4, జనవరి 2017, బుధవారం

కరడు కట్టిన చిరంజీవి అభిమాని

నా చిన్నతనమంతా బావిలో కప్పలా పల్లెటూర్లలోనే గడిచింది. అన్న గారి ఫ్యాన్ నుంచి కృష్ణ గారి ఫ్యాన్ గానూ, ఆ తర్వాత చిరంజీవి ఫ్యాన్ గానూ, జయమాలిని ఫ్యాన్ నుంచి సిల్క్ స్మిత ఫ్యాన్ గానూ ఇలా ఎన్నో కప్ప దాట్ల వేశాను వాటి గురించి వివరంగా నా పాత పోస్ట్ లలో రాశాను మీకు వీలయితే చదువుకోవచ్చు. పెళ్ళిళ్ళలో ఉప్మా కు శుభం పలికి వడ, పొంగల్ లాంటివి పెడుతున్న ఆ రోజులలో ఒకసారి పెళ్ళికి నెల్లూరు వెళితే ఉదయాన్నే ఆ వడ, పొంగల్ కూడా తినకుండా నీ చిరంజీవి పిచ్చి ఏమిటిరా అని మా నాన్న చేత తిట్లు తిని ఉన్న ఆ కాస్త టైం లోనే గ్యాంగ్ లీడర్ సినిమా కు వెళ్లాను.  నీ అంత పిచ్చి అభిమాని ఈ భూ ప్రపంచం లో ఇంకెవరూ ఉండరేమో అన్న మా నాన్న మాట నిజమేనేమోనన్నభ్రమ లో ఉండిపోయాను బావిలోకప్పలాంటి నేను నది లోకి వచ్చి పడేంతవరకు. అదేనండి మా నాన్నకు కడప కు ట్రాన్స్ఫర్ అయి నేను కడప లో అడుగు పెట్టేంతవరకు. 


కడప కు వచ్చాక అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని అన్నట్లు నా కంటే ఒక ఘనుడిని కలుసుకున్నాను. అసలు ఒక వ్యక్తి పై అభిమానం అంటే ఎంత పీక్స్ లో ఉంటుందో అతన్ని కలిశాకే తెలిసింది. నా కంటే గొప్ప చిరంజీవి అభిమాని ఉండడని అనుకున్న నాకు గర్వ భంగం కలిగింది.  అతని ముందు అభిమానం విషయం లో నేనొక పిల్లకాకి అని తెలిసింది. 

పచారీ కొట్లు సూపర్ మార్కెట్లు  గా టర్న్ తీసుకుంటున్న సమయంలో మేముండే వీధి టర్నింగ్ లోనేకొత్తగా ఓపెన్ చేసిన సూపర్ మార్కెట్ దగ్గర ఉండే ఖాసీం అనే నా వయసు కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఒక రెండు రోజుల్లో తెలిసింది అతనో కరడు కట్టిన చిరంజీవి అభిమాని అని. ('కరడు కట్టిన' అనేది సాధారణంగా నేరస్తులకు ఉపయోగిస్తారు అని తెలుసు గానీ ఇతనికి కూడా ఆ పదం ఆపాదించడం లో తప్పు లేదని నా ఫీలింగ్)

ఆ ఏరియా లో చాలా మంది చిరంజీవి ఫాన్స్ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కనీసం ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ గా ఉండేవారు ఆ రోజుల్లో. చుట్టుపక్కల ఉండే చిరంజీవి అభిమానులకు అతను లీడర్ అని తెలిసింది. అప్పుడప్పుడు కాలేజీ వెనుక ఫాన్స్ మీట్ కూడా జరిగేది. 

అలా జరిగిన మీటింగ్ లో అతని ఉపన్యాసం నుంచి ఒక మచ్చు తునక ఇది. 

"టికెట్ కోసం క్యూ లో చొక్కా చినిగి పోవచ్చు

అందుకు నాన్న కర్ర తీసుకొని శివ తాండవం చెయ్యొచ్చు

సినిమాలు కూడెట్టవు రా అని అమ్మ వీపు పగల గొట్టచ్చు

మీ చిరంజీవి వేస్ట్ మా బాలకృష్ణ బెస్ట్ అని మీ ఇంట్లో అన్నయ్యో బాబాయో నిన్నుపార్టీ మారమని చెప్పచ్చు

చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడల్లా తన హుండీ పగలగొట్టి డబ్బులిచ్చే చెల్లి ఉండచ్చు ఉండకపోవచ్చు 

చుట్టల కోసం మీ తాత ట్రంకు పెట్టె లో దాచుకున్న డబ్బులు మీరు కొట్టేయచ్చు కొట్టెయ్యకపోవచ్చు 

చీర కొంగు లో చుట్టుకున్న చిల్లరను మీ అవ్వ మీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు  

అయినా తగ్గేది వద్దు మడమ తిప్పేది లేదు

చిరిగినా చొక్కా తొడుక్కో పర్లేదు తోలి రోజు చిరంజీవి చిత్రం చూడటం మాత్రం మానద్దు"

అని అభిమానులను ఉత్తేజపరుస్తున్నాడు 

ఆ ఉత్తేజానికి లోనయి ఆకాశం సైతం ఉరుములు మెరుపులతో దద్దరిల్లి వర్షం కురిపించింది.

పట్టండిరా గొడుగు

వెయ్యండిరా కుర్చీ మన ఖాసీం భాయ్ కి 

కొట్టరా తొడ

తిప్పరా మీసం

ఎత్తరా కాలర్

అన్నాను నేను ఆవేశంగా అక్కడున్న గుంపు లోంచి తోసుకుంటూ ఖాసీం దగ్గరకెళ్ళి.

ఇంగ్లీష్ సినిమాలు చూసి inspire అయ్యే అలవాటున్న రాజమౌళి కూడా ఆ గుంపు లో ఉండి ఈ సీన్ ను ఛత్రపతి సినిమా లో వాడుకొని ఉంటాడు అని నా అనుమానం 

అంతవరకు చిరంజీవి సినిమా రిలీజ్ అయిన నెలకో, రెండు నెలలకో ఒక్కోసారి సంవత్సరానికో చూసేవాడిని. అలాంటిది అతనితో పరిచయమయ్యాక రిలీజ్ కు ముందు రోజే తనతో కలిసి నాలుగు సినిమాలు చూశాను. కడప లో చిరంజీవి సినిమాని ఫ్యాన్స్ కోసం రిలీజ్ కు ముందు రోజు రాత్రే ఒక షో వేసేవాళ్ళు.  ఒక వేళ అలా ముందు రోజు వేసే షో నేను మిస్ అయితే ఉదయాన్నే కాలేజీ లో కలిసినప్పుడు 2 గంటల సినిమాను 4 గంటల సేపు చెప్పేవాడు. 

జనాలు ఇడ్లి, దోశ లాంటి టిఫిన్ లు తినడం తగ్గించి బ్రెడ్లు జాములు తింటున్న రోజుల్లో ఒక రోజు ఉదయాన్నే ఖాసీం వచ్చి మా అమ్మ అట్లు పోస్తోంది,అట్లు విత్ చికెన్ కర్రీ తినడానికి మా ఇంటికి రా అని పిలిచాడు. వాళ్ళ అమ్మ వేసే అట్లు భలే రుచిగా ఉండేవి. అవి తిందామన్న ఆతృతలో జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టలేక పిలవగానే ఎగేసుకొని వెళ్ళాను వెర్రి వెధవను.

మిగతా విషయాలు తర్వాతి పోస్ట్ లో. 

8 కామెంట్‌లు:

 1. "కరడు గట్టిన అభిమానులు" ప్రస్తుతం టీవీ ప్రోగ్రాముల్లో కనిపిస్తున్నారు కదా 🙂. పొద్దున లేచినప్పటినుంచీ రాత్రి టీవీ స్టేషన్ కట్టేసేంత వరకూ సినిమాల మీద ప్రోగ్రాములు, సినిమాల / ముఖ్యంగా హీరోల గురించి భజన.

  ఈ టపా తరువాత భాగం(లు) చదివే వరకు నా తతిమ్మా comments reserved 😀😀.

  రిప్లయితొలగించండి
 2. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ నరసింహా రావు గారు. మీరన్నది 100% కరెక్ట్.

  రిప్లయితొలగించండి
 3. మీ చిరు-అభిమాన కబుర్లు సరదాగా వున్నాయి :)

  రిప్లయితొలగించండి
 4. ఏంటండీ ఇలా సస్పెన్స్ లో పెట్టి ఆపితే ఎలా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. తప్పలేదండి.. అంతా ఒకే పోస్ట్ లో రాయాలనుకుంటాను కానీ అలా అనుకుంటే ఎప్పటికీ రాయలేనండి. చిన్న పోస్ట్ అయితే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు రాసి పోస్ట్ చెయ్యొచ్చు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ చంద్రిక గారు.

   తొలగించండి
 5. చాలా బాగుంది బ్రదర్. చేయి తిరిగిన రచయితలా రాస్తున్నారు. శుభాభినందనలు-శ్రవణ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఏదో మీ అభిమానం అంతే శ్రవణ్ గారు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజిమెంట్ బ్రదర్.

   తొలగించండి