11, జూన్ 2016, శనివారం

నా చిన్ని వానర సైన్యం కబుర్లు

పిల్లల మనసు స్వచ్ఛంగా ఉంటుంది, సాధ్యమైనంత వరకు ఆ మనసు T.V, సినిమాల లాంటి మాధ్యమాల నుంచి కల్మషం కాకూడదనే ప్రతి రోజు సాయంత్రం బాల్కనీ లోనే కూర్చోబెట్టుకొని కాసేపు కబుర్లు చెప్పడం అలవాటు నాకు. ఇండియా లో అయితే చాలా వరకు ఈ I.T కంపెనీ లలో ఫలానా టైం కి ఆఫీసుకు వెళ్ళడమే తప్ప ఫలానా టైం కి తిరిగి ఇంటికి రావడమనేది మన చేతిలో ఉండదు కాని ఇక్కడ 8 గంటలు కన్నా ఎక్కువ  పని గంటలు ఉండకపోవడం ఆఫీసు నుంచి సాయంత్రం 6 గంటలకే ఇంట్లో వాలిపోవడము, మా వానర సేన తో చేరి ఇల్లు కిష్కింధకాండ చేయడం అలవాటు. కేవలం డబ్బు బాగా సంపాదించవచ్చనే ఇక్కడికి వచ్చాను కానీ మా పిల్లలతో గడపటానికి  సమయం కూడా ఎక్కువ దొరకడంతో   డబ్బు కాదు కానీ మధురమైన జ్ఞాపకాలు అయితే మాత్రం బాగా సంపాదించుకున్నాను .  

పిల్లలు ఒక వయసు దాటాక హోంవర్క్, ఫ్రెండ్స్, కార్టూన్స్ అని బిజీ బిజీ గా ఉంటారు. మొదటి నాలుగు సంవత్సరాలు మాత్రం వాళ్లకు అమ్మా నాన్నే లోకం. ఈ నాలుగు సంవత్సరాలు  మా పాపతో ఆడుకున్న ప్రతి సాయంత్రం ఒక ఫోటో లాగా ఎప్పటికీ నా గుండెలోని ఆల్బంలో పదిలంగా నిలిచి ఉంటుంది. ఇలా పిల్లలతో గడిపిన ప్రతీ  క్షణం ప్రతీ తండ్రి నా లాగే తనే ఒక చక్రవర్తి అని ఫీల్ అవుతాడేమో. రెండు కోట్లు సంపాదించాక కలిగే తృప్తి కన్నా ఇద్దరు పిల్లలు కలిగాక కలిగే తృప్తి అనంతం. డబ్బు విషయం లోనూ, పిల్లల విషయం లోనూ ఒక పోలిక ఏమిటంటే  ఆశ తీరదు ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది  అని అనిపిస్తుంది.  ఇద్దరు పిల్లలున్నా ఇంకో పాప  కూడా ఉంటే  బాగుండు అని గొణుగుతూ ఉంటాను. (మీకేం మగాళ్ళు ఎన్నైనా చెప్తారు .. కనేవాల్లము మేము మాకు తెలుస్తుంది ఆ బాధ అంటుంది నా భార్య. అది సరే పాపే ఎందుకు బాబు అనచ్చుగా అంటుంది నా భార్య) ఏది ఏమైనా చెప్పండి ఆడపిల్లలు ముద్దుగా ఉంటారండి ఇంటికి వాళ్ళు ఒక కళను తీసుకువస్తారు (ఔనా మేమింకా అల్లుడ్ని తీసుకోస్తారనుకున్నామే  అని పంచ్ డైలాగ్  మాత్రం వెయ్యకండే) దానికి తోడూ ఆడపిల్లలకు అయితే షాప్ లో ఎన్ని రకాల కలర్ల లో డ్రెస్సెస్ ఉంటాయో.  అదే అబ్బాయిలకు అయితే అవే నాలుగైదు కలర్స్.నాకు పాపంటే బాగా ఇష్టమని మా బుడ్డోడిని బుడ్దమ్మ గా మార్చేసి ఫొటో తీసింది నా భార్య. ఈ ఫోటో జీవితాంతం దాచుకోగల జ్ఞాపకం నాకు. 

మా పాపతో నేను ఆడిన దాగుడు మూతలు, ఉప్పు మూటలు, కేకలు, కోతి గంతులు  మళ్లీ నా బాల్యాన్ని నాకు తిరిగి రుచి చూపించాయి.  అప్పుడప్పుడు  బొమ్మలు గీద్దాం రా నాన్నా అని అంటూ ఉంటుంది.  చిన్నప్పుడు అయితే బాగానే బొమ్మలు గీసేవాడిని కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా గుర్తులేవు . స్కూల్ లో ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ఒక బొమ్మ మాత్రం ఎందుకో కానీ  బాగా ముద్ర పడిపోయింది కింద గీసాను మీరూ చూసి తరించండి. చిన్నదానికి ఏమీ తెలీదని ఎప్పుడూ ఇదే బొమ్మేనా గీసేది అంటూ ఉంటుంది నా భార్య అయితే.  చెప్పడం మర్చిపోయాను మేఘాల బొమ్మలు కూడా గీయడం వచ్చు అలాగే గడ్డం గీయడం కూడా :)మా పాప ఒక్కోసారి తన బొమ్మ తమ్ముడికి ఇవ్వను అంటుంది కానీ వాడు, నువ్వు వేర్వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అని నచ్చచెప్పాక కాసేపటికి తనే ఆ బొమ్మ తీసుకెళ్ళి తన తమ్ముడికి ఇస్తుంది.   చాలా రోజుల క్రితం ఒకసారి వాడిని బేబీ చైర్ లో కూర్చోబెట్టాము. చైర్ బెల్ట్ ఎలా ఊడి వచ్చిందో తెలీదు కాని పాపం వాడు కింద పడి  బాగా ఏడ్చాడు. వాడైనా కొద్ది సేపే ఏడ్చాడు కానీ పాపం మా పాప మాత్రం చాలా సేపటి వరకు ఏడుపు ఆపలేదు. ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి పాపం తమ్ముడు కి ఎక్కువ నొప్పి ఉండదు కదా నాన్నా అని అడిగింది. తమ్ముడి మీద తనకున్న ప్రేమ చూసి  'నొప్పి ఉండదురా ఊరికే కిందపడ్డానని భయపడ్డాడు అంతే' అని అనాలనుకున్న మాటను బాధతో పూడుకు పోయిన నా  గొంతు ఆపేసింది కాని బయటకు వస్తున్న కన్నీటిని మాత్రం నా కన్ను ఆపలేకపోయింది. అంత స్వచ్చమైన ఆపేక్ష ఉంటుంది పిల్లల్లో ఒకరి మీద ఒకరికి.

మీకు ఈ ఆర్టికల్ నా పర్సనల్ డైరీ లోని ఒక పేజి లాగా అనిపిస్తూ నా నస నచ్చకపోచ్చు కాబట్టి... చిన్న పిల్లల మనస్తత్వం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఎక్కడో విన్నకథను వీలైనంతగా నా మాటల్లో వివరించి ముగిస్తాను. 

పదేళ్ళు కూడా నిండని అన్నాచెల్లెలు ఇద్దరూ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ పాప కింద పడి తలకు పెద్ద దెబ్బ తగిలితే హాస్పిటల్ కు తీసుకు వెళ్తారు. రక్తం చాలా పోయింది కాబట్టి అదే గ్రూప్ రక్తం దొరకక  చివరకు ఆ చిన్న పిల్లాడిది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని తెలిసి ఆ పిల్లాడిని ఇమ్మని అడుగుతారు. మొదట కాసేపు మౌనంగా ఉండి  ఆ తర్వాత ఒప్పుకుంటాడు.

కాసేపు అయ్యాక ఇక చాలు అని రక్తం తీయడం ఆపేస్తారు. అప్పుడు ఆ కుర్రాడు చెల్లెలు నిద్ర లేచేవరకు ( స్పృహ  వచ్చేవరకు)  అయినా నేను బతుకుతానా డాక్టర్ అని అడుగుతాడు ఆశగా. అంటే రక్తం తీస్తేనువ్వు చనిపోతావని అనుకున్నావా అంటాడా డాక్టర్ . అవునని సమాధానమిస్తాడు ఆ కుర్రాడు. అంటే చనిపోతావని అనుకొని కూడా నువ్వు ఆ రక్తం ఇచ్చావా అన్న వణుకుతో కూడిన మాటలు వచ్చాయి ఆ  డాక్టర్ గొంతు నుంచి.   7 కామెంట్‌లు:

  1. Chala baga rasavu.. 100% true. Naaku aa bomma geeyadam vachu( of course nee daggare nerchukunna). Nenu ade vesi pillalaki chupisthu unta..ha ha..same pinch..

    రిప్లయితొలగించండి
  2. Thanks for ur comments Radha.ఇంకా నువ్వూ గుర్తుపెట్టుకున్నావన్నమాట :)

    రిప్లయితొలగించండి
  3. పాప(డు) భలే ముద్దుగా ఉన్న(డు)ది. ఆడపిల్లలు లేని ఇల్లు ఇల్లు కాదు.శూన్యమందిరం !

    రిప్లయితొలగించండి