22, మే 2017, సోమవారం

సరిగ్గా 363 రోజుల క్రితం

సరిగ్గా అటు ఇటుగా సంవత్సరం క్రితం ఒక బ్లాగ్ ఓపెన్ చేసి ఏమైనా రాద్దామనుకున్నప్పుడు నా అంతరాత్మకు, నాకు జరిగిన సంభాషణ. 

బ్లాగ్ రాయాలనుకుంటున్నావ్ బాగానే ఉంది..టైం దొరుకుతుందంటావా?

అవేమైనా 5 సెంట్స్ కాయిన్ అనుకుంటున్నావా, రోడ్డు మీద దొరకడానికి?

అంటే నా ఉద్దేశం బ్లాగ్ రాయడానికి టైం కేటాయించ గలవా అని?

వారం లో ఒక గంట అయినా కేటాయించలేనా? నా తిప్పలేవో నేను పడతాను.

ఏం పేరు పెడదామనుకుంటున్నావ్?

కడప కత్తి, నాటు బాంబులు, రాయల సీమ రెడ్డి ఇలా ఏదో ఒకటి.

సాంబారు బుడ్డి, గంపలో గడ్డి, నీ మొహం మడ్డి .. ఏంటా పేర్లు నువ్వేమైనా ఫ్యాక్షన్ సినిమా తీస్తున్నావా?

ఏదో సీమ వాడిని కదా అలా relate చేసుకుంటే బాగుంటుందని

నీ మొహం అదొక డబ్బా ఐడియా

మరి బఠాణీలు, మరమరాలు , జంతికలు, వేడి వేడి పకోడీలు అని పెట్టుకుంటే?

అప్పడాలు, వడియాలు, పిడత కింద పప్పులు, డబ్బాలో మురుకులు అని పెట్టుకో, రాసే కబుర్లకు ఇదే ఎక్కువ. 

పోనీ కాఫీ కబుర్లు, టీ టైం చతుర్లు ?

పాల పుంతలు , మజ్జిగ ముంతలు , వెచ్చటి బొంతలు , సంతలో సరుకులు అని పెట్టుకో ఇంకా బాగుంటుంది

ఊసుల లోగిలి, పవనం, చిరు జల్లులు, తొలకరి చినుకులు

ఉరుములు పిడుగులు అని పెట్టుకో దెబ్బకు నీ బ్లాగ్ పక్కకు ఎవరూ రారు. నువ్వు రాసే లొల్లాయి కబుర్లకు అలాంటి కవితాత్మకమైన పేర్లు అవసరమంటావా?

పోనీ సినిమా కబుర్లు అని పెడితే

సినిమా కబుర్లు అని పేరు పెడితే, చిన్నప్పుడు గోళీలాడి గ్రాండ్ స్లాం గెలుచుకున్నాను, పరుగు పందెం లో పది రికార్డ్స్ సాధించాను, సొల్లు కబుర్లు చెప్పడం లో స్టేట్ ఛాంపియన్ని లాంటి గొప్పలు చెప్పుకోవడం కుదరదు.

అసలు నువ్వు దేని గురించి రాయాలనుకుంటున్నావో క్లారిటీ తెచ్చుకో. రాజకీయాల గురించి రాయాలనుకుంటున్నావా? 

M.P కి M.L.A కి తేడా కూడా తెలీదు ఇక రాజకీయాల గురించి ఏం రాస్తాను?

లేక సాహిత్య సౌరభాలు వెదజల్లలనుకుంటున్నావా?

సాహిత్య అంటే అమ్మాయి పేరని, సౌరభ్ అంటే సౌరభ్ గంగూలీ అని తెలుసు కానీ వాళ్ళను వెదజల్లడం ఎలాగో నాకస్సలు తెలీదు.

కనీసం నీ రచనలతో ప్రజలను చైతన్య పరుద్దామనుకుంటున్నావా?

చాప పరచడమో, దుప్పటి పరచడమో అయితే చేయగలను గాని చైతన్యం ఎలా పరవాలో నాకు తెలీదు

కార్మిక, కర్షక సోదరుల గురించి ఏమైనా రాయగలవా?

కరిష్మా, కరీనా సోదరీమణుల గురించి అయితే కాస్తో, కూస్తో రాయగలను గానీ కార్మిక, కర్షక సోదరుల గురించి నేనేమి రాయలేనందుకు సిగ్గు పడుతున్నాను.

కనీసం రామాయణమో, భారతంలో జరిగి కొన్ని ఘట్టాల గురించి

రామాయణం కడు రమణీయం, రామాయణం లో రాముడు హీరో, భారతం లో కృష్ణుడు హీరో, రామాయణం రంకు, భారతం బొంకు అని వాళ్ళు వీళ్ళు అంటే విన్నాను కానీ ఏ రోజు అవి చదవని అవివేకిని. 

కనీసం కృష్ణ శాస్త్రి కవితలో, రావి శాస్త్రి రచనలో, శ్రీరంగం శ్రీనివాసరావు వంటి అభ్యుదయ రచయిత రాసిన పుస్తకాలో చదివావా?

ఈ శ్రీరంగం శ్రీనివాసరావు ఎవరు?  ఎప్పుడూ వినలేదే?

అగ్గి పుల్ల,  కుక్క పిల్ల,  సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్న శ్రీ శ్రీ గారు తెలీదు నువ్వూ ఒక బ్లాగ్ రాయడమే, 

హుర్రే దొరికేసింది.. నా బ్లాగ్ కు ఒక పేరు దొరికేసింది 'కాదేదీ బ్లాగ్ కి అనర్హం' .

అసలేమీ తెలీకుండా ఒక బ్లాగ్ రాసేస్తావా? అసలేం అర్హత ఉందని?

వెయ్యి కథలు చదివాక ఒక కథ రాయడం మొదలెట్టు అని నాకొక సలహా ఇచ్చాడు మా మాథ్స్ లెక్చరర్ ఒకసారి

ఆయనెందుకు అలా సలహా ఇచ్చాడు

అదో  పెద్ద కథ..ఇంకో సారి చెప్పుకుందాం

అయినా ఆ సలహాకు ఈ బ్లాగ్ కి ఏంటి సంబంధం?

'వెయ్యి కథలు చదివాక ఒక కథ రాయడం మొదలెట్టు అని' ఆయన అన్నారు, వెయ్యి కథలు చదివక పోయినా, వెయ్యి బ్లాగు పోస్టులు అయితే చదివి ఉంటాను కాబట్టి మా లెక్చరర్ ప్రకారం నేను ఒక బ్లాగ్ మొదలెట్టచ్చు. 

12 కామెంట్‌లు:

 1. వెయ్యి పోస్టులు చదవడమే కొలమానం అయితే, ఇంకా చాలా మంది వ్రాసేసే వారు. కానీ మీకు ఆ వ్రాసే flair ఉంది. అందుకని వ్రాస్తున్నారు. గతంలో ఇలాగే ఓ స్నేహితుడు ఓ వెయ్యి పుస్తకాలు చదివితే రాసెయ్యచ్చు అన్నాడు. కానీ అది నిజం కాదు, చదవటం వేరు రాయటం వేరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ అన్యగామి గారు

   తొలగించండి
 2. "అన్యగామి" గారి అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. చదువువారలందు రాయు వారు వేరయా అని కరక్ట్ గా చెప్పారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ నరసింహారావు గారు

   తొలగించండి
 3. మీ అంతరాత్మ పంచ్ డవిలాగులు బాగా పేలాయి.
  నేను కూడా నా బ్లాగు మొదలెట్టినప్పుడు, నా మొదటి టపా ఇంచుమించు ఇలాంటిదే. అదే గుర్తొచింది నాకు.
  http://kavvinta.blogspot.in/2012/11/blog-post.html

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు శ్రీ గారు.

   తొలగించండి
 4. మీ బ్లాగ్ మొదలుపెట్టి ఏడాది అయిందన్నమాట! శుభాభినందనలు - మీరిలాగే బోల్డన్ని కబుర్లు రాస్తూ వుండాలి.

  రిప్లయితొలగించండి
 5. Stay tuned! రాస్తూనే ఉండండీ!
  ఇదో దురద మరో పదిమందికి అంటిస్తేగాని తీరదంటారు పెద్దలు! ఆ ప్రయత్నంలోనూ ఉండండీ!
  Best wishes

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రోత్సాహానికి ధన్యవాదాలు శర్మ గారు. అవునండీ ఇదొక దురద, వ్యసనం, తగ్గేవరకూ బ్లాగుతూ ఉండాల్సిందే.

   తొలగించండి
 6. మీ బ్లాగు పేరే భలే నవ్వొచ్చేస్తుంది పవన్ గారు. కష్టేఫలి వారి చెప్పినట్లు ఇంకో పది మందికి అంటించే ప్రయత్నం లోనూ ఉండండి :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చంద్రిక గారు

   తొలగించండి