9, మే 2021, ఆదివారం

వ్యాపార ప్రస్థానం - బీజం

అసలు సిడ్నీ ఓపెరా హౌస్ చూడటమే కలగా ఉంటుంది చాలా మందికి. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకలాంటి చిన్న చిన్న కోరికలు ఉండేవి కావు, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు ఉండేవి. అందులో ఒకటి... పెద్ద ఆడిటోరియం లో ది బెస్ట్ బిజినెస్ మాన్ గా అవార్డు తీసుకుంటానని మూడవ తరగతి లోనే జారిపోతున్న నా నిక్కర్ ని లాకుంటూ, కారుతున్న నా ముక్కును తుడుచుకుంటూ నేను ఒక ఛాలెంజ్ చేశాను. 

ఎక్కడి తాళ్ళ ప్రొద్దుటూరు ఎక్కడి సిడ్నీ...మా ఇంటికి స్కూల్ కి యేరు అడ్డు ఉండేది. చెప్పులకి కాళ్ళు లేకుండా .. సారీ కాళ్లకు చెప్పులు లేకుండా రోజుకు 3 కిలోమీటర్లు ఇంటి నుంచి స్కూల్ కి మళ్ళీ సాయంకాలం స్కూల్ నుంచి ఇంటికి ఆ ఇసుకలో నడవాల్సి వచ్చేది. వానాకాలం లో వానలు వస్తే యేరు పారేది అప్పుడు బట్టలన్నీ విప్పేసి అన్నీ అంటే అన్నీ కాదు కొన్ని విప్పేసి వాటిని స్కూల్ బాగ్ లో పెట్టుకొని దాన్ని నెత్తిన పెట్టుకొని యేరు దాటాక మళ్ళీ బట్టలు తొడుక్కొని వెళ్ళేవాడిని. వర్షాకాలం కష్టాలు ఇలా ఉంటే ఎండా కాలం కష్టాలు మరోలా ఉండేవి. చెప్పులు లేక ఇసుకలో కాళ్ళు కాలిపోయేవి. గొప్ప గొప్ప వాళ్ళ బయోగ్రఫీ/ఆటోబయోగ్రఫీ బుక్స్ లో ఉండే ఇలాంటి కష్టాలు దాటి ఈ స్టేజికి చేరుకున్నాను. అసలు నా వ్యాపార ప్రస్థానం ఎలా మొదలైందో నేను మీకు ఈ  సిడ్నీ ఓపెరా హౌస్ ఆడిటోరియం లో కొన్ని లక్షల మంది ముందు  చెప్పబోతున్నాను. 

ఒక రోజు నేను నా కిష్టమైన 12 వ ఎగ్ దోశ తింటుంటే మా నాన్న వచ్చి 'స్కూల్ లో ఎక్సమ్ రిజల్ట్స్ వచ్చాయట కదా' అన్నాడు. 

'అవును నాన్నా, నేను క్లాస్ లో లాస్ట్ వచ్చాను ' అన్నాను. 

నువ్వు ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నావ్ అది ముఖ్యం, నువ్వు  లాస్ట్ వచ్చావా ఫస్ట్ వచ్చావా అన్నది అనవసరం అన్నాడు. 

అప్పుడే నేను డిసైడ్ అయ్యాను పెద్ద బిజినెస్ మాన్ కావాలని, అలాగే ఒక పెద్ద ఆడిటోరియం లో ది బెస్ట్ బిజినెస్ మాన్ గా అవార్డు తీసుకోవాలని.    

చదువుతో పాటు నాకు ఎగ్ దోశ మీద ఉండే ప్రేమ కూడా పెరిగింది. జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగాలేకపోయినా మూడుపూటలా  మాత్రల బదులు మూడుపూటలా ఎగ్ దోశే తినేవాడిని. ఒకసారి శ్రీదేవి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. నా వయసు తక్కువని ఇంట్లో వద్దన్నారు. నేను వినకపోతే నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చి ఒక్కటే choose చేసుకోమన్నారు.  నువ్వు శ్రీదేవితో పెళ్ళిని  వదులుకుంటావో లేదా ఎగ్ దోశని వదులుకుంటావో నీ ఇష్టం అంటే బోనీ కపూర్ మీద జాలి, ఎగ్ దోశ మీద నా ప్రేమ, మా ఇంట్లో వారి మీద గౌరవం నన్ను వెనక్కి లాగాయి. 

అలా ఎగ్ దోశ మీద నా ప్రేమ వయసుతో పాటూ పెరుగుతూ వచ్చింది. MCA చదవడానికి  తిరుపతి వచ్చినప్పుడు అక్కడ దొరికే ఎగ్ దోశ రుచికి మరింత అడిక్ట్ అవడంతో అక్కడున్న మూడు సంవత్సరాలు అదే నా బ్రేక్ఫాస్ట్ అయింది. ఎందుకో తెలీదు కానీ అక్కడ దొరికే ఆ ఎగ్ దోశ చాలా రుచిగా ఉండేది. 

ఆ తర్వాత చదువు ముగించుకొని ఉద్యోగ అవకాశాల కోసం బెంగళూరు లో అడుగుపెట్టినప్పుడు మంచి రుచికరమైన ఎగ్ దోశ ఎక్కడా దొరకలేదు. కొన్నేళ్ళకు '99 దోశ' అని స్టార్ట్ చేస్తే ఆశగా అక్కడికి వెళ్ళాను నాకిష్టమైన ఎగ్ దోశ దొరుకుతుందేమో అని. 

రండి సర్ మా దగ్గర రక రకాల దోశలు ఉన్నాయి అని అదేదో సినిమాలో సుత్తి వీరభద్ర రావు చెప్పినట్లు దోశల పేర్లు చెప్పడం మొదలెట్టాడు. 

ప్లెయిన్ దోశ 

పేపర్ దోశ 

ప్లెయిన్ పేపర్ దోశ 

పేపర్ ప్లెయిన్  దోశ

కారం దోశ 

ఎర్ర కారం దోశ 

పచ్చ కారం దోశ

తెల్ల కారం దోశ

కారం పొడి దోశ 

వెల్లుల్లి కారం పొడి దోశ

కారం + కారం పొడి దోశ 

చీజ్ దోశ 

అప్పడం వడ ఆశ దోశ 

నిరోషా దోషా 

తనీషా దోషా

మనీషా దోషా 

భాషా దోషా 

ఆపరా నాయనా, దోశ కి దోషం తగులుతోంది నీ పలుకులలో. ఇవన్నీ వద్దు కానీ ఎగ్ దోశ ఉందా అని అడిగా.  

ఉందని ఎగ్ దోశ ఇచ్చాడు కానీ తిరుపతిలో చూసిన 'ఖుషి' ఆశిస్తే బెంగుళూర్ లో 'జానీ' ఎదురైంది. దోశ లో సరిగ్గా రుచి లేదు కాబట్టే దాని మీద రక రకాల పదార్థాలు వేసి అమ్ముతున్నాడని నాకు అర్థమైంది. 

గతి లేనమ్మకి గంజే పానకం అని ఆ ఎగ్ దోశ తోనే నా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేవాడిని అక్కడ ఉన్నన్ని రోజులు. 

అక్కడ నా ఎగ్ దోశ కు అంటుకున్న దోషం అలా అలా ..... 

2 కామెంట్‌లు:

  1. మరింకేం, మీకిష్టమైన ఆ దోషెల ... అదే దోశెల ... వ్యాపారం మీ ఊళ్ళో వెంటనే మొదలెట్టేసి, త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరించేసి, దోశ చెయిన్ కు అధిపతి అయిపోవడానికి మంచి అవకాశం. ఆ తరువాత ఇంకేముంది - ది బెస్ట్ బిజినెస్ మన్ గా పెద్ద ఆడిటోరియంలో సత్కారం అందుకుని మీ కలని సాకారం చేసుకోవడమే. ఆల్ ది బెస్టూ 👍.

    రిప్లయితొలగించండి