6, జులై 2022, బుధవారం

ఈ ఆర్ధిక సహాయం మతలబేంటో అర్థం కాదు నాకు

సాధారణంగా ఏ సినిమా అయినా టైటిల్స్ తో సహా చూస్తేనే సినిమా చూసిన ఫీలింగ్ ఉండే నాకు "శివ శంకర్", "సలీం", "గౌతం రాజు", "మార్తాండ్ కె వెంకటేష్", "రాజు సుందరం", "రాజు" లాంటి కొన్ని పేర్లు బాగా గుర్తుండిపోయాయి. వీరందరూ ఎక్కువగా తెర వెనుక పనిచేసే వాళ్ళే కాబట్టి నిన్నా మొన్నటి వరకూ ఈ సోషల్ మీడియా రానంతవరకూ వారి మొహాలు తెలీక పోయినా వారి పేరు బాగా గుర్తు. 

సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరైనా చనిపోతే వారిలో కొందరికి చిరంజీవి  లాంటి వారు ముందుకొచ్చి వారి కుటుంబానికి మా తరపు నుండి ఆర్ధికసహాయం అని చెప్పి వారి కుటుంబాలకి కొంత డబ్బు అందిస్తూ ఉంటారు. 

రీసెంట్ గా ఓ రెండు లక్షల ఆర్ధిక సాయాన్ని దాదాపు  850 పై చిలుకు సినిమాలకి ఎడిటర్ గా పని చేసిన "గౌతం రాజు" కుటుంబానికి  చిరంజీవి అందజేశారు అని విన్నాను. ఆ 850 సినిమాలలో తెలుగే కాకుండా తమిళం, కన్నడ, హిందీ చిత్రాలు ఉన్నాయని అంటున్నారు. అంటే అన్ని సినిమాలకు పని చేసినా వారి కుటుంబానికి నిజంగా ఆర్ధిక సాయం అవసరం అయిందా లేదంటే అది కేవలం తన సినిమాలకి పని చేసినందుకు గానూ కృతజ్ఞతగా చిరంజీవి అందజేశారా అన్నది తెలీదు. రెండవ కారణం నిజం అయితే పర్లేదు, లేదు నిజంగానే వారి ఫామిలీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటే కాస్త విశ్లేషించుకోవాల్సిందే. 

డాన్స్ మాస్టర్ శివ శంకర్, ఫైట్ మాస్టర్ రాజు విషయంలో కూడా ఇలానే జరిగిందని విన్నాను. అంటే దీన్ని బట్టి చూస్తే ఒకటి, వారు వారి సంపాదనని సరైన మార్గం లో ఇన్వెస్ట్ చేయలేదనుకోవాలి లేదంటే వారి వేతనం బాగా తక్కువుగా అయినా ఉండి ఉండాలి. 

ఒక వేళ వారి వేతనం బాగా తక్కువుగా ఉంది అంటే తిరిగి నిందించవలసింది చిరంజీవి లాంటి పెద్ద హీరోలనే. ఈ హీరోలు తీసుకునే కోట్లలో ఒక అర కోటి తగ్గించుకొని అది తెర వెనుక పనిచేసే వారి వేతనాలకు కలిపితే ఇలాంటి ఇబ్బందులు వారి ఫ్యామిలీస్ పడకుండా ఉంటారు అలాగే ఈ రెండు మూడు లక్షల ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం రాకపోవచ్చు. 

ఒక రకంగా చూస్తే ఇది అధికారం లో ఉన్న నాయకులు ఆ ఐదేళ్లు ప్రజల డబ్బులు దోచేసుకొని మళ్ళీ ఎన్నికల ముందు ఓటుకు నోటు ఇచ్చే టైపులా ఉంది. 

10 కామెంట్‌లు:

  1. మీరేవేవిటో “ఘనంగా” ఊహించుకుంటారల్లే ఉందే? ఎంత చేటైనా ఇంత చేటా అనేవాళ్ళు లెండి పాతకాలం వాళ్ళు. అలాగ ఎంత అభిమానమైనా ఇంత అభిమానమా?

    ఇక మీరన్న సలహా తమ పారితోషికం కూసింత తగ్గించుకోవడం గురించి … నాకొకటి గుర్తొచ్చింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను గమనించినది ఒకటుండేది. ఖర్చులు తగ్గించాలి తగ్గించాలి అంటూ క్రింది వారిని ఊదరగొట్టేస్తుండేది హెడ్ ఆఫీస్. పై వాళ్ళు కూడా విమానాల్లో తిరిగే బదులు రైల్లో వెళ్ళచ్చు గదా (overnight journey ఉండే దగ్గర దూరాలకు); అలాగే 5-నక్షత్రాల హోటల్ బదులు ఓ నక్షత్రం తగ్గించుకోవచ్చు కదా అనీ అనేవాడిని. అవన్నీ జరగవని తెలిసినా … నోటిదూల కదా … పై వాళ్ళతో కాదు గాని పక్కవాళ్ళతో అంటుండేవాడిని (ఆ మాట పక్కవాళ్ళల్లో ఎవరో కొందరైనా పై వాళ్ళకి మోసేసి ఉంటుండేవారని నా అనుమానం). అలా ఉంది మీ ఆశాభావం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలాంటి ఆశాభావంతోనే అనుకోండి, అయినా ఇది వాళ్ళ చెవి కెక్కినా విదిలించుకొని వెళ్ళరూ

      తొలగించండి
  2. ఏమిటి మీ సిడ్నీ నగరం వర్షాలకు అతలాకుతలంగా ఉందట? ఇందాక ఓ టీవీ ఛానెల్లో ఏంకరిణి చాలా ఆవేదనతో చెప్పింది. అంతా కంట్రోల్ లోనే ఉందా? ఒపేరా హౌస్ నిలబడుందా 😄?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇవాళే ఆ వరుణ దేవుడు కాస్త కనికరించాడు లెండి, లేదంటే అదీ అయ్యేదే

      తొలగించండి
  3. అవును, నాకు అదే అనుమానం . 800 సినిమాలు కి పైగా ఎడిటర్ , అంత్యక్రియలకు 2 లక్షలు సహాయం చేసిన చిరంజీవి అంటే , షాక్ అయ్యాను . లాజిక్ అర్ధం కావడం లేదు .

    రిప్లయితొలగించండి
  4. పవన్,
    పైన “అజ్ఞాత” పేరుతో కనబడుతున్న మొదటి రెండు వ్యాఖ్యల రచయిత నేనే నేనే (ఈ పాటికే మీరు ఊహించి ఉండకపోతే 🙂).

    రిప్లయితొలగించండి
  5. సినిమా రంగంలో చాలామంది సంపాదించిన దానికన్నా వ్యసనాలకు తగలేసేదే ఎక్కువ. అందుకే ఈ దుస్థితి అనుకుంటాను.

    రిప్లయితొలగించండి