ఈ ప్రపంచంలో మీకిష్టమైన సిటీ ఏమిటి? అని అడిగితే 'పబ్లిసిటీ' అని సమాధానం ఇస్తాడు. ఊరందరిదీ ఒక దారైతే ఇతనిది మరో దారి. మీకీపాటికే అర్థం అయి ఉంటుంది ఆ ఉలిపి కట్టె ఎవరో.
'శివ' సినిమా ఏడవ తరగతి లో చూశాను (నా వయసెంత ఉండచ్చు అని లెక్కలెయ్యకండి ఇప్పటిప్పుడు నా వయసు ఇంకా... అని తక్కువ చెప్పుకోవడానికి నేనేమైనా హీరోయిన్నా? వయసు దాచుకోవడానికి ఏముంది జస్ట్ మొన్నే ముప్పై దాటింది) శివ సినిమా అప్పుడు పెద్దగా నచ్చలేదు ఆ తర్వాత ఎప్పుడూ చూడాలని అనిపించలేదు. స్కూల్ డేస్ లో కాబట్టి ఆ కాలేజీ గొడవలు ఆ మాఫియా నచ్చలేదు నాకు.
ఆ తర్వాత వచ్చిన క్షణక్షణం మాత్రం బాగా నచ్చింది, శ్రీదేవి యాక్టింగ్ వల్ల అనుకుంటా. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వర్మ ఫోకస్ అంతా శ్రీదేవి మీదే ఉండేదట.
ఏదో ఒక సాంగ్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు .. ఓకే, అంతా బాగా వచ్చింది ప్యాకప్ అన్నారట వర్మ గారు.
డాన్స్ స్టెప్ సరిగ్గా కుదరలేదండి అన్నారట డాన్స్ మాస్టర్.
ఇదిగో అద్భుతంగా కుదిరింది కదా అన్నారట వర్మ.
మీరు శ్రీదేవి డాన్స్ మాత్రమే చూస్తున్నారు, కాస్త వెంకటేష్ గారి డాన్స్ స్టెప్ ని చూడండి సింక్ అవ్వట్లేదు మిగతా వారితో అన్నారట ఆ డాన్స్ మాస్టర్.
మనలో మన మాట.. ఈ డాన్స్ మూవ్మెంట్స్ లో నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ విషయంలో ఇలాంటివి ఎన్ని సార్లు జరిగి ఉంటాయో. అల్లరి ప్రియుడు షూటింగ్ టైం లో రాజశేఖర్ డాన్స్ కి మిగతా డాన్సర్స్ డాన్స్ కి ఎంతకీ సింక్ కుదరక రాజశేఖర్ ఎలా చేస్తాడో మీరు అలాగే చేయండి అని గ్రూప్ డాన్సర్స్ తో డాన్స్ మాస్టర్ అన్నాడని అప్పుడెప్పుడో విన్నట్లు గుర్తు.
క్షణక్షణం తర్వాత కొన్ని మంచి సినిమాలు, కొన్ని ప్లాప్ సినిమాలు తీసి ఆ తర్వాత గోవిందా గోవిందా అంటూ తెలుగుకు గుడ్ బై చెప్పేసి ముంబై కి వెళ్ళాడు. ఎలాగోలా సినిమాలు తీసి బతికేద్దాం అని కాదు ఎలాంటి సినిమాలు తీయొచ్చో చూపించడానికి. రంగీలా, సత్య, సర్కార్, కంపెనీ అంటూ ఒక ట్రెండ్ సృష్టించాడు. ఆ తర్వాత పతనం తెలిసిందే.
'గరిటెడైన చాలు గంగి గోవు పాలు కడివెడైన నేమి ఖరము పాలు' అనే మాట మరచి మీ ఖర్మ చూడండి ఈ వర్మ సినిమాలు అని కుప్పలు తెప్పలుగా సినిమాలు తీస్తున్నాడు. అలా తీయడంలో అర్థం లేదని ఆయనకీ తెలిసే ఉంటుంది కాకపోతే దీపం ఉండేలోపే ఇల్లు చక్క బెట్టుకోవాలని అనుకుంటున్నాడేమో.
కానీ ఒక్కటి మాత్రం నిజం, తనలో టాలెంట్ కి కొరత లేదు, అదే లేకపోతే బాలీవుడ్ లో అన్నేళ్ళు డైరెక్టర్ సీట్ లో కూర్చోలేడుగా, ఒక తెలుగోడు వెళ్ళి బాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు తన జెండా పాతి అక్కడ పాగా వేయాలంటే మాటలా? యెంత మంది కొత్త వారిని యాక్టర్స్ గా, డైరెక్టర్స్ గా ఇండస్ట్రీ లోకి తీసుకురాలేదూ? కాకపోతే ప్రతీ ఒక్కరిలో ఏ మూలో ఉండే వేపకాయంత వెఱ్ఱి అతన్ని డామినేట్ చేస్తూ ఉండచ్చు ఇప్పుడు. లేదా అతని calculations అతనికి ఉండచ్చు.
చిన్నప్పుడు మొదట్లో బాగా చదివి ఆ తర్వాత సరిగ్గా చదువుకోకపోతే 'రాను రాను రాజు గారి గుఱ్ఱం గాడిద అయ్యిందట' అనేవారు పంతుళ్ళు. అప్పుడు ఆ సామెత పెద్దగా అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు లైవ్ example చూశాక బాగా అర్థమైంది.
ఈ సోది అంతా ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఎప్పుడో సినిమా షూటింగ్ అయిపోయినా బయ్యర్లు ఎవరూ రాక లేటుగా రిలీజ్ చేసిన పట్టపగలు/దెయ్యం సినిమా చూడటమే కారణం. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారడం చూశాం గానీ, అంత మంచి సినిమాలు తీసి ఇప్పుడు పట్టపగలు/దెయ్యం లాంటి చెత్త సినిమాలు తీయడం ఏంటో? తన సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో వర్మకి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. జనాల ఫోకస్ తన పట్టపగలు/దెయ్యం సినిమా మీదకు రావాలనేమో మళ్ళీ పవన్ కళ్యాణ్ కి సోకిన కరోనా మీద కామెంట్స్ చేసినట్లు ఉన్నాడు. ఎద్దు పుండు కాకి కి రుచి అన్నట్లు చచ్చిన పాము లాంటి పవన్ కళ్యాణ్ ని పొడుచుకు తింటూ ఉంటాడు అప్పుడప్పుడూ.
చిన్నప్పుడు అవ్వ/తాత చెప్పే కథల్లో ఉత్తరం దిక్కుకి వెళ్ళకూడదు అనే రూల్ ఉంటుంది. అరె, ఎందుకు వెళ్ళకూడదు అని పట్టు పట్టి మరీ కథానాయకుడు అటు వైపే వెళ్తాడు. అలా వర్మ సినిమాలు చెత్త అని తెలిసి కూడా అవే చూస్తూ ఉంటాను కుక్క తోక వంకర లా.
వర్మ సినిమాలకి ఎవరో ఒకరు రెడీ గా ఉంటాడు కొనడానికి, దీనికి మాత్రం ఎవరూ ముందుకు రాకపోవడం ఏమిటి? ఫామ్ లో లేని రాజశేఖర్ హీరో అవ్వడం, తక్కిన వర్మ సినిమాల్లో లాగా exposing చేసే హీరోయిన్ లేకపోవడమా, ఏమో మరి ఆ వర్మకే తెలియాలి.
ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి/ఉలిపి కట్టెది /ఉలికి పిట్టది ఒక దారి అంటారు కదా. ఈ ఉలిపిరి/ఉలిపి కట్టె/ఉలికి పిట్ట లలో ఏది కరెక్ట్? అసలు ఈ కట్టె కథేమిటి, దానిది ఎందుకు మరో దారి?
ఈ ప్రశ్నలకి జవాబులు తెలిసీ చెప్పకపోతే గత నాలుగైదు ఏళ్లలో వర్మ తీసిన సినిమాలు వరుసబెట్టి చూసే పరిస్థితి మీకు వస్తుంది జాగ్రత్త.
'గరిటెడైన చాలు గంగి గోవు పాలు కడివెడైన నేమి ఖరము పాలు'
రిప్లయితొలగించండిఇప్పుడు ఈ సామెత తిరగబడింది
Correct గా చెప్పారు చిరు డ్రీమ్స్ గారు
తొలగించండి