ఎనిమిదేళ్ళ క్రితం అనుకుంటాను తెలుగు మీద మోజుతోనో లేదంటే ఏదో తెలుగుని బతికించాలి అనే సదుద్దేశ్యంతో ఒక తెలుగు పత్రిక స్టార్ట్ చేశారు ఆస్ట్రేలియా లో. మంత్లీ 4 డాలర్లు కట్టండి లేదంటే సంవత్సర చందా 40 డాలర్లు కట్టండి, పత్రిక మీ ఇంటికే పంపిస్తాము. నెలలో జస్ట్ ఒక కాఫీ కంటే తక్కువ ఖర్చుకే మీరు మంచి తెలుగు కథలు చదవచ్చు అని advertise చేసుకున్నారు.
పుస్తకం పట్టుకు చదివితే వచ్చే మజానే వేరు అనే ఉద్దేశ్యంతో నేనూ 8 డాలర్లు మిగులుతాయని సంవత్సర చందా 40 డాలర్లు కట్టాను, తర్వాత సరిగ్గా సంవత్సరానికి ఎక్కువ మంది చందాదారులు లేక ప్రింట్ ఆపేస్తున్నాము, ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ లో చదువుకోండి అని చెప్పి ఆన్లైన్ లో మరో ఏడాది కొనసాగించి ఆ తర్వాత దుకాణం పూర్తిగా మూసేశారు. చదవాలి అనే ఆసక్తి పాఠకుల్లో లేకపోవడమో లేదంటే చదివి తీరాలి అనిపించే కంటెంట్ వాళ్ళు ఇవ్వలేకపోవడమో జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పఠనానికంటే దృశ్య మాధ్యమానికే మొగ్గు చూపుతున్నారు ఈ నాటి తరం. చిన్న హాస్య పుస్తకం చదవడానికంటే జబర్దస్త్ చూడటానికో, సినిమా రివ్యూ చదవడం కంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికో యు ట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు తప్ప అసలు చదవడం అన్నదానికి ఫుల్ గా ఫుల్స్టాప్ పెట్టేసినట్లున్నారు.
నేనొక న్యూస్ కంపనీ లోని IT డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను. ఆ న్యూస్ పేపర్స్ కి ఉన్న సబ్స్క్రైబర్స్ సంఖ్య చాలా ఎక్కువ, నేను మాట్లాడేది ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ గురించి కాదు ప్రింట్ సబ్స్క్రిప్షన్ గురించి. ఇంకా ఇంటికి పేపర్ తెప్పించుకొని చదివే అలవాటు పెంచుకుంటున్నారు తప్పితే తగ్గించుకోవడం లేదు. ప్రింట్ పేపర్ తగ్గించడం వల్ల వాతావరణానికి మంచి చేసినట్లే అవ్వచ్చు కానీ మన కంటికి విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాము అదే టైం లో ఈ లాప్టాప్, మొబైల్ ఫోన్స్ వాడి విపరీతమైన రేడియేషన్ పెంచుతున్నాము అని నా అభిప్రాయం.
ఇక్కడ చాలా మంది తెల్లోళ్ళ ఇళ్ళలో ఈ బుక్ షెల్ఫ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది, వారు ఈ చదివే అలవాటు తగ్గించుకోవడం లేదు. మన పాత జనరేషన్ లో ఈ బుక్ షెల్ఫ్ వ్యవహారం ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఈ జనరేషన్ వాళ్ళు అంతా ఫోన్ లోనే వినడం లేదంటే పోడ్ కాస్ట్ లంటూ వింటూ ఉండటం, చివరికి కథలు కూడా ఎవరో రికార్డు చేస్తే వింటున్నారు. అసలు కథలను మనం చదివితే కదా మజా, వాళ్లెవరో చదివి వినిపించడం ఏమిటి? సరేలెండి నేను ఓల్డ్ జనరేషన్ కాబట్టి నా అభిప్రాయం ఇదేమో. చదవడానికి అంత టైం ఎక్కడుంది, వినడం అయితే సైకిల్ మీద వెళ్తూనో లేదంటే జాగింగో, జిమ్ చేస్తూనో వినచ్చు అంటున్నారు ఇప్పటి వారు. ఏదైనా సరే ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఒక వీడియో చూడటం కంటే చదివి తెలుసుకోవడం ఉత్తమం అనేది పాత చింతకాయ పచ్చడి కిందే లెక్క.
మొన్నీ మధ్యే ఏదో మళయాళ సినిమా బాగుంది అన్నాడు ఒక మిత్రుడు. ఎప్పుడు చూశావ్ అంటే చూడలేదు విన్నాను అన్నాడు. వినడం ఏమిటి, అప్పట్లో మాయాబజార్, శ్రీ కృష్ణ తులాభారం లాంటి సినిమా ఆడియో కాస్సెట్స్ వచ్చేవి, పాటలు మాత్రమే కాకుండా సినిమా అంతా. అలా ఇప్పుడు కూడా ఆడియో సినిమాలు రిలీజ్ చేస్తున్నారా అని అడిగాను.
అదేం లేదు, యు ట్యూబ్ లో కొన్ని సైట్స్ ఉన్నాయి. రెండు గంటల సినిమా చూసే ఓపిక లేని వాళ్ళకు సినిమా స్టోరీ మొత్తం అరగంట లో చెప్పేస్తారు అన్నాడు. సినిమా కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ యు ట్యూబ్ వీడియోస్ కూడా వచ్చాయంటే జనాలు దృశ్య మాధ్యమానికి యెంత అడిక్ట్ అయ్యారో తెలుస్తోంది. ఇదేం విచిత్రం రా నాయనా అనుకున్నా? 20-20 క్రికెట్ మ్యాచుల జనరేషన్ లో పోను పోను ఇలాంటి ఎన్ని విచిత్రాలు వినాల్సి వస్తుందో.
పాతికేళ్ళ క్రితం 'రోజులో అలా 8 గంటలు టీవీ ముందు కూర్చుని క్రికెట్ చూస్తూ టైం ఎందుకు వేస్ట్ చేస్కుంటారు' అని మా నాన్న అంటుంటే ఓల్డ్ జనరేషన్ అని సరిపెట్టుకున్నా. ఇప్పుడు నేను కూడా అదే ఓల్డ్ జనరేషన్ లోకి చేరినట్లున్నాను.
పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిందే, అదే ప్రకృతి ధర్మం కూడా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి