10, నవంబర్ 2021, బుధవారం

టికెట్ ఎలా రాదో నేనూ చూస్తా

జ్యోతిష్య స్టార్ గా పేరొందిన ఏకాంబరాన్ని, ఏడుకొండలు  తన ఇంటికి ఆహ్వానించాడు. 

"రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా నేను గెలుస్తానంటారా?" అడిగాడు ఏడుకొండలు . 

ఆ జ్యోతిష్కుడు అతని కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు అన్నీ క్షుణ్ణముగా పరిశీలించి 'చాన్స్ లేదన్నాడు' 

"అంటే, ఓడిపోతానంటారా?" వణికే పెదవులతో 

గెలవడం, ఓడటం కాదు అసలు మీరు ఎన్నికల్లో నిలబడితే కదా?

అదెలా సాధ్యం?

ఎందుకంటే ఎన్నికల్లో నిలబడటానికి మీకు టికెట్ ఇవ్వరు కాబట్టి 

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ముత్తాత, తాత, తండ్రి మొదలుకొని మా కుటుంబానికే టికెట్ ఇస్తూ వస్తున్నారు, అంతేకాదు జ్యోతిష్యలెజెండ్ గా పేరొందిన మీ  నాన్న కనకాంబరం గారు ఇంకో వందేళ్ళ వరకు ఆ టికెట్ మా ఫామిలీ కే వస్తుందని ఘంటాపదంగా చెప్పారు. 

కావచ్చు కానీ .. ఇప్పటి మీ ఇంటి వాస్తు బాగోలేదు.  

మరి పరిష్కారం

కొన్ని పూజలు జరిపించాలి, పైకం పంపండి. మీ ఇంట్లో ఈశాన్యం మూలలో బరువు ఎక్కువుంది 

అవును స్వామి అటు వైపు పూల కుండీలు పెట్టాము అందుకే అటు వైపు బరువెక్కువైనట్లు ఉంది.  

వాటిని తీసి మేడ మీద పెట్టించండి. 

అలా మారిస్తే టికెట్ ఖచ్చితంగా నాకొస్తుందంటారా?

నా మాటకు తిరుగులేదు, మా నాన్న గారి మాటకు ఎదురులేదు. 

                                                         *****************

వారం తిరగక ముందే మేడ మీద పెట్టిన పూల కుండీ ఏడుకొండలు మీద పడి స్వర్గానికి టికెట్ అందుకున్నాడు ఆ  జ్యోతిష్య స్టార్ మాటకు తిరుగులేకుండా. 

పార్టీ టికెట్ మిసెస్ పద్మావతి కి దక్కింది జ్యోతిష్యలెజెండ్  మాటకు ఎదురు లేకుండా. 

7, నవంబర్ 2021, ఆదివారం

డాక్టర్ సీతారాం బినాయ్ - పక్క భాషల సినిమాలు

ఈ వారం రెండు సినిమాలు చూశాను అందులో ఒకటి తమిళ్ మరొకటి కన్నడ. రెంటిలో బాగా నచ్చిన కన్నడ సినిమా గురించి మొదట చెప్పుకుందాం.  

విజయ్ రాఘవేంద్ర నటించిన  'సీతారాం బినాయ్ కేసు నెంబర్ 18' అతని కెరీర్ లో 50 వ సినిమా.  కమర్షియాలిటీ కి బాగా దూరంగా ఉంటుంది కాబట్టి చాలా మందికి నచ్చకపోవచ్చు. ఇతని తమ్ముడు శ్రీ మురళి నటించిన 'ఉగ్రం' సినిమా డైరెక్టరే ప్రశాంత్ నీల్,  కర్ణాటక లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తర్వాత వచ్చిన KGF హిట్ తో కర్ణాటక బయట కూడా అతని పేరు మార్మోగి పోయింది. ఈ విజయ్ రాఘవేంద్ర, శ్రీ మురళి ల మేనత్తే స్వర్గీయ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ. నెపోటిజం అన్నది ఏ భాషా ఇండస్ట్రీలో నైనా ఉండేదే తప్పుపట్టడానికి లేదు.  

ఇళ్ళను దోచుకునే దొంగలని పట్టుకునే సినిమాగా మొదలై ఆ తర్వాత సీరియల్ కిల్లర్ ని పట్టుకొనే సినిమా గా మలుపు తిరుగుతుంది.  అక్కడక్కడ నేటివిటీ మూలంగా కాస్త డల్ గా అనిపించినా ఓవరాల్ గా సినిమా బానే మెప్పిస్తుంది. 

ఇక మరో సినిమా తమిళంలో అలాగే తెలుగులో కూడా రిలీజ్ అయిన తమిళ్ సినిమా డాక్టర్/ వరుణ్ డాక్టర్. శివ కార్తికేయన్ హీరో గా నటించిన ఈ సినిమాకి తెలుగులో టైటిల్ దగ్గర సమస్యలేమైనా వచ్చాయేమో అందుకే 'డాక్టర్' టైటిల్ కి ముందు వరుణ్ అని కలిపారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు వద్దన్నా నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాని గుర్తుకు తెప్పిస్తుంది పైగా రెండు సినిమాల్లోనూ అదే హీరోయిన్. 

నాని, శివ కార్తికేయన్ ఇద్దరూ రేడియో / టీవీ లలో ప్రెసెంటర్స్ గా పని చేసిన అనుభవం ఉన్నవారే, సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చారు. 

శివ కార్తికేయన్ టీవీ లో పని చేసేప్పుడు స్నేహ భర్త 'ప్రసన్న' హీరోగా నటించేవాడు సినిమాల్లో. అలా ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా టీవీ లో పని చేసే శివ కార్తికేయన్, ప్రసన్న ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత ప్రసన్న అంతగా క్లిక్ అవ్వలేకపోయాడు కానీ శివ కార్తికేయన్ హీరోగా ప్రమోట్ అయ్యాడు, అదే శివ కార్తికేయన్ ను ఈ ప్రసన్న ఒక టీవీ ఇంటర్వ్యూ లో ఇంటర్వ్యూ చేస్తూ తమ సీట్స్ తారుమారు అయిన విశేషాన్ని చెప్పుకొచ్చాడు. కొన్ని పాత సినిమాల్లో రవితేజ చిన్నా చితక వేషాలు వేశాడు, ఇప్పుడు అదే రవితేజ హీరోగా నటించిన సినిమాలో ఆ పాత సినిమాల్లోని ప్రధాన పాత్రలు వేసిన వాళ్ళు చిన్నా చితక వేషాలు వేస్తున్నారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. 

హీరో శివ కార్తికేయన్ నటించిన ఇతర సినిమాల వల్ల, అలానే ఈ డాక్టర్ సినిమా పోస్టర్ చూసి  ఇదేదో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనుకున్నాను కానీ, సినిమా మొదలైన కాసేపటికే నా అంచనా తప్పని  ఇది డార్క్ కామెడీ అని అర్థమైంది. చాలా సీరియస్ ఇష్యూ ని కామిక్ వే లో చెప్పడమే ఈ డార్క్ కామెడీ కాన్సెప్ట్. 

అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న గ్యాంగ్ నుంచి ఆ అమ్మాయిలని తప్పించడానికి ఒక డాక్టర్ పడ్డ తాపత్రయమే ఈ సినిమా. ఇందులో ప్రతినాయకుడి పాత్రని వాన సినిమాలో హీరో గా నటించిన 'వినయ్ రాయ్' పోషించాడు. ఈ వాన సినిమా కన్నడ సూపర్ హిట్ అయిన 'ముంగారు మలే' కి తెలుగు రీమేక్. అసలు 'ముంగారు మలే' సినిమా హిట్టయ్యింది కథ వల్ల కాదు కేవలం పాటలు అందులో హీరో గా నటించిన గణేష్ ఆకట్టుకునే నటన వల్లనే(ఈ గణేష్ కూడా టీవీ బాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడే)  అసలు 'ముంగారు మలే' కన్నడలో ఎందుకు  హిట్ అయిందో సరిగ్గా అంచనా వేయకుండానే తెలుగులో తీసి బోల్తా పడ్డారు. అంటే M.S రాజు కు ఈ మాత్రం జడ్జిమెంటల్  స్కిల్స్ లేకుండానే అంత పాపులర్ ప్రొడ్యూసర్ అయ్యాడా అంటే నేనేం చెప్పలేను. 'ముంగారు మలే' రిలీజ్ అయినప్పటికి నేను బెంగుళూరు లోనే ఉన్నాను ఒక తెలుగు ప్రేక్షకుడిగా నాకు అందులో పాటలు, గణేష్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ విపరీతంగా నచ్చేశాయి, మరి అలాంటి సినిమాకి మంచి పేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగల హీరో ని పెట్టి తీయాలి గానీ  'వినయ్ రాయ్' లాంటి వాళ్ళు సరి తూగలేరు. నేను ఇంతకు ముందు చెప్పినట్లే కన్నడ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తే 10% మాత్రమే వర్కౌట్ అయ్యాయి ఇంతవరకు. ఆ 90% కోవలోకే వెళ్తుంది ఈ వాన. 

అదేంటి ఎక్కడో మొదలెట్టి ఎక్కడో ముగించాడు అని తిట్టుకోకండి, సినిమాలకి రివ్యూస్ రాయడం కాదు నా పని, జస్ట్ ఆ సినిమాల వెనుక, ఆ సినిమాల్లో నటించిన నటీనటుల వెనుకో ఉండే ఆసక్తికరమైన విశేషాలను పంచుకోవడమే నా ఉద్దేశ్యం. ఉదాహరణకి పైన మాట్లాడుకున్న నటుల్లో నాని, శివ కార్తికేయన్ మరియు గణేష్ టీవీ నేపధ్యం నుంచి వచ్చిన వారే. టాలెంట్ ఉండి కాస్త అదృష్టం కలిసి రావాలి అంతే, ఎవరైనా హీరోలు అయిపోవచ్చు సినిమా ఫీల్డ్ లో. 

4, నవంబర్ 2021, గురువారం

పర్మనంట్ అడ్రస్

మా నాన్నగారు బాంక్ ఉద్యోగి అవడం మూలాన ప్రతీ రెండు మూడేళ్ళకోసారి ఊరు మారాల్సి వచ్చేది. కొన్ని సార్లు సంవత్సరానికోసారి మారాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంవత్సరం పూర్తి కాగానే ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందో ఎప్పుడు బయలుదేరాలో అనేట్టు ఉండేది. అందువల్ల చిన్నప్పుడు స్కూల్లో చదివే రోజుల్లో నుంచి 'పర్మనంట్ అడ్రస్' అనే కాలం కింద ఏం రాయాలి అనే భేతాళ ప్రశ్న ఎదురయ్యేది.  

ఇక కాలేజ్ కి వచ్చాక ఈ  భేతాళ ప్రశ్న తీవ్రత పెరిగిందే కానీ తగ్గలేదు. మీ 'పర్మనంట్ అడ్రస్'  అప్లికేషన్ ఫారం మీద రాసివ్వు నీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ లేదంటే ఫీజ్ కట్టిన రిసీప్ట్స్ లాంటివి మీ ఇంటికి పంపిస్తాం అనేవారు. ఈ సంవత్సరం ఫీజ్ రీయింబర్సుమెంట్ కింద మీ డబ్బులు వాపసు ఇచ్చేస్తాం  మీ పర్మనంట్ అడ్రస్ రాసి వెళ్ళండి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక చెక్ మీ ఇంటికి పంపిస్తాం అన్నారు  డిగ్రీ కాలేజ్ ముగిశాక. 

ఆ ఫీజ్ రీయింబర్సుమెంట్ కింద పంపే చెక్కు విలువ అయిదారు వందల రూపాయల దాకా ఉండేది, అప్పట్లో మా లాంటి మధ్య తరగతి వాళ్లకు అది చాలా  పెద్ద మొత్తమే. 

ఏమోయ్, మొన్న మీ అబ్బాయి బారసాల అని లీవ్ పెట్టుకున్నావు కదా. ఇవాళేమో పెళ్ళికి లోన్ తీసుకుంటున్నావేమిటీ? అడిగాడు ఆశ్ఛర్యపోతూ కొత్తగా వచ్చిన ఆఫీసర్. 

నా పెళ్ళికని లోన్ కోసం రెండేళ్ళ క్రితం అప్లికేషన్ పెట్టుకుంటే అది ఇప్పుడు శాంక్షన్ అయింది సర్ అన్నాడా ఉద్యోగి. 

ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే రెడ్ టేపిజం గురించి మాట్లాడేప్పుడు తరచుగా వినిపించే జోక్ ఇది. సో, ఆ కాలేజ్ వాళ్ళు ఆ చెక్కు పంపే లోపు మేమసలు ఆ అద్దె ఇంట్లో అదే ఊర్లో ఉంటామో లేదో అని భయం, పోనీ పర్మనెంట్ అడ్రస్ ఏదైనా ఇద్దామనుకుంటే అలాంటిదొకటి ఏడ్చి ఛస్తే కదా?

MCA సీట్ అడ్మిషన్  కోసం అనుకుంటా మీ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ జత చేయండి అది లేని పక్షంలో  మీ మండల రెవిన్యూ అధికారితో మీరు ఫలానా చోట ఉంటున్నట్లు సంతకం చేయించుకున్న ఫారం జతపర్చండి అన్నారు. ఆ మండల రెవిన్యూ అధికారి అనే పదార్ధం ఎప్పుడు ఎక్కడుంటుందో తెలీక పడ్డ చిక్కులు అన్నీ ఇన్నీ కావు. 

తిరుపతి లో MCA సీట్ వచ్చాక, కాలేజీ లో డిసెంబర్ 4 వ తేదీ నుంచి క్లాసెస్ మొదలుతాయి ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఉత్తరం ద్వారా తెలియజేస్తాం మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నారు(అప్పట్లో ఫోన్ సౌకర్యాలు అంత అభివృద్ధి చెందలేదు మరి)

ఏ అడ్రస్ ఇచ్చి వెళ్ళాలి? అప్పటికే ఉంటున్న ఊరిలో రెండేళ్ళు దాటడం వల్ల  ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది నాన్నకు. సరే అని చేసేదేమీ లేక అప్పుడు ఉంటున్న అడ్రసే ఇచ్చి వెళ్ళాను. ఆ తర్వాత పది రోజులకే ఆ ఉన్న ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళాము. 

డిసెంబర్ 4 వ తేదీ కాలేజ్ కి వెళ్తే,  వారం రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మీకు ఉత్తరం పంపామే అన్నారు. పంపే ఉంటారు కానీ మేము ఆ ఊరు వదలి వెళ్ళడం వల్ల అది మాకు చేరలేదు. 

ఇక ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ కోసం, పాస్పోర్ట్ అప్లై చేసేప్పుడు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వెళ్ళినపుడు ఇలా చెప్పుకోలేనన్ని సార్లు ఈ పర్మనంట్ అడ్రస్ లేదంటే అడ్రస్ ప్రూఫ్ లాంటిది లేక ఇబ్బంది పడ్డ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. 

ఇక ఆస్ట్రేలియా వచ్చాకా ఆ ఇబ్బంది ఎప్పుడూ ఏర్పడలేదు, మనం అద్దె ఇంట్లో ఉన్నా సరే ఎలక్ట్రిసిటీ బిల్లులు, గ్యాస్ బిల్లులు మన పేరు మీదే పంపించే ఏర్పాటు ఉంటుంది, వాటిని అడ్రస్ ప్రూఫ్స్ గా ఎక్కడైనా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ నచ్చిన మరో విషయం ఏమిటంటే గ్యాస్ అయిపోతోందని మరో సిలండర్ ఆర్డర్ చెయ్యాలి అనే దిగులు లేకపోవడం. వాటర్ కనెక్షన్ లానే గ్యాస్  కనెక్షన్ కూడా ఉంటుంది, వాడుకున్నంత మేర బిల్లులు పంపిస్తుంటారు. ఇండియా లో కూడా ఇలాంటి ఏర్పాటు త్వరలోనే వస్తుంది అని పదేళ్ళ కిందటే విన్నాను కానీ అదెంతవరకు వచ్చిందో తెలీదు మరి. 

గత రెండు నెలలుగా ఏదైనా అప్లికేషన్ నింపుతున్నప్పుడు 'పర్మనంట్ అడ్రస్' అనే కాలం కనపడినప్పుడల్లా నా ఛాతీ రెండించులు వెడల్పవుతోంది. 

నడ్డి మీదకు నలభయ్యేళ్ళు దాటేదాకా ఈ పర్మనంట్ అడ్రస్ అన్నది లేదు ఇప్పటికీ పేరుకు పర్మనంట్ అడ్రస్ అనే కానీ మరో ముప్పయ్యేళ్లు గాడిద చాకిరీ చేస్తే గానీ అది పూర్తిగా నా సొంతమవ్వదు బ్యాంక్ నుండి. 

ఆ పర్మనంట్ అడ్రస్ లో ఇది మా తొలి దీపావళి. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.