26, అక్టోబర్ 2016, బుధవారం

సిటీ బస్సు లో జరిగిన సంఘటన

ఇండియా వెళ్లినప్పటి కబుర్లలో భాగమైన సెలూన్ లో నా పాట్లు కి తర్వాతి పోస్ట్ ఇది. 

సెలూన్ లో 150 పే చేసి మిగిలిన 50 తో బయటి కొచ్చాను. మెడికల్ షాప్ లో కొన్న సామాన్లు బరువు ఉండటం తో సిటీ బస్సు లో వెళదామని బస్సు స్టాప్ కి వచ్చి ఆగాను.

వచ్చిన 3 బస్సులు ఆగడం వెళ్లిపోవడం అంతా క్షణాల్లోనే జరిగిపోతోంది. అందరూ దిగాక ఎక్కుదాం అని నేను అనుకుంటున్నాను కానీ బస్సు రావడం జనాలు ఎక్కడం దిగడం వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోతోంది. అప్పుడు నా మెదడు కాళ్ళకు సందేశం అందించింది నువ్వు ఇప్పుడు వెయిట్ చేసేది సిడ్నీ బస్ స్టాప్ లో కాదు బెంగుళూరు బస్సు స్టాప్ లో అని. (ఈ విషయంలో కొక్కిరి బిక్కిరి వంకర కాయల కథ  నాకు అన్వయించాలనుకోవడంలో మీ తప్పేమీ లేదు) ఇంకేముంది కాళ్లకు పని చెప్పి బస్సు ఎక్కేసాను. 

bus is a vehicle that runs twice as fast when you are after it as when you are in it 

అని అన్నట్లు బస్సు లోకి ఎక్కాక చాలా నిదానంగా బస్సు వెళ్తున్నట్లు అనిపించింది. 'చాలా రోజులుగా గమనిస్తున్నాను మా ఊరికి వచ్చే దాకా బస్సు బాగా ఫాస్ట్ గా వస్తుంది తీరా మేము ఎక్కాక ఇంత నిదానంగా వెళ్తుందెందుకు ' అని కండక్టర్ ని కోప్పడ్డాడట వెనకటికి ఒకతను. 'మీరు బస్సు దిగాక మళ్ళీ ఆటోమేటిక్ గా స్పీడ్ అందుకుంటుందిలెండి' అన్నాడట లావుగా ఉండే ఆయనను, ఆయన భార్యను, బాల భీముళ్ళ లాంటి వాళ్ళ ఐదుగురు పిల్లలను చూసి. 

నేను దిగాల్సిన స్టాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటే బస్సు లో గొడవ మొదలైంది. 

నువ్వు ఇవ్వాల్సింది 80 అంటున్నాడు ఒక పదిహేను పదహారేళ్ళ కుర్రాడు. 

కాదు 30 అంటాడు కండక్టర్. 

100 ఇస్తే టికెట్ కి 20 పోనూ 80 చేంజ్ ఇవ్వాలి అదే నువ్వు టికెట్ వెనుక వైపు రాసావు అంటాడు కుర్రాడు 

లేదు నేను 30 అని రాసాను నువ్వు దాన్ని 80 అని మార్చావు అంటాడు కండక్టర్ 

ఇలాంటి కుర్రాళ్ళను చాలా మందిని చూశాను నాటకాలు ఆడి డబ్బులు రాబడతారు అన్నాడొక వ్యక్తి మధ్యలో కలగజేసుకొని 

అదిగో తెల్ల కాకి అంటే ఇదిగో దాని పిల్ల కాకి అన్నట్లు - అసలు అక్కడ ఎం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే నాతో పాటు బస్సు లోకి ఎక్కిన మరో ఇద్దరు అతనికి వంత పాడారు. 

తిరిగి ఇంటికి వెళ్ళడానికి, మధ్యాహ్నం అన్నం తినడానికి ఆ 80 అవసరం అంటాడా కుర్రాడు 

అన్నమే నేనూ కడుపుకు తినేది, మన్నుకాదు అంటాడా కండక్టర్ - నేనలా మోసం చేసే టైపు కాదు అనే ఉద్దేశ్యంతో

కండక్టర్ వెళ్ళిపోగానే అసలు ఆ కుర్రాడు ఏ మాత్రం నిజం చెబుతున్నాడు అని అతన్నే కాసేపు అబ్సర్వ్ చేస్తే నావరకైతే అతని బిహేవియర్ లో, కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. 

అసలు నువ్వేమి చేస్తుంటావ్ తమ్ముడూ అని మాటలు కలిపితే 'మార్కెట్ లో పని చేస్తుంటానని, వారం చివర్లో వాళ్ళు డబ్బు ఇస్తుంటారని చెప్పాడు. ఇప్పుడుండే 30 లో తిరిగి ఇంటికెళ్లడానికే 20 కావాలి కాబట్టి మిగిలే 10 రూపాయలతో మధ్యాహ్నం ఎదో ఒకటి తినాలని అన్నాడు. 

నా జేబులో మిగిలిన 30 రూపాయల్లో 20 నోట్ అతనికి ఇచ్చి భోజనానికి ఉంచుకోమంటే ససేమిరా తీసుకోనన్నాడు, కానీ చుట్టుపక్కల ఉన్న మరో ఇద్దరు బలవంతపెడితే తీసుకున్నాడు. 

వెనుక సీట్లో కూర్చున్న ఒక ముస్లిం వ్యక్తి కూడా 30 ఇచ్చి తీసుకోమన్నాడు. ఆ కుర్రాడు తీసుకోకపోతే ఇది నీ డబ్బే అనుకో మీ బాబాయే ఇస్తున్నాడనుకో అని అతని జేబులో పెట్టాడు. 

మీలాంటి అమాయకులు ఉన్నన్నాళ్ళు ఇలాంటి వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు అన్నారు ఆ బస్ లో ఇద్దరు ముగ్గురు. 

ఒకవేళ ఆ పిల్లాడు నిజంగా నిజాయితీ పరుడు అయ్యుంటే నేను చేసిన దాంట్లో తప్పేమి లేనట్లే. ఒకవేళ నేను మోసపోయినా పర్లేదు కనీసం ఆ కుర్రాడు సిగరెట్లో, బీడీలో కాకుండా ఆ డబ్బులతో కడుపు నిండా తిని ఉంటాడు అనే ఆలోచన నన్ను సంతోషపరిచింది.  

4 కామెంట్‌లు: