4, నవంబర్ 2021, గురువారం

పర్మనంట్ అడ్రస్

మా నాన్నగారు బాంక్ ఉద్యోగి అవడం మూలాన ప్రతీ రెండు మూడేళ్ళకోసారి ఊరు మారాల్సి వచ్చేది. కొన్ని సార్లు సంవత్సరానికోసారి మారాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంవత్సరం పూర్తి కాగానే ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందో ఎప్పుడు బయలుదేరాలో అనేట్టు ఉండేది. అందువల్ల చిన్నప్పుడు స్కూల్లో చదివే రోజుల్లో నుంచి 'పర్మనంట్ అడ్రస్' అనే కాలం కింద ఏం రాయాలి అనే భేతాళ ప్రశ్న ఎదురయ్యేది.  

ఇక కాలేజ్ కి వచ్చాక ఈ  భేతాళ ప్రశ్న తీవ్రత పెరిగిందే కానీ తగ్గలేదు. మీ 'పర్మనంట్ అడ్రస్'  అప్లికేషన్ ఫారం మీద రాసివ్వు నీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ లేదంటే ఫీజ్ కట్టిన రిసీప్ట్స్ లాంటివి మీ ఇంటికి పంపిస్తాం అనేవారు. ఈ సంవత్సరం ఫీజ్ రీయింబర్సుమెంట్ కింద మీ డబ్బులు వాపసు ఇచ్చేస్తాం  మీ పర్మనంట్ అడ్రస్ రాసి వెళ్ళండి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక చెక్ మీ ఇంటికి పంపిస్తాం అన్నారు  డిగ్రీ కాలేజ్ ముగిశాక. 

ఆ ఫీజ్ రీయింబర్సుమెంట్ కింద పంపే చెక్కు విలువ అయిదారు వందల రూపాయల దాకా ఉండేది, అప్పట్లో మా లాంటి మధ్య తరగతి వాళ్లకు అది చాలా  పెద్ద మొత్తమే. 

ఏమోయ్, మొన్న మీ అబ్బాయి బారసాల అని లీవ్ పెట్టుకున్నావు కదా. ఇవాళేమో పెళ్ళికి లోన్ తీసుకుంటున్నావేమిటీ? అడిగాడు ఆశ్ఛర్యపోతూ కొత్తగా వచ్చిన ఆఫీసర్. 

నా పెళ్ళికని లోన్ కోసం రెండేళ్ళ క్రితం అప్లికేషన్ పెట్టుకుంటే అది ఇప్పుడు శాంక్షన్ అయింది సర్ అన్నాడా ఉద్యోగి. 

ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే రెడ్ టేపిజం గురించి మాట్లాడేప్పుడు తరచుగా వినిపించే జోక్ ఇది. సో, ఆ కాలేజ్ వాళ్ళు ఆ చెక్కు పంపే లోపు మేమసలు ఆ అద్దె ఇంట్లో అదే ఊర్లో ఉంటామో లేదో అని భయం, పోనీ పర్మనెంట్ అడ్రస్ ఏదైనా ఇద్దామనుకుంటే అలాంటిదొకటి ఏడ్చి ఛస్తే కదా?

MCA సీట్ అడ్మిషన్  కోసం అనుకుంటా మీ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ జత చేయండి అది లేని పక్షంలో  మీ మండల రెవిన్యూ అధికారితో మీరు ఫలానా చోట ఉంటున్నట్లు సంతకం చేయించుకున్న ఫారం జతపర్చండి అన్నారు. ఆ మండల రెవిన్యూ అధికారి అనే పదార్ధం ఎప్పుడు ఎక్కడుంటుందో తెలీక పడ్డ చిక్కులు అన్నీ ఇన్నీ కావు. 

తిరుపతి లో MCA సీట్ వచ్చాక, కాలేజీ లో డిసెంబర్ 4 వ తేదీ నుంచి క్లాసెస్ మొదలుతాయి ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఉత్తరం ద్వారా తెలియజేస్తాం మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నారు(అప్పట్లో ఫోన్ సౌకర్యాలు అంత అభివృద్ధి చెందలేదు మరి)

ఏ అడ్రస్ ఇచ్చి వెళ్ళాలి? అప్పటికే ఉంటున్న ఊరిలో రెండేళ్ళు దాటడం వల్ల  ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది నాన్నకు. సరే అని చేసేదేమీ లేక అప్పుడు ఉంటున్న అడ్రసే ఇచ్చి వెళ్ళాను. ఆ తర్వాత పది రోజులకే ఆ ఉన్న ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళాము. 

డిసెంబర్ 4 వ తేదీ కాలేజ్ కి వెళ్తే,  వారం రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మీకు ఉత్తరం పంపామే అన్నారు. పంపే ఉంటారు కానీ మేము ఆ ఊరు వదలి వెళ్ళడం వల్ల అది మాకు చేరలేదు. 

ఇక ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ కోసం, పాస్పోర్ట్ అప్లై చేసేప్పుడు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వెళ్ళినపుడు ఇలా చెప్పుకోలేనన్ని సార్లు ఈ పర్మనంట్ అడ్రస్ లేదంటే అడ్రస్ ప్రూఫ్ లాంటిది లేక ఇబ్బంది పడ్డ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. 

ఇక ఆస్ట్రేలియా వచ్చాకా ఆ ఇబ్బంది ఎప్పుడూ ఏర్పడలేదు, మనం అద్దె ఇంట్లో ఉన్నా సరే ఎలక్ట్రిసిటీ బిల్లులు, గ్యాస్ బిల్లులు మన పేరు మీదే పంపించే ఏర్పాటు ఉంటుంది, వాటిని అడ్రస్ ప్రూఫ్స్ గా ఎక్కడైనా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ నచ్చిన మరో విషయం ఏమిటంటే గ్యాస్ అయిపోతోందని మరో సిలండర్ ఆర్డర్ చెయ్యాలి అనే దిగులు లేకపోవడం. వాటర్ కనెక్షన్ లానే గ్యాస్  కనెక్షన్ కూడా ఉంటుంది, వాడుకున్నంత మేర బిల్లులు పంపిస్తుంటారు. ఇండియా లో కూడా ఇలాంటి ఏర్పాటు త్వరలోనే వస్తుంది అని పదేళ్ళ కిందటే విన్నాను కానీ అదెంతవరకు వచ్చిందో తెలీదు మరి. 

గత రెండు నెలలుగా ఏదైనా అప్లికేషన్ నింపుతున్నప్పుడు 'పర్మనంట్ అడ్రస్' అనే కాలం కనపడినప్పుడల్లా నా ఛాతీ రెండించులు వెడల్పవుతోంది. 

నడ్డి మీదకు నలభయ్యేళ్ళు దాటేదాకా ఈ పర్మనంట్ అడ్రస్ అన్నది లేదు ఇప్పటికీ పేరుకు పర్మనంట్ అడ్రస్ అనే కానీ మరో ముప్పయ్యేళ్లు గాడిద చాకిరీ చేస్తే గానీ అది పూర్తిగా నా సొంతమవ్వదు బ్యాంక్ నుండి. 

ఆ పర్మనంట్ అడ్రస్ లో ఇది మా తొలి దీపావళి. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. 




2 కామెంట్‌లు:

  1. Congratulations for your permanent address.
    పోస్ట్ చదువుతుంటే నా అడ్రస్ మార్పించుకోడానికి నేను పడ్డ తిప్పలు గుర్తుకొచ్చాయండి...

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ ప్రియరాగాలు గారు. గత రెండు నెలలుగా అదే పనిలోనే ఉన్నాను, కాకపోతే ఇది తక్కువ జనాభా ఉన్న దేశం కాబట్టి ప్రాసెస్ ఈజీ గా ఉంది.

    రిప్లయితొలగించండి