15, జనవరి 2017, ఆదివారం

ఖైదీ నెంబర్ 150 కబుర్లు

సుష్టుగా భోజనం చేసి సోకులన్నీ చేసుకొని మూడు గంటల షో కి బయలుదేరేపాటికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే దండిగా పోగయిన చిరంజీవి అభిమానుల కోలాహలం తో సందడిగా ఉంది. చిరంజీవి కం బ్యాక్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ రెండు కేకులు కట్ చేసేసారు అభిమానులు. వచ్చిన పిల్లలకు చాక్లేట్లు, కేకులు పంచారు. ఫ్రీ గా చిన్న సైజు వెజ్ అండ్ నాన్వెజ్ buffet కూడా ఏర్పాటు చేశారు.  కనీసం 600 డాలర్స్ దాకా ఖర్చు పెట్టినట్లున్నారు. 





ఇంత మంది గొప్ప అభిమానులు ఉండటం చిరంజీవి గారి అదృష్టం అనుకుంటాను. కాకపోతే ఆ అభిమానాన్ని సినిమాలో అన్నట్లుగా మరో సారి రాజకీయాల్లో అమ్ముకోకపోతే చాలు. 

అభిమానుల కేకలు విజిల్స్ మధ్య సినిమా మొదలైంది. కత్తి, చాకు,బాకు లాగా లేడు గానీ కాస్త మందంగా గొడ్డలి లాగా ఉన్నాడు. ఇంకాస్త తగ్గితే బాగుంటుంది నెక్స్ట్ మూవీ కి. లావుగా ఉండటం వలన కొన్ని సీన్స్ లో మరీ ఎబ్బెట్టుగా అనిపించాడు. 

'పొరుగింటి పుల్లగూర రుచి' అన్నట్లు ఈ మధ్య వచ్చే సినిమాల్లో విలన్ అంటే నార్త్ ఇండియా వాడే అన్నట్లు తయారైంది వ్యవహారం. ఈ సినిమా లో కూడా విలన్ గా ఒకప్పటి హీరోయిన్ అయిన అంజలా ఝవేరి భర్తని కాకుండా జీవిత గారి భర్తని తీసుకొని ఉంటె బాగుండునేమో ఎలాగూ రాజశేఖర్ కొంత కాలం క్రితం ఇంటర్వ్యూలలో చిరంజీవి సినిమా లో విలన్ గా అయితే చేస్తాను అని ఆశపడ్డాడు. 

పదేళ్ళ క్రితం రాజశేఖర్ మీద  ఒక మేకు జోకు ఉండేది. 

ఒక ఇంటర్వ్యూ కోసం ఒక విలేఖరి రాజశేఖర్ ఇంటికి వెళ్తాడు. సర్ వస్తారు కూర్చోండి అని ఒక సర్వెంట్ హాల్లోని సోఫా ను చూపిస్తుంది. అతను సోఫా లో కూర్చొని ఉంటే ఆవిడ ఇల్లు క్లీన్ చేసే పనిలో ఉంటుంది. 

ఆ విలేఖరి ఇంటిని తేరి పార చూస్తూ అక్కడ కింద పడి ఉన్న ఒక మేకు ను గమనించి 'ఇదిగో అమ్మాయ్ ఇక్కడ మేకు పడి ఉంది తీసి ఎక్కడైనా పెట్టు' అని అంటాడు.

అయ్యో మెల్లిగా మాట్లాడండి, మా అయ్య గారికి వినపడుతుంది అంటుందావిడ కంగారుగా

వినపడితే వచ్చే నష్టమేముందమ్మాయ్ .. మేకునే కదా నేను ఎత్తేయమన్నాను అంటాడు

అయ్యో మెల్లిగా మాట్లాడండి సర్ ..మేకు అనే మాట వినపడితే చాలు పూనకం వచ్చిన వాడిలా ఏదో ఒక సినిమా రీ'మేకు' రైట్స్ కొనడానికి తమిళనాడుకో, కేరళాకో బయల్దేరతారు అంటుంది మెల్లిగా. 

అప్పట్లో రాజశేఖర్ ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుండటం వల్ల వినపడ్డ జోక్ అది. అయినా సందర్భం లేకుండా ఇప్పుడు ఆ జోక్ గురించి చెప్పడం అవసరమా అని మీరు అనుకుంటూ ఉండచ్చు 

మొన్న చరణ్  తమిళ రీమేక్ 'ధృవ' అన్నాడు, ఇవాళ చిరంజీవి ఇంకో తమిళ రీమేక్ చేసాడు. అలాగే పవన్ కళ్యాణ్ రాబోయే  సినిమా 'కాటమ రాయుడు' కూడా ఇంకో తమిళ్ రీమేక్ అని బయట టాక్. కాబట్టి  ఇప్పుడు దాన్ని మెగా ఫామిలీ ఇంట్లో జోక్ గా మార్చి రాయవలసిన అవసరం రాకుండా వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది. 

రీఎంట్రీ టైం లో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అనిపించి ఉండచ్చు అందుకే చిరంజీవి గారు రీమేక్ పై డిపెండ్ అయి ఉండచ్చు. ప్రతిసారీ ఇలాంటి సినిమాలే చేస్తే లాభం లేదు. ఎదో 150 వ సినిమా అని చూసారు గాని ప్రతీ సారి ప్రేక్షకుల రెస్పాన్స్ ఇలాగే ఉంటుందని ఎక్సపెక్ట్ చెయ్యరని వాళ్లకు తెలుసు కాబట్టి మరింత మంచి మూవీ తో వస్తారని ఆశిస్తున్నాను.

నేను చిన్నప్పుడు చిరంజీవి డాన్స్ సూపర్ అంటే.. చిరంజీవి పక్కన వేసే వాళ్ళు కూడా అదే స్టెప్ ని అంత కంటే బాగా వేస్తారు అని మా బాబాయి అనేవారు. 

ఎంత కష్టమైన స్టెప్ వేసినా చిరంజీవి పేస్ లో ఆ స్టెప్ తాలూకు స్ట్రెస్ కనపడదు అదే ఆయన్ని అంత పెద్ద డాన్సర్ ను చేసింది అని చెప్పేవాడిని. ఇప్పుడు 60+ వయసులో కూడా ఆ డాన్స్ ను చూసి ఇదే సమాధానం చెప్పచ్చు. షూ లేస్ కట్టుకునే స్టెప్ అయితే కేకే. ఇంకొక హీరో కనుక ఆ సింపుల్ స్టెప్ చేసి ఉంటే థియేటర్ లో విజిల్స్ బదులు నవ్వులు వినపడేవి. 

గతంలో ఎప్పుడూ బాలకృష్ణ సినిమా థియేటర్ లో చూడలేదు..చూడాలనుకోలేదు కానీ తొలిసారి 'గౌతమి పుత్ర శాతకర్ణి' చూడాలనుకున్నా. ఫామిలీ పర్సన్ ని కాబట్టి ప్రతి సినిమా చూడటం కుదరదు ఉన్న బడ్జెట్ మరియు టైం లిమిటేషన్ లో. అందుకే మంచి సినిమా మిస్ అయ్యాను. 

ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి రివ్యూ రాస్తావనుకుంటే 'జోకు-మేకు-రీమేకు-కేకు-సోకు-చాకు-బాకు' అని ఎదో సొల్లు రాశావే అని అనుకుంటూ ఉంటారని తెలుసు కనుక క్షమించేసేయండి. మొత్తానికి సినిమా అయితే బాగుంది. రియల్లీ బాస్ ఈస్ బ్యాక్. 

9, జనవరి 2017, సోమవారం

ఖబడ్ధార్..ఒట్టు తీసి గట్టు మీద పెడ్తా, ఖైదీ నెంబర్ 150 చూస్తా

కరడు కట్టిన చిరంజీవి అభిమాని పోస్ట్ కి తరువాయి భాగం

వాళ్ళింటికి పిలిచి 'బాలయ్య ఫ్యాన్ గా మారిపోదామా' అని ప్రపోసల్ ఏమైనా పెట్టాడా మీ వాడు అని చాలా మంది అడిగారు ఆ పోస్ట్ చదవగానే. 

కాదండి అంతకంటే పెద్ద షాక్ ఇచ్చాడు అదేంటో  తెలుసుకోవాలంటే చదవండి మరి. 

వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పెరట్లో ఎప్పుడూ ఉండే కుక్కి మంచం కనపడలేదు. మంచం విరిగిందా అని అడిగాను?

లేదు. పోయిన వారమే మా అమ్మ వృద్దాశ్రమానికి డొనేట్ చేసింది  అన్నాడు. 

మరి దానిపై కూర్చుని ఉండే మీ బామ్మ

తను మొన్నే పోయిందిరా

ఖాసీం .. పనికి మాలిన విషయాలన్నీ గంటల తరబడి మాట్లాడుతావ్ కానీ మీ బామ్మ పోయిన విషయం మాత్రం చెప్పలేదేరా

పోవడం అంటే ఆ పోవడం కాదురా ఆ మంచం మీద తప్ప ఇంకెక్కడా నిద్ర పట్టలేదంటేనూ తననూ వృద్దాశ్రమానికి పంపించేసిందిరా మా అమ్మ

దాన్ని పోవడం అనరురా పంపించడం అంటారు

కరక్టే అనుకో కానీ మా బామ్మ గురించి ఎవరు అడిగినా తనే వెళ్ళిపోయినట్లుగా చెప్పమందిరా మా అమ్మ.

ఇక అంతకంటే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే అట్లు దక్కవని గ్రహించి సైలెంట్ గా ఉండిపోయి అట్లు తింటూ వాటి రుచికి మైమరిచిపోయిన ఆ బలహీన క్షణం లో 'చిరంజీవి సినిమాలు ఫ్యాన్స్ షో గాని, మొదటి రోజు మొదటి షో గానీ నువ్వెప్పుడూ చూడద్దు అని పెరటి గట్టు మీద కూర్చోబెట్టి వాళ్ళమ్మ చేసిన అట్టు పెట్టి పట్టు బట్టి ఆ అట్టు మీద గట్టి గా ఒట్టు వేయించుకున్నాడు.'

ఇంతకీ అలా ఫ్యాన్స్ షో లోనో, మొదటి రోజు మొదటి షో లోనే చూసిన ఆ నాలుగు కళాఖండాలు ఏవో మీకు చెప్పలేదు కదూ అవి ముగ్గురు మొనగాళ్లు, S.P పరశురామ్, బిగ్ బాస్, రిక్షావోడు.

దెబ్బకు ఒట్టు తీసి గట్టు మీద పెట్టలేక ఆ తర్వాత రిలీజ్ అయినా హిట్లర్ సినిమా ఫస్ట్ రోజు చూడలేదు. ఆ సినిమా హిట్, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి సినిమాలు మూడు నాలుగు నేను మొదటి రోజు చూడలేదు అవి బాగా హిట్ అయ్యాయి. దాంతో మా వాడి నమ్మకం బాగా బలపడి పోయింది. వాడి నమ్మకాన్ని మరింత బలపరచడం ఇష్టం లేక తాడిపత్రి వెళ్ళినప్పుడు మా పెదనాన్న కొడుకుతో కలిసి 'ఇద్దరు మిత్రులు' సినిమాని మొదటి రోజు చూసిన విషయాన్ని దాచి పెట్టాను. ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత నా జీవితం లో అట్టు అనేది అంతమైపోయి దోశ అనేది మొదలైంది. (దోశ కు అట్టు కు నక్కకు నాగలోకానికి  ఉన్నంత తేడా ఉంది)

పేలాలు Popcorn గా రూపాంతరం చెందుతున్న రోజుల్లో కప్పనది లోంచి మరోనది లోకి వచ్చి పడింది. M.C.A చదవడానికి తిరుపతి చేరాను.

అక్కడ  మరో సారి ఒట్టు తీసి గట్టున పెట్టేశాను. ఫ్రెండ్స్ ఒత్తిడి మేరకు తొలి రోజు తొలి ఆట 'మృగరాజు' సినిమా బుట్టెడు popcorn తింటూ చూశాను. ఈ విషయం ఖాసీం కు తెలిస్తే నన్ను మృగరాజులా నమిలేస్తాడేమో. ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత ఎందుకో Popcorn అంటే ఇష్టం పోయింది. 

సేమియా వదిలేసి మ్యాగీ వెంట పడుతున్న రోజుల్లో కప్ప నది లోంచి సముద్రం లోకి వచ్చి పడింది. ఉద్యోగ అన్వేషణ కోసం బెంగళూరు చేరాను.

మళ్ళీ మాట తప్పాను..  పొద్దుటే లేచి రూమ్ లో ఇష్టమైన మ్యాగీ చేసుకొని తిని చంద్ర, చిన్ని భయ్యా తో కలిసి 'అంజి' సినిమా బెంగళూరు లోని సుద్దగుంట పాళ్య శ్రీనివాస థియేటర్ లో ఉదయం 7 గంటలకే చూసాను. ఫలితం తెలిసిందే. ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత ఎందుకో మ్యాగీ అంటే ఇష్టం పోయింది. 

ఫిల్టర్ కాఫీ వదిలేసి espresso, cappuccino అంటూ బరిస్తా ల వెంట పడుతున్న రోజుల్లో కప్ప ఈ సారి సంసార సాగరం లో పడింది. పెళ్లయింది, నా భార్య తో కలిసి cappuccino  తాగుతూ జై చిరంజీవ ఫస్ట్ రోజే ఫస్ట్  షో చూసాను ఫట్టుమంది.  ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత ఎందుకో cappuccino  అంటే ఇష్టం పోయింది. 

చివరికి నేను చెప్పొచ్చేదేమిటంటే జరిగిన పరిణామాలను బట్టి నేను ఎవరితో కలిసి చిరంజీవి సినిమా మొదటి రోజు చూసినా సరే అది ఫట్టుమనటం ఖాయం అని. 

అప్పట్లో ఈ ఫేసుబుక్స్, ఈ మెయిల్స్, మొబైల్స్ ఉండేవి కాదు కాబట్టి కడప నుంచి మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యాక ఖాసీం ను కలవలేదు మాట్లాడలేదు.. అతనిప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. 2 గంటల సినిమాను కూడా 4 గంటల సేపు చెప్పేవాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక తెలుగు సీరియల్ కు మాటలు రాస్తూ ఉంటాడు అని రాస్తుంటాడు అని నా నమ్మకం.

బాబు ఖాసీం నువ్వెక్కడున్నా ఒకసారి touch లోకి రా. నువ్వు touch లో నుంచి వెళ్ళినప్పటినుంచి మూడు పూటలా తినడం మానేసి కేవలం త్రీ టైమ్స్ మాత్రమే తింటున్నాను. రాత్రి పూట మంచం పడుతున్నాను (నిద్రపోతున్నాను). పగలు పడుకోవడం మానేసాను (ఆఫీస్ లో తప్ప). గత ఎనిమిది సంవత్సరాలుగా రిలీజ్ అయిన చిరంజీవి కొత్త సినిమాలు చూడడమే మానేసాను.

హెచ్చరిక: నువ్వు ఈ పోస్ట్ చదివి కూడా టచ్ లోకి రాకపోతే..  ఖబడ్ధార్,  చిరంజీవి 175 వ సినిమా మా అబ్బాయితో, 200 వ సినిమా మా మానవరాలితో వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను of course అంతవరకు ఈ సీనియర్ సిటిజెన్ ను హీరో గా అభిమానించే పెద్ద మనసు మన తెలుగు ప్రేక్షకులకు ఉందనుకుంటాను. 

అందరూ పాస్తా వెంట పడుతున్న ఈ రోజులలో కూడా ఇంకా పాత చింతకాయపచ్చడి రుచి చూపిస్తా అంటున్నాడు చూడాలి మరి సినిమా ఏమవుతుందో.


ఖాసీం, 'ఖైదీ నెంబర్ 150' సినిమా రిలీజ్ కు ముందు రోజు షో కి ఇంకా 14 సీట్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఒక టికెట్ బుక్ చేసుకొని పాస్తా తిని వెళ్తా జాగ్రత్త ....వెంటనే టచ్ లోకి రాగలవు. (ఎలాగూ నాకు పాస్తా అంటే ఇష్టం లేదు కాబట్టి అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపం వల్ల  వచ్చే నష్టమేమి లేదు)

4, జనవరి 2017, బుధవారం

కరడు కట్టిన చిరంజీవి అభిమాని

నా చిన్నతనమంతా బావిలో కప్పలా పల్లెటూర్లలోనే గడిచింది. అన్న గారి ఫ్యాన్ నుంచి కృష్ణ గారి ఫ్యాన్ గానూ, ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్ గానూ, జయమాలిని ఫ్యాన్ నుంచి సిల్క్ స్మిత ఫ్యాన్ గానూ ఇలా ఎన్నో కప్ప దాట్ల వేశాను వాటి గురించి వివరంగా నా పాత పోస్ట్ లలో రాశాను మీకు వీలయితే చదువుకోవచ్చు. 



పెళ్ళిళ్ళలో ఉప్మా కు శుభం పలికి వడ, పొంగల్ లాంటివి పెడుతున్న ఆ రోజులలో ఒకసారి పెళ్ళికి నెల్లూరు వెళితే ఉదయాన్నే ఆ వడ, పొంగల్ కూడా తినకుండా నీ చిరంజీవి పిచ్చి ఏమిటిరా అని మా నాన్న చేత తిట్లు తిని ఉన్న ఆ కాస్త టైం లోనే గ్యాంగ్ లీడర్ సినిమా కు వెళ్లాను.  నీ అంత పిచ్చి అభిమాని ఈ భూ ప్రపంచం లో ఇంకెవరూ ఉండరేమో అన్న మా నాన్న మాట నిజమేనేమోనన్నభ్రమ లో ఉండిపోయాను బావిలోకప్పలాంటి నేను నది లోకి వచ్చి పడేంతవరకు. అదేనండి మా నాన్నకు కడప కు ట్రాన్స్ఫర్ అయి నేను కడప లో అడుగు పెట్టేంతవరకు. 


కడప కు వచ్చాక అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని అన్నట్లు నా కంటే ఒక ఘనుడిని కలుసుకున్నాను. అసలు ఒక వ్యక్తి పై అభిమానం అంటే ఎంత పీక్స్ లో ఉంటుందో అతన్ని కలిశాకే తెలిసింది. నా కంటే గొప్ప చిరంజీవి అభిమాని ఉండడని అనుకున్న నాకు గర్వ భంగం కలిగింది.  అతని ముందు అభిమానం విషయం లో నేనొక పిల్లకాకి అని తెలిసింది. 

పచారీ కొట్లు సూపర్ మార్కెట్లు  గా టర్న్ తీసుకుంటున్న సమయంలో మేముండే వీధి టర్నింగ్ లోనేకొత్తగా ఓపెన్ చేసిన సూపర్ మార్కెట్ దగ్గర ఉండే ఖాసీం అనే నా వయసు కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఒక రెండు రోజుల్లో తెలిసింది అతనో కరడు కట్టిన చిరంజీవి అభిమాని అని. ('కరడు కట్టిన' అనేది సాధారణంగా నేరస్తులకు ఉపయోగిస్తారు అని తెలుసు గానీ ఇతనికి కూడా ఆ పదం ఆపాదించడం లో తప్పు లేదని నా ఫీలింగ్)

ఆ ఏరియా లో చాలా మంది చిరంజీవి ఫాన్స్ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కనీసం ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ గా ఉండేవారు ఆ రోజుల్లో. చుట్టుపక్కల ఉండే చిరంజీవి అభిమానులకు అతను లీడర్ అని తెలిసింది. అప్పుడప్పుడు కాలేజీ వెనుక ఫాన్స్ మీట్ కూడా జరిగేది. 

అలా జరిగిన మీటింగ్ లో అతని ఉపన్యాసం నుంచి ఒక మచ్చు తునక ఇది. 

"టికెట్ కోసం క్యూ లో చొక్కా చినిగి పోవచ్చు

అందుకు నాన్న కర్ర తీసుకొని శివ తాండవం చెయ్యొచ్చు

సినిమాలు కూడెట్టవు రా అని అమ్మ వీపు పగల గొట్టచ్చు

మీ చిరంజీవి వేస్ట్ మా బాలకృష్ణ బెస్ట్ అని మీ ఇంట్లో అన్నయ్యో బాబాయో నిన్నుపార్టీ మారమని చెప్పచ్చు

చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడల్లా తన హుండీ పగలగొట్టి డబ్బులిచ్చే చెల్లి ఉండచ్చు ఉండకపోవచ్చు 

చుట్టల కోసం మీ తాత ట్రంకు పెట్టె లో దాచుకున్న డబ్బులు మీరు కొట్టేయచ్చు కొట్టెయ్యకపోవచ్చు 

చీర కొంగు లో చుట్టుకున్న చిల్లరను మీ అవ్వ మీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు  

అయినా తగ్గేది వద్దు మడమ తిప్పేది లేదు

చిరిగినా చొక్కా తొడుక్కో పర్లేదు తోలి రోజు చిరంజీవి చిత్రం చూడటం మాత్రం మానద్దు"

అని అభిమానులను ఉత్తేజపరుస్తున్నాడు 

ఆ ఉత్తేజానికి లోనయి ఆకాశం సైతం ఉరుములు మెరుపులతో దద్దరిల్లి వర్షం కురిపించింది.

పట్టండిరా గొడుగు

వెయ్యండిరా కుర్చీ మన ఖాసీం భాయ్ కి 

కొట్టరా తొడ

తిప్పరా మీసం

ఎత్తరా కాలర్

అన్నాను నేను ఆవేశంగా అక్కడున్న గుంపు లోంచి తోసుకుంటూ ఖాసీం దగ్గరకెళ్ళి.

ఇంగ్లీష్ సినిమాలు చూసి inspire అయ్యే అలవాటున్న రాజమౌళి కూడా ఆ గుంపు లో ఉండి ఈ సీన్ ను ఛత్రపతి సినిమా లో వాడుకొని ఉంటాడు అని నా అనుమానం 

అంతవరకు చిరంజీవి సినిమా రిలీజ్ అయిన నెలకో, రెండు నెలలకో ఒక్కోసారి సంవత్సరానికో చూసేవాడిని. అలాంటిది అతనితో పరిచయమయ్యాక రిలీజ్ కు ముందు రోజే తనతో కలిసి నాలుగు సినిమాలు చూశాను. కడప లో చిరంజీవి సినిమాని ఫ్యాన్స్ కోసం రిలీజ్ కు ముందు రోజు రాత్రే ఒక షో వేసేవాళ్ళు.  ఒక వేళ అలా ముందు రోజు వేసే షో నేను మిస్ అయితే ఉదయాన్నే కాలేజీ లో కలిసినప్పుడు 2 గంటల సినిమాను 4 గంటల సేపు చెప్పేవాడు. 

జనాలు ఇడ్లి, దోశ లాంటి టిఫిన్ లు తినడం తగ్గించి బ్రెడ్లు జాములు తింటున్న రోజుల్లో ఒక రోజు ఉదయాన్నే ఖాసీం వచ్చి మా అమ్మ అట్లు పోస్తోంది,అట్లు విత్ చికెన్ కర్రీ తినడానికి మా ఇంటికి రా అని పిలిచాడు. వాళ్ళ అమ్మ వేసే అట్లు భలే రుచిగా ఉండేవి. అవి తిందామన్న ఆతృతలో జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టలేక పిలవగానే ఎగేసుకొని వెళ్ళాను వెర్రి వెధవను.

మిగతా విషయాలు తర్వాతి పోస్ట్ లో.