6, జూన్ 2017, మంగళవారం

గుడ్డు మా కులదైవం - లడ్డు మా ఫలహారం: ప్లాట్ నెంబర్ 62 బ్లాగోతానికి పునః స్వాగతం

బాహుబలి-1 కి బాహుబలి-2 కి బాగా గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ నువ్వు రాసే ఈ ప్లాట్ నెంబర్ 62 సిరీస్ కి ఇంత గ్యాప్ వస్తే ఎవరికి గుర్తుఉంటుందబ్బాయ్ అని మీరు అనుకుంటుంటారు కానీ తప్పలేదు కాస్త పని ఒత్తిడి వలన తరచూ రాయలేకపోతున్నాను.

ఆ ఎక్కడ ఉన్నాం? తిరుపతి లో మిర్చి బజ్జి తింటూ, టీ తాగుతున్నాం కదా!

కొత్త చెప్పులు కొనాలి షాప్ కి వస్తావా అని మా చిన్ని భయ్యా అడిగితే వెళ్ళొద్దని చెప్పాను కదా అని వాళ్ళ ఊరికి వెళదామని పిలిస్తే మాత్రం వెళ్లడం మానకండి. ఆప్యాయతకు, ప్రేమకు కేర్ అఫ్ అడ్రస్ అయిన మా చిన్ని వాళ్ళ అమ్మను నాన్నను  కలిసే అవకాశం మీరు మిస్ అయినట్లే.

గుండె నాలుగు గదులంటారు కదా ఆ నాలుగు గదుల్లో వారి ఆప్యాయతను నింపుకొచ్చాను వారింటికి వెళ్లిన 4 సార్లలో. ఇక నింపుకోవడానికి ఖాళీ లేదనేమో ఇంకో సారి వెళ్లే అవకాశం నాకు దొరకలేదు :(

ఏంటి కళ్ళలో నీళ్ళొచ్చేశాయా..రావా మరి, మిర్చి బజ్జి తింటే,  మరీ ఇంత సున్నితమైన మనుషులైతే ఎలాగండీ?  కళ్ళు సరిగ్గా తుడుచుకొని చూడండి మా సుబ్బు, చంద్ర లని. ఒంటి బరువు తక్కువుండటం వలన మామూలుగానే కంటికి సరిగా కనపడరు మా ఈ జంట మిత్రులు. కనీసం 10 గ్రాములైనా పెరగాలని తెగ అవస్థలు పడుతుంటారు ఇద్దరూ. తమిళనాడు లో పుట్టవలసిన వాళ్ళు ఆంధ్రా లో పుట్టారు అంత అభిమానం వీరికి రజనీ కాంత్ అంటే. 

స్వాతి, ఆంధ్ర జ్యోతి లాంటి పుస్తకాలు మాత్రమే తెలిసిన మాకు క్షమించాలి నాకుఎందుకంటే మా శీను భయ్యాకి 'చిలక', 'మేనక' లాంటి అద్భుతమైన(?) పుస్తకాల నుంచి 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు' 'ఇనుప కచ్చడాలు' లాంటి తాపీ ధర్మారావు గారి పుస్తకాల వరకు చాలా జ్ఞానం ఉండేది అది వేరే విషయం. (ఇళ్ళు కట్టడమే కాకుండా ఖాళీ సమయాల్లో ఇలా పుస్తకాలు కూడా రాసేవాడు కాబోలు అని అనుకునేవాడిని అతని పేరులోని 'తాపీ' ని చూసి) 

అలా ఏవో స్వాతి, ఆంధ్ర జ్యోతి, జ్యోతి చిత్ర, సితార వంటివి కాకుండా ఏవేవో పుస్తకాలు (నాకు తెలిసి చస్తేగా మీకు ఖచ్చితంగా చెప్పడానికి)  ఉండేవి అతని దగ్గర. వాటిని తూకం వేస్తే మాత్రం అతనికి రెట్టింపు బరువు తూగుతాయని ఖచ్చితంగా చెప్పగలను.  పదండి రూమ్ కెళ్ళి మీ కళ్ళతో మీరే చూద్దురు గాని.

ఇక మా చంద్ర గురించి చెప్పాలంటే నేను రాముడనుకుంటే తను లక్ష్మణుడు. ఇక్కడ నేను రాముడినని చెప్పుకోవడం కేవలం మా చంద్ర గొప్పతనాన్నితెలియజేయడానికి మాత్రమే సుమా. అలాంటి అనుబంధం మాది.

పదండి ఎగ్-365 చేశాను డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం

ఎగ్-65 గురించి విన్నాను గానీ ఈ ఎగ్-365 ఏమిటా అని ఆశర్యపోతున్నారా? అది మామూలు ఎగ్ బుర్జీ నే, కాకపొతే సంవత్సరం లో 365 రోజులు మేము అదే తింటాము కాబట్టి దానికి ఆ పేరెట్టాను అంతే.

అలా తిని తినీ నాకు గుడ్డు మేనియా తో పాటు గుడ్డో ఫోబియా కూడా పట్టుకుంది. 

మళ్ళీ ఇదేమిటంటారా? ఇలా ప్రతి రోజూ రెండు పూటలా గుడ్డు తింటూ ఉంటే ఏదో ఒక పూట నేనే కోడి లాగా గుడ్డు పెట్టేస్తానేమో అని భయపడుతూ ఉంటాను. దీన్నే గుడ్డో ఫోబియా అని నామకరణం చేసాను లెండి.

మాతృదేవోభవ, 
పితృదేవోభవ, 
ఆచార్యదేవోభవ,
గుడ్డుదేవోభవ 

అని గుడ్డు ను కూడా అందులో కలిపి తీరాల్సిందే. ఈ మాటను 90%  బ్యాచ్ లర్స్ ఒప్పుకుని తీరతారు అని నా గట్టి నమ్మకం (ఒప్పుకోని ఆ 10% మంది గుడ్డు తినని వాళ్ళు అయి ఉండచ్చు అని నా అంచనా) . కాబట్టి కుల దైవం లాగా మా లాంటి యువ కుల దైవం ఈ గుడ్డు.

ఇక మేము తిరుపతి లో ఉండటం వలన ఏదో ఒక రకంగా తిరుమల నుంచి లడ్డు వచ్చేది. ఎంతగా తిన్నామంటే లడ్డు అనే పేరు విన్నా విరక్తి కలిగేటంతగా. ఏదో ఫలహారం తిన్నట్లుగా ప్రతి రోజూ తినేవాళ్ళము (హి...హి...హి..ఏదో రకంగా ఈ పోస్ట్ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చేశా) 

అందరి గురించి చెప్పి మరో రూమ్ మేట్ అయినా మా మను గురించి చెప్పలేదు కదా. "అసలు అదృష్టం ఉండాలంటే పెట్టి పుట్టాలి అంటారు" కదా అలాంటి వాడే మా మను ...చూశారా మనం ఇంతలా మాట్లాడుతున్నా కూర్చునే నిద్రపోతున్నాడే తనే మా మను, మరి అంతటి అదృష్టం ఎవరికీ దొరుకుతుందండీ?

ఏమిటి? బాగా బోర్ కొట్టించానా, దమ్ము కొడదామనుకుంటున్నారా, దయచేసి మా రూమ్ బయటికి వెళ్ళి దమ్ము కొట్టి రండి.  ఎందుకంటే రూమ్ లో మేమింతమంది ఉన్నా ఏనాడూ సిగరెట్, మందు, పేక లాంటి దురలవాట్లను, బలహీనతలను మా రూమ్ లోకే కాదు, అసలు మా జీవితాల్లోకి కూడా జొరబడనీయలేదు. అదే మాకు, మా రూమ్ కు ఉన్న విశిష్టత.

అలాగని మాకే బలహీనత లేదనుకోకండి, ఉంది అదేమంటే ఒక్కసారి మేము ప్రేమించడం మెదలెట్టామంటే విపరీతంగా ప్రేమ పెంచుకుంటాం అది సినిమాలైనా, ఇష్టపడ్డ వ్యక్తులైనా.  

31, మే 2017, బుధవారం

సిడ్నీ లో ఘనంగా జరిగిన రామారావు జన్మదిన వేడుకలు

ఎక్కడో న్యూస్ పేపర్లో వార్త నా బ్లాగ్ పోస్ట్ కి హెడ్డింగ్ అయిందేమిటబ్బా అనుకుంటున్నారా? 

గత ఆదివారం సిడ్నీ లో తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన రామారావు గారి జన్మదిన వేడుకల గురించి ఈ పోస్ట్.


ఇక్కడ 5 ఏళ్లుగా ఉంటున్నాకూడా, ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకలకు ఎప్పుడూ వెళ్లలేక పోయాను. ఈ సారి మాత్రం వీలు చూసుకొని వెళ్ళాను. ఒక్కచోట అంత మంది తెలుగు వాళ్ళను సిడ్నీ లో చూడటం ఇదే మొదటి సారి.

మేము వెళ్ళేప్పటికీ పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, కాకపొతే మా వాడు అటు ఇటు పరిగెత్తుతూ ఉండటం తో వాడితో రన్నింగ్ రేస్ లో పాల్గొనటం వలన అవేవీ చూడలేకపోయాను. వాడు పడుకున్నాక కాస్త తీరికగా కూర్చుని అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. 

ఇంతలో నా పక్కన ఉండే సీట్ లో కూర్చున్న వ్యక్తి(50 ఏళ్ళు ఉండచ్చు అనుకుంటున్నాను) నాతో మాట్లాడటం మొదలెట్టాడు 

మీరు  నాయుడూసా లేక చౌదరీసా?

రెండూ కాదండీ.

మరి ఏ కులం?

ఖర్మరా బాబు ఖండాలు దాటినా కులాల పట్టింపులు మాత్రం పోలేదు అనుకొని 'రెడ్డి' అన్నాను. 

అలాగా జగన్ మోహన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి నాకు బాగా పరిచయం అన్నాడు 

'సమర సింహా రెడ్డి' , 'ఇంద్ర సేనా రెడ్డి' , ' ఆది కేశవ రెడ్డి'  నాకు  బాగా తెలుసు అందామనుకొని సైలెంట్ అయిపోయాను 

అప్పట్లో కాంగ్రెస్ లో ఉండేవాడిని, ఆ తర్వాత తెలుగు దేశం లోకి మారాను అన్నాడు. 

'ఏం తరిమేశారా?' అందామనుకొని ఊరికే ఉండిపోయాను 

రాజ శేఖర్ రెడ్డి అప్పట్లో నాకు బాగా తెలుసు. నేనెంత చెపితే అంత తనకు అన్నాడు. 

అవును నాకు కూడా ట్రంప్ బాగా తెలుసు ఇప్పట్లో, కాకపొతే తనకే నేను తెలీదు అందామనుకొని ఊరికే ఉండిపోయాను. 

జగన్ మాత్రం వాళ్ళ నాయనలా కాదబ్బా, కొంచెం నేర్చుకోవాల అన్నాడు 

ఏం నేర్చుకోవాలండి అన్నాను 

పద్దతి నేర్చుకోవాలబ్బ. పెద్ద వాళ్ళను రాజ శేఖర్ రెడ్డి ఎంత బాగా గౌరవించేవాడు అది ఈ పిలగాడికి రాలా అన్నాడు. 

యంగ్ జెనరేషన్ కదండీ కాస్త దూకుడెక్కువుండచ్చు అన్నాను 

అది కాదులే అబ్బి..వాళ్ళ నాయన్ను కూడా ఆ వయసులో చూశానుగా ఆయన పద్దతి వేరు అన్నాడు.  

కొడుకును తండ్రితో పోలిస్తే కష్టం కదండీ ఆయన ఐడెంటిటీ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ని కూడా వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు తో పోలిస్తే ఎప్పటికీ రెండు మూడు అడుగులు కిందే ఉంటాడు కదండీ అన్నాను. 

రెండు మూడు అడుగులు కాదబ్బాయ్ .. పాతాళం లో ఉంటాడు అన్నాడాయన (ఆయన వాడిన బాష ఇక్కడ వాడటం బాగోదు కాబట్టి నేనిలా మార్చాల్సి వచ్చింది)

ఇంతలో అతనికి ఫోన్ రావడం తో, సరిగ్గా వినపడటం లేదని బయటికి వెళ్ళిపోయాడు.  

ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వహించినా దాన్ని కేవలం N.T.R గారి పుట్టినరోజు వేడుకలగా నిర్వహించారే గానీ చంద్ర బాబు గారి అలాగే వారి సుపుత్రిడి  గురించిన భజన అయితే ఎక్కడా కనపడలేదు, అందుకు సంతోషం. 

ఈ సందర్బంగా ఎన్టీవోడి గురించి నా చిన్ననాటి సంఘటన. 

కర్నూల్ జిల్లా లోని కొత్తకోట గ్రామం లో నేను 5 వ తరగతి చదువుతున్న రోజులు అనుకుంటా. మా టీచర్ ఒకాయన క్లాస్ లోకి రాగానే 'ఎన్నికల ప్రచారం లో భాగంగా రామారావు గారు మన బడి ముందుగా వెళ్తున్నారట' రండి బయటికి వెళ్లి చూద్దాం అని పిలిచారు. 

అందరూ వెళ్లిపోయారు ఒక్కసారిగా నేను తప్ప. అందరితో పాటు పరుగెత్తుకెళ్ళిన మా బడ్ దల్(నా ఫ్రెండ్) వెనక్కి వచ్చి, నువ్వూ రా వెళదాం అని పిలిచాడు 

మనం ఎన్టీవోడి పార్టీ నుంచి కృష్ణ పార్టీ కి మారాము ఆ మాత్రం గుర్తులేదా నీకు.  సిగ్గు, ఎగ్గు, లజ్జ, మానం, మర్యాద నీకు లేవేమో గాని పౌరుషం, సాహసం, సింహాసనం, కురుకేత్రం, అగ్నిపర్వతం ఉన్నాయి నాకు. నువ్వెళ్లు నేను రాను అన్నాను అగ్ని పర్వతం లో కృష్ణ లా రగిలిపోతూ. 

నీకు చిన్నప్పుడు ఏ స్వీట్ అంటే ఇష్టం అన్నాడు 

బెల్లం మిఠాయి 

మరిప్పుడు 

లవ్ లడ్డు (రవ్వ లడ్డును సరిగ్గా పిలవటం తెలీక అలా పిలిచే వాడిని చిన్నప్పుడు)

మరిప్పుడు నిన్ను బెల్లం మిఠాయి తినమంటే తినవా?

పద వెళ్లి చూద్దాం అన్నాను లేచి. 

బయటికి వెళ్లి చూశామా! విజిల్స్, అరుపులూ, కేకలతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా.  ఈ ఊళ్ళో ఇంత మంది జనమున్నారా అనిపించింది. కొందరైతే ఏదో దేవుడు ఊరేగింపుకు వస్తే దండాలు పెట్టినట్లు దండాలు పెడుతున్నారు తమ జన్మ ధన్యమైనట్లు. 

పవన్ కళ్యాణ్ ఫంక్షన్ లో ఫాన్స్ వేసే కేరింతలు, బాహుబలి-2 ఇంటర్వెల్ లో జనాలు పలికే జేజేలు ఇవేవీ సాటి రావు అప్పటి ఆ అరుపులకి.  

అదే మొదటి సారి అలాగే  చివరి సారి ఎన్టీవోడిని చూడటం. 

ఆయనలా వెళ్ళిపోయాక 'నువ్వు జీవితం లో చేసిన రెండో మంచి పని నన్నుకన్విన్స్ చేయడమే' అన్నాను మా 'బడ్ దల్' భుజం తడుతూ. 

మరి మొదటి మంచి పని ఉత్సాహంగా అడిగాడు తన జేబులోంచి ఒక చాక్లెట్ తీసి నా చేతిలో పెడుతూ 

'నాతో  ఫ్రెండ్ షిప్  చేయడం' అన్నాను  ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ. 

24, మే 2017, బుధవారం

సంవత్సర కాలంగా భరిస్తున్నందుకు ధన్యవాదాలు

అలా సరిగ్గా సంవత్సరం క్రితం పులిని చూసి వాతలు పెట్టుకున్ననక్కలా, బాహుబలి అద్భుత విజయం చూసి భారీ బడ్జెట్ తో సినిమాలు తీయాలనుకుంటున్న కొంతమంది గొర్రెల్లా (ఈ గొర్రె అనే మాటకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కమల్ హాసన్ గారి పోలిక ఇది) వాళ్ళు వీళ్ళు రాసిన బ్లాగ్ లను చూసి నేనూ బ్లాగ్ మొదలెట్టాను.

పురిటిలోనే సంధి కొట్టినట్లు బ్లాగ్ అయితే మొదలెట్టాను కానీ ఏం రాయాలో తెలియలేదు.  నేను రాస్తే చదివేవాళ్ళు ఉంటారా అసలు ఏం రాయాలి ఎలా రాయాలి అని తెగ నిరుత్సాహపడ్డాను.

ఆ తర్వాత 'ధైర్యే సాహసే ఆయాసే ఉబ్బసే దగ్గే ఎంకట లక్ష్మే' అని ఏదో ఒకటి రాయడం మొదలెట్టాను. ( ధైర్యే సాహసే లక్ష్మి  అనే దాన్ని చిన్నప్పుడలా సరదాగా అనుకునేవాళ్ళము ఏదైనా పని మొదలు పెట్టాల్సి వచ్చినప్పుడు, మీలో కొందరికి అది గుర్తు ఉండే ఉంటుంది)

ఆదిలోనే హంసపాదు అన్నట్లు మొదట్లో నేను రాసిన ఒక పోస్ట్ చదవమని నా మిత్రుడిని అడిగితే నాకు తెలుగు మాట్లాడటం వచ్చు కానీ చదవడం రాదు అన్నాడు (నెల్లూరు కుర్రాడే కానీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లో చదివాడట మరి)

సరే అని మా ఆవిడ ని అడిగితే చదివే ఓపిక లేదు నువ్వే చదువు వింటాను అంది .హతవిధీ! పగవాడైన మా మేనేజర్ కు కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనుకున్నాను. 

అలా రెండు మూడు పోస్ట్లు రాసి పోస్ట్ చేసాక, ఎవరైనా చదువుతున్నారా అని అనుమానం వచ్చింది. ఎవరైనా చదువుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది, కనీసం కామెంట్ పెడితే చదువుతున్నారని తెలుస్తుంది అని అనుకున్నాను. ఇక అప్పటి నుంచి  

C.M పోస్ట్ కోసం జగన్ లా, 
P.M పోస్ట్ కోసం రాహుల్ లా, 
అమరావతి కోసం ఆంధ్రుల్లా, 
చంద్రుని కోసం చకోర పక్షిలా

కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్న నా నిరీక్షణ కు తెర పడింది ఒకరో ఇద్దరో కామెంట్ పెట్టడంతో. 

ఆ కామెంట్స్ తో కాస్త ఉత్సాహం వచ్చి అప్పటినుంచి గుడ్డెద్దు చేలో పడ్డట్లు తోచింది రాసుకుంటూ వస్తున్నాను. కొన్ని మీకు నచ్చి ఉండచ్చు మరికొన్ని నచ్చక పోయి ఉండచ్చు. చదువుతున్న వారికి అలాగే చదివి అభిప్రాయలు షేర్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. 


పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు కాకుండా కనీసం పది కాలాల పాటు పడుతూ లేస్తూ  అయినా ఏదో ఒకటి రాస్తూ ఉండాలని అనుకుంటున్నాను. (రాయబట్టి సంవత్సరం, అంటే 3 కాలాలు అయిపోయాయి, ఇంకా పది కాలాల పాటు అంటే ఇంకో 3 సంవత్సరాలు రాస్తావా? ఆశకైనా హద్దు ఉండాలి రా వెధవ - నా అంతరాత్మ గోల ఇది. పట్టించుకోకండి  ప్లీజ్ )

ఇంతోటి బాగోతానికేనా మీసాలు గొరిగాడు అన్నట్లు బ్లాగ్ మొదలెట్టి సంవత్సరమైనందుకే ఇంత హంగామా చేసావు , నీ  సంబడం సంతకెళ్లా ఈ మాత్రం దానికే ఒక పోస్ట్ పెట్టాలా అంటారా ఏం చేస్తాం కాకి పిల్ల కాకికి ముద్దు కదండీ అందుకే ఈ సంబడం.

మొన్నా మధ్య నా మిత్రుడు ఫోన్ లో మాట్లాడుతూ నీ పోస్టులు చదువుతూ ఉంటాను అందులో నీ సృజనాత్మకత బాగుంది అన్నాడు

పొరపడినట్లున్నావ్.. నాకు ఆ సృజన ఎవరో ఆవిడ ఆత్మకథ ఏమిటో అస్సలు తెలీదు అని చెప్పేశా, ఆ తర్వాత అతను కింద పడి గిల గిల కొట్టుకున్నట్లు వాళ్ళావిడ చెప్పగా వినడమే తప్ప అతనితో తర్వాత మాట్లాడలేకపోయాను.

అప్పటినుంచి ఆ సృజనాత్మకత ఎప్పుడు రాశానబ్బా అని నా బ్లాగ్ పోస్ట్ లన్ని వెదుక్కుంటున్నా. కొంపదీసి నా బ్లాగ్ కూడా అందరి సెలెబ్రెటీల అకౌంట్స్ లా హాక్ చేసి ఎవరైనా పోస్ట్ చేసి ఉంటారా ?

అవును మరి నువ్వో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వి, సింగర్ సుచిత్రవి కదా అందుకని నీ అకౌంట్ ని హాక్ చేసి ఉంటారు అంది నా అంతరాత్మ. 

చెప్పలేము కదా ఎవరైనా నా బ్లాగ్ ని హాక్ చేసి ఉండచ్చు

బుద్ధి ఉంటే సరి నువ్వేమైనా మనిషివా చలపతిరావువా?  వాళ్లంటే సెలెబ్రెటీలు, వాళ్ళ అకౌంట్స్ హాక్ అయ్యానని చెప్పుకుంటుంటారు. అంతెందుకు రేప్పొద్దున రేపుల స్పెషలిస్ట్ అయిన ఆ చలపతి రావు లాంటి వాళ్ళు కూడా నా గొంతు ఎవరో హాక్ చేసి ఆ మాట అనిపించారు అని ఒక స్టేట్మెంట్ పడేస్తారు. అయినా బోడి నీ అకౌంట్ ఎవడు హాక్ చేస్తాడు?

మరి ఎవరూ హాక్ చేయకపోతే నేను రాయకుండానే ఆ సృజన గారి ఆత్మ కథ నా బ్లాగ్ లో ఎలా కనిపించి ఉంటుందబ్బా నా మిత్రుడికి ?

22, మే 2017, సోమవారం

సరిగ్గా 363 రోజుల క్రితం

సరిగ్గా అటు ఇటుగా సంవత్సరం క్రితం ఒక బ్లాగ్ ఓపెన్ చేసి ఏమైనా రాద్దామనుకున్నప్పుడు నా అంతరాత్మకు, నాకు జరిగిన సంభాషణ. 

బ్లాగ్ రాయాలనుకుంటున్నావ్ బాగానే ఉంది..టైం దొరుకుతుందంటావా?

అవేమైనా 5 సెంట్స్ కాయిన్ అనుకుంటున్నావా, రోడ్డు మీద దొరకడానికి?

అంటే నా ఉద్దేశం బ్లాగ్ రాయడానికి టైం కేటాయించ గలవా అని?

వారం లో ఒక గంట అయినా కేటాయించలేనా? నా తిప్పలేవో నేను పడతాను.

ఏం పేరు పెడదామనుకుంటున్నావ్?

కడప కత్తి, నాటు బాంబులు, రాయల సీమ రెడ్డి ఇలా ఏదో ఒకటి.

సాంబారు బుడ్డి, గంపలో గడ్డి, నీ మొహం మడ్డి .. ఏంటా పేర్లు నువ్వేమైనా ఫ్యాక్షన్ సినిమా తీస్తున్నావా?

ఏదో సీమ వాడిని కదా అలా relate చేసుకుంటే బాగుంటుందని

నీ మొహం అదొక డబ్బా ఐడియా

మరి బఠాణీలు, మరమరాలు , జంతికలు, వేడి వేడి పకోడీలు అని పెట్టుకుంటే?

అప్పడాలు, వడియాలు, పిడత కింద పప్పులు, డబ్బాలో మురుకులు అని పెట్టుకో, రాసే కబుర్లకు ఇదే ఎక్కువ. 

పోనీ కాఫీ కబుర్లు, టీ టైం చతుర్లు ?

పాల పుంతలు , మజ్జిగ ముంతలు , వెచ్చటి బొంతలు , సంతలో సరుకులు అని పెట్టుకో ఇంకా బాగుంటుంది

ఊసుల లోగిలి, పవనం, చిరు జల్లులు, తొలకరి చినుకులు

ఉరుములు పిడుగులు అని పెట్టుకో దెబ్బకు నీ బ్లాగ్ పక్కకు ఎవరూ రారు. నువ్వు రాసే లొల్లాయి కబుర్లకు అలాంటి కవితాత్మకమైన పేర్లు అవసరమంటావా?

పోనీ సినిమా కబుర్లు అని పెడితే

సినిమా కబుర్లు అని పేరు పెడితే, చిన్నప్పుడు గోళీలాడి గ్రాండ్ స్లాం గెలుచుకున్నాను, పరుగు పందెం లో పది రికార్డ్స్ సాధించాను, సొల్లు కబుర్లు చెప్పడం లో స్టేట్ ఛాంపియన్ని లాంటి గొప్పలు చెప్పుకోవడం కుదరదు.

అసలు నువ్వు దేని గురించి రాయాలనుకుంటున్నావో క్లారిటీ తెచ్చుకో. రాజకీయాల గురించి రాయాలనుకుంటున్నావా? 

M.P కి M.L.A కి తేడా కూడా తెలీదు ఇక రాజకీయాల గురించి ఏం రాస్తాను?

లేక సాహిత్య సౌరభాలు వెదజల్లలనుకుంటున్నావా?

సాహిత్య అంటే అమ్మాయి పేరని, సౌరభ్ అంటే సౌరభ్ గంగూలీ అని తెలుసు కానీ వాళ్ళను వెదజల్లడం ఎలాగో నాకస్సలు తెలీదు.

కనీసం నీ రచనలతో ప్రజలను చైతన్య పరుద్దామనుకుంటున్నావా?

చాప పరచడమో, దుప్పటి పరచడమో అయితే చేయగలను గాని చైతన్యం ఎలా పరవాలో నాకు తెలీదు

కార్మిక, కర్షక సోదరుల గురించి ఏమైనా రాయగలవా?

కరిష్మా, కరీనా సోదరీమణుల గురించి అయితే కాస్తో, కూస్తో రాయగలను గానీ కార్మిక, కర్షక సోదరుల గురించి నేనేమి రాయలేనందుకు సిగ్గు పడుతున్నాను.

కనీసం రామాయణమో, భారతంలో జరిగి కొన్ని ఘట్టాల గురించి

రామాయణం కడు రమణీయం, రామాయణం లో రాముడు హీరో, భారతం లో కృష్ణుడు హీరో, రామాయణం రంకు, భారతం బొంకు అని వాళ్ళు వీళ్ళు అంటే విన్నాను కానీ ఏ రోజు అవి చదవని అవివేకిని. 

కనీసం కృష్ణ శాస్త్రి కవితలో, రావి శాస్త్రి రచనలో, శ్రీరంగం శ్రీనివాసరావు వంటి అభ్యుదయ రచయిత రాసిన పుస్తకాలో చదివావా?

ఈ శ్రీరంగం శ్రీనివాసరావు ఎవరు?  ఎప్పుడూ వినలేదే?

అగ్గి పుల్ల,  కుక్క పిల్ల,  సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్న శ్రీ శ్రీ గారు తెలీదు నువ్వూ ఒక బ్లాగ్ రాయడమే, 

హుర్రే దొరికేసింది.. నా బ్లాగ్ కు ఒక పేరు దొరికేసింది 'కాదేదీ బ్లాగ్ కి అనర్హం' .

అసలేమీ తెలీకుండా ఒక బ్లాగ్ రాసేస్తావా? అసలేం అర్హత ఉందని?

వెయ్యి కథలు చదివాక ఒక కథ రాయడం మొదలెట్టు అని నాకొక సలహా ఇచ్చాడు మా మాథ్స్ లెక్చరర్ ఒకసారి

ఆయనెందుకు అలా సలహా ఇచ్చాడు

అదో  పెద్ద కథ..ఇంకో సారి చెప్పుకుందాం

అయినా ఆ సలహాకు ఈ బ్లాగ్ కి ఏంటి సంబంధం?

'వెయ్యి కథలు చదివాక ఒక కథ రాయడం మొదలెట్టు అని' ఆయన అన్నారు, వెయ్యి కథలు చదివక పోయినా, వెయ్యి బ్లాగు పోస్టులు అయితే చదివి ఉంటాను కాబట్టి మా లెక్చరర్ ప్రకారం నేను ఒక బ్లాగ్ మొదలెట్టచ్చు. 

18, మే 2017, గురువారం

ప్లాట్ నెంబర్ 62 బ్లాగోతానికి పునః స్వాగతం


ప్లాట్ నెంబర్ 62 కి తరువాయి భాగం చదవండి.

మీరంత బెదిరిస్తే చెప్పక ఛస్తానా? పైగా నా గెస్ట్ మీరు చెప్పకుండా ఉంటానా?

ఆ ఇద్దరు ఎవరంటే పక్క వీధిలోని C.D షాప్ ఓనర్, జయభారత్ థియేటర్ ఓనర్. 

సంబంధం లేకుండా మోకాలికి బోడిగుండుకు ముడి పెడుతున్నానంటారా? అబ్బే సంబంధం ఉంది.. అదే చెబుతున్నా. 

నన్ను నమ్ముకొని పోయిన ఏడాది ఇల్లు కట్టించుకొని, ఈ ఏడాది పిల్ల పెళ్లి చేయాలనుకున్నవాడు ఆ C.D షాప్ ఓనర్, అలాగే సెకండ్ షిఫ్ట్ మీద కొత్తగా రిలీజ్ అయిన సినిమాను ఆడించుకునే బదులు ఎప్పటికైనా ఫస్ట్ రోజే పవన్ కళ్యాణ్ సినిమాను తన థియేటర్ లో రిలీజ్ చేసుకునే ఆర్ధిక స్తొమత  కోసం నా మీద భరోసా పెట్టుకున్న వాడు ఆ జయభారత్ థియేటర్ ఓనర్.  అదే వాళ్ళిద్దరికీ, వారికి రెగ్యులర్ కస్టమర్ ని అయిన నాకు మధ్య ఉన్న ఆర్ధిక సంబంధం. 

పదండి దగ్గర్లో మంచి టీ స్టాల్ ఉంది అక్కడ టీ తో పాటు మిర్చి బజ్జి, ఎగ్ బజ్జి కూడా భలే ఉంటాయి. యెంత దూరమంటారా ఇక్కడే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్

ఇదేంటి ఊరి మధ్యలో 'వెల్కమ్ టు తిరుపతి' అని బోర్డ్ పెట్టారని అడుగుతున్నారా?

ఊరి మధ్యలో కాదండి మనం ఊరి బయటకి వచ్చేశాం. 5 కిలోమీటర్స్ వచ్చేసాం ఇంకెంత 3 కిలోమీటర్స్ వెళితే మంచి ధాబా ఉంటుంది అక్కడికెళ్లి డిన్నర్ చెయ్యొచ్చు సారీ టీ తాగొచ్చు. ఇంకెంత 3 కిలోమీటర్లు,  టూ వీలర్ మీద అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం పదండి. 

టూ వీలర్ ఎ.. క..డా  అంటున్నారా?

మన రెండు కాళ్ళు మనకుండగా మళ్ళీ  టూ వీలర్ ఎందుకు దండగ?  నా  ఉద్దేశ్యం ప్రకారం మనకున్న టూ లెగ్స్ టూ వీల్స్ కదా అందుకే అలా అన్నాను 

నువ్వు నీ తొక్కలో ఉద్దేశ్యం .. అదే 10 కిలొమీటర్లు ఇటు వైపు వెళ్తే తిరుమల కొండపైకి ఎక్కి దేవుడికో హాయ్ చెప్పి ఒక టీ తాగి రావచ్చు. అయినా నీతో టీ కి వెళ్లడమంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అంటారా? నువ్వు నీ సోది, తలనొప్పి తెప్పిస్తున్నావ్? %$#%#$%#$%$#%$#% అంటారా?

ఆపండి బాబోయ్ !!! మీ తలనొప్పి తగ్గిపోతుంది, ఇక్కడే ఎక్కడో చోట టీ తాగేద్దాం.

ఇప్పుడే చెబుతున్నాను టీ తాగాక మా చిన్నితో కాస్త జాగ్రత్త. కొత్త చెప్పులు కొనాలి షాప్ కి వస్తావా అని అడిగితే పొరపాటున కూడా వెళ్ళకండి. తనకి సరిపడే  చెప్పులు దొరకాలంటే తిరుపతి లో ఉండే షాప్స్ అన్ని వెతకాల్సిందే లేదా స్పెషల్ గా ఆర్డర్ చేసి తయారు చేయించాలి లేదూ instant గా కావాలి అంటే దగ్గర్లో ఏదైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. అక్కడైతే పెద్ద పెద్ద చెప్పులు ఉంటాయి గుడి బయట పూజ కోసం, అవి కొట్టుకొచ్చెయ్యాలి, పాపమైన సరే తప్పదు మరి అతని కాళ్ళ సైజు అలాంటిది.

భాగవతం లో బలి చక్రవర్తి వామనుడికి దానమిస్తానన్న మూడడుగుల నేల కథలో రెండు పాదాలతోనే లోకమంతా  కొలవడం ఏమిటి మరీ కట్టు కథ కాకపొతే అని కొట్టి పడేసే వాళ్ళెవరైనా ఉంటే మా చిన్ని భయ్యా పాదం సైజు చూశాక బహుశా అది నిజమే అయి ఉండచ్చు అని నమ్మేస్తారు.  

(నీ పాదం మీద దిష్టి చుక్క పెడుతున్నానన్నయ్యా  .  ఎవరి దిష్టి తగలకుండ )

చెప్పడం మర్చిపోయాను టీ మాత్రమే కాదు ఫ్రెండ్షిప్ అన్నా మహా ఇష్టం మా చిన్ని భయ్యా కి. (అసలే తన కాళ్ళ మీద జోక్ చేశాను కాబట్టి లాస్ట్ లో ఈ మాట చెప్పి బాలన్స్ చేశాననుకుంటున్నారేమో, కాదండీ నిజ్జంగానే ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం తనకి)

9, మే 2017, మంగళవారం

ప్లాట్ నెంబర్ 62 కి పునః స్వాగతం


క్షమించాలి .. మిమ్మల్ని నిద్ర లేపటం కాస్త ఆలస్యమైంది. ఎక్కడున్నాను అని దిక్కులు చూస్తున్నారేమిటి?  మీ ఖర్మ కాలి టైం మెషిన్ ఎక్కి ప్లాట్ నెంబర్ 62 కి వచ్చారు.

ఓహో గుర్తుందా మంచింది. ఏమిటి నిద్ర లేచాక కాస్త టీ తాగాలనిపిస్తోందంటారా?

చక్కటి ఆలోచన.. పదండి అలా బయటికి వెళ్లి చిక్కటి టీ తాగొద్దాం. అదిగో టీ అనగానే రివ్వున గువ్వలా దూసుకువస్తున్నాడు చూడండి అతనే మా చిన్ని భయ్యా  (అసలు పేరు గురు లక్ష్మీకర్, మేము పెట్టుకున్న కొసరు పేరు చిన్ని).

అర్థరాత్రి అయినా సరే లేపి టీ తాగుదాం వస్తావా అంటే సై అని ఎవడంటాడో వాడే మా చిన్న భయ్యా.  తనతో వెళదాం పదండి టీ తాగి రావడానికి.

ఏంటి? అక్కడ కనపడే హోటల్ కి వెళదాం అంటారా?

మీ ఇంట్లో చెప్పే వచ్చారా? ఆ హోటల్ గురించి తెలుసే మాట్లాడుతున్నారా? అసలు  ఏ హోటల్ పేరు చెబితే జనాలు ఆ హోటల్ లో తినడం మానేసి మూడు పూటలా పస్తు అయినా ఉండటం బెస్టు అనుకుంటారో , ఏ హోటల్ పేరు చెబితే తొక్కలో ఉండే అరటి పండైనా తిని ఆ పూటకు కడుపు నింపుకుంటారో, ఏ హోటల్ పేరు చెబితే బస్ స్టాండ్ లో బఠాణీలు తిని అటే రిటర్న్ బస్సు ఎక్కి వెళ్ళిపోతారో ఆ హోటలేనండి ఈ పులిరాజు హోటల్. 

ఆ T.V add లో వచ్చే పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందో రాదో తెలీదు కానీ ఈ పులిరాజు హోటల్లో తింటే మాత్రం వెంటనే నరకానికి రైడ్ గ్యారెంటీ. (ఆత్మహత్య కు నరకమే ప్రాప్తి అని ఎక్కడో చదివినట్లు గుర్తు) తమిళనాడు కు చెందిన అతడి వంటలకు తమిలోళ్ళే తట్టుకోలేకపోయారు  ఇక మనమెంత జుజుబీ. అసలు తమిళ్ వాళ్ళు సాంబార్ యెంత కమ్మగా పెడతారండీ, ఇతనెందుకో మరి అంత చెండాలంగా చేస్తాడు. తమిళోళ్ళ పరువు తీసేసాడు. ఇతనితో పాకిస్తాన్ లో ఆ ఉగ్రవాదులుండే చోట ఒక హోటల్ పెట్టిస్తే బాగుండు.  ఇతని జన్మకి ఒక సార్థకత లభిస్తుంది, అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక పరమ శూర ఘోర వీర చక్ర కూడా. తధాస్తు..ఆమెన్. (క్షమించాలి నా ఈ అతి వీరావేశానికి)

ఒకసారి గ్రహపాటునో పొరపాటునో చపాతీ తిందామని వెళ్తే చపాతీ లోకి సాంబార్ ఇచ్చాడు మహానుభావుడు. అయినా అదేం కాంబినేషన్ ఛండాలంగా? లంగా వోణి తో అందంగా ఉన్న అమ్మాయి పక్కన లుంగీ కట్టుకున్న అబ్బాయిని జోడి గా నిలబెట్టినంత ఛండాలంగా ఉంది. ఏ పప్పో, ఆలూ కర్రీ నో అయితే పంచె కట్టుకున్న అబ్బాయి లాగానో లేక ప్యాంటు వేసుకున్న అబ్బాయి లాగానో ముచ్చటగా ఉండేది జోడి. (ఏంటి? నా పోలిక చపాతీ,సాంబార్ కాంబినేషన్ కన్నా దరిద్రంగా ఉందంటారా? ఏదో ఫ్లో లో అలా వచ్చేసింది..మన్నించాలి. రోజూ చూస్తున్న దిక్కుమాలిన తెలుగు సినిమాల ప్రయాసల ప్రాసల ప్రభావం)

ఆ రోజు అలా సాంబార్ తో చపాతీ తినలేక  వచ్చేసాను కాబట్టే ఈ రోజు ఇలా మీ బుర్ర తినడానికి  తయారయ్యాను. అప్పుడు ఏ నక్క తోకో తొక్కి వెళ్లి ఉంటాను గానీ లేకపోతే కుక్క చావు చావాల్సి వచ్చేది.  అదే జరిగుంటే నాతో పాటు మరో ఇద్దరి పేర్లు నరకం లో రిజిస్టర్ అయ్యేవి ఆ రోజో మరుసటి రోజో.

ఇంకో ఇద్దరెవరంటారా? వద్దులెండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అన్ని రహస్యాలు మీకు చెప్పడం బాగోదు.

అయినా ఆ పులిరాజు హోటల్ లో తినాలంటే పులి మీద రైడ్ చేసేంత దైర్యం కావాలి, నాకంత లేదు వేరే హోటల్ వెతుక్కుందాం పదండి.

ఏంటి అక్కడేదో ఇంకో హోటల్ ఉంది వెళదాం అంటారా వద్దండి.

రుచి గురించి కాదండీ బాబోయ్, 'బాబాయ్ హోటల్' అని రుచి,శుచి బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతైనా గుంటూరు వ్యక్తి కదా వంటలు అద్భుతంగా చేస్తాడు. కాకపొతే రుచి, శుచి కోసం పొతే మన మెదడు వాచి పోతుంది ఆయన గొప్పలు వినలేక. 

అబ్బో ఆ రోజుల్లో అయితే అని మొదలెట్టి "సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశానని, ఎన్టీవోడు అయినా అక్కినేని అయినా నేను యెంత చెబితే అంతే అని" పప్పు వేసినప్పుడల్లా డప్పుతో, రసం వేసినప్పుడు సన్నాయితో, మజ్జిగ వేసినప్పుడు మద్దెలతో మన పొట్ట చించి ఫిడేలు, డొక్క చించి డోలు వాయించేస్తాడు, పీకల దాకా మెక్కి ఉంటామా ఆ వాయింపుకు  ఎటూ పారిపోలేక మెక్కడానికి వెళ్లిన మనం మన చొక్కా మనమే చించేసుకొని ఆయన గోచినే లాక్కొని వెంకన్నకు మొక్కు తీర్చడానికి పెట్టుకున్న తలను కుర్చీ పైకెక్కి అక్కడున్న ఫ్యాన్ రెక్కకి అర్పించేయాలి, దానికంటే ముక్కు మూసుకొని తపస్సు చేసినా వెంకన్న దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లొచ్చు. అందుకే అటు వైపు వద్దులెండి అసలే నన్ను నమ్ముకొని ఇద్దరున్నారు.

నీ ఇద్దరి గొడవేమిటయ్యా .. అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు నిన్ను నమ్ముకొని ఉన్నారో తెలిసీ చెప్పకపోయావో నీ తల ఆ పులిరాజు బారిన, ఈ బాబాయ్ బారిన పడ్డ బాధితుల సంఖ్య అంత ముక్కలవుతుంది అంటారా? కాస్త ఓపిక పట్టండి చెప్తాను.

26, ఏప్రిల్ 2017, బుధవారం

నా పాపానికి నిష్కృతి ఉందంటారా?

ఏంటి వెళ్లడం లేదా?
నహీ జారహే హో?
నాట్ గోయింగ్?
హోగ్తా ఇల్వా?


గత  రెండు రోజులుగా కనబడ్డ ప్రతివారూ నిన్ను అడుగుతున్న ప్రశ్న. ఇంత మంది అడిగాక కూడా వెళ్లలేదో చచ్చాక 'మహిస్మతి పురాణం' ప్రకారం నువ్వు నరకం లో నానా బాధలు పడాల్సిన ఉంటుంది జాగ్రత్త, నువ్వసలు తెలుగు వాడివేనా? వెళ్లకుండా పెద్ద పాపం చెయ్యబోతున్నావ్, ఈ నీ పాపానికి నిష్కృతి లేదు అని నా మనస్సాక్షి హెచ్చరించించింది.  

చాళ్లే నీ వెటకారాలు. బాహుబలి-2 సినిమాకు వెళ్లనంత మాత్రాన నేను తెలుగు వాడిని కాకుండా పోతానా? నాకూ వెళ్లి చూడాలనే ఉంది కాకపొతే కొన్ని కారణాల రీత్యా వెళ్లలేక పోతున్నాను. 

కారణాలు అని చెప్పి తప్పించుకుంటే సరిపోదు చెప్పి తీరాల్సిందే?  అంది మనస్సాక్షి

నీకు గుర్తుందా? బాహుబలి కి వెళ్ళినప్పుడు 7 సార్లు 
ధృవ కి వెళ్ళినప్పుడు రెండు సార్లు 
ఖైదీ నెంబర్ 150 కి వెళ్ళినప్పుడు మూడు సార్లు థియేటర్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. 

అయినా అన్ని సార్లు వెళ్ళే బదులు, ఒక్క సారిగా ఇంటర్వెల్ లో వెళ్లి పోసుకు రావచ్చుగా? ఒకసారి డాక్టర్ ని కలిస్తే మంచిదేమో?

నేను బయటికి వెళ్ళింది అందుకు కాదు, నీకు తెలుసు కదా ఫైటింగ్ వచ్చినప్పుడల్లా 'నాకు భయం నేను చూడనహో' అని బుడ్డిది అక్షయ మొత్తుకుంటుంది కాబట్టి తనకోసం ఆ ఫైటింగ్ అయిపోయే వరకు థియేటర్ బయటికి వెళ్ళి రావాలి.  ఇక బాహుబలి-2 లో ఖచ్చితంగా యుద్ధాలే ఎక్కువ ఉండి ఉంటాయి, అవి చూడకపోతే మిగిలేది రసం పిండేసిన చెరకు పిప్పే. అల్లాంటప్పుడు ఇక సినిమాకు వెళ్లడం ఎందుకు అని వెళ్లట్లేదు. 

పాయింటే, మరి నువ్వొక్కడివే వెళ్లి చూసి రావొచ్చుగా?

ఆఫీస్ కి తప్ప ఇంకెక్కడికి ఫామిలీ ని వదలి వెళ్ళను అని తెలిసీ ఆ ప్రశ్న అడగటం అనవసరం.

అది సరే, నాకు తెలిసినంతవరకు తెలుగులో పార్ట్-2 సినిమా ఏదీ హిట్టయ్యినట్లు చరిత్రలో లేదే? మరి ఇది అవుతుందంటావా?(తధాస్తు దేవతలూ! కాసేపు ఆగండి ప్లీజ్)

ఏమో ఈ సినిమానే ఆ పాత చరిత్ర కి శుభం పలికి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టొచ్చేమో. (ఇప్పుడు తధాస్తు అనేయండి ప్లీజ్)

ఆ ఏముంది ఆ సినిమాలో అని సత్యనారాయణ లాంటి సీనియర్ నటులు పెదవి విరిచారు కదా?

తాను మునిగిందే గంగ, వలచిందే రంభ, నటించిందే కళాఖండం అని ఆయన అనుకొని ఉండచ్చు. అయినా అంత గొప్ప వారిని తప్పుపట్టే అర్హత మనకెక్కడుంది. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు అంతే. లోకోభిన్నరుచి అని అన్నది అందుకే కదా, అందరికీ  అన్ని నచ్చాలని లేదు. ఒకప్పుడు కుర్రకారును వెర్రెత్తించిన 'ప్రేమదేశం' ను కూడా ఇదేం సినిమారా అనేవారు మా పక్కింటి అంకుల్. మొన్నామధ్య యమగోల సినిమా చూస్తుంటే 'ఈ అంకుల్ హీరో ఏంటి?' అని అడిగింది అక్షయ. పిల్ల కాకి తనకేం తెలుసు ఎన్టీవోడి గొప్పదనం గురించి. అంతెందుకు అందరికి నచ్చిన 'నేను లోకల్' సినిమా నాకు నచ్చలేదు, అంత మాత్రం చేత అది మంచి సినిమా కాకుండా పోతుందా? జనరేషన్ గ్యాప్ అని సరి పెట్టుకోవాలంతే. 

కావచ్చు కానీ అదేమైనా చరిత్ర గురించి చెబుతున్న సినిమానా అంత విలువ యివ్వడానికి, అనవసరంగా ఆ సినిమాను పొగుడుతున్నారు అనిపిస్తోంది. 

చరిత్ర పేరు చెప్పి కమర్షియాలిటీ కోసం కథను వక్రీకరించడం కన్నా ఇలాంటి సినిమాలు తీయడమే బెటర్. అప్పుడెప్పుడో మాయబజార్, నర్తనశాల, శంకరాభరణం లాంటి కొన్ని గొప్ప సినిమాల తర్వాత ఇదిగో ఇప్పుడే తెలుగు సినిమాలకు మళ్ళీ అంతర్జాతీయ లెవెల్లో కాస్తో కూస్తో గుర్తింపు వస్తోంది సంతోషం.

సినిమా బాలేదని అప్పుడే చూసేసినట్లు కొందరు విమర్శిస్తున్నారు. ఇంతకీ బాహుబలి-2 గురించి నువ్వు ఏమంటావ్? బాగుంటుందంటావా?

ఏదో కాస్త పబ్లిసిటీ వస్తుందని కొందరు అలా అని ఉండచ్చు. సూట్ అవుతుందో లేదో తెలీదు కానీ మోటు సామెత ఉంది చెప్తాను విను. 'గుళ్ళో గుగ్గిలం వెయ్యకపోయినా పర్లేదు అదేదో చేసి కంపు కంపు చెయ్యొద్దు' అన్నారు కదా పెద్దలు, అది ఫాలో అయిపోతే సరి.  

P.S: నా దగ్గర బాహుబలి-2 మీద ఒక టపా రాయడానికి ఎటువంటి మేటర్ లేకపోయినా కనీసం ఆ సినిమా మీద ఏదో  ఒక టపా రాస్తే కొంతలో కొంత పాప విమోచనం కలుగుతుందని మా గురువు బొంగు భగవానందస్వామి గారు, అలాగే ఆయన గురువు గొట్టం గోవిందస్వామి గారి ఉపదేశం మేరకు ఆదరా బాదరా గా ఇప్పటికిప్పుడు రాసిన పోస్ట్ ఇది. తప్పులున్నా, మిమ్మల్ని బోర్ కొట్టించినా క్షమాపణలు. 


19, ఏప్రిల్ 2017, బుధవారం

ప్లాట్ నెంబర్ 62, తిరుపతి


మీకు టైం మెషిన్ ఎక్కే ఛాన్స్ వచ్చి 15 ఏళ్ళు వెనక్కి వెళ్లగలిగే అద్భుతమైన అవకాశం దొరికిందనుకోండి. మీరు వెళ్లే చోట సంతోషాలకు, సినిమాలకు, కబుర్లకు, గౌరవ మర్యాదలకు లోటు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా తిరుపతి లోని మా ప్లాట్ నెంబర్ 62 కి వెళ్ళండి.

అయ్యో పక్కవీధి లోనే దిగేసారా, మా రూమ్ కి ఎలా వెళ్ళాలో తెలీక తికమక పడుతున్నారా? అక్కదేదైనా సీడీ షాప్ కనపదిండా మీరింక అడ్రస్ కోసం వెదుక్కోనవసరం లేదు, లోపలికెళ్ళి మా ప్లాట్ నెంబర్ 62 కి ఎలా వెళ్లాలో అడగండి, గౌరవ మర్యాదలతో మారూమ్ కి తీసుకొచ్చి వదులుతారు నాదీ గ్యారంటీ. Most Valuable Customers అయిన మాకు వాళ్ళిచ్చే గౌరవం అది.


ఓహ్ వచ్చేశారా రండి .. ఇప్పుడే కంప్యూటర్ లో మార్నింగ్ షో అయిపోయి మాట్నీ మొదలైంది. ఎగ్ దోస విత్ చట్నీ తో బ్రేక్ ఫాస్ట్  చేస్తూ చూద్దురు గానీ.  మాట్ని టైం లో దోస, చట్నీ అంటారేమిటి అనుకోవద్దు. ఇందాకే మార్నింగ్ షో అయిపోయాక బయటికి వెళ్లి టిఫిన్ పార్సెల్ తీసుకొచ్చాం రండి తిందురు గానీ, ది బెస్ట్ ఎగ్ దోస ఇన్ ది వరల్డ్. అక్కడున్న మూడేళ్ళు క్రమం తప్పకుండా అదే ఎగ్ దోస తిన్నామంటే మీరే అర్థం చేసుకోవచ్చు అది యెంత బెస్టో, టేస్ట్ లో యెంత ఎవరెస్టో.

మీరేదో మంచి వాళ్ళని మిమ్మల్ని గెస్ట్ గా ఆహ్వానిస్తే బూతులు మాట్లాడుతున్నారేమిటీ? కాలేజ్ కు ఎప్పుడు వెళ్తారు అని అడుగుతున్నారా? అసలు కాలేజ్ కు వెళ్లడం అనేది ఈ రూమ్ లో ఎంత పెద్ద బూతు పనో మీకు తెలుసా? దయ చేసి దాని ప్రస్తావన ఇంకోసారి తీసుకురాకండి.

కాలేజ్ కి వెళ్ళని వాళ్లలో రూమ్ నెంబర్ 62 ఫస్ట్
సినిమాలు చూడటం లో రూమ్ నెంబర్ 62 ఫస్ట్
చదవడం లో కూడా మేమేమి తక్కువ కాదండోయ్ మరీ ఫస్ట్, బెస్ట్ కాకపోయినా వరస్ట్, లాస్ట్ అయితే మాత్రం కాదు.

ఎవరో అద్భుతంగా పాడుతున్నట్లున్నారు కదా! పదండి ఆత్మ విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్ అయిన మా శీను భయ్యా ను పరిచయం చేస్తాను.

భయ్యా అంటే మాకంటే ఏ పదేళ్ళో పెద్దవాడనుకునేరు, మా వయసు వాడే, మేము అలా గౌరవించుకునే వాళ్ళము తనని. అతనితో ఒక్క సారి మాట్లాడి చూడండి. గంటలు క్షణాల్లా కరిగిపోయే అద్భుత అనుభూతి మీ సొంతం కాకపొతే నా అంతం చూడండి. 

పనిలో పని పూరీ ఆయిల్ లో వేస్తె ఎలా పొంగుతుందో చూడాలనుకుంటున్నారా అయితే ఒక్క సారి చిరంజీవి అని పిలువండి చాలు.

యెంత సేపని అతని చతురోక్తులకు ముగ్దులవుతారు? తన నోటి మాటే కాదు కాస్త చేతి వంట కూడా రుచి చూద్దురు రండి ఇందాకా మీరు చిరంజీవి అన్నందుకు పొంగిపోయి ఒక పక్క మీతో మాట్లాడుతూనే చికెన్ చేశాడు మా వంటల భీముడు.

ఎక్కడో పల్లెలో పుట్టినా కూడా బాగా చదువుకొని తన శారీరిక వైకల్యాన్ని సైతం ఓడించిన మగధీరుడు (చిరంజీవి టైటిల్ అనుకుంటున్నారా?  చెప్పానుగా చిరంజీవి అంటే పొంగిపోతాడని అందుకే వాడేశా). 

చిన్నతనం లో పోలియో వల్ల కాళ్ళు చచ్చుబడి చక్రాల కుర్చీకి తల వంచాల్సి వచ్చినా, జీవితంలో మాత్రం దేనికీ తలవంచక స్వంత కాళ్ళ మీద నిలబడ గలిగిన వ్యక్తిత్వ శిఖరం. 

నాకెందుకో కలాం జీవిత చరిత్ర గానీ, మోడీ జీవిత చరిత్ర గానీ అంత ఇన్స్పైరింగ్ గా అనిపించదు, మా శీను భయ్యా జీవితాన్ని దగ్గరగా చూసినందుకేమో.

మన మీద మనమే జోక్స్ వేసుకోవడానికి అహాన్నివదిలేయాలని అతన్ని చూసాకే తెలుసుకున్నా. యెవరైనా తమాషాకి గాని కోపంగా గానీ రెండు కాళ్ళు విరగ్గొడతా అంటే విరగ్గొట్టడానికి ఇక్కడేం మిగిలున్నాయని అని నవ్వుతూ సమాధాన మివ్వాలంటే యెంత గొప్ప సంస్కారం ఉండాలి?

ఏంటి కళ్ళలో నీళ్లు వస్తున్నాయా? చికెన్ కాస్త కారంగా ఉన్నట్లుంది నీళ్లు తాగండి. కూరలో మమకారం తో పాటు కాస్త కారం కూడా ఎక్కువేసినట్లు ఉన్నాడు మా శీను భయ్యా.

తన గురించి మరీ ఎక్కువగా చెప్పానని అనుకుంటున్నారా.. లేదండి నేను చెప్పింది, చెప్పగలిగింది చాలా తక్కువ. ఒక చేయి తిరిగిన రచయిత తలచుకుంటే అతని జీవితాన్ని ఎవరికైనా inspiration కలించేలా ఒక పుస్తకంగా రాయగలరు.

ఏమో ఒక పదేళ్ల తర్వాత నా టైం బాగుండి అప్పటికి నా రచన ను ఇంప్రూవ్ చేసుకోగలిగితే నేనే తన మీద ఒక పుస్తకం రాయగలనేమో చూద్దాం.

ఒక వేళ ఇప్పుడే కనుక నేను తన ఆత్మకథ రాస్తే ఇదిగో ఇలా చండాలంగా ఉంటుంది. 

స్టేషన్ లో ట్రైన్ బయలుదేరి వేగం అందుకుంది. 

స్టేషన్ పక్కనే ఉండే హాస్పిటల్ లో అంతే వేగంగా అమ్మ కడుపులోంచి ఒక పిల్లాడు బయటికి వచ్చాడు.

అతని వేగాన్ని చూసి ఆశ్చర్య పడి 'హౌరా' అంది నర్స్ 

కాదు వెళ్ళింది 'కోరమాండల్' అన్నాడు అప్పుడే పుట్టిన పిల్లాడు 

అలా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు పిల్లాడు పుట్టగానే 'కేర్ మనకుండా కోరమాండల్' అన్నాడు. 

ఓహ్ అర్థమైంది నీ సోది చాలు కడుపు నిండా తిన్నాను , కాసేపు కునుకు తీస్తాను అంటారా అల్లాగే కానీండి. లేచాక మిగతా వాళ్ళను పరిచయం చేస్తాను.

P.S: శీను భయ్యా, నీ అనుమతి లేకుండా నీ గురించి రాసినందుకు క్షమాపణలు. చదువులు అయ్యాక ఎవరి బతుకుల్లో వాళ్ళు పడి మనం ఎక్కువగా కలవడం కుదరకపోయుండచ్చు కానీ ఇప్పటికి ఆ అభిమానం గుండెల్లో గూడు కట్టుకొనే ఉంది..మరీ సినిమాటిక్ గా ఉందంటావా డైలాగ్? :)

హౌరా, కోరమాండల్ జోక్ ఒకసారి మాటల మధ్యలో నువ్వు చేప్పిందే, దానికి నేను నా స్టయిల్ అఫ్ ట్రీట్ మెంట్ ఇచ్చాను. ఓహ్ అర్థమైంది నీ మొహానికో స్టైల్, దానికో ట్రీట్మెంట్ కూడానా అంటావా? అయితే ఇంతటితో ఆపేస్తాను. 


17, ఏప్రిల్ 2017, సోమవారం

బానిస వీరుడు - లోహ మార్పుడు

నేనోదో నా పాటికి లాప్టాప్ లో 'నా ఒరు సిరిక్కి సంసారిక్కినుం' అనే ఒక అద్భుతమైన రొమాంటిక్ కంగాళీ మళయాళ సినిమా చూసేసి  'బానిస వీరుడు' అనే  తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా చూద్దామనుకుంటుంటే 'ఉన్నావా పోయావా' అన్న మాట వినపడింది.

ఎవరా అని చుట్టూ చూస్తే ఎవరూ కనపడలేదు

నేనోయ్ నీ బ్లాగ్ ని ..మంకీ కి మొబైల్ దొరికినట్లు నేను నీకు దొరికి చచ్చాను. నువ్వేమిటి ఈ మధ్య మరీ నల్ల పూస అయిపోయావ్, ఇటు వైపే రావట్లేదు అంది 

వెన్నపూసలా తెల్లగా ఉండేవాడిని ఎండలు కదా నల్ల పూస అయ్యుంటాను. 

నీ చెత్త వెటకారం ఏడ్చినట్లే  ఉంది కానీ నీ పాటికి నువ్వు నన్ను ఓపెన్ చేసి వారాల తరబడి అలా ముట్టుకోకుండా వదిలేస్తే ఎలా..ఎదో ఒక పోస్ట్ రాయొచ్చుగా. 

కాస్త పనుల్లో బిజీ గా ఉండి సమయం లేక.  

సమయం లేకా? విషయం లేకా?

విషయాలకేం ఇంకో 20 పోస్ట్స్ రాయడానికి సరిపడా కంటెంట్ ఉంది నా దగ్గర.  పోస్ట్ రాయాలనుకుంటే ఇప్పటికిప్పుడు ఒక గంటలో రాసి పోస్ట్ చేసేయగలను అది నా సత్తా. 

నీలాగే పూరి జగన్నాథ్ కూడా 20 సినిమాలకు కావాల్సిన కథలు నా దగ్గరున్నాయ్, తలచుకుంటే రెండు నెలలకో సినిమా తీసే సత్తా ఉందంటూ బీరాలు పలికి 'రోగ్' లాంటి చెత్త తీసాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు వాళ్ళ గురువు వర్మ గారు కూడా నిన్న మొన్నటి వరకు లెక్కలేనన్ని చెత్త సినిమాలు తీసేసి మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లిపోయారు. అది సరే గానీ సినిమా అంటే గుర్తొచ్చింది తప్పని సరి తద్దినానికి వెళ్ళొచ్చావా లేదా?

ఏది కాటమ రాయుడు సినిమా గురించేనా? వెళ్లాను. 

మరి కనీసం ఆ రివ్యూ రాసి పోస్ట్ చేయొచ్చుగా

చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకు అని వదిలేశా .. అదీ గాక సినిమా రిలీజ్ అయిన వారం దాకా రివ్యూ రాయకపోతే మంచిది, సినిమాలు లాభపడతాయ్ అని రజినీ కాంత్ గారు అన్నారుగా ఆయన మాటకు విలువ ఇద్దామని. 

అబ్బో నీకూ, నాకు అంత సీన్ ఎక్కడ ఏడ్చి చచ్చిందిలే గానీ కనీసం పది మందికి పనికొచ్చే విషయం గురించైనా రాయొచ్చుగా..ఎప్పుడూ పనికి మాలిన విషయాలు తప్ప పనికొచ్చే విషయం ఒక్కటైనా రాశావా?

ఎందుకు రాయలేదు..గొంగళి పురుగు సీతాకోకచిలుక గా పరివర్తనం చెందినట్లు పవన్ అనబడే నేను చిరంజీవి అభిమానిగా ఎలా మారానో యెంత inspiring గా రాసానో గుర్తు లేదా?

అవి కాదు  ఉపయోగపడే విషయాలంటే. దేశం లో ఉండే పేదరికం eradicate చేయడమెలా? బర్నింగ్ ఇష్యూష్ మీద ప్రజలను educate చేయడమెలా అన్నవి పనికొచ్చే విషయాలంటే. అదెలాగూ నీకు చేతకాదు కానీ కనీసం చూసిన ఒక ప్రదేశం గురించైనా, చదివిన ఒక మంచి పుస్తకం గురించైనా నలుగురికీ తెలిసేలా రాయొచ్చుగా. 

రాద్దామనే అనుకుంటున్నాను అందుకే కెమిస్ట్రీ పుస్తకాలన్నీ ఎక్కడ దొరుకుతాయో అని గూగుల్ లో ఎంక్వయిరీ చేస్తున్నా. 

కాస్తో కూస్తో బుర్ర షార్ప్ గా ఉండే స్కూలు, కాలేజీ టైం లోనే ఆ కెమిస్ట్రీ అర్థం కాక చదవలేదు.లోకేష్ బుర్రతో తో పోటీ పడటానికి రెడీగా ఉంది నీ బుర్ర, ఇప్పుడెందుకు  దాన్ని కష్టపెట్టాలనుకుంటున్నావ్?

మొన్నొకసారి 'ఏమిటి పవనయ్యా దీర్ఘ0గా ఆలోచిస్తున్నావ్' అని నా  friend సుబ్బు అడిగితే 'యేమీలేదు  జీవితం లో ఏది సాధించలేక పోతున్నాను అందుకే గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది' అంటే ఇందులో ఆలోచించడానికేముంది  'ఆల్ కెమిస్ట్రీ ' చదువు నీ గిల్టీ ఫీలింగ్ పోతుంది అని చెప్పాడు. అందుకే  కెమిస్ట్రీ పుస్తకాల కోసం ఈ వెదుకులాట. 

తెలివి తెల్లారినట్లే ఉంది అది 'ఆల్ కెమిస్ట్రీ ' అయుండదు.

'నాలాగ డబ్బింగ్ జోలికి పోకుండా అన్ని భాషల్లోని జీవిత సత్యాలన్నీ రుబ్బింగ్ మిషన్ లో రుబ్బేసి మరీ తాగి శుభ్రంగా జీర్ణించుకున్న మా చార్మింగ్ చబ్బీ సుబ్బు చెప్పిన దాంట్లో తిరుగులేదు'.  (రుబ్బింగ్ మిషన్ - గ్రైండర్ కు తెలుగు అనువాదం.. ప్రాస కోసం ప్రయాస..మన్నించాలి)

అయితే అది 'ఆల్ కెమిస్ట్రీ ' అయుండదు alchemist అయుంటుంది తాను సరిగ్గానే చెప్పి ఉంటాడు నీకలా అర్థం అయుంటుంది. ఖర్మ! అందుకే అన్నాను నేను నీ చేతిలో పడటం కోతికి కొబ్బరి కాయ దొరికినట్లే అని . డిక్షనరీ చేతిలో ఉంటే తప్ప ఇంగ్లీష్ అర్థమయి చావదు నీకు, అలాంటిది ఆ ఇంగ్లీష్ బుక్ చదవడం అవసరమా?

సరేలే అయితే 'లోహ మార్పుడు' దొరుకుతుందేమో ప్రయత్నిస్తా 

మళ్ళీ ఈ అర్థం కాని 'లోహ మార్పుడు' ప్రయత్నమేమిటి  విక్రమూర్ఖ మహాశయా!

alchemist ఇంగ్లీష్ బుక్ కి తెలుగు డబ్బింగ్ 'లోహ మార్పుడు' పేరు తోనే చేసి ఉంటారు కదా అందుకు. 

తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమాలు చూసిన తెలివి ఎక్కడికి పోతుంది ... 'పరుసవేది' అని వెదికి చావు అదే తెలుగు అనువాదం ఆ పుస్తకానికి. అలాగే 'సందులో సుందరి -గొందులో బందరి', 'రహస్య వీరుడు- అసహ్య శూరుడు' లాంటి డబ్బింగ్ సినిమాలు చూడటం మానెయ్. అవే కాదు ఆ కాటమ రాయుడు లాంటి సినిమాలు avoid చెయ్యి, దానికి తోడు ఆ 'మిస్టర్' సినిమా కూడా చూసినట్లున్నావ్ పూర్తిగా మతి గతి తప్పినట్లుంది . అయినా ఆ మెగా ఫామిలీ కి నువ్వేమైనా కట్టప్పవా?తరతరాలకు  అభిమాన బానిసత్వం చేస్తున్నావ్? చిరంజీవి అంటే అభిమానం అన్నావ్ బాగుంది.  తమ్ముడు, కొడుకు, మేనల్లుడు అంటూ వచ్చే వారినందరిని అభిమానించడమేమిటి? రేపు చిరంజీవి మనవడు హీరో గా వచ్చినా అభిమానిని అంటూ వాళ్ళను తలకెక్కించుకుంటావ్ కట్టప్పలా. దీనికి అంతు పొంతు లేదా?

దాని గురించి చెప్పాలంటే ఇంకో పోస్ట్ అవుతుంది ...అయినా నేనిప్పుడు 'బానిస వీరుడు' అనే సినిమా చూడాలి ఇంకోసారి రాపో తీరిగ్గా మాట్లాడుకుందాం.

చూడు ఇంత చెప్పినా మళ్ళీ ఇంకో డబ్బింగ్ సినిమా చూస్తా అంటున్నావ్.  అలా డబ్బింగ్ సినిమాలు చూస్తే అందులోని ఒరిజినాలిటీ మిస్ అవుతావ్. అది సరే నీకు తెలుగే సరిగ్గా వచ్చి చావదు, ఆ మలయాళం ఎలా అర్థమవుతుంది డబ్బింగ్ కాకుండా ఒరిజినల్ చూస్తున్నావ్?

భావం అర్థమవ్వాలంటే లాంగ్వేజ్ ముఖ్యం కానీ జింరిజ్ఝయ్ అర్థం కావడానికి భాష ముఖ్యం కాదు. నీకు చెప్పినా అర్థం కాదు నన్ను విసిగించకుండా వెళ్ళిపో అన్నాను. 

ఈ పోస్ట్ చదువుతున్న వారిలో ఎవరైనా 'నా ఒరు సిరిక్కి సంసారిక్కినుం' అనే రొమాంటిక్ కంగాళీ మళయాళ సినిమా కోసం అలాగే 'జింరిజ్ఝయ్' అర్థం కోసం ఈ పాటికి ఎవరైనా గూగుల్ ను ఆశ్రయించి వుంటే  నాకు, అలాగే భజన బృందాలతో భావి ముఖ్య మంత్రి గా కీర్తింపబడుతున్న చినబాబు లోకేష్ కు మధ్య తెలివితేటల విషయంలో 'అక్టోబర్ 2 వ తేదీ గాంధీ వర్ధంతి' రోజున జరగబోయే పోటీలో మీరు కూడా పాల్గొనచ్చు. 

మొన్న రాత్రి, నా మిత్రుడు కాలేజీ రోజుల్లో రూమ్మేట్ అయిన సుబ్బు తో మాట్లాడుతున్నప్పుడు alchemist అనే పుస్తక ప్రస్తావన వచ్చింది. ఆ పాయింట్ ను బేస్ చేసుకొని అతిశయోక్తులు,సెటైరులు ,సెట్యూబులు అనబడే మసాలా లాంటివి పూసి, కాసిన్ని సమకాలీన విషయాల్లాంటి పోపు గింజలు జత చేసి తాలింపు వేసి ఒక పోస్ట్ రాయగలనా అని నాకు నేను ఒక చిన్న టెస్ట్ లాంటిది పెట్టుకొని రాసిన పోస్ట్ ఇది. మీకు నచ్చినట్లైతే సంతోషం లేదంటే మీ టైం వేస్ట్ చేసినందుకు క్షమాపణలు. 

23, మార్చి 2017, గురువారం

నేను లోకల్ కాదు కాదు నేను సోంబేరి

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్క మొరిగినట్లు ఎప్పుడో విడుదల అయిన ఆ సినిమా గురించి ఇప్పుడెందుకు అంటారా గత వారమే చూసా మరి  అందుకే ఇప్పుడీ సోది. 

ఇందులో నాని పేరు 'బాబు', ఫిక్స్డ్ అయిపోండి ఇక పైన నేను కూడా 'బాబు' నే అని హింట్ ఇచ్చేశాడు. సినిమా నాలెడ్జి ఉన్న వాళ్లకు ఈ బాబు అనే పదం గురించి బాగా తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్పదలచుకోలేదు. 

ఈ సినిమాలో కూడా మం హీరోకి తెలుగు సినిమా హీరో లకు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ ఉంటాయి, అంటే ఇంట్లో అమ్మ సంపాదిస్తుంటే బలాదూర్ గా తిరగడం, పరీక్షలు తప్పడం, సిగరెట్లు తాగడం లాంటి వన్నమాట. జీవితంలో  గోల్ లాంటి గోలలేవీ లేకుండా కాపీ కొట్టి మరీ ఇంజనీరింగ్ అయిందనిపించి ఒక అమ్మాయిని కూడా ప్రేమించేస్తాడు.  

ఈ రసం పిండేసిన చెరుకు పిప్పి లాంటి సినిమా కథలు ఇప్పటికే బొచ్చెడు వచ్చాయి అందులో మచ్చుకు 'నువ్వే నువ్వే', 'ఇడియట్' లాంటివి చూసే ఉంటారు కాబట్టి కథ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత సీసా లో కొత్త సారా అన్నట్లు తరుణ్, రవితేజ బదులు నాని సరి కొత్తగా మెస్మరైస్ చేస్తాడు అంతే తేడా. నాని,శర్వానంద్ లాంటి హీరో ల సినిమాలంటే కాస్త ఇంట్రస్ట్ ఉంది, కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తారని. ఇకపై నాని ఇలాంటి సినిమాలు చేస్తూ పొతే తప్పక టాప్ హీరో అవ్వచ్చు కానీ మంచి నటుడు అనే విషయం మరుగున పడిపోవచ్చు. తప్పదు మరి పెద్ద హీరో అవ్వాలంటే ఇలాంటి మాస్ సినిమాలు చెయ్యాల్సిందే అని నాని డిసైడ్ అయినట్లున్నాడు.


ఈ సినిమాలో డబ్బు, ఉద్యోగం గురించి మాటలు వచ్చినప్పుడలా సోంబేరి ఫిలాసఫీలు వల్లిస్తుంటాడు నాని, కాబట్టి 'నేను లోకల్' అనే కన్నా 'నేను సోంబేరి' అనే టైటిల్ అయితే అప్ట్ అని నా ఉద్దేశ్యం అదే నా ఈ పోస్ట్ టైటిల్ కి జస్టిఫికేషన్ కూడాను. 

కాకపొతే అందరికీ ఈ సినిమా నచ్చినట్లు ఉంది అందుకే అంత పెద్ద హిట్ అయినట్లుంది నేనొక్కడ్నే ఉలిపి కట్టెలాగా మిగిలిపోయాను. జనరేషన్ గ్యాప్ అనుకుంటా అందుకే నచ్చలేదేమో మరి. 

నేను ఆఫీస్ కి వచ్చే ముందు 'ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఏదో ఒక బామ్ తీసుకురండి' మా ఆవిడ కేక . 

అమృతాంజన్ బామా , జుండు బామా?

'ఏది దొరికితే అది, ఏ బామ్ అయితేనేం నాకు తలకు,  మీకు అరికాలుకు రుద్దుకోవడానికి? అసలే పోయిన వారం చూసిన సినిమా దెబ్బకు ఇంట్లో ఉన్న బామ్ అయిపొయింది. ఆదివారం అవసరం పడొచ్చు' అంది. 

ఔనవును నిజమే అన్నాను నేను. 

'వేడి పాలు తాగి మూతి కాల్చుకున్న పిల్లి మజ్జిగను కూడా ఊదుకుని తాగుతుందట' మరి మనం మనుషులు ఆ పాటి జ్ఞానం లేకపోతే ఎలా? అసలే ఆదివారం 'కాటమరాయుడు' సినిమా చూడ్డానికి వెళ్తున్నాం ఇంతకు ముందు సర్దార్ గబ్బర్ సింగ్ తో దెబ్బ తిని ఉన్నాము మరి ఆ పాటి ముందు జాగ్రత్త ఉండద్దూ?16, మార్చి 2017, గురువారం

గత రెండు నెలల కబుర్లు

గత రెండు నెలలలో మా పాప స్కూల్ లో జాయిన్ అవడం అలాగే నేను ఉద్యోగ రీత్యా కంపనీ మారడం లాంటి వాటి వలన బ్లాగింగ్ కేమిటి అసలు ఇంటెర్నెట్ కే దూరమయ్యాను. ఏదో మెయిల్స్ లాంటి వాటికి తప్ప దేనికీ నెట్  ఉపయోగించే సమయం చిక్కలేదు. ఇకపైన పోస్టుల రాశి తగ్గచ్చేమో కానీ వాసి తగ్గకుండా చూసుకుంటానని హామీ ఇస్తూ ఈ పోస్ట్ తో మీ ముందుకు వచ్చాను. 
తొలి రోజు కదా గుర్తుగా ఉంటుందని మా పాప స్కూల్ లో జాయిన్ అయినప్పుడు ఒక ఫొటో తీసుకున్నాను.  స్కూల్ లో యెలాగూ చదువంతా ఇంగ్లిష్ లోనే కాబట్టి అదనంగా ఇంకో భాష నేర్పిస్తారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఆప్సెన్స్ మాత్రం నచ్చలేదు. ఏ రాయి అయితేనేం  పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్లు అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి పోస్ట్ కు పన్నీర్ సెల్వమ్, శశికళా, పళని స్వామి లాంటి ముగ్గురి పేర్లు బయటికి వచ్చినట్లు ఇక్కడ స్కూల్ లో చైనీస్, కొరియన్, తమిళ్ అంటూ మూడు పనికిమాలిన ఆప్సెన్స్ ఇచ్చారు. నేను ఆ మూడు భాషలను తక్కువ చేయడం లేదు కాని మా పాపకు భవిష్యత్తు లో బొత్తిగా వాటి అవసరం పడకపోవచ్చేమే అని నా అంచనా.

మొన్నా మధ్య ఇల్లంతా వెదికినా రిమోట్ కనపడలేదు. మా బుడ్డోడికి మా చెడ్డ అలవాటు ఉంది...వాడికి తిక్క రేగినపుడు అది అరటి తొక్కైనాచెక్కయినాపనికొచ్చే ముక్కైనా వాడికి లెక్కుండదు దాన్ని సరా సరి డస్ట్ బిన్ లో పారేస్తాడు.  రెండు రోజులైనా రిమోట్ దొరక్కపోయేసరికి దాన్ని కూడా అలా డస్ట్ బిన్లో పడేసి ఉండచ్చుకనుక అది దొరికే ఛాన్స్ లేదని కొత్త టీవీ కొన్నాము .. మీ వాడి తిక్క సరే మీకు లెక్క అంటే లెక్క లేనట్లుందేరిమోట్ పోయిందని కొత్త టీవీ కొన్నారా లెక్క మీకు అంత ఎక్కువుందా అని ఆశ్చర్య పోకండి. (మా వూర్లో డబ్బును లెక్క అని కూడా అంటారు) మేము వాడుతున్నది బాగా పాత మోడల్ టీవీ అందుకే కొత్తది కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాముకాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు మా బుడ్డోడి మూలాన ఇప్పుడు కొత్త టీవీ కొన్నాము.

పోయిన నెల ఒక పార్టీ లో పది మంది మిత్రులు కలిసినప్పుడు  'నేను లోకల్ సినిమా నుంచి  ట్రంప్ అజెండా అయిన 'ప్రిఫెరెన్స్ టు లోకల్స్'  టాపిక్  పైకి చర్చ మళ్లింది. లోకల్స్ కు ప్రిఫెరెన్సు ఇవ్వాలన్న ట్రంప్ డెసిషన్ కు ఫిదా అయిపోయిన ఇక్కడి లోకల్స్, ఆస్ట్రేలియా లో కూడా ట్రంప్ పెడుతున్న రూల్స్ లాంటివి పెట్టాలని డిమాండ్స్ మొదలెట్టారట. మాటల్లో ఒక మిత్రుడు ఆస్ట్రేలియా ప్రైమ్ మిసిస్టర్ ఎవరో చెప్పమని అడిగితే, గత మూడు నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్న పది మందిలో ముగ్గురంటే ముగ్గురే సరైన జవాబివ్వగలిగారు. అది ఆస్ట్రేలియాకు అమెరికాకు తేడా, ప్రపంచం కళ్ళు, చెవులు అన్నీ అమెరికా వైపే ఉంటాయి అనడానికి ఇదే సాక్ష్యం. 

"ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదంటారు" కదా...అందులో రెండవ భాగం నాకిప్పుడు అవగతమవడమే కాకుండా అనుభవంలోకి కూడా వచ్చింది. గత రెండు నెలల్లో ఎండలు బాగా మండిపోతుంటేనూ గుండు చేయించుకోవాలనుకున్నాను కానీ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ని అలాగే ప్రపంచ బద్దకస్తుల సంఘానికి అధ్యక్షత వహించగలిగే అవకాశాన్ని బద్ధకం చేత తృణప్రాయంగా త్యజించిన చరిత్ర కలిగిన వాడిని కావడం వల్ల గుండు చేయించుకునేప్పటికి ఎండలు పోయి భారీ వర్షాలు మొదలయ్యాయి, ఏమైనప్పటికి గుండు కదా యెంత వర్షమైనా తడుస్తుందన్న భయం లేదు, గుండు చేయించుకోవడం కాస్త లేట్ అయినా ఇదొకందుకు మంచిదైంది. ఈ భారీ వర్షాలు చూసి నాలుగేళ్ళ మా పాప 'ఇంతకు ముందు నేనెప్పుడూ ఇంత వర్షాలు చూడలేదబ్బా' అని తన ఫ్రెండ్ తో చెప్తోంటే 'నాలుగు వారాల నాడు పుట్టిన నక్క ఇంత పెద్ద గాలి వాన నా జీవితంలో యెన్నడూ చూడలేదు'   అన్న సామెత గుర్తొచ్చి నవ్వుకున్నా. 

గుండు విషయం ఇంట్లో మా ఆవిడకి తెలిస్తే ఆ ఇచ్చే జుత్తేదో దేవుడికి ఇస్తే పుణ్యం వస్తుందని అంటుందని తెలిసి తనకి చెప్పకుండా గుండు చేయించుకొని ఇంటికి వచ్చాను. కాసేపటికి నిద్ర లేచిన మా బుడ్డోడు గుండుతో ఉన్న నన్ను ఎగా దిగా చూసి వెంటనే వాడి తల మీద చెయ్యి పెట్టుకుని, నిద్రపోతున్నపుడు నాకూ గుండు చేయించలేదు కదా ఈ మనిషి అని చెక్ చేసుకున్నాడు. 

నేను సాధారణంగా చాలా విషయాలు గుర్తుపెట్టుకోను అందుకే నన్ను గజిని అంటుంటారు నా మిత్ర బృందం.  నువ్వో  గజినీవి, గుండొక్కటి తక్కువ అనే వారు ఇంతకు ముందు.  ఇప్పుడు ఆ ముచ్చట తీరిపోయి గుండు గజినీని అయిపోయా. 

గత నెల నా మిత్రుడొకడు  ఫొన్ చేసి...అలాగే జరిగింది కదూ అన్నాడు తలా తోక లేకుండా

ఏం జరిగింది ఎలా జరిగింది అన్నాను సరిగ్గా అర్థం కాక

జనవరి మొదటి వారం లో నేను నీకు ఈ సంవత్సరానికి గాను రాశి పలితాలు పంపాను గుర్తుందా..

అవును అయితే అన్నాను

అందులో ఉద్యోగ మార్పు ఉంటుంది అని రాశారు కదా అది నిజమైంది చూశావా అన్నాడు

వెనకటికి నీలాంటి వాడు ఒకడు శవాన్ని చూడటానికి వెళ్ళి 'నేనెప్పుడో చెప్పాను వీడు ఏదో ఒక రొజు చస్తాడని అన్నాడట' ఆలా ఉంది నీ వాలకం అన్నాను.

అయినా నేను చేసేది ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగమా మారకుండా ఉండటానికి, IT జాబ్ అన్నాక అప్పుడప్పుడు కంపెనీ మారడమన్నది అతి సాధారణమైన విషయం. 

మా వాడు వాట్స్ అప్ లో పంపిన రాశి  ఫలాలు ఇవే ఓపికుంటే చదవండి.
  

సింహం (జూలై 24–ఆగస్టు 23)

సగర్వంగా, కొండొకచో అహంకారంగా అనిపిస్తున్నా, నమ్మకంగా, ధైర్యంగా ముందుకు సాగడం సింహ రాశి వారి లక్షణం. సౌహార్దంగా ఉంటారు. ఇతరుల పట్ల దయతో, మంచి ఉత్సాహంగా ముందుకు సాగుతుంటారు. ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, ప్రయాణాలు, లాటరీలు కొనడం జరుగుతాయి అంతేగాక అవన్నీ మీకు ఈసారి కలిసొస్తాయి. మీ ఆశయాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఇతరులను ఎవరినీ మీ మార్గంలోకి అడ్డుగా రానివ్వకండి. ఉద్యోగం, పని విషయంలో ఏడాది మీకు ఎక్కడ లేని శక్తి, ఉత్సాహం ఉంటాయి. కొత్త ఏడాది ఆరంభంలో మీరు పట్టిందల్లా బంగారమేమీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాని మీద దృష్టి పెట్టండి. మీ ప్రేమ విషయంలో మీ మనసులోని మాటను నిజాయతీగా చెప్పేయడం మంచిది. సింహరాశి వారికి తగిన వ్యక్తులు దొరుకుతారు. ఇంట్లో దక్షిణ మూలలో  రెండు ఎర్ర కొవ్వత్తులు వెలిగించండి. దాంతో, మీకు మరింత ప్రేమ, ప్రణయం లభిస్తాయి.

కలిసొచ్చేవి: అదృష్ట సంఖ్య: 4; రంగు: అగ్ని జ్వాల లాంటి కమలాపండు రంగువారం: ఆదివారం