15, డిసెంబర్ 2021, బుధవారం

బకెట్స్ లో పండ్లు నింపుకుందామా?

"పవన్, వీకెండ్ లో నువ్వు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తావా"  అన్నాడు మా మేనేజర్?

పార్ట్ టైం జాబా ? అన్నాను ఆశ్చర్యంగా 

అదే Orange Picking అన్నాడు నవ్వుతూ. 

పోయిన నెల పండ్ల తోటకి వెళ్ళాము, అక్కడికి మా మేనేజర్ కూడా వచ్చాడట అక్కడ నన్ను చూశాడట అదీ విషయం. 

ఆస్ట్రేలియా లో ఈ సీజన్లో oranges విరివిగా పెరుగుతాయి. కొన్ని పండ్ల తోటల ఓనర్స్ పది లేదా ఇరవై డాలర్ల టికెట్ పెట్టి పబ్లిక్ ని లోనికి వెళ్ళనిస్తారు. పది డాలర్ల టికెట్ కొన్నవారికి  చిన్న బకెట్,  ఇరవై డాలర్ల టికెట్ కొన్నవారికి పెద్ద బకెట్ చేతికిస్తారు. లోపల తిన్నన్ని పళ్ళు తిని మిగతావి ఆ బకెట్స్ లో నింపుకొని రావచ్చు. 

చిన్నప్పుడు మేము కడప జిల్లా పులివెందుల దగ్గర ఉండే అంకాలమ్మ గూడూరు అనే పల్లెలో ఉండేవాళ్ళము అక్కడ శీనాకాయ తోటలు బాగా ఉండేవి. మా పక్కింట్లో ఉండేవారికి ఆ తోటలు ఎక్కువగా ఉండేవి. మాకు వాళ్ళు బాగా క్లోజ్ అవడం వల్ల ప్రతీ వారం అక్కడికెళ్ళి మేమే కోసుకొని తినేవాళ్ళము. అవీ కాక చింత చెట్లు, రేగి పండ్లు, గంగి రేగు పండ్లు, సుగంధాలు కాచే చెట్లు కూడా ఉండేవి. 

రేగు పండ్లలో రకరకాలు ఉండేవి, కొన్ని పెద్ద సైజు, కొన్ని చిన్న సైజు. ఆవులు, గేదెలు తోటలోకి రాకుండా ఉండటానికి ఈ చిన్న సైజు రేగు పండ్ల చెట్లను తోటల చుట్టూ పెంచేవారు. ఈ చిన్న సైజు రేగు పళ్ళతో రేగు వడలు చేసేవారు, భలే రుచిగా ఉంటాయి కొంచెం కొంచెం కొరుక్కుంటూ తింటూ ఉంటే. కొన్ని ప్రాంతాల్లో వీటిని రేణిగాయలు అని కూడా అంటారు, ఈ రేణిగాయల చెట్టుకు ముళ్ళు ఉంటాయి, అవి అప్పుడప్పుడూ చేతికి కుచ్చుకునేవి రేణిగాయలు తెంచడానికి ప్రయత్నించినప్పుడు.  

కొంచెం పెద్ద సైజు రేగు పళ్ళను గంగి రేగు పండ్లని పిలిచేవారు. ఇవి పుల్లగా కాకుండా కాస్త తియ్యగా ఉండేవి. ఈ  గంగి రేగు పండ్ల సైజు లోనే ఉంటూ వాటి కంటే తియ్యగా ఉండటంతో పాటు మంచి సువాసనతో ఉండే పళ్ళను సుగంధాలు అని పిలిచేవారు. ఈ పండ్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో కాస్తున్నాయో లేదో నాకు తెలీదు. గ్లోబలైజషన్ వచ్చాక స్ట్రాబెర్రీస్, చెర్రీస్ లాంటివి వచ్చేసి మన మధురమైన పండ్లు మూలన పడిపోయినట్లున్నాయి. 

పల్లెల్లో పెరిగిన నా లాంటి వాడికి ఇలాంటి పళ్ళ తోటలు కొత్త కాదు కానీ మా పిల్లలకి అలాగే సిటీస్ లోనే పెరిగిన వారికి ఇలా పళ్ళ తోటలలోకి వెళ్ళి పళ్ళు కోసుకోవడం లాంటివి సరదాగా ఉంటుంది కాబట్టి తిరణాలకి తరలి వెళ్ళినట్లు ఇక్కడి జనాలు పండ్ల సీజన్ లో తోటలకి వెళ్తారు. దాని వల్ల ఆ పళ్ళ తోటల చుట్టుపక్కల దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. 

తోట లోపల పండ్లు తినడం వరకూ బాగానే ఉంటుంది కానీ చాలా మంది పండ్లు ఒలిచి కొంచెం మాత్రం తినేసి  మిగతాది పారేయడం వంటివి చేస్తూ ఉంటారు అదే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. ఒక్క అన్నం మెతుకు పారేయాలంటేనే భాధపడే రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అలా పండ్లను వృధా చేయడం, ఫోటో దిగడం కోసం ఆ కొమ్మల మీద వాలిపోయి వాటిని విరిచిపారేయడం వంటివి బాధ కలిగిస్తూ ఉంటాయి. 

ఆ పండ్ల తోటల ఓనర్స్ కి ఇలాంటివి నష్టం కలిగించినా, ఇంకో రకంగా వాళ్ళు లాభపడతారు. అదెలాగంటే పండ్లు కోయించే కూలీ ఖర్చు తగ్గిపోతుంది (ఇక్కడ లేబర్ ఖర్చు చాలా ఎక్కువ, వాచ్ లాంటివి పని చేయకపోతే వాటిని రిపేర్ చేయించుకునే ఖర్చుతో ఇంకో కొత్త వాచ్ కొనుక్కోవచ్చు) పైగా వాటిని కోసిన తర్వాత మార్కెట్ కి తరలించే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గుతుంది. 

అక్కడ ఆ తోటల బయట ఉన్న గొఱ్ఱెలు, ఆవులు, కోళ్ళను చూసి పిల్లలు యెంత సంబరపడ్డారో వాటిని అబ్బురంగా చూస్తూ.  

How do oranges communicate with each other? 

చిన్న జోకు లాంటి పై ప్రశ్నకి సమాధానం కనుక్కోండి చూద్దాం?

... 

... 

Answer: By speaking in  Mandarin.

ఇక్కడ oranges ని మాండరిన్స్ అంటారు. మాండరిన్ అనేది ఒక లాంగ్వేజ్, చైనాతో సహా కొన్ని దేశాల్లో కొందరు ప్రజలు ఈ భాషలో మాట్లాడుతారు. 

11 కామెంట్‌లు:

  1. శీనాకాయ అంటే శనక్కాయేనా , మిగతావి అర్ధమయినవి కానీ ఇది మాత్రం అర్ధం కాలా .ఆస్ట్రేలియాలో సమ్మర్ మొదలయిందా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శీనాకాయ అంటే బత్తాయి లక్కరాజు గారు, పొరపాటయ్యింది..చూసుకోలేదు అలవాటులో మా కడప జిల్లా భాష వచ్చేసింది.

      ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయ్యిందండీ.

      తొలగించండి
    2. కొత్త విషయం తెలుసుకున్నాను. It is winter and windy in Chicago. Enjoy Summer.

      తొలగించండి
    3. వింటర్ కాస్త నయం లక్కరాజు గారు, మంచు ఇక్కడ కురవదు కాబట్టి ఒక జెర్కిన్ తో మానేజ్ చెయ్యొచ్చు, ఈ ఎండలు తట్టుకోలేం బాబోయ్, ఈ రెండు మూడు నెలలు సినిమా పరిభాషలో చెప్పాలంటే బొమ్మ చూపెడుతుంది.

      మీకైతే snowy winter అనుకుంటాను అక్కడ. ఇక్కడి వాళ్ళు క్రిస్మస్ snowy winter లో ఎంజాయ్ చేయలేమని బాధపడుతుంటారు.

      తొలగించండి
    4. చీనీ తోటలు అంటే వాటివేనా?

      తొలగించండి
    5. కరెక్ట్ చిరు గారూ, చీని తోట అంటే బత్తాయిలు కాసే తోట అని, శీనా తోట అని అంటారు కొందరు . మరి సరియైన వాడుక భాషలో ఏమంటారో కరెక్ట్ గా తెలీదు, పుస్తకాలు చదివే అలవాటు నాకు లేదు కాబట్టి పుస్తకాల్లో ఎక్కడైనా రాశారేమో కూడా తెలీదు . సీనీ కాయలు, శీనా కాయలు , చీనా కాయలు ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు పలికేవారు,

      తొలగించండి
  2. క్రిస్మస్ వైట్ క్రిస్మస్ కాకపోతే జుట్టు పీక్కుంటారు. ఇంకా స్నో లేదు సుడిగాలులతో ఊగి పోతోంది. గుడ్ నైట్.

    రిప్లయితొలగించండి
  3. టైటిల్ చూసి ఇదేదో రాఘవేంద్ర రావు సినిమా పాట గురించి బ్లాగుతున్నారేమో అనుకున్నాను :-)

    రిప్లయితొలగించండి
  4. Today (Dec 22nd) - National Mathematics Day (india).

    Jayanthi of legendary mathematician Srinivasa Ramanujam
    (lived from 22-12-1887 to 26-04-1920) 🙏

    రిప్లయితొలగించండి