26, ఏప్రిల్ 2022, మంగళవారం

రీమేకులకు ఇక కాలం చెల్లినట్లే

ఓ పది పన్నెండేళ్ళ క్రితం హీరో రాజశేఖర్ మీద ఒక మేకు జోకు బాగా వినిపించేది.

ఇంటర్వ్యూ కోసం ఒక విలేఖరి రాజశేఖర్ ఇంటికి వెళ్తాడు. సర్ వస్తారు కూర్చోండి అని ఒక సర్వెంట్ హాల్లోని సోఫాను చూపిస్తుంది. అతను సోఫా లో కూర్చొని ఉంటే ఆవిడ ఇల్లు క్లీన్ చేసే పనిలో ఉంటుంది. 

ఆ విలేఖరి ఇంటిని తేరిపార చూస్తూ అక్కడ కింద పడి ఉన్న ఒక మేకు ను గమనించి 'ఇదిగో అమ్మాయ్ ఇక్కడ మేకు పడి ఉంది తీసి ఎక్కడైనా పెట్టు' అని అంటాడు.

అయ్యో! మెల్లిగా మాట్లాడండి, మా అయ్య గారికి వినపడుతుంది అంటుందావిడ కంగారుగా

వినపడితే వచ్చే నష్టమేముందమ్మాయ్ .. మేకునే కదా నేను ఎత్తేయమన్నాను అంటాడు

అయ్యో మెల్లిగా మాట్లాడండి సర్ ..మేకు అనే మాట వినపడితే చాలు పూనకం వచ్చిన వాడిలా ఏదో ఒక సినిమా రీ'మేకు' రైట్స్ కొనడానికి తమిళనాడుకో, కేరళాకో బయల్దేరతారు అంటుంది మెల్లిగా. 

అప్పట్లో రాజశేఖర్ ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుండటం వల్ల వినపడ్డ జోక్ అది. ఇప్పటికీ 'శేఖర్' అనే రీమేక్ సినిమా చేస్తూ అదే జోన్ లోనే ఉంటున్నాడు "పరుగు ఆపడం ఒక కళ" అని అర్థం చేసుకోకుండా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆ జోక్ ని అన్వయించుకోవచ్చేమో...వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అంటూ వరుసగా రీ-మేకులు దించుతున్నాడు. 

మొన్న "జిగర్ తాండ"/"గడ్డలకొండ గణేష్" సినిమాని "బచ్చన్ పాండే" అని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు, నిన్నటికి నిన్న జెర్సీ సినిమాతో మరో సారి  అదే రిపీట్ అయింది. పదేళ్ళ క్రితం పరభాషా సినిమాలు అతి తక్కువ మంది చూసేవారు కాబట్టి ఈ రీమేకులు వర్కౌట్ అయ్యేవి. ఇప్పుడు ప్రపంచసినిమాలని మన ఇంట్లోనే చూసే సౌలభ్యం కలిగాక ఈ రీమేకుల ను చూసే ఇంటరెస్ట్ జనాలలో తగ్గిపోయింది. 

ఏదో పవన్ కళ్యాణ్ కాబట్టి, అంతో ఇంతో పిచ్చిగా చూసే అభిమానులు ఉండబట్టి అతని రీమేక్ సినిమాలు కాస్తో కూస్తో బాగా ఆడి ఉండచ్చు కానీ మరో హీరో సినిమాలు అయితే బొక్క బోర్లా పడటం ఖాయం. పోను పోను ఆ మాత్రం కూడా ఆడతాయని నమ్మడానికి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడటం మంచిది. 

పర భాషలో హిట్టయ్యింది కదా అని వందల కోట్లు కుమ్మరించి మళ్ళీ రీమేక్ అని తీయడం వల్ల లాభం లేదని ఈ పాటికే బచ్చన్ పాండే, జెర్సీ సినిమా నిర్మాతలకి అర్ధమయ్యే ఉంటుంది, అయినా ఇంకా పలు తెలుగు, తమిళ  సినిమాలని రీమేక్ చేస్తున్నారంటే వారి లెక్కలు వారికి ఉండే ఉండచ్చు. 

సూరారై పోట్రు / ఆకాశమే నీ హద్దురా  సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నారు. ఛత్రపతి సినిమాని మన బెల్లంకొండ హీరోగా రీమేక్ చేస్తున్నాడంటే ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ ని బంగారు పళ్ళెం లో పెట్టి ఇవ్వడమే, ఇప్పటికే ఆ ఛత్రపతి  బెంగాళీ రీమేక్ సినిమా హీరో ని మన ప్రభాస్ తో పోల్చుతూ బోలెడంత కామెడీ చేశారు యూ ట్యూబ్ వీడియో లలో. 

ఇక తప్పని సరి తద్దినం అయిన మెగాస్టార్ సినిమా వస్తోంది, ఆ మెగా ఫామిలీ కి మా రెండెద్దుల ఫ్యామిలీ ఏ జన్మలోనే పడిన బాకీని ఈ జన్మలో ఇలా తీరుస్తున్నాను.  ఇలా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఫామిలీస్ యెంత బాకీ పడ్డాయో గానీ ఆ బాకీ తీరే వరకూ ఈ తాత సినిమాలు ఆపేలా లేడు.  సినిమానో, సీరియలో లేదంటే షార్ట్ ఫిల్మో కూడా అర్థం కానంత సినిమాని వదిలాడు లెజెండ్ అనుకునే ఇంకో తాత.  ఘోరాతి ఘోరమైన హిట్టు అని వినిపించిన సినిమా వదిలాడు మరో తాత. కాకపోతే ఇవేవీ రీమేకులు కాకపోవడం మన అదృష్టం. 

"పరుగు ఆపడం ఒక కళ" అని ఈ తాతల వయసు హీరోలు తెలుసుకోలేరు, మనం అయినా తెలుసుకుంటే మంచిదేమో. 

11 కామెంట్‌లు:

 1. ప్రపంచ సినిమాలని మన ఇంట్లోనే చూసే సౌలభ్యం మీకూ, నాకూ ఉందేమో కాని, ఇండియాలో అందరికీ లేదండీ. ఇండియాలో స్మార్ట్ ఫోన్/ఇంటర్నెట్ వాడేవాళ్ళు సుమారు 50% మాత్రమే. అందులో సినిమా చూసి మీరు ఎంతవరకూ enjoy చెయ్యగలరు? అదీ కాక, ఏదైనా సినిమాలో తెలుగు నేటివిటీ, తెలుగు ఏక్టర్లు లేకపోతే మీరు ఆ సినిమాకి సరిగా కనెక్ట్ కాలేరు (అది రామాయణం, మహాభారతం లాంటి సినిమాలైనా సరే). దాంతో ఆ సినిమా గొప్పగా ఉన్నా మీకు నచ్చకపోవచ్చు. అందుకే ఈ రీమేకులన్నీ తీసేది. అంచేత రీమేకులకి కాలం చెల్లిపోయిందంటే నేను ఒప్పుకోను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పాయింట్ కొంతవరకు నిజమే, ఒప్పుకుంటాను కానీ ప్రపంచ సినిమాలు చూసే ఆ 50% కేటగిరీ నుంచి ఒక 5% మాత్రమే రీమేక్ సినిమాలు చూసేవారు ఉంటే, అలాగే మిగతా 50% నుంచి ఒక 15% మాత్రమే ఈ రీమేక్ సినిమాలు చూస్తే మొత్తం 20% మాత్రమే రీమేక్ సినిమాలు చూస్తే పెట్టిన బడ్జెట్ కి వచ్చే కలెక్షన్స్ కి పొంతన కుదరక నిర్మాత నష్టపోవచ్చేమో అని నా ఉద్దేశ్యం కాంత్ గారు. ఏదో మినిమం లో బడ్జెట్ లేదంటే మీడియం బడ్జెట్ సినిమాలైతే చెల్లిపోతాయేమో గానీ వందల కోట్లు పెట్టి రీమేక్ సినిమాలు తీయడం వల్ల నిర్మాత నెత్తిన గుడ్డ వేసుకోవాలేమో అని నా అభిప్రాయం.

   తొలగించండి
 2. ఏదో సినిమాలోనో / వేదిక మీదో మీ “ఘన తార” తాత - ఆంధ్రదేశంలో నేను ఏ ఊరు వెళ్ళి ఏ ఇంటి తలుపు తడితే నాకు పట్టెడన్నం దొరకదు గనక - అన్నాడు లెండి ఒకసారి.
  పట్టెడన్నం ఓకేనే (మరీ పట్టెడంటే పట్టెడే పెట్టరు గదా 🙂) గానీ మీరన్నట్లు మీతో బాటు వారికి గత జన్మలో బాకీ ఉన్న తెనుగు కుటుంబాలు చాలానే ఉన్నట్లున్నాయి, ఇంకా తీరుస్తూనే ఉన్నాయి 🙂.

  ఇప్పటి తాతలకు తాతలు, మార్గనిర్దేశకులు కొంతమంది ఉండేవారు కదా - గొంతు వరకు గుండీలు పెట్టుకుని కొందరు, బొడ్డు వరకు గుండీలు వదిలేసి కొందరు. వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతున్నారేమో ఈ నాటి “తాతలు”? వయసుకు తగ్గ పాత్రలు వేస్తే హుందాగా ఉంటుంది అనే ఆలోచనను రానివ్వరేమో?

  రీమేకుల సంగతి మీరన్నది కొంతవరకు నిజమే గానీ సినిమాలకు కొంతమంది మహారాజ పోషకులు ఉంటారు కదా. ఏ సినిమానైనా చూసేస్తారు - ఆడవాళ్ళు ఏ సీరియల్ అయినా సరే సీరియల్ అయితే చాలు అని చూసేస్తున్నట్లు 🙂. ఈ సినిమా ఒరిజినల్ అలా తీసారు కదా, రీమేక్ లో ఎలా న్యాయం చేసారో చూద్దాం అనుకుంటూ రీమేకులను కూడా చూస్తుంటారేమో బహుశః? పైగా అభిమానుల సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయి మొయ్యటానికి. కాబట్టి నడుస్తుంది … నడుస్తుంది … నడుస్తుంది.
  🙂🙂

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్ వ్రాసినది విన్నకోట నరసింహారావు.

   తొలగించండి
  2. అయితే నడుస్తుంది .. నడుస్తూనే ఉంటుంది అంటారు.

   మీరు "ఘన తార" అన్నప్పుడే ,అర్థమైంది అది మీరేనని మేష్టారు.

   మొన్న ఎప్పుడో ఓ సారి అనుకున్నా ఈ తాతల మొహాలు ఇక చూడకూడదు అని .. కాకపోతే కుక్క తోక వంకర కదా

   తొలగించండి
 3. తాత హీరోలు తమ కొడుకుల తో హీరోయిన్ గా నటించిన వారితో, కూతురు మనవరాలు వయసు వారితో హీరోగా నటించడం వెర్రి గంతులు వేయడం సిగ్గు చేటు. తాతలు తమ వయసుకు తగ్గ వేషాలు వేసుకుంటే ఓకే. తాత హీరోలు ఆలోచించాలి. రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. కూడా కుర్ర వేషాలు వేయడం సరికాదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అలా చెస్తే మా ఫాన్స్ గతి ఏమిటి? అని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇది తెలుగు సినిమా చట్ట విరుద్ధం అని విన్నవించుకుంటున్నాను

   తొలగించండి
 4. పవన్,
  మీ బ్లాగులో వచ్చే కామెంట్లు aggregator “మాలిక” లో కనబడడం లేదని, “మాలిక” వారికి ఇమెయిల్ ద్వారా తెలియజేయమని ఆ మధ్య మీకో ఉ.బో.స ఇచ్చాను, గుర్తుందా? “మాలిక” వారి దృష్టికి తీసుకు వస్తానని మీరు అన్నారు కూడా. ఏమైనా జరిగిందా? ఇప్పటికీ అదే పరిస్థితి.

  - విన్నకోట నరసింహారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కాలమతి ని కదా, ఇప్పుడే request చేశాను మేష్టారు, Thanks.

   తొలగించండి
  2. కామెంట్లు కనిపిస్తున్నాయండోయ్. భరద్వాజుడు ("మాలిక") మంత్రం వేసినట్లున్నాడు🙂.

   తొలగించండి
  3. అవును మేష్టారు , థాంక్స్ మీకు అలాగే వారికి కూడా .

   తొలగించండి