30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

బెంగుళూరు లో మొదటి రోజు

ఇండియాలో నా మూడు వారాల vacation లో జరిగిన విషయాలకు కాస్త ఉప్పు కారం తగిలించి రాస్తున్న పోస్ట్ ఇది. 

బెంగుళూరు వెళ్ళగానే మా ఆవిడ ఎదో లిస్ట్ ఇచ్చిఅవన్నీ కొనుక్కురమ్మంది. లిస్ట్ బాగా పెద్దదే కానీ అందులో చాలా వరకు మెడికల్ షాప్ లో దొరికేవే కనుక మెడికల్ షాప్ వెతుక్కుంటూ వెళ్ళాను.

హిమగిరి మెడికల్ షాప్ అని బోర్డు కనపడింది. ఎదో బార్ కో రెస్టారెంట్ కో ఆ పేరు సూట్ అవుతుంది కానీ మెడికల్ షాప్ కేంటి హిమగిరి అని అనిపించింది.

ఈ రోజు నేను చేసే షాపింగ్ తో నీ హిమగిరి షాప్ వారం పాటు మూసేసుకొని నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి హిమాలయాలకో, కాశ్మీర్ కో ట్రిప్ వెళ్ళి రావచ్చు అని మనసులో అనుకుని '10కేజీల వెయిట్ ఉండే పిల్లాడికి సరిపోయే డైపర్లు ఇవ్వు తమ్ముడూ' అన్నాను. 

10 డైపర్లు ఉండే ప్యాక్ ఇమ్మంటారా లేక 20 ఉండేవా ?

10, 20 ఏంటి 50 ఉండేవి ఉంటె ఇవ్వు

80 ఉండేవి ఉన్నాయి సర్

లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూస్కో. మంచి బ్రాండ్ ఇవ్వు డబ్బులు ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూస్కో  అలాగే ఆకలి వెయ్యడానికి మంచి టాబ్లెట్స్ యివ్వు. తిన్నాక ఆకలి వెయ్యడం లేదు అలాగని మరీ ఎక్కువేమీ తినట్లేదు కానీ రోజుకు 4 పూటలే తింటున్నాను. 

ఇంకా ఏమైనా కావాలా సర్?

అయినా ఈ బెంగుళూరు ఎండలు ఏమిటయ్యా ఇలా ఉన్నాయ్, తల వేడెక్కి పోతోంది. ఆ నవరత్న హెయిర్ ఆయిల్ ఇవ్వు. ఇంకా పిల్లల సెరిలాక్, Wipes, Pediasure, మన్నా హెల్త్ మిక్స్ ఇంకా $$@#@#$@#$@#$@  &&&**%^  #$#$@#$@#$ ఇవ్వు

ఇప్పుడు చెప్పు బిల్ ఎంత అయింది

22800 సర్

నీ షాప్ కు నువ్వు కట్టే రెంట్ గురించి నేను అడగడం లేదు తమ్ముడూ నేను కొన్న వాటికి బిల్ ఎంత అని అడిగాను

నేనూ మీ బిల్ గురించే చెప్పానండి, అయినా బెంగుళూరు లో ఇలాంటి షాప్ 22800 రెంట్ కు అద్దె కిచ్చే పిచ్చి సన్నాసి ఎవడున్నాడు?

నా దగ్గర ఉండేదేమో 17000 రూపాయలు మాత్రమే .. బిల్ 22800 అంటున్నాడు కాబట్టి తీసుకున్న వాటిలోంచి కొన్ని ఐటమ్స్ తగ్గించడం మొదలెట్టాను.

అయినా ఇక్కడి డైపర్లు సరిగ్గా ఫిట్ అవుతాయో లేదో ఆ 80 డైపర్లు ఉండే ప్యాక్ వద్దు కానీ ఆ 10 ఉండే ప్యాక్ ఇవ్వు. అయినా మనిషన్న వాడు రోజుకు 4 పూటల కంటే ఎక్కువ ఏమి తింటాడు. ఆ టాబ్లెట్స్ వద్దులే. అవీ తీసేసి బిల్ ఎంతో చెప్పు

19200 సర్

ఇంతకు ముందు ఇదే  బెంగుళూరు లో 10 ఏళ్ళు ఉండి ఇప్పుడు ఈ ఎండలకు తల వేడేక్కుతోందంటే ''ఏమిటి రాజా ఆ కొక్కిరి బిక్కిరి  వంకర కాయలు" అని వెనకటికి ఆవిడెవరో అన్నట్లు ఉంటుంది కాబట్టి  ఆ నవరత్న హెయిర్ ఆయిల్ కూడా తీసేయ్. అలాగే... 

'ఇంతకీ ఆ కొక్కిరి బిక్కిరి వంకర కాయలు ఏమిటో, ఆవిడ ఎవరో చెప్పనే లేదు..మీ తాలూకానా' అన్నాడు మధ్యలో అడ్డు తగులుతూ 

మా తాలూకా కాదు జిల్లా కాదు. ఎదో అదృష్టం బాగుండి అలాగే అందంగా ఉండబట్టి వంకాయలు అమ్ముకునే ఆవిడ రాజు గారి పెళ్ళాం అయింది. అలాంటి ఆవిడ ఒక రోజు కోట మీద నిల్చుని ఉంటే దారిలో ఒకావిడ గంపలో వంకాయలు పెట్టుకొని వెళ్తూ ఉందట. అది ఈ రాణి గారు చూసి పక్కనున్న రాజు గారితో 'ఆ కొక్కిరి బిక్కిరి  వంకర కాయలు ఏమిటి రాజా' అని అడిగిందట...అది ఆవిడ కొక్కిరి బిక్కిరి వంకర కాయల కథ అన్నాను. 

బాగుంది సర్ కథ. ఇంతకూ ఆ రాజు అవి యేమని చెప్పాడు సర్ 

పర్లేదయ్యా బాగా ఖాళీగా ఉన్నట్లున్నావ్ .. నేను చెప్పే చెత్త వినడమే కాకుండా మళ్ళీ ప్రశ్నలు కూడా అడుగుతున్నావ్ అనుకొని మా నాన్నను అడిగి చెప్తానులే అన్నాను 

మీ నాన్నను అడగటం ఎందుకు సార్ అన్నాడు 

ఎందుకంటే ఆ సామెతను నేను మా నాన్న ద్వారా చిన్నప్పుడు విన్నాను కాబట్టి. సరే బిల్ ఎంత అయిందో ఒకసారి చెప్పు. 

19000 సర్ 

అయినా పిల్లోళ్ల ముడ్డి తుడవడానికి తెల్లోళ్ళ పద్దతి మనకెందుకు, wipes బదులు శుభ్రంగా నీళ్లతో కడిగేస్తే పోతుంది. ఆ Wipes తీసేయ్. అలాగే $#$@#%@#% కూడా తీసేసి బిల్ ఎంత అయిందో చెప్పు 

16800 సర్ 

పర్ఫెక్ట్ .. ఇదిగో డబ్బు అని ఇచ్చేసి మిగిలిన 200 రూపాయలతో హెయిర్ కట్ కోసం సెలూన్ కు బయలుదేరాను. 

అయినా ఈ రెండేళ్లలో రేట్లు ఇంతగా పెరిగివుంటాయని ఊహించలేదు. రెండేళ్ల క్రితం నేను ఇండియా వెళ్లినప్పటికి, ఇప్పటికి ధరలు  చాలా మటుకు అలోమోస్ట్ double అయినట్లు నాకు అనిపించింది.  

గత నాలుగేళ్లుగా సిడ్నీ లో ఉంటున్నాను కానీ ఇక్కడ మరీ ఈ రేంజ్ లో రేట్స్ పెరగడం చూడలేదు. అలా పోల్చి ఇండియా ను తక్కువ చేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు కానీ  ప్రతీ సారి ధరలు అదుపులో ఉంచుతాము అని పాలకులు గుప్పిస్తున్న హామీలు ఎప్పుడు అమలులోకి వస్తాయన్నదే నా ప్రశ్న. 













26, సెప్టెంబర్ 2016, సోమవారం

సిడ్నీ నుంచి బెంగళూరు ప్రయాణ కబుర్లు

పొద్దుటే పడక మీద నుంచి లేచి పాచి మొహాలు కడిగేసుకొని పరుగు పరుగున పనులు చేసేసుకొని, మాతో పాటే పొద్దుటే లేచి ఎం చేయాలో తెలీక జుట్టు పట్టుకు కొట్టేసుకుంటున్న పిల్లకాయలను పట్టేసుకుని నీటి తొట్టి లో కూర్చోపెట్టిసి  కాసిన్ని నీళ్లు పట్టి పోసేసి, ఆట్టే మాకు స్నానాలు చేసే టైం లేక పెర్ఫ్యూములు, పౌడర్లు కొట్టేసుకొని లిఫ్ట్ లేని మా రెండు ఫ్లోర్ల అపార్టుమెంట్ లో మెట్ల మీదుగా మూడు పెద్ద పెద్ద పెట్టెల్ని కష్టపడి పోర్టికోలోకి పట్టుకొచ్చి క్యాబ్ కోసం పడిగాపులు కాస్తుంటే ఆ ముదనష్టపు క్యాబ్ వాడు చెప్పిన టైం కంటే పది నిముషాలు లేటుగా అదీ రెండు పెట్టెలు కూడా పట్టని పిట్టంత కార్ పట్టుకొస్తే ఎట్టుంటుందో ఇప్పుడిట్టా మాటల్లో చెప్పాలంటే కష్టం.

ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి లగేజ్ ఎక్కువుంది కాస్త పెద్ద టాక్సీ పంపండి అని బుక్ చేసే ముందే మొత్తుకొని చెప్పినా చిన్నకారు పంపారు ఇక్కడి కాబ్ కంపెనీ వాళ్ళు. ఇండియా లోనే అనుకుంటాము కానీ ఎక్కడైనా ఇంతేనేమో ఈ క్యాబ్ వాళ్ళు. ఇండియా నుంచి తిరిగి వచ్చేప్పుడు కూడా బెంగుళూరు లో ఒక కంపెనీ క్యాబ్ వాళ్ళు ఇండికాను పంపారు. కాకపొతే అక్కడ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండవు కాబట్టి లగేజ్ అంతా కార్ లో ఇరికించేశాడు ఆ డ్రైవర్. 

కానీ ఇక్కడ రూల్స్ గట్రా ఉంటాయి కాబట్టి అలా లగేజ్ ఇరికించలేదు క్యాబ్ డ్రైవర్. దాంతో బాగా లేట్ అయిపోతోందే అని మా బాధ. ఇక్కడ కొని ఇండియా కు తీసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కు ఎయిర్పోర్ట్ లో G.S.T క్లెయిమ్ చేసుకోవాలి  కాస్త తొందరగా వెళితే బాగుండు అని మా ఉద్దేశ్యం. ఇంతలో వెదకబోయిన తీగ ఎదురొచ్చినట్లుగా అదే రోడ్ లో ఖాళీగా వెళ్తున్న పెద్ద టాక్సీ ఎదురు రావడంతో  ఆ టాక్సీ మాట్లాడుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము.  ఇక తొందరగా ఎయిర్పోర్ట్ కి వెళ్లొచ్చనుకున్నాము కానీ సమస్య ఏమిటంటే ఆ టాక్సీ కన్నా ఆ టాక్సీ మీటరే ఫాస్ట్ గా పరిగెత్తింది. 

ఎయిర్పోర్ట్ లో చెకింగ్ అని చెప్పి ద్రౌపతీ వస్త్రాపహరణం లాగ వేసుకున్న జెర్కిన్, పెట్టుకున్న బెల్ట్, వాచ్ అన్నీ విప్పించి గానీ వదలలేదు. ఇక్కడే జరిగింది ఒక విచిత్రమైన సంఘటన. ఒకావిడ తన కేబిన్ లగేజ్ తో పాటు స్కూటర్ కూడా తీసుకెళ్తానని గొడవపెట్టింది. చెకింగ్ అథారిటీస్ వాళ్లేమో అలా తీసుకెళ్లడానికి వీల్లేదు అని, ఈవిడేమో నా మనవడికి తీసుకెళ్తున్నాను వదలమని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంది.  కానీ అక్కడ రూల్స్ ఫాలో అవ్వాలి తప్ప ఎమోషనల్  ఫీలింగ్స్ కి తావు ఉండదు కదా మరి అందుకే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా ఓపెన్ చేయని packed piece అయితే ఒప్పుకునేవాళ్ళేమో కానీ ఆల్రెడీ ఓపెన్ చేసేసి సెట్ చేసినది కాబట్టి ఒప్పుకోలేదనుకుంటాను. చూస్తున్న వాళ్లలో  అయ్యో పాపం అనుకున్నవాళ్ళు కొందరైతే చాటుగా నవ్వుకున్నా వాళ్ళు మరికొందరు.


ఎప్పటిలాగానే ..ఫ్లైట్ ఎక్కగానే చిరునవ్వు మొహాన పులుముకొని ఎయిర్ హోస్టెస్ వచ్చింది. అదేంటో సినిమాల్లోనే అందమైన ఎయిర్ హోస్టెస్ లను చూసింది .. నేనెక్కిన ఫ్లైట్ లో ఎప్పుడూ అలాంటి వాళ్ళను చూడలేదు.  ఈ ఎయిర్ హోస్టెస్ వయసు ప్రకారం చూస్తే మా పెద్దక్క క్లాసుమేట్ అయి ఉండచ్చు అని అనుకున్నాను.

కౌలాలంపూర్ లో దిగి బెంగుళూరు ఫ్లైట్ ఎక్కాము.

అక్కడా నవ్వుతూ ఎయిర్ హోస్టెస్ స్వాగతించింది.  ఈ సారి డౌట్ లేదు confirm ఈవిడ మా పిన్ని క్లాస్ మేట్ అయుండచ్చు ఇదే చివరి ట్రిప్ అనుకుంటా ఎయిర్ హోస్టెస్ గా ఈవిడకి. బెంగుళూరు లో ఈ రోజు సాయంత్రమే తన రిటైర్మెంట్ పార్టీ అరెంజ్ చేసి ఉంటారు. 

ఫ్లైట్ లో నాకూ, మా పాపకు వెనుక వైపు ఇచ్చి బుడ్డోడు ఉన్నాడు కాబట్టి మా ఆవిడకు ముందు వైపు సీట్ ఇచ్చారు. అందరూ ఒక చోట కూర్చుంటే పిల్లలను మేనేజ్ చేయడం ఈజీ గా ఉంటుందని అక్కడ విండో సీట్ లో కూర్చున్న అతన్ని రిక్వెస్ట్ చేస్తే టాట్ టూట్ వీల్లేదు నాకు విండో సీటే కావాలని అక్కడే కూర్చున్నాడు. ఎర్ర బస్సు లో విండో సీట్ అడిగారంటే ఓకే అనుకోవచ్చు ఎదో వామిటింగ్ ప్రాబ్లమ్ ఉండి ఉండచ్చు అని సర్ది చెప్పుకోవడానికి, మరీ ఎయిర్ బస్సు లో కూడానా.  విండో సీట్ కావాలి అని మా పాప ఒకటే ఏడుపు. అతను మా పాప ఏడుపు చూసి కూడా కనికరించలేదు. ఏదోలోగా మా పాపకు సర్ది చెప్పి మాకు కేటాయించిన మధ్య సీట్ లలో వెళ్లి కూర్చున్నాము. ఫ్లైట్ బయలు దేరిన కాసేపటికి ముందు సీట్ లో మా బుడ్డోడి కోసం బసినేట్(చిన్న పిల్లలకు పడుకోవడానికి బెడ్ లాంటి చిన్న తొట్టి) అరెంజ్ చేసాక కాళ్లు చాపుకోవడానికి అది ఇబ్బంది అనిపించి తనే అడిగాడు సీట్ మారతానని. 

అలా విండో సీట్ దొరికినందుకు మా పాప సంతోషించింది. కాసేపయ్యాక నాన్నా మనం క్లౌడ్స్ కన్నా పైన ఉన్నాం కదా మరి మన కన్నా పైకి ఆస్ట్రోనౌట్స్ వెళ్తారు కదా అంది మా పాప. పర్లేదు స్కూల్ కు వెళ్ళక ముందే ఈ కాలపు పిల్లలు T.V చూసి కాస్తో కూస్తో నేర్చుకుంటున్నారు అనిపించింది. 

ఫ్లైట్ నుంచి దిగేప్పటికీ 2 కిలోల వెయిట్ పెరిగి ఉంటాను కారణం వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ తిని, ఫ్రీ గా వాళ్ళు ఇచ్చిన జ్యూస్ లు తాగి. నా లాంటివాళ్లే మరో ఇద్దరు ఉన్నట్లున్నారు ఫ్రీ గా ఇస్తున్నారని తాగే రకాలు, కాకపొతే వాళ్ళు తాగింది నా లాగా జ్యూస్ కాదు మందు. ఆ తాగిన మందు ఎక్కువై ఆ ఇద్దరు యువకులు కాస్త అల్లరి చేశారు. అదొక్కటే కాస్త ఇబ్బంది పెట్టింది ఫ్లైట్ లో అందరినీ. 


20, సెప్టెంబర్ 2016, మంగళవారం

ఇండియా వెళ్లే ముందటి విశేషాలు

హాయ్ ఫ్రెండ్స్! అయామ్ బ్యాక్ టు బ్లాగింగ్. లీవ్ లో ఇండియా కు వెళ్లి వచ్చాను. అర్రే మేమంతా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ లో వెళ్లి వస్తామే అని అనుకుంటున్నారా?  హి హి హి

మరీ బాడ్ జోక్ తో మొదలు పెట్టానా... అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్.

ఇండియా లో మూడు వారాలు ఉంటాను కదా బోలెడు టైం ఉంటుంది అనుకున్నాను కానీ పిల్లలిద్దరూ సిక్ అవ్వడంతో చాలా పనులు పెండింగ్ లోనే ఉండిపోయాయి అలాగే చాలా మంది బంధు మిత్రులను కూడా కలుసుకోలేక పోయాను. కాకపోతే ఆ మూడు వారాలు ఆఫీస్ పని, ఫోన్, లాప్ టాప్ లాంటి వాటికి దూరంగా ఉండి  ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో రాతల్లో రాయలేను.

ఇక ఆ 3 వారాల్లో జరిగిన విశేషాలన్నీ కొన్ని రోజుల పాటు రాయబోతున్నాను. "కట్టే, కొట్టే, తెచ్చే" అన్నంత సింపుల్ గా కాకుండా అలాగే మరీ బోర్ కొట్టించకుండా కాస్త క్లుప్తంగా రాయడానికి ప్రయత్నిస్తాను. రామాయణం లో పిడకలవేట లాగా మధ్య మధ్యలో సంబంధం లేని విషయాలు వస్తుండచ్చు దానికి మన్నించగలరు.

గత నెలలో ఇండియా కు వెళ్తున్నాను అని ఇక్కడ చెప్పానో లేదో ప్లీజ్ నా కోసం ఇండియా నుంచి అది తీసుకొస్తావా ఇది తీసుకొస్తావా అనే రిక్వెస్ట్ లు వినపడ్డాయి.

నా ఫ్రెండ్ ఒకతను అయితే వీలయితే సీమ నీళ్లు తీసుకురా అన్నా..ఇక్కడి నీళ్లు తాగి పౌరుషం చచ్చిపోయింది అని అడిగాడు.  

ఒక కొలీగ్ అయితే పానీ పూరి తీసుకు రమ్మంది. ఎందుకో తెలీదు కానీ అమ్మాయిలకు పానీ పూరి అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇంకో కొలీగ్ ను కూడా ఇండియా వెళ్లినప్పుడు నువ్వు అక్కడ చేసిన బెస్ట్ థింగ్ ఏమిటి అని అడిగితే  ప్రతి రోజూ పానీ పూరి తిని వచ్చా అంది. మేము 2 వారాల క్రితం బెంగుళూరు లో Mavenpick అనే ఫైవ్ స్టార్ట్ హోటల్ కి డిన్నర్ కి వెళ్తే, అక్కడ సవాలక్ష నోరూరించే ఐటమ్స్ ఉన్నా పండగ నాడు కూడా పాత చీరే కావాలన్నట్లు మా ఆవిడ మొదట వెళ్ళింది పానీ పూరి స్టాండ్ దగ్గరకే. నాకు తెలిసినంత వరకు చాలా మంది అమ్మాయిలకు పానీ పూరి తినందే రోజు గడవదు.  

కొంత మంది ఫ్రెండ్స్ అయితే కుక్కర్లు, మిక్సీ ల్లాంటివి కూడా తెమ్మని అడిగారు. అవన్నీ తీసుకు రావంటే కనీసం ఓ 200 కిలోల వెయిట్ దాకా అవుతుంది. ఆల్రెడీ సిడ్నీ ఎయిర్పోర్ట్ లో ఈ ఇండియా వాళ్ళను వదిలేస్తే మొత్తం ఇండియా ను వాళ్ళ సూట్ కేసుల్లో చుట్టబెట్టుకు వచ్చేస్తారు అనే బాడ్ టాక్ ఉంది. కాబట్టి అంత వెయిట్ మోసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని మరింత బలపరచడం కన్నా నొప్పించక తానొవ్వక అన్న చందంగా ఎదో ఒక లాగ సర్ది చెప్పాను అంత వెయిట్ అయితే కష్టమని. ఏవో మాత్రలు, cooker gasket లాంటివి అయితే తెస్తామని చెప్పాను. 

ఒక ఫ్రెండ్ అయితే సిగరెట్స్ కూడా తీసుకు రమ్మన్నాడు. లగేజ్ పాకింగ్ సమయంలో వాటిని మా నాన్న చూసాడంటే వీడే తాగడానికి తీసుకెళ్తున్నాడేమో అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అతనికి నో చెప్పాను.  పైగా ఈ రిక్వెస్ట్ నేను ఓకే చేసినట్లు వాళ్ళ వైఫ్ కి తెలిసిందంటే వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా నాకు ఇష్టం లేని గ్రీన్ టీ ఇచ్చి పగ తీర్చుకునే అవకాశం కూడా ఉంది. 

ఇక అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన లిస్ట్ లో మా అమ్మ పంపే అరిసెల పాకం, కజ్జి కాయలు, ఊరగాయలు, పొడులు (చెనక్కాయల పొడి, నూగులు చింతాకు వేసి చేసే చింతాకు పొడి , కరివేపాకు పొడి లాంటివి ) ఉండనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చెనక్కాయల పొడి ని గన్ పౌడర్ అంటారు. దీని మీద ఎవరో చెప్పగా విన్న జోక్ .. కస్టమ్స్ వాళ్ళు బ్యాగేజ్ చెక్ చేస్తూ చెనక్కాయల పొడిని చూసి ఇదేమిటి అని అడిగితే గన్ పౌడర్ అని చెప్పి వాళ్ళను హడలగొట్టాడట. 

నాకు  తెలిసిన ఒక ఫామిలీ ఫ్రెండ్ అమెరికాకు 2 కేజీల పిండి తో చేసిన మురుకులు, నాలుగు కేజీల అరిసెల పాకం, కజ్జికాయలు, నూగుల పిండి ముద్దలు తీసుకెళ్ళాడట. పల్లెటూరి వాళ్ళు కదా నూగుల పిండి ముద్దలు బాగా పెద్ద సైజు లో చేశారట. వాటిని చూసి  బాంబులేమో అని భయపడ్డారట ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ వాళ్ళు.  ఇవి కాకుండా పుల్లా రెడ్డి స్వీట్ షాప్ లో 5 కేజీల స్వీట్స్ కూడా కొనుక్కొని తీసుకెళ్లాడట. మొత్తంగా బాగ్ నిండా ఈ స్వీట్స్ ఉన్నాయట. అందుకని స్వీట్ షాప్ ఏమైనా పెడుతున్నారా అని అడిగాడట నవ్వుతూ ఆ కస్టమ్స్ వాడు. 

వచ్చేప్పుడు కాజు బర్ఫీ తీసుకురమ్మని అడిగారు ఆఫీస్ లో ఫ్రెండ్స్. ఈ కాజు బర్ఫీ ని నార్త్ ఇండియన్స్ అయితే కాజు కట్ లీ అంటారట ఎందుకంటే అవి బ్రూస్ లీ లాగా సన్నగా ఉంటాయని. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఇవే తెచ్చాను. ఇప్పుడూ ఇవే తెచ్చాను ఎందుకంటే అందరికీ ఇవే ఇష్టం. కస్టమ్స్ చెకింగ్ లో వీటిని చూడగానే ఇవేంటో నాకు బాగా తెలుసు రోజుకు 10 మంది ఇండియన్స్ అన్నా ఇండియా నుంచి ఈ స్వీట్స్ తీసుకొస్తుంటారు అన్నాడు ఒక ఆఫీసర్. 

వచ్చేప్పుడు తీసుకురావాల్సినవన్నీ లిస్ట్ రాసుకున్నాను కానీ కొన్ని తెచ్చుకోలేక పోయాను వెయిట్ ఎక్కువడం వలన. ముఖ్యంగా ఆ లిస్ట్ లో ఉన్న కొన్ని పుస్తకాలు తెచ్చుకోలేక పోయాను. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్లు అక్కడికి కూడా నీ బుక్స్ అవసరమా అని మా ఆవిడ గోల పెట్టింది. తన గోల కు ఒక కారణం ఉంది ఎందుకంటే గత 2 సంవత్సరాలలో ఇండియాకు వెళ్ళలేదు కాబట్టి ఈ రెండేళ్ల షాపింగ్ అంతా రెండు వారాల్లో చేసేసింది. మరి ఆ బట్టల కొట్టు అంతా ఇక్కడికి తెచ్చుకోవాలి కాబట్టి నా బుక్స్ కు మోక్షం లభించలేదు.

ఏమి తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మరచి పోకుండా తీసుకురావాల్సినవి మాత్రం తెచ్చుకున్నాను అవే మా అమ్మా నాన్నల దీవెనలు offcourse అవెప్పుడూ మన వెంటే ఉంటాయనుకోండి కాకపొతే ముగింపు కు ఒక మంచి మాట తోడైతే బాగుంటుందని జత చేసాను.