2, జులై 2023, ఆదివారం

రెండు పాత సినిమాలు

ఈ వారాంతం లో ఇంట్లో ఎవరూ లేక కాస్త తీరిక దొరికి కొత్త సినిమాలు చూడబుద్ది కాక పాత కామెడీ సినిమాలు వెదికితే చూడని సినిమాలు ఏవీ దొరక్లేదు. సరే, కనీసం కృష్ణ గారి సినిమాలు చూసి కాస్త నవ్వుకుందామని వెదికితే నేను ఎప్పుడూ చూడని "సింహ గర్జన" సినిమా కనపడింది. సరే వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఆరేస్తూ, ఆరిపోయిన బట్టలు మడిచేస్తూ, ఇల్లు ఊడుస్తూ, భోజనం చేస్తూ సినిమా మీద కన్నేస్తూ ఉంటూ వారాంతపుకార్యం స్వకార్యం రెండూ పూర్తవుతాయి కదా అని సినిమా చూడ్డం మొదలెట్టా. 

కృష్ణ హీరోగా, గిరిబాబు సెకండ్ హీరోగా పర్వాలేదనిపించే సినిమా. మరి గిరిబాబు నిర్మాతనో లేక మరో కారణమో తెలియదు గానీ సినిమాలో కొన్ని చోట్ల చాలా సేపు కృష్ణ తెర మీద కనిపించడు, గిరిబాబే లీడ్ తీసుకుంటూ ఉంటాడు మొదటి సగం లో. కృష్ణ ఆ రేంజ్ హీరో అయి ఉండీ భేషజాలకి పోకుండా పెద్దగా ఇమేజ్ లేని గిరిబాబుకి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడం మరి కృష్ణ గారి గొప్పతనమో లేక సంవత్సరానికి పది పన్నెండు సినిమాలతో బిజీ గా ఉండే కృష్ణ గారి కాల్షీట్స్ దొరకక అలా లాగించేసారో తెలీదు మరి?

సరే అని మరుసటి రోజు "సింహబలుడు" అనబడే సినిమా చూద్దామనుకొని యూట్యూబ్ ఓపెన్ చెయ్యగానే..ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు లేదంటే వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు  యూట్యూబ్ తన తెలివితేటల్ని ప్రదర్శించి సింహబలుడు సినిమాని సజెస్ట్ చేసింది. 

'మమ్మల్ని కాపాడటానికి ఎవరో ఒకరు రాకపోరు' అంటూ తరతరాలుగా తెలుగు సినిమాల్లో తరచూ ఇప్పటికీ వినిపించే స్టాక్ డైలాగ్ తో మొదలయ్యే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ అయిన ఎంటీవోడు, వాణిశ్రీ ఇద్దరూ ముదురు టెంకలే కావడం వల్ల సినిమా జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది. పైగా అదేదో అలెగ్జాOడర్ రాజ్యం ఏలుతున్నట్లు రావు గోపాల్ రావుకు, మరికొందరికి గ్రీకు రాజుల లాగా గెటప్ లు ఉంటాయి.

పైగా అదేం దౌర్భాగ్యమో గానీ పాత తెలుగు సినిమాల్లో హీరో కి చెల్లి అయిన పాపానికి ఆవిడకి మరణం తప్పదన్న సూత్రాన్ని ఈ సినిమా పాటించింది. ఇప్పటిలాగా అప్పట్లో మనోభావాలు ఉంటే ఎందరి చెల్లెమ్మల మనోభావాలు దెబ్బతినేవో పాపం?

ఇక ఈ సినిమా పూర్తిగా చూసేలోపు నేనెక్కడ ఆరిపోతానో అని భయపడుతూ ఆరిపోయిన బట్టలు మరుస్తూ ఉండటం పక్కన బెట్టి రిమోట్ చేతిలోకి తీసుకోబోతుంటే .. షోలే లో హేమమాలిని లాగా విలన్స్ ముందు డాన్స్ ఆడుతూ వాణిశ్రీ గారి నృత్య విన్యాసాలు చూసేప్పటికి ఇక ఇంతకంటే చూడటానికి దారుణాలు ఏముంటాయిలే, నిండా మునిగిన వాడికి చలేమిటి అని మిగిలిన ఆ కొద్ది సినిమా పూర్తిగా చూసేశాను. 

ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకుడైతే అప్పటికింకా పేరొందని మరో ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి సహ దర్శకుడు కావడం విశేషం.  

పై రెండు సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అవడమే కాకుండా రెంటిలోనూ మరికొన్ని సారూప్యతలు ఉన్నాయి. 

  • రెండు సినిమాల్లోనూ మోహన్ బాబే ప్రతినాయకుడు అవ్వడం 
  • రెండు సినిమాల్లోనూ హీరోయిన్ రాజు గారి కుమార్తె అవ్వడం, నూటికి తొంభై తెలుగు సినిమాల్లో ఇది కామన్ అనుకోండి. 
  • రెంటిలో సుమారుగా ఒకే కథ, చాలా వరకు ఒకే సీన్స్ ఉండటం మరీ ముఖ్యంగా బానిసల సీన్ .. వినోదం కోసం బానిసల మధ్య పెట్టిన పోరాటాలు, తర్వాత బానిసల తో కలిసి తిరుగుబాటు చేయడం అక్కడ గిరిబాబు అయితే ఇక్కడ ఎంటీవోడు అన్నీ సేమ్ టు సేమ్

నేను పుట్టక మునుపే రిలీజ్ అయిన సినిమాలు కాబట్టి ఏ సినిమా హిట్టయ్యిందో ఏ సినిమా ఫట్టయ్యిందో నా కళ్ళతో చూడలేదు గానీ ఆ తర్వాత ఎప్పుడో విన్న సమాచారం ప్రకారం సింహ గర్జనే ఒక మెట్టు పైన నిలిచిందట. 

ఏది ఏమైతేనేం ఈ రెండు సినిమాలు చూసి తల బొప్పి కట్టించుకున్నట్లు మరే చెత్త సినిమాలు చూడకూడదు అనుకున్నా. కానీ కుక్క తోకే కాదు మనిషి బుద్ధి కూడా వంకర కాబట్టి మళ్ళీ యు ట్యూబ్ ఓపెన్ చేస్తే.... సింహ గర్జన, సింహ బలుడే కాదు సింహం అనే పేరుండే తెలుగు సినిమాలన్నీ అది వరసబెట్టి సజెస్ట్ చేస్తూ పోతే  

పల్నాటి సింహం

కొండవీటి సింహం

పల్లెటూరి సింహం

సాహస సింహం

కొదమ సింహం

భారత సింహం 

అడవి సింహాలు

సింహం నవ్వింది

జై సింహ

జయ సింహ

నర సింహ 

సింహం పులి 

ఆ తర్వాత పులితో మొదలెట్టి బొబ్బిలి పులి, పులి బెబ్బులి, పులి బిడ్డ వామ్మో అవన్నీ చూసి నేను ఏ సింహం లానో పులి లానో మారితేనే ???

నో నేను మనిషిని అన్నాననుకోండి అప్పుడు గూగుల్ ఆ మాటని పట్టేసుకుని 

దేవుడు చేసిన మనుషులు

నకిలీ మనిషి 

దేవుడి లాంటి మనిషి

మనిషికో చరిత్ర 

అని తెలుగు సినిమా చరిత్రలోని సినిమాలన్నీ సజెస్ట్ చేస్తూ పోతే ??? 

4 కామెంట్‌లు:

  1. ఆహా, ఎన్నాళ్ళకెన్నాళకు, పవన్ కుమారా !! దీనికి ముందు మీరు పెట్టిన పోస్టు జనవరిలో మాత్రమే అని గుర్తు తెచ్చుకోండి. ఏడు నెలల అంతరాయమా? నో, ఏ మాత్రమూ బాగుండలేదు. అంత బిజీ బిజీయా?

    మొదటి పేరా చూస్తే మహేష్ బాబు మీ మీద విరుచుకు పడతాడేమో జాగ్రత్త. ఏం, మీ అభిమాన బాసుడి సినిమాల్లో హాస్యభరితమైనవి లేవా?

    ఏమైతేనేం, వెల్కం బాక్. ఇక పైనవయినా తరచూ కనబడుతుండండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. IT ఫీల్డ్ కదండీ ఎప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ తలకెత్తుకోవాల్సి వస్తుందో తెలీదు, ఈ సంవత్సరం ఒక దిక్కు మాలిన ప్రాజెక్ట్ లో పడటం వల్ల పది నిమిషాలు కూడా తీరిక చిక్కట్లేదు పైగా IT ఫీల్డ్ లో up to date ఉండాలి, లేదంటే చెల్లని నాణెం లా మిగిలిపోతాం కాబట్టి కాస్త ఫోకస్ అటు వైపు పెట్టడం కూడా ఈ విరామానికి కారణం మేష్టారు.

      యూట్యూబ్ పుణ్యమా అని కృష్ణ గారి సినిమాలు ఓ 250 పైగానే చూశాను, నాకు తెలిసి వారి పుత్ర నక్షత్రం కూడా చూసి ఉండరేమో.

      తొలగించండి
  2. ప్రాజెక్ట్లో పడడం వల్ల ఓ పది నిమిషాలు కూడా తీరికలే !
    యూట్యూబు పుణ్యమా అని కృష్ణ గారి 250 పై సినిమాలు చూసా :)
    ఈ రెండింటికి మధ్య పొంతన కనబడటము లేదు :)


    ఇట్లు
    కలహాల్రాణి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గత 6 నెలల సమాచారాన్ని గత పదేళ్ళ సమాచారంతో మిక్స్ చేయడం వచ్చిన తిప్పలివి జిలేబి గారూ.

      తొలగించండి