31, మే 2016, మంగళవారం

వీలయితే నాలుగు కబుర్లు కుదిరితే చిన్నప్పుడు విన్న కథలు

నేనో బ్లాగ్ ఓపెన్ చేసానోచ్ అని నేను నా ఫ్రెండ్స్ కు చెప్దామనుకున్నాను . కానీ మొహమాటం గట్రా లేకుండా  'పని లేని మంగలి వాడు పిలిచి తల గొరిగాడు అన్నట్లు' నువ్వు కూడా ఈ బ్లాగ్స్ అవి రాస్తున్నావా  అని ఎగతాళి చేస్తారేమో అనుకొని ఎవ్వరికి చెప్పలేదు. కానీ నా మిత్రుడు ఒకడికి ఈ విషయం ఎలాగో తెలిసిపోయింది ఇంకేముంది almost అలాంటి మాటే అన్నాడు. నీకు పని తక్కువగా ఉంటే నా  పని కూడా చేసిపెట్టచ్చు కదా అని. కొత్తగా Onsite వచ్చిన మరొక మిత్రుడేమో ఇంటికి పోయి బ్లాగ్ రాసుకునే బదులు ఆఫీసు లోనే ఉండి ఇంకొంచం పని ఎక్కువ చేయొచ్చు కదా మేనేజర్ హ్యాపీ గా ఫీల్ అవుతాడు అని suggestion ఇచ్చాడు. పార్థా ఒక్కసారి Onsite వచ్చాక  'ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి దక్కుతుంది' అన్న సామెత చెప్పినట్లు extra వర్క్ చేయడం/చేయకపోవడం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు అని గీతోపదేశం చేసాను.  

కాబట్టి మిత్రులారా ఏదో పొడిచేద్దామనో సాధిద్దామనో బ్లాగ్ రాయడం లేదు. ఇదేదో ఒక హాబీ లాంటిది అంతే. ఈ బ్లాగ్ లో సాహిత్యాల గురించో మరేదో  గొప్ప విషయాల గురించో భూతద్దం పెట్టి వెదికినా కనపడవు. ఏదో వీలయితే నాలుగు కబుర్లు కుదిరితే చిన్నప్పుడు విన్న కథలు రాస్తుంటాను. ఏదో కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు నా బ్లాగ్ నాకు ముద్దు. నా బ్లాగ్ పోస్టులు చదివిన వారు ఏవైనా తప్పులు కనిపించినపుడు  సరిదిద్దితే సంతోషిస్తాను.

చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు నా గురించి. శతకోటి లింగాల్లో నేనొక బోడిలింగాన్ని. అబ్దుల్ కలాం గారు అన్నట్లు నాదింకా ఒట్టి సిగ్నేచరే, ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజి కి వెళ్లాలని ఆశ. మరీ పెద్ద ఆశ అంటారా ఆశ పడటం లో తప్పు లేదు కదా. పెద్దాయనే చెప్పారు కదా కలలు  కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండి అని. 

చివరిగా మంగలి వాడు అనే మాట ఎవరి మనోభావాలను అయినా కించపరిచింది  అని అనిపిస్తే మన్నించగలరు.  


30, మే 2016, సోమవారం

మా ఇంటికి వచ్చిన అతిధి వారానికి కానీ వెళ్ళలేదు

ఎవరి పేరు చెబితే జనాలు భయపడి పారిపోతారో, ఎవరి పేరు చెబితే జనాలు  గాలి పీల్చడం కూడా కాసేపు ఆపేస్తారో అతను మేము పిలవకపోయినా పోయిన వారం మా ఇంటికివచ్చాడు. అతిధి మా ఇంటికే కాదు ఒకే టైం లో శ్రీ కృష్ణ పరమాత్మునిలా లోకమంతటా అందరి ఇళ్లనూ చుట్టేస్తుంటాడువచ్చేవాడు ఒక్కడే రావచ్చు కదా అలా రాడండోయ్ మొహమాటం గట్రాలు అస్సలు లేవు కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా వెంటబెట్టుకు వచ్చేసాడు. మేము అతన్ని సాదరంగా ఆహ్వానించకపొయినా అతనికి చనువెక్కువ కాబట్టి  ఇంట్లో అందరిని పలకరించే వెళ్ళాడు పాపం మాటలు రాని మా చంటోడ్ని కూడా పలకరించేసాడు. దాంతో చంటోడు అతనికి భయపడి పగలు మా చంక దిగకపోవడాలు, రాత్రి పూట నిద్రపోకుండా ఆరున్నొక్క రాగాలు తీయడాలు  జరిగింది గత వారం రోజులుగా

అతిధి ని జలుబు, పడిసం, రొంప అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతొ పిలుచుకుంటూ ఉంటారు. మా ఆవిడయితే  దానికో బిరుదు తగిలించి 'గబ్బు జలుబు' అని గౌరవిస్తూ ఉంటుంది. తను ఇంతవరకూ గబ్బు అని బిరుదు తగిలించాకుండా పలకడం నేనింతవరకూ వినలేదు.  

పడిసం పది రోగాల పెట్టు అని పెద్దలు ఊరికే అనలేదు. పడిసం ఒక్కటి పట్టిందంటే జ్వరం, వొళ్ళు నొప్పులు, తల నొప్పి, దగ్గు ఇలాంటివన్నీబంపర్ ఆఫర్ స్కీం కింద ఫ్రీ గా వచ్చేస్తాయివెధవ జలుబు మందులు వాడితే  వారం రోజుల్లో వాడకపోతే  ఏడు రోజుల్లో పోతుంది అనే సామెతను నేను బలంగా నమ్మినా  కూడా మరీ పిల్లల విషయం లో మనం మందులు, చిట్కా వైద్యాలు వాడకుండా ఉండలేము కదా అయినా కూడా సామెత ప్రకారమే  మందులు వాడినా వారానికి తగ్గింది

జలుబు అనేది మేకలకు కూడా వస్తుందని  ఎక్కడో చదివాను. మరి మిగతా ప్రాణులకు, aliens కు, దేవతలకు కూడా వస్తుందేమో మరి తెలియదు. పోకిరి సినిమా టైం లో మహేష్ బాబు కు కూడా వచ్చి ఉంటుంది ఇదేదో బాగుందని హీరో characterization కింద మార్చి ఉంటాడు పూరి జగన్నాధ్. 

శీతాకాలంలో జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు ఎక్కువగా వుంటాయి కదా వీటిని తగ్గించడానికి సనాతన వైద్య విధానం ఒకటి చైనాలో ఇంకా ఆచరణలో ఉందని గూగుల్ చేస్తే తెలిసినది . వీటి నివారణకు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో మద్యంతో తడిపిన క్లాత్ను మండించి, రోగి శరీరభాగాలపై ఒక రకం క్లాత్ను వేసి, దానిపై మండుతున్న క్లాత్ను నిర్ణీత కాలం పాటు వుంచుతారట . ఇదేమంత బాధాకరంగా వుండదని అక్కడివారు చెబుతారు. అయితే కార్యక్రమం అంతా నిపుణుడైన వైద్యుని పర్యవేక్షణలోజరుగుతుందట

ఈ జలుబు తో పాటు భయపెట్టేది ఇంకొకటి కూడా ఉందండోయ్ అదే ఈ సోమవారం. ఈ జలుబన్నా చెప్పా పెట్టకుండా ఎప్పుడో ఒకసారి వస్తుంది కాని ఈ  సోమవారం మాత్రం చెప్పి మరీ  ప్రతీ వారం వస్తుంది వచ్చేసింది ఇక ఆఫీసు కి బయల్దేరాలి .