7, జులై 2022, గురువారం

ఈ ఆర్ధిక సహాయం మతలబేంటో అర్థం కాదు నాకు

సాధారణంగా ఏ సినిమా అయినా టైటిల్స్ తో సహా చూస్తేనే సినిమా చూసిన ఫీలింగ్ ఉండే నాకు "శివ శంకర్", "సలీం", "గౌతం రాజు", "మార్తాండ్ కె వెంకటేష్", "రాజు సుందరం", "రాజు" లాంటి కొన్ని పేర్లు బాగా గుర్తుండిపోయాయి. వీరందరూ ఎక్కువగా తెర వెనుక పనిచేసే వాళ్ళే కాబట్టి నిన్నా మొన్నటి వరకూ ఈ సోషల్ మీడియా రానంతవరకూ వారి మొహాలు తెలీక పోయినా వారి పేరు బాగా గుర్తు. 

సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరైనా చనిపోతే వారిలో కొందరికి చిరంజీవి  లాంటి వారు ముందుకొచ్చి వారి కుటుంబానికి మా తరపు నుండి ఆర్ధికసహాయం అని చెప్పి వారి కుటుంబాలకి కొంత డబ్బు అందిస్తూ ఉంటారు. 

రీసెంట్ గా ఓ రెండు లక్షల ఆర్ధిక సాయాన్ని దాదాపు  850 పై చిలుకు సినిమాలకి ఎడిటర్ గా పని చేసిన "గౌతం రాజు" కుటుంబానికి  చిరంజీవి అందజేశారు అని విన్నాను. ఆ 850 సినిమాలలో తెలుగే కాకుండా తమిళం, కన్నడ, హిందీ చిత్రాలు ఉన్నాయని అంటున్నారు. అంటే అన్ని సినిమాలకు పని చేసినా వారి కుటుంబానికి నిజంగా ఆర్ధిక సాయం అవసరం అయిందా లేదంటే అది కేవలం తన సినిమాలకి పని చేసినందుకు గానూ కృతజ్ఞతగా చిరంజీవి అందజేశారా అన్నది తెలీదు. రెండవ కారణం నిజం అయితే పర్లేదు, లేదు నిజంగానే వారి ఫామిలీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటే కాస్త విశ్లేషించుకోవాల్సిందే. 

డాన్స్ మాస్టర్ శివ శంకర్, ఫైట్ మాస్టర్ రాజు విషయంలో కూడా ఇలానే జరిగిందని విన్నాను. అంటే దీన్ని బట్టి చూస్తే ఒకటి, వారు వారి సంపాదనని సరైన మార్గం లో ఇన్వెస్ట్ చేయలేదనుకోవాలి లేదంటే వారి వేతనం బాగా తక్కువుగా అయినా ఉండి ఉండాలి. 

ఒక వేళ వారి వేతనం బాగా తక్కువుగా ఉంది అంటే తిరిగి నిందించవలసింది చిరంజీవి లాంటి పెద్ద హీరోలనే. ఈ హీరోలు తీసుకునే కోట్లలో ఒక అర కోటి తగ్గించుకొని అది తెర వెనుక పనిచేసే వారి వేతనాలకు కలిపితే ఇలాంటి ఇబ్బందులు వారి ఫ్యామిలీస్ పడకుండా ఉంటారు అలాగే ఈ రెండు మూడు లక్షల ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం రాకపోవచ్చు. 

ఒక రకంగా చూస్తే ఇది అధికారం లో ఉన్న నాయకులు ఆ ఐదేళ్లు ప్రజల డబ్బులు దోచేసుకొని మళ్ళీ ఎన్నికల ముందు ఓటుకు నోటు ఇచ్చే టైపులా ఉంది. 

6, జులై 2022, బుధవారం

నిన్నా మొన్నటి సినిమా కబుర్లు

హీరో రవితేజ ఏజ్ కి బచ్చన్ ఫ్యాన్ అంటే ఓకే గానీ పూరీ ఆకాష్ ఏజ్ కి బచ్చన్ ఫ్యాన్  ఏమిటో?? బచ్చన్ , షారుక్ వీళ్లంతా ఎప్పుడో అవుట్ డేటెడ్  అయిపోయారు అని ఆ డైరెక్టర్ అప్డేట్ అవ్వకుండా లేదంటే పదేళ్ళ క్రితమెప్పుడో రాసుకున్న కథతో జార్జి రెడ్డి లాంటి అంతో ఇంతో మంచి సినిమా తీసిన డైరెక్టర్  'చోర్ బజార్'  అనే సినిమా తీస్తే అది 'బోర్ బజార్' అని చూసిన అతి కొద్దిమంది ప్రేక్షకులు తీర్పు ఇచ్చేశారు. బచ్చన్ గారు ఉండీ కూడా  సైరా కి ఒక్క వంద టికెట్స్ కూడా సరిగ్గా తెగినట్లు లేవు బాలీవుడ్ లో. ఇంకా బచ్చన్, చిరంజీవి అంటూ ఉంటే ఎలా?

హీరోల కొడుకులు హీరోలుగా క్లిక్ అవుతున్నారు కానీ డైరెక్టర్స్ కొడుకులు హీరోలుగా నిలబడలేక పోయారు, కారణం కొడుకులు హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి ఆ డైరెక్టర్స్ డైరెక్షన్ గేట్ ఎగ్జిట్ దగ్గరికి చేరటమే కారణం. 

కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, ఈవీవీ సత్యనారాయణ ఇలా చాలా మంది దర్శకులు వారి బిడ్డల్ని స్టార్స్ చేయలేకపోయారు. పూరీ జగన్నాథ్ కూడా ఆ కోవలోకే చెందుతాడేమో. 

గాలి నాగేశ్వర రావు అనే సినిమా కి జిన్నా అని పేరు మార్చారు. గాలి నాగేశ్వర రావు షార్ట్ కట్ లో జిన్నా అవుతుందని వాళ్లకు ఎలా అనిపించిందో. ఏదో ఒక కాంట్రవర్సీ చేసి జనాలకు సినిమాని దగ్గర చెయ్యాలని చూస్తున్నట్లు ఉంది గానీ అశోక వనంలో అర్జున కళ్యాణం విషయంలో ఇలాంటి పప్పులు ఉడకలేదని తెలియదేమో ఈ జిన్నా మేకర్స్ కి.  నిన్నా, ఇవాళ సిగరెట్ తాగుతున్న కాళికా పోస్టర్ కూడా ఈ పైత్యానికి సంబంధించినదే. 

సినిమాలను రెండు మూడు వారాలకే ఓ.టి.టి కి ఇవ్వడం వల్ల థియేటర్స్ కి జనాలు రావడం లేదని భ్రమపడి సినిమా రిలీజ్ పూర్తి అయిన ఏడు వారాల వరకూ ఓ.టి.టి కి ఇవ్వకూడదు అని నిర్మాతల మండలి (ఇదసలు ఉందో లేదో తెలీదు కానీ అప్పుడప్పుడూ ఈ పేరు వినపడుతూ ఉంటుంది, ఆటలో అరటిపండు లాగా అన్నమాట) తీర్మానించిందట. తొక్కలో సినిమా కోసం ఓ 50 రోజులు ఆగలేమా అనుకునే జనాలే  ముప్పాతిక శాతం మంది ఉంటారు అన్న విషయం మర్చిపోయారేమో మరి. 

ఒక్క సినిమా ఘోరంగా విఫలమయ్యాక, 150 సినిమాల విషయంలో గుర్తురాని న్యూమరాలజీ ఇప్పుడు గుర్తుకొచ్చి తన పేరులో మరో 'E' చేర్చుకున్నారని అందరూ అంటుంటే లేదు లేదు అది ఎడిటింగ్ లో జరిగిన లోపమని సరిపెట్టుకున్నారు ఒక జీవి. 

ఒకానొక అవార్డు విన్నర్, RRR సినిమాని గే సినిమా అన్నారని ఆయన పేరు లోని బూతు పదాన్ని హైలైట్ చేస్తూ ట్వీట్ చేశారొక సంగీత జ్ఞాని. 

అల్లూరిని ఈ మాత్రమైనా జనాలు గుర్తుంచుకునేలా చేసిన ఆ స్టార్ ని కాకుండా మరో స్టార్ ని అల్లూరి విగ్రహావిష్కరణ కి ఆహ్వానించారని మండిపడుతున్న ఒక వర్గం. 

ఎవడి పెళ్ళాం ఎవరో, ఎవడి మొగుడు ఎవురో అర్థం కాక మాజీ మొగుడు, మాజీ పెళ్ళాం, తాజా పెళ్ళాం, తాజా మొగుడు అని జుట్టు పీక్కుంటూ రోడ్డుకెక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియని సినిమా తర్వాత "నిన్న ఒరు తమిళ్ పడం సూస్తిమి కదా, అదు నేను హీరోగా నీ డైరచ్చన్ లో రీమేక్ సేస్తుమా" అని ఓ అన్యోన్య జంట ముచ్చటించుకుంటున్నట్లు సమాచారం.