27, జూన్ 2016, సోమవారం

ఈ సారి కృష్ణ గారి పార్టీ నుంచి చిరంజీవి పార్టీ లోకి కప్ప దాట్లు

ముందు టపా కి తరువాయి భాగం ఇది.

నా చిన్నతనమంతా పల్లెలలోనే గడిచింది. అప్పట్లో సినిమా చూడాలంటే  పక్కనున్న టౌన్ కో లేదా వారానికోసారి దూరదర్శన్ లో వచ్చే సినిమాలే ఆధారం. మేముండే పల్లెలో నెలకు ఒకసారి బట్ట సినిమాలు వేసేవారు. ఇక ఆ రోజు మా నాన్న ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉండేవాడిని. ఇంటికొచ్చిన మా నాన్నకు అర్థం అయ్యేది ఇది వీడు సినిమా కు పోవడానికి వేసిన ప్లాన్ లో భాగం అని.

గోపాల్ పళ్ళపొడి వదిలేసి కోల్గేట్ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటున్న రోజులవి. నేను కూడా అలా ఓ రోజు కోల్గేట్ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటుంటే మా బడదల్ వచ్చి రేపు రాత్రి తోడుదొంగలు అనే సినిమా వేస్తున్నారు అని చెప్పాడు. కృష్ణ హీరో ఆ పైన తోడుదొంగలు అనే మంచి కిక్కిచ్చే పేరు, ఫైటింగ్స్ బాగానే ఉంటాయని పేరు చూస్తే తెలిసిపోతుంది. తోడు దొంగలు అన్నారు కదా ఇంకో హీరో ఎవడురా ఎన్టీవోడా, నాగ్గాడా, లేక శోభన్ బాబా అని అడిగితే వీళ్ళెవరూ కాదు చిరంజీవి అని ఎవరో కొత్త హీరో అట అన్నాడు. అంతవరకు బావి లోని కప్ప లాంటి నేనైతే ఆ పేరున్న హీరో గురించి ఎప్పుడూ వినలేదు కాబట్టి వీడెవడో ఆటలో అరటిపండు లాంటి వాడు అయుంటాడు ఏదో ఇంకో హీరో కావాలి కాబట్టి ఎవరూ దొరక్క వీడిని తీసుకొని ఉంటారు అని అనుకున్నాను.

జనాలు రామకృష్ణ కాఫీ లాంటి లోకల్ బ్రాండ్స్ వదిలేసి గ్రీన్ లేబుల్ కాఫీ వెంట పడుతున్న రోజులు. అలా మా అమ్మ కూడా గ్రీన్ లేబుల్ కాఫీ ఆస్వాదిస్తున్నప్పుడు ఇంత కన్నా మంచి సమయం మించిన దొరకదు అని సినిమా ప్రపోసల్ తన సైడ్ నుంచి O.K చేయించుకున్నాను. ఇక నాన్న ఎలాగూ భోళా శంకరుడే ఆయన దగ్గర O.K చేయించుకోవడానికి పైన చెప్పిన చిట్కా ఎలాగూ ఉంది కనుక భయం లేదు. 

సినిమా మధ్యలో తినడానికి కావలసిన బజ్జీలు, జంతికలు, బెల్లం మిఠాయి, పాకం పప్పు లాంటివి శెట్టి గారి షాప్ లో కొనుక్కెళ్ళాము కానీ సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడొంతులు పైనే ఖాళీ చేసేసాము, మిగిలిన ఆ ఒక్క భాగాన్ని సినిమా అయిపోయాక ఇంటికి పోయేప్పుడు తింటూ వెళదాం అని పక్కన పెట్టుకున్నాము.

కృష్ణ కంటే ముందే చిరంజీవి సినిమా లో ఎంటర్ అయ్యాడు కాసేపయ్యాక తెలీకుండానే కళ్ళు అతని వైపు attract అవుతున్నాయి. దేవతలు మళ్ళీ ఆ కళ్ళు ఆర్పకుండా ఉండే వరాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేసేశారు. మొదటి పాట మొదలైంది. ఆ పాటలో కృష్ణ ఏమో మామూలుగా మర్యాదగా సైకిల్ తొక్కుతున్నాడు కాని చిరంజీవి ఏమో హేండిల్ ని అటూ ఇటూ తిప్పుతూ ఒక్కోసారి చేతులు వదిలేస్తూ ఇలా సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు, బంతి లాగా గెంతుతున్నాడు, మాంచి మాంచి డాన్సులేస్తున్నాడు.

అంతవరకూ సినిమాల్లో హుందాగా మెట్లు దిగే హీరోనే చూసాను కాని చిరంజీవి మాత్రం రెండు మూడు మెట్లు స్కిప్ చేస్తూ గెంతుకుంటూ ఎగురుకుంటూ దిగుతాడు ఒక సీన్ లో. ఇలాంటి రకరకాల విన్యాసాలతోనే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మొన్నటి చచ్చుబడిన చపాతి ని ఇవాళ తిన్నట్లు రుచిగా అనిపించకపోవచ్చు కానీ డైరెక్ట్ గా పెనం మీది చపాతీని ప్లేట్ లో వేసుకొని వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో ఆ ఫీట్లు డాన్సులు ఆ కాలంలో కుర్రాళ్ళుగా  ఉన్న నా లాంటి వాళ్ళను అంతగా ఆకట్టుకున్నాయి.

మొత్తానికి సినిమా అంతా అయిపోయాక ఇడ్లి కంటే చట్నీ టేస్ట్ గా ఉన్నట్లు కృష్ణ గారు ఎర్రగా, ఎత్తుగా అందంగా ఉన్నా చిరంజీవి కోతి చేష్టలు బాగా ఆకట్టుకోవడంతో త్రాసు కాస్త చిరంజీవి వైపు తూగింది. 

సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తూ ఇందాక తినకుండా మిగిలినవి కొన్ని ఉన్నాయి కదా ఇవ్వు తింటూ వెళదాం అని అడిగాను.

ఇంకెక్కడున్నాయ్ ఎప్పుడో తినేసాను అన్నాడు

ఎప్పుడు అని అడిగాను

ఆ జయమాలిని పాట వచ్చినపుడు, చుట్టుపక్కల భూకంపం వచ్చినా ఆ టైం లో నువ్వు పట్టించుకోవు అని తెలుసు అందుకే మిగిలినదంతా ఆ పాట అయిపోయేలోగా తినేసాను అన్నాడు.

మిగతా ఏ విషయం లో నైనా అమాయకుడేమో కానీ తిండి విషయం లో మాత్రం మా వాడి బుర్ర మహా బాగా పనిచేస్తుంది.

మరుసటి రోజు చిరంజీవి గురించి కూపీ లాగాను మా అమ్మ దగ్గర నుంచి. తాను అప్పటికే చూసిన పున్నమి నాగు సినిమా గురించి గొప్పగా చెప్పింది.  ఇక ఆ తర్వాత చట్టానికి కళ్ళు లేవు, న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సినిమాలతో అభిమానం పీక్స్ కు చేరింది.

పార్టీ మారదామని మళ్ళీ ఓ రోజు మీటింగ్ మా బడదల్ తో.

టాట్ టూట్ నేను మారనంతే ఖరాకండిగా చెప్పేశాడు.

నేను నీ ఫ్రెండ్ ని నా మాట వినవా అని request చేస్తూనే "స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం" అనే పాట కూడా గుర్తుచేసాను.

అయినా అలా చీటికీ మాటికీ పార్టీ మారడం అన్యాయం అన్నాడు

ఇక వీడికి అప్పుడెప్పుడో చేసిన కృష్ణ బోధ లాంటిదే ఇంకో నికృష్ట బోధ చేసి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నాను. చూడు బడదల్ "నిన్నటి వరకు నిక్కర్లతో తిరుగిన మనం ఇప్పుడు పాంట్ వేసుకుంటున్నామా లేదా? ఎందుకు పెద్దవాళ్ళం అవుతున్నాం పైగా అందరూ వేసుకోవడం మొదలు పెట్టారు కాబట్టి.  తప్పులేదు కాలం తో పాటు update అవ్వాలి" అని కన్విన్స్ చేశాను.

అయినా కూడా నాకెందుకో ఇలా పార్టీ మారడం అంటూ నసిగాడు.

అవునులే నేను చెప్తే ఎందుకు వింటావ్ అదే గుడి దగ్గర టెంకాయలు అమ్మే వెంకట లక్ష్మి చెప్తే వినేవాడివి కదా అన్నాను.

అది కాదు ఇలా పార్టీ మారడం న్యాయం అనిపించటం లేదు పవన్ అని అంటూనే వెంకట లక్ష్మి గుర్తుకు వచ్చి మనోడు కాస్త సిగ్గుపడిపోయాడు.

ఇదే మంచి సమయం అని "మొన్నటి వరకు రేగ్గాయలు అమ్మే రమణమ్మ అంటే ఇష్టపడ్డావ్, మరి నిన్నటి నుండి రమణమ్మ కంటే కాస్త బాగుందనేగా వెంకట లక్ష్మి అంటే ఇష్టపడుతున్నావ్ మరి ఇందులో మాత్రం న్యాయం ఉందా" అని తిరుగులేని లా పాయింటు లాగాను జస్టిస్ చౌదరి కి కాలు విడిచి వేలు పట్టుకున్న మేనమామ కొడుకులా. చెప్పానుగా ముందు టపాలోనే జల్లెడతో నీళ్లు పోసే టైప్ మా వాడని పార్టీ మారడానికి ఒప్పుకున్నాడు కాదు ఒప్పుకునేలా చేసాను.

రెండవ కప్పదాటు .. కృష్ణ గారి పార్టీ నుంచి చిరంజీవి పార్టీ కి మారాము.

మా బడదల్ అసలు పేరు చెప్పలేదు కదూ "ఓబులయ్య". తనకి ఆ పేరు నచ్చలేదు కాబట్టి బడదల్ అనే పేరుతోనే పిలవడాన్ని ఇష్టపడేవాడు.

ఇక మూడవ కప్పదాటు గురించి తర్వాతి టపాలో 
4 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. As Harish said, the way of writing is superb.This is reminding the child hood memories as i discussed with my friends about movies. I can feel the innocence and funniest child hood memories. Especially some sentences i like 'టాట్ టూట్ నేను మారనంతే', 'గోపాల్ పళ్ళపొడి వదిలేసి కోల్గేట్ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటున్న రోజులవి'..

   తొలగించండి
  2. కామెంట్స్ రాసినందుకు థాంక్స్ చంద్ర.

   తొలగించండి