22, ఫిబ్రవరి 2021, సోమవారం

5 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా?

ముందు రెండు భాగాలు కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం , ఇన్నాళ్ళకి.. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను చదవకపోయి ఉంటే చదివేసి ఇక్కడికి వచ్చేయండి. ఇదేదో బాహుబలి పార్ట్ ఒకటో లేక KGF చాఫ్టర్ ఒకటో కాదు కాబట్టి చదవకపోయినా వచ్చే నష్టం లేదు. 

'బైక్ డ్రైవ్ తెలుసు అన్నావు కాబట్టి ఆక్సిల్రేటర్, బ్రేక్ స్లో గా ఎలా  ప్రెస్ చెయ్యాలి  అనేది తెలిసే ఉంటుంది, కాబట్టి ఆక్సిల్రేటర్ స్లో గా ప్రెస్ చేస్తూ వెళ్లు' అని ఢాంబాబు మొదటి డ్రైవింగ్ లెసన్ స్టార్ట్ చేశాడు. 

మొత్తానికి అలా మొట్ట మొదటి సారి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డ్రైవింగ్ మొదలెట్టాను. కాసేపటికి సిగ్నల్స్ ఉండే రోడ్ వచ్చింది. 

హేయ్, గ్రీన్ లైట్ పడ్డప్పుడు మాత్రమే సిగ్నల్ క్రాస్ చెయ్యాలి, నువ్వేమిటి ఆగకుండా వెళ్తున్నావ్?

అదిగో గ్రీన్ హ్యూమన్ లైట్ పడిందిగా అందుకే వెళ్తున్నాను. 

నువ్వు ఇప్పుడు ఉన్నది కార్ లో, కార్ రూల్స్ ఫాలో అవ్వాలి. 

సారీ, కన్ ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడి 9 ఏళ్ళ వాకింగ్ అనుభవం ఈ 9 నిమిషాల డ్రైవింగ్ ని డామినేట్ చేస్తోంది. 

ఇప్పుడు కాసేపు కారు పక్కన పార్క్ చెయ్. కొద్దిసేపు నీకి థియరీ క్లాస్ చెబుతా. కారు డ్రైవింగ్ అనేది ఒక కల, ఒక వరం. పూర్వ జన్మ లో ఎంతో తపస్సు చేసావో గానీ ఇంత చిన్న వయసులోనే నీకు దక్కింది (వెటకారంగా).  ఏదీ ముందు నీకు కార్ గురించి యెంత తెలుసో చెప్పు?

ఏముంది కారుకు నాలుగు వీల్స్ ఉంటాయి. ఈ రోజు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక తెలిసింది ఇక్కడ కూడా ఒక వీల్ ఉంటుందని. 

వెనుక డిక్కీలో కూడా ఒక వీల్ ఉంటుంది దాన్ని స్టెప్నీ అంటారు (వెటకారంగా). 

స్టెప్నీ అంటే స్పేర్ వీలా, నేనింకా ఒక సెటప్ అనుకుంటున్నానే. అదేదో సినిమాలో శరత్ బాబు పెళ్ళాన్ని కాకుండా ఇంకొకరిని మెయింటైన్ చేస్తుంటాడు. వాళ్ళను కదా స్టెప్నీ అంటారు.. 

ఇదిగో మా శరత్ బాబు ను ఏమన్నా అంటే నేను ఊరుకోను. 

సరే. సారీ. నీకు జావా గురించి తెలుసా. 

తెలుసు.  నా చిన్నప్పుడు మా అమ్మ రోజూ రాగి జావ చేసి ఇచ్చేది. ఇప్పటికీ వేడి చేస్తే ఆ రాగి జావానే  తాగుతా. 

ఏమిటీ! అప్పుడెప్పుడో మీ అమ్మ కాచి ఇచ్చిన జావ నే ఇప్పటికీ తాగుతున్నావా?

ఇదిగో ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకు నాకు మండుతుంది. 

సరే, నేను అడిగేది జావా లాంగ్వేజ్ గురించి, నీకు దాని గురించి యెంత తెలుసో నాకూ కారు గురించి అంతే తెలుసు. 

సరే విను నీకు రూల్స్ చెబుతా అని గ్రీన్, రెడ్ సిగ్నల్స్, రౌండబౌట్స్ అని కాస్త థియరీ రౌండ్ వేసుకున్నాడు. నువ్వు స్టీరింగ్ వీల్ ని గట్టిగా పట్టుకుని తిప్పుతున్నావు. అలా గట్టిగా తిప్పినంత అది నీ మాట వింటుందనుకోకు, లూస్ గా పట్టుకో. సినిమాల్లో తిప్పినట్లు ఓ తెగ తిప్పేయ్యాల్సిన అవసరం లేదు.  కాస్త యంగ్ గా ఉన్న వాళ్లయితే ఈజీ గా క్యాచ్ చేస్తారు, నువ్వు లేట్ ఏజ్ లో నేర్చుకుంటున్నావ్ అదే ప్రాబ్లెమ్. 

మరి నేర్చుకోవడం కష్టం అంటావా?

మై హూ నా, 5 రోజుల్లోనే నేర్పిస్తా. 'హేయ్, లేన్ చేంజ్ అయ్యేప్పుడు అటుపక్క ఇటుపక్క వెళ్ళే వెహికల్స్ ని చూసి మారాలి' అన్నాడు. 

సారీ, నాకు కాపీ కొట్టే అలవాటు లేదు, వాళ్ళను చూసి ఎలా మారాలో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో కూడా ఎప్పుడూ పక్కనోళ్ళను చూడలేదు తెలుసా?

'ఆ పరీక్షల్లో ఓకే గానీ ఈ డ్రైవింగ్ పరీక్షలో చూసి తీరాలి, లేదంటే నెగటివ్ మార్క్ వేస్తాడు, పైగా అలా అబ్సర్వ్ చేస్తూ లేన్ మారటం సేఫ్ కూడా' అన్నాడు. 

అలా 5 రోజులు గడిచిపోయాయి రోజుకో గంట డ్రైవింగ్ ప్రాక్టీస్ తో. కాకపోతే అయిదు రోజులైనా పర్ఫెక్ట్ గా రివర్స్ పార్కింగ్ చేయడం లాంటివి రాలేదు. ఎలాగోలా డ్రైవింగ్ చేయడం అయితే నేర్చేసుకున్నాను. అందుకని '5 రోజుల్లోనే డ్రైవింగ్ నేర్పిస్తా అన్నావ్? ఇంకా ఆ పర్ఫెక్షన్ రాలేదే' అని అడిగా. 

'30 రోజుల్లో ఇంగ్లీష్' అని ఒక పుస్తకం వచ్చేది మన చిన్నప్పుడు చదివావా?

బోలెడు సార్లు 

చదివావా?

నీ మొహం, బోలెడు సార్లు చూశాను. అది చదివి 30 రోజుల్లోనే ఇంగ్లీష్ మొత్తం నేర్చుకుంటారు అని చెప్తే నమ్మేటంత పిచ్చి వెధవని అనుకున్నావా?

మరి నేను 5 రోజుల్లో డ్రైవింగ్ అని అన్నప్పుడు ఎలా పిచ్చి వెధవ అయ్యావ్? చూడు, వయసులో నువ్వు నా కంటే పెద్దవాడివి అయినా సరే నీకు ఒక జీవిత పాఠం చెప్తా విను..  

నిన్ను చూసినప్పుడు, నువ్వే నా కంటే పెద్ద వాడివి అనుకుంటున్నానే?

కాదు, నీ డ్రైవింగ్ లైసెన్స్ లో  నీ డేట్ అఫ్ బర్త్ చూసాను. నేను నీ కంటే చిన్నవాడిని. కాకపోతే బాగా జుట్టు రాలిపోయి, కాస్త పొట్ట వచ్చేసి వయసులో పెద్ద వాడిలా కనపడుతున్నాను. అప్పట్లో కాలేజ్ రోజుల్లోనే కార్ కొన్న తర్వాత ఆ కార్ తీసుకొని నేను రోడ్డు ఎక్కాను, దాంతో చదువు అటకెక్కింది. చివరికి ఏ ఉద్యోగం రాక ఇదో ఇలా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అవతారం ఎత్తాను. తొందరగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు అందరూ ఇలా అయ్యారు అని చెప్పను. నా విషయం లో జరిగింది నీకు చెప్తున్నాను. నేనేదో లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నానని, బాగా సంపాదిస్తున్నానని అనుకోను. ఈ కార్ లో తిరిగి తిరిగి వొళ్ళు బాగా వేడి చేస్తుంది. ఆరోగ్యం బాలేక సెలవు పెడితే ఆ రోజుకు  ఆదాయం ఉండదు. పోయిన నెల ఆరోగ్యం బాలేక నెల రోజులు ఇంట్లోనే ఉండాలి వచ్చింది. మీకు లాగా మాకు సిక్ లీవ్స్, యాన్యువల్ లీవ్స్ ఉండవు.  

అందుకేనేమో Other side of grass always looks greener అని ఇంగ్లీష్ పెద్దోళ్లు, దూరపు కొండలు నునుపు అని మన తెలుగు పెద్దోళ్ళు అన్నది అన్నాను అతని మాటలకు అడ్డుపడుతూ.  

చూడు, ఇలా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ల చుట్టూ తిరుగుతుంటే డబ్బులన్నీ డ్రైవింగ్ క్లాసెస్ కే అయిపోతాయి. నీకు బేసిక్ డ్రైవింగ్ వచ్చేసింది ఇకపైన నువ్వే ఒక కార్ కొని ప్రాక్టీస్  చేసేయ్, లేదంటే నీ ఫ్రెండ్స్ కార్ తీసుకొని ప్రాక్టీస్ చెయ్. 'కొత్త కార్ కొనగలిగే స్థోమత ఉంటే పాతది కొను' ఇలా మీ మురళీమోహన్ డైలాగ్ ని కాస్త కస్టమైజ్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కార్ కొనెయ్  అని జ్ఞానోదయం కలిగించి  శ్రీ కృష్ణుడు తన రథం లో వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ 'నువ్వు లేట్ ఏజ్ లో నేర్చుకుంటున్నావ్ అదే ప్రాబ్లెమ్ కాబట్టి నీకు బాగా డ్రైవింగ్ రావడానికి ఇంకో రెండు మూడు నెలలు పట్టొచ్చు' అని కాస్త నిరుత్సాహపరిచాడు . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి