ఓ పది పన్నెండేళ్ళ క్రితం హీరో రాజశేఖర్ మీద ఒక మేకు జోకు బాగా వినిపించేది.
ఇంటర్వ్యూ కోసం ఒక విలేఖరి రాజశేఖర్ ఇంటికి వెళ్తాడు. సర్ వస్తారు కూర్చోండి అని ఒక సర్వెంట్ హాల్లోని సోఫాను చూపిస్తుంది. అతను సోఫా లో కూర్చొని ఉంటే ఆవిడ ఇల్లు క్లీన్ చేసే పనిలో ఉంటుంది.
ఆ విలేఖరి ఇంటిని తేరిపార చూస్తూ అక్కడ కింద పడి ఉన్న ఒక మేకు ను గమనించి 'ఇదిగో అమ్మాయ్ ఇక్కడ మేకు పడి ఉంది తీసి ఎక్కడైనా పెట్టు' అని అంటాడు.
అయ్యో! మెల్లిగా మాట్లాడండి, మా అయ్య గారికి వినపడుతుంది అంటుందావిడ కంగారుగా
వినపడితే వచ్చే నష్టమేముందమ్మాయ్ .. మేకునే కదా నేను ఎత్తేయమన్నాను అంటాడు
అయ్యో మెల్లిగా మాట్లాడండి సర్ ..మేకు అనే మాట వినపడితే చాలు పూనకం వచ్చిన వాడిలా ఏదో ఒక సినిమా రీ'మేకు' రైట్స్ కొనడానికి తమిళనాడుకో, కేరళాకో బయల్దేరతారు అంటుంది మెల్లిగా.
అప్పట్లో రాజశేఖర్ ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుండటం వల్ల వినపడ్డ జోక్ అది. ఇప్పటికీ 'శేఖర్' అనే రీమేక్ సినిమా చేస్తూ అదే జోన్ లోనే ఉంటున్నాడు "పరుగు ఆపడం ఒక కళ" అని అర్థం చేసుకోకుండా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆ జోక్ ని అన్వయించుకోవచ్చేమో...వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అంటూ వరుసగా రీ-మేకులు దించుతున్నాడు.
మొన్న "జిగర్ తాండ"/"గడ్డలకొండ గణేష్" సినిమాని "బచ్చన్ పాండే" అని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు, నిన్నటికి నిన్న జెర్సీ సినిమాతో మరో సారి అదే రిపీట్ అయింది. పదేళ్ళ క్రితం పరభాషా సినిమాలు అతి తక్కువ మంది చూసేవారు కాబట్టి ఈ రీమేకులు వర్కౌట్ అయ్యేవి. ఇప్పుడు ప్రపంచసినిమాలని మన ఇంట్లోనే చూసే సౌలభ్యం కలిగాక ఈ రీమేకుల ను చూసే ఇంటరెస్ట్ జనాలలో తగ్గిపోయింది.
ఏదో పవన్ కళ్యాణ్ కాబట్టి, అంతో ఇంతో పిచ్చిగా చూసే అభిమానులు ఉండబట్టి అతని రీమేక్ సినిమాలు కాస్తో కూస్తో బాగా ఆడి ఉండచ్చు కానీ మరో హీరో సినిమాలు అయితే బొక్క బోర్లా పడటం ఖాయం. పోను పోను ఆ మాత్రం కూడా ఆడతాయని నమ్మడానికి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడటం మంచిది.
పర భాషలో హిట్టయ్యింది కదా అని వందల కోట్లు కుమ్మరించి మళ్ళీ రీమేక్ అని తీయడం వల్ల లాభం లేదని ఈ పాటికే బచ్చన్ పాండే, జెర్సీ సినిమా నిర్మాతలకి అర్ధమయ్యే ఉంటుంది, అయినా ఇంకా పలు తెలుగు, తమిళ సినిమాలని రీమేక్ చేస్తున్నారంటే వారి లెక్కలు వారికి ఉండే ఉండచ్చు.
సూరారై పోట్రు / ఆకాశమే నీ హద్దురా సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నారు. ఛత్రపతి సినిమాని మన బెల్లంకొండ హీరోగా రీమేక్ చేస్తున్నాడంటే ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ ని బంగారు పళ్ళెం లో పెట్టి ఇవ్వడమే, ఇప్పటికే ఆ ఛత్రపతి బెంగాళీ రీమేక్ సినిమా హీరో ని మన ప్రభాస్ తో పోల్చుతూ బోలెడంత కామెడీ చేశారు యూ ట్యూబ్ వీడియో లలో.
ఇక తప్పని సరి తద్దినం అయిన మెగాస్టార్ సినిమా వస్తోంది, ఆ మెగా ఫామిలీ కి మా రెండెద్దుల ఫ్యామిలీ ఏ జన్మలోనే పడిన బాకీని ఈ జన్మలో ఇలా తీరుస్తున్నాను. ఇలా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఫామిలీస్ యెంత బాకీ పడ్డాయో గానీ ఆ బాకీ తీరే వరకూ ఈ తాత సినిమాలు ఆపేలా లేడు. సినిమానో, సీరియలో లేదంటే షార్ట్ ఫిల్మో కూడా అర్థం కానంత సినిమాని వదిలాడు లెజెండ్ అనుకునే ఇంకో తాత. ఘోరాతి ఘోరమైన హిట్టు అని వినిపించిన సినిమా వదిలాడు మరో తాత. కాకపోతే ఇవేవీ రీమేకులు కాకపోవడం మన అదృష్టం.
"పరుగు ఆపడం ఒక కళ" అని ఈ తాతల వయసు హీరోలు తెలుసుకోలేరు, మనం అయినా తెలుసుకుంటే మంచిదేమో.