24, డిసెంబర్ 2020, గురువారం

మెంబర్ ఇట్, ప్యూటర్ మీద పెట్టాను మేటోస్

ప్యూజ్డ్ 

బ్రెల్లా 

ఆ హెడ్డింగ్, ఈ పదాలు మీకు అర్థం కావాలంటే మీరు కాస్త ఓపిక చేసుకుని ఇది చదవాల్సిందే. 

మా బుడ్డోడు పుట్టింది పెరిగింది ఇక్కడే ఆస్ట్రేలియాలో. వాడు పుట్టి కాస్త పెరిగేపాటికి ఇంట్లో ఇంగ్లీష్ గోల మొదలైంది. మా అమ్మాయి స్కూల్లో చదువుతోంది కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడటం, నేను కూడా PTE పరీక్షల (వీటి గురించి ఇంకో బ్లాగ్ లో మాట్లాడుకుందాం)  గొడవలో పడి తినడం, తాగడం, వాగడం అంతా ఇంగ్లీష్ లోనే. అప్పట్లో మంగస్థలం అని ఓ సినిమా రిలీజ్ అయితే భలే బాగుంది మన తెలుగు సినిమా అని  అందరూ ఆ సినిమాకి వెళ్తే నేను మాత్రం PTE పరీక్షలు అయిపోయేవరకు తెలుగు రుచి కాదు కదా దాని వాసన కూడా చూడకూడదు అని ఆస్ట్రేలియా గడ్డ మీద గట్టిగా ఒట్టు వేసుకున్నాను.  ఇక్కడ చుట్టుపక్కల పిల్లల్తో కలిసినప్పుడు కూడా మా బుడ్డోడు వాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాడు. కొన్నాళ్ళకు మాకు అర్థం అయింది ఏమిటంటేఎవరైనా తెలుగులో మాట్లాడితే వాడు అర్థం చేసుకుంటాడు కానీ తిరిగి ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు. వాడి ఇంగ్లీష్ కూడా కాస్త తేడాగా అనిపించేది నాకు. 

వాళ్ళ టీచర్స్ లో ఒకరి పేరు 'మాయా' అని చెప్పేవాడు .. సరే ఏ ఇండియన్ టీచెరో అనుకున్నా. ఒకసారి ప్రీ-స్కూల్ కి వెళ్తే ఆమెను చూపించాడు. అంతవరకూ మాయ అంటే ఘర్షణ సినిమాలో స్కూల్ టీచర్ ఆసిన్ లా ఊహించుకుంటే చిన్ని కళ్ళు, చప్పిడి ముక్కు ఉన్నావిడని చూపించాడు.  తరువాత తెలిసింది కొరియన్ టీచెర్ అయిన ఆవిడ పేరు 'సమాయా' అని. 

6 ఆడ్ నెంబరా లేక ఈవెన్ నెంబరా అంటే వెన్ నెంబర్  అనేవాడు, ఈవెన్ నెంబర్ అని మనం అర్థం చేసుకోవాలి దాన్ని. కన్ఫ్యూజ్ ను ఫ్యుజ్ అని, కంప్యూటర్ ని ప్యూటర్ అని, రిమెంబర్ ని మెంబెర్ అని షార్ట్ కట్ లో పలికేవాడు. ఒక పట్టాన అర్థం  అయ్యేది కాదు మొదట్లో. 

ఒకసారి ప్రీ-స్కూల్ లో నేను వాడి హెడ్ మిస్ట్రెస్ తో మాట్లాడుతూ ఉంటే 'హి ఈజ్ హెడ్ అఫ్ అదర్ కిడ్స్ ఇన్ మ్యాథ్స్ ' అంది. మీరు హెడ్ అఫ్ అదర్ టీచర్స్ అని తెలుసు వీడు హెడ్ ఆఫ్ అదర్ కిడ్స్ ఎలా అవుతాడు అని అడిగా. తర్వాత ఆవిడ విడమరచి చెప్తే అర్థం అయింది 'హి ఐస్ అహెడ్ ఆఫ్ అదర్ కిడ్స్ ఇన్ మ్యాథ్స్ ' అని. 

ఇంకో టీచర్ తన బర్త్డే అని స్కూల్ లో పిల్లలకు గిఫ్ట్ ఇస్తే, వాట్ ఐస్ యువర్ ఏజ్ అని అడిగాడట ఆవిడ్ని. వీడు ప్రీ-స్కూల్ లో చేరిన రోజే  ఆవిడకి కూడా మొదటి రోజట స్కూల్లో. ఆవిడకు మెమొరబుల్ మూమెంట్ ఏమిటంటే ఆస్ట్రేలియన్ అయిన తను చిన్నప్పుడు కూడా అదే ప్రీ-స్కూల్ లో చదువుకుందట. ఆవిడకి వీడికి కాస్త బాండింగ్ బాగా ఉండటం వల్ల వయసు 23 అని  చెప్పిందట. 

23 సంవత్సరాల ఆవిడే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంది నీకు ఇంకా ఏజ్ ఎక్కువ కదా మరి నీకెందుకు రాదు అని అడుగుతుంటాడు అప్పుడప్పుడు. 

ఒకసారి ఆ టీచర్ తో మాట్లాడాను మా వాడు పదాలు పలికే విధానం గురించి. అప్పుడావిడ 'మీ వాడు మాట్లాడేది కరక్ట్ , మీ ఇండియన్స్ లాగా స్పష్టంగా విడమరచి ప్రతీ పదం పలకాల్సిన అవసరం లేదు' అంది.  

మా అమ్మాయి చదివే స్కూల్ లో ఒక టీచర్ ఉంది. నేనేమో రోజీ అని పలుకుతాను ఆవిడ పేరును.  రోజీ కాదు 'రోజీ' అని సరిచేస్తూ ఉంటుంది మా అమ్మాయి మంచు లక్ష్మి లాగా అదోలా పలుకుతూ. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అయి చావదు. రెండూ ఒకటి లాగే అనిపిస్తూ ఉంటాయి. 

సరేలే వీళ్ళ ఇంగ్లీషే కరెక్టేమో అని సర్దుకుపోతున్నా అప్పటినుంచి. 

ఈ పాటికే మీకు ఈ పోస్ట్ హెడ్డ్డింగ్  '(రి)మెంబర్ ఇట్, (కం)ప్యూటర్ మీద పెట్టాను (ట)మేటోస్' అర్థం ఉంటుంది.  

నాన్నా!  'ఐ వాంట్ నిల్లా ఐస్క్రీమ్, నాట్ దిస్ బెరీ ఐస్క్రీమ్' అంటూ వచ్చాడు  మా వాడు. వీడికి ఇంగిలీసోళ్ళ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో వచ్చింది ఇక తెలుగు మాట్లాడేది నేర్పాలి లేదంటే మంచు లక్ష్మి ని మించి పోతాడు కాబట్టి ఈ రోజు నుంచి వాడికి తెలుగు నేర్పాలని ఇదే ఆస్ట్రేలియా గడ్డ మీద ఇప్పుడు గట్టిగా ఒట్టు పెట్టుకుంటున్నాను. 

అవును 'నిల్లా' అదే వెనిల్లా ని, 'బెరీ' అదే స్ట్రాబెరీ ని తెలుగులో ఏమంటారో మీకెవరికయినా తెలిస్తే చెప్తారా? వీలయితే ప్యూజ్డ్ అండ్  బ్రెల్లా ను కూడా డీకోడ్ చెయ్యండి. 

29, ఆగస్టు 2020, శనివారం

అంకాళమ్మ గుళ్ళో ప్రసాదం పంచి పెట్టే పని చెయ్

అయిదారు నెలల క్రితం కొలీగ్ తో జరిగిన వాదన లాంటి సంభాషణలో భాగంగా 'పేద వాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ చేతగానితనమే' అనే కాన్సెప్ట్ ని బలపరుస్తూ నేను నా లైఫ్ లో చూసిన ఉదాహారణలతో పాటు వాదించాను. 

ఈ మధ్య పూరి జగన్నాథ్ ఏమైతే అన్నారో దాదాపు అలాంటి పాయింట్స్ నేను కూడా లేవదీశాను. బాగా డబ్బు ఉండి కూడా  రేషన్ కార్డు అడ్డ దారిలో సంపాదించి ఫ్రీ బియ్యం తెచ్చుకొని అన్నం చేసుకోవడానికి బాగోకపోతేనేమి ఇడ్లీ కి పనికొస్తాయి అని వాడుకునే వాళ్ళను చూశాను. 

మొన్నా మధ్య నేను పనిచేస్తున్న కంపెనీ లో రిజైన్ చేసాను. మేనేజర్, ఆ పై మానేజర్ మాట్లాడారు సంధి కుదర్చడం కోసం.  అవి ఫలించకపోవడంతో కంపనీ డెలివరీ హెడ్ నన్ను పిలిచి మాట్లాడారు. 

రెక్కలొచ్చాయి కాబట్టి ఎగరాలనుకుంటున్నావు? అంతేనా?

అంతే కదా సుబ్బారావ్ గారు. ప్రతీ కుక్కకి ఒక రోజు వస్తుంది. 

నువ్వు ఇక్కడే ఉండాలంటే మేము ఏంచెయ్యాలి?  

గత ఎనిమిది సంవత్సరాలుగా నా శాలరీ లో హైక్ అనేది లేకుండా చేస్తున్నారు  యెంత మంచి రేటింగ్స్ వచ్చినా హైక్ ఇవ్వడం లేదు యేవో కారణాలు చూపిస్తూ. కాబట్టి 10% హైక్ ఇస్తే ఉంటాను. 

తప్పకుండా, ఈ సారి అప్రైసల్ లో హైక్ వచ్చేలా చూస్తాను. 

గత మూడేళ్ళలో ఇది రెండో సారి మీ నుండి ఇదే మాట వినడం 

లేదు, ఈ సారి confirm.  

ఎలా నమ్మేది, ఒక మెయిల్ పంపించండి అలా అని. 

అలా కుదరదు. సరే, బయట నీకు యెంత ఇస్తున్నారు?

30% హైక్ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్న శాలరీ పైన. 

నీకు ఇప్పుడు ఇక్కడ యెంత వస్తుందో తెలుసుకోవచ్చా.  

***** $

ఆయన తన ఫోన్లో calculator ఓపెన్ చేసి నీకు ఈ మధ్యే PR వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు  PR హోల్డర్ వి. నీకు ఇద్దరు పిల్లలు అలాగే నీ శాలరీ ##### కంటే తక్కువ,  కాబట్టి నీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్, ఇప్పటి నీ సాలరీ కలుపుకుంటే నీకు ఆ కొత్త కంపెనీ ఇచ్చే శాలరీ కి ఆల్మోస్ట్ సమానం. మరి అలాంటప్పుడు నువ్వు కంపెనీ మారడం అవసరమా? ఇక్కడ నీకు ఈ కంపెనీ లో హాయినా జరుగుతూ ఉన్నప్పుడు?

అంటే నన్ను భిక్షం ఎత్తుకోమంటారా?

అలా ఎందుకు అనుకుంటావ్? నువ్వు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా బెనిఫిట్స్  పొందుతున్నావ్. 

నాకు ఎక్కువ సంపాదించే శక్తి ఉండి కూడా చేవ చచ్చిన వాడిలా  గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవడం అవసరం అంటారా, ఆ బెనిఫిట్స్ యేవో నిజంగా అవసరం అయ్యే వారికి ఉపయోగపడతాయి. 

PR ఉండి కూడా మన కంపెనీ లోనే తక్కువ శాలరీ కి పనిచేస్తూ గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు వారిలాగే నువ్వు అనుకోవచ్చుగా.  

టాలెంట్ ఉండి ఈ కంపెనీ వదిలి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలా ఉండాలనుకుంటున్నాను అని అన్నాను. 

అలా  డిస్కషన్ ముగిసింది. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి 'గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకో, జాబ్ మారడం అవసరమా?' అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ "సారా పాకెట్స్ ఇస్తాము, మీకు కలర్ టీవీలు ఇస్తాము మాకే ఓటు వేయండి" అని ఓటర్లను ప్రలోభపరిచే రాజకీయ నాయకుడిని తలపించాడు. 

ఈ సోది అంతా ఎందుకు చెప్పాను అంటే, పూరి జగన్నాథ్ గారి వాఖ్యలకు ఈ ఇన్సిడెంట్ కాస్త దగ్గరగా ఉండటం వల్ల. ఆయన పూర్తిగా ఏమన్నారో వినలేదు కానీ అక్కడ ఇక్కడ చదివిన దాన్ని బట్టి ఆయన ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకున్నాను. 

చివరిగా నేను చెప్పేది ఏమిటంటే మనం ఏది అన్నా కూడా దాన్ని విమర్శించే వారు ఉండనే ఉంటారు కాబట్టి పూరీ జగన్నాథ్ వాఖ్యల మీద కస్సు బుస్సుమని బుసలు మొదలు పెట్టారు కొందరు. నేను ఆయన్ని సమర్థిస్తున్నాను అని నేను పూరి జగన్నాథ్ ఫ్యాన్ ని అనుకోకండి అతని సినిమాలు చాలా వరకు నాకు నచ్చవు.  సరే అలాంటి వాళ్ళను పట్టించుకుని వారిని సంతోషపరచాలి అనుకుని ఆయన సారీ చెప్తూ పోతే కుదరదు. 

నేను తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడు నన్ను క్లాస్ లీడర్ గా పెట్టారు. ఎవరైనా టీచర్ రానప్పుడు స్కూల్ లో అల్లరి చేయకుండా పిల్లలు చదువుకోవాలి, ఎవరైనా అల్లరి చేస్తే వారి పేరు బోర్డు మీద రాయాలి ఇది క్లాస్ లీడర్ పనిలో భాగం.  

ఒక అరగంట తర్వాత  మా శాస్త్రి సార్ వచ్చి బోర్డు మీద చూసారు అందులో ఎవరి పేరు లేదు . నన్ను పిలిచి 'మా ఆఫీస్ రూమ్ వరకు వినపడుతోంది ఈ క్లాస్ లో పిల్లలు చేసే అల్లరి' మరి బోర్డు మీద ఎవ్వరి పేరు లేదెందుకు అన్నారు. 

ఫలానా వాళ్ళు అల్లరి చేస్తున్నారు కానీ వాళ్ళను భాధ పెట్టడం ఎందుకని రాయలేదు అన్నాను.  

అందరిని సంతోష పెట్టాలంటే 'అంకాళమ్మ గుళ్ళో ప్రసాదం పంచి పెట్టే పని చెయ్, క్లాస్ లీడర్ గా పనికి రావు' అన్నారు. 

'If you want to make everyone happy, don't be a leadersell ice cream!'  అనే స్టీవ్ జాబ్స్ గారి కొటేషన్ గుర్తుకు వచ్చింది కదూ. అప్పుడెప్పుడో మా శాస్త్రి సార్ ఇదే మాట అన్నారు, కాకపోతే శంఖం లోంచి వస్తేనే కదా తీర్థం అయ్యేది. అవును కాపీ కేసు వేయచ్చంటారా స్టీవ్ జాబ్స్ వారసుల మీద. ఇలాంటి కాపీమరకలు  కొత్త సినిమాలు అయిన 'ఆచార్య', 'పుష్ప' మీద పడ్డట్లున్నాయి ఈ మధ్య. 

తోక: నా మేనేజర్స్ ని ఎవరైనా సరే సుబ్బారావ్ అని పిలుచుకుంటాను నేను. 

23, జూన్ 2020, మంగళవారం

మొత్తానికి నే చెప్పొచ్చేది ఏమిటంటే

పి.వి నరసింహారావు గారి జయంతి కదా అని అందరూ ఆయన గురించి రాస్తుంటే మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం బళ్ళో దెబ్బలైనా, ఇంట్లో దోశలైనా, గుళ్ళో ప్రసాదాలైనా అని ఆయన మీద ఏదో ఒకటి రాద్దామని అనిపించి మొదలెట్టా కానీ ఆయన గురించి నాకు పెద్దగా తెలీదాయె. సరే మొదలు పెడితే ఏదో ఒకటి రాయొచ్చు అని మొదలెట్టా. 

అప్పట్లోనే ఆయన 15 లాంగ్వేజెస్ వరకు నేర్చుకున్నారని విన్నాను. ఇప్పుడంటే చాలా మందికి చాలా లాంగ్వేజెస్ వచ్చు. అంతెందుకు నా బోటి వాడికే తెలుగు, కన్నడ , ఇంగ్లీష్, జావా, సి, సి++ అని బోల్డు వచ్చు. మరి అప్పట్లోనే అన్ని భాషలు అంటే యెంత గొప్ప మరి. అయినా ఎక్కువ భాషలు నేర్చుకోవడం కూడా మంచిదే. హిందీ వస్తే మేనేజర్ మన వాడు అవుతాడు, తమిళ్ వస్తే టీం అంతా మన వాళ్ళే, తెలుగు వస్తే ఇదిగో ఇలా ఎవ్వరికీ ఉపయోగం లేని బ్లాగులు రాసుకోవాలి. అదేం ఖర్మో, నేను ఏ టీం కి వెళ్లినా హిందీ మేనేజర్, అరవ టీం మెంబెర్స్ ఉంటారు. చక్కగా హాయిగా తెలుగులో మాట్లాడలేని పరిస్థితి ఆఫీస్ లో. ఇదేమైనా జాతక ప్రభావమో ఏమో తెలీదు. దీనికి ఉంగరాలో, రంగు రాళ్ళో, గులక రాళ్ళో, జాతకం చెప్పే పంతుల్లో, గుళ్లో దేవుళ్ళో, మీలో ఒకళ్ళో నాకు పరిష్కారం చూపెడతారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. 

పి. వి నరసింహారావు గారు అప్పుడెప్పుడో ప్రధాన మంత్రి గా ఉన్నారని తెలుసు. చిన్నప్పుడు ప్రధాన మంత్రి కి, ముఖ్య మంత్రికి తేడా తెలీక పరీక్షలో ఏ క్వశ్చన్ వచ్చినా 'N.T. రామారావు' అని రాసేవాడిని. టి.వి లో వార్తలు చూడరా ఇలాంటివి తెలుస్తాయి అని మా నాన్న యెంత తిట్టినా దులిపేసుకొని ఆడుకోవడానికి వీధిలోకి పరిగెత్తేవాడినే కానీ ఈ నాటికీ ఏ రోజూ వార్తలు విన్నది గానీ చూసింది గానీ లేదు అందుకే నా జ్ఞానం ఇట్టా ఏడ్చిందని తెలుసు కానీ ఈ జన్మకింతే అని సరి పెట్టుకోవడమే.  ఇక గవర్నర్, రాష్ట్రపతి గురించి అయితే అస్సలు అర్థం అయ్యేది కాదు, వాళ్ళేం చేస్తారో అస్సలు తెలిసేది కాదు, మరి ఇప్పుడు తెలుసా? అని అడక్కండి అది అప్రస్తుతం. ఎందుకంటే మనం ఇక్కడ పి. వి నరసింహారావు గురించి మాట్లాడుకుంటున్నాం. 

ఆయన పేరులో ఉండే 'నరసింహా' అనేది బాగా కామన్ నేమ్. మా క్లాస్ లోనే కాదు , చుట్టుపక్కల ఉండే ఇళ్లలోనూ ఆ పేరుతో పది మంది దాకా ఉండేవారు. నరసింహ మూర్తి అని ఒక కుర్రాడు ఉండేవాడు మా కాలేజీ లో. ఎప్పుడూ అమ్మాయిలకి లైన్ వేస్తుండే వాడు అందుకని మర మూర్తి అని పిలిచేవాళ్ళం. 

మనుషుల పేర్లే కాదు, ఈ 'నరసింహా' పేరుతో సినిమాలు కూడా చాలా వచ్చినట్లు ఉన్నాయి. 

నరసింహా 
నరసింహానాయుడు 
నర్సింహుడు 
లక్ష్మీ నరసింహా 
సైరా నరసింహా రెడ్డి 

పైన నేను పేర్కొన్న సినిమాల్లో ఒక సినిమా పేరు తుపాకీ కాల్పులు గుర్తుకు తెప్పిస్తే, మరోటి హుస్సేన్ సాగర్ లో దూకిన నిర్మాతని గుర్తుకు తెస్తుంది, అవేంటో మీరే కనుక్కోండి.  కాకపోతే మన టాపిక్ అది కాదు కాబట్టి అంతటితో వదిలేద్దాం. 

మొత్తానికి నే చెప్పొచ్చేది ఏమిటంటే ....  పి.వి నరసింహారావు గారు మన మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలుగోడు అయి ఉండి కూడా ప్రధాని అయ్యాడు అని అప్పట్లో గొప్పగా చెప్పేవారు అని. 

భవిష్యత్తులో మళ్ళీ ఏ తెలుగోడు అయినా ఆ సీట్ లో కూర్చోగలడో లేడో చూడాలి. ఇప్పట్లో అయితే ఆ సూచనలు ఏమీ కానరావట్లేదు. 

చిన్నప్పుడు బళ్ళో ఒకడికి 'ఆవు - గడ్డి' మాత్రమే తెలుసు. ఇందిరా గాంధీ గురించి చెప్పమంటే, ఆవిడ ఉండే బంగాళా బాగా పెద్దది, బంగాళా బయట లాన్ లో గడ్డి ఏపుగా ఉంటుంది. ఆవులకు గడ్డి అంటే ఇష్టం ఇలాంటి ఏపుగా పెరిగిన పచ్చి/పచ్చ గడ్డి అంటే మరీ ఇష్టం అని ప్రతీ దానికి తనకు తెలిసిన ఆవు - గడ్డి కాన్సెప్ట్ తో లింక్ చేస్తుంటాడు. 

ఆవు - గడ్డి కథ కు నా ఈ బ్లాగ్ పోస్ట్ కి అస్సలు సంబంధం లేదు, ఉందనిపిస్తే అది మీ భ్రమ అని నా మనవి. 

18, జూన్ 2020, గురువారం

అతుకుల బొంత

ఇక్కడ స్కూల్స్, ఆఫీసులు తెరుచుకున్నాయి కరోనా కాస్త తగ్గడంతో. మాల్స్ లో, హోటల్స్ లో సోషల్ డిస్టెన్సిన్గ్ ఫాలో అవుతున్నాము అనే భ్రమతో అందరూ తెగ తిరుగుతున్నారు, తింటున్నారు.

పోయిన వారం ఒక రోజు ఉద్యోగ రీత్యా క్లయింట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడో వ్యక్తి ని చూశాను. అతను కొరియనో, చైనీనో (చైనా వ్యక్తి అని నా ఉద్దేశ్యం) అయి ఉంటాడు అనిపించింది పేస్ చూస్తే. అతనితో మాట్లాడింది ఏమి లేదు కానీ నేను కూర్చున్న ప్లేస్ కి కాస్త దూరంలో కూర్చొని ఉండటం వల్ల పలు సార్లు చూడటం జరిగింది. 

ఆ తర్వాత కాసేపటికి క్లయింట్ మీటింగ్లో 55 ఏళ్ల పెద్దావిడను కలిశాను. మన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తే, ఎప్పుడో పాతికేళ్ళ క్రితమే వచ్చి ఇక్కడ సెటిల్ అయిందట. 

నా కొరియన్ కొలీగ్ తో కలిసి ఈ వారం మరో క్లయింట్ ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ, పోయిన వారం క్లయింట్ ఆఫీస్ లో చూసిన వ్యక్తి పోలికలతో ఉన్న మరో వ్యక్తిని చూశాను. కాకపోతే ఈ కొరియన్స్, చైనీస్ అందరూ ఒకేలా అనిపిస్తారు అంతెందుకు నాతో పాటు వచ్చిన నా కొలీగ్ కూడా అలానే అనిపిస్తాడు నాకు కాబట్టి, అతను ఇతను ఒకరే కాదులే అనుకున్నా. ఆ తర్వాత లంచ్ టైం లో అతన్ని కలిసినప్పుడు పలకరిస్తే విషయం తెలిసింది అతను ఇతనే అని. ఈ వారం లోనే ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడు అని. (నేను అక్కడ కన్ఫ్యూజ్ అయినట్లే మీరు కూడా ఈ పేరా అర్థం చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అయి ఉంటారనుకుంటా)

అక్కడ కిచెన్ లో ఫ్రిడ్జ్ పై అతికించిన నోట్ ఒకటి ఆశ్ఛర్య పరిచింది. 'దయచేసి ఇంకొకరి ఫుడ్ తినకండి' అని. కరోనా హెచ్చరికేమో 'ఒకరి ఫుడ్ మరొకరు షేర్ చేసుకొని తినకండి అని' చెప్పడానికి కాబోలు అనుకున్నా. కానీ, గతంలో ఎవరో కొందరు కక్కుర్తి వ్యక్తులు ఇంకొకరి ఫుడ్ ఖాళీ చేశారట, అప్పటి నుంచి ఆ స్టికర్ అతికించారట. ఏ దేశమేగినా కక్కుర్తి వ్యక్తులకు కొదవ లేదన్నమాట. గతంలో నేను ఇండియాలో H.P కంపనీ లో పనిచేసేప్పుడు లంచ్ బాక్సులు ఉంచుకోవడానికి అప్పట్లోనే మాకు ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు.  ఒక రోజు మధ్యాహ్నం లంచ్ కి వెళ్ళి చూస్తే నా బాక్స్ లోని చికెన్ ఫ్రై ఖాళీ చేశారు ఎవరో.  ఇంకోసారి నా కొలీగ్ కి ఇలాగే జరిగింది. ఆ తర్వాత పప్పు, సాంబార్ లాంటివి తప్పితే స్పెషల్ లంచ్ బాక్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేవాడిని కాదు.  

గతంలోంచి ప్రస్తుతానికి వస్తే, ఆ రోజు లంచ్ తర్వాత క్లయింట్ మీటింగ్ ఒకటి జరిగింది. అందులో మన తెలుగమ్మాయి కూడా ఉంది. మీటింగ్ తర్వాత మాట్లాడుతుంటే తెలిసింది, పోయిన వారం నేను కలిసిన ఆ పెద్దావిడ కూతురే ఈ అమ్మాయి అని.

ఇలా ఒక్క వారం లోనే రెండు యాదృచ్ఛిక ఘటనలు జరిగాయి. ప్రపంచం చాలా చిన్నది అంటారు కదా ఇక దాంతో పోలిస్తే సిడ్నీ యెంత అని అనిపించింది అప్పుడు. 

ఇంకో విషయం ఏమిటంటే అదే ఆఫీస్ లో ఇద్దరు ఇండియన్ అమ్మాయిలు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య నా కొరియన్ కొలీగ్ కి కన్ఫ్యూషన్ఏర్పడింది. ఇందాకే కదా ఆ అమ్మాయి లంచ్ చేస్తూ ఉండేది, ఇప్పుడిలా ఇక్కడ మీటింగ్ రూమ్ లో ఎలా ఉంది అన్నాడు. 

'మన ఊరి నుంచి వాళ్ళ ఊరికి యెంత దూరమే, వాళ్ళ ఊరి నుంచి మనూరికి అంతే దూరం కదా' అనే విషయం గుర్తొచ్చింది. మనం కొరియాన్స్ ను గుర్తు పట్టడం లోనే కాదు, మన ఇండియన్స్ ని గుర్తు పట్టడంలో వారికీ ఇదే కన్ఫ్యూషన్ ఉంటుందని. ఇలాంటి కన్ఫ్యూషనే నాకు  చిన్నప్పుడు పల్లెల్లో జీవాల విషయంలో ఉండేది. చూడ్డానికి అన్ని గొర్రెలు, ఆవులు, కోళ్లు, మేకలు ఒకేలా ఉండేవి కానీ పల్లెలో వారు గుర్తు పట్టేవారు, నాకు మాత్రం అన్నీ ఒకేలా అనిపించేవి. 

ఒక్క టాపిక్ మీద బ్లాగ్ పోస్ట్ రాయకుండా పుల్లగూరలా అన్ని విషయాలు కలగాపులగం చేసావు ఏంటీ 'అతుకుల బొంత చదవాల్సిన ఖర్మ మాకు' అని అంటారా?

నిన్న నాకూ  అదే అనిపించింది 'యెంత మంచి వాడవురా' సినిమా చూసినప్పుడు. అదేంటో ఆ సినిమాలో సీరియల్ లోని ఎపిసోడ్స్ లాగా ఒక స్టోరీ మొదలవుతుంది కాసేపటికి అది ముగిసి మరోటి మొదలై అదీ ముగుస్తుంది. సినిమా అంతా ఇంతే. అదేదో భాషలోని సినిమాని మనోళ్లు ఎత్తుకొచ్చి తెలుగీకరించినట్లు ఉన్నారు అన్ని మసాలాలు కలిపేసి.

రాజీవ్ కనకాల విలన్ పాత్ర చేశాడు ఈ సినిమాలో. అతను హీరో ఇంటికి వెళ్లి బెదిరించినప్పుడు పూర్తి గడ్డం తో ఉంటాడు. ఆ తర్వాత మరో గంటకే హీరో వెళ్ళి రాజీవ్ కనకాలను బెదిర గొట్టినప్పుడు కొంచం గడ్డంతో ఉంటాడు, సరేలే ఈ గంటలో కాస్త గడ్డం ట్రిమ్ చేసుకున్నాడేమో అని సరిపెట్టుకుందామనుకుంటే వార్నింగ్ సీన్ ముగిసి ఫైట్ సీన్  మొదలయ్యేసరికి మళ్ళీ బాగా పెరిగిన గడ్డంతో ఉంటాడు. కంటిన్యూటీ బాగా  మిస్ అయినట్లు ఉంది ఆ సీన్స్ లో. 

సినిమా అంతా ఏదో సీరియల్ లాగా 10 ఎపిసోడ్స్ ఉన్నట్లు ఉంటుంది.  కథ అంతా ముక్కలు ముక్కలు గా ఉంటుంది. కాస్తో కూస్తో ఉన్నంతలో తనికెళ్ళ భరణి ఎపిసోడ్ మాత్రమే బాగుంటుంది. ఇక శరత్ బాబు, సుహాసిని ఉండే ఎపిసోడ్ అయితే మాత్రం సీరియల్ కంటే దారుణంగా హింసిస్తుంది.

హీరోయిన్ కి హీరో ని ప్రేమించడం తప్ప వేరే జీవితాశయాలు లాంటివి తెలుగు సినిమాల్లో ఉండవు కాబట్టి, ఈ సినిమాలోనూ చిన్నప్పటి నుంచి హీరో ని తెగ ప్రేమిస్తూ ఉంటుంది.

సరేలే, అంత ఖర్చు పెట్టి తీసిన సినిమానే అలా తీయగా లేనిది నేను ఈ పోస్ట్ ఇలా అతుకుల బొంతగా రాస్తే పోయేదేముంది అని రాసేశా. అదీ సంగతి, చిత్తగించగలరని మనవి.

అన్నట్లు, హీరో హీరోయిన్స్ పేరు చెప్పనే లేదు కదూ పైన మెన్షన్ చేసిన సినిమాలో.  హీరో ఏమో నందమూరి నట వారసుల్లో ఒకడు, హీరోయిన్ ఒక తెల్లతోలు పిల్ల.  ('తిరుమల వెళ్లి 'గుండాయన నా మొగుడు, కనపడటం లేదు మీరు ఎవరైనా చూసారా?' అనేది మీకు గుర్తొస్తే నాకు సంబంధం లేదు)

11, జూన్ 2020, గురువారం

ఎవరక్కడ? తక్షణమే..

ఎందుకో తెలీదు కానీ చిన్నప్పటి నుంచి బాలు గారి పాటలు విన్నందుకో ఏమో ఆయన పాటలంటే బాగా పిచ్చి. దానికి తోడు ఇళయరాజా గారి మ్యూజిక్ కూడా ఆ పాటలు వినడానికి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చేది. అప్పుడపుడు పాటల్లో ఆయన పాడే విధానం కాస్త అతి అనిపించేది కానీ తన గొంతు బాగా నచ్చేది. 

ఇక నాగూర్ బాబు (మనో) అప్పుడప్పుడు పాడేవారు కానీ ఇతనిది బాలు గారికి కాపీ గొంతులా ఉండటం వల్లనేమో అంత నచ్చేది కాదు. 

ఇక మోహన్ బాబు ఎక్కువగా జేసుదాసు గారితో పాటలు పాడించుకునే వారు. ఆయన గొంతు కూడా నచ్చేది. అంతులేని కథ లోని 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి' ఇప్పటికీ ఎప్పటికీ నచ్చే పాట.

మధ్యలో కృష్ణ ఏదో ఒక సింగర్ ని తెచ్చినట్లు ఉన్నాడు బాలు గారికి పోటీగా, కానీ అతను క్లిక్ అయిన దాఖలాలు లేవు. 

ఇక ఇళయరాజా గారి మ్యూజిక్ వరకూ నాకు నచ్చుతుంది కానీ ఆయన పాడితే నచ్చేది కాదు. కాకపోతే ఆ తర్వాత తరం సంగీత దర్శకులంతా వారే పాడటం మొదలెట్టారు. 

నాకు తెలిసి A.R రెహ్మాన్ తో ఈ ట్రెండ్ బాగా ఊపు అందుకుందనుకుంటాను. ఆ తర్వాత చక్రి, R.P పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వారు తెలుగు పాటలను పాడి ఇంకొంచం భ్రష్టు పట్టించారు. 

ఇక తరం మారే కొద్దీ చాలా మంది గాయకులు వచ్చారు కానీ, ఎవరూ పెద్ద క్లిక్ అవ్వలేదు. మధ్యలో ఉదిత్ నారాయణ అనే హిందీ సింగర్ వచ్చి పాటలు పాడటంతోటే తెలుగు పాటల పతనం పూర్తిగా మొదలైంది అని నా ఫీలింగ్. మన బాలు కూడా అక్కడ హిందీ సినిమాల్లో పాడినప్పుడు వారికి కూడా ఇదే ఫీలింగ్ వచ్చి ఉండచ్చు అనుకుంటాను. అప్పట్లో 'నా మది నిన్ను పిలిచింది' అంటూ హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ గారు 'ఆరాధన' సినిమా లో పాడినప్పుడు ఎందుకు ఈయన ఏదో పట్టి పట్టి పాడుతున్నాడు పాటను ముక్కలు ముక్కలు విడగొట్టినట్లు అనుకునే వాడిని. మరి ఆ పాట అలాగే పాడాలని పెట్టారో ఏమో తెలీదు, ఆ సినిమా కూడా చూళ్ళేదు ఎప్పుడూ. 

హిందీలో సోను నిగమ్ పాటలు బాగా నచ్చేవి. 'ముంగారు మలే' అనే కన్నడ సినిమాలోని హిట్ సాంగ్ తో నిర్మాతలు అతనితో పాడించుకోవడం కోసం క్యూ కట్టారు.  ఆ దెబ్బకు అతను బెంగుళూరు లో పదెకరాలలో ఒక పెద్ద బంగాళా కొనేసి ఉంటాడని నా ఫీలింగ్.  

ఇక లేటెస్ట్ గా అందరూ సిద్ శ్రీరామ్ వెంట పడ్డారు, నాకెందుకో అతని కంటే రైల్లో అడుక్కుంటూ పాడేవాళ్ళ గొంతే బాగుంటుంది అని అనిపిస్తుంది అతను తెలుగు పాటను ఖూనీ చేసి పాడే విధానం చూస్తే. 

ఇక వీరందరికి పెద్దన్న లాంటి ఘంటశాల గారి పాటలు వింటుంటే హాయిగా ఉంటుంది. కాకపోతే ఆయన పాటలో ఏదో తేడా ఉంటుంది అని అనిపించేది నాకు చిన్నప్పటినుంచి. అదేమిటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అనేది మాత్రం అంతు చిక్కేది కాదు. 

నేను M.C.A చదివే రోజుల్లో దాని అంతు చిక్కింది మా శీను భయ్యా వల్ల. ఏముంది? నోట్లో తాంబూలం వేసుకొని పాడినట్లు ఉంటుంది అన్నాడు, అర్రే అవును కాదా అని నాకూ అనిపించింది. 

ఘంటశాల అభిమానులకు క్షమాపణలు, ఇలా అన్నందుకు.  జస్ట్ సరదాకే. 

అంత గొప్ప గాయకుడు అయిన ఘంటశాల గారి ఎన్నో పాటల్లో, ముఖ్యమైనది, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేది 'శివ శంకరీ' పాట. అలాంటి పాటను పాడి, బాలయ్య బాబు పుట్టిన రోజు కానుకగా అభిమానులకు అంకితం చేసినట్లు ఉన్నాడు. సరేలే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాలు చేస్తున్నాడు అని మెచ్చుకోవచ్చు కానీ ఈ పాట కాకుండా ఏదైనా సింపుల్ గా ఉండే పాట అయి ఉంటే బాగుండేదేమో. అయినా ఈ విషయం విన్నందుకే నాకు మతి పోతోంది. ఇక ఆ పాట విని ఉంటే? 

ఎవరక్కడ, తక్షణమే థాయిలాండ్ ప్రధాని కె. ఏ. పాల్ తో నా మీటింగ్ ని ఊహాన్ లో ఏర్పాటు చేయండి, దానికి న్యూజిలాండ్ రాష్ట్రపతి నాగబాబుని, లాస్ ఏంజిల్స్ మేయర్ నిత్యానందని  కూడా ఆహ్వానించండి. గబ్బిలాల అప్పడాలను, బొద్దింకల బోండాలను స్నాక్స్ గా తయారుచేసి ఉంచండి. 

అమ్మో! వద్దులే ఆ ఊహే భయంకరంగా ఉంది. కాకపోతే చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు, లోకేష్ బాబు పాడనందుకు బతికిపోయాం బాలయ్య బాబు బదులు. కానీ లోకేష్ బాబు కూడా పాడితే, అప్పుడు బాలయ్య బాబు బాగా పాడారు అనే ఫీలింగ్ వచ్చేది చిన్న గీత పక్కన పెద్ద గీత లాగా. 

9, జూన్ 2020, మంగళవారం

లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా??


లాభయ్య బాబు, విరంజీవి అనే ఇద్దరు పేద్ద నటులు ఒక చోట సమావేశమయ్యారు.  గత కొద్ధి రోజులుగా వీరిద్దరి మధ్య వైరం రకోనా కన్నా వేగంగా పెరుగుతోందని అన్ని సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలు విని కరోనా వైరస్ లాగా దీన్ని కూడా తుంచేయాలని వారిద్దరూ నడుం వాల్చారు. 

ఇప్పటికిప్పుడు ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని లోకానికి ఎలుగెత్తి చాటాలని నిర్ణయించుకున్నారు. 

నేను నిన్నే అరవై క్రాస్ చేశాను మహా అయితే ఇంకో అరవయ్యేళ్లు (నిజ్జంగా నిజం లాభయ్య బాబే అలా అన్నారట ఒక ఇంటర్వ్యూ లోమాత్రమే హీరోగా నటించగలను అనిపిస్తోంది

నేను కూడా  మధ్యే 65 కి దగ్గరయ్యా, నా స్టార్ డం (??)  తో బాక్స్ ఆఫీస్ ని ఇంకో పాతికేళ్ళు  మాత్రమే గడగడ లాడించగలనుకాబట్టి మనం ఎన్ని సినిమాలు చేస్తే కళామతల్లికి అంత సేవ చేసినట్లు

మౌళిరాజా ను పెట్టుకుందామా మన సినిమా తీయడానికి?

మనం కాదు, ఆయనకి ఇప్పుడున్న ఫేమ్ కి మనం ఆయన్ని పెట్టుకునే సీన్ లేదు, ఆయనకి అనిపిస్తేనే మనల్ని పెట్టుకుంటాడు. 

మా బ్లడ్డు, బ్రీడ్ అలాగే మేము తినే బ్రెడ్డు మా రేంజ్ వేరు, అలాంటిది మాకు అంట సీన్ లేదంటావా?

అయినా ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాని పూర్తి చేయడానికే సంవత్సరం పడుతుంది, మనకు కుదరదు. 

మరి వితిక్రమ్ ని ట్రై చేద్దామా?

అతనూ అంతే, మరి నీతో మాంచి హిట్స్ తీసిన బోయటపా?

పెద్ద పెద్ద ఫైటింగ్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తాడు, ఈ కరోనా టైములో అవి షూట్ చేయడానికి టైం పడుతుంది. వినాషక్ ని ట్రై చేద్దామా?

వినాషక్ మన లాంటి ముదురు హీరోలను చూసి ఇన్స్పైర్ అయి ఈ వయసులో కూడా యాక్షన్ హీరో అవ్వాలనుకొని ఒక సినిమాలో హీరో గా చేస్తూ బిజీ గా ఉన్నాడు కాబట్టి వీలుపడదు. 

కరోనాకాలం లో కూడా సినిమా చుట్టేసిన నిర్జీవి మాత్రమే ఇప్పటికిప్పుడు సినిమా తీయగలడు అని ఆయన్ని వెళ్లి కలిశారు. 

మీ ఇద్దరినీ కలిపి సినిమా తీయాలంటే నా లాంటి వాడే సరైన వ్యక్తి. సైరా, శాతకర్ణి కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసినట్లు ఒక కాల్పనిక కథ రాసుకుందాం రెండు సినిమాల్లోని కొన్ని సీన్స్ తీసుకొని నా స్టైల్ ఎడిటింగ్ టచ్ ఇస్తాను. మిగతాది నేను కొంత తీసి అతికిస్తాను. అలాగే వాళ్ళిద్దరిని ఇన్స్పైర్ చేసే నార్త్ ఇండియన్ క్యారెక్టర్ లో మియతాబ్ ని తీసుకుందాం. తనకి నేను యెంత చెప్తే అంత, నా మాట వింటాడు

మా బుడ్డోడు, రచణ్, విజయ్ గదేవన్ కలిసి నటిస్తున్న RRR సినిమా స్టోరీ లా అనిపిస్తోంది నువ్వు చెప్తున్న కథ వింటుంటే

మరీ మంచిది, బాగా కాంట్రవర్సీ అవుతుంది, నాకు, నా సినిమాకి అదే పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది, నాక్కావలసింది కూడా కాంట్రావర్సీనే. మన కథకు RRR అని కాకుండా SSS ( సైరా శాతకర్ణి సమరం) అని పెట్టుకుందాం. ఇక కథ ప్రకారం హీరోయిన్ గా లాభయ్య బాబు పక్కన ఒక ఫారిన్ పిల్లని తీసుకోవాలి కాబట్టి 'యమా పాలకోవా' ని తీసుకుందాం, మొన్న నా S.G.T , నిన్న నా ఐమాక్స్ సినిమాలో భలే నటించింది

కానీ కోక, రైక అని నా మార్క్ పాట ఒకటి ఉండాలి

యమా పాలకోవా కి అలాంటి పాట సెట్ అవదు, నేను ఇంకో పాట రాసి సెట్ చేస్తా

సరే పాట ఇప్పుడు బాగా పాపులర్ అయినా దిస్ శ్రీశ్యామ్  తో పాడిద్దాం

అవన్నీ అవసరం లేదు, నేను బాగా పాడగలను మొన్నీ మధ్యే రకోనా సైరస్ మీద ఒక పాట పాడా, అది బాగా పాపులర్ అయింది.  

సరే లాభయ్య బాబు పక్కన యమా పాలకోవా ని తీసుకుంటున్నారు కాబట్టి నా పక్కన మన దేవిశ్రీ కూతురు నాజ్వి ని తీసుకోండి, మా జోడి చూడ్డానికి బాగుంటుంది

విషయం నాకొదిలేయ్, గజలోక వీరుడు మతిలేని సుందరి సినిమాలో ఒక రెండు పాటలు తీసుకుని ఎడిటింగ్ చేసి దేవిశ్రీ బదులు దేవిశ్రీ కూతురు డాన్స్ చేసినట్లు ఎడిటింగ్ చేయిద్దాం. ఇలా త్వరగా సినిమా చుట్టేస్తే లాక్ డౌన్ తర్వాత థియేటర్ లో విడుదల అవుతున్న మొదటి సినిమా మనదే అవుతుంది

అదీ ఈ రోజుకి నాకు తట్టిన తలా తిక్క ఆలోచన నిన్న నిర్జీవి ఇంటర్వ్యూ చూసాక. మరి అలాంటి సినిమా నిజంగానే వస్తే నరసింహనాయుడు + ఇంద్ర అంత హిట్ అవుతుందో లేక ఒక్క మగాడు + మృగరాజు అంత ఫట్టు మంటుందో చూడాలి.  

2, ఏప్రిల్ 2020, గురువారం

ఈ సినిమా వాళ్ళు ఇంతే

ఈ సినిమా వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా వేలల్లో దానం చేయడానికి కూడా ఛస్తుంటారు. అందుకే వారి తీరును ఉతికి ఆరేసి ఎండగడతా ఈ రోజు పోస్టులో. 

నేను కడప లో చదివేప్పుడు అనుకుంటా చిరంజీవి ఏమో Thumbs Up అని, పవన్ కళ్యాణ్ ఏమో పెప్సీ అని ప్రమోట్ చేసి వాళ్ళ జేబులు నింపుకుంటే ఆ ఇద్దరి ఫాన్స్ చొక్కా జేబులు చించుకుని మరీ కొట్టుకున్నారు.  అదేదో థియేటర్ లోనే కొట్టుకు చచ్చారు కూడా. 

ఇక ఫెయిర్ అండ్ లవ్లీ, సంతూర్, లక్స్ మోసాలు చెప్పాల్సిన అవసరం లేదు, తరతరాలుగా తారలను పోషిస్తూ మధ్య తరగతి కుటుంబీకుల నడ్డి విరిచేస్తున్నాయి. 

మహేష్ బాబు మాత్రం ఎన్ని కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడరో ఎవరికీ తెలీదు. Thumbs Up లాంటివి మంచిది కాదు అని తెలిసీ ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటారు, అదే సినిమాలో అయితే ప్రజల తరపున పోరాడతారు, అంతా డబ్బు మాయ. ఆయనకున్న కోట్లల్లో మరీ కోటి రూపాయలు COVID విరాళం ఏమిటండీ మరీ చోద్యం కాకపొతే. శ్రీమంతుడు సినిమాలోనేమో ఆస్తి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు ప్రజల కోసం.  ఈ సినిమా హీరోలంతా ఇంతేనండీ.   చెప్పేది శ్రీ రంగ నీతులు, దూరేది *** . 

అందరి మీద కంటే మహేష్ బాబు మీద కూసింత విషం ఎక్కువే కక్కేసినట్లున్నాను. ఎంతైనా అసూయ అతనంటే,  అందగాడు, పైగా మూణ్ణెల్లకోపాలి పెళ్ళాం పిల్లల్ని సంకలో ఎత్తేసుకొని పారిన్ టూర్లన్నీ తిప్పేస్తుంటాడు. అందుకే అందరు భార్యలు మహేష్ బాబు లాంటి మొగుడు కావాలి అంటారు. అయినా మా లాంటి నెలసరి జీతగాళ్ళ వల్ల అవుతుందా ఇలా తిప్పాలంటే? 

సరే లారెన్స్ లాంటి వాళ్ళు అంతో ఇంతో చేతనైన సాయం చేస్తుంటారు అనుకోండి పేదల కోసం అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సినిమా రంగంలో. 

ఇక మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం తానా, తందానా అంటూ U.S వెళ్ళి తైతక్కలాడతారు అక్కడ మనోళ్ల నెత్తి మీద చెయ్యెయ్యడానికి. ఏం కోట్లకు కోట్లు పెట్టి ఇళ్ళు, కారవాన్ లు కట్టుకుంటారు కానీ వాళ్ళ సొంత డబ్బుల్తో అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి మాత్రం వీళ్లకు మనసొప్పదు. 

ఇక పొలిటీషియన్స్ గురించి నన్నడకండి, నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది, నేనసలే శానా ఈక్ పాలిటిక్స్ లో.

నేనిక్కడ ఇంత సీరియస్ గా ఈ సినిమా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎండగడుతుంటే ఎవరో మా ఇంటి డోర్ కొడుతున్నారు. చూసేసి వస్తా. 

ఎవరు కావాలి? మీరు

మెర్రీ

మెర్రీ క్రిస్మస్?

నో, మెర్రీ ఈస్టర్

Ok merry, చెప్పండి

COVID మీద పోరాటానికి విరాళాలు సేకరిస్తున్నాం. 

విరాళమా?

వందలు ఏమి అవసరం లేదు సర్, మీ వంతుగా కనీసం ఒక రెండు డాలర్లు ఇచ్చినా చాలు సర్. 

Change లేదు

Card ఇచ్చినా ok

కార్డు కాకెత్తు కెళ్ళింది

Sorry

Card తీసుకొని మా ఆవిడ ఇందాకే షాపింగ్ వెళ్ళింది


ఈ క్రైసిస్ లోనా?

అవును, అది వారి జన్మ హక్కు అడగడానికి ఎవరికీ ధైర్యం లేదు.  

మరి ఇంట్లో ఉన్న ఆవిడ ?

మా బామ్మ  

బాగా యంగ్ గా ఉన్నారు, నమ్మకం కలగడం లేదు

బాల్య వివాహం 


ఓహ్ అలాగా పాపం , మరి COVID బాధితులకు మీ వంతు సాయం ....

నా వంతు సాయం అంటే ఒక చిన్న జోక్ గుర్తొస్తోంది, చెబుతా విను. 

నాకు టైమ్ లేదు సర్ 

టైమ్ అంటే మరో పెద్ద జోక్ గుర్తొస్తోంది. 

వద్దులేండి  సర్,ఆ చిన్న జోకే చెప్పెయ్యండి వింటాను. 

నీలాంటి ఒక వ్యక్తి నాలాంటి పెద్ద మనిషి దగ్గరికి వచ్చి 'మేష్టారు, వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఉచితంగా సేవ చేద్దామనుకుంటున్నాను, మీ వంతు సాయం చేస్తే బాగుంటుంది' అని అడిగాట్ట. 

అప్పుడు దానిదేముంది, మా అమ్మా, నాన్నను మీ వృద్ధాశ్రమానికి పంపిస్తాను లెండి అన్నాడట ఆ పెద్దమనిషి. 

ఇప్పుడు నీకు ఆ జోక్ ఎందుకు చెప్పానో అర్థమైందా?

అర్థమయింది. వెళ్ళొస్తాను సారీ వెళ్తాను సర్. 

ఆ ఏం చెప్పుకుంటున్నాం, ఈ సినిమా వోళ్ళు అంతా ఇంతే, ఒక్క లక్ష విదిల్చడానికి కూడా చస్తారు కోట్లు పెట్టుకొని ఏం మనుషులో ఏమో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఈ ప్రపంచాన్ని బాగు చేయడం ఈ కరోనా వల్ల కూడా కాదు.