3, మార్చి 2021, బుధవారం

సరదాకి ఓ చిన్న కథ

అనగనగా ఓ పేద్ద గవర్నమెంట్ ఆఫీస్.  ఓ రోజు రాత్రి ఏదో పని మీద ఆ ఆఫీస్ తలుపులు తెరిచినప్పుడు ఒక పులి లోపలికి దూరింది. దూరాక బయటికి ఎలా వెళ్లాలో తెలీక మనుషులు వస్తున్న అలికిడి విని కాస్త పిరికి పులి అవ్వడం వల్ల బాత్రూములో ఒక మూలగా ఉండే చీకటైన స్టోరేజ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కుంది.  

మరుసటి రోజు తెల్లారి ఆఫీస్ మొదలయ్యాక  అప్పుడొకరు అప్పుడొకరు  బాత్రూములోకి వచ్చి వెళ్తున్నారు. బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది దాంతో పులికి  ఆకలి మొదలైంది. భయంతో బిక్కు బిక్కుమంటూ ఆ చీకటి గది లోనే ఉండిపోయింది కానీ బయటికి వచ్చే ధైర్యం చేయలేక పోయింది. మధ్యాహ్నం దాటే పాటికి ఆకలి ఎక్కువైంది కానీ మళ్ళీ భయంతో బయటికి రాలేక పోయింది. సాయంత్రానికి భయం కంటే ఆకలి ఎక్కువై అప్పుడే లోపలికి వచ్చినోడిని లోపలికి లాక్కెళ్ళి కిళ్ళీ నమిలేసినట్లు నమిలేసింది. 

మరుసటి రోజు ఆ ఆఫీస్ మేనేజర్ లీవ్ పెట్టాడని అనుకున్నారు అందరూ. యదావిధిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు బల్లల కింద  చేతులు పెట్టి జేబులు నింపుకుంటూ. 

ఈ సారి క్లర్క్ వంతు. మరుసటి రోజు అసిస్టెంట్ మేనేజర్ వంతు. ఇలా ప్రతీ రోజు సాయంత్రం అయ్యేప్పటికీ ఆ అయ్యప్ప వాహనంలో భయాన్ని ఆకలి డామినేట్ చేయడంతో నాలుగైదు Suppers సప్పరించేసింది. 

మరుసటి రోజు ఆఫీసులో  ఒక మనిషి  మిస్ అయ్యాడని పెద్ద గందరగోళం. ఇంటికి ఫోన్ చేస్తే ఆఫీస్ కే వచ్చాడు అన్నారు. అతని కోసం ఆఫీస్ లో వెతకడం మొదలెడితే పులి గుట్టు రట్టయి జూలో జాయిన్ అయ్యింది . 

'అన్నాయ్! ఒక్క పూట ఆ వ్యక్తి కనపడకపోయేసరికి ఆఫీస్ లో ఎవరి చేతులు కాళ్ళు ఆడలేదు. మరీ అంత పేద్ద ఆఫీసర్ ని సప్పర్ కింద సప్పరించేశానా ఏమిటి?'  అని పక్కనే టీ తాగుతున్న ఆ జూ కీపర్ ని అడిగింది. 

ఇంకో పది మంది ఆఫీసర్స్ ని లేపేసినా నువ్వు దొరికి పోయేదానివి కాదు,  కాకపోతే నువ్వు చివరిగా  తిన్నది ఆ ఆఫీస్ లో టీ లు అందించే ఒక ప్యూన్ ని అన్నాడు. 

                                                                  ****************

COVID టైం లో ఒక కంపెనీ ఇద్దరు పెద్ద managers కి అలాగే మరో ఇద్దరు H.R డిపార్ట్మెంట్ లోని వారికి జీతాలు సెటిల్ చేసి వదిలించుకుంది. అంతవరకూ బానే ఉంది తర్వాత ఇంకాస్త లోతుకెళ్ళి ఒక డెవలపర్ ని కూడా తొలగించారు, ఆ డెవలపర్ ని తొలిగించిన తర్వాత తెలిసి వచ్చింది ఒక డెవలపర్ తక్కువ అవడం వల్ల వచ్చిన ఇబ్బంది.  ఆ తర్వాత తప్పు తెలిసి వచ్చి అతన్నినెల తిరిగే లోపే మళ్ళీ జాయిన్ అవమని రిక్వెస్ట్ చేశారు. పులి-ప్యూన్ విషయంలో జరిగింది కథ కానీ ఇది మాత్రం నిజంగా నా ఫ్రెండ్ లైఫ్ లో గత సంవత్సరం జరిగిన విషయం.  కాస్త సారూప్యత ఉందనిపించి  ఆ పులి కథ చెప్పాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి