నేను నిన్న రాసిన అఖండ తో బాలయ్య మరో పదేళ్ళు?? అనే పోస్ట్ లో వంశోద్ధారకుడు ప్లాప్ అయితే నువ్వు హిట్ అని రాశావు అని నా ఫ్రెండ్ అన్నాడు.
పవిత్ర ప్రేమ మా ఊర్లో వంద రోజులు ఆడింది కాబట్టి అది ప్లాప్ సినిమా కింద ఎలా కన్సిడర్ చేస్తావు, అలాగే టాప్ హీరో కూడా ప్లాప్ కాదు అని ఒక వ్యక్తి అన్నారు.
దాని గురించి అదే పోస్ట్ లో కామెంట్స్ రాద్దామని మొదలెట్టాను, కానీ అది ఒక పెద్ద పోస్ట్ అయి కూర్చుంది, అదే ఈ సారాంశం.
అవి నేను కొత్తగా కడపకు వచ్చిన రోజులు, ఒక్కడినే సినిమా కెళ్ళడం కూడా అదే మొదటి సారి.
సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి కౌంటర్ దగ్గర జనాలు లేరు అనుకున్నా, ఫస్ట్ క్లాస్ కి ఒక టికెట్ ఇవ్వండి అన్నాను కౌంటర్ దగ్గర కెళ్ళి
అతను టికెట్ఇవ్వబోయాడు.
నేను డబ్బులు నా చేతిలోనే ఉంచుకొని టికెట్ తీసుకోకుండా 'సీట్స్ ఉన్నాయా లోపల' అని అడిగాను
లేవు తమ్ముడూ, థియేటర్ ఫుల్ అన్నాడు
అయితే టికెట్ వద్దన్నా అన్నాను
పర్లేదు తమ్ముడూ, ఎక్స్ట్రా చైర్ వేస్తారు. నిలబడి చూడాల్సిన అవసరం లేదు అన్నాడు
ఆ సమాధానం తో కాస్త సంతృప్తి చెంది టికెట్ తీసుకొని లోపకి వెళ్తే నేను ఫూల్ అయ్యానని అర్థం అయింది.
మొత్తంగా పట్టుమని పది మంది కూడా లేరు ఫస్ట్ క్లాస్ లో, థియేటర్ మొత్తంలో యాభై మంది ఉంటే ఎక్కువ అది కూడా ఆదివారం మధ్యాహ్నం షో కి. నాకేం తెలుసు సినిమా ఆడినన్ని రోజులు జనాలతో నిండిపోయి ఉండేవేమో థియేటర్స్ అని అనుకునే వయస్సు అది.
ఆ థియేటర్ మా ఇంటికి దగ్గరలో ఉండేది దాని పేరు 'లక్ష్మి రంగ', మరి ఇప్పటికీ అది ఉందో లేదు తెలీదు. అది యెంత పెద్ద థియేటర్ అంటే ఆ థియేటర్ ని కొట్టేసి ఇంకో మూడు థియేటర్స్ కట్టే అంత. పది లారీల జనాన్ని అందులోకి పంపినా ఇంకా సీట్స్ ఖాళీగా ఉంటాయి అని అనేవారు అప్పట్లో ఆ థియేటర్ గురించి.
ఆ సినిమా పేరు బంగారు బుల్లోడు, అప్పటికే ఆ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే మిగతా 50 రోజులు ఇలా 50 మందితోనో లేదంటే ఇంకా తక్కువ మందితోనే వంద రోజులు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత తెలిసిందేమిటంటే కొన్ని సినిమాలు ఆబ్లిగేషన్ మీద లేదంటే ఫాన్స్ తలా కొంత డబ్బులు పోగు చేసి ఆ థియేటర్ వాడికిచ్చి వంద రోజులు ఆడిస్తారని తెలిసింది.
పైగా బంగారు బుల్లోడుతో పాటు ఒకే రోజు విడుదల అయిన 'నిప్పురవ్వ' సినిమా మీద ఈ సినిమా హిట్ అని అనిపించుకోవడానికి కొంత తంటాలు పడ్డారని తెలిసింది. అలా అని బంగారు బుల్లోడు ప్లాప్ అని నేను చెప్పడం లేదు, కాకపోతే ఎందుకో నిప్పు రవ్వే మంచి సినిమా ఏమో అని నాకప్పుడు అనిపించింది.
కాబట్టి సినిమా హిట్టా ఫట్టా అనే దానికి నిర్దిష్టమైన కొలమానం ప్రజలు మాట్లాడుకునే మాటలే అంతే.
నేను చిన్నప్పుడు 'శంకరాభరణం' సినిమా చూడని జన్మా ఒక జన్మేనా అనే మాట వినపడేది మేముండే ఒక పల్లెలో, అంటే 'శంకరాభరణం' చూడకపోతే జన్మ వ్యర్థం అని కాదు, ఆ సినిమా ఏదో బాగుందనో హిట్టయ్యిందనో మాకు అర్థం అయ్యేది. అలా జనాల మాటలే కొలమానం అని నా ఉద్దేశం.
ఉదాహరణకు నేను MCA చదివే రోజల్లో ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్తే, నైట్ అక్కడే పడుకోవాలి అని డిసైడ్ అయితే మృగరాజా? నరసింహనాయుడా? అని అడిగేవారు.
నరసింహనాయుడా? వద్దు బాబోయ్, మృగరాజు బెటర్ అనేవాళ్ళము.
మీ కర్థం కాలేదు కదూ, చెబుతా. ఎక్కువ రోజుల నుంచి ఉతక్కుండా వాడే లుంగీ అయితే నరసింహనాయుడు, ఈ మధ్యే ఉతికిన లుంగీ అయితే మృగరాజు అని దాని అర్థం. నరసింహనాయుడు ఎక్కువ రోజులు ఆడిందని, మృగరాజు పట్టుమని పది రోజులు కూడా ఆడలేదని ఆ మాటల్లో అర్థం.
ఇలా జనాల మాటల్లో తెలిసిపోయేది ఏది హిట్టు ఏది ప్లాప్ అని.
అలా నా చుట్టుపక్కన వాళ్లతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలని బట్టి నేను పవిత్ర ప్రేమ ప్లాప్ అని వంశోద్ధారకుడు హిట్ అని నాకు అప్పట్లో అర్థమైంది. నేను వేరే ఊరిలో ఉంటే ఈ అభిప్రాయం వేరే లాగా ఉండేదేమో చెప్పలేను. 2+2=4 అన్నంత ఖచ్చితంగా ఇది హిట్టు ఇది ప్లాప్ అని డిసైడ్ చేయడం కష్టం అని నా ఉద్దేశ్యం.