2, నవంబర్ 2022, బుధవారం

ది ఘోస్ట్ - ఓ.టి.టి రివ్యూ

రెండు మూడు నెలల క్రితం చంద్రుడి బ్యాక్ డ్రాప్ లో గన్ పట్టుకొని , క్లాక్ టవర్ బ్యాక్ డ్రాప్ లో తల్వార్ పట్టుకొని నిలుచునే రెండు పోస్టర్స్ వదలగానే చూసి 'పేరు గొప్ప' అనుకున్నా గానీ సినిమా మొదటి సీన్ చూశాకే అర్థమైంది 'ఊరు దిబ్బ' అని. 

మనం పాట్లాక్ అంటూ నాలుగు పిక్నిక్ మాట్స్ పార్క్ కి ఎత్తుకెళ్ళి, ఒక క్యాంపింగ్ సెట్ వేసుకొని మనం వండుకు తెచ్చిన చపాతీలు, కూరలు, అన్నం అంతా అక్కడ సర్దుతున్నట్లు ..  సినిమా ఓపెనింగ్ సీన్ లోనే టెర్రరిస్టులు ఒక ఎడారిలో నాలుగు  తివాచీలు పరిచి, పది టెంట్స్ వేసుకొని నల్ల చెక్క పెట్టెలలో తెచ్చుకున్న గన్స్, బాంబులు బయటికి తీస్తుంటారు. 

ఇంతలో ఎక్కడినుంచో బుల్లెట్ల వర్షం, కాసేపటికి ఇసుకలోంచి బయటకి దూకుతూ నాగ్ మాయ్య ఎంట్రీ, అటువైపు నుంచి బాలీవుడ్ కన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనపడే బాలీవుడ్ హీరోయిన్ అనబడే ఆటలో అరటిపండు లాంటి ఒక హీరోయిన్. 

ఆ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఇది ప్రెజెంట్ జెనెరేషన్ హీరో మూవీ అని కలరింగ్ ఇస్తూ ఒక లిప్ కిస్ ప్లస్ ఇప్పటికీ మన్మథుడు అని చూపించుకోవడానికి ఒక రొమాంటిక్ కలర్ ఫుల్ సాంగ్. 

ఆ తర్వాత మరో రెండు ఫైట్ సీక్వెన్సెస్ తర్వాత గార్ధభ స్వరంతో ఓండ్ర పెడుతూ హీరో గురించి బిల్డప్ ఇస్తూ  

ఇదిగిదిగో వచ్చాడొక ఘోస్ట్

చేస్తాడిక  మీ టైం వేస్ట్

మీరు అవుతారు చికెన్ రోస్ట్

ఇందాక అయిపోయిన రొమాంటిక్ సాంగ్ ఒక్కటే మీకు ఫీస్ట్

ఇక ఆ తర్వాతదంతా వరస్ట్

ఇది చూడ్డానికి వచ్చారంటేనే తెలుస్తోంది మీ టేస్ట్ 

మీకిదే నా అల్ ది బెస్ట్ 

అని ఒక బాక్గ్రౌండ్ సాంగ్. 

ఇన్నేళ్ళ బట్టీ చూస్తున్నా గానీ కొన్ని సీన్స్ లో నాగ్ మాయ్య ఎక్సప్రెషన్స్ ఏమిటో అర్థం కావు.  జగపతి బాబు, బాలయ్య బాబు లాగా ఈయన కూడా కూసింత వీకే కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ మోహంలో పలికించాలంటే. 

ఇక ఆ హీరోయిన్ గత పన్నెండేళ్ళ నుంచి ఫిజిక్ మెయింటైన్ చేయడంలో పెట్టిన ఎఫర్ట్ నటన ఇంప్రూవ్ చేసుకోవడంలో పెట్టలేదేమో అనిపిస్తోంది. నాకు తెలిసి బాలకృష్ణ తనకి ఏ హీరోయిన్ దొరక్క ఈవిడని పట్టుకురాక పోయి ఉంటే ఈ పాటికి ఈవిడకి ఈ మాత్రం తెలుగు సినిమా ఛాన్స్ లు కూడా వచ్చేవి కావేమో. కంటెంట్ ఉంటే కటవుట్ ఎలా ఉన్నా పర్లేదు అని నిత్యామీనన్, విద్యా బాలన్, సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ నిరూపించారు వారి నటనతో. ఈవిడది డిఫరెంట్ రూటు. కంటెంట్ ఎలా ఉన్నా కటవుట్ తో కొట్టుకొస్తోంది.    

మొదట్లో కాజల్  ని హీరోయిన్ గా అనుకొని ఆవిడ ప్రెగ్నెంట్ అని యాక్షన్ సన్నివేశాలు కష్టం అని తెలిసి లాస్ట్ మినిట్ లో ఈవిడని పట్టుకొచ్చారట ఏ రాయి అయితేనేం ఈ సినిమా లో నటించడానికి అని.   

ఇక అక్క గా ఎవరూ దొరకనట్లు ఆ గుల్ పనాగ్ ను ఎందుకు తెచ్చారో తెలీదు, మేకప్ ఎక్కువ యాక్టింగ్ తక్కువ.  యాక్షన్ రాదో, మర్చిపోయిందో లేక ఆ డైరెక్టర్ ఏం చెపుతున్నాడో అర్థం కాక ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో ఆవిడకే తెలియాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు సుపరిచయమైన అనీఖా సురేంద్రన్ పక్కన కూడా ఈవిడ యాక్టింగ్ సరితూగలేదంటే ఆ రోల్ కి న్యాయం చేయలేక పోయిందనే చెప్పుకోవాలి.  

గడ్డం పెంచితే ధనవంతులలా కనిపిస్తారనో లేక  అలా అయ్యాకే గడ్డం పెంచుతారో తెలీయట్లేదు.  ఈ మధ్య కాలం వచ్చే సినిమాల్లో రిచ్ పీపుల్ అంటే వారికి గడ్డం ఉండాల్సిందే అని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ప్రతీ ఒక్కడూ గడ్డం తోనే.  ఎవడు ఎవడో ఎవడి మొహం ఎవడిదో పోల్చుకునేప్పటికే సినిమా మొత్తం అయిపొయింది. తిరుపతిలో గుండు గీయించుకుని దానికి  గంధం పూసుకొని నుదుట నామాలు పెట్టుకుని  తిరిగినట్లు సినిమాలో అందరూ గెడ్డాలు పెంచుకొని కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని సూటు బూటు వేసుకొని తిరుగుతూ ఉంటారు.  

హీరో క్యారెక్టర్ ఆర్క్ అనేది పెరుగుతూ పోవాలి అనేది కమర్షియల్ సినిమా సూత్రం, దానికి రివర్స్ లో ఉంటుంది ఈ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల వచ్చిన కమల్ హాసన్ 'విక్రమ్' కథా ఇలాంటిదే, కానీ తాగుబోతుగా అతన్ని చూపించి తర్వాత తర్వాత అతని రేంజ్ పెంచుతూ పోయారు. కానీ ఇందులో ఆపోజిట్ లో మొదట్లో హీరోని హై పిచ్ లో చూపించి చివరికి నాగార్జున 'కిల్లర్' సినిమా ట్రాక్ లోకి తీసుకువచ్చారు. 

తమిళ్ హీరో విక్రమ్ కి నా సినిమాలో నువ్వు పది వేషాలు వెయ్యాలి అంటే కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నట్లు నాగార్జున కి కూడా నువ్వు నా సినిమాలో ఒక ఇంటర్ పోల్ ఆఫీసర్ వి గన్నులతో కాల్చుకోవచ్చు అని అంటే ఒప్పుకుంటాడేమో (అధికారి, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలని ఇదే మత్తులోనే ఒప్పుకొని ఉంటాడేమో). 

అసలు విలన్ ని చూస్తే వీడేం విలన్ రా బాబూ అనిపిస్తుంది. 'డీల్ తీసుకునే ముందు వాడి బాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోమని నీకెన్ని సార్లు చెప్పాను అసలే తెలుగు సినిమా హీరోలందరికీ భాషా లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలీదా' అని విలన్ బెల్ట్ లాంటిది తీసుకొని కొడుకుని కొడుతూ ఉంటే 'ఇది అట్టర్ ప్లాప్ అయిందని తెలిసి కూడా ఫ్రీ గా వస్తోందని ఓ టి టి లో చూస్తావా' అని ఆ దెబ్బలు నా వీపుకు తగిలినట్లు అనిపించింది. 

21 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇదీ స్మశాన వైరాగ్యం లాంటిదే మేష్టారు, మళ్ళీ రెండ్రోజులకి మరో చెత్త సినిమా చూడ్డానికి తయారు.

      ప్రస్తుతానికైతే ఈ దెయ్యం వదిలింది మరో దెయ్యం పట్టుకునేవరకూ

      తొలగించండి
  2. నాగార్జున గురించి ఒక కథనం. నాగేశ్వరరావు గారు నాగార్జునను ఒకాయనకు అప్పగించారు నటనలో తర్ఫీదు ఇవ్వమని. మూడు నెలల తరువాత ఆయన వారికి చెప్పిన మాట "మీఅబ్బాయి కాబట్టి స్టార్ కాగలడేమో కాని మంచినటుడు మాత్రం కాలేడండీ" అని. నాకీ కథనం చెప్పిన వారికి ఆ తర్ఫీదు ఇచ్చిన ఆయన స్వయంగా తెలుసును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్యామలీయం గారు. ఆ మాటైతే నూటికి నూరు పాళ్ళు నిజమే అనిపిస్తుంది.

      తొలగించండి
    2. ఇది నిజ్జంగా నిజమండీ. మామాష్టారికి ప్రపంచంలో తెలియని విషయం లేదండీ. కావాలంటే అడిగి చూడండి. మోక్షజ్ఞ వాడే సోపు కంపెనీపేరుకూడా చెప్పగలరు.

      తొలగించండి
    3. వయసు లోనూ , అనుభవం రీత్యా పెద్దవారు కాబట్టి మన కన్నా ఎక్కువ విషయాలు తెలిసి ఉండచ్చు, అందులో తప్పు పట్టే అవసరం లేదని నా అభిప్రాయం

      తొలగించండి
    4. కృష్ణ గారి మీద ఇటువంటిదే ఒక జోకు చెప్పాడు మా రూమ్మేటు. డయలాగ్ ఇది - "సుభద్ర చెల్లెలు నీకు;.. నాకు భార్య" అని అనాలంటే ఈయన చెప్పడం "సుభద్ర చెల్లెలు, .... నీకూ నాకూ భార్య" అనేవాడుట. అందువల్లే పౌరాణికాల్లో రాణించలేదు అంటారు. ఈ నాగార్జున ఇటువంటివాడే అనిపిస్తుంది, నాకైతే.

      తొలగించండి
    5. మంచి జోక్ పంచుకున్నందుకు ధన్యవాదాలు SD గారు. నటన రాకుండానే స్టార్ అవ్వచ్చు అని నిరూపించిన సాహసి కృష్ణ గారు.

      తొలగించండి
  3. భలే హిలేరియస్ గా రివ్యూ రాశారు. నాగార్జున కెరీర్ మొదట్లో తన నటన భరించలేక పోయే వాళ్ళం కానీ కొంత ఇంప్రూవ్ అయ్యడేమో అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ చేయలేడు. అయితే నటించే అవసరం లేని పాత్రలకి బాగానే సూట్ అవుతాడు.
    మనం, ఊపిరి సినిమాలలో బాగా చేశాడు అనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది కరక్టే, కొన్ని రకాల సీన్స్ చెయ్యలేడు. నాకు మనం, అన్నమయ్య సినిమాలు బాగా ఇష్టం.

      తొలగించండి
  4. ఇక్కడ చూడగలరు

    https://magazine.saarangabooks.com/%e0%b0%b8%e0%b0%be%e0%b0%ab%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%87%e0%b0%82%e0%b0%9c%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9c%e0%b1%80/

    రిప్లయితొలగించండి
  5. మీ బ్లాగ్ టైటిల్ లాగే, నాగార్జున motto కూడా 'కాదేదీ నాగ్‌కు అనర్హం' అయి వుండొచ్చుగా. అందుకే అన్ని రకాల పాత్రలు ఎడపెడా వేసిపారేస్తున్నాడేమో. BTW, రెవ్యూ చాలా hilarious గా ఉంది.

    రిప్లయితొలగించండి
  6. నేను కామెంట్ పెట్టాను కనిపించడం లేదు. :-(

    https://magazine.saarangabooks.com/%e0%b0%b8%e0%b0%be%e0%b0%ab%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%87%e0%b0%82%e0%b0%9c%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9c%e0%b1%80/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మోడరేషన్ పెట్టాను అందువలన approve చేయడానికి కాస్త ఆలశ్యం అయింది, క్షమించండి. లింక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. ఇంకా చూడలేందండి మంచి సినిమా అని విన్నాను. ఈ మధ్య థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం తగ్గించానండి పిల్లల పోరు తట్టుకోలేక, వారు చూడరు, నన్ను చూడనివ్వరు. OTT నే గతి ఇకపై.

      తొలగించండి
    2. The trainer must be either Ravi Kondala Rao garu or Devadas Kanakala garu

      తొలగించండి
    3. Might be, because Satyanand is the trainer for the next generation like Pawan Kalyan etc.

      తొలగించండి