19, సెప్టెంబర్ 2021, ఆదివారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 3

అప్పుడెప్పుడో రాసి పోస్ట్ చేసిన ఆస్ట్రేలియా సీరీస్ లో మొదటి మరియు రెండో భాగాలకి ఇది కొనసాగింపు. 

మరుసటి రోజు ఆదివారం కాబట్టి రెస్ట్ తీసుకున్నా. మా ఆఫీస్ అడ్రస్ కూడా లక్కీ గా  క్రాంతి ఆఫీస్ దగ్గరలోనే అని తెలిసింది.

సోమవారం తనతో కలిసి స్టేషన్ కి వెళ్తే ట్రైన్స్ లేట్ అని అనౌన్సుమెంట్ వినపడింది. 'ఇండియా లో ట్రైన్ లేట్ అయినప్పుడల్లా, ఇదే ఫారిన్ లో అయితేనా అస్సలు ట్రైన్స్ లేట్ అనే మాట వినపడదు అని అన్నవాడిని కరవాలనిపించింది.' మిగతా ఫారిన్ కంట్రీస్ గురించి నాకు తెలీదు కానీ ఇక్కడ ట్రైన్స్ లేట్ గా రన్ అవడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. 

సరే, పద నువ్వు ఇంకా పాస్ తీసుకోలేదు కాబట్టి ట్రైన్ టికెట్ కొందువు అని కౌంటర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు క్రాంతి నన్ను. 

నా మొహం మీద నీళ్ళు చల్లి లేపి 'అదేంటి అలా పడిపోయావ్, నీకే మైనా మూర్ఛ రోగం ఉందా?' అని అడిగాడు. 

ఏ మాయదారి రోగాలు లేవు గానీ, మన రూమ్ నుండి మా ఆఫీస్ 15 కిలోమీటర్స్ ఉంటుందని గూగుల్ లో చూసాను వీడేంటి  4 డాలర్లు అంటున్నాడు?

అవును ఇక్కడ ట్రైన్ ఛార్జెస్ బాగా ఎక్కువ.  

అవునా, ఈ ఛార్జ్ తో  అయితే నేను బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్ళి రావచ్చేమో అన్నా.  

సరే పద ట్రైన్ లేటయ్యింది, కాఫీ తెచ్చుకుందాం అని కాఫీ షాప్ లోనికి వెళ్ళగానే వాటర్ బాటిల్ మూత తీసి రెడీ గా పెట్టుకున్నాడు. 

'ఇక్కడ కాఫీ రేట్ విని అదిరి పడతావనుకున్నానే? మామూలుగానే ఉన్నావ్?' అన్నాడు వాటర్ బాటిల్ మూత మూసేసి. 

కాఫీ రేటు నాకు సిడ్నీ ఎయిర్పోర్ట్ లోనే షాకిచ్చింది కాబట్టి నేను ప్రిపేరయి ఉన్నాను. అయినా కాఫీకి నాలుగున్నర్ర డాలర్లు ఏమిటి? 

'సిడ్నీ లో అంతే, సిడ్నీ లో అంతే' అన్నాడు రౌడీ అల్లుడులో అల్లు రామలింగయ్యలా.  సరే ట్రైన్ రావడానికి ఇంకో 15 నిముషాలు ఉంది కదా పద ఇదే బిల్డింగ్ లో బ్యాంకు ఉంది, నువ్వు అకౌంట్ ఓపెన్ చేద్దువు గానీ అన్నాడు. 

వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా నిజంగానే పదంటే పదే నిముషాల్లో అకౌంట్ ఓపెన్ చేశాను బ్యాంకు లో.  ఆస్ట్రేలియా స్వర్గం కాకపోయినా నరకం అయితే కాదని తెలియజేయడానికి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.  

నేను చదువుకోవడానికి తిరుపతికి వెళ్ళినప్పుడు మొదటి సారి అకౌంట్ ఓపెన్ చేయడానికి బాంక్ కి  వెళ్ళా. అంతవరకూ జీవితం లో ఒంటరిగా బ్యాంకు లోకి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. నాన్న బ్యాంకు ఉద్యోగి అవడం వల్ల నా సంతకం చేయడం తప్ప బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఏ కష్టం కలగలేదు.  

హౌ కెన్ ఐ హెల్ప్ యు? అంది కౌంటర్ లోపల కూర్చున్న ఒక అమ్మాయి.  నేమ్ ప్లేట్ మీద 'మల్లీశ్వరి, క్లర్క్'  అని రాసుంది. 

'మీ బాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేద్దామనుకున్నా'  అన్నాను. 

'ఏదీ మీ చేతులు ఒకసారి చూపించండి' అంది. 

నా చేతిలో ఏముంటుందండీ ఒట్టి గీతలు తప్ప అన్నాను. 

అహ, చేతికి ఉంగరాలు గట్రా ఏమన్నా ఉన్నయోమేనని అంది. 

తాడు బొంగరం లేని వాడిని నా వేళ్ళ కెందుకు ఉంటాయి ఉంగరాలు, మీరు మరీనూ. 

బొంగరం ఏమిటి,  ఉంగరం కూడా కొని పెడతారు పెళ్లి చేసుకుంటే అంది.

ఆ టైం నాకింకా రాలేదు లెండి అన్నాను. 

కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. ఏ క్లర్కో మీతో కళ్యాణం కోసం పుట్టే ఉంటుంది లెండి. 'జస్ట్ రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు ఇవ్వండి, ఓపెన్ చేద్దాం' అంది ఉత్సాహంగా. 

ఇవిగోండి అని పర్సు ఓపెన్ చేసి ఇవ్వబోతుంటే అందులోనుంచి ఒక అమ్మాయి ఫోటో బయట పడింది. దాన్ని నేను తనకి కనపడకుండా దాచడానికి ప్రయత్నించేలోగా...  

"నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒకర్ని తీసుకురా అలాగే నీ ఓటర్ కార్డు, మీ ఆస్తి పత్రాలు, మీ ఇంటి అటక మీదుండే తాళ పత్రాలు, మీ గుమ్మానికి కట్టిన మామిడాకులు, మీ అవ్వ కొంగులో చుట్టి పెట్టుకున్న తమలపాకులు, మీ వంటింటి డబ్బాలో ఉన్న పూతరేకులు, మీ పెరట్లో కాసిన మామిడాకులు, మీ వీధి చివర కుప్పతొట్టి లో పారేసిన ఇస్తరాకుల తో పాటు నీ వేలి ముద్రలు, కాలి ముద్రలు పట్రా.... వచ్చేశాడు ఉట్టి తలకాయ ముద్రలు తీసుకొని" అంది మల్లీశ్వరి కాస్తా ఎల్లారీశ్వరి రేంజ్ లో గొంతు పెంచి కోపంగా

కిసుక్కున నవ్వి బ్యాగులోంచి పెన్ను పేపర్ తీసుకొని సీరియస్ గా రాసుకోవడం మొదలుపెట్టాడు   అక్కడే ఒక టేబుల్ మీద కూర్చొని ఉన్న ఒక గెడ్డం అతను. 

అటు చూస్తావేం, నేను చెప్పిన వాటిని తీసుకొని రా అలాగే నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒకర్ని తీసుకురా. 

సత్యనారాయణో, రాఘవేంద్ర రావో లేదంటే జగన్నాథ్ గారినో అడగాలి మరి అన్నాను నేను ఆలోచిస్తూ.  

వాళ్లెవరు?  ఈ బ్యాంకు లో వాళ్ళకు  అకౌంట్ ఉందా?

ఉండకపోవచ్చు గానీ పవన్ , మహేష్, పునీత్ లని వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. 

వాళ్లెవరు, మీ రూంమేట్సా?

అయితే బాగుండు. పవన్, మహేష్ తెలుగు సినిమా స్టార్స్, మరి పునీతేమో పూరి జగన్నాథ్ 'అప్పు' సినిమా తో ఇంట్రడ్యూస్ చేసిన కన్నడ సినిమా స్టార్ 

నువ్వేమయిన స్టార్ కొడుకువి అనుకుంటున్నావా ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడమంటే ఈ బ్యాంకు లో అకౌంట్ ఉన్నవాళ్ళు నువ్వు తెలుసని చెప్పడం. 

గోవిందా! గోవిందా!, నా డబ్బులు నేను బ్యాంకులో దాచుకోవడానికి కూడా ఇంత శ్రమ పడాలా అని  తూర్పు తిరిగి ఆ ఏడు కొండల వాడికి దండం పెట్టి అక్కడి నుంచి బయలుదేరాను.  

కానీ ఇన్నేళ్లయినా ఆ గెడ్డం ఉండే ఆయన అంత అర్జెంట్ గా పెన్ను పేపర్ వెతుక్కొని ఏం రాసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు, మీకేమైనా అతనెవరో, ఎందుకలా చేశాడో  తట్టింటే కాస్త చెప్పరూ ప్లీజ్. 

13, సెప్టెంబర్ 2021, సోమవారం

ఎవ్వరినీ ఉద్దేశించి రాసిన కథ కాదు

ఒకానొక ఊర్లో భూషణం అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు, అతనంటే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ భయం భక్తి  ఉందో లేదో తెలీదు కానీ రాజు గారి దేవతా వస్త్రాల టైపు లో కొంతమంది కి ఉన్నట్లు ఇంకొంత మందికి లేనట్లు ఉండేది. ఆ పెద్ద మనిషి కూడా అందరికీ నేనే పెద్దన్న అన్నట్లు గానే  వ్యవహరిస్తూ తన ఊరిని బాగానే చూసుకునేవాడు ఈగ కూడా వాలనీయకుండా, అలాంటిది ఒకానొక రోజు ఏనుగుల గుంపు వచ్చి అతని తోటని పెంట పెంటగా చేసి చెల్లాచెదరు చేసి ఊరిని అల్లకల్లోలం చేశాయి. 

అతని తోటనే కాపాడుకోలేకపోయాడు ఇక ఊరినేం కాపాడతాడు అని అవహేళన చేశారు చుట్టుపక్కల జనం. ఈగో హర్ట్ అయి ఆ ఏనుగుల గుంపు ని వేటాడటానికి మెరికల్లాంటి తన మనుషులను కొందరిని పోగు చేసి మంచి ట్రైనింగ్ ఇప్పించి పంపాడు. 

వాళ్ళు వేట మొదలెట్టారు, ఆ ఏనుగుల అడవిలోకి పారిపోతూ వీళ్ళకి దొరకలేదు.  అయ్యా, రోజూ మనూరి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి వేటాడి మళ్ళీ మన ఊరికి వచ్చేప్పటికి బాగా అలసిపోతున్నాం అన్నారు ఆ మెరికలు

సరే మీ కోసం ఆ ఊర్లోనే వసతి ఏర్పాటు చేస్తాను, యెంత ఖర్చైనా పర్లేదు ఆ ఏనుగుల మంద ను మట్టుబెట్టి తీరాల్సిందే అని వారికో వంటమనిషి, పనిమనిషి పెట్టాడు. కొన్ని రోజులకు వాళ్ళ పెళ్ళాలు, పిల్లలు అక్కడే సెటిల్ అయ్యారు, మరింత ఖర్చులు పెరిగాయి. 

సర్పంచ్ ఊరి అభివృద్ధికి వచ్చే డబ్బులను అక్కడికి తరలించాడు, సరి పోకపోతే తన ఊరి ప్రజల నుంచి పోగు చేసి పంపాడు. 

కొన్ని నెలలకి ఆ ఏనుగుల గుంపు లీడర్ ని చంపారు, కానీ మిగతా ఏనుగుల మందను మట్టుబెట్టే దాకా అక్కడి నుంచి తిరిగి రావద్దని ఆదేశించాడు. 

ఇలా తరాలు మారిపోయాయి, అటువైపు ఏనుగుల మంద పెరుగుతూనే ఉంది , ఇటువైపు వీళ్ళకు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. తర్వాతి తరం వాడైన బోడయ్య,  ఆ మెరికలని అక్కడి నుంచి వెనక్కి వచ్చెయ్యమన్నాడు. 

మూడ్రోజుల క్రితమే రాసిన ఈ పోస్ట్ వ్యక్తిగత పనుల్లో పడి మర్చిపోయి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఈ కథ చనిపోయిన లేదా బతికి ఉన్న వారిని ఉద్దేశించి రాసినది కాదని, మీకెక్కడైనా పోలికలు కనిపిస్తే అవి కేవలం యాదృచ్ఛికం అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంతే సంగతులు చిత్తగించగలరు.