5, డిసెంబర్ 2016, సోమవారం

ఊరికొచ్చిన/ఉరికొచ్చిన ఉత్సాహం - తిరిగొచ్చిన బాల్యం

ఇండియా వెళ్లినప్పటి కబుర్లలో భాగమైన బెంగళూరు నుంచి తాడిపత్రి ప్రయాణ కబుర్లు కి తర్వాతి పోస్ట్ ఇది

పవన్ అనే పేరు ప్రింట్ చేయబడిన బైక్ కనపడగానే నాన్న వాళ్ళుండే అపార్ట్మెంట్ అదే అని అర్థమైంది. 


వరహా కన్నా వడ్డీ ముద్దు - కొడుకుకన్నా మనమడు ముద్దు అంటారు కానీ కొడుకే ముద్దు అని మా నాన్న ఈ మధ్యే కొత్త గా కొన్న బైక్ మీద నా పేరే వేయించాడని మా అమ్మ  చెప్పిన విషయం గుర్తుకొచ్చింది.

ఇక అక్కడ ఉన్నన్ని రోజులూ బయటికి వెళ్ళాల్సివచ్చినప్పుడల్లా మా నాన్న నన్ను ఆ బైక్ వెనుక కూర్చోబెట్టుకొని బజార్లన్నీ చుట్టేశాడు అచ్చు చిన్నతనం లో నన్ను వెనుక కూర్చోబెట్టుకొని తిప్పిన రోజులు గుర్తుకు తెప్పిస్తూ. 

ఏదో ఇలా కాలు మీద కాలు వేసుకొని వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్నానంటే అది ఆయన నా చదువు మీద తీసుకున్న శ్రద్దే కదా.   మా నాన్న గురించి ఇది వరకు  బాల్యంలో గురువు, గూగుల్ , డిక్షనరీ, వికీపీడియా అన్నీ నాన్నే  పోస్ట్ లో రాసుకున్నాను.

ఇక మా అమ్మ గురించి, మేము వచ్చామని ఎప్పటిలాగానే ఇంటిని స్వీట్ స్టాల్ గా మార్చేసింది .


అన్నీ ఒకేసారి తినాలని ఉంటుంది కానీ ఆశ లావు పీక సన్నం అంటారు కదా అందుకని బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక సారి, ఈవెనింగ్ ఒక సారి, నైట్ పడుకునే ముందు మరోసారి, మూడు పూటలా మందులు వేసుకున్నట్లు తినేవాడిని. వీటికి తోడు ఇక సాయంకాలం పూట మళ్ళీ పకోడీలు, వడలు లాంటివి అదనం.

ఇక వెళ్లిన ప్రతిసారి నాకు ఇస్తామని తను చేసే 'జొన్న రొట్టె, గుత్తి వంకాయ' ,  'రాగి సంగటి, చెనక్కాయల పచ్చడి' లాంటివి కామన్. ఇక పాత కాలం స్వీట్స్ కానివ్వండి వంటలు కానివ్వండి అద్భుతంగా చేస్తుంది మా అమ్మ.

చిన్నప్పుడు అయితే చేసిన కూరంతా నేనే తినేస్తే ఇంట్లో ఉండే ఎదో ఒక పొడి వేసుకొని తినేదే తప్ప ఏనాడూ అంత తినొద్దురా మిగల్చకుండా అని అనని పిచ్చిది అమ్మ. అవును మరి 'గాడిదా  చేసిన దంతా నువ్వే తింటే ఎలా ' అని తిట్టకుండా ఎదో ఒక పొడి వేసుకొని తినేసే పిచ్చి వాళ్లెవరు ఉంటారు ఒక్క అమ్మ తప్ప.

ఇక ఓపికకు, సహనానికి ఒక రూపం ఇవ్వాలంటే అది మా అమ్మే అని టైప్ చేస్తున్న ఈ కీ బోర్డు గుద్ది మరీ చెప్పగలను. ఏదైనా సినిమాకు వెళ్లి వచ్చినప్పుడు కానీ లేదా లేట్ గా ఊరి నుంచి వచ్చినప్పుడు గానీ పిల్లలు అర్దాకలితో పడుకోకూడదు అని అంత అలుపులో కూడా చక్కగా మా కిష్టమైన వంటలు వండి వడ్డించేది.  మేము పడుకునేప్పటికి ఆ గిన్నెలు కడుగుతూ ఉంటుంది తిరిగి మేము లేచేప్పటికీ డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ తో పాటు, నాన్నకు మధ్యాహ్నం భోజనానికి డబ్బా కూడా హాజరు. ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచిందో అమ్మకు, ఆ రాత్రికి మాత్రమే తెలిసిన రహస్యం. 

ఇక హాలిడేస్ లో మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ అయితే మీ అమ్మ ఖాళీగా ఉండటం మేమున్న ఈ మూడు రోజుల్లో చూడలేదు. మనం తినడానికి ఎప్పుడూ ఎదో ఒకటి చేస్తూనే ఉంది అంటారు.

ఇలా సంతోషంగా మూడు రోజులు గడిచాయో లేదో, మా పాపకు బెంగుళూరు లో  మొదలైన జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరగడం మొదలెట్టింది.

జ్వరం అంటే గుర్తొస్తోంది, చిన్నప్పుడు నాకొక అనుమానం ఉండేది. అందరికీ జ్వరం వచ్చేది కానీ మా అమ్మకు మాత్రం జ్వరం రాదెందుకబ్బా అని.  అమ్మకూ జ్వరం వస్తుందని, కానీ అందరి లాగ పనులు మానేసి పడుకోదని,ఇంట్లో యెవ్వరూ ఇబ్బంది పడకూడదని, జ్వరాన్ని జో కొట్టేసి మరీ పనులన్నీ చేస్తూ ఉండేదని కాస్త పెద్దయ్యాక తెలిసొచ్చింది.

ఈ పోస్ట్ రాసి వారమవుతున్నా 'సముద్రమంత అమ్మ నాన్నల మంచితనాన్నినీటి బొట్టంత ఈ చిన్ని పోస్టు లో రాసి సరిపెట్టడం ఇంద్రధనుస్సుకు రంగులు పూయాలనుకోవడమంత మూర్ఖత్వం అని అనుకొని'  మనసొప్పక  పోస్ట్ చెయ్యకుండా ఆట్టే అట్టిపెట్టుకున్నాను కానీ తల్లితండ్రుల గొప్పతనం గురించి ఇంతకంటే గొప్పగా రాయలేము అని చేతులెత్తేసిన మహామహుల ముందు నేనెంత అని నచ్చచెప్పుకొని పోస్ట్ చేశాను.

10 కామెంట్‌లు:

 1. చేసిన కూరంతా నేనే తినేస్తే ఇంట్లో ఉండే ఎదో ఒక పొడి వేసుకొని తినేదే తప్ప ఏనాడూ అంత తినొద్దురా మిగల్చకుండా అని అనని 'పిచ్చిది' అమ్మ
  yes that is mother...amma...maa.... in what ever lamguage u say that is amma...అమ్మ

  రిప్లయితొలగించండి
 2. అసలు ఈ టపాకి "అమ్మ" అని పేరు పెట్టవచ్చేమో? "తిరిగొచ్చిన బాల్యం" అన్నారు గానీ నిజానికి ఎంత వయసొచ్చినా అమ్మ అమ్మే కదా. బాగుంది టపా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ నరసింహా రావు గారు. మీరన్నది కరక్టే అనిపిస్తోంది. ఏదో రాయాలని అలా టైటిల్ పెట్టాను చివరకి అమ్మ గురించి చెప్తూ మొత్తం తన గురించే రాశాను.

   తొలగించండి
 3. "అమ్మ అన్నది ఒక కమ్మని మాట
  అది ఎన్నెన్నో తెలియని మమతల మూట"
  -----అన్న పాట గుర్తొచ్చిందండీ మీ అమ్మగారి మీద ఈ పోస్ట్ చదవగానే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలండి లలిత గారు మీ కామెంట్స్ కి అలాగే మంచి పాట గుర్తు చేసినందుకు.

   తొలగించండి
 4. మీ ఈ పోస్ట్ మీరు చెమర్చిన కళ్ళతో రాసుండాలి. మరి నేను చెమర్చిన కళ్ళతోనే చదివాను.
  It's so honest and straight from heart.
  అమ్మ గురించి రాసినవన్నీ అక్షర సత్యాలు. చాలా చాలా బావుంది పవన్ గారూ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు ఊహించింది 100 % కరెక్ట్ శ్రీ గారు. చెమర్చిన కళ్ళతోనే రాశాను. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ శ్రీ గారు.

   తొలగించండి
 5. ఏడిపించేశారండీ..

  రిప్లయితొలగించండి

 6. మీ కామెంట్స్ కు, నా పోస్ట్ కు స్పందించిన మీ సున్నితమైన మనసుకు ధన్యవాదాలండి ఫణి గారు. మీ పేరును తప్పుగా రాసి ఉంటె క్షమించగలరు.

  రిప్లయితొలగించండి