24, మే 2017, బుధవారం

సంవత్సర కాలంగా భరిస్తున్నందుకు ధన్యవాదాలు

అలా సరిగ్గా సంవత్సరం క్రితం పులిని చూసి వాతలు పెట్టుకున్ననక్కలా, బాహుబలి అద్భుత విజయం చూసి భారీ బడ్జెట్ తో సినిమాలు తీయాలనుకుంటున్న కొంతమంది గొర్రెల్లా (ఈ గొర్రె అనే మాటకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కమల్ హాసన్ గారి పోలిక ఇది) వాళ్ళు వీళ్ళు రాసిన బ్లాగ్ లను చూసి నేనూ బ్లాగ్ మొదలెట్టాను.

పురిటిలోనే సంధి కొట్టినట్లు బ్లాగ్ అయితే మొదలెట్టాను కానీ ఏం రాయాలో తెలియలేదు.  నేను రాస్తే చదివేవాళ్ళు ఉంటారా అసలు ఏం రాయాలి ఎలా రాయాలి అని తెగ నిరుత్సాహపడ్డాను.

ఆ తర్వాత 'ధైర్యే సాహసే ఆయాసే ఉబ్బసే దగ్గే ఎంకట లక్ష్మే' అని ఏదో ఒకటి రాయడం మొదలెట్టాను. ( ధైర్యే సాహసే లక్ష్మి  అనే దాన్ని చిన్నప్పుడలా సరదాగా అనుకునేవాళ్ళము ఏదైనా పని మొదలు పెట్టాల్సి వచ్చినప్పుడు, మీలో కొందరికి అది గుర్తు ఉండే ఉంటుంది)

ఆదిలోనే హంసపాదు అన్నట్లు మొదట్లో నేను రాసిన ఒక పోస్ట్ చదవమని నా మిత్రుడిని అడిగితే నాకు తెలుగు మాట్లాడటం వచ్చు కానీ చదవడం రాదు అన్నాడు (నెల్లూరు కుర్రాడే కానీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లో చదివాడట మరి)

సరే అని మా ఆవిడ ని అడిగితే చదివే ఓపిక లేదు నువ్వే చదువు వింటాను అంది .హతవిధీ! పగవాడైన మా మేనేజర్ కు కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనుకున్నాను. 

అలా రెండు మూడు పోస్ట్లు రాసి పోస్ట్ చేసాక, ఎవరైనా చదువుతున్నారా అని అనుమానం వచ్చింది. ఎవరైనా చదువుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది, కనీసం కామెంట్ పెడితే చదువుతున్నారని తెలుస్తుంది అని అనుకున్నాను. ఇక అప్పటి నుంచి  

C.M పోస్ట్ కోసం జగన్ లా, 
P.M పోస్ట్ కోసం రాహుల్ లా, 
అమరావతి కోసం ఆంధ్రుల్లా, 
చంద్రుని కోసం చకోర పక్షిలా

కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్న నా నిరీక్షణ కు తెర పడింది ఒకరో ఇద్దరో కామెంట్ పెట్టడంతో. 

ఆ కామెంట్స్ తో కాస్త ఉత్సాహం వచ్చి అప్పటినుంచి గుడ్డెద్దు చేలో పడ్డట్లు తోచింది రాసుకుంటూ వస్తున్నాను. కొన్ని మీకు నచ్చి ఉండచ్చు మరికొన్ని నచ్చక పోయి ఉండచ్చు. చదువుతున్న వారికి అలాగే చదివి అభిప్రాయలు షేర్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు. 


పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు కాకుండా కనీసం పది కాలాల పాటు పడుతూ లేస్తూ  అయినా ఏదో ఒకటి రాస్తూ ఉండాలని అనుకుంటున్నాను. (రాయబట్టి సంవత్సరం, అంటే 3 కాలాలు అయిపోయాయి, ఇంకా పది కాలాల పాటు అంటే ఇంకో 3 సంవత్సరాలు రాస్తావా? ఆశకైనా హద్దు ఉండాలి రా వెధవ - నా అంతరాత్మ గోల ఇది. పట్టించుకోకండి  ప్లీజ్ )

ఇంతోటి బాగోతానికేనా మీసాలు గొరిగాడు అన్నట్లు బ్లాగ్ మొదలెట్టి సంవత్సరమైనందుకే ఇంత హంగామా చేసావు , నీ  సంబడం సంతకెళ్లా ఈ మాత్రం దానికే ఒక పోస్ట్ పెట్టాలా అంటారా ఏం చేస్తాం కాకి పిల్ల కాకికి ముద్దు కదండీ అందుకే ఈ సంబడం.

మొన్నా మధ్య నా మిత్రుడు ఫోన్ లో మాట్లాడుతూ నీ పోస్టులు చదువుతూ ఉంటాను అందులో నీ సృజనాత్మకత బాగుంది అన్నాడు

పొరపడినట్లున్నావ్.. నాకు ఆ సృజన ఎవరో ఆవిడ ఆత్మకథ ఏమిటో అస్సలు తెలీదు అని చెప్పేశా, ఆ తర్వాత అతను కింద పడి గిల గిల కొట్టుకున్నట్లు వాళ్ళావిడ చెప్పగా వినడమే తప్ప అతనితో తర్వాత మాట్లాడలేకపోయాను.

అప్పటినుంచి ఆ సృజనాత్మకత ఎప్పుడు రాశానబ్బా అని నా బ్లాగ్ పోస్ట్ లన్ని వెదుక్కుంటున్నా. కొంపదీసి నా బ్లాగ్ కూడా అందరి సెలెబ్రెటీల అకౌంట్స్ లా హాక్ చేసి ఎవరైనా పోస్ట్ చేసి ఉంటారా ?

అవును మరి నువ్వో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వి, సింగర్ సుచిత్రవి కదా అందుకని నీ అకౌంట్ ని హాక్ చేసి ఉంటారు అంది నా అంతరాత్మ. 

చెప్పలేము కదా ఎవరైనా నా బ్లాగ్ ని హాక్ చేసి ఉండచ్చు

బుద్ధి ఉంటే సరి నువ్వేమైనా మనిషివా చలపతిరావువా?  వాళ్లంటే సెలెబ్రెటీలు, వాళ్ళ అకౌంట్స్ హాక్ అయ్యానని చెప్పుకుంటుంటారు. అంతెందుకు రేప్పొద్దున రేపుల స్పెషలిస్ట్ అయిన ఆ చలపతి రావు లాంటి వాళ్ళు కూడా నా గొంతు ఎవరో హాక్ చేసి ఆ మాట అనిపించారు అని ఒక స్టేట్మెంట్ పడేస్తారు. అయినా బోడి నీ అకౌంట్ ఎవడు హాక్ చేస్తాడు?

మరి ఎవరూ హాక్ చేయకపోతే నేను రాయకుండానే ఆ సృజన గారి ఆత్మ కథ నా బ్లాగ్ లో ఎలా కనిపించి ఉంటుందబ్బా నా మిత్రుడికి ?

8 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ నుంచి ఇంకా బోలెడు పోస్టులు రావాలని కోరుకుంటున్నాను.ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదివి మెచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చిత్ర గారు.

      తొలగించండి
  2. మీ self-appraisal బాగుందండి 👌🙂. విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్. మరెన్నో సంవత్సరాలు తెలుగు బ్లాగ్ లోకంలో మీరు వెలుగుతారని మా నమ్మకం 👍.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ నమ్మకానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు నరసింహా రావు గారు.

      తొలగించండి
  3. ఇంకో పది కాదు - ఇంకొన్ని పదుల పది-కాలాల పాటు రాయాలి మీరు.

    రిప్లయితొలగించండి