29, జూన్ 2021, మంగళవారం

ఈ వారం చూసిన సినిమా - మోసగాళ్ళు

ఎన్టీఆర్, చిరంజీవి కాలంలోని పాత తెలుగు సినిమాల్లో అరిగిపోయిన ఫార్ములా తో (తల్లికి మందులు లేక మోసం చేయడం లాంటి)   మొదలవుతుంది హీరో ఎలా మోసగాడిగా మారాల్సి వచ్చింది అనేది సినిమాలో కూడా.  ఆ కాలంలో అంటే హీరో మంచివాడు అనే జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటి సీన్స్ ఒక నాలుగైదు పెట్టాలి, ఈ కాలంలో అలాంటివి అవసరం లేదు. 

తర్వాత యధావిధిగా అన్ని తెలుగు మాస్ సినిమాలో లాగా స్టార్టింగ్ లో హీరో ఒక ఫైట్ చెయ్యాలి కాబట్టి అదీ చేయించి కథ మొదలెడతారు. ఇంతోటి సినిమా తీయడానికి మనోళ్ళు సరిపోరు అన్నట్లు జెఫ్రీ అనే ఒక హాలీవుడ్ డైరెక్టర్ ని తెచ్చారు. (అక్కడ బేరాలు లేక ఇక్కడికి వచ్చిన చోటా మోటా డైరెక్టరేమో తెలీదు, తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ లేదు)

కాజల్, సునీల్ శెట్టి తో పాటు హీరో కూడా ఫేడ్ అవుట్ అయిన వారే కాబట్టి కాస్టింగ్ పరంగా పెద్దగా ఖర్చు కూడా అయి ఉండదు, బాహుబలి లాంటి పీరియాడిక్ సినిమా కాదు, KGF లాంటి భారీ చేజింగ్ సీన్స్ ఉన్న సినిమా యెంత మాత్రం కాదు, మరి ఈ మాత్రం సినిమాకా 50 కోట్లు ఖర్చు అయిందన్నారు? ఓ పాతిక కోట్లు ఎక్కువ చెప్పారేమో అనిపించింది. దీనికి థియేటర్స్ నుంచి కలెక్షన్స్ 2 కోట్లు మాత్రమే వచ్చాయని టాక్, మరి మంచు వారికి పెద్ద స్థాయిలోనే నష్టం వచ్చి ఉండాలి. 

అప్పట్లో సచిన్ అని ఒక బడా వ్యాపారవేత్త కొడుకు సంవత్సరానికి ఒక తెలుగు సినిమా వదిలేవాడు, వాళ్ళ నాన్నే ఆ ఖర్చు భరించేవాడేమో మరి. అలాగే మోహన్ బాబు పిల్లలు కూడా వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బుతో సంవత్సరానికి తలా ఒకటి తీస్తుంటారేమో. ఈ ఫామిలీ అనే కాదు సినిమా ఇండస్ట్రీ లో అన్ని హీరో ల ఫామిలీస్ ఇంతేగా. సరేలే మనదేం పోయింది అమెజాన్ కి, నెట్ ఫ్లిక్స్ కి చందా కట్టుకోవడమే కదా. 

సినిమాలో అంత పెద్ద స్కాం చాలా సింపుల్ గా చేసినట్లు చూపిస్తారు కానీ నమ్మబుద్ది వెయ్యదు, కాకపోతే 2016 లో షాగీ రవీందర్ అనబడే 24 ఏళ్ళ యువకుడు చేసిన మీరా రోడ్ కాల్ సెంటర్ స్కాం ని బేస్ చేసుకొని తీసిన సినిమా కాబట్టి నమ్మాల్సిందే. 

ఆస్టేలియా లో కూడా ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి నమ్మేసి 2000 డాలర్లు కూడా కట్టేసాడు. F. M ల్లో టీవీ ల్లో కూడా ఇల్లాంటి ఫేక్ కాల్స్ నమ్మొద్దని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అంటే మీరే అర్థం చేసుకోండి యెంత మంది బకరాలు అయి ఉంటారో.  

అసలు విషయం ఏమిటంటే ఇక్కడి కొచ్చిన కొందరు స్థానికులు,  విదేశీయులు చేస్తున్న జాబ్ తో పాటు సైడ్ బిజినెస్ చేసి రెండు చేతులా సంపాదిస్తుంటారు, ఆ సైడ్ బిజినెస్ అంతా కార్డు payments ద్వారా కాకుండా క్యాష్ రూపంలో జరుగుతుంటుంది. దీని వల్ల వాళ్ళు ఆ సైడ్ బిజినెస్ వల్ల సంపాదించిన దానికి టాక్స్ కట్టరు, సో ఆ భయం అలాగే ఉండిపోతుంది దాన్ని ఈ స్కాం చేసే వాళ్ళు కాష్ చేసుకుంటారు. వాళ్ళు పది మంది మీద వల చేస్తే అందులో ఇద్దరు ముగ్గురు చిక్కుకుంటారు.  

ఉదాహరణకి, ఒక మూడేళ్ళ క్రితం అనుకుంటా, నాకు ఇలాగే ఒక కాల్ వచ్చింది. నువ్వు కార్ రివర్స్ చేస్తూ మరొక కారుని గుద్దావు, ఆ విషయం ఓల్డ్ సీసీ కెమెరా రికార్డ్స్ డిలీట్ చేస్తున్నప్పుడు బయట పడింది కాబట్టి ఆ డామేజ్ కి డబ్బులు కట్టు అన్నారు. అది స్కాం అని నాకు అర్థం అయింది ఎందుకంటే నాకు అప్పటికి డ్రైవింగ్ రాదు కాబట్టి, కానీ వేరొకరైతే ఆ వల లో చిక్కుకునే ఛాన్స్ ఉంది. స్కాం చేసే వాళ్ళు కూడా పోతే వెంట్రుక వస్తే కొండ అని అనుకునే మొదలుపెడతారు. 

క్లుప్తంగా జరిగినదేమిటంటే షాగీ అనే యువకుడు కాల్ సెంటర్ ఓపెన్ చేసి యువతీ యువకులను రిక్రూట్ చేసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి అమెరికన్లకు ఫోన్ చేయించి పోయిన ఏడాది మీరు లేదా మీ ఆడిటర్ టాక్స్ పూర్తిగా కట్టలేదు, ఇంకా ఇంత అమౌంట్ కట్టాల్సి ఉంది ఈ రోజు లోగా కట్టకపోతే రేపు ఉదయాన్నే FBI వాళ్ళు మీ డోర్ తలుపు తట్టాల్సి వస్తుంది జాగ్రత్త అనే హెచ్చరికతో కూడిన బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. అలా రోజుకో 100 రాళ్ళు విసిరితే ఒక పది రాళ్ళు తగులుతూ ఉండేవి. ఆ కాల్ సెంటర్ లో పని చేసేవారికి జీతంగా 15000 రూపాయల దాకా ఇస్తూ డీల్ క్లోజ్ చేసి మనీ రాబట్టిన వారికి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేవారు. అలా స్కాం ద్వారా 380 మిలియన్ డాలర్ల దాకా గుంజారట.  ఆ తర్వాత స్కాం బయట పడ్డప్పుడు ఆటను దుబాయ్ పారిపోయి తర్వాత పోలీసులకి చిక్కి కొన్ని నెలలకు బయటికి వచ్చి దర్జాగా బతుకుతున్నాడని గూగులమ్మ చెబుతోంది. 

24, జూన్ 2021, గురువారం

ఒక విజేత కథ - ఏర్చి కూర్చిన కథలు

మా ఇంట్లో పెద్దగా చదివించలేదు గానీ లేదంటే నా రేంజే వేరుగా ఉండేది అని ఎవరైనా అనడం మన చెవిన పడుతూ ఉంటుంది అప్పుడప్పుడూ.  ఇది ఒక రకంగా వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే అని ఈ పోస్ట్ చదివాక మీకు అనిపించచ్చు. 

నోరు తిరగని పేరు గల Nusret Gökçe అనే కుర్రాడు మైన్స్ లో పనిచేసే ఒక లేబరర్ కొడుకు. ఇల్లు గడవాలి అంటే ప్రతీ రోజు ఆ మైన్స్ లో దిగాల్సిందే ఆ దిగువ తరగతి కుటుంబీకుడు. కానీ అతని కొడుకైన Nusret Gökçe బ్రతకాలంటే  అక్కడే ఆ మైన్స్ లో దిగాల్సిందే అని మైన్స్ లోతు ల్లోకి దిగలేదు , ఎత్తుకు ఎదగాలనుకున్నాడు ఎదిగి చూపించాడు. 

'పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పు, నీ చేతగాని తనమే" అంటారు కదా అలా చేతగాని వాడిలా మిగిలిపోలేదు. 

ఒక అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎంతోమంది గురించి మీరు వినే ఉంటారు లేదా చదివి ఉంటారు.  అలాంటి కోవలోకి చెందిన వ్యక్తే ఈ Nusret Gökçe. మరీ చరిత్ర సృష్టించేటంతటి ఉన్నత స్థాయికి చేరుకోక పోయి ఉండచ్చు, కానీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇతని కథ ఒక పాఠమే. 

పుట్టింది టర్కీ లో, ఒక పేద కుటుంబలో. స్కూల్ లో చదవడానికి డబ్బులు లేక 6 వ తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. అతని పేదరికం అతన్ని చదువుకు దూరం చేయగలిగిందేమో గానీ, అతని కష్టించే గుణం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. 

స్కూల్లో చదువే ఆర్థికస్తోమత లేక కుటుంబం గడవడం కోసం ఒక కసాయి కొట్లో అలాగే ఒక హోటల్ లో పనికి కుదిరాడు. అక్కడే తనకి వంట మీద మక్కువ ఏర్పడింది.  ఆ తర్వాత వివిధ దేశాలు తిరిగి అక్కడి రెస్టారెంట్స్ లో పనిచేసి వివిధ రకాల వంటలు నేర్చుకొని తన దేశానికి తిరిగొచ్చి ఆ అనుభవంతో తన మొదటి రెస్టారెంట్ ని మొదలెట్టాడు. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని దుబాయ్ తో పాటు అమెరికా లాంటి వివిధ దేశాలకి విస్తరించాడు. 

వంట చేసేటప్పుడు అతని చేష్టలు అలాగే వంట పూర్తయ్యాక సాల్ట్ ని ఆ వంట మీద చల్లే అతని స్టైల్ కి అభిమానులు ఉన్నారు (మన రజినీ కాంత్ నోట్లో సిగరెట్ విసురుకునే విధానానికి ఉన్నట్లు). ఆ సాల్ట్ చల్లే ఒక ప్రత్యేకమైన అతని స్టైల్ వల్ల Salt Bae అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. Salt Bae అని మీరు గూగుల్ లో టైపు  చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ చూడొచ్చు. 

పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రతీ వారి జీవితంలో ఉన్నట్లే ఇతనూ విమర్శలు ఎదుర్కున్నాడు గానీ అవేమీ అతని ఎదుగుదలని ఆపలేకపోయాయి.  ఫుడ్ బాగా కాస్ట్లీ అనీ మరీ అంత రుచిగా ఏమి ఉండదు అని ప్రఖ్యాత మ్యాగజైన్స్ లో విమర్శించారు అలాగే కస్టమర్స్ తమకు ఇచ్చే టిప్స్ లో అతను వాటా అడుగుతాడని అతని రెస్టారెంట్ లో పని చేసిన కొందరు వెయిటర్స్ ఆరోపణలు చేశారు, వాటి కోసం కోర్ట్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది గానీ అవేమీ అతని బిజినెస్ ని దెబ్బతీయలేదు.

కథ ఇక్కడే ముగిసిపోలేదు, శ్రీమంతుడు సినిమాలో లాగా తన ఊరికి ఏదైనా చెయ్యాలనుకొని తనలా తన ఊరిలో ఇంకెవ్వరూ చదువుకు దూరం కాకూడదని స్వంత డబ్బులతో స్కూల్ కట్టించాడు.  

చివరికి దీని నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా అంటే, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాకపోతే దాన్ని మనమే ప్రపంచానికి చూపెట్టాలి ఆ కళను ప్రదర్శించే ప్లాట్ఫారంని మనం వెదుక్కోవాలి లేదంటే నిర్మించుకోవాలి. వంట చేయడం అనేది కూడా ఒక కళే, దాన్ని సరైన చోట ప్రదర్శించబట్టే అతను విజేత అయ్యాడు.  ఇలాంటి విజేతలు ఎక్కడో విదేశాల్లో కాదు మన ఊర్లోనే ఉంటారు, మనం వారిని చూసి స్ఫూర్తి పొందాలి. 

21, జూన్ 2021, సోమవారం

2 లక్షల వీక్షణలు

ఒక గాడిద గుంటలో పడిందట, నువ్వు పైకి రాలేవు  కష్టపడి నీ శక్తి వృధా చేసుకోకు అన్నాయట పైనుండే తోటి మిత్ర బృందం. 

కానీ అది మాత్రం ఆపకుండా  అలాగే అని తన ప్రయత్నాలు అది చేసి పైకి వచ్చిన తర్వాత 'మేమంతా నిన్ను నిరుత్సాహ పరచినా నువ్వు ప్రయత్నించి పైకి వచ్చావంటే పర్లేదు, నీకు పట్టుదల ఉంది' అందట తోటి మిత్ర బృందం

'ఆ చెప్పేదేదో గట్టిగా చెప్పండి, నాకు చెవులు సరిగా వినపడవు అన్నదట' గుంటలో నుంచి పైకొచ్చిన గాడిద. 

సరిగ్గా పై పిట్టకథ లోని గాడిద లాంటి వాడిని నేను, నా ప్రయత్నం ఏదో నేను చేస్తుంటాను. మొదట్లో బ్లాగ్ మొదలెట్టాలి అనుకున్నప్పుడు పది పోస్టులు పెడితే ఎక్కువ ఇంతోటి సంబడానికి బ్లాగ్ అవసరమా అని నిరుత్సాహపరచిన వాళ్ళే ఎక్కువ. నువ్వు రాస్తే మాత్రం చదివే వాళ్ళు యెంత మంది ఉంటారు? శుద్ధ దండగ అని అన్నవారు కొంతమంది. 

నేను కూడా చెవిటి గాడిదలాగా ఇవన్నీ వినిపించుకోకుండా, రాయడం మొదలెట్టాను. అసలు ఏం రాయాలో కూడా తెలీదు ఎలా రాయాలో తెలీదు. ఎప్పుడూ పట్టుమని పది పుస్తకాలు కూడా చదవలేదే, కనీసం వార్తా పత్రికలలో సినిమా పేజీ తప్ప మిగతా పేజీలు ఎప్పుడూ చదివినట్లు కూడా గుర్తులేదు. ఇక వార్తలు వినడం అన్న మంచి అలవాటు కూడా లేదు లోక జ్ఞానం సంపాదించడానికి. సరే, Ignorance is bliss రాసేద్దాం ఏదో ఒకటి అని అయిదేళ్ళ క్రితం మొదలెట్టాను. 

బ్లాగ్ మొదలెట్టానని తెలిసిన కొందరు మిత్రులు 

నువ్వు తప్ప ఇంకెంత మంది చదువుతారు? హహ్హహ్హ 
ఈ కాలం లో తెలుగు చదివే వాళ్ళు ఎవరు ఉన్నారు?
వీడేదో రైటర్ అనిపించుకోవాలని పెద్ద ఆశ. 
ఇలాంటివి నేనూ రాయగలను. పెద్ద కష్టం ఏమీ కాదు. 
పర్లేదు, బానే రాస్తున్నావ్. 
నీలో ఈ కళ కూడా ఉందన్నమాట. 

అని మిక్స్డ్ రియాక్షన్స్ ఇచ్చారు. 

తెలిసిన వాళ్ళు ఏదో మొహమాటం కొద్దీ మొదట్లో చదువుతారు. ఆ తర్వాత వీడి లొల్లి ఏమిటి అని ఆ తర్వాత సైట్ ఓపెన్ కూడా చేయరు అన్నారు కొందరు. నిజం చెప్పాలంటే నాకు తెలిసిన వారు ముగ్గురు నలుగురు తప్ప ఎవ్వరూ నా బ్లాగ్ చదవడం లేదు, వాళ్ళను చదవమని కూడా నేను రిక్వెస్ట్ చేయలేదు. ఇష్టంగా, ఎక్కువగా చదువుతున్న వారంతా నాకు ముఖ పరిచయం లేని వారే. చదివి ప్రోత్సహిస్తున్న వారికందరికీ ధన్యవాదాలు అలాగే నువ్వు తప్ప ఇంకెంత మంది చదువుతారు? అని వెక్కిరించిన వారికి కూడా.  ఎందుకంటే తెగిడే వాళ్ళే లేకపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు కాబట్టి. 

మీ అందరి చలవ వల్ల ఇప్పటికి నా బ్లాగ్ కి అక్షరాలా 2 లక్షల వ్యూస్ వచ్చాయి. అయిదేళ్ళలో నేను రాసిన 143 పోస్టులకి 2 లక్షలు అంటే చాలా తక్కువే అయి ఉండచ్చు కాకపోతే నా లాంటి వాడికి అది చాలు.  లక్షలు అంటే నేను పనిచేసేచోట ఒక రోజు జరిగిన సంఘటన గుర్తొస్తోంది.  

'ఫలానా సర్వీస్ ప్రొడక్షన్ లో యెంత మెమరీ తీసుకుంటోంది  అని అడిగింది' ఒక తెల్లావిడ మన ఇండియన్ ని. 

దానికి ఇతను 10.2 లాక్స్ కిలో బైట్స్  అన్నాడు. 

సారీ, నాకు అర్థం కాలేదు అంది ఆ తెల్లావిడ. 

మనోడేమో అరౌండ్ 10 లాక్స్  అన్నాడు. 

పాపం అతను ఆస్ట్రేలియా వచ్చి నెల రోజులే అయింది, తను చెప్పేది క్లయింట్ కి అర్థం  కావట్లేదు, ఆవిడకి అర్థం అయ్యేట్లు ఎలా చెప్పాలి అని అతను తిక మక పడుతుంటే, నేను మధ్యలో కలుగజేసుకొని 1 మిలియన్ అన్నాను. ఇక్కడ మీరు లక్షలు అనేది వాడరు కాబట్టి మీకు అది తెలియదు, ఇండియా లో మేము లక్షలు అంటాము అని వివరించాను.  

18, జూన్ 2021, శుక్రవారం

నిశ్శబ్దం సినిమా - రంధ్రాన్వేషణ

దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్క మొరిగినట్లు, ఎప్పుడో రిలీజ్ అయిన నిశ్శబ్దం సినిమాని ఇప్పుడు చూసి రివ్యూ రాస్తున్నాను. 

మొన్నటి అప్పడానికి, నిన్నటి న్యూస్ పేపర్ కి వేల్యూ ఉండదని తెలుసు కాకపోతే న్యూస్ పేపర్ యెంత పాతదైనా కొన్ని ఆర్టికల్స్ ఎప్పటికీ చదవటానికి బాగుంటాయి అలాగే అప్పడం మొన్నటి దైనా దాన్ని జాగ్రత్త పరిస్తే కాస్త కరకర లాడుతూనే ఉంటుంది, అలాంటి ప్రయత్నమే నాది.  

సినిమా స్టార్టింగ్ లోనే అంజలి పోలీస్ ఆఫీసర్ అంటే నవ్వొచ్చింది, ఆ పాత్రకి ఆ అమ్మాయి సూట్ అవలేదేమో అని నా ఫీలింగ్. ఉత్సవ విగ్రహం లాగా ఉండటం తప్ప పెద్దగా పనికొచ్చే ఇన్వెస్టిగేషన్ చేయదు ఆ పాత్ర.  ఇక తనకొక ఫామిలీ ఉన్నట్లు చూపించారు, కానీ కథకు పెద్దగా అవసరపడనప్పుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని నాకు అనిపించింది.  అంజలి అక్కగా వేసినావిడ ని సైక్రియాటిస్టు అని చెప్పి ఒక క్లూ ఇచ్చినట్లు చూపించారు కానీ మినిమం కామన్ సెన్స్ ఉన్నవారికే ఆ విషయం తెలిసిపోద్ది, అంతోటి దానికి ఒక సైక్రియాటిస్టు చెప్పాల్సిన అవసరం లేదు. 

అంజలి హస్బెండ్ గా పాత్ర వేసిన అవసరాల తప్పితే మిగతా వారంతా అక్కడ సెటిల్ అయిన తెలుగు వాళ్లేమో అనిపించింది, ఎవ్వరికీ బొత్తిగా నటించడం తెలియదు. ఇలా చాలా సినిమాల్లో చూశాను. వీసా ఖర్చులు, ట్రావెలింగ్ అండ్ అకామిడేషన్ ఖర్చులు కలిసొస్తాయని అంతగా ప్రాముఖ్యం లేని పాత్రలలో లోకల్ తెలుగు వాళ్ళనే పెట్టి తీస్తుంటారు. 

ఆస్ట్రేలియా లో ఎవరైనా ఒక సినిమా తీసి,  అందులో నాకూ అలాంటి ఒక వేషం ఇస్తే చాలు, ఫ్రీ గా నటించి సినీ కళామతల్లి సేవ చేసుకుంటా :)  మనలో మన మాట ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుపుకున్న చాలా సౌత్ ఇండియన్ సినిమాలు హిట్టవ్వలేదని నా ఎనాలిసిస్ చెబుతోంది (ఆరెంజ్, ఒక్క మగాడు, శంఖం, నీవల్లే నీవల్లే, ప్రేమికుల రోజు, తలైవా, అమృతరామమ్ లాంటివి కొన్ని ఉదాహరణలు). అసలే ఈ సినిమా వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ కదా. కొన్ని హిట్ సినిమాలు కూడా ఉన్నాయనుకోండి (ఆడవారి మాటలకి అర్థాలు వేరులే, సింగం 3)

అంజలి భర్త క్యారెక్టర్ లో నటించిన అవసరాల క్యారెక్టర్ అనవసరం అనిపించింది. 'తను దూర సందు లేదు మెడకో డోలు' అన్నట్లు తన క్యారెక్టరే సినిమాలో వేస్ట్ అంటే మళ్ళీ ఆవిడకో ఫామిలీ. ఎక్స్ట్రా ఖర్చు, footage తప్పితే దేనికి ఉపయోగం? (ఈ మధ్య చూసిన మరో సినిమా  'యుద్ధం శరణం' లో కూడా ఇలాంటిదే గమనించాను. అందులో మురళీ శర్మ అర్థం పర్థం లేని ఇన్వెస్టిగేషన్ ఏమిటో పక్కన అసిస్టెంటుగా వుండే రవివర్మ ఏం చేస్తుంటాడో అస్సలు అర్థం కాదు. రవివర్మ క్యారెక్టర్ అసలు సినిమాలో ఏం చేస్తుందో కూడా తెలీదు, కథకు అస్సలు అవసరం లేని పాత్ర అది (ఎడిటింగ్ లో ఏమైనా లేచిపోయిందేమో ఆ పాత్ర చేసే పనికి వచ్చే పని సినిమాలో ఏదైనా ఉంటే, అది నాకు తెలీదు). 

ఇక మాధవన్ ఎందుకు ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నాడో తెలియాలి. బేరాలు తగ్గాయా లేక మొహమాటపడ్డాడా ఒక సారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. ఎర్ర గులాబీలు సినిమాలో కమలహాసన్ చేసిన క్యారెక్టర్ ని మాధవన్ చేశాడు అంతే. మైకెల్ మాడ్సెన్ పాత్ర అదే ఎర్ర గులాబీలు సినిమా లోని కమలహాసన్ తండ్రి పాత్రని గుర్తు చేస్తుంది. 

ఇక అనుష్కని ఇంత పేలవంగా నేనుప్పుడూ చూడలేదు, ఆ హెయిర్ కట్ అస్సలు సూట్ అవ్వలేదు. తన క్యారెక్టర్ ని పెయింటర్ గా,  మూగ, చెవిటి అమ్మాయిలాగా ఎందుకు పెట్టారో అర్థం కాదు, కథలో దాని ప్రమేయం అసలు లేదు, మామూలుగా పెట్టినా కథకు వచ్చే నష్టం లేదు. (రంగస్థలం లో కథానాయకుడికి చెవుడు అని పెట్టడం వల్ల కథకు ఒక ఉపయోగం వచ్చింది, దాన్నే వాడుకున్నారు కూడా కథ నడవడానికి.) సినిమా లో గన్ చూపిస్తే సినిమా అయిపోయేలోగా అదొక్కసారైనా పేలాలి  అంటారు, మరి ఈ సూత్రం ఎందుకు మరచి పోయారో. 

ఏదో హారర్ మూవీ అని కలరింగ్ ఇచ్చి ఆ పైన సస్పెన్స్ థ్రిల్లర్ అని చూపించారు. అనుష్క తో మొదలుకొని సుబ్బరాజు పాత్ర వరకు తమ తమ flashbacks మనకు అప్పుడప్పుడూ చెప్పేస్తూ ఉంటారు. అవన్నీ పోలీస్ ఆఫీసర్ కదా కనిపెట్టి మనకు చెబుతూ ఉండాలి, ఇంత మాత్రం దానికి పోలీస్ ఆఫీసర్ ఉండటం ఎందుకు కథలో.  

ఇంతోటి సినిమాని అమెరికా లో తీయడం ఎందుకు, రిచ్ నెస్ కోసమా? ఆ సినిమా తీసినోళ్ళకే తెలియాలి. నాకు హిందీ సినిమాలలో నచ్చనిది ఇదే, అవసరం లేకున్నా ఏదో ఒక ఫారిన్ కంట్రీ లో సినిమా తీస్తారు. అదే తమిళ్, మలయాళం సినిమాలు చూస్తే చాలా వరకు లోకల్ గా తీసి ఆకట్టుకున్నవే. 

ఏదో సంపూర్ణేష్ బాబు లేదంటే షకలక శంకర్ సినిమా అంటే మన అంచనాలు అడుగున ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు సినిమా బాగాలేకున్నా. కాకపోతే అనుష్క, మాధవన్ అనేసరికి కాస్త ఎక్కువ అంచనాలు ఉంటాయి అక్కడే ఇబ్బంది. సరేలెండి తీసే వాళ్లకు తెలుస్తుంది ఆ కష్టం, ఒడ్డున ఉన్న నా లాంటి వాడు ఇలా రాళ్ళేస్తూ ఉంటాడు. 

14, జూన్ 2021, సోమవారం

తమిళోళ్ళయినా తెలుగు భలే మాట్లాడుతున్నారే?

నేను చిన్నప్పుడు మా పక్కింట్లో ఉండే ఒక అన్నతో చిరంజీవి సినిమాకని వెళ్తే, టికెట్స్ దొరక్క మరేదో సినిమాకి వెళ్ళాము. సినిమా మొదలయి అరగంట దాటుతోంది

'హీరో లేడా ఈ సినిమాలో' అని అడిగా?

ఉన్నాడురా?

మరి ఇంత వరకు కనపడలేదే సినిమాలో. 

ఇందాకే కదరా ఒక ఫైటింగ్ చేశాడు. 

అతనా? హీరో లా అనిపించట్లేదే, ఆయనేం హీరో?

తమిళ్ హీరో రా 

కృష్ణ, శోభన్బాబు లాగా ఉంటారనుకున్నానే హీరో అంటే. కనీసం చిరంజీవి, కృష్ణంరాజు లా ఉన్నా ఓకే. ఇతనెవరు? 

విజయ్ కాంత్ అని 

రజనీ కాంత్ తమ్ముడా?

కాదు, ఇతను వేరే. 

మనిషి అందంగా లేకపోయినా అతని వాయిస్ భలే ఉంది అనుకున్నా. 

ఇంకోసారి మోహన్ లాల్ సినిమాకి వెళ్ళినప్పుడు అరే, ఇతని వాయిస్ కూడా భలే ఉందే అనుకున్నా. 

ఈ సారి శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు వంతు.  ఇతని వాయిస్ కూడా బాగుందే, మన తెలుగు వాళ్ళు కాకపోయినా తెలుగు భలే మాట్లాడుతున్నారు వీళ్ళంతా. సుమన్, రాజశేఖర్ కూడా తమిళ్ సినిమా నుంచే వచ్చారు. కానీ వీళ్లందరి వాయిస్ కూడా భలే ఉంటుందే అనుకున్నా. 

ఆ తర్వాతెప్పుడో ఇంట్లోకి టివి వచ్చి, కేబుల్ కనెక్షన్ ఇంట్లోకి జొరబడి వారంలో నాలుగైదు సినిమాలు చూశాక కానీ తెలీలేదు ఆ వాయిస్ లు చాలా వరకు ఒక లాగే ఉంటున్నాయి అని. సితార, జ్యోతిచిత్ర లాంటి సినిమా వారపత్రికలు చదివాక తెలిసింది వీరందరి వెనుక డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ఉంటారని, అలాంటి వారిలో సాయి కుమార్, ఘంటశాల రత్న కుమార్ లాంటి వారు ముందంజలో ఉన్నారని. అంతవరకూ పాటలు మాత్రమే వెనుక నుండి పాడుతారు అని తెలుసు కానీ మాటలు కూడా వేరొకరు మాట్లాడుతారని తెలిసింది.  అలాగే సినిమాకి ఒక డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్, మాటలు, పాటలు రాసేవాళ్ళు ఉంటారని. హీరో అని పిలవబడే సదరు పెద్దమనిషి ఒట్టి తోలుబొమ్మ మాత్రమే అని అప్పుడు తెలిసింది. వెనుక నుంచి ఎంతోమంది కలిసి శ్రమించి వాళ్ళు ఎలా ఆడిస్తే వీళ్ళు  తెర మీద అలా ఆడతారని. 

పోయిన వారం ఘంటశాల గారి తనయుడు,  ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్  'ఘంటశాల రత్న కుమార్' గారు మరణించారని తెలిసింది. తండ్రిలా గాయకుడిగా రాణించలేకపోయినా డబ్బింగ్ వృత్తి లో తనదైన ముద్రవేసిన వారికిదే నా నివాళి. 

7, జూన్ 2021, సోమవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 1

హలో, మీ సిగరెట్ బాక్స్ కింద పడింది.

అది ఖాళీ అయింది నాకిక అవసరం లేదు అన్నాడు కొత్తగా విదేశానికి వెళ్లిన మన ఇండియన్. 

మా దేశానికి కూడా అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని చేతికిచ్చాడు. 

ఇది చాలా సార్లు విన్న జోకే అయినా సిడ్నీ లో దిగగానే నాకు గుర్తొచ్చింది. దూరపు కొండల నునుపెంతో రోడ్స్ మీద చచ్చి పడున్న సిగరెట్స్, రైళ్ళలో, స్టేషన్స్ లో ఖాళీ అయి పడి ఉన్న కూల్డ్రింక్స్ బాటిల్స్ తెలియజేశాయి. పక్కనే డస్ట్ బిన్స్ ఉన్నా కొందరు ఎక్కడంటే  అక్కడ పడేస్తుంటారు చెత్తని. మలేషియా లోనే సింగపూర్ లోనే అలా కింద పడేస్తే ఫైన్స్ వేస్తారని విన్నాను. అవి కూడా నాకు దూరపుకొండలు కాబట్టి ఎవరైనా దాని నునుపెంతో తెలియజేయండి. ఇక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్ లో మరీ అంత స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ ఉన్నట్లు లేవు. 

ఇక ఫుట్పాత్ మీద నడుస్తూ వెళ్తూ పొగ వదుల్తుంటారు కొందరు ధూమపాన రాయుళ్ళు, వారి వెనుక వస్తే మాత్రం చచ్చే చావే. కాసేపు అక్కడే ఆగి, ఆ పొగ రాయుడు ( చినరాయుడు, పెద రాయుడు, సుబ్బారాయుడు లాంటి వారి మనోభావాలు ఎప్పుడూ దెబ్బతినలేదా అలా ఎవరైనా అన్నప్పుడు, లేక మగరాయుడు అనేదాంట్లో కూడా రాయుడు ఉంది కదా అని సంతోషపడ్డారా??) కాస్త దూరం వెళ్ళే దాకా ఆగడం లేదంటే అర్జెంట్ గా వెళ్తున్నప్పుడు ఆ పొగ రాయుడిని లేదంటే ఆ రాయుడమ్మ ని దాటి వెళ్ళాలి. (ఎవ్వరి మనో బావాల, మరదళ్ళ వివక్షలేదని నా ఉద్దేశ్యం)  నేను రాస్తున్నది రామాయణం కాదు కాబట్టి ఈ పిడకల వేట ఉండటం లో తప్పేం లేదు. అది రామాయణంలో పిడకల వేట కాదని, పితకాల వేట అని కాదు కాదు పీడ కలల వేట అని కొందరు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అంటుంటారు. 

సరే ఆ పిడకల వేట వదిలేసి విషయానికి వస్తే,  ఏ పూర్వ జన్మ శాపమో గానీ, నేను ఏ ఇంట్లో అద్దెకి ఉన్నా నా కింది ఇంటి వాడో, పక్కింటి వాడో బాల్కనీ లో పొగ వదులుతుంటారు. వీళ్ళ దెబ్బకి విశాలమైన బాల్కనీ ఉండి కూడా అక్కడ కూర్చొని టీ తాగాలన్నా, కనీసం ఓపెన్ చేయాలన్నా భయం వేస్తుంది. 'పది మంది పొగరాయుళ్ళకి/రాయుడమ్మలకి  పది రోజుల పాటు పది సిగరెట్ పెట్టెలు పంచి పెడితే ఈ పాపం పోతుందని'  నా జాతకం చూసి పొగేశ్వరస్వామి సెలవిచ్చారు లేదంటే Pavan అని కాకుండా Paavan అని ఒక a ఎక్కువ చేర్చాలట నా పేరులో. ఆలోచించుకోవాలి ఏ రెమెడీ ఫాలో అవ్వాలో. 

నా చిన్నప్పుడు ఈ ఇంటర్నెట్ లేదు కాబట్టి క్రికెట్ విషయంలో మాత్రమే అప్పట్లో ఆస్ట్రేలియా పేరు ఎక్కువగా పినిపించేది, సబ్జక్ట్స్ లో, టీవిలో న్యూస్ లో వచ్చినా అవి మనకు వినపడవు. ఆ తర్వాత రేసిజం మీద ఒక పదేళ్ళ క్రితం జనాల నోళ్ళలో బాగా నానింది. అప్పుడే నా onsite ప్రయాణం ఆస్ట్రేలియా కి, చాలా మంది భయపెట్టారు కానీ రేసిజం తీవ్రతను నేనెప్పుడూ ఎదురుకోలేదు ఇక్కడ. 

ఈ మధ్య గత రెండేళ్ళుగా వార్తలలో మరీ ఎక్కువగా వినపడుతోంది ఆస్ట్రేలియా పేరు. కార్చిచ్చులని కొన్ని రోజులు, వరదలని కొన్ని రోజులు, ఎలుకల దాడి అని గత వారం రోజులు వార్తల్లో నిలిచింది. పోయిన రెండు నెలలలో విపరీతంగా కురిసిన వర్షాల దాటికి కలుగుల న్నీ నిండిపోయి ఎలకలు ఊరిమీద, ఇళ్ళ మీద పడ్డాయి. 

గత సంవత్సరం లంచ్ టైం లో టీవీలో వార్తలు వింటూ ( ఆఫీస్లో ఛానల్ మార్చే అవకాశం లేదు కాబట్టి, లేదంటే వార్తలు చూసే అలవాటు మా ఇంటా వంటా లేదు మా నాన్నగారికి తప్ప) covid గురించి విన్న కొత్తలో 'హెహ్హేయ్, అదెక్కడో చైనా లో మొదలైన వైరస్, దాని గురించి ఎందుకు ఇంత వర్రీ' అనుకున్నా కర్రీ లో చపాతీ ముంచుకొని తింటూ. ఆ తర్వాత కదా దాని ప్రతాపమేమిటో ప్రపంచానికి తెలిసింది. ఆ విషయం ఇంకా గుర్తు ఉంది కాబట్టే మేముండేస్థలం ఆ మూషికదాడులు జరిగే స్థలానికి దూరంగా ఉన్నా భయపడాల్సి వస్తోంది. అవి మేము ఉండే చోటికి చేరేలోగా వాటిని అరికట్టే చర్యలు ప్రభుత్వం చేపడుతుందని  ఆశిస్తూ... 

1, జూన్ 2021, మంగళవారం

మొండోడు మేనేజర్ కంటే గొప్పోడు

ఇవాళ ఉదయం ట్రైన్ లో మా పాత మేనేజర్ కనపడ్డాడు. అతనితో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి  రాయాలనిపించి రాస్తున్నా. 

"IT తల్లికి చేస్తున్న సేవకు ఫలం ఇదేనా?" అన్నాన్నేను బాధతో కూడిన ఆవేశంతో.  

"నువ్వేం ఊరికే చేస్తున్నావా?" నిర్లక్ష ధోరణిలో మా మేనేజర్ సుబ్బారావ్

ఊరికే కాదనుకోండి, కాకపోతే సినిమా వాళ్ళు రొటీన్ గా అంటుంటారు కదా "కళామ తల్లికి యెనలేని సేవలు చేశాను" అని అలా ఏదో ఒక డైలాగ్ ఫ్లో లో వచ్చింది.

ఏది ఏమైనా సరే నాలుగైదు రోజుల్లో నువ్వు ఇండియా పోవాల్సిందే. ఫండ్స్ లేవని క్లయింట్ ప్రాజెక్ట్ ఆపేయమన్నారు. 

నాకు ఇంకో మూడు వారాలు గడువు కావాలి.

ఇవ్వను.

కంపెనీ పాలసీ ప్రకారం ఇచ్చి తీరాల్సిందే 

మరీ మొండిగా బిహేవ్ చేస్తున్నావ్, ఖరా ఖండిగా చెప్పేస్తున్నా మంచిగా వెళ్ళు, ఇన్నేళ్ళు మంచిగానే ఉన్నావుగా ఈ మొండితనం నీకు మంచిది కాదు. 

మనిషి బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి.. మంచితనం మనుషుల మీద .. మొండితనం పరిస్థితుల మీద చూపించాలి

quote బాగుంది, పేస్ బుక్ లో పెట్టుకో

అక్కడినుంచే కొట్టుకొచ్చా, మళ్ళీ నా పేరుతో పోస్ట్ చేస్తే కొట్టేస్తారు. నా సొంత quote చెప్తాను విను.   'మొండోడు మేనేజర్ కంటే గొప్పోడు' ..... గుర్తుంచుకో.

నా ఈగో హర్ట్ చేస్తున్నావ్?

అది నా దగ్గర టన్నుల కొద్దీ ఉంది. అయినా నేనేమైనా నీ ఆస్తులో లేదంటే కంపెనీ ఆస్తులో రాసిమ్మని అడుగుతున్నానా ఏమిటి? నాకివ్వాల్సిన నాలుగు వారాల గడువు నాకివ్వు అనే కదా అడిగేది.

ఇవ్వను. ఈ శుక్ర వారం నైట్ కి టికెట్స్ బుక్ చేసుకో...  నువ్వు ఇండియా పోవాల్సిందే. కావాలంటే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలైతే నిన్నే పిలిపిస్తా. 

దీన్ని శాడిజం అంటారు, మమ్మల్ని ఇండియా వెళ్ళమంటున్నావ్ అదీ నాలుగైదు రోజుల్లో. శుక్రవారం ఆఫీస్ కి వచ్చి ఆ రోజు రాత్రే ఫ్లైట్ ఎక్కాలంటున్నావ్? మేమేమైనా  పిక్నిక్ వచ్చామా, అంతా సర్దేసుకొని సాయంత్రానికి బయలుదేరడానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు పిలవగానే  మళ్ళీ ఇక్కడికి రావడానికి. అయినా ఇలా మమ్మల్ని ఇండియా పంపించడానికి నీకు బాధ వేయట్లేదా?

నీ ఇంట్లోనుంచి నువ్వు ఈగలు బయటికి తరిమేస్తే నీకు బాధగా ఉంటుందా?

అంటే మేము నీకు ఈగలతో సమానమన్నమాట.

అవును అంతే.

చపాతీలు తినేవాడివి నీకే అంత ఉంటే అన్నం తినేవాడిని నాకెంత ఉండాలి?

ఏమిటది?

ఏమో నాకూ తెలీదు, ఒక తెలుగు సినిమాలో హీరో డైలాగ్ గుర్తొచ్చి ఫ్లో లో చెప్పేశా. నీకో కథ చెబుతా విను

కొన్నేళ్ళ క్రితం "నువ్వు onsite ఎలా వెళ్తావో నేనూ చూస్తా" అన్నాడు నీలాంటి ఒక మేనేజర్. నా గుండె మండి పోయి ఆ వీకెండే ఇంటర్వ్యూ కి వెళ్లి మండే కి ఆఫర్ లెటర్ తెచ్చుకొని నా మొండి తనం ఎలా ఉంటుందో చూపించి రిసైన్ చేశా.

అప్పుడు పై మానేజ్మెంట్ దిగి వచ్చి, బాలకా ఏమిటి నీ కోరిక అన్నారు.

పాకిస్తాన్ తప్ప ఏ పరదేశమైనా పంపించండి అని అడిగా.

ఇంత ఫ్రస్ట్రేషన్ ఏమిటి పవన్? అని అడిగింది మా డిపార్ట్మెంట్ హెడ్ 

ఫ్రస్ట్రేషన్  కాక  మరేమిటి వినుత గారు, నన్ను అమెరికా పంపిస్తామని చెప్పి వాడెవడినో పంపించారు మా మేనేజర్ డర్టీ పాలిటిక్స్ నడిపించి.  ఈ ఆఫీసులో అందర్నీ ఏదో ఒక దేశం పంపించారు చివరాఖరికి  ఆ టీ పెట్టే అతన్ని, బయటున్న ఆ సెక్యూరిటీ గార్డ్ ని, బాత్రూములు క్లీనింగ్ చేయడానికి వచ్చే ఆ బాయ్ ని కూడా పంపించేటట్టు ఉన్నారు నన్ను తప్ప. 

అలా మొండిపట్టు పట్టి ఆ దేవత కరుణించబట్టి  ఆస్ట్రేలియా వచ్చా.  ఆ మొండిపట్టుని దాచి ఉంచి మంచిగా ఉంటూ ఎనిమిది ఏళ్ళు నెట్టుకొచ్చా ఆస్ట్రేలియా లో. కాబట్టి నా మంచితనం వైపే చూడు, మొండితనం వైపు చూడాలనుకోకు మాడి మసై పోతావ్. 

నీ తొక్కలో సినిమా డైలాగ్స్ నన్ను భయపెట్టలేవ్, ఏం చేసుకుంటావో చేసుకో. 

వెంటనే నేను ఒక మైగ్రేషన్ ఏజెంట్ మరియు లాయర్ ని కలిసి నాకున్న రైట్స్, అవకాశాల పరిమితులు తెలుసుకొని వాటితో ఇక్కడ నెగ్గుకురాగలను అనే నమ్మకంతో మరుసటి రోజు ఉదయమే మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి .. 

'సుబ్బారావ్ నేను resign చేస్తున్నట్లు మెయిల్ కూడా పంపించా, అలాగే పోర్టల్ లో కూడా అప్డేట్ చేశా' అన్నాను కాంటీన్ లో కాఫీ తాగుతున్న మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి 

ఏంటీ? resign  చేశావా? నెలలో నీ వీసా కాన్సల్ అవుతుంది, అప్పుడైనా నువ్వు ఇండియా వెళ్ళిపోవాలి. అని బెదిరించాడు. 

అవన్నీ నేను చూసుకుంటాను. ఇంకో స్పాన్సర్ ని వెతుక్కుంటా ఆ లోపు, నా మీద నాకు నమ్మకం ఉంది. 

నమ్మకం వమ్ము అయితే?

నమ్మకం అమ్మ లాంటిది, ఎప్పుడూ మనల్ని మోసం చెయ్యదు. 

సినిమాలు ఎక్కువ చూస్తావ్ అనుకుంటా. 

అవును రాత్రే మా బాస్ సినిమా 'ఛాలెంజ్' ముప్పై మూడో సారి చూశా. 

అంత కరెక్ట్ గా  ఎలా గుర్తు పెట్టుకున్నావ్ అన్ని సార్లు చూశావని. 

ఏదో నోటికొచ్చిన నెంబర్ చెప్పా... టాపిక్ డైవర్ట్ చెయ్యకు. 

రిస్క్ చేస్తున్నావేమో ఆలోచించు, రిస్క్ చేయడమంటే రస్క్ తిన్నంత ఈజీ కాదు అన్నాడు కాఫీ లో రిస్క్ ముంచుకు తింటూ. 

అంటే నువ్వు కూడా సినిమాలు ఎక్కువ చూస్తావన్నమాట. 

అవును ఎంటర్టైన్మెంట్ కావాలంటే హిందీ లోకి డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలే చూస్తా. చూశావా మన ఇద్దరి వేవ్ లెంగ్త్ యెంత బాగా మ్యాచ్ అవుతుందో. 

మ్యాచింగ్ తర్వాత, నువ్వు మనిద్దరి మధ్య ప్యాచింగ్ చేస్తున్నావని అర్థం అవుతోంది. ఇంతకీ ఏమంటావ్?

"ఏముంది, ఒక నెల ప్రొడక్షన్ సపోర్ట్ లో వర్క్ చెయ్, ఈ లోపు ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు, అందులో చేరచ్చు" అని మేనేజర్ చెప్పడం తో మా మధ్య సంధి కుదిరింది. 
 
ఒక రెండు వారాలు గడిచాక, ఆపేసిన ప్రాజెక్ట్ మళ్ళీ మొదలెట్టమని క్లయింట్ చెప్పారు. అలా శుభం కార్డు అప్పటికి పడిపోయింది. కాబట్టి నేను చెప్పొచ్చేదేమిటంటే జీవితంలో కొన్ని సార్లు మొండితనం, ధైర్యం, తెగింపు లాంటి వాటికి చోటివ్వాల్సిందే.  

అర్రే, నా లైఫ్ లో కూడా చిన్నా చితక విషయాలు ఉన్నాయ్ కాసింత మసాలా కలుపుకుంటే నా ఆటోబయోగ్రఫీ రాసుకోవడానికి. ఏం గాంధీ, కెప్టెన్ గోపినాథ్, విఠల్ కామత్ లాంటి గొప్పోళ్ళు మాత్రమే రాసుకోవాలా, నా లాంటి అతి సామాన్యుడు రాసుకోకూడదా ఏమిటి? కాబట్టి ఇంకో ఇరవయ్యేళ్ళ తర్వాత 'నేను - నా మదిలో సోది' అని రాసుకుంటా. ఇంకా మంచి టైటిల్ మీకు స్ఫురిస్తే చెప్పేయండి నా బుక్ మీద వచ్చే లాభాలన్నీ మీకే ఇచ్చేస్తా. అవును, సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకున్నట్లు ఈ బుక్ టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్ఛా ఇంకొకరు కొట్టేయకుండా?