మొన్న రాత్రి "మన శంకర వరప్రసాదు గారు" సినిమా చూశా OTT లో, సినిమా గొప్పగా ఏమీ లేదు కానీ టైం పాస్ మూవీ. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో రెండు లేదంటే మూడో స్థానం లో పెట్టచ్చు. ఆఖరి స్థానం దేనికి ఇవ్వచ్చో అందరికీ తెలుసు. మొదటి స్థానం నేనైతే "నారి నారి నడుము మురారి" కి ఇస్తాను, కొందరు "అనగనగా ఒక రాజు" అన్నారు కానీ నాకెందుకో అదంత నచ్చలేదు.
వింటేజ్ చిరంజీవి అదీ ఇదీ అంటున్నారు గానీ ఇదంతా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం లాగానే ఉంది. అలాంటి వేషాలు ఎప్పుడో చూసేశాం మళ్ళీ అవే చూడటమేమిటీ మన ఖర్మ కాకపోతే. సినిమా అంటేనే బిజినెస్ కాబట్టి ఏది అమ్ముడుపోతోందో అదే తయారు చేస్తారు.
ముసలోడికి దసరా పండుగ అన్నట్లుగా ఈ వయసులో ఈ వేషాలు అవసరమా? వయసుకు తగినట్లు అమితాబ్ , రజినీ లాగా చేయచ్చుగా అంటున్నారు గానీ వాళ్ళు మాత్రం చిరంజీవిలా కాస్త కాలు కదిపే శక్తి ఉంటే ఎందుకు వెయ్యరు. ఎవరి ఏడుపేదో వాళ్ళు ఏడుస్తున్నారు ఇష్టమైతే చూడండి లేదంటే దూరంగా ఉండండి.
ఈయన హీరో వేషాలు వెయ్యడం ఆపేస్తే యువకులకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అంటారు గానీ ఇదేమీ ఇండియన్ క్రికెట్ టీమ్ కాదుగా పదకొండు మందే ఆడాలి అనటానికి సీనియర్స్ తప్పుకొని జూనియర్స్ కి అవకాశాలు ఇవ్వాలని.
వెధవ డబ్బు కక్కుర్తి తప్ప మరేమీ లేదు, అంత సంపాదించాడు ఇక ఆపేయచ్చుగా పచ్చి స్వార్థపరుడు ఆయన అంటున్నారు గానీ డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు ఎంతమంది పరుగు ఆపారో చెప్పండి. యెంత చెట్టుకి అంత గాలి, రిటైరైన వాళ్ళు కూడా మనం సంపాదించింది చాల్లే అని ఇంట్లో ఊరికే కూర్చోవడం లేదుగా వారి టాలెంట్ కి తగ్గట్లు వాళ్ళు బిజినెస్ లేదంటే ఇంకో ఉద్యోగమో చేసి మరింత డబ్బు పోగు చేసుకోవడం లేదూ?
చూసేవాళ్ళు లేకపోవబట్టేగా మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి వాళ్ళు ఇంటి పట్టునే కూర్చున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లను అక్కడో ఇక్కడో చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కాస్తో కూస్తో ఎదురు ఈదగలుగుతున్నారు.
ఇప్పట్లో డెబ్భై ఏళ్ళు దాటితే మంచం మీద పడకుండా ఉండి కాస్త అటూ ఇటూ తిరిగితే చాలు అనుకుంటున్న వారిని ఎంత మందిని చూడలేదు అలాంటిది ఈ వయసులో శరీరాన్ని ఆ మాత్రం రిథమిక్ గా కదపగలుగుతున్నారంటే మెచ్చుకోవాల్సిందే. ఆపరేషన్స్ చేయించుకున్నారో, మందులు వాడుతున్నారో తర్వాత విషయం. 45 యేళ్ళకే బద్దకించి సినిమాలో చాలా వరకు డూప్ లను వాడాడు అని చివరి స్థానం లో మిగిలి పోయిన సినిమా గురించి ఎంత మంది విమర్శించారో మర్చిపోతే ఎలా? మొదటి సారి తనని స్క్రీన్ మీద చూసినప్పుడు "హీరో అంటే ఇలా కదా ఉండాలి" అని అనుకున్న నేనే రాజుగారేంటి ఇలా అయ్యారు అనుకున్నా.
నేనూ స్కూల్, కాలేజీ రోజుల్లో చిరంజీవి సినిమా వస్తే ఫాన్స్ షో అని జాబ్ చేయడం మొదలెట్టాక మొదటిరోజు మొదటి అట అని పెళ్ళైన తర్వాత మొదటి వారం చూస్తే చాలని ఆపైన రెండో వారం చూసినా వచ్చే నష్టం లేదని ఇప్పుడైతే నెల తర్వాత OTT లో చూడచ్చులే అని థియేటర్ కి వెళ్లడం మానేశా ఇంకాసిన్ని ఏళ్ళు గడిస్తే చూడకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అని అనుకుంటాం. ఆ ఇంకాసిన్ని ఏళ్ళు గడిచే లోగా ఈ చిరంజీవికి కూడా బేరాలు తగ్గి వేషాలు ఆపెయ్యచ్చు.
థియేటర్ కి వెళ్ళి ఎగబడి చూసే ఎర్రి ఫాన్స్ ఉన్నంతవరకూ తగ్గడంటే తగ్గడంతే ఆయన తాత అయినా ముత్తాత అయినా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి