30, మే 2016, సోమవారం

వీలయితే నాలుగు కబుర్లు కుదిరితే చిన్నప్పుడు విన్న కథలు

నేనో బ్లాగ్ ఓపెన్ చేసానోచ్ అని నేను నా ఫ్రెండ్స్ కు చెప్దామనుకున్నాను . కానీ మొహమాటం గట్రా లేకుండా  'పని లేని మంగలి వాడు పిలిచి తల గొరిగాడు అన్నట్లు' నువ్వు కూడా ఈ బ్లాగ్స్ అవి రాస్తున్నావా  అని ఎగతాళి చేస్తారేమో అనుకొని ఎవ్వరికి చెప్పలేదు. కానీ నా మిత్రుడు ఒకడికి ఈ విషయం ఎలాగో తెలిసిపోయింది ఇంకేముంది almost అలాంటి మాటే అన్నాడు. నీకు పని తక్కువగా ఉంటే నా  పని కూడా చేసిపెట్టచ్చు కదా అని. కొత్తగా Onsite వచ్చిన మరొక మిత్రుడేమో ఇంటికి పోయి బ్లాగ్ రాసుకునే బదులు ఆఫీసు లోనే ఉండి ఇంకొంచం పని ఎక్కువ చేయొచ్చు కదా మేనేజర్ హ్యాపీ గా ఫీల్ అవుతాడు అని suggestion ఇచ్చాడు. పార్థా ఒక్కసారి Onsite వచ్చాక  'ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి దక్కుతుంది' అన్న సామెత చెప్పినట్లు extra వర్క్ చేయడం/చేయకపోవడం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు అని గీతోపదేశం చేసాను.  

కాబట్టి మిత్రులారా ఏదో పొడిచేద్దామనో సాధిద్దామనో బ్లాగ్ రాయడం లేదు. ఇదేదో ఒక హాబీ లాంటిది అంతే. ఈ బ్లాగ్ లో సాహిత్యాల గురించో మరేదో  గొప్ప విషయాల గురించో భూతద్దం పెట్టి వెదికినా కనపడవు. ఏదో వీలయితే నాలుగు కబుర్లు కుదిరితే చిన్నప్పుడు విన్న కథలు రాస్తుంటాను. ఏదో కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు నా బ్లాగ్ నాకు ముద్దు. నా బ్లాగ్ పోస్టులు చదివిన వారు ఏవైనా తప్పులు కనిపించినపుడు  సరిదిద్దితే సంతోషిస్తాను.

చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు నా గురించి. శతకోటి లింగాల్లో నేనొక బోడిలింగాన్ని. అబ్దుల్ కలాం గారు అన్నట్లు నాదింకా ఒట్టి సిగ్నేచరే, ఆటోగ్రాఫ్ ఇచ్చే స్టేజి కి వెళ్లాలని ఆశ. మరీ పెద్ద ఆశ అంటారా ఆశ పడటం లో తప్పు లేదు కదా. పెద్దాయనే చెప్పారు కదా కలలు  కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండి అని. 

చివరిగా మంగలి వాడు అనే మాట ఎవరి మనోభావాలను అయినా కించపరిచింది  అని అనిపిస్తే మన్నించగలరు.  


2 కామెంట్‌లు: