిష్&చిప్స్  పంపిస్తారా?' అంటాడు. 

'హేయ్, ఇది లైబ్రరీ' అంటాడు ఆ లైబ్రేరియన్. 

కుర్చీలోంచి ఆ వ్యక్తి లేచి ఇతని దగ్గరగా వచ్చి చెవిలో 'నా టేబుల్ కి ఒక ప్లేట్ ఫిష్&చిప్స్  పంపిస్తారా?' అని శబ్దం లేకుండా చెప్తాడు. 

నాకు ఆ జోక్ నచ్చి నవ్వి, నైస్ జోక్ అన్నాను. దానికి మా అయిదేళ్ళ బుడ్డోడికి ఇగో హర్ట్ అయి నేనొక జోక్ సారీ ఒక question  అడుగుతాను, ఆన్సర్ చెయ్యండి అన్నాడు. 

కౌబోయ్ సూపర్ హీరో మూన్ ని ఎందుకు డస్ట్ బిన్ లో వేశాడు?

ఎందుకంటే అతనికి మూన్ అంటే ఇష్టం లేదు అందుకు అన్నాడు. 

సరే, బాగుంది అన్నాను తనని సంతోషపరచడానికి. 

'ఒక సూపర్ rat అదే మూన్ ని డస్ట్ బిన్ లోంచి బయటికి తీసి తినాలని ట్రై చేసింది. ఎందుకు?' అని  అడిగాడు మళ్ళీ వాడే. 

ఆ పిచ్చి ఆన్సర్ కూడా నువ్వే చెప్పు అన్నాను.  

'ఆ మూన్ యెల్లో కలర్ లో కనపడేసరికి దాన్ని చీజ్ అనుకొని ఆ సూపర్ rat తినాలని ట్రై చేసింది' అన్నాడు. 

యేవో కాసిన్ని పిచ్చి కబుర్లు ఏదో ఒకటి రాయాలనిపించి రాశాను. 

విషయానికి వస్తే ఇక్కడ సిడ్నీ లో గత ఐదు రోజులుగా వర్షాలు తెగ కురుస్తున్నాయి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు! కుండ పోత వర్షాలు అంటారు కదా అలా. అవును! కుండ పోత వర్షం అంటే కుండతో పోసినట్లుగా అనా? ఎవరైనా తెలిసిన వారు సరి చేయండి. 

నెక్స్ట్ వీక్ కూడా వర్షాలు ఇలాగే కురుస్తాయట. predictions తప్పైతే బాగుండు లేదంటే బయటికి వెళ్లాల్సి వస్తే ఇలా వెళ్ళాలి 

    
                                                            ఇమేజ్ సోర్స్: గూగుల్ 

15, మార్చి 2021, సోమవారం

అమెరికన్ హిస్టరీ లో ఒక ప్రమాదకరమైన మహిళ -2

గత పోస్ట్ కి కొనసాగింపు.. 

ఆ తర్వాత George, Mary పని చేసిన 8 ఫ్యామిలీస్ ని enquire చేస్తే అందులో 7 ఫ్యామిలీస్ లోని వ్యక్తులు  టైఫాయిడ్ ఫీవర్ బారిన పడ్డారని తెలిసింది. చివరికి Mary ని ఆవిడ బాయ్ ఫ్రెండ్ సాయంతో కలుసుకొన్నాడు. టైఫాయిడ్ ప్రతీ చోటా ఉందని దాని వ్యాప్తికి తాను కారణం కాదని వాదించింది. చివరికి పోలీసులు కూడా ఆ విషయంలో కలుగజేసుకొని ఆవిడతో యూరిన్ సాంపిల్స్ ఇవ్వడానికి ఒప్పించారు.  సేకరించిన యూరిన్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే ఆమె Gallbladder టైఫాయిడ్ వ్యాప్తి చేసే ఇన్ఫెక్షన్ సెంటర్ అని తెలిసింది. ఆవిడ పుట్టినప్పుడే ఆమె Gallbladder లో ఈ టైఫాయిడ్ లక్షణాలు ఉండి ఉండచ్చని నిర్ధారించారు. ఆవిడ వంట వండే ముందు చేతులు కడుక్కునేది కాదని ఆమెని enquire చేస్తే తెలిసింది. 

1907 లో ఆమెని ఒక ఐలాండ్ కి తరలించి quarantine లో ఉంచారు. కొన్ని వారాల తర్వాత కూడా Gallbladder లో లక్షణాలు తగ్గకపోయేసరికి దాన్ని తీసేయాలని అనుకున్నారు కానీ ఆమె నిరాకరించడంతో వెనక్కి తగ్గారు వైద్యులు. అప్పట్లో Gallbladder తీయడం అన్నది చాలా ప్రమాదకరమైనదని, కొంతమంది మరణించారని కూడా ఆవిడ వాదించింది. తను వంట మనిషిగా పని చేయడం మానేస్తే వదిలేస్తామని చెప్పినా ఆవిడ అందుకు నిరాకరించింది, ఎందుకంటే ఆ పని అప్పట్లో కాసులు కురిపించేది కాబట్టి. 

కొంతమంది వైద్య నిపుణులు కూడా ఆవిడని అలా quarantine లో ఉంచడం సరి కాదని ఆవిడకి సపోర్ట్ చేశారు. చివరకి 1910 లో వంట మనిషిగా పని చేయడం మానేస్తానని ఆవిడతో ఒక అఫిడవిట్ లో సంతకం చేయించుకొని వదిలేశారు. 

ఆవిడని quarantine నుంచి బయటకి పంపి, బట్టలు ఉతికే పని ఇప్పించారు. అప్పట్లో వంట పనికి నెలకు 50$ ఇస్తే బట్టలు ఉతికే పనికి 20$ మాత్రమే ఇచ్చేవారు. ఆవిడ అయిష్టం గానే దానికి ఒప్పుకుంది. కొన్ని సంవత్సరాలకి పేరు మార్చేసుకొని ఇళ్ళలో కాకుండా రెస్టారెంట్స్, హోటల్స్ లాంటి చోట మళ్ళీ వంట పనికి చేరింది. చేరిన ప్రతీ చోటా అక్కడ పని చేసేవారికి, అక్కడ తిన్నవారికి టైఫాయిడ్ లక్షణాలు బయట పడేవి. కాకపోతే ఎక్కడా ఎక్కువ రోజులు పని చేసేది కాదు కాబట్టి ఆవిడ మీద ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. 

ఆ తర్వాత 1915 లో ఒక హాస్పిటల్లో వంట పనికి కుదిరింది. అక్కడ పనిచేసేవారిలో కొంత మందికి టైఫాయిడ్  సోకడమే కాక, ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ఆ హాస్పిటల్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ చేయమని George ని పిలిపించారు. Mary తన రూపు రేఖలు మార్చుకున్నా ఆవిడ చేతి రాతని బట్టి గుర్తు పట్టగలిగాడు George. మళ్ళీ ఆవిడని అదే ఐలాండ్ కి తరలించి quarantine లో ఉంచారు. 

కొన్నేళ్ళకి అక్కడే ఒక టెస్టింగ్ ల్యాబ్ లో పని చేసే ఉద్యోగం ఇప్పించారు. అలా తన జీవితం అక్కడే ముగిసిపోయింది. చివరికి ఆవిడ 'టైఫాయిడ్ మేరీ' గా చరిత్ర లో నిలిచిపోయింది. తను విలనా, విక్టిమా అంటే తేల్చడం ఇప్పటికీ కష్టమే అంటారు కొందరు. 

సరే, ఈ పోస్ట్ లో తెలుసుకోవాల్సిన లేదంటే ఉపయోగపడే విషయం ఏమైనా ఉందా అంటేఏం లేదనే చెప్పొచ్చు. ఏదో టైం పాస్ కోసం అంతే, లేదంటే వంట మనుషులతో జాగ్రత్త అని చెప్పొచ్చు. 

నాకు హిస్టరీ పెద్దగా తెలీదని నేను రాసిన బ్లాగ్స్ చదివే మీకు తెలిసే ఉంటుంది, మరి ఈ విషయం ఎక్కడ తగిలిందని అనుకుంటున్నారా? PTE లో ఇది ఒక పాపులర్ question, అందుకే గుర్తు ఉండిపోయింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అవి ఇంకోసారి బ్లాగ్ లో రాస్తాను. 

11, మార్చి 2021, గురువారం

అమెరికన్ హిస్టరీ లో ఒక ప్రమాదకరమైన మహిళ -1

ఎప్పుడూ సరదా కబుర్లు, కథలు కాకుండా ఇవాళ కాస్త హిస్టరీ లోకి తొంగి చూద్దాం. 

Quarantine అనేది ఎప్పటినుంచో ఉన్నా, COVID స్టార్ట్ అయిన తర్వాత బాగా వింటున్నాం. అనారోగ్యం పాలైన వారిని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని లేదంటే అంటు రోగాల బారిన పడ్డ వారిని కాస్త దూరంగా ఉంచడమే ఈ Quarantine ముఖ్య ఉద్దేశ్యం. 

లాటిన్ భాషలో Quarantine అనేది forty అనగా 40 నుంచి వచ్చిందని గూగులమ్మ చెబుతోంది. ఈ పదాన్ని వెనిస్ లో మొదటి సారిగా వాడారట.  సుదూర తీరాల నుంచి షిప్ లో ప్రయాణించి వచ్చిన వారిని తీరం దగ్గరే 40 రోజుల పాటు ఉంచేవారు, ఆ తర్వాతే వారిని ఆ ప్రాంతం లోకి అడుగుపెట్టనిచ్చేవారు. 

తరచుగా విదేశీ యానం చేసేవారు ఎయిర్పోర్ట్ లో ఈ పదం వింటూ ఉంటారు. పర దేశాల్లో ఉప్పు కూడా ఎక్కువ రేట్ ఉంటుందేమో లేదంటే మన దేశ ఉప్పు మాత్రమే కొనాలన్న ఉక్కు సంకల్పమో తెలీదు కానీ ఉప్పుతో పాటు ఒక చిన్నపాటి provision స్టోర్ నే :) మనం వేరే దేశానికి తీసుకెళ్ళినప్పుడు ఆ దేశ ఎయిర్పోర్ట్ లో Quarantine అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. 

ఓల్డెన్ డేస్ లో మశూచి, మలేరియా లాంటి అంటు వ్యాధులు ప్రభలినప్పుడు ఈ పదం బాగా వినపడుతూఉండేది.   1980-2000 మధ్యలోరకరకాల వాక్సిన్స్, యాంటీబయాటిక్స్ వచ్చేశాక ఈ Quarantine అనేది కాస్త తగ్గింది.  మళ్ళీ ఈ covid రాకతో ఈ పదం బాగా పాపులర్ అయ్యిందిగత సంవత్సర కాలంలో. 

ఇక అసలు విషయానికి వస్తే, 1869 లో cookstown లో పుట్టిన Mary Mallon అనే ఐరిష్ మహిళ గురించే నేను ఈ బ్లాగ్ లో మాట్లాడబోయేది. తనకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఐర్లాండ్ వదలి అమెరికా లో అడుగుపెట్టింది. మొదట్లో పని మనిషి గానే తన అవతారం ఎత్తినా, cookstown అనే పుట్టిన ఊరి పేరు సార్థకం చేయడానికా అన్నట్లు ఆ తర్వాత వంట వృత్తిని ఎంచుకుంది. అప్పట్లో ఇంట్లో వంట పనులు చేసేవారికి  జీతాలు కూడా ఎక్కువగా ఉండటం ఒక కారణం అవ్వచ్చు ఆవిడ ఆ పని మొదలు పెట్టడానికి.  

1900 టైం లో వంట మనిషి గా ఒక కుటుంబంలో పనికి కుదిరింది. తను వంట చేయడం మొదలుపెట్టిన రెండు వారాల్లోనే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డారు.  ఆ తర్వాత అక్కడ పని వదలి పెట్టి వేరే టౌన్ కి మకాం మార్చి అక్కడ ఇంకొకరి ఇంట్లో వంట పని స్టార్ట్ చేసింది. అక్కడా ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు టైఫాయిడ్ బారిన పడ్డారు అంతే కాకుండా వారింట్లో పనిచేసే బట్టలు ఉతికే ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ పని మానేసి ఒక లాయర్ ఇంట్లోకి మకాం మార్చింది. వారి ఇంట్లో కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. అలా ఓ ఏడెనిమిది ఇళ్ళలో జరిగింది. 

1907 లో Charles Warren అనే వ్యక్తి ఇంట్లో పనిచేసేప్పుడు వారి ఒక్కగానొక్క కూతురు టైఫాయిడ్ symptoms తో చనిపోయింది. సాధారణంగా ఈ టైఫాయిడ్ అనేది శుభ్రంగా లేని పరిసరాలలో వ్యాపిస్తుంది కానీ ఇంత మంచి ఏరియా లో ఇంత నీట్ గా ఉండే ఇంట్లో ఉన్న వారికి ఈ జబ్బు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి Charles Warren ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని  George Albert Soper II అనబడే ఒక శానిటేషన్ ఇంజనీర్ ని ఇన్వెస్టిగేషన్ లోకి దించాడు.

టైఫాయిడ్ అనేది కలుషితమైన నీరు లేదంటే కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఈ వ్యాధి సోకడానికి ఒకే దారి ఇంట్లో పని చేసేవారే అయి ఉండచ్చు అనే కోణం లో మొదలైన దర్యాప్తు... తీగ పట్టి లాగితే డొంకంతా కదిలినట్లు వంట మనిషి అయిన Mary Mallon దగ్గరికి చేర్చింది. ఎక్కడెక్కడ ఏ ఫ్యామిలీ టైఫాయిడ్ బారిన పడ్డారో వారిని ఇన్వెస్టిగేట్ చేస్తే దీనికి మూల కారణం Mary అయి ఉండొచ్చని confirm చేసుకున్నాడు. కాకపోతే అప్పటికే Mary ఆ ఇంటిని, ఆ ప్రాంతాన్ని వదిలేసి తనెక్కడికి మకాం మార్చిందో ఎవ్వరికీ తెలీకుండా ఆనవాళ్ళులేకుండా చేసింది. 

                                                    Photo from the Google 

అదే సమయంలో Park Avenue లో ఉండే ఒక ఫ్యామిలీ లో ఈ టైఫాయిడ్ లక్షణాలు కనపడ్డాయని విన్న George అక్కడికి వెళ్ళి  అక్కడ వంట మనిషిగా ఉన్న Mary ని పట్టుకున్నాడు. అప్పుడావిడ అక్కడే కిచెన్ లో అందుబాటులో ఉన్న carving fork అందుకొని బెదిరించి పారిపోయింది. 

తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పోస్ట్ లో .. 

8, మార్చి 2021, సోమవారం

ఎవడ్రా! covid దెబ్బకి టూరిజం ఇండస్ట్రీ పడిపోయింది అన్నది?

'ఈస్టర్ వస్తోంది కాబట్టి పిల్లల స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి పైగా 4 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సో, ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం' అంది మా హోమ్ మినిస్టర్. 

'ప్రేమ యాత్రలకి బృందావనము, నందనవనము ఏలనో, కులుకులొలుకు చెలి చెంత నుండగా వేరే స్వర్గము ఏలనో' అని అక్కినేని వారి స్టైల్ లో పాట అందుకున్నా. 

ప్రేమ యాత్రల టైం ఎప్పుడో అయిపోయింది ఇది కుటుంబ యాత్ర కాబట్టి వెళ్ళి తీరాల్సిందే. పైగా మన పక్కింటి పెన్నీ వాళ్ళు  (పిన్ని కాదు పెన్నీ అనబడే తెల్ల దొరసాని) పది నెలల శాలరీ ఖర్చు పెట్టి అటెటో వెళ్లొచ్చారు, వెనకింటి విన్నీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళు తాకట్టులో పెట్టి మరీ ఎటెటో వెళ్ళి వచ్చారు, కాబట్టి డబ్బులు లేకపోయినా నిన్ను నువ్వు తాకట్టు పెట్టేసుకొని అయినా మమ్మల్ని తీసుకెళ్ళాల్సిందే అంది శుభలగ్నం సినిమాలో ఆమని ని గుర్తుచేస్తూ. 

సరే తప్పుతుందా అని ట్రిప్ ప్లాన్ చేసి accommodation కోసం వెతుకుతుంటే దొరకట్లేదు. నిన్న సాయంకాలం 6 కి మొదలెడితే రాత్రి 12 అయింది ఓ రెండు రోజులు ట్రిప్ కి  accommodation బుక్ చేయడానికి. ఎక్కడ చూసినా సోల్డ్ అవుట్ అనే బోర్డ్స్ వెక్కిరించాయి. ఏదో కాస్త డబ్బులు మిగిల్చి ఇంకో ఇళ్ళు ఎక్కువ కట్టుకుందాం అనే తెలివి తేటలు లేవు ఈ తెల్లోళ్ళకి, సెలవలు స్టార్ట్ అవడం ఆలశ్యం పొలోమని ట్రిప్ లకి ఎల్లిపోతారు. మురళి మోహన్ ఇంటర్వ్యూ చూపించాలి ఈ దేవుడి బిడ్డలకి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా ఇన్వెస్ట్ చేయాలో. జన్మకో శివరాత్రి అన్నట్లు ఎప్పుడో ఒక సారి ఇలా ట్రిప్ ప్లాన్ చేస్తాను, నేను అనుకున్న బడ్జెట్ లో  accommodation దొరకదు, దొరికే చోట నా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ బుక్ చేసుకోవాల్సి వస్తోంది, ఆ రేంజ్ లో వాయగొడుతున్నారు రేట్లు. టూరిజం ఇండస్ట్రీ మళ్ళీ కాసులు కురిపిస్తోంది. ఎవడ్రా! covid దెబ్బకి టూరిజం ఇండస్ట్రీ పడిపోయింది అన్నది? వాడు కనపడాలి వాడికి అల్లుడు అదుర్స్ సినిమా రెండు సార్లు చూపించాలి. ఒక్కసారి చూసిన పాపానికే నేనింకా ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకోలేదు సినిమా చూసి నెల దాటినా. 

మొత్తానికి, నిన్న అర్ధరాత్రి అయ్యేప్పటికి నా బడ్జెట్ లో ఓ రెండు రోజులకి accommodation దొరికేసింది, ఇంకో రెండు రోజులకి దొరికిచ్చుకోవాలి. మళ్ళీ ఈ రోజు ఏ మిడ్నైట్ అవుతుందో అవి బుక్ చేయడానికి. ఏవీ దొరక్కపోతే ఇదిగో ఇలా సైట్ బుక్ చేసుకొని ఒక టెంట్ వేసుకొని పడుకుందాం అనుకుంటే అవి కూడా బుక్ అయిపోయాయి.  


టూరిస్ట్ స్పాట్ నుంచి ఒక 100 కిలోమీటర్లు అటో ఇటో వెదకాలి accommodation దొరకబుచ్చుకోవడానికి. 

చెప్పడం మరిచిపోయా, నేను accommodation బుక్ చేసుకున్న చోట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఈత రాకపోయినా సరే అంత డబ్బులు కట్టినందుకైనా అందులో దిగి ఈత కొట్టినట్లు ఒక ఫోటో తీసుకోవాలి (పిల్ల చేష్టలు పోలేదు ఇంకా). డ్రైవింగ్ నేర్చుకునే పని అయిపోయింది కానీ స్విమ్మింగ్ నేర్చుకోవడం అన్నది ఇంకా పెండింగ్ లో ఉండిపోయింది ఈ పని ఎప్పుడు మొదలెడతానో ఏమిటో ... 

3, మార్చి 2021, బుధవారం

సరదాకి ఓ చిన్న కథ

అనగనగా ఓ పేద్ద గవర్నమెంట్ ఆఫీస్.  ఓ రోజు రాత్రి ఏదో పని మీద ఆ ఆఫీస్ తలుపులు తెరిచినప్పుడు ఒక పులి లోపలికి దూరింది. దూరాక బయటికి ఎలా వెళ్లాలో తెలీక మనుషులు వస్తున్న అలికిడి విని కాస్త పిరికి పులి అవ్వడం వల్ల బాత్రూములో ఒక మూలగా ఉండే చీకటైన స్టోరేజ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కుంది.  

మరుసటి రోజు తెల్లారి ఆఫీస్ మొదలయ్యాక  అప్పుడొకరు అప్పుడొకరు  బాత్రూములోకి వచ్చి వెళ్తున్నారు. బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది దాంతో పులికి  ఆకలి మొదలైంది. భయంతో బిక్కు బిక్కుమంటూ ఆ చీకటి గది లోనే ఉండిపోయింది కానీ బయటికి వచ్చే ధైర్యం చేయలేక పోయింది. మధ్యాహ్నం దాటే పాటికి ఆకలి ఎక్కువైంది కానీ మళ్ళీ భయంతో బయటికి రాలేక పోయింది. సాయంత్రానికి భయం కంటే ఆకలి ఎక్కువై అప్పుడే లోపలికి వచ్చినోడిని లోపలికి లాక్కెళ్ళి కిళ్ళీ నమిలేసినట్లు నమిలేసింది. 

మరుసటి రోజు ఆ ఆఫీస్ మేనేజర్ లీవ్ పెట్టాడని అనుకున్నారు అందరూ. యదావిధిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు బల్లల కింద  చేతులు పెట్టి జేబులు నింపుకుంటూ. 

ఈ సారి క్లర్క్ వంతు. మరుసటి రోజు అసిస్టెంట్ మేనేజర్ వంతు. ఇలా ప్రతీ రోజు సాయంత్రం అయ్యేప్పటికీ ఆ అయ్యప్ప వాహనంలో భయాన్ని ఆకలి డామినేట్ చేయడంతో నాలుగైదు Suppers సప్పరించేసింది. 

మరుసటి రోజు ఆఫీసులో  ఒక మనిషి  మిస్ అయ్యాడని పెద్ద గందరగోళం. ఇంటికి ఫోన్ చేస్తే ఆఫీస్ కే వచ్చాడు అన్నారు. అతని కోసం ఆఫీస్ లో వెతకడం మొదలెడితే పులి గుట్టు రట్టయి జూలో జాయిన్ అయ్యింది . 

'అన్నాయ్! ఒక్క పూట ఆ వ్యక్తి కనపడకపోయేసరికి ఆఫీస్ లో ఎవరి చేతులు కాళ్ళు ఆడలేదు. మరీ అంత పేద్ద ఆఫీసర్ ని సప్పర్ కింద సప్పరించేశానా ఏమిటి?'  అని పక్కనే టీ తాగుతున్న ఆ జూ కీపర్ ని అడిగింది. 

ఇంకో పది మంది ఆఫీసర్స్ ని లేపేసినా నువ్వు దొరికి పోయేదానివి కాదు,  కాకపోతే నువ్వు చివరిగా  తిన్నది ఆ ఆఫీస్ లో టీ లు అందించే ఒక ప్యూన్ ని అన్నాడు. 

                                                                  ****************

COVID టైం లో ఒక కంపెనీ ఇద్దరు పెద్ద managers కి అలాగే మరో ఇద్దరు H.R డిపార్ట్మెంట్ లోని వారికి జీతాలు సెటిల్ చేసి వదిలించుకుంది. అంతవరకూ బానే ఉంది తర్వాత ఇంకాస్త లోతుకెళ్ళి ఒక డెవలపర్ ని కూడా తొలగించారు, ఆ డెవలపర్ ని తొలిగించిన తర్వాత తెలిసి వచ్చింది ఒక డెవలపర్ తక్కువ అవడం వల్ల వచ్చిన ఇబ్బంది.  ఆ తర్వాత తప్పు తెలిసి వచ్చి అతన్నినెల తిరిగే లోపే మళ్ళీ జాయిన్ అవమని రిక్వెస్ట్ చేశారు. పులి-ప్యూన్ విషయంలో జరిగింది కథ కానీ ఇది మాత్రం నిజంగా నా ఫ్రెండ్ లైఫ్ లో గత సంవత్సరం జరిగిన విషయం.  కాస్త సారూప్యత ఉందనిపించి  ఆ పులి కథ చెప్పాను. 

28, ఫిబ్రవరి 2021, ఆదివారం

పులి, పొట్టేలు, గుఱ్ఱం మరియు ఆవు

ఈ రోజు ఆఫీస్ లో లంచ్ టైములో కొలీగ్ ఒక ప్రశ్న అడిగాడు. మీ దగ్గర పులి, పొట్టేలు, గుఱ్ఱం, ఆవు ఉంటే అందులో నుంచి ఒక్కొక్క జంతువును  వదిలేయాల్సి వస్తే ఏ ఆర్డర్ లో వదిలేస్తారు అని.   

నేను కొద్ధి సేపు ఆలోచించి మొదట నేను పులి ని వదిలేస్తాను అన్నాను. 

కారణం అడిగాడు. 

పులి ప్రమాదకరమైంది, దాన్ని హేండిల్ చేయడం కష్టం కాబట్టి నేను రిస్క్ తీసుకోనుమొదట్లోనే వదిలేస్తాను అన్నాను. తర్వాత గుఱ్ఱం వదిలేస్తాను ఎందుకంటే దానికి దాణా ఖర్చు తప్ప వేరే రకంగా ఉపయోగపడదు. పైగా ఇప్పుడిప్పుడే కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి దాని ఉపయోగం శూన్యం అన్నాను. 

తర్వాత అన్నాడు 

పొట్టేలు, ఆవు ఈ రెండింటిలో ఏది ముందు వదిలేయాలి అన్నది  కష్టం. రెండూ ఉపయోగపడేవే. తప్పని సరి అయితే పొట్టేలు వదిలేస్తాను ఎందుకంటే నేను ఇండియన్ సెంటిమెంట్స్ నమ్మేవాడిని కాబట్టి ఆవు ఇంట్లో ఉండటం మంచిది, పైగా అది పవిత్రమైనది అని నమ్మకంఅంతే కాకుండా తన చుట్టూ ఉన్న గాలిని కూడా ప్యూరిఫై చేయగల సామర్థ్యము ఆవుకు ఉంది అని ఎక్కడో చదివాను . అయినా ఈ ప్రశ్న అడగటం వెనుక లాజిక్ ఏంటి అన్నాను. 

చెప్తాను, మన సూర్య ఏం చెప్తాడో విందాం అన్నాడు. 

తనేమో నాకు ఆల్మోస్ట్ రివర్స్ లో ఆన్సర్ చేశాడు పొట్టేలు, ఆవు, గుఱ్ఱం, పులి అని. కారణం అడిగితే ఆవు, పొట్టేలు చాలా ఇళ్ళలో ఉంటాయి గుఱ్ఱం, పులి ఉంటే అదో థ్రిల్ అన్నాడు. 

సరే, నువ్వైయితే ఏ ఆర్డర్ లో వదిలేస్తావు అని ఆ ప్రశ్న అడిగిన కొలీగ్ నే అడిగాను. 

మొదటి సారి నన్ను ఈ ప్రశ్న నా ఫ్రెండ్ అడిగినప్పుడు పులి, గుఱ్ఱం, ఆవు, పొట్టేలు అని చెప్పాను కారణం ఆల్మోస్ట్ నువ్వు చెప్పిన లాంటిదే. కాకపోతే ఆవును మేనేజ్ చెయ్యడం కంటే పొట్టేలు పెంచడం ఈజీ అని నా ఉద్దేశ్యం అదీ కాక పొరపాటున అవి చనిపోతే పొట్టేలు అయితే పెద్ద ఇబ్బంది ఉండదు, ఆవు అయితే కాస్త ఫార్మాలిటీస్ ఉంటావు అని. 

సరే ఇప్పుడు చెప్పు ఈ ప్రశ్న అడగటం వెనుక లాజిక్ ఏంటి అన్నాను. 

చెబుతాను, ముందు ఇంకో ప్రశ్న కి సమాధానం చెప్పండి అని 'మీ ఇద్దరిలో షేర్స్ లో ఎవరైనా మనీ ఇన్వెస్ట్ చేశారా' అన్నాడు. 

అబ్బే, అలాంటి వాటికి నేను ఆమడ దూరం. అంత తెలివి తేటలు లేవు, రిస్క్ అంత కన్నా అస్సలు చేయలేను అన్నాను. 

'మరి నువ్వు సూర్య?' అని అడిగాడు. 

నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం షేర్స్, బిట్ కాయిన్ లోనే పెట్టాను అన్నాడు. 

నాకు కూడా ఈ షేర్స్ అర్థం కావు, నేను కూడా ఇన్వెస్ట్ చేయలేదు అందులో అన్నాడు కొలీగ్. 

నాకిప్పుడు అర్థం అయింది అన్నాను మొదట్లో ఆ ప్రశ్న అడగడం వెనుక లాజిక్  ఏంటో అన్నాను. 

తను చెప్పడం మొదలెట్టాడు 'పులి డబ్బుకు, గుఱ్ఱం స్టేటస్ కి, పొట్టేలు ప్రేమకి, ఆవు కుటుంబానికి నిదర్శనం. మనం డబ్బును మేనేజ్ చెయ్యలేక పోతే అదే మనల్ని ఆడిస్తుంది అదే ఆ డబ్బును మేనేజ్ చెయ్యగలిగితే మనమే కింగ్. సూర్య విషయం లో ఇది సరిగ్గా రుజువైంది, తనకి డబ్బును ఎలా హేండిల్ చెయ్యాలో తెలుసు కాబట్టి చివర్లో మాత్రమే పులి ని వదిలేశాడు మనమిద్దరం మొదట్లోనే వదిలేశాం అన్నాడు.'

నోట్: ఈ లాజిక్ అన్ని చోట్లా కరెక్ట్ అవ్వకపోవచ్చు కాకపోతే టైంపాస్ కోసం మీ ఫ్రెండ్స్ నో మీ ఫామిలీ మెంబెర్స్ నో  ఈ ప్రశ్న అడిగి చూడండి. 

24, ఫిబ్రవరి 2021, బుధవారం

కొత్తొక వింత పాతొక రోత కాలం కాదిది

మన పాత తెలుగు సినిమాల్లో అడుక్కునే వాళ్ళు ఒక చక్రాల బల్ల పై కూర్చుని చేతులతో తోస్తూఉంటే అది ముందుకు వెళ్తూ ఉంటుంది. చిరంజీవి దొంగ మొగుడు సినిమా లో ఇలాంటిది యూజ్ చేశాడు. ఇంకా ఖైదీ లో అనుకుంటా సుత్తివేలు యూజ్ చేస్తాడు ఇలాంటిది.  ఇప్పుడా సోది ఎందుకు అంటారా? సరిగ్గా అలాంటి చక్రాల బల్లనే చూశాను మొన్నొక సారి షాప్ కి వెళ్ళినప్పుడు.  పైగా దానికి 'స్కూటర్ బోర్డ్' అని దానికి స్టైల్ గా పేరొకటి.ఈ మధ్య ఒకసారి మా ఆఫీస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో క్లే పాట్స్ స్టాల్ పెట్టి హెల్త్ కి మంచిది ఈ మట్టి కుండలో వంట వండుకోండి నాన్ స్టిక్ కోటింగ్ మంచిది కాదు అని ఊదర గొట్టేసి సాయంత్రానికి స్టాల్ మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళారు. ధర తక్కువేమీ కాదు ఒక్కొక్కటి 50$ పైనే. నా చిన్నప్పుడంతా ఈ మట్టి కుండల్లోనే శుభ్రంగా వాడుకుతినేవారు. ఆ తర్వాత నాన్ స్టిక్ అనేది రావడంతో మట్టి పాత్రలని, ఇనుప పాత్రలని వదిలేసి నాన్ స్టిక్ కి స్టిక్కయి పోయారు. ఆ మోజు కొంచం తీరి మళ్ళీ ఇప్పుడు మట్టి కుండల వెంట పడుతున్నారు.  

ఒకప్పుడు చక్కగా పెరట్లోనో, సొంత తోటల్లోనో పురుగుల మందులు వాడకుండా పెంచిన కాయగూరలు వాడేవారు. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ అయి వచ్చిన కూరగాయలు కొన్నారు.  ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వెంట పడ్డారు. ఆర్గానిక్ అని చెప్పి గోంగూర 250 గ్రాములు 15$ పెట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆర్గానిక్ కొంటే అదో గొప్ప ఫ్యాషన్ పైగా హై క్లాస్ ఫ్యామిలీ అని ఒక ఫీలింగ్.  సరేలెండి హెల్త్ కి మంచిదే కాబట్టి కొంటే తప్పేమి లేదు. 

ఒకప్పుడు హవాయి చెప్పులు (ఆ రబ్బరు చెప్పులు) వేసుకు తిరిగితే నామోషీ అనేవారు. ఇప్పుడంతా అవే చెప్పులే స్టైల్ గా వేసుకుని తిరుగుతున్నారు, వాటికి బీచ్ స్లిప్పర్స్, thongs, Flip flops అని ఏవేవో పేర్లు పెట్టేశారు రకరకాల రంగుల్లో తయారుచేసి. 

అప్పట్లో ప్యాంట్ పైకి మడిస్తే రిక్షా వాడిలా ఏమిట్రా అని తిట్టేవారు. ఇప్పుడు అదే ఫాషన్. మిస్సమ్మ లో మన ఎన్టీవోడు వేసిన నిక్కర్ల లాంటివి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి షార్ట్స్ గా పేరు తెచ్చుకున్నాయి. 

మన పాత రాగి సంగటిని రాగి బాల్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంటుల్లో అమ్మేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు చద్ది అన్నం కూడా ఫ్యాషన్ అయినట్లు ఉంది. చిన్నప్పుడు బయటి నుంచి రాగానే చేతులు, కాళ్ళు కడుక్కోండి అని పెద్దవాళ్ళు అంటే వీళ్లది మరీ చాదస్తం అనేవాళ్ళే ఇప్పుడు రుద్ది రుద్ది చేతులు కడుగుతున్నారు COVID దెబ్బకి. 

కాలం ముందుకే కాదు అప్పుడప్పుడూ వెనక్కి పోతుందని అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. కొత్తొక వింత పాతొక రోత అనుకునే కాలం పోయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు ఇప్పుడు. 

22, ఫిబ్రవరి 2021, సోమవారం

5 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా?

ముందు రెండు భాగాలు కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం , ఇన్నాళ్ళకి.. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను చదవకపోయి ఉంటే చదివేసి ఇక్కడికి వచ్చేయండి. ఇదేదో బాహుబలి పార్ట్ ఒకటో లేక KGF చాఫ్టర్ ఒకటో కాదు కాబట్టి చదవకపోయినా వచ్చే నష్టం లేదు. 

'బైక్ డ్రైవ్ తెలుసు అన్నావు కాబట్టి ఆక్సిల్రేటర్, బ్రేక్ స్లో గా ఎలా  ప్రెస్ చెయ్యాలి  అనేది తెలిసే ఉంటుంది, కాబట్టి ఆక్సిల్రేటర్ స్లో గా ప్రెస్ చేస్తూ వెళ్లు' అని ఢాంబాబు మొదటి డ్రైవింగ్ లెసన్ స్టార్ట్ చేశాడు. 

మొత్తానికి అలా మొట్ట మొదటి సారి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డ్రైవింగ్ మొదలెట్టాను. కాసేపటికి సిగ్నల్స్ ఉండే రోడ్ వచ్చింది. 

హేయ్, గ్రీన్ లైట్ పడ్డప్పుడు మాత్రమే సిగ్నల్ క్రాస్ చెయ్యాలి, నువ్వేమిటి ఆగకుండా వెళ్తున్నావ్?

అదిగో గ్రీన్ హ్యూమన్ లైట్ పడిందిగా అందుకే వెళ్తున్నాను. 

నువ్వు ఇప్పుడు ఉన్నది కార్ లో, కార్ రూల్స్ ఫాలో అవ్వాలి. 

సారీ, కన్ ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడి 9 ఏళ్ళ వాకింగ్ అనుభవం ఈ 9 నిమిషాల డ్రైవింగ్ ని డామినేట్ చేస్తోంది. 

ఇప్పుడు కాసేపు కారు పక్కన పార్క్ చెయ్. కొద్దిసేపు నీకి థియరీ క్లాస్ చెబుతా. కారు డ్రైవింగ్ అనేది ఒక కల, ఒక వరం. పూర్వ జన్మ లో ఎంతో తపస్సు చేసావో గానీ ఇంత చిన్న వయసులోనే నీకు దక్కింది (వెటకారంగా).  ఏదీ ముందు నీకు కార్ గురించి యెంత తెలుసో చెప్పు?

ఏముంది కారుకు నాలుగు వీల్స్ ఉంటాయి. ఈ రోజు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక తెలిసింది ఇక్కడ కూడా ఒక వీల్ ఉంటుందని. 

వెనుక డిక్కీలో కూడా ఒక వీల్ ఉంటుంది దాన్ని స్టెప్నీ అంటారు (వెటకారంగా). 

స్టెప్నీ అంటే స్పేర్ వీలా, నేనింకా ఒక సెటప్ అనుకుంటున్నానే. అదేదో సినిమాలో శరత్ బాబు పెళ్ళాన్ని కాకుండా ఇంకొకరిని మెయింటైన్ చేస్తుంటాడు. వాళ్ళను కదా స్టెప్నీ అంటారు.. 

ఇదిగో మా శరత్ బాబు ను ఏమన్నా అంటే నేను ఊరుకోను. 

సరే. సారీ. నీకు జావా గురించి తెలుసా. 

తెలుసు.  నా చిన్నప్పుడు మా అమ్మ రోజూ రాగి జావ చేసి ఇచ్చేది. ఇప్పటికీ వేడి చేస్తే ఆ రాగి జావానే  తాగుతా. 

ఏమిటీ! అప్పుడెప్పుడో మీ అమ్మ కాచి ఇచ్చిన జావ నే ఇప్పటికీ తాగుతున్నావా?

ఇదిగో ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకు నాకు మండుతుంది. 

సరే, నేను అడిగేది జావా లాంగ్వేజ్ గురించి, నీకు దాని గురించి యెంత తెలుసో నాకూ కారు గురించి అంతే తెలుసు. 

సరే విను నీకు రూల్స్ చెబుతా అని గ్రీన్, రెడ్ సిగ్నల్స్, రౌండబౌట్స్ అని కాస్త థియరీ రౌండ్ వేసుకున్నాడు. నువ్వు స్టీరింగ్ వీల్ ని గట్టిగా పట్టుకుని తిప్పుతున్నావు. అలా గట్టిగా తిప్పినంత అది నీ మాట వింటుందనుకోకు, లూస్ గా పట్టుకో. సినిమాల్లో తిప్పినట్లు ఓ తెగ తిప్పేయ్యాల్సిన అవసరం లేదు.  కాస్త యంగ్ గా ఉన్న వాళ్లయితే ఈజీ గా క్యాచ్ చేస్తారు, నువ్వు లేట్ ఏజ్ లో నేర్చుకుంటున్నావ్ అదే ప్రాబ్లెమ్. 

మరి నేర్చుకోవడం కష్టం అంటావా?

మై హూ నా, 5 రోజుల్లోనే నేర్పిస్తా. 'హేయ్, లేన్ చేంజ్ అయ్యేప్పుడు అటుపక్క ఇటుపక్క వెళ్ళే వెహికల్స్ ని చూసి మారాలి' అన్నాడు. 

సారీ, నాకు కాపీ కొట్టే అలవాటు లేదు, వాళ్ళను చూసి ఎలా మారాలో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో కూడా ఎప్పుడూ పక్కనోళ్ళను చూడలేదు తెలుసా?

'ఆ పరీక్షల్లో ఓకే గానీ ఈ డ్రైవింగ్ పరీక్షలో చూసి తీరాలి, లేదంటే నెగటివ్ మార్క్ వేస్తాడు, పైగా అలా అబ్సర్వ్ చేస్తూ లేన్ మారటం సేఫ్ కూడా' అన్నాడు. 

అలా 5 రోజులు గడిచిపోయాయి రోజుకో గంట డ్రైవింగ్ ప్రాక్టీస్ తో. కాకపోతే అయిదు రోజులైనా పర్ఫెక్ట్ గా రివర్స్ పార్కింగ్ చేయడం లాంటివి రాలేదు. ఎలాగోలా డ్రైవింగ్ చేయడం అయితే నేర్చేసుకున్నాను. అందుకని '5 రోజుల్లోనే డ్రైవింగ్ నేర్పిస్తా అన్నావ్? ఇంకా ఆ పర్ఫెక్షన్ రాలేదే' అని అడిగా. 

'30 రోజుల్లో ఇంగ్లీష్' అని ఒక పుస్తకం వచ్చేది మన చిన్నప్పుడు చదివావా?

బోలెడు సార్లు 

చదివావా?

నీ మొహం, బోలెడు సార్లు చూశాను. అది చదివి 30 రోజుల్లోనే ఇంగ్లీష్ మొత్తం నేర్చుకుంటారు అని చెప్తే నమ్మేటంత పిచ్చి వెధవని అనుకున్నావా?

మరి నేను 5 రోజుల్లో డ్రైవింగ్ అని అన్నప్పుడు ఎలా పిచ్చి వెధవ అయ్యావ్? చూడు, వయసులో నువ్వు నా కంటే పెద్దవాడివి అయినా సరే నీకు ఒక జీవిత పాఠం చెప్తా విను..  

నిన్ను చూసినప్పుడు, నువ్వే నా కంటే పెద్ద వాడివి అనుకుంటున్నానే?

కాదు, నీ డ్రైవింగ్ లైసెన్స్ లో  నీ డేట్ అఫ్ బర్త్ చూసాను. నేను నీ కంటే చిన్నవాడిని. కాకపోతే బాగా జుట్టు రాలిపోయి, కాస్త పొట్ట వచ్చేసి వయసులో పెద్ద వాడిలా కనపడుతున్నాను. అప్పట్లో కాలేజ్ రోజుల్లోనే కార్ కొన్న తర్వాత ఆ కార్ తీసుకొని నేను రోడ్డు ఎక్కాను, దాంతో చదువు అటకెక్కింది. చివరికి ఏ ఉద్యోగం రాక ఇదో ఇలా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అవతారం ఎత్తాను. తొందరగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు అందరూ ఇలా అయ్యారు అని చెప్పను. నా విషయం లో జరిగింది నీకు చెప్తున్నాను. నేనేదో లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నానని, బాగా సంపాదిస్తున్నానని అనుకోను. ఈ కార్ లో తిరిగి తిరిగి వొళ్ళు బాగా వేడి చేస్తుంది. ఆరోగ్యం బాలేక సెలవు పెడితే ఆ రోజుకు  ఆదాయం ఉండదు. పోయిన నెల ఆరోగ్యం బాలేక నెల రోజులు ఇంట్లోనే ఉండాలి వచ్చింది. మీకు లాగా మాకు సిక్ లీవ్స్, యాన్యువల్ లీవ్స్ ఉండవు.  

అందుకేనేమో Other side of grass always looks greener అని ఇంగ్లీష్ పెద్దోళ్లు, దూరపు కొండలు నునుపు అని మన తెలుగు పెద్దోళ్ళు అన్నది అన్నాను అతని మాటలకు అడ్డుపడుతూ.  

చూడు, ఇలా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ల చుట్టూ తిరుగుతుంటే డబ్బులన్నీ డ్రైవింగ్ క్లాసెస్ కే అయిపోతాయి. నీకు బేసిక్ డ్రైవింగ్ వచ్చేసింది ఇకపైన నువ్వే ఒక కార్ కొని ప్రాక్టీస్  చేసేయ్, లేదంటే నీ ఫ్రెండ్స్ కార్ తీసుకొని ప్రాక్టీస్ చెయ్. 'కొత్త కార్ కొనగలిగే స్థోమత ఉంటే పాతది కొను' ఇలా మీ మురళీమోహన్ డైలాగ్ ని కాస్త కస్టమైజ్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కార్ కొనెయ్  అని జ్ఞానోదయం కలిగించి  శ్రీ కృష్ణుడు తన రథం లో వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ 'నువ్వు లేట్ ఏజ్ లో నేర్చుకుంటున్నావ్ అదే ప్రాబ్లెమ్ కాబట్టి నీకు బాగా డ్రైవింగ్ రావడానికి ఇంకో రెండు మూడు నెలలు పట్టొచ్చు' అని కాస్త నిరుత్సాహపరిచాడు . 

14, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఇన్నాళ్ళకి .. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను

అప్పుడెప్పుడో COVID అనేది పుట్టక ముందు:

హలో, నా పేరు పవన్. ఇది add a did daala కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యుటా?

add a did daala కాదది 'అడ్డదిడ్డాల'.  నా పేరు అడ్డదిడ్డాల ఢాంబాబు. మా ఇంటి పేరు మీదే  ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాను. 

ఓహో అలాగా! నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. 

DKT ఇచ్చావా ?

నేను ఆఫీస్ లో KT ఇస్తున్నట్లు వీడికేలా తెలిసింది? 3 KT లు ఇచ్చాను, ఇంకో రెండు ఇస్తే అయిపోతుంది. 

అంటే 3 సార్లు రాశావా?

రాయడమేమిటి?

DKT టెస్ట్ 

అలాంటి పేరు వినలేదు. 

ముందు DKT టెస్ట్ రాసి పాస్ అయితే learner లైసెన్స్ ఇస్తారు. అప్పుడు రా, డ్రైవింగ్ నేర్పిస్తాను. ఎర్ర బస్సు అనుకొని ఎయిర్ బస్ ఎక్కి వచ్చేస్తారు మా టైం వేస్ట్ చెయ్యడానికి. 

కొన్నినెలల.. కరెక్ట్ గా చెప్పాలంటే ఏడాది తర్వాత:

అడ్డదిడ్డాల ఢాంబాబా?

అవును. 

నాకు learner లైసెన్స్ ఉంది. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. 

ఓకే,  గంటకు XX $. 

మరీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మిగతా వారి కంటే. 

నేనయితే 5 గంటల్లో నేర్పిస్తా, మిగతా డ్రైవింగ్ స్కూల్ లాగా కాదు. 

అయితే ఓకే. 

రేపు ఉదయం 8 గంటలకి మీ ఇంటి బయట వెయిట్ చేస్తుంటాను. 

మరుసటి రోజు ఉదయం: 

మీరేనా ఢాంబాబు?

అవును, ఎవరికి నేర్పించాలి? మీ తమ్ముడికా? లేక మీ అబ్బాయికా ??

నాకే... అన్నాను జేబులోంచి మాస్క్ బయటికి తీస్తూ. 

దబ్బున శబ్దం వచ్చింది. ఎదురుగా ఢాంబాబు కనపడలేదు. అరె, ఢాంబాబు ఎక్కడ అని అటూ ఇటూ చూస్తే కింద పడి ఉన్నాడు. 

వెంటనే కార్లోంచి కాస్త పెట్రోల్ తీసి ఢాంబాబు మొహం మీద చల్లితే లేచి నిలబడ్డాడు. 

మరీ ఇంత లేత వయసులో డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు  అనుకుంటున్నారు. ఇంకో పదేళ్ళు ఆగితే మీ పిల్లలే నేర్చుకునేవారుగా. 

అవుననుకోండి, కాకపోతే ఇంత లేటుగా డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవడం మొదలెట్టానో తెలుసు కోవాలంటే కాసిన్ని కారు కూతలు మాట్లాడుకోవాల్సిందే

ఆపు నీ సోది, ఇప్పటికే ఇవాళ్టి గంటలో 15 నిముషాలు టైం  అయిపొయింది. పద కార్ లో కూర్చో. 

సరే. 

సరే అని అటు వైపు సీట్ లోకి వెళ్తావేం? డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి కూర్చో. 

అలవాటు లేదు కదా అందుకే ఈ పొరపాటు అనేసి 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే' అని హమ్ చేసుకుంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను. 

నువ్వు బైక్ డ్రైవ్ చేశావా ఎప్పుడైనా?

బైక్ డ్రైవింగా? మూతి మీద మీసాలు మొలవక ముందే దాని మీద విన్యాసాలు చేశాను.  ఏదో కార్ డ్రైవింగ్ అంటే టైం కలిసి రాక నెత్తి మీద జుట్టు రాలడం మొదలయ్యాక మొదలు పెడుతున్నాను. 

అదీ గొప్పేనా, నేను మూతి మీద మీసాలు మొలవక ముందే అప్పట్లోనే డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ కార్ కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను. 

డబ్బు లేకపోయినా అప్పు చేసి కార్ కొన్నావా? మురళీ మొహన్  ఇంటర్వ్యూ చూడలేదా?

ఆడెవడు?

అదే, తెలుగు సినిమాల్లో ఎక్కువగా సెకండ్ హీరో వేషాలు వేసేవాడు అప్పట్లో.  నాగేశ్వర్రావో, శోభన్బాబో కొన్ని కారణాల చేత హీరోయిన్ ని పెళ్ళి చేసుకోకపోతే తనే చేసుకునే వాడు. 

నేను శరత్ బాబు ఫ్యాన్ ని. మురళీ మోహన్ నచ్చడు, అతని ఇంటర్వ్యూలు మాత్రం ఎందుకు చూస్తాను?

అర్రే యెంత ఘోరం జరిగి పోయింది, నేను కూడా శరత్ బాబు ఫ్యాన్ అయ్యుంటే మురళీ మొహన్ ఇంటర్వ్యూ చూడకుండా అప్పట్లోనే కార్ కొని డ్రైవింగ్ నేర్చుకొని ఉంటే ఇప్పుడిలా వీడితో అడ్డదిడ్డమైన మాటలు పడాల్సి వచ్చేది కాదు, పైగా వీడిలా దర్జాగా రోజూ కార్లో తిరుగుతూ బతకొచ్చు అనుకుంటూ ... 

8, ఫిబ్రవరి 2021, సోమవారం

కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం

హలో, మాట్లాడేది పవనేనా?

అవును నేనే 

మేము RMS డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. 

సారీ, నేను MCA తోనే చదువు ఆపేసాను, ఇప్పుడు MS చేసే ఆలోచన లేదు. 

Roads and Maritime Services డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. లాస్ట్ ఇయర్ మీరు కార్ రివర్స్ చేస్తూ ఫలానా నెంబర్ వెహికల్ ని గుద్దేశారు. అది మేము ఓల్డ్ రికార్డెడ్ వీడియోస్ చూస్తూ ఉంటే బయటపడింది. మీరు దానికి ఇంతవరకు ఫైన్ చెల్లించలేదు. ఓవరాల్ గా మీరు 1240$ చెల్లించాలి. మేము మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము, మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చెయ్యండి ఈ రోజు బిజినెస్ క్లోజ్ అయ్యే లోపు. లేదంటే రేపు ఉదయాన్నే పోలీసులు మీ డోర్ తట్టాల్సి వస్తుంది. 

డోర్ తట్టాల్సిన అవసరం లేదండి, మాకు ఇంటర్ కామ్ ఉంది అందులో మా యూనిట్ నెంబర్ ఎంటర్ చేసి # సింబల్ ప్రెస్ చేయమని చెప్పండి. 

అంతే, అవతలి వాడు టక్కున ఫోన్ కట్ చేశాడు. 

ఇలాంటి ఫేక్ కాల్స్ ఇక్కడ చాలా కామన్ గా వస్తుంటాయి. మీరు ఇల్లీగల్ గా వీసా ప్రాసెస్ చేయించుకున్నారు, కాబట్టి మీకు అరెస్ట్ వారెంట్ తప్పదు, వెంటనే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ కి ఫలానా అమౌంట్ కట్టి అప్లికేషన్ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మీరు టాక్స్ ఎగ్గొట్టారు మీరు ఇంత అమౌంట్ వెంటనే కట్టేయండి అని స్కాం కాల్స్ వస్తుంటాయి. 

ఇలాంటి ఫోన్స్ రాగానే  చాలా మంది భయపడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కూడా చేశారు. 2019 లో ఇలాంటివి చాలా ఎక్కువై గవర్నమెంట్ టీవీల్లో రేడియోల్లో కూడా అవేర్నెస్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. 

నాకు మాత్రం కొంచెం కూడా భయం వెయ్యలేదు ఆ కాల్ వచ్చినప్పుడు..ఎందుకంటే నా మొహానికి కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి. 

మాది చిన్నప్పుడు మధ్య తరగతి కుటుంబం అవ్వడం వల్ల (ఇప్పుడేదో హై క్లాస్ ఫామిలీ అనుకునేరు ఇంకా అదే ఏడుపే) బైక్ ఉండేది కానీ కారు ఉండేది కాదు కాబట్టి బైక్ డ్రైవింగ్ మాత్రమే నేర్చుకున్నాను. 

ఆ తర్వాత M.C.A పూర్తి చేసి I.T జాబ్ వెలగపెట్టేటప్పుడు ఇప్పుడే కదా సంపాదన మొదలైంది అప్పుడే అప్పు పెట్టి కార్ కొనడం అవసరమా అనుకున్నాను. 

కొన్ని సంవత్సరాలకి చేతిలో కొంత డబ్బు పడింది. అసలే మనకి సినిమా పిచ్చి కదా, సినిమా వాళ్ళు ఏమి చెప్పినా బాగా ఎక్కేస్తుంది. ఒక సారి మురళి మోహన్ ఏదో ఇంటర్వ్యూ లో మాటాడుతూ మీ దగ్గర కారు కొనగలిగిన డబ్బు ఉన్నా బైక్ కొనండి చాలు.  బైక్ కొనగలిగిన డబ్బు ఉన్నా సైకిల్ కొనండి, సైకిల్ కొనగలిగిన డబ్బు ఉన్నా తోపుడు బండి కొని దాని మీద ముంత కింద పప్పు అమ్ముకుని బతకండి (కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని మీరు అర్థం చేసుకోవాలి) అని 'డబ్బులన్ని ఖర్చుపెట్టక దాచుకోండి నాయనా' అనే ఒక ఉపదేశం ఇచ్చాడు. అది బాగా పట్టెయ్యడం వల్ల కార్ కొనగలిగే స్తోమత ఉన్నా కారు కొనలేదు (ఓహో అయితే బైక్ కొన్నావా?  అని మాత్రం అడగకండి. బైక్ కొనడమో లేక  తోపుడు బండి కొని దాని మీద శెనక్కాయలు అమ్ముకోవడమో కాదు కాన్సెప్ట్ ఇక్కడ, మనం కార్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం) 

ఆ తర్వాత ఇంకాస్త డబ్బు సంపాదించాక, ఈ బెంగుళూరు ట్రాఫిక్ లో కార్ డ్రైవ్ చేసే నరకం కన్నా అదే బెంగుళూరు లో ఏదో ఒక థియేటర్ లో కన్నడ సినిమా చూడటం ఎంతో కొంత బెటర్ అని డిసైడ్ అయి కార్ కొనలేదు. 

ఆఫ్ఘనిస్తానో , పాకిస్తానో ఏదో ఒక దేశానికి onsite పంపిస్తామని ఆఫీస్ లో చెప్పడం వల్ల  ఈ టైం లో కార్ కొనడం అవసరమా అని అప్పుడూ కార్ కొనలేదు. 

నాకుండే ఫ్రెండ్స్ కి కూడా అప్పట్లో కారు ఉండేది కాదు కాబట్టి కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు, అనిపించలేదు కూడా. 

అలా స్వదేశంలో  నా చుట్టుపక్కల నాకెప్పుడూ కారు కూతలే వినిపించలేదు. 

1, జనవరి 2021, శుక్రవారం

ఎక్కడి గొంగళి అక్కడే

 తెలిసిన విషయమే అయినా ఇది సరైన సందర్భం కాబట్టి ఇక్కడది చెప్పుకుందాం. 

న్యూ ఇయర్ రోజున ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. 

బాబాయ్ సిగరెట్ మానేశాను అన్నాడు మొదటి వాడు  

రాత్రే కదా మన వాట్సాప్ గ్రూప్ లో అలా అని మెసేజ్ పెట్టావు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో కూడా పెట్టినట్లు ఉన్నావ్? ప్రపంచమంతా తెలియాలా ఏమిటి ?

అవును తెలిస్తే మంచిది , మళ్ళీ నాకు తాగాలి అనిపిస్తే అందరికి మానేశానని గొప్పగా చెప్పుకున్నాను కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా తాగినట్లు తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారు అనే  భయంతో నైనా తాగకుండా ఉంటాను. 

సిగరెట్ అలవాటు లేదు కాబట్టి ఇది నాకు వర్తించదు కానీ, ఈ కింది లిస్ట్ లో ఉన్న ఏడవ రెసొల్యూషన్ గురించే నా బాధంతా. నాకు మునుపు ఈ నెంబర్స్ గురించి పట్టింపు లేదు కానీ దాన్ని ఏడవ నెంబర్ లోనే పెట్టడం వల్ల అది అలా పెండింగ్ లో ఉందని నా గట్టి ఫీలింగ్. ఏడవ ఛీ ఛీ ఈ ఆరున్నొక్క నెంబర్ ని మళ్ళీ వాడకుండా ఉండాలి. 

సరే ఇప్పుడు నేను మనవి చేసుకునేది ఏమిటంటే నెక్స్ట్ ఇయర్ రెసొల్యూషన్ లిస్ట్ లోడ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనే పాయింట్స్ ఉండవు యెందుకంటే అప్పటికి నేను అవి నేర్చుకొని ఉంటాను కాబట్టి.  హమ్మయ్య ఇక నేను కూడా బ్లాగు ముఖంగా ప్రకటించాను కాబట్టి నేర్చుకు తీరాలి లేదంటే పరువు పోతుంది.  

సరే రెండేళ్ళ క్రితం తీసుకున్న రెసొల్యూషన్స్ ఇవి. ఇందులో ఏవి ఎంతవరకు సాధించగలిగానో ఓ సారి చెక్ చేసుకుని రెడ్ ఫాంట్ లో రాసుకున్నాను. 
 1. కాలమతి నుంచి సుమతి గా మారడం (గత 20 ఏళ్లుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఇందులో) --> ఇంకో ఇరవెయ్యేళ్ళు ఇలాగే కంటిన్యూ అయిపోదాం. పుట్టుకతో వచ్చింది పుడకలతోనే గానీ పోదంటారు కదా. ఈ జన్మ కి దీన్ని వదిలేస్తే సరి. 
 2. కొత్త వాళ్లతో అంత తొందరగా మాటలు కలపలేను. ఇందులో కాస్త ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేయడం. --> లోకేష్ గారి తెలుగులో యెంత ఇంప్రూవ్మెంట్ ఉందో ఈ విషయం లో నా ఇంప్రూవ్మెంట్ కూడా అంతే  ఉందని అనుకుంటున్నాను. 
 3. వీలయితే ఒక్క మగాడు, బ్రహ్మోత్సవం, అజ్ఞాత వాసి లాంటి సినిమాలకు దూరంగా, కామెడీ సినిమాలకు దగ్గరగా ఉండటం. --> హమ్మయ్య, covid దెబ్బకు సినిమా హాల్లో సినిమాలు చూసే అవకాశం లేదు, ఇంట్లో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఉంది. 
 4. నడక తగ్గించడం, రోజుకు 6-7 కిలోమీటర్లు నడుస్తున్నాను, వీలయితే అది కాస్త తగ్గించడం. --> covid దెబ్బకు వర్క్ ఫ్రొం హోమ్ , ఎక్కడికీ కదలట్లేదు. 
 5. 63 కిలోల నుచి 62.5 కిలోలకు తగ్గడం (500 గ్రాములు పెరగడం ఈజీ కానీ, తగ్గడం కష్టం )వామ్మో , covid దెబ్బకు రివర్స్ అయింది 63 నుంచి 68 కి వెళ్ళింది
 6. 🐓 🐑 🍕 లాంటివి మానేసి 🥑 🥕 🥦 🍄 🌽 🐟 లాంటివి ఎక్కువగా తినడం (కష్టమే, కానీ ట్రై చేస్తే ఆరోగ్యానికి మంచిది) --> ఇది ఇంకో ఐదేళ్లకు పోస్ట్ పోన్ చేద్దాం 
 7. జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలైన స్విమ్మింగ్ మరియు డ్రైవింగ్ నేర్చుకోవడం. --> పైనే మాట్లాడుకున్నాం ఈ ఆరున్నొక్క పాయింట్ గురించి. ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ డ్రైవింగ్, స్విమ్మింగే. 
 8. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి 10 నిముషాలు ముందే బయలుదేరడం, హడావిడిగా లేటుగా బయలుదేరకుండా.  --> ఇది ఈ జన్మ కి అవ్వదు 
 9. మిత్రుల, కుటుంబ సభ్యుల, బంధువులకు  అన్ని రకాల విషెస్ చెప్పడం లాంటివి. (నా వరకు నాకు ఎందుకో ఈ పండుగ విషెస్, బర్త్ డే విషెస్ లాంటివి చెప్పాలంటే అంత ఇష్టం ఉండదు, దాన్ని మొహమాటం అంటారో ఏమో నాకే తెలీదు మరి) --> ఇదీ ఈ జన్మ కి అవ్వదు. 
 10. ఇక నుంచైనా ప్రతీ రోజూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. (చదివితే మరింత జ్ఞానం పెరిగి మంచి మంచి పోస్టులు రాస్తానని ఆశ) --> రామ్ గోపాల్ వర్మ ఒక మంచి సినిమా తీసేవరకు దీన్ని పోస్టుపోన్ చేద్దాం. మోకాలికి బోడి గుండుకు లంకె పెట్టడం అంటే ఇదే, కానీ తప్పదు. 
 11. ఆ మధ్య చేయడం ఆపేసిన యోగా ను మళ్ళీ కంటిన్యూ చేయడం. --> ఇదయితే ఖచ్చితంగా అర్జెంటుగా మొదలెట్టాలి. 
 12. పైన చెప్పిన లిస్ట్ అంతా నెక్స్ట్ ఇయర్ రెసొల్యూషను లిస్ట్ లోకి మూవ్ చేయడం😜 --> ఆరున్నొక్క పాయింట్ తప్ప 

ఈ సారి ఎక్కువ మంది గుమికూడ కూడదు అనే covid రూల్స్ ఉండటం వల్ల గా 31st నైట్ సింపుల్ గా కానిచ్చేయాల్సి వచ్చింది మా ఫ్రెండ్ హరి వాళ్ళ ఇంట్లో.  గోదావరి వాళ్ళ ఆతిథ్యం ముందు సీమ వారి ఆతిధ్యం తక్కువేమీ కాదు అని ఋజువు చేయడానికి మా హరి example. వాళ్ళింటికి వెళితే గాలి కూడా దూరడానికి సందు లేకుండా ఫుడ్ పెట్టి చంపేస్తాడు. అక్కడే ఈ సారి కేక్ కటింగ్. 

10 మంది కన్నా ఎక్కువ మంది ఇంట్లో కలవకూడదు అనే covid రెస్ట్రిక్షన్స్ ఉండటంవల్ల జనవరి ఫస్ట్ రోజు మాత్రం ఫ్రెండ్స్ అంతా కలిసి పచ్చిక బయళ్ళు, వాగులు, కొండల మధ్య టెంట్స్ వేసుకొని గడిపేశాము. 

 
ఇక మిగిలింది తప్పనిసరి విషెస్, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.