6, అక్టోబర్ 2016, గురువారం

సెలూన్ లో నా పాట్లు

బెంగుళూర్ లో మొదటి రోజు పోస్ట్ కి కొనసాగింపు

సిడ్నీ లో చాలా వరకు సెలూన్ షాప్స్ Asians వాళ్ళవే ఉంటాయి అంటే ముఖ్యంగా కొరియా వాళ్ళవో లేదంటే చైనా వాళ్ళవో ఉంటాయి. సెలూన్ షాప్స్ అనే కాదు మిగతా షాప్స్ కూడా చాలా వరకు వాళ్ళవే ఉంటాయి. మేము ఉండే చోట అయితే వీళ్ళు మరీ ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడూ  అనిపిస్తూ ఉంటుంది నేను ఉండేది ఆస్ట్రేలియా లోనా లేక కొరియా/చైనా లోనా అని. 

వాళ్లలో చాలా మందికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు అర్థమయి చావదు. ఇంగ్లీష్ మాట్లాడటం లో మనమేదో పెద్ద పిస్తాలం అని కాదు కానీ వాళ్ళ కంటే మనం కొంచెం బెటర్ అని నా ఉద్దేశ్యం. నేను ఇలా ఇలా హెయిర్ కట్ చేయండి అంటాను వాళ్ళేదో అర్థం చేసుకుంటారు చివరికి వాళ్ళ పద్దతిలో చేసేస్తారు. మన వెంట్రుకలను  అంట రాని వాటి కింద లెక్కేసి చేత్తో ముట్టుకోకుండా మిషన్ తోనే హెయిర్ కట్ కానిచ్చేస్తారు. 

అదే మన ఇండియా లో అయితే మనకు నచ్చే పద్దతిలో  హెయిర్ కట్ చేయించుకోవచ్చు అంతేకాదు చక్కగా కత్తెర తో కట్ చేస్తారు.  పైగా సిడ్నీ లో 20 డాలర్లు సమర్పించుకోవాలి అదే ఇండియా లో అయితే 200 లో కటింగ్ తో పాటు షేవింగ్ కూడా చేయించుకుకోవచ్చు కదా అందుకని ఇండియాకు బయలు దేరే ముందు 2 నెలల నుంచి హెయిర్ కట్ చేయించుకోలేదు కాస్త డబ్బులు మిగుల్చుకుందామని. ఇదేం కక్కుర్తి అంటారా ఏం చేస్తాం మిడిల్ క్లాస్ మెంటాలిటీ. పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా పుడకలతో పోవాల్సిందే. 

మెడికల్ షాప్ లో మిగిలిన 200తో హెయిర్ కట్ చేయించుకుందామని సెలూన్ వెళ్ళాను. సోమవారం అదీ మధ్యాహ్నం అవ్వడం వల్లనేమో సెలూన్ ఖాళీగా ఉంది. ఒక మూల కుక్క కూర్చొని ఉంది షాప్ వాడిదే అనుకుంటాను. కుర్చీ లో కూర్చుని కునికి పాట్లు పడుతున్న కుర్రాడు నన్ను గమనించి కటింగా సర్ అన్నాడు.

అవునన్నాను.

కుర్చీ చూపించి కత్తెర అందుకున్నాడు హెయిర్ కట్ చేద్దామని


అలాగే  షేవింగ్ కూడా అన్నాను. కాస్త ఆశతో  కుక్క వచ్చి నా చైర్ వెనుక కూర్చున్నట్లు అనిపించింది. 

ఫ్యాన్ తో పాటు టీవీ ఆన్ చేసి మంచి పాటలు పెట్టాడు 

చూడమ్మా ఇలా కట్ చెయ్ అలా కట్ చెయ్ అని instructions ఇవ్వబోయాను 

జుట్టున్నయ్య అయితే ఏ కటింగ్ అయినా కొట్టించుకోవచ్చు కానీ .. నీకుండే నాలుగు వెంట్రుకలకు ఇన్ని instructions అవసరం లేదనుకుంటానురా డిప్పకాయ్ అనేట్లు పెట్టిన అతని పేస్ ఎక్స్ప్రెషన్స్ అద్దం లో గమనించి కటింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ అయిపోయాను 

షేవింగ్ మొదలెడుతూ, సర్ డెనిమ్ షేవింగ్ క్రీం రాయమంటారా లేక లోకల్  షేవింగ్ క్రీం రాయమంటారా అన్నాడు 

తేడా ఏమిటి అన్నాను 

డెనిమ్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తాం లోకల్  షేవింగ్ క్రీం అయితే తక్కువ ఛార్జ్ చేస్తాం అన్నాడు 

ఉన్నది 200 రూపాయలు అందుకని ఎందుకైనా మంచిదని లోకల్  షేవింగ్ క్రీం యూస్ చెయ్యి అన్నాను 

సరే అని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసాడు. 

పేస్ ప్యాక్ ఏమన్నా వేయమంటారా అన్నాడు 

వద్దమ్మా అన్నాను 

పాటలు వస్తున్నఛానల్ మార్చి 'నీదీ ఒక బతుకేనా' అనే సీరియల్ వస్తున్న ఛానల్ పెట్టాడు. 

ఇందాకా కటింగ్ చేస్తున్నప్పుడు అబ్సర్వ్ చేసాను సర్ మీ తల బాగా హీట్ ఎక్కినట్లు ఉంది, నవరత్న ఆయిల్ తో మసాజ్ చేయమంటారా అని నవరత్న ఆయిల్ గుర్తు చేసి మరింత మంటెక్కించాడు.

వద్దమ్మా అన్నాను 

అంత దాకా నెమలి ఈక తో చేస్తున్నట్లు అనిపించిన షేవింగ్ కాస్తా మచ్చుకత్తి తో బరా బరా గోకుతున్నట్లు అనిపించింది.  

కుక్క కళ్ళలో ఆశ మరింత పెరిగింది నా చెవి ముక్క కాస్త దొరుకుతుందని. 

పరిస్థితి అర్థమయి 'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే చేతులు కాలకుండా ఉండేట్లు' నివారణా చర్యలు మొదలెట్టాను.

ఇప్పుడు కాస్త అర్జెంటు పని మీద బయటకు వెళ్లాలి సాయంత్రం తీరికగా వచ్చి ఆయిల్ మసాజ్, ఫేసియల్ చేయించుకుంటాలే అన్నాను 

 'నీదీ ఒక బతుకేనా' అనే సీరియల్ వస్తున్న ఛానల్ కాస్తా మార్చేసి 'రాజువయ్యా మహరాజువయ్యా' పాట వస్తున్న ఛానల్ పెట్టాడు. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు. మచ్చుకత్తి తో కాకుండా నెమలీక తో షేవింగ్ చేయడం మొదలెట్టాడు.

కుక్క నా సీట్ వెనుక నుంచి వెళ్ళిపోయి దాని ప్లేస్ లో అది పడుకుండిపోయింది నిరాశగా.

ఇవండీ నా ఇక్కట్లు/ పాట్లు మొదటి రోజు బెంగుళూరు లో ఇండియా కి వెళ్లినపుడు.

డాలర్స్ సంపాదిస్తూ ఇండియా లో రేట్స్ పెరిగాయని మీరు ఏడుస్తున్నారే మరి రూపాయలు సంపాదిస్తూ రూపాయలు ఖర్చు పెట్టాలంటే మాకెంత ఇబ్బందో ఆలోచించండి అన్నారు ఒకతను నా పాత పోస్ట్ చదివి.  ఏం చేస్తాం సర్ పీత కస్టాలు పీతవి సీత కస్టాలు సీతవి.

ఈ పోస్ట్ కు వచ్చే రెస్పాన్స్ బట్టి ఇండియా విశేషాలు రాయాలా వద్దా అని డిసైడ్ అవుతాను. దయచేసి మీకు ఇవి నచ్చాయో లేదో తెలియజేయండి. 

14 కామెంట్‌లు: 1. తలగొరిగిరి నిండుగ సుజ
  న లక్ష ణముగాను నన్ను నట్టేటన ముం
  చె! లకారంబుల దస్కము
  నలవోకగ ఖర్చు జేసి నాడ జిలేబీ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. @జిలేబి గారు, అంత అర్ధం కాలేదు కానీ పవన్ గారి టపా కంటే మీ పద్యం బావుంది :) పవన్ గారు కార్టూన్, కార్టూన్ లో కుక్క కూడా బావున్నాయండీ :)

   తొలగించండి
  2. థాంక్స్ అండీ జిలేబీ గారు పద్యం రాసినందుకు..కానీ నా బోటి వాళ్లకు అర్థం అయి చావదు అదే సమస్య.

   తొలగించండి
 2. chandrika గారూ ధన్యవాదాలండీ కామెంట్స్ పెట్టినందుకు. అసలు కంటే కొసరే ముద్దంటారు అయితే. ఏదో లాస్ట్ మినిట్ లో ఆ కార్టూన్ ట్రై చేసి గీసానండి.

  రిప్లయితొలగించండి
 3. పోస్టు బాగుంది. అప్పుడెప్పుడో ఆరంభశూరత్వంతో నేను మొదలెట్టి రాసుకున్న బ్లాగులో ఇలాంటి అనుభవాన్నే నాతోనేను పంచుకున్నాను.

  https://kaalakshepam.wordpress.com/%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ అండీ సూర్య గారు. కడుపుబ్బా నవ్వించారండి మీ పోస్ట్ తో. రాయడం కంటిన్యూ చేయండి వీలున్నప్పుడల్లా. నాకూ సమయం దొరకదు కొన్ని సార్లు రాయడానికి, చూద్దాం నేనెన్ని రోజులు రాస్తానో

   తొలగించండి
 4. చాలా బాగా రాస్తున్నారు. ప్రొసీడ్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ కామెంట్స్ కు, ప్రోత్సాహానికి ధన్యవాదాలండి శ్రవణ్ గారు

   తొలగించండి
 5. nice writing...i liked very much..!! keep writing buddy..long way to go...

  రిప్లయితొలగించండి
 6. మీ బ్లాగ్ పోస్ట్ ఇడ్లీకి కార్టూన్ చట్నీ బాగా కుదిరింది :))

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలండి లలిత గారు. ట్రైన్ లో వెళ్తూ ఉన్నప్పుడు బోర్ కొట్టి ఈ పోస్ట్ కు తగ్గట్లు గీసిన కార్టూన్ అండీ అది.

   తొలగించండి
 7. భలే ఉంది సెలూన్ గొడవ. మీరు ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇవేనా మొదటి పోస్టులు?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవునండీ .. చాలా ఉంది రాయాల్సింది. కాకపొతే పని ఒత్తిడి లో రాయడం కష్టంగా ఉంది.

   తొలగించండి