22, ఏప్రిల్ 2021, గురువారం

వకీల్ సాబ్ - మండేలా

పోయిన వారం 3 సినిమాలు చూశాను. థియేటర్ లో రెండు, ఇంట్లో ఒకటి . దాదాపు 3 సంవత్సరాల తర్వాత థియేటర్ లో సినిమా చూడటం ఇప్పుడే. 

పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది అంటే ఫస్ట్ రోజే చూడాలి అనే అభిప్రాయం 'తొలిప్రేమ' సినిమాతో మొదలైంది. పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా అది అలాగే ఉంటూ వచ్చింది. పైగా ఇక్కడ సిడ్నీ లో మొదటి రోజు టికెట్స్ దొరకడం కష్టం కాదు కాబట్టి వెళదాం అనుకున్నా. కాకపొతే చిన్న ఇబ్బంది మా పిల్లలతో. వాళ్ళు సినిమా చూడరు, నన్ను చూడనివ్వరు కాబట్టి వాళ్ళను కింద తెలిసిన వాళ్ళింట్లో వదిలేసి వెళ్ళాము. వాళ్ళ పిల్లలు మా ఇంట్లో, మా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అది సమస్య కాలేదు. 

వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ హాఫ్ లో కాసిన్ని అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి గానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఇక పవన్ కళ్యాణ్ కి ఫైట్స్ లాంటివి ఉండకపోతే మరీ 'గోపాలా గోపాలా' సినిమాలో  లాగా అభిమానులను  నిరాశ పరచాల్సి వస్తుంది కాబట్టి అవి తప్పని సరి తద్దినాలే. 'ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్' అన్నట్లు టాక్ బాగానే వచ్చినా covid ఎఫెక్ట్ పడి కలెక్షన్స్ దెబ్బ తిన్నాయి అంటున్నారు మరి. 

సినిమాకి మేము మాత్రం వెళ్ళి, పిల్లలను తీసుకుపోలేదు అని గిల్టీ ఫీలింగ్ వచ్చి నెక్స్ట్ రోజు ఏ సినిమాకి వెళ్దాం అని పిల్లల్ని అడిగితే 'Peter Rabbit 2' అన్నారు. కార్టూన్ సినిమాలు చూడటం మా ఆవిడకు పెద్దగా ఇష్టం లేకపోయినా పిల్లలతో కలిసి తనూ వచ్చింది. మొదట్లో మీరు ముగ్గురు సినిమాకి వెళ్ళండి, ఆ 2 గంటల్లో నేను మాల్లో షాపింగ్ చేస్తూ ఉంటాను అంది. ఒక 100 డాలర్లు ఖర్చు అనుకున్నా కానీ, తర్వాత సినిమాకి వస్తాను అనడంతో 20 డాలర్స్ తోనే సరిపోయింది :)

ఇక ఇంట్లో చూసిన సినిమా 'మండేలా'. కాస్త రియలిస్టిక్ మూవీ చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. ఎలక్షన్స్ మీద, ప్రత్యేకించి తమిళనాడు ఎలక్షన్స్ మీద సెటైరికల్ గా తీసిన సినిమా. ప్రముఖ కమెడియన్ యోగి బాబు హీరోగా నటించిన ఈ సినిమా చూద్దామా? వద్దా? అని కాస్త ఆలోచించి చూశాను. ఎందుకంటే కమెడియన్స్ హీరోగా చేసినప్పుడు వాళ్ళకు సరిపోయే సినిమాలు చేయకుండా కాస్త ఎక్స్ట్రా చేస్తుంటారు. సరే కాసేపు చూద్దాం ఎలా ఉంటుందో అని మొదలెట్టా. సినిమా చూసిన తర్వాత అనుకున్నా 'టైలర్ మేడ్ క్యారెక్టర్' అంటారే సినీ పరిభాషలో సరిగ్గా అతనికి సరిపోయే సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు. 

వీలయితే ఈ సినిమా చూడండి, బాగుంటుంది. మొదటి 15-20 నిముషాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ ఒక్కసారి కథ మొదలయ్యాక ఇంట్రస్ట్ పెరుగుతుంది. అరచుకోవడాలు, మెడ రుద్దుకోవడాలు, తొడలు గొట్టే హీరోయిజాలు మచ్చుకైనా కనిపించవు. మంచి మంచి లొకేషన్స్, కేవలం పాటల కోసం వచ్చి ఆ తర్వాత పక్కకు వెళ్లిపోయే అందమైన హీరోయిన్, 'నేనేమో తెల్ల రంగీలా నువ్వేమో నల్లటి మండేలా' లాంటి వెకిలి పాటలు ఆశించేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు.

ఈ ''మండేలా'' సినిమా టైటిల్ విని నెల్సన్ మండేలా మీద తీసిన ఇంగ్లీష్ సినిమా ఏమో అని కొంతమంది పొరపడే ఛాన్స్ ఉంది. ఒక చిన్న జోక్ గుర్తొస్తోంది దీని మీద. 

ఒక ఆస్ట్రేలియన్ డైరెక్టర్ 'టెండుల్కర్' అని పేరు పెట్టి సినిమా తీసి ఇండియా లో రిలీజ్ చేశాడట. ఆ సినిమా మొదటి ఆట చూసిన ఒక వ్యక్తి ఆ డైరెక్టర్ ఫోన్ నెంబర్ దొరకబుచ్చుకొని 'టెండుల్కర్' అని పేరు పెట్టి మా సచిన్ టెండుల్కర్ మీద కాకుండా ఏదో కథ పెట్టి తీసారే అన్నాడట. అప్పుడా డైరెక్టర్ మీరు మాత్రం 'బోర్డర్' అని పేరు పెట్టి మా ఆస్ట్రేలియన్  క్రికెట్ 'అలెన్ బోర్డర్' మీద కాకుండా యుద్ధం మీద సినిమా తీస్తే నాకెంత కాలి పోయి ఉండాలి అన్నాడట. 

జస్ట్ ఫర్ ఫన్, ఇదే  'మండేలా' సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ని పెట్టి తీస్తే  పింక్ రూపు రేఖలు మారిపోయి వకీల్ సాబ్ అయినట్లు మండేలా రూపు రేఖలు మారిపోయి చెగువేరా తయారు అవుద్దేమో??

ఈ బ్లాగ్ లో కంటెంట్ ఏమిటి? బ్లాగ్ టైటిల్ ఏమిటి? బ్లాగ్ టైటిల్ చూసి ఇదేదో వెరైటీ అండ్ ఇంటరెస్టింగ్ టాపిక్ అనుకొని ఎవరైనా చదివి టైం వేస్ట్ చేసుకొని ఉండచ్చు. కాకపోతే సరైన టైటిల్ ఏదీ దొరక్క అలా టైటిల్ పెట్టేశాను. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్న వారికి క్షమాపణలు. 

4 కామెంట్‌లు:

 1. 😄😄😄 చాలా బాగుందండీ! మీరన్న ఆ ఇరుక్కుపోయినట్టు ఏమీ అనిపించలేదు. అభినందనలు. మండేలా సినిమా గురించి నేనుకూడా కోరా లో చదివానండీ. వీలు చూసుకొని చూడాలి.

  రిప్లయితొలగించండి


 2. మండే, లా వకీల్ సాబ్ పీటర్ రాబిట్
  అంటే బాగుంటుందండి టైటిలు :)

  వంద డాలరు వదులుకుని ఇరవై డాలర్లకు
  సర్దుకు పోయెనా! ప్చ్!  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లా వకీల్ సాబ్..మంచి ప్రయోగం జిలేబి గారు, మీకు చప్పట్లు.

   తొలగించండి