5, జూన్ 2016, ఆదివారం

సంతోషాన్ని తుడిచేసిన వర్షం

రెండు సంవత్సరాల పరిపాలన సందర్భంగా తెలంగాణా లో K.C.R గారి మీద ప్రశంసల వర్షం , ఆంధ్ర లో చంద్ర బాబు గారి మీద విమర్శల వర్షంకురిసినట్లుగా ఇక్కడ కూడా  సిడ్నీలో గత రెండు రోజులుగా  విపరీతమైన వర్షం కురిసింది. 

నేను 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన కొత్తలో వర్షాలు ఇక్కడ ఎప్పుడైనా పడొచ్చు గొడుకు ఒకటి కొని ఉంచుకో  అన్నాడు నా  మిత్రుడు . అందుకని ఒక షాప్ కి వెళ్లి గొడుగు అడిగితే వాళ్ళు గొడుగులు ఉన్న ప్లేస్ చూపించారు. అన్నీ పెద్ద పెద్ద గొడుగులే. చిన్న సైజు గొడుగు అయితే బాగ్ లో సరిపోతుంది పెట్టుకోవడానికి  అని ఇంత పెద్దవి వద్దు చిన్న సైజు గొడుగు కావాలి అని చిన్నది కొన్నాను. అయినా పాత కాలం వాళ్ళలాగా ఇంతింత పెద్ద గొడుగులు ఇప్పుడు కూడా వాడుతున్నారేమిటబ్బా అని సందేహించాను కానీ  ఆ రోజు సాయంత్రo పడ్డ వర్షానికి నా గొడుగు కుక్కలు చించిన విస్తరి అంటారే అలా తయారైతే  గాని తత్త్వం భోధపడలేదు ఎందుకు ఇక్కడి వాళ్ళు  పెద్ద గొడుగులు వాడతారో. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు గాలి కూడా విపరీతం గా వీస్తుంటుంది. బాగా వర్షం పడిన రోజు బ్రోకెన్ గొడుగులు అక్కడక్కడ రోడ్ పక్కన పడి ఉంటాయి.

చిన్నప్పుడు ఈ వర్షం పడిందంటే మహా సరదాగా ఉండేది ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉండేవి.  స్కూల్ కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎంచక్కా కాగితపు పడవలు చేసుకొని ఆడుకోవచ్చు. పెద్దవాళ్లెవరూ  అరవకపోతే వానా వానా వల్లప్ప పాట పాడుకుంటూ ఆడుకోవచ్చు వానలో. ఇప్పుడు కాలం పిల్లల జీవితాల్లో  రింగా రింగా రోజెస్ అనే రైమ్ వానా వాన వల్లప్ప లాంటి పాటలను కబ్జా చేసేసింది అది వేరే విషయం. ఇక సాయంకాలం కనుక వర్షం పడిందంటే అమ్మ చేతి బజ్జీలో, పకోడీలో పొట్ట పగిలేంతగా తినేసి కమ్మటి కాఫీ ఒకటి తాగడమనేది దాదాపు గా ప్రతి ఒక్కరి జీవితం లో మరువలేని అధ్బుతమైన జ్ఞాపకం. ఇది చదివిన చాలా మంది  ఈ పాటికే తెలుగు సినిమాలో చూపించినట్లుగా మీ మైండ్ లో కూడా చక్రాలు సుడులు తిరిగినట్లుగా అనిపించి అధ్బుతమైన మీ flashback లోకి వెళ్లి అమ్మ చేతి కమ్మటి బజ్జీలో పకోడీలో తినేసి కమ్మటి కాఫీ ఒకటి తాగి వచ్చేసి ఉంటారనుకుంటాను. కమ్మటి కాఫీ ఒకటి తాగి వచ్చారు కాబట్టి నేను రాసిన నస చదవడం వల్ల మొదలైన తలనొప్పి తగ్గి ఉంటుంది కాబట్టి మిగతాది కూడా చదివేయండి.

ఈ రెండు రోజుల కుండ పోత వర్షాల వల్ల బయటికి కూడా వెళ్ళలేకపోయాను. అప్పుడప్పుడూ ఫలానా ఫలానా గ్రామ శివారులోని పొలాల్లో చేపల వర్షం కురిసింది అని T.V లలో చెప్తుంటారు అదేదో ఇక్కడ కూడా మా బాల్కనీ లో పడి  ఉండచ్చు కదా కమ్మగా చేపల పులుసు అయినా వండుకు తినేవాళ్ళము అనిపించింది. బాల్కనీ లో చేపలు కాదు కానీ పక్కనున్న చెట్టు మీదనుంచో లేక పై కప్పు నుంచో millipedes  పడ్డాయి. కాని వాటితో millipedes  పులుసు వండుకొని తినలేము కదండీ. కానీ  వాటి ప్రాణం గట్టిది అనుకుంటా లక్కీగా మా బాల్కనీ లో పడ్డాయి మా అపార్ట్ మెంట్ లోనే  ఉండే ఆ చైనా వాడి  బాల్కనీ లో కాకుండా.

వర్షం పడి  వెలసిన తర్వాత మా పల్లె లో అయితే దారి పొడుగునా  చాలా millipedes కనపడేవి. రోకలి బండ ఆకారం లో ఉంటాయి కాబట్టి రోకలి బండ అనే వారు వాటిని మా ప్రాంతం లో అయితే. టచ్ చేస్తే ముడుచుకుపోయే వాటి తీరు వల్ల వాటిని కాలితో టచ్ చేస్తూ దారిలో నడవడం అదో రకమైన సరదా నాకు. నిన్న సాయంత్రం కాస్త వాన వెలిసాక మా  బాల్కనీ లో అది కనపడితే మా పాపకు చూపించాను. మొదటి సారి దాన్ని చూడటం టచ్ చేస్తే ముడుచుకువు పోవడంలాంటివి తనకు కొంచం కొత్తగా అనిపించాయి. 

వర్షం పడితే ఉండే ముఖ్యమైన నష్టాలు ఏమిటంటే ఒక వేళ ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉందంటే కనుక అది రద్దయ్యే అవకాశం  ఉండేది  కనుక వర్షం వద్దని కోరుకునేవాల్లము. అది చిన్నప్పుడు వర్షం వలన బాధ పడ్డ సందర్భం. మళ్లీ నిన్న వర్షం వలన ఇంకో బాధపడవలసి వచ్చింది. నిన్న హోటల్ లో జరపవలసిన మా పాప birthday పార్టీ ని cancel చేసి నెక్స్ట్ వీకెండ్ కు postpone చేయవలసి వచ్చింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.  నెక్స్ట్ వీకెండ్  ఎప్పుడు వస్తుంది నాన్నా అని ఎంత బాధగా అడిగిందో నా చిట్టితల్లి. దాదాపు వారం రోజులు నుంచి ఈ పార్టీ కోసం ఎంతగానో ఎదురుచూసింది. కాసేపయ్యాక మళ్ళీ వచ్చి మరి నెక్స్ట్ వీకెండ్ కూడా ఎక్కవ వర్షం పడితేనో అంది మరింత దిగులుగా. 

ప్రస్తుతానికి అయితే forecast ప్రకారం రెయిన్ లేదు నెక్స్ట్ వీకెండ్ కి ఇక్కడ. కానీ Don't trust the 3 W's: American Wife, Indian Work, Australian Weather  అన్నది ఇక్కడి కొంతమంది అభిప్రాయం. నెక్స్ట్ వీకెండ్ ఇంత  భారీ వర్షం పడకూడదు అని కోరుకుంటున్నాను. 

మీ తల తిరుగుతున్నట్లుగా భారంగా ఏదో తేడాగా ఉన్నట్లనిపిస్తోంది కదూ పూర్తిగా చదివాక దాన్నే తలనొప్పి అంటారు ఇప్పుడు అర్జెంట్ గా మరో కప్ కాఫీ తాగేయండి ఈ సారి flashback లోకి కాకుండా కిచెన్ లోకి వెళ్లి.

4 కామెంట్‌లు:

 1. ప్రశ్న. నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడు వస్తుంది నాన్నా ?
  ప్రశ్న. మరి నెక్స్ట్ వీకెండ్ కూడా ఎక్కవ వర్షం పడితేనో?

  జవాబు: పాప సంతోషం కోసం, మీ ఊళ్ళో నెక్స్ట్ వీకెండ్ వాన రద్ధుచేయట మైనది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సిడ్నీ weather మీ ఆర్డర్ని గౌరవించి వర్షం పడనీయకుండా చూస్తుందని ఆశిస్తున్నాను.

   తొలగించండి
 2. బ్లాగ్ సిద్దాంతం :- సమకాలికుల బ్లాగ్ చదవడం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళడానికి షార్ట్ కట్

  రిప్లయితొలగించండి
 3. హేమ కుమార్ గారు మొత్తం పోస్ట్ ను ఒకే ఒక లైన్ తో తెలియజేసారండి

  రిప్లయితొలగించండి