27, అక్టోబర్ 2019, ఆదివారం

సైరా లాస్ వెంచర్ అయిందా?

సైరా సినిమా నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలకు నా పైత్యం కొంత కలిపి పులిహోర వండాను, నచ్చితే ఎంజాయ్ చెయ్యండి లేక పులుపు ఎక్కువైపోయి ఉంటే మన్నించండి. 

కొందరేమో సైరా క్యారెక్టర్ లో మా బాలయ్య అయితే బాగుండేవాడు.   రాజసం అంటే బాలయ్యదే, గౌతమీ పుత్ర శాతకర్ణి లో అదరగొట్టాడు. అంతేకాదు చిరంజీవి డైలాగులు బాగా చెప్పలేదు, వాయిస్ బాగా దెబ్బ తిన్నట్లుంది మా బాలయ్య నోట్లోంచి వచ్చి ఉంటే బాగుండేది అన్నారు. 

మొన్నొక సారి బాబూమోహన్ 'గుర్రం మీద స్వారీ చేయడం అంటే అది బాలయ్య బాబే చెయ్యాలి చిరంజీవి గిరంజీవి బలాదూర్' అన్నాడట భైరవద్వీపం సినిమాలో బాలయ్యతో పని చేసిన అనుభవాలు పంచుకుంటూ ఒక ఇంటర్వ్యూ లో.  మరి బాబూమోహన్ సైరా సినిమాలో చిరంజీవి గుర్రం మీద స్వారీ చేయడం చూశాడో లేదో, కానీ చిరంజీవి ఫాన్స్ మాత్రం కొదమ సింహం సినిమాలో చిరంజీవి స్టైలిష్ గా గుర్రం మీద స్వారీ చేసిన వీడియోలు బాబూ మోహన్ గారికి షేర్ చేస్తున్నారట.

రామాయణం లో పిడకల వేటలా సైరా గురించి మాట్లాడుతూ ఎటో వెళ్ళిపోయా.

మళ్ళీ సైరా విషయానికి వస్తే ఇంకొందరేమో స్క్రీన్ నిండా చిరంజీవే కనపడుతున్నాడు, అంత లావుగా ఉండే వ్యక్తిని హీరో గా accept చెయ్యలేం అంటున్నారు. మన తెలుగులోనే కొందరు అలా ఫీల్ అవుతున్నారంటే ఇక మిగతా భాషల వాళ్ళు ఎలా ఫీలవ్వాలి? అందుకే ఒక్క తెలుగులో తప్ప మిగతా భాషల్లో సినిమా బోర్ల పడినట్లుంది. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఈ వయసులో ఆయన మనకు హీరో గానీ పక్క భాషల వారికి కాదు కదా.  అందుకే సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే కాస్తో కూస్తో కర్ణాటక నుంచి రావాలి కాబట్టి ఇది లాస్ వెంచర్ కిందే లెక్క.  

చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు ఆల్మోస్ట్ కల్లెక్షన్స్ డ్రాప్ అయిన సినిమాకి ఏంతో కొంత కలెక్షన్స్ వస్తే చాలని, సినిమాని నిలబెట్టడానికి ఎక్కే గడప దిగే గడప అన్నట్లు అందరి ఇళ్ల చుట్టూ తిరిగాడు తిరుగుతూనే ఉన్నాడు చిరంజీవి. 

మొన్నటికి మొన్న చిరంజీవి గారి కోడలు పిల్ల మోడీ ని నిలదీసింది మీకు ఈ  దేశంలో సినిమా నటులంటే ఉత్తరేది వారేనా, ఇక్కడి వాళ్ళు మీ కంటికి కనిపించలేదా అని. చిరంజీవి గారు మాత్రం అలాంటి మొహమాటాలు ఏమీ పెట్టుకోకుండా నా సినిమా చూడండి మొర్రో అని మోడీ గారికి  మొర పెట్టుకోబోతున్నాడట పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్దే అన్నట్లు.  అలాగే మొన్న ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా కలిసాడు ఈ విషయమై. ఈ తిప్పలేవో సినిమా రిలీజ్ అవ్వకముందే చేసి ఉంటే ఇంకాస్త కలెక్షన్స్ పెరిగేవేమో. అయినా ఊపిరి పట్టినంత మాత్రాన బొజ్జ నిండుతుందా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చూసినంత మాత్రానా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నిండిపోతుందా? ఏమిటో మా చిరంజీవి చాదస్తం, అసలే ఈతాకు యవ్వారం ఆయనది, తన డబ్బులు పోతే ఎట్టా? అందుకే ఆయన పాట్లు యేవో ఆయన పడుతున్నారు. 

సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ పడేప్పుడు చాలా మంది స్వాతంత్ర సమరయోధులను చూపించారట కానీ అల్లూరి సీతా రామరాజుని చూపించలేదు అని గగ్గోలు పెడుతున్నారు.

సర్లే ఎప్పుడో స్వర్గస్తులైన అల్లూరిని చూపించకపోయినా పర్లేదు మొన్నీ మధ్యే మరణించిన మా రాజన్న వీళ్ళ కంటికి అనలేదా అని కొందరు, ఇప్పటికీ కళ్ళ ముందు తిరుగుతున్న మా చంద్రన్న ఫోటో ఎందుకు చూపించలేదు అని మరికొందరు  వాళ్ళ వాళ్ళ అక్రోశం వెళ్ళగక్కారు అది వేరే విషయం.  

P.S: 'ఈతాకు యవ్వారం' అనే పద ప్రయోగం మా అమ్మ అప్పుడప్పుడూ వాడుతూ ఉండేది. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగితే చెప్పింది. గాలి వీచినప్పుడో లేదంటే ఆకులు రాలే కాలంలోనో ఏ చెట్టు ఆకులైనా రాలుతూ ఉంటాయి, కానీ ఈతాకు చెట్టుకు మాత్రం ఎప్పుడూ రాలవు. తన డబ్బు ఒక్క రూపాయి కూడా రాలకుండా చూసుకునే వాడిని 'ఈతాకు యవ్వారం' తో పోలుస్తారు అంది. 

22, అక్టోబర్ 2019, మంగళవారం

ఒక్కోసారి పిచ్చి ఊహ కూడా మీకు మేలు చెయ్యొచ్చు - ఏర్చి కూర్చిన కథలు

"పెంపుడు రాళ్ళు" అన్న మాట ఎప్పుడైనా విన్నారా?

ఏంటి మమ్మల్ని పిచ్చోళ్లనుకున్నావా? నువ్వు రాసే ప్రతీ చెత్త మేము చదవడానికి అని నా పోస్ట్ క్లోజ్ చేయాలని మీరు అనుకుంటే పప్పులో కాలు, ఉప్పులో చెప్పు వేసినట్లే.

"పెంపుడు రాళ్ళు" అనే మాట పిచ్చిగా అనిపిస్తుంది కానీ ఆ పిచ్చి ఊహే నాలుగు రాళ్ళు వెనకేసుకునేలా చేసింది ఒక వ్యక్తి విషయంలో.

అప్పుడెప్పుడో 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో గాలి బొక్కల చొక్కా, తుపుకు తుపుకు డిజైన్ షర్ట్ అని అమ్మితే జనాలందరూ ఎగబడి కొన్నట్లు చూపిస్తే సినిమా కాబట్టి అలా చూపిస్తారు నిజ జీవితం లో అలాంటి జనాలు ఎవరుంటారు అని అనుకునే వాళ్ళము కదా! కానీ నిజ జీవితం లో అంతకంటే క్రేజీ పీపుల్ ఉంటారని మీరు ఈ పోస్ట్ చదివిన తర్వాత అనుకుంటారు. 

ఇక నాన్చుడు లేకుండా డైరెక్ట్ గా విషయానికి వస్తాను.

గారీ రోస్ దాల్ ..వద్దులే అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇప్పుడు నేను మార్చడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ లోనే చెప్తాను Gary Ross Dahl అనే పేరున్న ఇతన్ని మనం Gary అని పిలుచుకుందాం క్లుప్తంగా.

1975 టైములో ఈ Gary అనే వ్యక్తి అమెరికా లో "ఫ్రీలాన్స్ కాపీ రైటర్" అనబడే ఉండీ లేని జాబ్ ఏదో వెలగబెడుతున్న రోజులవి. బార్లో కూర్చొని బీర్ తాగుతూ ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్, తను ఊరెళ్ళినప్పుడు తన పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి యెంత కష్టపడ్డదీ, యెంత ఖర్చుపెట్టిందీ తలచుకొని బావురుమన్నాడు. ఇక మిగతా వారు కూడా ఈ పెంపుడు జంతువుల విషయం లో తాము ఊర్లో లేనప్పుడు వాటి సంరక్షణ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టారు. అసలే డబ్బులు లేక కరువు లో అల్లాడుతున్న మన Gary కి ఈ సమస్య ఏదో బంగారు బాతులా అనిపించి "పెంపుడు రాళ్ళు" అనే ఐడియా వచ్చేలా చేసింది.

అట్టపెట్టెలలో కాస్త మందంగా ఎండు గడ్డి పేర్చి అట్టపెట్టె సైడ్ లో కాస్త పెద్ద సైజు రంధ్రాలు చేసి లోపల Rosarito అనే బీచ్ దగ్గర దొరికే నున్నటి ఓవల్ షేప్ లో ఉన్న రాళ్ళను ఉంచి ఆ అట్టపెట్టె మీద 'Pet Rock' అని ముద్రించి ఒక్కొక్కటి నాలుగు డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. ఈ రాయితో పాటు దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు చెబుతూ ఒక instruction బుక్ కూడా పెట్టాడు. కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మకాల్లో ఈ instruction బుక్ కీ లాగా పనిచేసింది. ఈ బుక్ లో ఆ పెంపుడు రాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పే జాగ్రత్తలు బాగా హాస్యాన్ని తెప్పించాయట. 'వీటికి బద్ధకం ఎక్కువ, కూర్చున్న చోటి నుంచి కదలవు. మీరే బయటికి తీసుకెళ్ళాలి.  అలాగని చెప్పి స్విమ్మింగ్ కి మాత్రం తీసుకెళ్ళద్దు వాటికి ఈత రాదు మునిగిపోతాయి' అంటూ హాస్యాన్ని కురిపించాయట.

మొత్తానికి అలా ఈ రాళ్ళ వ్యాపారం 1975 మధ్యలో మొదలైంది. అలా మొదలైన వ్యాపారం ప్రజల్లోకి వెళ్ళడానికి బాగా ఫేమస్ అయిన 'టు నైట్ షో' అనే పాపులర్ అమెరికన్ టీవీ షో లో పాల్గొనడం, పేపర్లో పబ్లిసిటీ ఇవ్వడం వీటికి తోడూ 'నేను నా పెట్ రాక్ తో ప్రేమలో ఉన్నాను'  అనే ఒక సాంగ్ ని కూడా షూట్ చేయించి రిలీజ్ చేయడం చేశాడు.


అతని ప్రయత్నాలు వృథా కాలేదు. అమెరికాలో ఆ సంవత్సరం క్రిస్మస్ కి చలితో పాటు ఈ పెట్ రాక్స్ వ్యాపారం కూడా అమాంతం పెరిగింది. ఈ క్రేజీ ఐడియా 6 నెలలే పని చేసింది గానీ అప్పటికే అతను పది పదిహేను లక్షల రాళ్ళ దాకా అమ్మి సొమ్ము చేసుకున్నాడట.

ఇందులో మనకు అంత విచిత్రం ఏమీ కనపడకపోవచ్చు, ఎందుకంటే జాతి రత్నాలపేరు చెప్పి మన దేశంలో ఇప్పటికీ బోలెడన్ని రాళ్ళు అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 

ఆ పెంపుడు రాళ్ళ వ్యాపారం మూలపడ్డాక అలాంటివే ఇంకొన్ని పిచ్చి పిచ్చి వ్యాపారాలు మొదలెట్టాడు గానీ ఏవీ క్లిక్ అవలేకపోయాయి. ఏదైతేనేం మార్కెట్టింగ్ లో తన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 'Advertising For Dummies' అనే బుక్ కూడా రాశాడు ఇతను. 

ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి పిచ్చి ఐడియా ఉండి దాన్ని ప్రమోట్ చేసుకోగలిగితే "పెంపుడు రాళ్ళు" కాన్సెప్ట్ లాగా మీరూ నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు. 

18, అక్టోబర్ 2019, శుక్రవారం

పూరీ జగన్నాథ్, నీకో దండం సామీ!

ఒక్కో సారి మన టైం బాలేనప్పుడు, కోరి తలనొప్పి తెచ్చుకునే పనులు చేస్తుంటాం. అలాంటి ఒక బాడ్ టైం లో మొన్నొక రోజు 'ఇస్మార్ట్ శంకర్' అనబడే హిట్ సినిమా చూశా.  

ఇంట్రడక్షన్ సీన్ లోనే ఒక పది మంది పోలీసుల బొక్కలు ఇరగ్గొడుతూ మధ్య మధ్య లో తెచ్చి పెట్టుకున్న తెలంగాణా స్లాంగ్ తో మన చెవులకు తూట్లు పొడుస్తాడు ఇస్మార్ట్ శంకర్ అనబడే మన ఎనర్జిటిక్ హీరో రామ్

గిట్ల ఫైట్ అవ్వంగానే ఒక పాట షురూ, ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ మళ్ళీ తెచ్చి పెట్టుకున్న తెలంగాణా స్లాంగ్ తో ఈవిడ కూడా మన చెవులకు తూట్లు పొడుస్తూ. 

ఒక రెండు సీన్స్ అయిపోగానే నిన్ను రేప్ జేస్తా అంటూ హీరోయిన్ యెంట బడి ఆమె ఇంట్లోకి దూరి చండాలం చేస్తడు మన ఇస్మార్ట్ శంకర్. అప్పటికే హీరోయిన్ పరిగెత్తుతూ పోలీస్ లకి ఫోన్ చేస్తది ఎవడో నన్ను తరుముతోండు అని. ఇగ పోలీసులు వచ్చి హీరోయిన్ ఇంటి తలుపు కొట్టగానే  'ఇంగ మీకు ఈడ పని లేదు, ఈడు నాకు శానా నచ్చిండు, మీరు ఎల్లిపొండి' అంటది హీరోయిన్ గుంట. 

ఇంత అద్భుతమైన లవ్ స్టోరీ చూశాక పూరి జగన్నాధ్ క్రియేటివిటీ కి స్టన్ అవకుండా ఉండలేం మరి. ఇంగేమ్ జెయ్యలేం, ఈ జనరేషన్ ల లవ్ ఇంతే ఫాస్ట్ గ షురూ అవుతాది అని మనం అనుకోవాలె. 

ఇంగ ఆ తర్వాత రెండు మూడు గన్ ఫైర్స్ జరుగుతయ్ అందుల హీరోయిన్ ఛస్తది. హీరోని పోలీసులు జైలుకి పట్టుకెళ్తారు, నన్నెవరు జైలుకు పంపించిండ్రో ఆళ్లనొదల అని హీరోతో అనిపించి సినిమాకి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ కలరింగ్ ఇస్తాడు.  

మళ్ళీ రెండు మూడు గన్ ఫైర్స్, ఒక సిబిఐ ఆఫీసర్ జస్తడు , హీరో గాయపడ్తడు. ఇంగ ఇప్పుడు 'క్రిమినల్' అనే ఇంగ్లీష్ సినిమా నుంచి కొట్టుకొచ్చిన Face/off కాన్సెప్ట్ లాగా Brain/off  కాన్సెప్ట్ ఇందులో ఇరికించి సినిమాకి సైన్స్ ఫిక్షన్ లాంటి కలరింగ్ ఇస్తాడు. 

ఇక్కడ CBI డిపార్ట్మెంట్ హెడ్ అయిన షాయాజీ షిండే 'ఆడి బ్రెయిన్ తీసి ఈడికి పెట్టెయ్' అంటాడు రెండో హీరోయిన్ తో.  అదేదో వాడి హ్యాట్ తీసి వీడికి పెట్టు లేదంటే వాడి కిడ్నీ తీసి వీడికి పెట్టు అన్నంత సింపుల్ గా. (ఏ మాటకామాట చెప్పుకోవాలి నాకెందుకో ఈ షాయాజీ షిండే తెలుగులో చెప్పే డైలాగ్స్ వింటే తెలుగు మీద ఉండే ఆ కాస్త అభిమానం కూడా చచ్చిపోతుంది.)

ఇంక ఆ బ్రెయిన్ మార్చేశాక మనోడు అపరిచితుడు టైపులో అటూ ఇటూ మారిపోతుంటాడు కాసేపు ఇంగ్లీష్, కాసేపు తెలంగాణా లాంగ్వేజ్ మాట్లాడుతూ. (మీరు నన్నో వింత జీవిని చూసినట్లు చూస్తారని తెలుసు గానీ ఆ అపరిచితుడు సినిమా కూడా నాకు నచ్చలేదు అది వేరే విషయం) 

మళ్ళీ కొన్ని గన్ ఫైర్స్ జరిగాక అసలైన సస్పెన్స్ (అసలైన విలన్ ఎవరో సినిమా మొదట్లోనే మనకు తెలిసిపోతుంది అనుకోండి)   క్లైమాక్స్ లో బయట పెడతారు. ఆ తర్వాత ఒక భీభత్సమైన ఫైట్, అది అయిపోగానే శుభం కార్డు పడే ఉంటుంది అనుకుంటా. (T.V స్విచ్ ఆఫ్ చేశాను అప్పటికే ఓపిక నశించి) 

ఈ సినిమాలో ఏదో నచ్చే ఉంటుంది కాబట్టే జనాలకు బాగా నచ్చి హిట్ అయిందనుకుంటా. లేదంటే ఇంతకు ముందు పూరి జగన్ తీసిన సినిమాల మీద ఇది కాస్త బాగుంది ఉండచ్చు కాబోలు. 

ఏది ఏమైతేనేం ఇంత మందికి నచ్చిన ఈ సినిమా మరి నాకెందుకు నచ్చలేదు? మీలో ఎవరికైనా నచ్చింటే కాస్త మీ మైండ్ నాకు అరువివ్వండి అది నేను పెట్టుకొని సినిమా చూస్తా. అప్పుడు నచ్చుతుందేమో. 

ఇదే వారం లో చల్తే చల్తే, వినరా సోదరా వీర కుమారా అనే రెండు తెలుగు సినిమాలు చూశాను. ఈ సినిమాలు బాగున్నాయి అని చెప్పను కానీ పైన చెప్పిన సినిమా కంటే కొంతలో కొంత బెటర్. కాకపోతే ఇవి రిలీజ్ అయ్యాయి అని కూడా చాలా మందికి తెలీదు కాబట్టి  ఎంతమంది థియేటర్ కెళ్ళి చూస్తారు అనేదే డౌట్ అందుకే ఇవి యు ట్యూబ్ సినిమాలుగానే మిగిలి పోతున్నాయి. 


మాములుగా హిందీ సినిమాలు అంటే నాకు పెద్దగా నచ్చవు కాకపోతే ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో 'మిషన్ మంగళ్' నచ్చింది.  

P.S: నేను కూడా కాస్త తెచ్చి పెట్టుకున్న తెలంగాణా భాష ఉపయోగించాను, బాగా తప్పులుంటాయి వీలయితే సరిచేయండి లేదంటే మన్నించండి. 

14, అక్టోబర్ 2019, సోమవారం

మరి ఇక్కడ శాలరీ పెరగడానికి దారేది?

ఈ పోస్ట్ 'అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు' అనే పోస్ట్ కి కొనసాగింపు & ముగింపు.

అలా నిరాశతో నిస్పృహతో  కూడిన మొహం వేసుకొని మెహర్ రమేష్ లా బయటికి వచ్చిన నాకు  కాఫీ టైం కంటే బాగా ఆలస్యంగా, లంచ్ టైం కంటే కాస్త ముందుగా ఆఫీస్ కి వస్తున్న రాజేష్ ఎదురయ్యాడు.

అది చూసి "హేయ్  రాజేష్, ఇంత ఆలస్యంగానా ఆఫీస్ కి వచ్చేది"  అన్నాడు సుబ్బారావ్ ఒక చీమను తన కాలికింద నలిపేసి ఇంకో నల్లిని కూడా నలిపేయాలన్న కసితో. 

"కుక్క ఉంది" డోంట్ కేర్ అన్నట్లు రాజేష్ రిప్లై  ఇచ్చాడు. 

"వాట్?" కోపంగా సుబ్బారావ్

మా కాంపౌండ్ లో కుక్క ఉంది, దాన్ని కట్టేయ్యలేదు. ఓనర్స్ దాన్ని కట్టేశాక బయల్దేరా లేటయింది.

"మరి ఆ జుట్టేంది" మళ్ళీ ఎటాక్ మొదలెట్టాడు సుబ్బా రావ్ 

"మొక్కు ఉంది"

"వాట్?"  మళ్ళీ కోపంగా సుబ్బారావ్

తిరుపతి వెళ్ళాలి, అందుకే జుట్టు కటింగ్ చేయించుకోలేదు 

ఆ చిరిగిన బట్టలేంటి ఆఫీస్ కి?

పంది కొక్కు ఉంది

వాట్? అన్నాడు మళ్ళీ, అప్పటికే నిప్పుల మీద పెట్టిన వంకాయలాగా మాడిపోయింది సుబ్బారావ్ మొహం.

పంది కొక్కు ఇంట్లో బట్టలను కొరికేస్తోంది. 

అయితే ఓకే, అని మేనేజర్ వెళ్ళిపోయాడు ఏం అనలేక. 

కుక్కుంది, మొక్కుంది, పంది కొక్కుంది అంటూ మాట్లాడావ్ సుబ్బారావు తో, "ఏముందని నీ దగ్గర అంత  ధైర్యం?" అని అడిగా రాజేష్ ని.

ధైరం ఉంది, బ్రహ్మాస్త్రం  లాంటి  P.R ఉందనే ధైర్యం ఉంది అందుకే అన్నాడు. అదిసరే గానీ  ఏమైంది నీ అప్రైసల్ అంది అడిగాడు. 

మళ్ళీ దెబ్బేశాడు, ఎన్ని హిట్లు పడి, యెంత టాలెంట్ ఉన్నా మార్కెట్ పెరగని నాని లాగా అయిపొయింది నా బతుకు అన్నాను. 

గొడవ పడక పోయావా?

అదీ అయింది, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లు మాట్లాడాడు.

సరే, నీకు జ్ఞానోదయం కలిగిస్తాను విను అని మొదలెట్టాడు ... 

ఇక్కడ ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా, అసలు దంచకపోయినా అదే కూలి దక్కుతుంది.  

అంతే కాదు, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మన ప్లేట్, కడుపు రెండూ నిండిపోతాయి.

నువ్వెంత పని చేసినా, సంవత్సరం చివరలో నీ పనిలో ఏదో ఒక బొక్క వెతుకుతారు. వాళ్లకు నువ్వు నచ్చకపోతే పొమ్మని ఎవరూ చెప్పరు పొగ పెడతారు అంతే. 

మార్కెట్ కి వెళ్ళినప్పుడు నీకొక్కడికే కూరగాయలు తెచ్చుకుంటే సరిపోదు వాటితో పాటు ఆపిల్స్, అరటి పండ్లు లాంటివి తెచ్చి ఎక్కడ సమర్పించాలో అక్కడ సమర్పించుకోవాలి. 

సూపర్ మార్కెట్ లో నీ బ్యాగులొక్కటి మోస్తూ తిరిగితే మోక్షం రాదు, సూర్యుడి చుట్టూ భూమి ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది చూశావా అలా తిరిగిన వారికే మోక్షం. 

లేదు ఈ తిప్పలన్నీ పడలేను అంటావా అయితే అన్ని రోగాలకు జిందా తిలిస్మాత్ లాంటి ఒకటే మందు ఉంది, అదే PR. ఆ బ్రహ్మాస్త్రం చేతిలో ఉంటే ఇంత తిప్పలు పడాల్సిన అవసరం లేదు. 

సరే! అప్పుడెప్పుడో  స్థిర యోగ హోమం మెదలెట్టానన్నావ్. ఎంతవరకు వచ్చింది?

నడుస్తోంది. చివరి స్టేజి దగ్గర  ఉంది.  కుదిరితే క్రిస్మస్ కు, లేదంటే సంక్రాంతికో అప్పటికీ కాదంటే ఉగాదికో నాకూ బ్రహ్మాస్త్రం వస్తుంది. అప్పుడు చూపిస్తా నా తడాఖా, పెద్దగా కష్టపడకపోయినా అందం ఒక్కటి అడ్డు పెట్టుకొని హిట్ మీద హిట్ కొడుతున్న మహేష్ బాబు లాగా మార్కెట్ పెంచుకుంటా.

ఆల్ ది బెస్ట్ అని రాజేష్ లంచ్ కి వెళ్ళాడు డబ్బా పట్టుకొని.  

P.S: మేనేజర్ మనోభావాలను దెబ్బదీశానని నా మీద కోర్ట్ కేసులేమి పెట్టకండి, అసలే జీతాలు పెరగక ఇబ్బందుల్లో ఉన్నాను. మా సుబ్బారావ్ కి తెలుగు రాదు కాబట్టి నా బ్లాగు చదవడు అని ధైర్యంగా రాసేశా, మీరు మాత్రం ఇలాంటివి రాయాలంటే ఆలోచించండి.

8, అక్టోబర్ 2019, మంగళవారం

అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు

మొన్న ఉదయాన్నే అప్రైసల్ డిస్కషన్ కి  మా మేనేజర్ సుబ్బారావ్ పిలవగానే ఉత్సాహంగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళాను . 

నేను - డిస్కషన్ ముందు
"పవన్, ఈ ప్రాజెక్ట్ లో గత సంవత్సర కాలంలో నీ అచీవ్మెంట్ గురించి చెప్పు" అని అడిగాడు మా సుబ్బారావ్ (మేనేజర్). 

సీ మిస్టర్ సుబ్బారావ్, సైరా ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి చేతికి వెళ్ళినప్పుడు ఇతను హేండిల్ చేయగలడా అని అందరూ సందేహించినట్లే, ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు చాలా మంది 'పవన్ ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలడా?' అని అనుమాన పడ్డారు.  అందరి నోళ్ళు మూయించేలా నేను ఈ ప్రాజెక్ట్ లో పొడిచేసాను, దంచేసాను, రుబ్బేసాను, ఉతికి ఆరేశాను, ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒంటి చేత్తో నిలబెట్టాను. ఇంతకంటే అచీవ్మెంట్ ఇంకేం కావాలి అన్నాను సినిమా సక్సెస్ అయిన తర్వాత జరిగిన అభినందన సభలో హీరోలా రెట్టించిన ఉత్సాహంతో. 

నా ఉత్సాహం మీద నీళ్లు చల్లేస్తూ "అభినందన్ గురించి నీకేం తెలుసు?" అన్నాడు. 

మన టీం లో అలాంటి పేరు ఎప్పుడూ వినలేదే?

టీం లో కాదు టీవీ లో చూసి ఉంటావ్ గా అతన్ని.

అతనెందుకు తెలీదు సర్, మన దేశం పరువు నిలబెట్టిన వీర సైనికుడు.

మరి దేశ పరువు నిలబెట్టిన అతనిది గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్నావా? లేక ప్రాజెక్ట్ ని ఒంటి చేత్తో నిలబెట్టిన నీదా?

ముమ్మాటికీ అతనిదే?

మరి నీది అసలు అచీవ్మెంట్ కానే కాదని ఒప్పుకున్నట్లేగా?

నేనొప్పుకోను, అయినా మోకాలికి బోడి గుండుకి ముడిపెడతారేంటి?

అదే కదా మేనేజర్ మొదటి క్వాలిఫికేషన్, అది లేకే నువ్వలా ఉండిపోయావ్ నేనిలా మేనేజర్ లా ఎదిగిపోయా. 

అది కాదు సుబ్బారావు గారు, ఎప్పుడో మా అమ్మాయి పుట్టక ముందు నుంచి ఇస్తున్న శాలరీ ఇది, మా అమ్మాయి పెరిగిపోయింది కానీ, నా శాలరీ మాత్రం ఒక్క సెంట్ కూడా పెరగలేదు. అంతెందుకు విజయ్ దేవరకొండ నిక్కర్లు వేసుకునే వయసులో నేను ఈ కంపెనీ లో చేరాను. ఇప్పుడతను అవే నిక్కర్లు, చొక్కాలు తన బ్రాండ్ నేమ్ తో అమ్ముకునే స్థాయికి ఎదిగాడు, నేనేమో ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా అదే పొజిషన్ లోనే ఉన్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే చిరంజీవి సినిమాలు ఆపేసినప్పడు చేరాను నేనీ కంపెనీలో. ఇప్పుడాయన 150,151 వ సినిమా కూడా పూర్తి చేసి 152 వ సినిమా మొదలుపెట్టాడు, నేనేమో ఏ శాలరీతో ఈ కంపనీలో నా ప్రయాణం మొదలెట్టానో అక్కడే ఆగిపోయాను. 

శాలరీ, ప్రమోషన్ అని అంటున్నావ్ గానీ, యెంత శాలరీ పెంచినా మనిషికి సంతృప్తి అనేది ఉండదు పవన్, సరే సంతృప్తికి డెఫినిషన్ ఇవ్వు ముందు, తర్వాత ఆలోచిద్దాం.

నెక్స్ట్ వీక్ నుంచి నేనుండే ఇంటికి వీక్లీ రెంట్ పది డాలర్స్ పెరుగుతోంది  అంటే నెలకు 40 డాలర్లు, కనీసం ఆ మాత్రం శాలరీ పెరిగితే అదే తృప్తి, సంతృప్తి అన్నాను ఒక సారి.

మరీ ఎక్కువ ఆశిస్తున్నావ్, ఫ్యూచర్ లో లోకేష్ బాబు C.M అవ్వచ్చు, పాల్ P.M అవ్వచ్చు,  అంతెందుకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు మొదలెట్టచ్చు గానీ ఇది జరగడం అసాధ్యం. వేరే ఏదైనా చెప్పు. 

ఇప్పుడు నేను ఆఫీస్ కు సైకిల్ లో వస్తున్నానుగా, కనీసం దాని మైంటెనెన్సు ఖర్చులు 20 డాలర్లు వస్తోంది, కనీసం ఆ మాత్రం నెలకు పెరిగితే సంతృప్తి .

ట్రైన్లోనే, బస్సు లోనో వస్తే కనీసం 120 డాలర్లు అవ్వుద్ది, కాబట్టి ఇంకా నువ్వు డబ్బులు మిగిలిస్తున్నావ్. ఇంకోటి చెప్పు.

కనీసం బయట కాఫీ తాగాలంటే 5 డాలర్లు ఖర్చు అవుతుంది, ఆ మాత్రం నెలకు పెరిగితే... 

థూ! సిగ్గుండాలయ్యా, 5 డాలర్లు పెరిగితే మాత్రం సిగ్గు లేకుండా ఎవరితో మాత్రం ఎలా చెప్పుకుంటావ్ 5 డాలర్లు పెరిగిందని.

అర్థమైంది మహానుభావా, ఈ సారి కూడా పెరగదు అనేగా.

అంతేగా! అంతేగా! కాబట్టి 'అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు' అని  అనుకో.

మరి ప్రమోషన్?

సంపూర్ణేష్ బాబు రేంజ్ మహేష్ బాబు రేంజ్ ని దాటొచ్చు అంతెందుకు మోహన్ బాబు కొడుకులు కూడా స్టార్ హీరోలు అవ్వచ్చు గానీ ... 

మళ్ళీ అర్థమైంది మహానుభావా, ఈ మాత్రం దానికి ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు సుబ్బారావ్ గారు.

ఫార్మాలిటీ అమ్మా ఫార్మాలిటీ, ఫాలో అవ్వాలి. పద డిస్కషన్ అయిపోయింది.

అపజయం ఎరుగని రాజమౌళిలా ఠీవీగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిన నేను పరాజయానికి కేరాఫ్ అడ్రస్ గా మిగిలిపోయిన మెహర్ రమేష్* లా మీటింగ్ రూమ్ లోంచి బయటపడ్డాను.

నేను - డిస్కషన్ తర్వాత

పోస్ట్ పెద్దది అవుతోంది మిగతాది తర్వాత పోస్ట్ లో కంటిన్యూ చేస్తా.

P.S: మెహర్ రమేష్ గురించి తెలియని వాళ్ళు 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు చూడండి, జన్మలో అతని పేరు మర్చిపోలేరు.

1, అక్టోబర్ 2019, మంగళవారం

మేమింతే! ఈ జన్మకి చిరంజీవి ఫాన్స్ గానే ఉండిపోతాం

చొక్కాదేముంది  చినగనీ , మన చిరంజీవి సినిమా టికెట్స్ దొరికాయి చాలు. 

ఎప్పుడు చూడు చిరంజీవి, చిరంజీవి అంటూ సినిమాలేనా, చదివేది ఏమైనా ఉందా?

ఈ సారి తిరణాలకు భలే జనం వచ్చినారు, ఏదో చిరంజీవి సినిమాకి వచ్చినట్లు.  

మనూర్లో వాడొక్కడే చిరంజీవిని చూసొచ్చాడు, అందుకే అంత బడాయి వాడికి. 

చిరంజీవి తర్వాత , ముందు బాగా చదువుకో రేపు నువ్వు పెద్దయ్యాక కూడెట్టేది  అదే. 

నేను పెద్దయ్యాక చిరంజీవితో ఒక సినిమా తియ్యాల.

ఇలాంటి మాటలు బాగా విన్న జనరేషన్ మాది.  ఆ జనరేషన్ లో స్కూల్ లో ఎవడన్నా చిరంజీవి ఫ్యాన్ కాదు అని తెలిస్తే వాడికి సినిమా పిచ్చి లేదని అర్థం, వేరే హీరో ఫాన్స్ లేరని కాదు గానీ, వారిని వేళ్ళ మీద లెక్కట్టచ్చు.   

అప్పుడు మొదలైన చిరంజీవి అనే మత్తు ఇప్పటికీ వదల్లేదు. ఇప్పటికీ T.V లో చిరంజీవి పాట వస్తుంటే యెంత ముఖ్యమైన పనున్నా ఆ పాట చూసి కానీ కదలను. ఆ పాటలో శ్రీదేవి ఉంటే  చిరంజీవి మీద నుంచి చూపు కాస్త మళ్లుతుందేమో కానీ వేరే హీరోయిన్ ఉంటే కాన్సంట్రేషన్ మొత్తం మా బాస్ మీదే.  

అలాంటి మా బాస్ ఇప్పటికీ హీరో అంటే చెప్పుకోవడానికి మాకు ముఖ్యంగా నాకు కొద్దిగా అసహనంగా ఉంది, వద్దులే అసహనం అనే మాట వింటే మనోభావాలు గట్రా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎబ్బెట్టుగా ఉంది అని అంటాను ఎందుకంటే ఈ  వయసులో ఇంకా డ్యూయెట్స్ పాడుతూ హీరో ఏమిటి అని? కాకపోతే ఆయన వయసుకు తగ్గ పాత్రలైతే హుందాగా ఉంటుంది అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు సైరా (తన వయసుకు కాస్తో కూస్తో తగ్గ పాత్రే అనుకుంటున్నా, ఏ మగధీరో, బాహుబలో అనకుండా) అంటూ వస్తున్నాడు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. 

గత రెండు రోజులుగా ఏ ఇద్దరు మిత్రుల మధ్యన సంభాషణ మొదలైనా సైరా కి వెళ్తున్నావా అని మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాను. తెలుగులో తన తరం హీరోలు ఈ తరం హీరోలతో పోటీ పడలేక వెనకబడి పోతుంటే మా బిగ్ బాస్ మాత్రం ఇప్పటికీ 'సై' రా అంటూ 'వయసైపోయినంత మాత్రాన కొదమ సింహం గడ్డి తినడం మొదలెట్టదు, రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంటుంది బాక్సులు బద్దలయ్యేలా' అని ఈ తరం హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు అరవయ్యేళ్ళ మా చంటబ్బాయ్

మధ్య మధ్య కాస్త ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా రాజా విక్రమార్కలా తన ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ ఆపకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చారు అందుకే అనొచ్చు బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అని. సినిమాల్లో అందరివాడు అనిపించుకుని రాజకీయాల్లో మాత్రం ది జంటిల్మెన్ అని అనిపించుకోలేకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తుంది. 

అడవికి రారాజు మృగరాజు అయితే తెలుగు సినిమా ప్రపంచంలో మగ మహారాజు మా హీరో.  రిక్షావోడైనా, గ్యాంగ్ లీడర్ లైనా, ముఠామేస్త్రి లైనా, ఆఖరికి  హిట్లర్ లాంటి వారైనా ఆయన్ను తెర మీద చూసి జై చిరంజీవా అని జేజేలు కొడుతూ మిమ్మల్ని ఎప్పటికీ తెర మీదే చూడాలని ఉంది అన్నయ్య  అని మైమరచి పోతారు.    

మొన్నటికి మొన్న 150 వ సినిమాతో విజేత అనిపించుకుని ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనే  ఖైదీ గా నిలిచిపోయారని నిరూపించారు. ఇప్పుడీ 151 వ సినిమా కూడా మా చక్రవర్తి కీర్తి కిరీటం లో మరో  కలికితురాయిగా చేరుతుందని మా చిరంజీవి అభిమానుల అభిలాష. ఇల లోని ఈ విజయాలన్నీ అక్కడి ఇంద్ర లోకం నుంచి స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చూసి  మా అల్లుడా! మజాకా! అని మరో సారి పొంగిపోవాలి.   

మా కరడు కట్టిన చిరంజీవి అభిమాని ఖాసీం కి మాట ఇచ్చినట్లు ఈ సినిమా రిలీజ్ మొదటి రోజు చూడటం లేదు. చిరంజీవి ఫాన్స్ ఎవరైనా ఇది చదువుతూ ఉండి ఉంటే కాస్త ఊపిరి పీల్చుకోండి. కాకపోతే సీట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయ్ కాబట్టి ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. 


సైరా కి పోటీ అంటున్న హిందీ సినిమా 'వార్' పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంది. దిక్కుమాలినన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఏది హిట్ అవుతుంది అనేది తర్వాత విషయం, క్రేజ్ విషయంలో యూత్ హీరోలతో పోటీ పడగలుగుతున్నాడు అని మాత్రం చెప్పొచ్చు. 

ముసలోడికి ఇప్పుడు సైరా లాంటి సినిమా అవసరమా? ప్రభాస్ లాంటి మంచి ఫిజిక్ ఉన్న హీరో అయితే బాగుండు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మాకు అవేమీ పట్టవు, ప్రభాస్, మహేష్ మాకొద్దు.  మేమింతే! చిరంజీవి అనే మత్తు వదలదు అదంతే , మేమింతే. ఈ జన్మకి చిరంజీవి ఫాన్స్ గానే ఉండిపోతాం మా ప్రాణాలు పోయేదాకా. మంచికో, చెడుకో కొందరికి తాగుడు, జూదం అంటూ ఏదో ఒక వ్యసనం ఉంటుంది మాకూ చిరంజీవి అనే వ్యసనం ఉంది, అదలానే ఉండిపోనీ నష్టమేముంది. 

ఏంటి డాన్స్ నేర్చుకుంటావా? వీడో పెద్ద చిరంజీవి మరి, డాన్స్ నేర్చుకుంటాడట మొహం చూడు. 

అవును మరి డాన్స్ గురించి ఎవరైనా అంటే మా చిరంజీవే గుర్తొస్తాడు ఇప్పటికీ, ఎప్పటికీ. ఆయనొక మాస్టర్ పీస్, డాన్స్ లో ఆ గ్రేస్, స్టైల్ మరెవరికీ లేదు, రాదు.  

ఏంటో ఈ వెర్రి "సినిమా హీరోలకి అభిమానులు" అట? వాళ్ళేం సాధించారని అదంతా దర్శకుల గొప్పతనం? అనే వాళ్ళు అననీ. ఒక సామాన్యుడు ఈరోజు కొన్ని కోట్ల మంది తన గురించి మాట్లాడుకునేలా చేసాడంటే ఆ స్వయంకృషి విలువ సామాన్యం కాదు, ఆ కష్టపడే తత్త్వం ఆదర్శంగా తీసుకుంటే మనమూ అద్భుతాలు సృష్టించచ్చు... 

సృష్టించచ్చు ... అంటూ చచ్చు మాటలెందుకూ చచ్చే లోగా మనమూ అద్భుతాలు సృష్టిద్దాం.